కేంద్ర బడ్జెట్ 2023 ను భారత ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 01, 2023న పార్లమెంటులో సమర్పించారు. ఆమె ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టిన ఐదవ బడ్జెట్ ఇది. అలానే నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఏ 2 ప్రభుత్వం యొక్క చిట్టచివరి పూర్తిస్థాయి బడ్జెట్ కూడా ఇదే. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనుందున, 2024లో ఈ ప్రభుత్వానికి తాత్కాలిక బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది.
సీతారామన్ స్వతంత్ర భారతదేశంలో ఐదు వరుస బడ్జెట్‌లను సమర్పించిన ఆరవ ఆర్థిక మంత్రిగా నిలిచారు. 2019 నుండి ఆమె వరుసగా ప్రవేశపెట్టిన ఐదవ బడ్జెట్ ఇది. దీనితో మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ మరియు పి చిదంబరం వంటి లెజెండ్‌ల సరసన ఆమె చేరారు. అలానే ఆమె 2021లో భారతదేశ మొదటి డిజిటల్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనతను కూడా దక్కించుకున్నారు.
యూనియన్ బడ్జెట్ మొదటిలో భారతదేశ వార్షిక ఆర్థిక నివేదికగా సమర్పించే వారు, కాలానుగుణంగా ఇది ప్రభుత్వం యొక్క ఆదాయం మరియు ఖర్చుల అంచనా రిపోర్టుగా మారింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం ఏటా బడ్జెట్ సమర్పించడం ప్రభుత్వం యొక్క తప్పనిసరి విధి.
భారతదేశపు మొదటి బడ్జెట్‌ను 1860 ఫిబ్రవరి 18న స్కాట్‌లాండ్‌కు చెందిన జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి యూనియన్ బడ్జెట్‌ను 26 నవంబర్ 1947న ఆర్కే షణ్ముఖం చెట్టి సమర్పించారు. అయితే రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క మొదటి బడ్జెట్‌ను జాన్ మథాయ్ ఫిబ్రవరి 28 , 1950న సమర్పించారు.
కేంద్ర బడ్జెట్ 2023 : కీలక అంచనాలు
- మొత్తం బడ్జెట్ అంచనా - 45,03,097 కోట్లు
- రెవిన్యూ వసూళ్లు - 26,32,281 కోట్లు
- రెవిన్యూ వ్యయం - 35,02,136 కోట్లు
- మూలధన వసూళ్లు - 18,70,816 కోట్లు
- మూలధన వ్యయం - 10,00,961 కోట్లు
- ప్రణాళిక వ్యయం - 19.44 లక్షల కోట్లు
- ప్రణాళికేతర వ్యయం - 25.59 లక్షల కోట్లు
- కొత్త ఏడాదిలో స్థూల అప్పులు - 15,43,0000 కోట్లు
కేంద్ర బడ్జెట్ 2023 : కీలక పథకాలకు కేటాయింపులు
- ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం - 79,590 కోట్లు
- జల్ జీవన్ మిషన్ - 70,000 కోట్లు
- ఉపాధి హామీ పథకం - 60,000 కోట్లు
- పీఎం కిషన్ సమ్మాన్ నిధి - 60,000 కోట్లు
- జాతీయ ఆరోగ్య మిషన్ - 36,785 కోట్లు
- కృషిసంచాయ్ యోజన - 10,787 కోట్లు
- జాతీయ విద్యా మిషన్ - 38,953 కోట్లు
- ఆదిమ గిరిజనులకు - 15,0000 కోట్లు
కేంద్ర బడ్జెట్ 2023 : కీలక రంగాలకు కేటాయింపులు
- రైల్వే బడ్జెట్ కేటాయింపు - 2.4 లక్షల కోట్లు
- రక్షణ శాఖకు బడ్జెట్ కేటాయింపు - 5.94 లక్షల కోట్లు
- ప్రజా ఆరోగ్యం - 89,155 కోట్లు
- అంతరిక్ష పరిశోధన - 12,544 కోట్లు
- జాతీయ రహదారులు - 1.62 లక్షల కోట్లు
- గ్రామీణ అభివృద్ధి - 2.38 లక్షల కోట్లు
- వ్యవసాయం - 84,214 కోట్లు
- జీఎస్టీ పరిహార నిధి - 1.45 లక్షల కోట్లు
- విద్య - 1.12 లక్షల కోట్లు
- సామాజిక సంక్షేమం - 55,080 కోట్లు
కేంద్ర బడ్జెట్ 2023 కీ పాయింట్స్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 2023 బడ్జెట్‌ను అమృత్‌కాల్‌లో తోలి బడ్జెట్‌గా అభివర్ణించారు. త్వరలో జరుపుకునే వందేళ్ల స్వాతంత్ర భారతదేశ ప్రగతికి ఇది బ్లూప్రింట్ అని, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి అమృత్‌కాల్‌లోని ఈ తోలి బడ్జెట్ పునాదులు వేస్తుందని ఆమె తెలిపారు.
స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలైన సందర్భాన్ని పురస్కరించుకుని వచ్చే 25 ఏళ్ళు భారత్‌కు అమృత్‌కాల్‌గా నరేంద్ర మోడీ గతంలో ప్రకటించారు. టెక్నాలజీ, విజ్ణానం ఆధారంగా బలమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించడమే అమృత్‌కాల్ లక్ష్యంగా ఆమె పేర్కొన్నారు. కోవిడ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు మందగమనంలో ఉండగా, భారత్ 7 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని తెలిపారు.
నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023లో ఏడు ప్రాధాన్యతలను జాబితా చేశారు. ఇవి అమృత్‌కాల్‌లో భారత్‌కు మార్గనిర్దేశం చేసే 'సప్తఋషులుగా' పనిచేస్తాయని తెలిపారు. జాబితాలో చేసిన వాటిలో
- 1. సమ్మిళిత అభివృద్ధి
- 2. మారుమూలకూ అభివృద్ధి
- 3. మౌలిక సదుపాయాలు & పెట్టుబడులు
- 4. సంభావ్యతను ఆవిష్కరణ
- 5. హరిత వృద్ధి
- 6. యువశక్తి
- 7. ఆర్థిక రంగం
1. సమ్మిళిత అభివృద్ధి
- సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ అనే ప్రభుత్వ సిద్ధాంతం రైతులు, మహిళలు, యువత, ఓబీసీలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, దివ్యాంగులు, ఆర్థికంగా బలహీన వర్గాలు మరియు అణగారిన వర్గాలలో సమ్మిళిత అభివృద్ధిని సులభతరం చేసిందని, ఇదే ఉత్సహంతో జమ్మూ & కాశ్మీర్, లడఖ్ మరియు ఇతర ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.
- వ్యవసాయ అభివృద్ధి కోసం అందరికి అందుబాటులో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను రూపొందిస్తున్నట్లు, పంట ప్రణాళిక మరియు ఆరోగ్యం, వ్యవసాయ ఇన్‌పుట్‌లు, క్రెడిట్ మరియు బీమాకు మెరుగైన ప్రాప్యత కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
- రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను విన్నూతంగా పరిష్కరించేందుకు గ్రామీణ ప్రాంతాల్లోని యువ పారిశ్రామికవేత్తలచే అగ్రి-స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 2,200 కోట్లతో వ్యాధి రహిత, నాణ్యమైన ఉద్యాన పంటల సాగుకు అవసరమయ్యే సామాగ్రిని, సాంకేతికతను అందుబాటులో ఉంచేందుకు ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.
- ఈ యేడాదిని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించినందున, ఇండియాను గ్లోబల్ హబ్ ఫర్ మిల్లెట్స్‌గా ప్రాచుర్యం కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నినాదం మిల్లెట్ల వినియోగంను పెంచడమే కాకుండా, పోషకాహారం, ఆహార భద్రత మరియు రైతుల సంక్షేమాన్ని మరింత మెరుగుపరుస్తుందని వెల్లడించారు.
- రైతుల సంక్షేమానికి సంబంధించి పశుపోషణ, పాడి పరిశ్రమ, మత్స్య రంగాలపై దృష్టి సారించి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని ఈ ఏడాది రూ.20 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
- మత్స్యకారులు, చేపల విక్రేతలు మరియు సూక్ష్మ & చిన్న పరిశ్రమల కార్యకలాపాలను మరింతగా పెంపొందించేందుకు, అలానే మార్కెట్‌ను విస్తరించడానికి ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయల లక్ష్య పెట్టుబడితో పీఎం మత్స్య సంపద యోజన యొక్క కొత్త ఉప పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
- 'సహకార్ సే సమృద్ధి' దార్శనికతను సాకారం చేసేందుకు కొత్తగా సహకార మంత్రిత్వ శాఖను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఈ దార్శనికతను సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.2,516 కోట్ల పెట్టుబడితో 63,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్) కంప్యూటరీకరణను ప్రారంభించిందని తెలిపారు.
- 2014 నుంచి ప్రభుత్వం మొత్తం 157 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిందని, ఇప్పుడు వాటికీ అనుబంధంగా 157 కొత్త నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 2047 నాటికి సికిల్ సెల్ అనీమియాను తొలగించే మిషన్‌ను ప్రారంభించనున్నట్లు తెలియజేశారు.
- ప్రభావిత గిరిజన ప్రాంతాల్లోని 0-40 సంవత్సరాల మధ్య వయస్సు గల 7 కోట్ల మంది ప్రజలకు సార్వత్రిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు, అలానే మెడికల్ పరిశోధనలు మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ప్రభుత్వ మరియు ప్రైవేట్ వైద్య కళాశాలలో, ఐసీఎమ్ఆర్ పరిశోధన ల్యాబ్‌లలో సౌకర్యాలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు.
- ఉపాధ్యాయ బోధన పద్దతులను మెరుగుపర్చేందుకు జిల్లా విద్యా మరియు శిక్షణా సంస్థలను వైబ్రెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అలానే విద్యార్థులకు నేషనల్ డిజిటల్ లైబ్రరీని మరింతంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రాలు పంచాయితీ మరియు వార్డు స్థాయిలలో భౌతిక గ్రంథాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
2. మారుమూలకూ అభివృద్ధి
- దేశ మారుమూల ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు నాడు వాజ్‌పేయి ప్రభుత్వం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖను ఏర్పాటు చేసిందని, నేడు మోడీ ప్రభుత్వం ఆయుష్, మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ, నైపుణ్యాభివృద్ధి, జలశక్తి మరియు సహకార మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేసిందని ఆర్థిక మంత్రి తెలిపారు.
- మారుమూల జిల్లాల అభివృద్ధికి సంబంధించి గతంలో ప్రారంభించిన ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాం విజయవంతమైన నేపథ్యంలో, ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, నీటి వనరులు, ఆర్థిక సమ్మేళనం వంటి బహుళ డొమైన్‌లలో ప్రభుత్వ సేవలను మెరుగుపర్చేందుకు ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్‌ను ఇటీవలే ప్రారంభించినట్లు తెలిపారు.
- బలహీన గిరిజన సమూహాల (పివిటిజి) సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి, ప్రధాన మంత్రి పివిటిజి డెవలప్‌మెంట్ మిషన్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. పివిటిజి కుటుంబాలకు సురక్షిత గృహాలు, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, రహదారులు, టెలికాం కనెక్టివిటీ మరియు స్థిరమైన జీవనోపాధి అవకాశాలను కల్పించేందుకు వచ్చే మూడేళ్లలో రూ.15,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
- వచ్చే మూడేళ్లలో 3.5 లక్షల మంది గిరిజన విద్యార్థులకు సేవలందిస్తున్న 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు 38,800 మంది ఉపాధ్యాయులు మరియు సహాయక సిబ్బందిని నియమించనున్నట్లు ప్రకటించారు.
- కర్ణాటకలోని కరువు పీడిత మధ్య ప్రాంతంలో, సుస్థిరమైన మైక్రో ఇరిగేషన్ మరియు తాగునీటి కోసం ఉపరితల ట్యాంకులను నింపడానికి ఎగువ భద్ర ప్రాజెక్ట్‌కు 5,300 కోట్ల రూపాయల కేంద్ర సహాయం ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
- ప్రధానమంత్రి ఆవాస్ యోజనను మరింతా మందికి చేరువ చేసేందుకు వాటి కేటాయింపులను 66 శాతం పెంచి రూ.79,000 కోట్లకు పైగా పెంచుతున్నట్లు తెలిపారు.
- లక్ష పురాతన శాసనాలను డిజిటలైజేషన్ చేసేందుకు ప్రస్తుతం ఉన్న డిజిటల్ ఎపిగ్రఫీ మ్యూజియంలలో 'భారత్ షేర్డ్ రిపోజిటరీ ఆఫ్ ఇన్‌స్క్రిప్షన్స్' ఏర్పాటు చేయనున్నారు ప్రకటించారు.
3. మౌలిక సదుపాయాలు & పెట్టుబడులు
- మూలధన పెట్టుబడి వ్యయాన్ని వరుసగా మూడో సంవత్సరం 33 శాతం నుంచి రూ. 10 లక్షల కోట్లకు పెంచుతున్నామని సీతారామన్ చెప్పారు. ఇది దేశ జిడిపిలో 3.3 శాతంకు సమానమని తెలిపారు. ఈ ఏడాది13.7 లక్షల కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్ చేయబడిందని, ఇది జిడిపిలో 4.5 శాతంకు సమానమని వెల్లడించారు.
- మూల ధన ఆస్తులను పెంచుకునేందుకు రాష్ట్రాలకు రూ. 13.7 లక్షల కోట్ల గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. అలానే రాష్ట్ర ప్రభుత్వాలకు 50 సంవత్సరాల వడ్డీ లేని రుణాన్ని మరో సంవత్సరం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు.
- రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని అందించినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఓడరేవులు, బొగ్గు, ఉక్కు, ఎరువులు మరియు ఆహార ధాన్యాల రంగాలకు రవాణా కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు రూ. 75,000 కోట్లును కేటాయించినట్లు తెలిపారు.
- ప్రాంతీయ వాయు కనెక్టివిటీని మెరుగుపరచడానికి యాభై అదనపు విమానాశ్రయాలు, హెలిపోర్ట్‌లు, వాటర్ ఏరోడ్రోమ్‌లు మరియు అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్‌లను పునరుద్ధరించనున్నట్లు సీతారామన్ చెప్పారు.
- టైర్ 2 మరియు టైర్ 3 పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (UIDF) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనిని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నిర్వహిస్తుందని, ఇందుకోసం ప్రభుత్వం ఏడాదికి 10,000 కోట్ల రూపాయలను అందుబాటులో ఉంచుతుందని వెల్లడించారు.
4. సంభావ్యతను ఆవిష్కరించడం
- ప్రభుత్వం యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను పెంపొందించడం కోసం 3,400 కంటే ఎక్కువ చట్టపరమైన నిబంధనలను నేరరహితం చేశామని, ట్రస్ట్ ఆధారిత పాలనను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, 42 కేంద్ర చట్టాలను సవరించేందుకు ప్రభుత్వం జన్ విశ్వాస్ బిల్లును ప్రవేశపెట్టినట్లు ఆర్థికమంత్రి తెలిపారు.
- కర్మయోగి సమీకృత ఆన్‌లైన్ శిక్షణా వేదిక ద్వారా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు, అలానే ప్రజలకు కేంద్రీకృత ప్రభుత్వ సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
- “మేక్ ఏఐ ఇన్ ఇండియా మరియు మేక్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా” అనే విజన్‌ను సాకారం చేయడం కోసం, దేశంలోని అగ్రశ్రేణి విద్యా సంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత మూడు ఎక్సలెన్స్ సెంటర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
- స్టార్టప్‌లు మరియు విద్యాసంస్థల ద్వారా ఆవిష్కరణలు మరియు పరిశోధనలను ప్రోత్సహించడానికి జాతీయ డేటా గవర్నెన్స్ పాలసీని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఇది అనామక ఆవిష్కర్తల డేటాకు ప్రాప్యత కల్పిస్తుందని వెల్లడించారు.
- వివిధ అధికారులు, రెగ్యులేటర్లు, బ్యాంకులు మరియు ఇతర వ్యాపార సంస్థలు తమ పత్రాలను ఆన్‌లైన్‌లో సురక్షితంగా నిల్వ చేయడానికి మరియు భాగస్వామ్యం చేయడం కోసం ఎంటిటీ డిజిలాకర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
- దేశంలో 5G సేవలు అందుబాటులోకి రావడంతో, దానికి అనుగుణంగా మౌలికసదుపాయాలను, ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు వంద స్మార్ట్ క్లాస్‌రూమ్‌లను ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
5. హరిత వృద్ధి (గ్రీన్ గ్రోత్)
- 2070 నాటికి హరిత పారిశ్రామిక మరియు ఆర్థిక పరివర్తనను పొందేందుకు రూపొందించుకున్న 'పంచామృతం' మరియు నికర-సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యంను సాధించేందుకు భారతదేశం దృఢంగా ముందుకు సాగుతోందని తెలిపారు.
- ఇటీవల ప్రారంభించిన నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోసం ఈ బడ్జెట్లో రూ. 19,700 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ కేటాయింపులు శిలాజ ఇంధనాల దిగుమతులను తగ్గించి, సౌర, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచుతుందని, భారతదేశం 2030 నాటికి 5 MMT వార్షిక గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి స్థాయికి చేరుకుంటుందని వెల్లడించారు.
- పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ ద్వారా ఇంధన పరివర్తన, ఇంధన భద్రత మరియు నికర శూన్య లక్ష్యాలు చేరుకునేందుకు రూ.35,000 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
- సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించేందుకు గోబర్ధన్ (గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో-అగ్రో రిసోర్సెస్ ధన్) పథకం కింద 500 కొత్త 'వేస్ట్ టు వెల్త్' ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వీటిలో 200 కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్లాంట్లు ఉన్నట్లు వెల్లడించారు.
- వచ్చే మూడేళ్లలో కోటి మంది రైతులు సహజ వ్యవసాయం చేసుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పిస్తుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇందుకోసం 10,000 బయో ఇన్‌పుట్ వనరుల కేంద్రాలను ఏర్పాటు చేసి, జాతీయ స్థాయిలో పంపిణీ చేయగలిగే సూక్ష్మ ఎరువులు మరియు పురుగుమందుల తయారీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
- 2021-22 బడ్జెట్‌లో పేర్కొన్న వాహనాల స్క్రాపింగ్ విధానానికి అనుగుణంగా, కేంద్ర ప్రభుత్వ పాత వాహనాలను స్క్రాప్ చేయడానికి తగిన నిధులను కేటాయించిదని, పాత వాహనాలు మరియు అంబులెన్స్‌లను మార్చడంలో రాష్ట్రాలు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు.
6. యువశక్తి
- యువతకు సాధికారత కల్పించేందుకు, వారి కలలను సాకారం చేయడం చేయడానికి ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందించిందని, వారిలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు, ఉద్యోగాల కల్పనకు దోహదపడే ఆర్థిక విధానాలను అవలంబించిందని మరియు వ్యాపార అవకాశాలకు మద్దతుఇస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు.
- వచ్చే మూడేళ్లలో లక్షలాది మంది యువతకు నైపుణ్యం కల్పించేందుకు ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కోడింగ్, ఏఐ, రోబోటిక్స్, మెకాట్రానిక్స్, ఐఓటీ, త్రీడీ ప్రింటింగ్, డ్రోన్లు మరియు సాఫ్ట్ స్కిల్స్ వంటి కోర్సులను అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు.
- యువతకు అంతర్జాతీయ అవకాశాలను అంది పుచ్చుకునేందుకు వివిధ రాష్ట్రాల్లో 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
- వచ్చే మూడు సంవత్సరాలలో 47 లక్షల మంది యువతకు స్టైఫండ్ మద్దతును అందించడానికి, పాన్-ఇండియా నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
- రాష్ట్రాలు తమ సొంత జిఐ ఉత్పత్తులు మరియు ఇతర హస్తకళా ఉత్పత్తుల ప్రచారం మరియు విక్రయం కోసం రాష్ట్ర రాజధాని లేదా అత్యంత ప్రముఖ పర్యాటక కేంద్రాలలో యూనిటీ మాల్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్రాలను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు.
7. ఆర్థిక రంగం
- ఎంఎస్ఎంఈల కోసం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌ను పునరుద్దిస్తున్నట్లు తెలిపారు. దీని కోసం 9వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఈ పథకం 1 ఏప్రిల్ 2023 నుండి అమలులోకి వస్తుందని ప్రకటించారు. ఇది ఎంఎస్ఎంఈలకు రూ. 2 లక్షల కోట్ల అదనపు పూచీకత్తు రహిత గ్యారంటీ క్రెడిట్‌ని అనుమతిస్తుందని వెల్లడించారు.
- ఆర్థిక మరియు అనుబంధ సమాచార కేంద్ర రిపోజిటరీగా పనిచేసేందుకు నేషనల్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీని ఏర్పాటు చేస్తున్నట్లు సీతారామన్ చెప్పారు. ఇది క్రెడిట్ యొక్క సమర్థవంతమైన ప్రవాహాన్ని సులభతరం చేస్తుందని, అలానే ఆర్థిక చేరికను మరియు ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుందని ప్రకటించారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జ్ఞాపకార్థం వన్-టైమ్ సేవింగ్ అనుమతితో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఇది 2 సంవత్సరాల కాలవ్యవధితో, 7.5 శాతం స్థిర వడ్డీ రేటుతో మహిళల పేరు మీద రూ. 2 లక్షల వరకు డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది.
- సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ గరిష్ట డిపాజిట్ పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలానే మంత్లీ ఇన్కమ్ అకౌంట్ స్కీమ్ గరిష్ఠ డిపాజిట్ పరిమితి సింగిల్ ఖాతాకు రూ.4.5 లక్షల నుంచి రూ.9 లక్షలకు, జాయింట్ ఖాతాకు రూ.9 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు.
- వ్యక్తిగత ఆదాయపు పన్నుకు సంబంధించి రిబేట్ పరిమితి ₹ 7 లక్షలకు పెంచబడింది, అంటే ₹ 7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 2020లో ప్రవేశపెట్టిన ఆరు ఆదాయ స్లాబ్‌ల విధానాన్ని 5కు తగ్గించారు. కొత్త విధానంలో 3 లక్షల వరకు ఎంటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 3 నుండి 6 లక్షల వరకు 5శాతం, 6 నుండి 9 లక్షల వరకు 15శాతం, 9 నుండి 12 వరకు 15శాతం, 12 నుండి 15 లక్షల వరకు 20శాతం మరియు 15 లక్షలకు మించి ఆదాయం ఉన్నవారు 30శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
- పన్ను చెల్లింపుదారుల సేవలను మరింత మెరుగుపరచడానికి, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని బలోపేతం చేసే ప్రణాళికలతో పాటు పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం కామన్ ఐటి రిటర్న్ ఫారమ్‌ను రూపొందించే ప్రతిపాదన చేస్తున్నట్లు తెలిపారు.