శ్వాసక్రియను ఆంగ్లంలో రెస్పిరేషన్ అంటారు. రెస్పి రేషన్ అనే పదం రెస్పైర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. రెస్పైర్ అంటే పీల్చడం అని అర్థం. అయితే ఇది కేవలం ఉచ్ఛ్వాస, నిశ్వాసలనే కాకుండా కణాలలో ఆక్సిజన్ వినియోగితమయ్యే వరకు ఉండే అన్ని దశలను కలిపి సూచిస్తుంది. శ్వాసక్రియ ఒక విచ్ఛిన్న క్రియ. పోషకాల నుంచి శక్తిని విడుదల చేసే క్రియను శ్వాసక్రియ అంటారు.
ఉచ్ఛ్వాసం అం టే గాలిలోకి పీల్చడం అని, నిశ్వాసం అంటే గాలిని శరీరం నుంచి బయటికి విడవడం అని అర్థం. పీల్చే గాలిలో నైట్రోజన్ 79 శాతం, ఆక్సిజన్ 21 శాతం, కార్బన్ డై ఆక్సైడ్ 0.04 శాతం ఉంటుంది. విడిచే గాలిలో నైట్రోజన్ 79 శాతం, ఆక్సిజన్ 16.4 శాతం, కార్బన్ డై ఆక్సైడ్ 4.4 శాతం ఉంటుంది. శ్వాసక్రియ అనేది శక్తిమోచక, ఉష్ణమోచక చర్య.
జీవుల మనుగడకు శ్వాసక్రియ చాలా అవసరం ఇది ఆహారం నుండి శక్తిని విడుదల చేస్తుంది. మనం పీల్చే ఆక్సిజన్ గ్లూకోజ్‌ను కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిలో విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగించబడుతుంది. ప్రక్రియలో శక్తి విడుదల అవుతుంది.
జీవులలో శ్వాసక్రియ రకాలు
ఆక్సిజన్ వినియోగం ఆధారంగా శ్వాసక్రియ రెండు రకాలు. వాయు శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ. వాయు శ్వాసక్రియను వాయుసహిత శ్వాస క్రియ అని కూడా పిలుస్తారు. ఇది ఆక్సిజన్ సమ క్షంలో జరుగుతుంది. ఈ శ్వాసక్రియలో ఆహారం (గ్లూకోజ్) పూర్తిగా విచ్ఛిన్నమవుతుంది. వాయు శ్వాసక్రియలో గ్లూకోజ్, ఆక్సిజన్‌తో చర్యనొంది కార్బన్ డై ఆక్సైడ్, నీటిని, శక్తిని విడుదల చేస్తుంది. ఈ శ్వాసక్రియ మొక్కలు, జంతువుల్లో జరుగుతుంది.
అవాయు శ్వాసక్రియను వాయురహిత శ్వాస క్రియ అంటారు. ఇది ఆక్సిజన్ లేకుండా జరుగు తుంది. దీనిని కిణ్వణం లేదా ఫర్మంటేషన్ (పులియట) కూడా అంటారు. ఇందులో ఆహారం పాక్షికంగా విచ్ఛిన్నం అవుతుంది. వాయురహిత శ్వాసక్రియలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. అవి ఆల్కహాలిక్ కిణ్వ ప్రక్రియ, లాక్టిక్ యాసిడ్ కిణ్వ ప్రక్రియ
ఈ శ్వాసక్రియ కండర కణాలలో, ఈస్టులలో, పరాన్న జీవులలో జరుగుతుంది. దీనికి కారణం కండరాలలో గ్లూకోజ్ పాక్షికంగా విచ్ఛిన్నమైనప్పుడు లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. ఆ సమయంలో మనం వేడి నీటి స్నానం లేదా మసాజ్ చేసినప్పుడు రక్త ప్రసరణ బాగా జరిగి కండరాలు ఉపశమనం పొందుతాయి. ఫలితంగా ఆక్సిజన్ సరఫరా కండర కణాలకు చేరి లాక్టిక్ ఆమ్లం పూర్తిగా కార్బన్ డై ఆక్సైడ్, నీరుగా విచ్ఛిన్నమవుతుంది.
మానవుని శ్వాస వ్యవస్థలోని ముఖ్య భాగాలు
- బాహ్య నాసికా రంధ్రాలు : బయటకు కనిపించే ముక్కు యొక్క రంద్రాలను బాహ్య నాసికా రంధ్రాలు అంటారు. ముక్కు వాసనను గుర్తించే ఒక జ్ఞానేంద్రియం. ముక్కు రెండు బాహ్య నాసికా రంధ్రాలను కలిగి, నాసికా కుహరంలోకి విస్తరించి ఉంటుంది. నాసికా రంధ్రాలను ఆవరించి రోమాలు ఉంటాయి. ఈ రోమాలు ధూళి నాసికా కుహరాల్లోకి పోకుండా అడ్డుకుంటాయి.
- నాసికా కుహరాలు : ప్రతి నాసికా రంధ్రానికి, వెనుక గొట్టంలా ఉండే నాసికా కుహరం ఉంటుంది. నాసికా కుహరాలు రెండూ ఒక విభాజకం ద్వారా వేరు చేసి ఉంటాయి. ఆస్య కుహరాన్ని, నాసికా కుహరాన్ని వేరు చేస్తూ ఉండే అస్థిఫలకాన్ని అంగిలి అంటారు. నాసికా కుహరాలను ఆవరించి శ్లేష్మస్తరం ఉంటుంది. ఈ శ్లేష్మస్తరం మీదుగా గాలికి తేమ చేరి దాని శరీర ఉష్ణోగ్రతకు సమానంగా చేస్తుంది. గాలిలోని దుమ్ము, ధూళి రేణువులు శ్లేష్మంలో చిక్కుకుంటాయి.
- అంతర నాసికా రంధ్రాలు : ఇవి నాసికా కుహరాలను గ్రసనితో కలుపుతాయి. ఒక జత అంతర నాసికా రంధ్రాల ద్వారా నాసికా కుహరాలు గ్రసనిలోకి తెరుచుకుంటాయి.
- గ్రసని : ఇది కండరయుతమైన గది. ఇది ఆహార, శ్వాస మార్గాలకు కూడలి. గ్రసని (కంఠబిలం) గ్లాటిస్ ద్వారా స్వరపేటికలోకి తెరుచుకుంటుంది. ఉపజిహ్విక (ఎపిగ్లాటిస్ అనే పలుచటి కవాటం, కంఠబిలం ద్వారా స్వరపేటికలోకి ఆహారం పోకుండా నిరోధిస్తూ, ఆహార, వాయువుల కదలిక లను క్రమబద్దీకరిస్తుంది. ఆహారం మింగేటప్పుడు ఉపజిహ్విక పాక్షికంగా కంఠబిలాన్ని మూస్తుంది.
- స్వరపే టిక : దీన్ని శబ్దపేటికగా పేర్కొంటారు. ఇది వాయు నాళంలోని మొదటి భాగం. దీనిలో స్వతం త్రులు ఉంటాయి. ఈ స్వరతంత్రులు పురుషులలో పొడవుగా, స్త్రీలలో పొట్టిగా ఉంటాయి. ఇవి నిశ్వాస ప్రక్రియలో ప్రకంపించి శబ్దాలను ఉత్పత్తి చేస్తాయి. స్త్రీలలో స్వరతంత్రులు మృదువుగా ప్రకంపిస్తాయి. కాబట్టి వారి నోటి నుంచి వచ్చే పాటలు, మాటలు వినసొంపుగా ఉంటాయి. పక్షులలో శబ్దాలను ఉత్పత్తి చేసే భాగాన్ని సైరింక్స్ (శబ్దిని) అంటారు.
- వాయునాళం : వాయునాళం: దీనిని గాలిగొట్టం అని కూడా పిలు స్తారు. ఇది స్వరపేటిక నుంచి బయలు దేరి మెడ ద్వారా ఉరఃకుహరంలోకి ప్రవేశిస్తుంది. వాయు నాళం గోడలో కాచాభ అనే మృదులాస్థి ఉంగరాలు 'C' ఆకారంలో ఉంటాయి. వాయునాళం ముడుచు కొని పోకుండా ఇవి కాపాడుతాయి.
- శ్వాసనాళాలు : ఉరఃకుహరంలో వాయునాళం రెండు గొట్టాలుగా విభజన చెంది రెండు శ్వాసనాళా లుగా ఏర్పడుతుంది. ఇవి ఊపిరితిత్తులలోకి ప్రవేశి స్తాయి.
- శ్వాస నాళికలు : శ్వాసనాళాలు అనేకసార్లు శాఖోప శాఖలుగా చీలిపోతాయి. వీటినే శ్వాసనాళికలు అంటారు.
- వాయు గోణులు : ఇవి ఊపిరి పీల్చుకునే ప్రక్రియలో ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ లను మార్పిడి చేస్తాయి. ఇవి శ్వాస నాళికలు (ఊపిరితిత్తులలోని గాలి గొట్టాల యొక్క చిన్న శాఖలు) చివర చిన్న గాలి సంచులు.
వాయుసహిత మరియు వాయురహిత మధ్య ప్రధాన తేడాలు
వాయుసహిత శ్వాసక్రియ | వాయురహిత శ్వాసక్రియ |
---|---|
ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది | ఆక్సిజన్ లేకుండా జరుగుతుంది |
కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు లిపిడ్లు పూర్తిగా విచ్ఛిన్నమవుతాయి | అసంపూర్ణ విచ్ఛిన్నం ఉంటుంది |
సైటోప్లాజం మరియు మైటోకాండ్రియా రెండింటిలోనూ జరుగుతుంది | సైటోప్లాజంలో మాత్రమే జరుగుతుంది |
పెద్ద మొత్తంలో శక్తి విడుదల అవుతుంది (36-38 ఏటీపీ) | ఒక గ్లూకోజ్ అణువు నుండి తక్కువ శక్తి ఉత్పత్తి అవుతుంది (2 ఏటీపీ) |
ముగింపు ఉత్పత్తులు కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు | కార్బన్ డయాక్సైడ్ మరియు లాక్టిక్ ఆమ్లం / ఇథైల్ ఆల్కహాల్ |
ఇది చాలా మొక్కలు మరియు జంతువులలో సంభవిస్తుంది | ఈస్ట్ మరియు కొన్ని బ్యాక్టీరియాలలో సంభవిస్తుంది |