భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలోని నియమాలు, నిబంధలను పరిస్థితులు మరియు కాలానికి అనుగుణంగా మార్చుకోవడానికి ఒక సవరణ విధానాన్ని పొందుపర్చారు. దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలను రాజ్యాంగంలోని 20వ భాగంలో, ఆర్టికల్ 368 ద్వారా అందుబాటులో ఉంచారు. అయితే రాజ్యాంగంలోని మౌలిక స్వరూప అంశాలను మార్చేందుకు పార్లమెంటుకు అధికారం లేదని 1973 కేశవానంద భారతి కేసులో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
26 జనవరి 1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 105 సార్లు మన రాజ్యాంగాన్ని సవరించారు. చివరిగా అక్టోబర్ 2021లో సవరించబడింది. భారత రాజ్యాంగానికి మార్పు చేయడానికి మూడు రకాల సవరణలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రెండు సవరణ విధానాలను మాత్రమే ఆర్టికల్ 368 యందు పొందుపర్చారు. కొన్ని నిర్దిష్ట అంశాలకు పార్లమెంట్ సాధారణ మెజారిటీ ద్వారా కూడా సవరించవచ్చు.
- మొదటి రకం సవరణకు భారత పార్లమెంటులోని ప్రతి సభలో సాధారణ మెజారిటీ పొందాల్సి ఉంటుంది. ఈ సవరణ పద్దతి ఆర్టికల్ 368 యందు లేదు.
- రెండవ రకం సవరణకు భారత పార్లమెంటులోని ఇరు సభలలో నిర్దేశించబడిన ప్రత్యేక మెజారిటీ సాధించాల్సి ఉంటుంది.
- మూడవ రకం సవరణకు భారత పార్లమెంటులోని ఇరు సభలలో నిర్దేశించబడిన ప్రత్యేక మెజారిటీతో పాటుగా సగం రాష్ట్రాల శాసనసభల ఆమోదం అవసరం.
భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యధిక సార్లు సవరించబడిన రాజ్యాంగంగా ఉంది. ఇందులో మెజారిటీ సంఖ్యలో మూడవ రకం సవరణలు ఉన్నాయి. రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లును మంత్రివర్గ లేదా ప్రైవేట్ సభ్యుడు పార్లమెంటులో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. దీనికి రాష్ట్రపతి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇరు సభలలో 50శాతం సభ్యుల సమ్మతి పొందాక, తిరిగి రాష్ట్రపతి ఆ బిల్లుని ఆమోదయించాల్సి ఉంటుంది.
పార్లమెంట్ సాధారణ మెజారిటీ ద్వారా సవరించబడే రాజ్యాంగ అంశాలు
- కొత్త రాష్ట్రాల ఏర్పాటు & నియోజక వర్గాల హద్దుల మార్పు.
- రాష్ట్రాల విస్తీర్ణం, సరిహద్దులు, పేర్లు మార్పు అంశాలు.
- రాష్ట్ర విధాన మండలి రద్దు లేదా ఏర్పాటు.
- రెండవ షెడ్యూల్ యందు ఉన్న రాష్ట్రపతి, గవర్నర్, స్పీకర్లు, న్యాయమూర్తుల జీతభత్యాలు, గౌరవ వేతనాలు, ప్రత్యేక హక్కులు.
- పార్లమెంట్ కోరమ్ & పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలు.
- పార్లమెంటులోని కార్య విధాన నియమాలు.
- పార్లమెంట్ సభ్యులు, కమిటీల ప్రత్యేక హక్కులు.
- పార్లమెంటులో ఇంగ్లీష్ & అధికారిక భాష వాడుక.
- సుప్రీం కోర్టులో న్యాయ మూర్తుల సంఖ్యా.
- సుప్రీం కోర్టుకు ఎక్కువ అధికార పరిధిని సంక్రమింపజేయడం.
- పౌరసత్వ సంబంధిత అంశాలు.
- పార్లమెంట్, రాష్ట్ర, శాసన సభలకు ఎన్నికలు.
- కేంద్రపాలిత ప్రాంతాలు.
- 5 & 6వ షెడ్యూల్ లోని షెడ్యూల్ తెగలు మరియు ప్రాంతాల పరిపాలన.
పార్లమెంట్ సాధారణ మెజారిటీ ద్వారా సవరించబడే రాజ్యాంగ అంశాలు
- ప్రాథమిక హక్కులు
- ఆదేశిక సూత్రాలు
పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీ & రాష్ట్రాల ఆమోదం ద్వారా సవరించబడే అంశాలు
- రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ
- కేంద్ర, రాష్ట్ర కార్యనిర్వాహక అధికార విస్తృతి.
- సుప్రీం కోర్టు, హైకోర్టు అంశాలు.
- కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసనపరమైన అధికార విభజన.
- షెడ్యూల్ 7 లోని అంశాలు.
- పార్లమెంటులో రాష్ట్రాల ప్రాతినిధ్యం.
- ఆర్టికల్ 368 సంబంధిత అంశాలు.
భారత రాజ్యాంగంలో ముఖ్యమైన సవరణలు
భారత రాజ్యాంగ మొదటి సవరణ చట్టం 1951
భారత రాజ్యాంగం 1950లో అమలులోకి వచ్చిన ఏడాది లోపే మొదటి సవరణ చోటు చేసుకుంది. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన అభివృద్ధి కోసం కొన్ని ప్రత్యేక నిబంధనలు చేర్చారు. అలానే జమీందారుల భూములను స్వాధీనం చేసుకునే చట్టాలకు మినహాయింపు కల్పించారు.
- భూసంస్కరణలు, ఇతర చట్టాలను రక్షించేందుకు కొత్తగా షెడ్యూల్ 9ని రాజ్యాంగంలో పొందుపర్చారు.
- ఎస్టేట్‌ల స్వాధీనానికి సంబంధించిన చట్టాలను రక్షించేందుకు ఆర్టికల్ 31A, 31B ని చేర్చింది.
- ఆర్టికల్ 15 పరిధిలోని వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛపై సహేతుకమైన పరిమితి విధించింది.
- ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తుల జాతీయకరణను సులభతరం చేసేందుకు కొన్ని నియమాలు జోడించింది.
రాజ్యాంగ సవరణ | 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1951 |
---|---|
రాష్ట్రపతి | రాజేంద్ర ప్రసాద్ |
ప్రధానమంత్రి | జవహర్‌లాల్ నెహ్రూ |
సవరించిన అంశం |
|
అమలులోకి వచ్చిన తేదీ | 18 జూన్ 1951 |
భారత రాజ్యాంగ రెండవ సవరణ చట్టం 1952
1952లో చేసిన 2వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబందించిన అధిక జనాభా పరిమితిని తొలగించారు. తద్వారా ఒక పార్లమెంట్ సభ్యుడు 7.5 లక్షల జనాభాకు ప్రాతినిధ్యం వహించేలా ఆర్టికల్ 81(1)(బి)ని సవరించింది.
రాజ్యాంగ సవరణ | 2వ రాజ్యాంగ సవరణ చట్టం 1952 |
---|---|
రాష్ట్రపతి | రాజేంద్ర ప్రసాద్ |
ప్రధానమంత్రి | జవహర్‌లాల్ నెహ్రూ |
సవరించిన అంశం | ఆర్టికల్ 81(1)(బి) |
అమలులోకి వచ్చిన తేదీ | 1 మే 1953 |
భారత రాజ్యాంగ మూడవ సవరణ చట్టం 1954
1954లో చేసిన మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా షెడ్యూల్ 7లోని వ్యాపారం మరియు వాణిజ్యం మరియు నాలుగు రకాల నిత్యావసర వస్తువుల ఉత్పత్తి, సరఫరా మరియు పంపిణీకి సంబందించిన అంశాలను కేంద్ర జాబితాలోకి తీసుకొచ్చారు. వీటిలో ఆహార ధాన్యాలు, పశువుల దాణా, పత్తి విత్తనాలు, పత్తి, ముడి జనుము వంటివి ఉన్నాయి.
రాజ్యాంగ సవరణ | 3వ రాజ్యాంగ సవరణ చట్టం 1954 |
---|---|
రాష్ట్రపతి | రాజేంద్ర ప్రసాద్ |
ప్రధానమంత్రి | జవహర్‌లాల్ నెహ్రూ |
సవరించిన అంశం | షెడ్యూల్ 7 |
అమలులోకి వచ్చిన తేదీ | 22 ఫిబ్రవరి 1955 |
4వ రాజ్యాంగ సవరణ 1955 |
|
5వ రాజ్యాంగ సవరణ 1955 | రాష్ట్ర సరిహద్దులు, పేర్ల మార్పుకు సంబంధించి కేంద్రం చేసే చట్టాలకు రాష్ట్రపతి విధించే తేదీలోపు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలపాల్సిన నిబంధన చేర్చింది. |
6వ రాజ్యాంగ సవరణ 1956 | అంతర్రాష్ట్ర వాణిజ్య పన్నుల అంశాలను సంబంధించి యూనియన్ జాబితా మరియు రాష్ట్ర జాబితాను సవరించింది. రాష్టాల అధికారాన్ని తొలగించింది. |
భారత రాజ్యాంగ 7వ సవరణ చట్టం 1956
1956 లో చేసిన 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రాల పునర్వ్యవస్తీకరణ కమిషన్ సిఫార్సుల ఆధారంగా చేసిన రాష్ట్రాల ఏ, బీ, సీ మరియు డీ వర్గీకరణను తొలగించారు. వాటిని భాషా ప్రాతిపదికన 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. అదే సమయంలో హైకోర్టుల న్యాయ విచారణ పరిధిని కేంద్ర ప్రాంతాలకు విస్తరించారు. రెండు లేదా మూడు రాష్ట్రాలకు ఒక హైకోర్టు ఏర్పాటుకు అవకాశం కల్పించారు.
రాజ్యాంగ సవరణ | 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 |
---|---|
రాష్ట్రపతి | రాజేంద్ర ప్రసాద్ |
ప్రధానమంత్రి | జవహర్‌లాల్ నెహ్రూ |
సవరించిన అంశం | 350A, 350B, 371, 372A మరియు 378A చేర్చారు. |
అమలులోకి వచ్చిన తేదీ | 1 నవంబర్ 1956 |
8వ రాజ్యాంగ సవరణ 1960 | ఆర్టికల్ 334ను సవరించారు. లోక్‌సభ మరియు రాష్ట్ర శాసనసభలలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు ఆంగ్లో-ఇండియన్లకు సీట్ల రిజర్వేషన్ కాలాన్ని 1970 వరకు పొడిగించారు. |
9వ రాజ్యాంగ సవరణ 1960 | షెడ్యూల్ 1 సవరించారు. పశ్చిమ బెంగాల్ పరిధిలోని బెరుబారి ప్రాంతాన్ని భారత్-పాకిస్తాన్ చట్టం (1958) ప్రకారం పాకిస్తానుకు అప్పగిస్తూ సవరించారు. |
---|---|
10వ రాజ్యాంగ సవరణ 1961 | ఆర్టికల్ 240ని& షెడ్యూల్ 1 సవరించారు. దాద్రా మరియు నగర్ హవేలీని పోర్చుగల్ నుండి స్వాధీనం చేసుకుని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసారు. |
11వ రాజ్యాంగ సవరణ 1961 |
|
12వ రాజ్యాంగ సవరణ 1962 | ఆర్టికల్ 240ని& షెడ్యూల్ 1 సవరించారు. గోవా, డామన్ మరియు డయ్యూలను పోర్చుగల్ నుండి స్వాధీనం చేసుకుని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసారు. |
13వ రాజ్యాంగ సవరణ 1962 | ఆర్టికల్ 371A కింద ప్రత్యేక రక్షణతో నాగాలాండ్ రాష్ట్రం ఏర్పాటు. ఆర్టికల్ 170ని సవరించి, కొత్తగా ఆర్టికల్ 371Aని చొప్పించారు. |
14వ రాజ్యాంగ సవరణ 1962 | పాండిచ్చేరిని భారత యూనియన్‌లో విలీనం చేశారు. హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, మణిపూర్ మరియు గోవాలకు కొత్త శాసన సభలను ఏర్పాటుకు అనుమతి కల్పించారు. |
15వ రాజ్యాంగ సవరణ 1963 |
|
16వ రాజ్యాంగ సవరణ 1963 |
|
17వ రాజ్యాంగ సవరణ 1964 | రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో ఎస్టేట్‌ల స్వాధీనం మరియు భూసేకరణకు సంబంధించి మార్కెట్ విలువదారిత నష్టపరిహార విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అలానే 9వ షెడ్యూల్‌లో మరో 44 చట్టాలు చేర్చారు. |
18వ రాజ్యాంగ సవరణ 1966 | ఆర్టికల్ 3 పరిధిలో కొత్త రాష్ట్రాలు ఏర్పాటుకు సంబంధించి పార్లమెంటుకు స్వష్టమైన నిబంధనల పరిధిని జోడించారు. కేంద్రపాలిత ప్రాంతాల పునర్వ్యవస్థీకరణకు అనుమతి కల్పించారు. |
19వ రాజ్యాంగ సవరణ 1966 | ఎన్నికల ట్రిబ్యునళ్లను చేసి, హైకోర్టుల ద్వారా ఎన్నికల పిటిషన్‌ల విచారణను ప్రారంభించారు. |
20వ రాజ్యాంగ సవరణ 1966 |
|
21వ రాజ్యాంగ సవరణ 1967 | షెడ్యూల్ 8ని సవరించి సింధీ భాషను 15వ అధికారిక భాషగా చేర్చారు. |
22వ రాజ్యాంగ సవరణ 1969 | అస్సాం రాష్ట్రంను విడదీసి కొత్తగా మేఘాలయ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసారు. |
23వ రాజ్యాంగ సవరణ 1969 | పార్లమెంట్ మరియు రాష్ట్ర ఉభయ సభల్లో ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న సీట్ల రిజర్వేషన్ కోటాను, గవర్నర్ పరిధిలోని ఇండో-ఆంగ్లో కోటాను మరో పదేళ్లు పొడిగించారు. |
24వ రాజ్యాంగ సవరణ 1971 | ఈ సవరణ ద్వారా ప్రాథమిక హక్కులతో పాటుగా రాజ్యాంగంలోని ఏ హక్కునైనా సవరించే అధికారం పార్లమెంటుకు కల్పించారు. ఈ సవరణ ద్వారా రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ బిల్లును తప్పక ఆమోదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. |
25వ రాజ్యాంగ సవరణ 1971 | ప్రాథమిక ఆస్తి హక్కు పరిధిని తగ్గించారు. ఆర్టికల్ 39 (బి), (సి)లో ఉన్న ఆదేశా సూత్రాలను అమలు పరుస్తూ చేసే చట్టాలను, ఆర్టికల్ 14, 19, 31ల కింద కోర్టులను ఆశ్రహించరాదు. |
26వ రాజ్యాంగ సవరణ 1971 | భారత రిపబ్లిక్‌లో విలీనం చేయబడిన రాచరిక రాష్ట్రాల మాజీ పాలకులకు చెల్లించే ప్రైవీ పర్స్ రద్దు |
27వ రాజ్యాంగ సవరణ 1971 |
|
28వ రాజ్యాంగ సవరణ 1972 | సివిల్ సర్వీస్ నియమాలను హేతుబద్ధీకరించారు. వీరికి సంబంధించి స్వాతంత్ర పూర్వపు నుండి ఉన్న కొన్ని ప్రత్యేక అధికారులను రద్దు చేశారు. |
29వ రాజ్యాంగ సవరణ 1972 | రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ ప్రకారం భూసంస్కరణ చట్టాలను సవరించింది. |
30వ రాజ్యాంగ సవరణ 1972 | సుప్రీం కోర్టులో అప్పీలుకు వెళ్ళడానికి గల 20 వేల విలువను రద్దు చేశారు. ఒకవేళ వివాదం పరిగణించదగ్గ చట్టానికి సంబందించిన ప్రశ్నతో కూడుకొని ఉంటె మాత్రమే సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు. |
31వ రాజ్యాంగ సవరణ 1972 | లోక్‌సభ సభ్యుల సంఖ్యను 525 నుండి 545కు పెంచారు. |
32వ రాజ్యాంగ సవరణ 1973 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాలలో ప్రాంతీయ హక్కుల పరిరక్షణకు సంబంధించి కొన్ని ప్రత్యేక నిబంధనలు పొందుపర్చారు. |
33వ రాజ్యాంగ సవరణ 1974 | పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభల సభ్యులు రాజీనామా చేసే విధానాన్ని మరియు హౌస్ స్పీకర్ చేత రాజీనామాను ధృవీకరించే మరియు ఆమోదించే విధానాలను పొందుపర్చారు. సదురు సభ్యులు ఇష్టపూర్వకంగా చేసే రాజీనామాలను ఆమోదించే అవకాశం స్పీకరుకు కల్పించారు. |
34వ రాజ్యాంగ సవరణ 1974 | వివిధ రాష్ట్రాలకు చెందిన 20కి పైగా భూసంస్కరణ మరియు భూమి కౌలు చట్టాలను 9వ షెడ్యూల్ యందు చేర్చారు. |
35వ రాజ్యాంగ సవరణ 1975 | సిక్కిం రాష్ట్రంకు గల రక్షిత హోదాను రద్దుచేసి దానిని భారత అనుబంధ రాష్ట్ర హోదా కల్పించారు. దీనికి సంబందించిన విధి విధానాలను షెడ్యూల్ 10లో చేర్చారు . |
36వ రాజ్యాంగ సవరణ 1975 | సిక్కిం రాష్ట్రంకు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించారు. దీనికి చెందిన షెడ్యూల్ 10లో నిబంధనలు తొలగించారు. |
37వ రాజ్యాంగ సవరణ 1975 | అరుణాచల్ ప్రదేశ్‌లో శాసనసభ మరియు మంత్రిమండలి ఏర్పాటు చేశారు. |
38వ రాజ్యాంగ సవరణ 1975 |
|
39వ రాజ్యాంగ సవరణ 1975 | రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానిమంత్రి, స్పీకర్లకు సంబందించిన వివాదాలను న్యాయపరిది నుండి మినహాయించారు. సారులు వివాదాలు పార్లమెంట్ నియమించిన వేదిక ద్వారా పరిష్కరించే అవకాశం కల్పించారు. |
40వ రాజ్యాంగ సవరణ 1976 | భారత ప్రాదేశిక జలాలు, ఖండాతర భూభాగం, ప్రత్యేక ఆర్థిక మండలాలు, నావికా భూభాగం పరిధిలను ఎప్పటికప్పుడు నిర్ణహించే అధికారం పార్లమెంటుకు కల్పించారు. |
41వ రాజ్యాంగ సవరణ 1976 | రాష్ట్ర మరియు జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల పదవీ విరమణ వయస్సు 60 నుండి 62కు పెంచారు. |
భారత రాజ్యాంగ 42వ సవరణ చట్టం 1977
భారత రాజ్యాంగ 42వ సవరణ చట్టం అత్యధిక సవరణలకు నోచుకున్న రాజ్యాంగ సవరణ చట్టంగా నిలిచింది. అందుకే దీనిని మినీ రాజ్యాంగంగా అభివర్ణిస్తారు. స్వరణ్ సింగ్ కమిటీ సిపార్సుల అమలు కొరకు ఈ సవరణలు చేశారు.
భారత రాజ్యాంగ 42వ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే మూడు పదాలు చేర్చారు. పార్ట్ IV-A ద్వారా పౌరులకు సంబంధించి ప్రాథమిక విధులను కొత్తగా చేర్చారు. ఇదే భాగంలో పరిపాల ట్రిబ్యునళ్ళు మరియు ఇతర ట్రిబ్యునళ్ళ ఏర్పాటు సంబంధిత అంశాలు చేర్చారు. 1972 జనాభా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాల శాసనసభల సీట్ల సంఖ్యను 2001 వరకు మార్చకుండా నిబంధన విధించారు.
ఇదే సవరణ ద్వారా రాజ్యాంగ సవరణలకు న్యాయస్థానాల విచారణ పరిధి మినహాయింపు కల్పించారు. సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయ సమీక్షాధికారాన్ని రిట్లను పరిశీలించే పరిధిని తగ్గించారు. అలానే లోక్ సభ, శాసన సభ సభ్యల పదవీకాలాన్ని 5 ఏళ్ళ నుండి 6 ఏళ్లకు పెంచారు.
- ఆదేశిక సూత్రాల అమలకు చేసిన చట్టాలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయన్న కారణంతో అవి చెల్లవని కోర్టులు ప్రకటించడానికి వీలు లేదు.
- జాతి వ్యతిరేక కార్యకలాపాను నియంత్రించడానికి పార్లమెంటుకు చట్టాలను రూపొందించే అధికారం కల్పించారు. ఈ చట్టాలకు ప్రాథమిక హక్కుల కంటే ఎక్కువ ప్రాధన్యత కల్పించారు.
- కొత్తగా మూడు ఆదేశిక సూత్రాలను చేర్చారు. ఇందులో సమ న్యాయం, ఉచిత న్యాయ సలహాలు, పర్యావరణ అడవుల వన్యప్రాణుల సంరక్షణ వంటివి ఉన్నాయి.
- రాష్ట్రపతి పాలనను పొడిగించే కాలపరిమితిని 6 నెలల నుండి ఏడాదికి పెంచారు.
- పార్లమెంట్ మరియు శాసన సభల్లో కోరం అవసరాన్ని తొలగించారు.
- అఖిల భారత న్యాయ సర్వీసులు ఏర్పాటుకు అవకాశం కల్పించారు.
- రాష్ట్ర జాబితాలోని అడవుల పరిరక్షణ, విద్య, తూనికలు, కొలతలు, ఖడ్గమృగాలు మరియు పక్షుల సంరక్షణ, న్యాయ పాలన వంటి అంశాలను తొలగించి ఉమ్మడి జాబితాలో చేర్చారు.
భారత రాజ్యాంగ 43వ సవరణ చట్టం 1977
ఈ సవరణ చట్టాన్ని జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకువచ్చింది. 42లో సవరించిన మెజారిటీ అంశాలను 43, 44 రాజ్యాంగ సవరణల ద్వారా తిరిగి పునఃప్రతిష్టించింది. సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయ సమీక్షాధికారాన్ని రిట్లను పరిశీలించే పరిధిని తిరిగి పెంచింది. జాతి వ్యతిరేక కార్యకలాపాను నియంత్రించడానికి పార్లమెంటుకు చట్టాలను రూపొందించే ప్రత్యేక అధికారాన్ని తొలగించింది.
భారత రాజ్యాంగ 44వ సవరణ చట్టం 1978
లోక్ సభ, శాసన సభ సభ్యల పదవీకాలాన్ని 6 ఏళ్ళ నుండి తిరిగి 5 ఏళ్లకు కుదించింది. పార్లమెంట్ మరియు శాసన సభల్లో కోరంనియామకాలకు తిరిగి అవకాశం కల్పించారు. పార్లమెంటరీ అధికారాలకు సంబందించిన నిబంధనలలో ప్రస్తావించిన బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ అనే పదాన్ని తొలగించింది. వార్త పత్రికలకు పార్లమెంట్, శాసనసభ సమావేశాల వాస్తవ నివేదికను ప్రచురించే స్వేచ్ఛ కల్పించింది.
- సుప్రీం కోర్టు, హైకోర్టుల ఉన్న అధికారాలను తిరిగి పునరుద్దించారు.
- జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించి అంతర్గత కల్లోలాలు అనే పదం తొలగించి సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని చేర్చింది.
- మంత్రివర్గ లిఖితపూర్వక సిపార్సు మేరకు మాత్రమే రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ప్రకటించాలనే నిబంధనను చేర్చింది.
- జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్రపతి పాలన విశాలకు సంబందించి కొన్ని విధానపరమైన రక్షణలను ఏర్పాటు చేసింది.
- ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి, చట్టబద్దమైన హక్కుగా రూపు మార్చింది.
- జాతీయ అత్యవసర పరిస్థితులలో ప్రాధమిక హక్కుల మినహాయింపును తొలగించింది.
- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానిమంత్రి, స్పీకర్లకు సంబందించిన వివాదాలను న్యాయపరిది నుండి మినహాయింపు నిబంధనను తొలగించింది.
45 రాజ్యాంగ సవరణ 1980 | ఎస్సీ మరియు ఎస్టీలకు రిజర్వేషన్లు మరియు పార్లమెంటు మరియు రాష్ట్రాల అసెంబ్లీలలో ఆంగ్లో ఇండియన్ సభ్యుల నామినేషన్ సీట్ల ప్రాతినిధ్యాన్ని మరో పదేళ్లపాటు పొడిగించారు. |
46వ రాజ్యాంగ సవరణ 1982 | సేల్స్ టాక్స్‌పై పరిధి మరియు వాటి పరిధిలోని లొసుగులను తొలగించుకునేందుకు రాష్ట్రాలకు అవకాశం కల్పించారు. |
47వ రాజ్యాంగ సవరణ 1984 | వివిధ రాష్ట్రాలకు చెందిన భూసంస్కరణ చట్టాలను షెడ్యూల్ 9 యందు జోడించారు. |
48వ రాజ్యాంగ సవరణ 1984 | పంజాబ్ రాష్ట్రంలో రెండేళ్ల వరకు రాష్ట్రపతి పాలనను అనుమతించేందుకు ఆర్టికల్ 356 సవరించారు. |
49వ రాజ్యాంగ సవరణ 1984 | త్రిపురను గిరిజన రాష్ట్రంగా గుర్తించి, త్రిపుర గిరిజన ప్రాంతాల స్వయంప్రతిపత్త జిల్లా కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించారు. |
50వ రాజ్యాంగ సవరణ 1960 | సాయుధ బలగాలు లేదా ఇంటిజెన్స్ సంస్థలకు చెందిన ప్రాథమిక హక్కులను నియంత్రించే అధికారం పార్లమెంటుకు కల్పించారు. |
51వ రాజ్యాంగ సవరణ 1984 | లోక్‌సభలో నాగాలాండ్, మేఘాలయ, మిజోరం మరియు అరుణాచల్ ప్రదేశ్‌లలోని షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్ కల్పించారు. ఆయా రాష్ట్రాల శాసన సభల్లో కూడా దీనిని అమలు చేసారు. |
52వ రాజ్యాంగ సవరణ 1985 | ఫిరాయింపు నిరోధక చట్టం - ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి ఫిరాయించిన సందర్భంలో పార్లమెంటు మరియు అసెంబ్లీ నుండి సభ్యులపై అనర్హత వేటు నిబంధనలను సవరించింది. దీనికి సంబంధించి షెడ్యూల్ 10లోని కొన్ని భాగాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. |
53వ రాజ్యాంగ సవరణ 1986 | మిజోరాం రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక నిబంధనలను ఆర్టికల్ 371G ద్వారా చేర్చింది. |
54వ రాజ్యాంగ సవరణ 1986 | భారత ప్రధాన న్యాయమూర్తి & ఇతర న్యాయమూర్తుల జీతాలను పెంచడం మరియు రాజ్యాంగ సవరణ అవసరం లేకుండా భవిష్యత్తు పెరుగుదలను నిర్ణయించుకునే అవకాశం కల్పించింది. |
55వ రాజ్యాంగ సవరణ 1987 | అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు సందర్బంగా గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 371H చొప్పించింది. |
56వ రాజ్యాంగ సవరణ 1987 | గోవా రాష్ట్ర ఏర్పాటుకు సంబందించిన పరివర్తన నిబంధనలను ఆర్టికల్ 371I ద్వారా పోందుపర్చింది. |
57వ రాజ్యాంగ సవరణ 1987 | ఆర్టికల్ 332ని సవరిస్తూ నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం మరియు అరుణాచల్ ప్రదేశ్ శాసన సభలలో షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు కల్పించింది. |
58వ రాజ్యాంగ సవరణ 1987 | రాజ్యాంగం యొక్క ప్రామాణిక హిందీ అనువాదాన్ని ప్రచురించే నిబంధనలు మరియు భవిష్యత్ సవరణల సంబందించిన నియమాలను జోడించింది. |
59వ రాజ్యాంగ సవరణ 1988 | పంజాబ్ రాష్ట్రంలో మూడు సంవత్సరాల వరకు రాష్ట్రపతి పాలనను పొడిగించడానికి ఆర్టికల్ 356 సవరించబడింది. |
60వ రాజ్యాంగ సవరణ 1988 | వృత్తి పన్ను కనిష్టంగా రూ. 250/- నుండి గరిష్టంగా రూ. 2500/- వరకు పెంచుతూ ఆర్టికల్ 276ని సవరించారు. |
61వ రాజ్యాంగ సవరణ 1989 | ఓటు హక్కు వయస్సును 21 నుండి 18కి తగ్గిస్తూ ఆర్టికల్ 326ని సవరించారు. |
62వ రాజ్యాంగ సవరణ 1990 | ఆర్టికల్ 334ని సవరిస్తూ ఎస్సీ మరియు ఎస్టీలకు రిజర్వేషన్లు మరియు పార్లమెంటు మరియు రాష్ట్రాల అసెంబ్లీలలో ఆంగ్లో ఇండియన్ సభ్యుల నామినేషన్ సీట్ల ప్రాతినిధ్యాన్ని మరో పదేళ్లపాటు పొడిగించారు. |
63వ రాజ్యాంగ సవరణ 1990 | 59వ సవరణ ద్వారా ఆర్టికల్ 359A ద్వారా పంజాబ్ రాష్ట్రానికి కల్పించిన అత్యవసర అధికారాలు రద్దు చేయబడ్డాయి. |
64వ రాజ్యాంగ సవరణ 1990 | పంజాబ్ రాష్ట్రంలో గరిష్టంగా మూడు సంవత్సరాల ఆరు నెలల వరకు రాష్ట్రపతి పాలనను అనుమతించడానికి ఆర్టికల్ 356 సవరించారు. |
65వ రాజ్యాంగ సవరణ 1990 | షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల కోసం జాతీయ కమిషన్ ఏర్పాటు చేశారు. రాజ్యాంగంలో దానికి సంబంధించి చట్టబద్ధమైన అధికారాలు పొందుపర్చారు. |
66వ రాజ్యాంగ సవరణ 1990 | వివిధ రాష్ట్రాలకు చెందిన మరో 55 భూసంస్కరణ చట్టాలను షెడ్యూల్ 9 యందు జోడించారు. |
67వ రాజ్యాంగ సవరణ 1990 | పంజాబ్ రాష్ట్రంలో గరిష్టంగా నాలుగు సంవత్సరాల వరకు రాష్ట్రపతి పాలనను అనుమతించడానికి ఆర్టికల్ 356 సవరించారు. |
68వ రాజ్యాంగ సవరణ 1991 | పంజాబ్ రాష్ట్రంలో గరిష్టంగా ఐదు సంవత్సరాల వరకు రాష్ట్రపతి పాలనను అనుమతించడానికి ఆర్టికల్ 356 సవరించారు. |
69వ రాజ్యాంగ సవరణ 1991 | ఢిల్లీని జాతీయ రాజధాని రీజియన్‌గా ప్రకటించారు. ఢిల్లీకి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా హోదా కల్పిస్తూ శాసనసభ మరియు మంత్రుల మండలి ఏర్పాటుకు అవకాశం కల్పించారు. |
70వ రాజ్యాంగ సవరణ 1992 | ప్రెసిడెంట్ ఎన్నికల కోసం ఎలక్టోరల్ కాలేజీలో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ మరియు యూనియన్ టెరిటరీ ఆఫ్ పాండిచ్చేరి సభ్యలకు భాగస్వామ్యం చేశారు. |
71వ రాజ్యాంగ సవరణ 1992 | కొంకణి , మణిపురి మరియు నేపాలీ భాషలను రాజ్యాంగంలోని షెడ్యూల్ 8లో చేర్చారు. దీనితో షెడ్యూల్ బాషల సంఖ్య 18కి చేరింది. |
72వ రాజ్యాంగ సవరణ 1992 | త్రిపుర రాష్ట్ర శాసనసభలో షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు కల్పించారు. |
73వ రాజ్యాంగ సవరణ 1992 | పంచాయతీ సంస్థలకు రాజ్యాంగ హోదా, భద్రత కల్పిస్తూ కొత్తగా పార్ట్ 9 ని రాజ్యాంగంలో చేర్చారు. అలాగే పంచాయతీలకు సంబంధించి 29 విధులతో కూడిన షెడ్యూల్ 11ని రాజ్యాంగంకు జోడించారు. |
---|---|
74వ రాజ్యాంగ సవరణ 1992 | పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా, భద్రత కల్పిస్తూ కొత్తగా పార్ట్ 9A ని రాజ్యాంగంలో చేర్చారు. అలాగే మున్సిపాలిటీలకు సంబంధించి 18 విధులతో కూడిన షెడ్యూల్ 12ని రాజ్యాంగంకు జోడించారు. |
75వ రాజ్యాంగ సవరణ 1994 | భూయజమానికి, కౌలుదారికి మధ్య వివాదాలు పరిష్కరించేందుకు రెంట్ కంట్రోల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు. |
76వ రాజ్యాంగ సవరణ 1994 | రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ ప్రకారం సంబంధిత తమిళనాడు చట్టాన్ని చేర్చడం ద్వారా తమిళనాడులో 69% రిజర్వేషన్ల కల్పనకు అవకాశం కల్పించింది. 1992లో సుప్రీం ఇచ్చిన తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్ల కోటా 50శాతంకు మించకూడదు అనే నిబంధన ఉంది. |
77వ రాజ్యాంగ సవరణ 1995 | పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రిజర్వేషన్లు కల్పించేందుకు సాంకేతిక సవరణ చేసారు. ఈ సవరణతో పదోన్నతిలో సుప్రీం ఇచ్చిన రూలింగ్ నిర్వీర్యం అయ్యింది. |
78వ రాజ్యాంగ సవరణ 1995 | వివిధ రాష్ట్రాలకు చెందిన మరో 27 భూసంస్కరణ చట్టాలను షెడ్యూల్ 9 యందు జోడించారు. దీనితో మొత్తం భూసంస్కరణ చట్టాల సంఖ్య 282కి చేరుకుంది. |
79వ రాజ్యాంగ సవరణ 1999 | ఎస్సీ మరియు ఎస్టీలకు రిజర్వేషన్లు మరియు పార్లమెంటు మరియు రాష్ట్రాల అసెంబ్లీలలో ఆంగ్లో ఇండియన్ సభ్యుల నామినేషన్ సీట్ల ప్రాతినిధ్యాన్ని మరో పదేళ్లపాటు పొడిగించారు. |
80వ రాజ్యాంగ సవరణ 2000 | 10వ ఆర్థిక సంఘం సలహా మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయాల పంపిణి కొరకు ప్రత్యామ్నాయ విధానం ఏర్పాటు చేశారు. మొత్తం పన్నులు, సుంకాల ఆదాయంలో 29శాతం రాష్ట్రాలకు ఇచ్చేలా నిబంధన చేర్చారు. |
81వ రాజ్యాంగ సవరణ 2000 | బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను కాపాడేందుకు కొత్త నిబంధనలు జోడించారు. |
82వ రాజ్యాంగ సవరణ 2000 | ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ప్రమోషన్ కోసం నిర్వహించే పరీక్ష లేదా ఇంటర్వ్యూలో రిజర్వేషన్ కోటా ఆధారంగా అర్హత మార్కులు మరియు ఇతర ప్రమాణాల సడలింపుకు అనుమతి కల్పించారు. |
83వ రాజ్యాంగ సవరణ 2000 | పంచాయతీ రాజ్ సంస్థల్లో షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నుండి అరుణాచల్ ప్రదేశ్‌కు మినహాయింపు కల్పించారు. |
84వ రాజ్యాంగ సవరణ 2001 | రాష్ట్రాల వారీగా పార్లమెంటరీ సీట్ల పంపిణీ కోసం 1971 జాతీయ జనాభా లెక్కల జనాభా గణాంకాల వినియోగాన్ని మరో 25 ఏళ్ళ వరకు పొడిగించింది. అనగా 2026 అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనను నిషేదించింది. |
85వ రాజ్యాంగ సవరణ 2002 | ఎస్సీ మరియు ఎస్టీల ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో పర్యవసానంగా సీనియారిటీని రక్షించడానికి సాంకేతిక సవరణ చేసింది. |
86వ రాజ్యాంగ సవరణ 2002 | ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చింది. దీని కోసం కొత్తగా ఆర్టికల్ 21-ఏ ని చేర్చింది. 6 నుండి 14 ఏళ్లలోపు బాల బాలికలకు నిర్బంధ ప్రాథమిక విద్య తప్పనిసరి చేసింది. |
87వ రాజ్యాంగ సవరణ 2003 | రాష్ట్రాల వారీగా పార్లమెంటరీ సీట్ల పంపిణీ కోసం 2001 జాతీయ జనాభా లెక్కల గణాంకాలను వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. |
88వ రాజ్యాంగ సవరణ 2003 | సేవా పన్ను విధింపు మరియు పన్ను వినియోగానికి చట్టబద్ధమైన నిబంధనలు చేర్చింది. |
89వ రాజ్యాంగ సవరణ 2003 | షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల జాతీయ కమీషన్‌ను షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ మరియు షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్‌గా విభజించారు. దీని కోసం కొత్తగా ఆర్టికల్ 338Aని చేర్చింది. |
90వ రాజ్యాంగ సవరణ 2003 | బోడోలాండ్ భూభాగ ప్రాంతానికి సంబంధించి అస్సాం అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కోటాను యధాతదంగా కొనసాగించింది. |
91వ రాజ్యాంగ సవరణ 2003 | ఫిరాయింపుల నిరోధక చట్టాలను పటిష్టం చేసేందుకు, మంత్రి మండలి పరిమాణాన్ని 15% శాసనసభ సభ్యులకు పరిమితం చేయబడింది. ఫిరాయింపు చట్టం ప్రకారం అనర్హుడు అయితే, సదురు సభ్యుడు మంత్రివర్గంలో చేర్చుకునేందుకు కూడా అనర్హుడు. |
92వ రాజ్యాంగ సవరణ 2003 | బోడో , డోగ్రీ , సంతాలి మరియు మథిలీ భాషలను షెడ్యూల్ 8లో చేర్చారు. దీనితో షెడ్యూల్ బాషల సంఖ్య 22కి చేరింది. |
93వ రాజ్యాంగ సవరణ 2005 | ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) కోసం 27శాతం రిజర్వేషన్ కల్పించింది. ఇది మైనారిటీ విద్యాసంస్థలకు వర్తించదు. |
94వ రాజ్యాంగ సవరణ 2006 | మధ్యప్రదేశ్ మరియు ఒరిస్సాతో సహా కొత్తగా సృష్టించబడిన జార్ఖండ్ మరియు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో తప్పనిసరి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉండాలనే నిబంధన చేర్చింది. బీహార్ రాష్ట్రానికి సంబంధించి ఈ నిబంధన తొలగించింది. |
95వ రాజ్యాంగ సవరణ 2009 | ఎస్సీ మరియు ఎస్టీలకు రిజర్వేషన్లు మరియు పార్లమెంటు మరియు రాష్ట్రాల అసెంబ్లీలలో ఆంగ్లో ఇండియన్ సభ్యుల నామినేషన్ సీట్ల ప్రాతినిధ్యాన్ని మరో పదేళ్లపాటు పొడిగించారు. |
96వ రాజ్యాంగ సవరణ 2011 | ఒరియా స్థానంలో ఒడియాని చేర్చింది. దీనితో షెడ్యూల్ 8లోని ఒరియా భాషను ఒడియాగా మార్చబడింది. |
97వ రాజ్యాంగ సవరణ 2011 | సహకార సంఘాలకు రాజ్యాంగ హోదాతో పాటుగా భద్రత కల్పించారు. ఆర్టికల్ 19 ద్వారా సహకార సంస్థలు ఏర్పాటు చేసుకోవడం ప్రాథమిక హక్కుగా మార్చారు. ఆర్టికల్ 43-బి ద్వారా సహకార సంఘాలను అభివృద్ధి చేయడానికి ఆదేశ సూత్రం జోడించింది. సహకార సంఘాల కోసం కొత్తగా పార్ట్ 9బి చేర్చారు. |
98వ రాజ్యాంగ సవరణ 2012 | కర్ణాటకలోని హైదరాబాద్-కర్ణాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక నిబంధనలు చేర్చారు. |
99వ రాజ్యాంగ సవరణ 2015 | జాతీయ న్యాయ నియామకాల కోసం కమిషన్ ఏర్పాటు చేసారు. దీనిని గోవా, రాజస్థాన్, త్రిపుర, గుజరాత్ మరియు తెలంగాణతో సహా 29 రాష్ట్రాలలో 16 రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించాయి. ఈ బిల్లును రాష్ట్రపతి కూడా ఆమోదించారు. అయితే ఈ సవరణను సుప్రీంకోర్టు 16 అక్టోబర్ 2015న కొట్టివేసింది. |
100వ రాజ్యాంగ సవరణ 2015 | బంగ్లాదేశ్‌తో నిర్దిష్ట ఎన్‌క్లేవ్ భూభాగాల మార్పిడికి అవకాశం కల్పించారు. భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య భూ సరిహద్దు ఒప్పందం ( LBA) ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా ఎన్‌క్లేవ్‌ల నివాసితులకు పౌరసత్వ హక్కులను కల్పించారు. |
101వ రాజ్యాంగ సవరణ 2017 | వస్తు సేవల పన్నును (జీఎస్టీ) ప్రవేశపెట్టారు. |
102వ రాజ్యాంగ సవరణ 2018 | వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించారు. |
103వ రాజ్యాంగ సవరణ 2019 |
|
104వ రాజ్యాంగ సవరణ 2020 | లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో ఎస్సీ, ఎస్టీలకు సీట్ల రిజర్వేషన్‌ను డెబ్బై ఏళ్ల నుంచి ఎనభై ఏళ్లకు పొడిగించారు. లోక్‌సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీలలో ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీకి రిజర్వు చేసిన సీట్లను తొలగించారు. |
105వ రాజ్యాంగ సవరణ 2021 | సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన ఇతర వెనుకబడిన తరగతులను (ఓబీసీ) గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వాల అధికారాన్ని పునరుద్ధరించింది. ఈ సవరణ 11 మే 2021 నాటి సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేసింది. |