Advertisement
Union and its Territory in Indian constitution in Telugu
Indian Constitution

Union and its Territory in Indian constitution in Telugu

భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 1లో, ఆర్టికల్ 1 నుండి 4 మధ్య యూనియన్ మరియు దాని భూభాగంకు సంబంధించిన కథనాలను పొందుపర్చారు. రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థని ఏర్పర్చినప్పటికీ, మన రాజ్యాంగ నిర్మాతలు దేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్‌ (రాష్ట్రాల యూనియన్‌)గా అభివర్ణించారు. దేశం మొత్తం అఖండమైనది, కేవలం పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే రాష్ట్రాలుగా విభజించడం జరిగిందనేది వారి ఉదేశ్యం.

భారత రాష్ట్రాలు ఒక ఒప్పందం ప్రకారం ఏర్పడలేదు. అలానే  ఈ రాష్ట్రాలకు యూనియన్ నుండి విడిపోయే అధికారం కూడా లేదు. ఏదైనా రాష్ట్రం నుండి భూభాగాన్ని వేరు చేయడం ద్వారా లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలను ఏకం చేయడం ద్వారా వీటిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భారతదేశం 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించబడింది.

భారత రాజ్యాంగంలో షెడ్యూల్ I

భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 1, రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల సరిహద్దుల ఏర్పాటు, రాష్ట్రాల పేరు మార్చడం, విలీనం చేయడం వంటి చట్టాలను కలిగి ఉంది. ఇది రాజ్యాంగంలో తరచుగా ఉపయోగించే యూనియన్ / సెంట్రల్ గవర్నమెంట్ / గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్స్, టెరిటరీ ఆఫ్ ఇండియా, స్టేట్ టెరిటరీ, యూనియన్ టెరిటరీలు మరియు ఆర్జిత టెరిటరీ అనే పదాలను కూడా భౌతికంగా నిర్వచిస్తుంది. ఇందులో మొత్తం 4 ఆర్టికల్స్ పొందుపర్చారు.

  • ఆర్టికల్ 1 : రాజ్యాంగంలోని ఆర్టికల్ 1, భారతదేశంను రాష్ట్రాల యూనియన్ అని చెబుతుంది
  • ఆర్టికల్ 2 : స్వాధీనం చేసుకున్న భూభాగాలను కొత్త రాష్ట్రం/రాష్ట్రాలుగా ఏర్పాటు
  • ఆర్టికల్ 3 : కొత్త రాష్ట్రాల ఏర్పాటు. ప్రాంతాలు, సరిహద్దులు మార్పు మరియు ఇప్పటికే ఉన్న రాష్ట్రాల పేర్ల మార్పు.
  • ఆర్టికల్ 4 : రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం యొక్క సరిహద్దును మార్చడానికి అవసరమైన విధి విధానాలను అందిస్తుంది.

భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 1

రాజ్యాంగంలోని ఆర్టికల్ 1, భారతదేశంను రాష్ట్రాల యూనియన్ అని చెబుతుంది. ఆర్టికల్ 1 ప్రకారం భారత భూభాగాన్ని మూడు రకాలుగా విభజించారు. వీటిలో మొదటి షెడ్యూల్‌లో పేర్కొన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు ఇతర స్వాధీనం చేసుకున్న భూభాగాలు ఉంటాయి.

సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలు సభ్యత్వం కలిగివుండి కేంద్రంతో అధికారాలు పంచుకుంటాయి. కానీ కేంద్రపాలిత ప్రాంతాలు మరియు స్వాధీనం చేసుకోబడ్డ భూభాగాలు కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పాలన పరిధిలోకి వస్తాయి. అలానే అంతర్జాతీయ న్యాయ సూత్రాలననుచరించి సార్వభౌమ రాజ్యమైన భారతదేశం విదేశీ భూభాగాలను కూడా ఆర్జించవచ్చు.

ఇది వరకే విదేశీయులు ఆక్రమించుకున్న భూభాగాలను యుద్ధం, సంధి, లీజు, కొనుగోలు వంటి ప్రక్రియల ద్వారా తిరిగి పొందవచ్చు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చాక గోవా, డామన్ & డయ్యూ, పుదుచ్చేరి, సిక్కిం వంటి భూభాగాలను భారత్ ఈ విదంగానే సొంతం చేసుకుంది.

భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 2

ఆర్టికల్ 2 అనేది భారత యూనియన్ స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని కొత్త రాష్ట్రంగా లేదా కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసేందుకు పార్లమెంటుకు అధికారం కల్పిస్తుంది. ఇందులో ఆర్టికల్ 2A భారత యూనియన్ యందు కొత్త రాష్ట్రాలను చేర్చుకునే అవకాశం కల్పిస్తుంది. ఆర్టికల్ 2B కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం కల్పిస్తుంది. ఇది కేవలం స్వాధీనం చేసుకునే భూభాగాలకు మాత్రమే వర్తిస్తుంది. 2019లో జమ్మూ కాశ్మీర్ & లడఖ్ ఇదే విధానం ద్వారా కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు.

భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3

ఆర్టికల్ 3 కొత్త రాష్ట్రాల ఏర్పాటు మరియు ఇప్పటికే ఉన్న రాష్ట్రాల సరిహద్దులు లేదా పేర్ల మార్పు గురించి విధి విధానాలను అందిస్తుంది. అయితే ఈ విషయంలో రెండు షరతులు ఉన్నాయి. మొదటిది వీటికి సంబంధించిన బిల్లును రాష్ట్రపతి ముందస్తు సిఫార్సుతో పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. రెండవది సంబంధిత రాష్ట్ర శాసనసభ ద్వారా ఈ బిల్లుకు సంబంధించి అభిప్రాయాలను స్వీకరించాల్సి ఉంటుంది.

  • ఆర్టికల్ 3A : ఏదైనా రాష్ట్రం నుండి భూభాగాన్ని వేరు చేయడం ద్వారా లేదా రెండు, అంతకంటే ఎక్కువ రాష్ట్రాల భాగాలను ఏకం చేయడం ద్వారా లేదా ఏదైనా రాష్ట్రంలోని ఒక భాగానికి ఏదైనా భూభాగాన్ని ఏకం చేయడం ద్వారా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కోసం వివరిస్తుంది.
  • ఆర్టికల్ 3B : ఏదైనా రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచడం కోసం వివరిస్తుంది.
  • ఆర్టికల్ 3C : ఏదైనా రాష్ట్ర విస్తీర్ణాన్ని తగ్గించడం కోసం వివరిస్తుంది.
  • ఆర్టికల్ 3D : ఏదైనా రాష్ట్రం సరిహద్దులను మార్చడం కోసం వివరిస్తుంది
  • ఆర్టికల్ 3E : ఏదైనా రాష్ట్రం యొక్క పేరు మార్చడం కోసం వివరిస్తుంది.

భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 4

రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం యొక్క సరిహద్దును మార్చడానికి ఆర్టికల్ 2 లేదా 3 కింద చట్టం రూపొందించబడినప్పుడు ఆర్టికల్ 4 అమలు చేయబడుతుంది. ఇది 1వ షెడ్యూల్ మరియు 4వ షెడ్యూల్‌కు అవసరమైన సవరణలకు సంబంధించిన నిబంధనలను కలిగి ఉంటుంది. ఆర్టికల్ 4 (1) ఆర్టికల్ 4 (2) కింద రూపొందించబడిన చట్టాలు, ఆర్టికల్ 368 ప్రయోజనాల సంబంధిత రాజ్యాంగ సవరణగా పరిగణించబడదు.

రాష్ట్రాలు & కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటు పరిణామక్రమం

దేశానికీ స్వాతంత్రం వచ్చినప్పుడు దేశం రెండు రాజకీయ భాగాలుగా ఉండేది. అందులో ఒకటి బ్రిటిష్ ప్రభుత్వం ఆదీనంలో ఉన్న బ్రిటిష్ ప్రావిన్సులు, రెండువవి స్వదేశీ రాజుల పరిధిలోని స్వదేశీ సంస్థానాలు. 1947 భారత స్వాతంత్ర చట్టం ప్రకారం భారత భూభాగాన్ని ఇండియా, పాకిస్తాన్ దేశాలుగా విభజించారు. ఈ సమయంలో స్వదేశీ సంస్థానాలకు మూడు అభిమతంలు ఇవ్వబడ్డాయి.

వీటిలో మొదటిది ఇండియాలో చేరడం, రెండవది పాకిస్తాన్ యందు చేరడం ఇక చివరిది స్వాతంత్రంగా కొనసాగడం. దీనితో దేశంలోని మొత్తం 552 స్వదేశీ సంస్థానాలలో 549 సంస్థానాలు భారతదేశంలో చేరాయి. ఈ సమయంలో హైదరాబాద్, జునాఘర్ మరియు కాశ్మీర్ సంస్థానాలు ఇండియాలో చేరేందుకు అంగీకరించలేదు. తర్వాత కాలక్రమంలో పోలీసు చర్య ద్వారా హైదరాబాద్, ప్రజాభిప్రాయం ద్వారా జునాఘర్, విలీన ఒప్పందం ద్వారా కాశ్మీర్ ఇండియాలో చేర్చబడ్డాయి.1950లో మొత్తం 29 భారత రాష్ట్రాలను నాలుగు వర్గాలుగా విభజించారు.

  • పార్ట్ A : పూర్వపు 9 బ్రిటిష్ గవర్నర్ ప్రావిన్సులు
  • పార్ట్ B : స్వదేశీ సంస్థానాల విలీనం ద్వారా ఏడ్పడిన రాష్ట్రాలు
  • పార్ట్ C : పూర్వపు 10 బ్రిటిష్ ఇండియా చీఫ్ కమిషనర్ల ప్రావిన్సులు
  • పార్ట్ D : అండమాన్ & నికోబర్ దీవులు

ధార్ కమీషన్ & జేవీపీ కమిటీ

స్వదేశీ సంస్థానాల విలీనం వివిధ ప్రాంతీయ డిమాండ్లకు దారి తీసింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుండి భాష ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థికరించాలనే డిమాండ్ ఏర్పడింది. దీని సాధ్యతను పరిశీలించడానికి భారత ప్రభుత్వం జూన్, 1948లో ఎస్కే థార్ అధ్యక్షతన లింగ్యుస్టిక్ ప్రావిన్సెస్ కమీషన్‌ని ఏర్పాటు చేసింది. ఈ కమీషన్ డిసెంబర్, 1948లో నివేదిక సమర్పించింది. రాష్ట్రాలను భాష ప్రాతిపదికన కాకుండా పరిపాలన సౌలభ్యం ప్రకారమే పునర్వ్యవస్థికరించాలని సిఫార్సు చేసింది.

ఈ నివేదికపై తీవ్ర వ్యతిరేకత రావడంతో నెహ్రు, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య అధ్యక్షతన మరో లింగ్యుస్టిక్ ప్రావిన్సెస్ కమీషన్‌ని ఏర్పాటు చేసారు. వీరు కూడా భాష ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థికర్ణను వ్యతిరేకిస్తూ ఏప్రిల్, 1949లో నివేదిక సమర్పించారు. అయినప్పటికీ అక్టోబర్, 1953లో  భారత ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం అనే ఒక భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.

ప్రముఖ కాంగ్రెస్ వాది అయిన పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 56 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరుడు కావడంతో పెద్దయెత్తున ఈ ఉద్యమం బలపడింది. దీనితో ప్రభుత్వానికి భాష ప్రాతిపదికన మొదటి రాష్ట్రం చేయవల్సిన అనివార్యం ఏర్పడింది. మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు ప్రాంతలను వేరు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.

ఫజల్ అలీ కమీషన్

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటంతో ఇతర రాష్ట్రాల నుండి కూడా భాష ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు డిమాండ్లు పెరిగాయి. దీనితో ఈ సమస్యను పరిష్కరించేందుకు ఫజల్ అలీ కమీషన్ ఏర్పాటు చేయబడింది. ఈ కమీషన్ సెప్టెంబర్, 1955లో తమ నివేదికను సమర్పించింది. దేశ ఐక్యతను, భద్రతను, భాష మరియు సంస్కృత వారసత్వాన్ని కాపాడేందుకు గాను మూల రాజ్యాంగంలో పొందుపర్చిన నాలుగు రకాల రాష్ట్రాల వర్గీకరణను రద్దు చేయాలని సిఫార్సు చేసింది.

దీనితో 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం మరియు 7వ రాజ్యాంగ సవరణ ద్వారా దేశాన్ని 14 రాష్ట్రాలుగా, 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. దీనితో పార్ట్ A, పార్ట్ B రాష్ట్రల మధ్య తేడాలు తొలగిపోవడంతో పాటుగా, పార్ట్ C రాష్ట్రాలను రద్దు చేయబడ్డాయి. కాలక్రమంలో వీటి సంఖ్య పెరుగుతూ పోయింది. 1956 తర్వాత ఏర్పడ్డ వివిధ రాష్ట్రాల జాబితా...

  • మహారాష్ట్ర & గుజరాత్ రాష్ట్రాల ఏర్పాటు : 1960లో  ద్విభాషా రాష్ట్రమైన బొంబాయిని రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించారు. మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రగా, గుజరాతీ మాట్లాడే ప్రాంతాలను గుజరాత్ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. గుజరాత్ భారతదేశ 15వ రాష్ట్రంగా అవతరించింది.
  • దాద్రా మరియు నాగర్ హవేలీ : పోర్చుగీస్ పాలనలో ఉన్న ఈ ప్రాంతం 1954లో ఇండియాలో విలీనం చేయబడింది. 1961లో 10వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు.
  • గోవా, డామన్ & డయ్యూ : ఈ ప్రాంతలను 1961లో పోలీస్ చర్య ద్వారా భారతదేశంలో విలీనం చేసుకుంది. వీటిని 12వ రాజ్యాంగ సవరణ ద్వారా 1962లో కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. 1987లో గోవాకు రాష్ట్ర హోదా ఇవ్వబడింది.
  • పుదుచ్చేరి విలీనం : ఫ్రెంచ్ పాలనలో ఉన్న పుదుచ్చేరి, యానాం వంటి ప్రాంతాలు 1954లో భారతదేశానికి అప్పగించబడ్డాయి. 14వ రాజ్యాంగ సవరణ ద్వారా 1962లో దీనిని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసారు.
  • నాగాలాండ్ రాష్ట్రం ఏర్పాటు : నాగా ఉద్యమాన్ని శాంతింపజేసేందుకు 1963లో అస్సాం రాష్ట్రం నుండి నాగా హిల్స్ ప్రాంతాన్ని వేరుచేసి కొత్తగా నాగాలాండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. నాగాలాండ్ ఇండియా 16వ రాష్ట్రంగా అవతరించింది.
  • పంజాబ్ విభజన & హర్యానా  ఏర్పాటు : 1969లో ఉమ్మడి పంజాబ్ రాష్ట్రాన్ని పంజాబ్ మరియు హర్యానాగా విభజించారు. మాస్టర్ తారాసింగ్ నాయకత్వంలో అకాలీదళ్ ప్రత్యేక సిక్కుల మాతృభూమి నినాదంతో పంజాబీ మాట్లాడే ప్రాంతాలను పంజాబ్ రాష్ట్రంలో ఉంచి, హిందీ మాట్లాడే వారి కోసం కొత్తగా హర్యానా రాష్ట్రం ఏర్పాటు జరిగింది. హర్యానా, ఇండియా యొక్క 17వ రాష్ట్రంగా అవతరించింది.
  • చండీగఢ్ & హిమాచల్ ప్రదేశ్ ఏర్పాటు : పంజాబ్ విభజన తర్వాత చండీగఢ్ ప్రాంతం, కేంద్రపాలిత ప్రాంతం అయ్యింది. మిగిలిన కొండ ప్రాంతాలను పక్కనే ఉన్న మరో కేంద్రపాలిత ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ యందు విలీనం చేశారు. హిమాచల్ ప్రదేశ్ 1971లో భారతదేశ 18వ రాష్ట్రంగా ఏర్పాటు చేయబడింది.
  • మణిపూర్, త్రిపుర & మేఘాలయ రాష్ట్రాల ఏర్పాటు : 1972లో ఈశాన్య భారతదేశ రాజకీయ పటంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.  కేంద్రపాలిత ప్రాంతాలైన మణిపూర్, త్రిపురాలు భారతదేశ 19, 20వ రాష్ట్రాలుగా ఏర్పాటు చేయబడ్డాయి. అస్సాంలోని మేఘాలయ ప్రాంతాన్ని భారతదేశ 21వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.
  • సిక్కిం రాష్ట్రం ఏర్పాటు : సిక్కిం 1974 వరకు భారత రక్షిత ప్రాంతంగా అనేది. 35వ రాజ్యాంగ సవరణ ద్వారా 1974లో ఇండియాలో విలీనం చేయబడింది. ప్రజాభిప్రాయంతో 1975లో 36వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత 22వ రాష్ట్రంగా అవతరించింది.
  • మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా రాష్ట్రాలు ఏర్పాటు : 1987లో కేంద్ర ప్రభుత్వం మరియు మిజో నేషనల్ ఫ్రంట్ మధ్య జరిగిన మిజోరాం శాంతి ఒప్పందం ప్రకారం మిజోరాం భారత 23వ రాష్ట్రంగా ఏర్పాటు చేయబడింది. అస్సాం నుండి వేరుచేయబడ్డ అరుణాచల్ ప్రదేశ్ భారత 24వ రాష్ట్రంగా అవతరించింది. డామన్ & డయ్యూ కేంద్రపాలిత ప్రాంతం నుండి గోవాను విడదీసి భారత 25వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.
  • ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఏర్పాటు : 2000 సంవత్సరంలో కొత్తగా 3 రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్ నుండి వేరుపడిన ఛత్తీస్‌గఢ్, భారత 26వ రాష్ట్రంగా అవతరించింది. ఉత్తరప్రదేశ్ నుండి ఉత్తరాఖండ్ విడిపోయి భారత 27వ రాష్ట్రంగా ఏర్పాటు అయ్యింది. బీహార్ నుండి విడిపోయిన జార్ఖండ్ ప్రాంత్రం భారత 28వ రాష్ట్రంగా ఏర్పాటు చేయబడింది.
  • ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ ఏర్పాటు : 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఏపీ నుండి తెలంగాణ ప్రాంతం వేరుచేయబడి భారత 29వ రాష్ట్రంగా ఏర్పాటు చేయబడింది. ప్రాంతీయ అభివృద్ధి కోసం జరిగిన తెలంగాణా ఉద్యమం ఫలితంగా ఈ రాష్ట్ర ఏర్పాటు జరిగింది.
  • జమ్మూ మరియు కాశ్మీర్ విభజన : 2019 జమ్మూ మరియు కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ ప్రాంతాలను రెండు వేరువేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు.
  • డామన్ మరియు డయ్యూ & దాద్రా మరియు నగర్ హవేలీ పునర్వ్యవస్థీకరణ : 2019 డామన్ మరియు డయ్యూ మరియు దాద్రా మరియు నగర్ హవేలీ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా రెండు కేంద్రపాలిత ప్రాంతాలను విలీనం చేశారు. దీనితో భారతదేశ మొత్తం రాష్ట్రాల సంఖ్య 28కి తగ్గి, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 8కి చేరుకుంది.
 భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలు & రాజధానులు
  • ఆంధ్రప్రదేశ్ (అమరావతి)
  • అరుణాచల్ ప్రదేశ్ (ఇటానగర్)
  • అస్సాం (డిస్పూర్)
  • బీహార్ (పాట్నా)
  • ఛత్తీస్‌గఢ్ (రాయ్‌పూర్)
  • గోవా (పనాజీ)
  • గుజరాత్ (గాంధీనగర్)
  • హర్యానా (చండీగఢ్)
  • హిమాచల్ ప్రదేశ్ (సిమ్లా)
  • జార్ఖండ్ (రాంచీ)
  • కర్ణాటక (బెంగళూరు)
  • కేరళ (తిరువనంతపురం)
  • మధ్యప్రదేశ్ (భోపాల్)
  • మహారాష్ట్ర (ముంబయి)
  • మణిపూర్ (ఇంఫాల్)
  • మేఘాలయ (షిల్లాంగ్)
  • మిజోరం (ఐజ్వాల్)
  • నాగాలాండ్ (కోహిమా)
  • ఒడిశా (భువనేశ్వర్)
  • పంజాబ్ (చండీగఢ్)
  • రాజస్థాన్ (జైపూర్)
  • సిక్కిం (గ్యాంగ్‌టక్)
  • తమిళనాడు (చెన్నై)
  • తెలంగాణ (హైదరాబాద్)
  • త్రిపుర (అగర్తలా)
  • ఉత్తరాఖండ్ (డెహ్రాడూన్)
  • ఉత్తర ప్రదేశ్ (లక్నో)
  • పశ్చిమ బెంగాల్ (కోల్‌కతా)
 భారతదేశంలో ఉన్న 8 కేంద్రపాలిత ప్రాంతాలు & రాజధానులు
  • అండమాన్ మరియు నికోబార్ దీవులు (పోర్ట్ బ్లెయిర్)
  • చండీగఢ్ (చండీగఢ్)
  • దాద్రా మరియు నగర్ హవేలీ మరియు డామన్ & డయ్యూ (డామన్)
  • ఢిల్లీ (ఢిల్లీ)
  • జమ్మూ & కాశ్మీర్ (శ్రీనగర్ & జమ్మూ )
  • లడఖ్ (లేహ్)
  • లక్షద్వీప్ (కవరత్తి)
  • పుదుచ్చేరి (పుదుచ్చేరి)

Post Comment