Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన నదులు మరియు వాటి భౌగోళిక వివరాలు
AP Geography Telugu Gk

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన నదులు మరియు వాటి భౌగోళిక వివరాలు

ఆంధ్రప్రదేశ్‌లో 40 పెద్ద, మధ్య మరియు చిన్న నదులతో కూడిన నదీ వ్యవస్థ ఉంది. వీటిలో గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి మరియు పెన్నా నదులు ప్రధానమైనవి. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద మరియు పొడవైన నది గోదావరి. ఆంధ్రప్రదేశ్ 975 కిమీల పొడవైన తీరప్రాంతం కలిగి ఉంది. ఇది గుజరాత్ తర్వాత భారతదేశంలో రెండవ పొడవైన తీరప్రాంతం.

ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఎక్కువ భాగం వాయవ్య భాగాన ఎత్తుగా ఉండి ఆగ్నేయ దిశగా వంగి ఉంటుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహించే నదులన్నీ వాయవ్య దిశ నుంచి ఆగ్నేయ దిశకు ప్రవహిస్తాయి. దేశంలో పశ్చిమ నుండి తూర్పుకు ప్రవించే ప్రధాన నదులు ఈ రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ మరియు తూర్పు కనుమల నుండి వచ్చే మెజారిటీ నదుల ప్రయోజనాలను పొందుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నది

గంగా నది తర్వాత భారతదేశం యొక్క రెండవ పొడవైన నది గోదావరి. ఇది భారత ఉపఖండంలో రెండవ అతిపెద్ద నదీ పరీవాహక ప్రాంతాన్ని కలిగి ఉంది. ఇది దేశ భౌగోళిక ప్రాంతంలో దాదాపు 10 శాతం భూభాగాన్ని కవర్ చేస్తుంది. ఇది దీపకల్ప నదులలో అతిపెద్దది, దక్షణ భారతదేశంలో ప్రవేహించే నదులలో కూడా ఇదే పెద్దది, అందుకే దీనిని దక్షిణ గంగా అని పిలుచుకుంటారు. గోదావరి మహారాష్ట్రలోని నాసిక్‌లోని త్రయంబకేశ్వర్‌లో జన్మించి, ఆంధ్రప్రదేశ్‌లో బంగాళాఖాతంలో కలుస్తుంది.

గోదావరి నది పాపికొండల సమీపాన బూర్గంపాడు మండలం వద్ద ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. రాష్ట్రం వెంబడి దాదాపు 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కోనసీమ జిల్లాలోని అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి ధవళేశ్వరం వద్ద గౌతమి మరియు వశిష్ట అనే రెండు శాఖలుగా విడిపోతుంది. ఈ రెండింటి మధ్య దాదాపు 80 కిమీ మేర గోదావరి సెంట్రల్ డెల్టా ఏర్పడుతుంది. గౌతమి శాఖ కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని యానాం ఎన్‌క్లేవ్ గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది.

నిజానికి గోదావరి ధవళేశ్వరం తర్వాత ఏడు పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది. వీటిని 1. గౌతమి 2. వశిష్ట 3. వైనతేయ 4. కౌశిక 5. ఆత్రేయ 6. తుల్య 7. భరద్వాజ పేర్లతో పిలుస్తారు. అందుకే దీనిని సప్త గోదావరి అని కూడా అంటారు. అయితే ఇందులో గౌతమి, వశిష్ట శాఖలు మాత్రమే ప్రధానమైనవి. ఈ సప్త గోదావరి ప్రాంతాన్ని కోనసీమ అని కూడా పిలుస్తారు. ఈ కోనసీమను ఆంధ్రప్రదేశ్ ఉద్యాన వనంగా భావిస్తారు.

గోదావరి నది భారతదేశంలోని మహారాష్ట్ర, తెలంగాణా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక మరియు ఒడిశాలో దాని పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంది. భారతదేశంలోని అన్ని నదీ పరీవాహక ప్రాంతాలలో గోదావరి బేసిన్‌లో నిర్మించిన ఆనకట్టల సంఖ్య అత్యధికం. 2023 నాటికి నదీ పరీవాహక ప్రాంతంలో దాదాపు 350 కి పైగా పెద్ద మరియు మధ్యస్థ ఆనకట్టలు మరియు బ్యారేజీలు నిర్మించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో ధవళేశ్వరం, పోలవరం ప్రాజెక్టులు ఉన్నాయి.

గోదావరి నదికి 16 ఉపనదులు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనవి ప్రవర నది, పూర్ణా నది, మానేరు నది, మంజీర నది, ప్రాణహిత నది, శబరి నది, సీలేరు నది, ఇంద్రావతి నది, కిన్నెరసాని నది. వీటిలో ప్రాణహిత నది గోదావరి నదికి అతిపెద్ద ఉపనది. వీటిలో కిన్నెరసాని, శబరి నదులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి.

గోదావరి నదిపై ప్రధానమైన ఏడు జలపాతాలు ఉన్నాయి. వీటిలో డుడుమ జలపాతం 175 మీటర్ల ఎత్తుతో దక్షిణ భారతదేశంలోని ఎత్తైన జలపాతాలలో ఒకటిగా ఉంది. ఇది ఆంధ్ర ప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల మధ్య సరిహద్దుగా ఉన్న సిలేరు నదిపై ఉంది. దీనితో పాటుగా ఈ నదీ పరీవాహక ప్రాంతంలో బోగత (చీకుపల్లి వాగుపై), చిత్రకూట్ (ఇంద్రావతి నది), కుంతల (కడం నదిపై), పోచెరా (హోలీ నది), సహస్త్రకుండ (పైంగంగా నది), తీరత్‌ఘర్ (కంగేర్ ఘాటి) ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణ నది

కృష్ణా నది దక్కన్ పీఠభూమిలో ఒక ప్రధాని నది. ఇది భారతదేశంలో గంగ మరియు గోదావరి తర్వాత మూడవ పొడవైన నది. గంగా, సింధు మరియు గోదావరి తర్వాత నీటి ప్రవాహాలు మరియు నదీ పరీవాహక ప్రాంతం పరంగా ఇది నాల్గవ అతిపెద్దది. ఈ నది మొత్తం పొడవు 1,400 కిలోమీటర్లు.

కృష్ణా నది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య శ్రీశైలం నుండి పులిచింతల వరకు సుమారు 290 కి.మీల వరకు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ డ్యామ్ గుండా ప్రవహిస్తుంది. సాగర్ నుండి విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజీ వరకు 105 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తుంది. ప్రకాశం నుండి మరో 90 కిలోమీటర్లు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇలా మొత్తం 485 కిలోమీటర్ల పొడవున కృష్ణా నది ఏపీ రాష్ట్రం గుండా ప్రవహిస్తోంది.

కృష్ణా నది మహారాష్ట్ర రాష్ట్రంలోని సుమారు 1,300 మీటర్ల ఎత్తులో ఉన్న మహాబలేశ్వర్ సమీపంలోని పశ్చిమ కనుమలలో ఉద్భవించింది. కృష్ణా నదికి మొత్తం 13 ప్రధాన ఉపనదులు ఉన్నాయి. దీని ప్రధాన ఉపనదులలో ఘటప్రభ నది, మలప్రభ నది, భీమా నది, తుంగభద్ర నది మరియు మూసీ నదులు ఉన్నాయి. భీమా నది కృష్ణా నదికి అతి పొడవైన ఉపనది.

కృష్ణ నది కృష్ణా జిల్లా పరిధిలోని పులిగడ్డ వద్ద రెండు పాయలుగా చీలి, 'హంసలదీవి' అనే ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ రెండు శాఖల మద్య ఉన్న సారవంతమైన మైదానాన్ని 'దివి సీమ' అంటారు. కృష్ణానదిలో నీటి అవసరాలకు సరిపడా నీటి లభ్యత లేకపోవడంతో ప్రకాశంకు నీటి లభ్యతను పెంచేందుకు 2015లో పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడికాలువతో గోదావరి నదిని కృష్ణా నదికి అనుసంధానం చేశారు. కృష్ణా-గోదావరి డెల్టాను "భారతదేశపు వరి ధాన్యాగారం " అని పిలుస్తారు.

కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం చమురు, గ్యాస్, బొగ్గు, ఇనుము, సున్నపురాయి, డోలమైట్, బంగారం, గ్రానైట్, లాటరైట్, యురేనియం, వజ్రాలు మొదలైన సుసంపన్నమైన ఖనిజ నిక్షేపాలను కలిగి ఉంది. వీటిలో కృష్ణా గోదావరి బేసిన్ (ఆయిల్ & గ్యాస్), యెల్లందు (బొగ్గు), బయ్యారం గనులు (ఇనుము), కుద్రేముఖ్ (ఇనుము), దోనిమలై (ఇనుము), జగ్గయ్యపేట గనులు (డోలమైట్), దోనిమలై (ఇనుము), నల్గొండ యురేనియం నిక్షేపాలు, కొల్లూరు గని (వజ్రాలు) హట్టి బంగారు గనులు , జగ్గయ్యపేట గనులు (డోలమైట్) ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో తుంగభద్ర నది

తుంగభద్ర నది కృష్ణా నదికి ముఖ్యమైన ఉపనది. రామాయణ కాలంలో పంపానదిగా పిలువబడిన తుంగభద్ర నది కర్ణాటకలో పడమటి కనుమలలో జన్మించిన తుంగ మరియు భద్ర అను రెండు నదుల కలయిక వలన ఏర్పడినది. షిమోగా సమీపంలో ఈ రెండు ప్రవాహాల సంగమం ఏర్పడుతుంది. ఇక్కడ నుండి ఆంధ్ర ప్రదేశ్‌లోని సంగమలేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలిపే వరకు సుమారు 531 కిమీల దూరం ప్రవహిస్తుంది.

తుంగభద్ర నది ప్రధాన కృష్ణా నదిలో కలిసే వరకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సరిహద్దుల ప్రయాణిస్తుంది. బళ్లారి జిల్లాలోని సిరుగుప్ప తాలూకాలో వేదవతి నది ఇందులో కలుస్తుంది. కర్నూలు జిల్లా కౌతాలం మండలం వద్ద ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి, మంత్రాలయం, కర్నూలు గుండా ప్రవహిస్తుంది. కర్నూలు సమీపంలో దాని ఉపనది హంద్రీ నది ఇందులో సంగమిస్తుంది.

తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని గుండిమల్ల గ్రామ సమీపంలో తుంగభద్ర కృష్ణలో కలిసిపోతుంది. తుంగభద్ర మరియు కృష్ణ నదుల సంగమం ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. ఇక్కడే సంగమేశ్వరం దేవాలయం ఉంటుంది. భౌగోళికంగానే కాకుండా చారిత్రకంగానూ ఈ నదికి ప్రాధాన్యత ఉంది. దక్షిణ భారతదేశ మధ్యయుగ చరిత్రలో వెలిసిన విజయనగర సామ్రాజ్యం ఈ నది ఒడ్డునే వెలిసింది. హంపి, మంత్రాలయం లాంటి పుణ్యక్షేత్రాలు ఈ నది ఒడ్డున వెలిశాయి. పెద్దలు తుంగభద్రను భారతదేశంలోని పంచగంగల్లో ఒకటిగా పేర్కొన్నారు.

తుంగభద్ర నదిపై ఉన్న ఆనకట్టలలో తుంగభద్ర ఆనకట్ట ప్రధానమైనది. ఈ ఆనకట్ట కర్ణాటకలోని హోసపేట్ పట్టణానికి సమీపంలో ఉంది. ఇది యునెస్కో వారసత్వ ప్రదేశమైన హంపికి సమీపంలో ఉంది. దీనిని మద్రాసుకు చెందిన వాస్తుశిల్పి తిరుమలై అయ్యంగార్ డిజైన్ చేసారు. అలానే కర్నూలు నగరానికి సమీపంలో సుంకేశుల ఆనకట్ట కూడా ఈ నదిపై నిర్మించబడింది. ఇది రాయలసీమకు భగీరథడుగా ప్రశంసించబడే బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ ద్వారా 1860 లో తుంగభద్ర నదిమీదిగా నిర్మించబడింది.

అలానే కడప జిల్లాకు సాగునీటి సరఫరా అందించడానికి మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం కోట్ల విజయభాస్కర రెడ్డి తుంగభద్ర బ్యారేజీని పునర్నిర్మించారు. రోడ్డు మరియు రైలు రవాణా పెరిగినందున, ఇది ఇప్పుడు కెసి కాలువ ద్వారా కర్నూలు, కడప జిల్లాలకు నీటిని సరఫరా చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో పెన్నా నది

పెన్నా, పెన్నేరు లేదా  పినాకిని పేరుతొ పిలిచే ఈ నది దక్షిణ భారతదేశంలోని కర్ణాటక నందిదుర్గ కొండలలోని చెన్నకేశవ కొండల్లో ఉద్భవించి, ఉత్తర మరియు దక్షిణ దిశలలో ఒకటిగా రెండు వేర్వేరు ప్రవాహాలుగా ప్రవహించే ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన నది. ఇది నంది పర్వత శ్రేణుల గుండ 40 కి.మీ. ప్రవహించి శ్రీ సత్యసాయి జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశిస్తుంది.

అక్కడి నుంచి 597 కి.మీ. అనంతపురం జిల్లా, వైఎస్‌ఆర్ జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో ప్రవహించి నెల్లూరుకు ఈశాన్యంగా 20 కి.మీ. దూరంలో ఊటుకూరు దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ  నది ఉత్తర మరియు దక్షిణ దిశలలో రెండు ప్రవాహాలలో ప్రవహిస్తుంది కాబట్టి, అది విల్లు ఆకారాన్ని ఏర్పరుస్తుంది. అందుకే ఈ నదికి పినాకిని అనే విల్లు పేరు వచ్చింది. కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున గండి కోట ఈ నది మధ్యనే ఉంది. కోటకు ఇరువైపులా ప్రవహించే పెన్నా నది, కోటకు సహజసిద్ధమైన రక్షణ కవచం అందిస్తుంది.

పెన్నా నదికి గల ముఖ్యమైన ఉపనదులుగా కుముదావతి, జయమంగళ, చిత్రావతి, కుందేరు, పాపఘ్ని, సగిలేరు, చెయ్యేరు, బొగ్గేరు, బిరపేరులు ఉన్నాయి. పెన్నా నది పరీవాహక ప్రాంతం మొత్తం 55,213 చ.కి.మీ. వ్యాపించి ఉంది. ఇది భారత దేశపు మొత్తం విస్తీర్ణంలో 1.7%. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ (48,276 చ.కి.మీ.), కర్ణాటక (6,937 చ.కి.మీ.) రాష్ట్రాలలో విస్తరించి ఉంది.

ఈ నదిపై ఉన్న ఆనకట్టలలో నెల్లూరు జిల్లా సోమశిల వద్ద నిర్మించిన భారీ సాగునీటి ప్రాజెక్టు సోమశిల ప్రాజెక్టు ప్రధానమైనది. ఈ ప్రాజెక్టు నిర్మాణం 1971లో ప్రారంభమైంది. ప్రస్తుతం దీనిలో 70 టీఎంసీల నీరు నిల్వ ఉంచబడుతుంది. ఈ ప్రాజెక్టు 4.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందిస్తుంది. నెల్లూరు జిల్లాలో పెన్నా నదిపై మరో బ్యారేజ్ నిర్మాణంలో ఉంది. ప్రస్తుతం సంగం బ్యారేజీ పేరుతొ పిలుస్తున్న దీనికి దిగవంత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడతామని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లో వంశధార నది

వంశధార నది లేదా బంషధార నది భారతదేశంలోని ఒడిషా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రుషికుల్య మరియు గోదావరి మధ్య తూర్పుగా ప్రవహించే ముఖ్యమైన నది. ఈ నది ఒడిశాలోని కలహండి జిల్లాలో జన్మించి, సుమారు 254 కిలోమీటర్ల దూరం ప్రవహించి, ఆంధ్ర ప్రదేశ్‌లోని కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

శ్రీకాకుళం జిల్లాలోని ముఖలింగం మరియు కళింగపట్నం పర్యాటక ఆకర్షణలు ఈ నది ఒడ్డునే ఉన్నాయి. ఒడిషాలోని గజపతి జిల్లాలో ఉద్భవించే మహేంద్రతనయ నది దీని యొక్క ప్రధాన ఉపనది. ఇది గొట్టా బ్యారేజీకి ఎగువన ఆంధ్రప్రదేశ్‌లోని వంశధారలో కలుస్తుంది. వంశధార ఈశాన్య ఆంధ్ర యొక్క ప్రధాన నది. ఈ నదిపై నిర్మించిన వంశధార ప్రాజెక్టు ఈశాన్య కోస్తా ఆంధ్రాకు సాగునీటి అవసరాలను తీర్చుతుంది. దీనిని బొడ్డేపల్లి రాజగోపాలరావు ప్రోద్బలంతో నిర్మించారు.

వంశధార ప్రాజెక్ట్‌లో రెండు ప్రధాన కాలువలు ఉన్నాయి. ఎడమ ప్రధాన కాలువ 600 కిమీ పొడవుతో సుమారు 148,000 ఎకరాలు, కుడి ప్రధాన కాలువ 252 కిమీ పొడవుతో సుమారు 62,280 ఎకరాల ఆయకట్టును కవర్ చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో నాగావళి నది

నాగావళి నది దక్షిణ ఒడిషా, ఉత్తరాంధ్రలో ప్రవహించే నది. ఒడిషా రాష్ట్రములో పుట్టి, 225 కిలోమీటర్లు ప్రవహించి బంగాళా ఖాతములో చేరుతుంది. శ్రీకాకుళం పట్టణం ఈ నదీ తీరమునే ఉంది. బర్హా, బల్దియా, సత్నాల, సీతగుర్హ, శ్రీకోన, జంఝావతి, గుముడుగెడ్డ, వొట్టిగెడ్డ, సువర్ణముఖి, వోనిగెడ్డ, రెల్లిగెడ్డ, వేగావతి నదులు నాగావళి యొక్క ప్రధాన ఉపనదులు.

ఈ నది యొక్క మొత్తం పరీవాహక ప్రాంతము 9,410 చ.కి.మీ. అందులో 4,462 చ.కి.మీలు ఒడిషా రాష్ట్రములో, 4,948 చ.కి.మీలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఉంది. నాగావళి నది మీద తోటపల్లి, నారాయణపురం వద్ద నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి. తోటపల్లి నీటిపారుదల ప్రాజెక్టు యొక్క ఆయకట్టు 37,000 ఎకరాలకు, నారాయణపురం ఆనకట్ట యొక్క ఆయకట్టు దాదాపు 40,000 ఎకరాలకు సాగునీటిని అందిస్తుంది. నాగావళి శ్రీకాకుళం పట్టణం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్లేపల్లి గ్రామం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

Post Comment