Advertisement
గంగానది మరియు దాని ఉపనదులు | నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా
Telugu Gk

గంగానది మరియు దాని ఉపనదులు | నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా

గంగా నది భారత ఉపఖండంలో అతి పొడవైన నది. గంగానది ఉత్తరకాశీ జిల్లాలో సుమారు 7010 మీటర్ల ఎత్తులో హిమాలయాలలోని గంగోత్రి (గౌముఖ్) హిమానీనదాల నుండి భాగీరథిగా మొదలవుతుంది. గంగా నది ఉత్తర భారతదేశంలోని గంగా మైదానం గుండా దక్షిణం మరియు తూర్పున ప్రవహిస్తుంది. ఉత్తరాఖండ్ నుండి  ప్రారంభమైన గంగా ప్రవాహం ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రయాణించి హుగ్లీ మరియు పద్మ నదిగా విడిపోతుంది. హుగ్లీ నది కోల్‌కాతాలో గంగా సాగర్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

దీని నుండి విడిపోయిన మరో శాఖ పద్మ నదిగా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించి, తరువాత జమున, బ్రహ్మపుత్ర దిగువ ప్రవాహలతో కలిసి చివరికి మేఘన నదిగా అదే దేశంలో తిరిగి బంగాళా ఖాతంలో కలుస్తుంది. ఇది గంగా డెల్టా యొక్క ప్రధాన ముఖద్వారాన్ని ఏర్పరుస్తుంది. భారతదేశంలో మొత్తం 2,525 కిమీ పొడవుతో గంగా ప్రవహిస్తుంది. గంగా పరీవాహక ప్రాంతం భారతదేశం, టిబెట్, నేపాల్ మరియు బంగ్లాదేశ్‌లలో 10,86,000 చ.కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది.

గంగా పరీవాహక ప్రాంతం ఉత్తరాన హిమాలయా మరియు ట్రాన్‌షిమాలయ నుండి, దక్షిణాన వింధ్య శ్రేణి యొక్క ఉత్తర వాలుల వరకు, పశ్చిమాన ఆరావళి యొక్క తూర్పు వాలుల నుండి తూర్పున చోటా నాగ్‌పూర్ పీఠభూమి మరియు సుందర్‌బన్స్ డెల్టా వరకు విస్తరించి ఉంది.

గంగా నది సాంకేతికంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని దేవప్రయాగ్ పట్టణంలో భాగీరథి మరియు అలకనంద నదుల సంగమం వద్ద ప్రారంభమవుతుంది. అక్కడ నుండి 159 కిమీ దాని ఇరుకైన హిమాలయ లోయ గుండా ప్రవహించి, రిషికేశ్ వద్ద పర్వతాల నుండి బయటపడుతుంది, ఆపై తీర్థయాత్ర పట్టణం హరిద్వార్ వద్ద మైదానంలోకి ప్రవహిస్తుంది. ఇక్కడ నుండి గంగా నది యొక్క ప్రధాన ఉప నదుల కలయిక ప్రారంభం అవుతుంది.

గంగానది యొక్క ప్రధాన ఉపనదులు

గంగానదిలో కలుస్తున్న ప్రధాన ఉపనదులలో యమునా, రామగంగ, ఘఘరా, గోమతి, గండక్, కోసి, మహానంద మరియు సోన్ నదులు ఉన్నాయి. వీటిలో ఎడమ వైపు నుండి కలిసే ఉపనదులలో గోమతి నది, ఘఘరా నది, గండకి నది మరియు కోసి నది ఉన్నాయి. కుడి వైపు నుండి కలిసే ఉపనదులలో యమునా నది, సోన్ నది, పున్‌పున్ మరియు దామోదర్ నదులు ఉన్నాయి. గంగానది యొక్క ఉపనదులలో అతి పొడవైనది యమునా నది. అయితే నీటి వాల్యూమ్ ప్రకారం గంగా నదికి అతిపెద్ద ఉపనది ఘఘరా నది. ఇది యమునా నది తర్వాత పొడవులో రెండవ అతిపెద్ద ఉపనది.

  • యమునా నది : యమునా గంగానది యొక్క పొడవైన మరియు రెండవ అతిపెద్ద ఉపనది. ఇది ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి హిమానీనదంలోని దిగువ హిమాలయాల నుండి ఉద్భవించి, అలహాబాద్‌లోని త్రివేణి సంగమం లేదా ప్రయాగ వద్ద గంగా నదిలో కలుస్తుంది. ఈ సంగమంకు ముందు యమునా నది 1,376 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
  • ఘఘరా నది : ఇది టిబెటన్ పీఠభూమిలో హిమాలయాల ఉత్తర వాలులలో కర్నాలీ నదిగా మొదలై, నేపాల్‌లోని హిమాలయాల గుండా భారతదేశంలోకి ప్రవేశించి బ్రహ్మఘాట్ వద్ద శారదా నదిలో కలుస్తుంది. ఈ రెండు నదులు ఘఘరా నదిగా బీహార్‌లోని రెవెల్‌గంజ్ వద్ద గంగానదిలో కలుస్తుంది. ఇది వాల్యూమ్ ప్రకారం గంగానదికి అతిపెద్ద ఉపనది మరియు యమునా తర్వాత పొడవుతో రెండవ అతిపెద్దది.
  • రామగంగ నది : రామగంగా నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలోని దుధతోలి కొండ యొక్క దక్షిణ వాలులలో ఉద్భవించి, యూపీలోని హర్దోయ్ జిల్లాలోని కత్రి చందాపూర్ గ్రామంలో గంగా నదిలో కలుస్తుంది.
  • గోమతి నది : గోమతి గంగా నది యొక్క అతి ముఖ్యమైన ఉపనదులలో ఒకటి. ఇది వారణాసి సరిహద్దులో ఉన్న ఘాజీపూర్ జిల్లాలోని కైతి వద్ద గంగా నదిలో కలుస్తుంది.
  • గండక్ నది : గండక్ నేపాల్‌లోని ప్రధాన నదులలో ఒకటి. ఇది గంగానదికి ఎడమ ఒడ్డు ఉపనది. ఇది లోతైన లోయకు ప్రసిద్ధి చెందింది. ఈ బేసిన్‌లో 8,000 మీ పైగా ఎత్తయిన మూడు ధౌలగిరి, మనస్లు మరియు అన్నపూర్ణ I శిఖరాలు ఉన్నాయి. ధౌలగిరి గండకి బేసిన్‌లో ఎత్తైన ప్రదేశం. ఇది హాజీపూర్ దిగువన సోన్‌పూర్ వద్ద పాట్నా దగ్గర గంగానదిలో కలుస్తుంది. ఈ సంగమాన్ని హరిహర్ క్షేత్రం అని కూడా అంటారు.
  • కోసి నది : కోసీ నది, నేపాల్, భారత దేశంలలో ప్రవహించే నది. నేపాలీ భాషలో ఈ నదిని కోషి అని అంటారు. గంగా నదికి ఉన్న పెద్ద ఉపనదులలో ఈ నది ఒకటి. కోసి నది బీహార్‌లోని కతిహార్ జిల్లాలో గంగలో కలుస్తుంది. దీనిని క్రష్ ఆఫ్ బీహార్ అని అంటారు. ఇది వర్షాకాలంలో ఈ రాష్ట్రాన్ని వరదలతో ముంచెత్తుతుంది.
  • మహానంద నది : దామోదర్ నది జార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ప్రవహిస్తుంది. ఈ లోయ మైనింగ్ పారిశ్రామిక కార్యకలాపాలకు నిలయంగా ఉంది. పశ్చిమ బెంగాల్ మైదానాలలో ఇది సృష్టించే వరదల కారణంగా దీనిని పశ్చిమ బెంగాల్ దుఃఖ దాయని అని కూడా పిలుస్తారు. ఇది కలకత్తాకు దక్షిణాన 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుగ్లీలోకి కలుస్తుంది.
  • సోన్ రివర్ : ఇది మధ్య భారతదేశంలో ఉన్న శాశ్వత నది. ఇది ఛత్తీస్‌గఢ్‌లోని గౌరెలా-పెండ్రా-మార్వాహి జిల్లాలోని అమర్‌కంటక్ కొండ దగ్గర ఉద్భవించి చివరకు బీహార్‌లోని పాట్నా సమీపంలో గంగా నదిలో కలుస్తుంది. సోన్ నది యమునా నది తర్వాత గంగానదికి రెండవ అతిపెద్ద దక్షిణ ఉపనది.

గంగా నది ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రాలు & నగరాలు

గంగా నది ఒడ్డు దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు మరియు పర్యాటక ప్రదేశాలకు కేంద్రంగా ఉంది. వారణాసి, హరిద్వార్, రిషికేశ్, ప్రయాగ్‌రాజ్, రుద్రప్రయాగ్, గంగోత్రి మొదలైనవి గంగా నది ఒడ్డున ఉన్న భారతదేశంలోని పవిత్ర నగరాలుగా పరిగణించబడతాయి.

  • వారణాసి : కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోవుంది.
  • హరిద్వార్ : హరిద్వార్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఒక పురాతన నగరం. ఇది గంగానది హిమాలయ పర్వతాల నుండి మైదానంలోకి అడుగుపెట్టే ప్రదేశం. ఇది గంగానది తీరం వెంబడి ఉన్న అనేక పవిత్రమైన ఘాట్‌లలో అతి పెద్దది.
  • రిషికేశ్ : రిషికేశ్ ఉత్తర భారతదేశంలోని ప్రధాన పర్యాటక మరియు తీర్థయాత్ర కేంద్రాలలో ఒకటి. ఇది గంగానది పర్వత ప్రాంతాల నుండి బయటపడే ప్రదేశం. రిషికేశ్‌ను భారతదేశ సాహస క్రీడల రాజధాని మరియు ప్రపంచ యోగా రాజధాని అని కూడా పిలుస్తారు. బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి మరియు యమునోత్రి అనే నాలుగు చోటా చార్ ధామ్ యాత్రా స్థలాలకు ప్రయాణించడానికి రిషికేశ్ ప్రారంభ స్థానం.
  • త్రివేణి సంగమం : ప్రయాగ్‌రాజ్‌లోని ప్రయాగ హిందువులకు అత్యంత ముఖ్యమైన తీర్థయాత్ర కేంద్రంగా నమ్ముతారు. ఈ నగరానికి మరొక పేరు అలహాబాద్. ఇక్కడ పవిత్ర గంగా, యమునా మరియు పురాణ సరస్వతి ఒక్కటి అవుతాయి. దీనినే త్రివేణి సంగమం అంటారు.
  • రుద్రప్రయాగ్ : ఇది అలకనంద నది యొక్క పంచ ప్రయాగ (ఐదు సంగమ ప్రదేశాలలో)  ఒకటి. ఇది అలకనంద మరియు మందాకిని నదుల సంగమ ప్రదేశం.
  • గంగోత్రి : ఇది గంగానది (భాగీరథీ) జన్మస్థలం. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో సముద్ర మట్టానికి 4,042 మీటర్ల ఎత్తులో ఉంది.
  • గంగానది ఒడ్డున ఉన్న ప్రముఖ పట్టణాలలో హరిద్వార్, రిషికేశ్, కాన్పూర్, వారణాసి, జజ్మౌ, అలహాబాద్, మీర్జాపూర్, ఘాజీపూర్, పాట్నా, భాగల్పూర్, బహరంపూర్, కోల్‌కతా వంటివి ఉన్నాయి.

గంగానది యొక్క ముఖ్యమైన పాయింట్స్

  • గంగానది జన్మస్థలం : ఉత్తరకాశిలోని గంగోత్రి
  • గంగానది ఇతర పేర్లు : భాగీరథి, అలకానంద, గంగోత్రి, పద్మ, త్రిపథ, జాహ్నవి
  • గంగానది పొడవు : 2525 కి.మీ
  • గంగానది ప్రవహించే రాష్ట్రాలు : ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్
  • గంగానది  పరీవాహక ప్రాంతం : గంగ మరియు దాని ఉపనదుల పరీవాహిక ప్రాంతం ఉత్తరాఖండ్, యుపి, ఎంపి, రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు ఢిల్లీ వంటి 11 రాష్ట్రాలను కవర్ చేస్తుంది. దీని మొత్తం విస్తరణ 1,999,000 చ. కిమీ
  • ఉపనదులు : యమునా, రామగంగ, గర్రా, గోమతి, తంస ఘఘరా, గండక్, బుర్హి గండక్, కోషి, మహానం, బ్రహ్మపుత్ర, మేఘన, తంసా, కరమ్నాస, సోనే, పున్పున్, ఫల్గు, కియుల్, చందన్, అజయ్, దామోదర్, రూపనారాయణ్
  • గంగానదిపై ప్రధాన ప్రాజెక్టులు : తెహ్రీ డ్యామ్ (భాగీరథి, ఉత్తరాఖండ్), ఫరక్కా బ్యారేజ్ (గంగ, పశ్చిమ బెంగాల్) రామగంగా డ్యామ్ (రామగంగా, ఉత్తరాఖండ్), భీమ్‌గోడ బ్యారేజీ (గంగ, ఉత్తరాఖండ్), దుర్గాపూర్ బ్యారేజీ (దామోదర్, పశ్చిమ బెంగాల్), దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (దామోదర, జార్ఖండ్). కోసి ప్రాజెక్ట్ (కోషి, బీహార్).

క్లీన్ గంగ లేదా నమామి గంగే కార్యక్రమం

క్లీన్ గంగ నేషనల్ మిషన్ 2011లో ప్రారంభించబడింది. ఇది సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 క్రింద నమోదు చేయబడింది. గంగా నది పరీవాహక ప్రాంతంలో పెరుగుతున్న కాలుష్య స్థాయిలను పరిష్కరించడానికి ఈ మిషన్ ప్రారంభించబడింది. తర్వాత గంగా నది మరియు దాని ఉపనదులను పునరుజ్జీవింపజేయడానికి నమామి గంగే కార్యక్రమం జూన్ 2014 నుండి 31 మార్చి, 2021 వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమం తరువాత 31 మార్చి, 2026 వరకు పొడిగించబడింది.

నమామి గంగే కార్యక్రమం కింద, మురుగునీటి శుద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, రివర్ ఫ్రంట్ మేనేజ్‌మెంట్ (ఘాట్‌లు మరియు శ్మశానవాటిక అభివృద్ధి), ఇ-ఫ్లో, అడవుల పెంపకం, జీవవైవిధ్య పరిరక్షణ వంటి ప్రాజెక్టులు చేపట్టారు. 2014-15 ఆర్థిక సంవత్సరం నుండి 30 జూన్ 2023 వరకు జాతీయ మిషన్ ఫర్ క్లీన్ గంగా కింద  మొత్తం రూ.15,517.02 కోట్లు ఖర్చు చేశారు. వీటిలో రూ. 14,796.46 కోట్లు ఎన్‌ఎంసిజి ద్వారా ఈ కార్యక్రమం కింద ప్రాజెక్టుల అమలు కోసం వివిధ ఏజన్సీలకు అందజేశారు.

దీనిని మరింత ప్రభావంతంగా అమలుచేసేందుకు జల్ శక్తి మంత్రిత్వ శాఖ పరిధిలో 2022 అక్టోబరులో "నేషనల్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ సెడిమెంట్ మేనేజ్‌మెంట్ రూపొందించారు. జూన్ 19, 2023న జలశక్తి మంత్రిత్వ శాఖ సెడిమెంట్ మేనేజ్‌మెంట్‌పై జాతీయ వర్క్‌షాప్‌ని నిర్వహించింది. దీని ద్వారా నదులు మరియు రిజర్వాయర్లలో అవక్షేపణకు సంబంధించిన ప్రస్తుత క్లిష్టమైన సమస్యల గురించి వాటాదారులందరికీ అవగాహన కల్పించారు.

Post Comment