January 08, 2024 Current affairs in Telugu. పోటీ పరీక్షల రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో పొందండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షల కొరకు సిద్దమవుతున్న ఆశావహులకు ఉపయోగపడతాయి.
నోథాపోడైట్స్ నిమ్మోనియానా మొక్కల నుండి కాన్సర్ ఔషధం
ఐఐటీ మద్రాస్ మరియు దాని పరిశోధకులు క్యాంప్‌టోథెసిన్ అనే శక్తివంతమైన క్యాన్సర్ నిరోధక మందు ఉత్పత్తిని పెంచడానికి మొక్కల కణాలను మెటబాలిక్‌గా రూపొందించడంలో పురోగతి సాధించారు. ఈ పరిశోధకులు క్యాంప్‌టోథెసిన్ అధికంగా ఉండే నోథాపోడైట్స్ నిమ్మోనియానా అనే మొక్కలను దీని ఎంపిక చేసుకున్నారు. క్యాంప్‌టోథెసిన్ సమ్మేళనాన్ని అత్యధిక స్థాయిలో ఉత్పత్తి చేయడానికి ఇంజినీరింగ్ ప్లాంట్ సెల్స్ సాంకేతికత ద్వారా ఈ మొక్క యొక్క స్థిరమైన మరియు అధిక-దిగుబడినిచ్చే ప్రత్యామ్నాయాన్ని రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ పరిశోధన క్యాన్సర్ చికిత్స ఔషధాలను ఉత్పత్తి చేయడానికి ఇది ఒక ప్రధాన ప్రోత్సాహకంగా భావించవచ్చు. కాన్సర్ వ్యాధుల ఔషధాలలో క్యాంప్టోథెసిన్ మూడవ అత్యంత డిమాండ్ ఉన్న ఆల్కలాయిడ్. దీనిని భారతదేశంలో అంతరించిపోతున్న మొక్క అయిన నోథాపోడైట్స్ నిమ్మోనియానా నుండి వాణిజ్యపరంగా సంగ్రహిస్తున్నారు. కేవలం ఒక టన్ను క్యాంప్టోథెసిన్ తీయడానికి దాదాపు 1,000 టన్నుల మొక్కల పదార్థం అవసరం.
క్యాంప్టోథెసిన్ పదార్థం యొక్క మార్కెట్ డిమాండ్‌ను తీర్చడానికి విస్తృతస్థాయిలో ఈ మొక్కలు ఓవర్‌హార్వెస్టింగ్ చేయబడుతున్నాయి. ఈ కారణంగా దాని ప్రధాన మొక్కల వనరులు ఇప్పుడు ఐయూసీఎన్ రెడ్-లిస్టులో చేర్చబడ్డాయి. గత దశాబ్ద కాలంలో నోథాపోడైట్స్ నిమ్మోనియానా జాతిలో దాదాపు 20 శాతం కంటే ఎక్కువ క్షీణత కనిపిస్తుంది. ఈ తాజా పరిశోధనలు వీటిని వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. బయోప్రాసెస్ ఇంజనీరింగ్ సూత్రాలతో మెటబాలిక్ ఇంజనీరింగ్‌ను ఏకీకృతం చేయడంద్వారా ఈ మొక్కల మెరుగైన మరియు స్థిరమైన ఉత్పత్తిని సాధించవచ్చు.
క్యాంప్టోథెసిన్ అనేది టోపోటెకాన్ మరియు ఇరినోటెకాన్ వంటి అధిక-విలువైన ఔషధాల కోసం ఒక ముఖ్యమైన క్యాన్సర్ వ్యతిరేక డ్రగ్ లీడ్ మాలిక్యూల్. ఇది ప్రధానంగా కాంప్టోథెకా అక్యుమినాటా (తూర్పు ఆసియా) మరియు నోథాపోడైట్స్ నిమ్మోనియానా (ఇండియా) మొక్కల నుండి సంగ్రహించబడుతుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2020లో దాదాపు 10 మిలియన్ల మంది ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వలన మరణించారు. భారతదేశంలో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ ప్రకారం 2025 నాటికి కాన్సర్ కేసుల సంఖ్య 15.7 లక్షలకు పెరుగుతుందని అంచనా. ప్రతి రోజు పెరుగుతున్న క్యాన్సర్ సంభవం కారణంగా, క్యాన్సర్ వ్యతిరేక ఔషధాల యొక్క మెరుగైన ఉత్పత్తి కోసం డిమాండ్ పెరుగుతుంది.
2022-2023 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుండి 60 లక్షల కోట్ల ఎగుమతులు
2022-2023 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 60 లక్షల కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసినట్లు కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 6 జనవరి 2024న బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 77వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
అదే సమయంలో దేశంలోని 340 జిల్లాల్లో హాల్‌మార్కింగ్ సౌకర్యాలు ఉన్నాయని, ప్రతిరోజూ దాదాపు 4.5 లక్షల వ్యాసాలు హాల్‌మార్క్ అవుతున్నాయని పేర్కొన్నారు. భారతదేశాన్ని స్వావలంబనగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ప్రశంసించిన గోయల్, 2014తో పోలిస్తే అప్పటికి, ఇప్పటికి బొమ్మల దిగుమతులలో 52 శాతం తగ్గుదల నమోదు అయినట్లు తెలిపారు.
స్వామిత్వ పథకంకు బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు
హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ యందు నిర్వహించిన పబ్లిక్ పాలసీ డైలాగ్స్–2024లో ఇన్నోవేషన్ శాండ్‌బాక్స్ ప్రెజెంటేషన్ కోసం స్వామిత్వ స్కీమ్ బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డును గెలుచుకుంది. ఈ పథకం 24 ఏప్రిల్ 2020 న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించినప్పటి నుండి వివిధ వేదికలపై ప్రత్యేక గుర్తింపు మరియు అవార్డులను అందుకుంది. ఆగస్టు 2023లో గోవాలో నిర్వహించిన డిజిటెక్ కాన్‌క్లేవ్ 2023లో, ఇ-గవర్నెన్స్ ఫర్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఇన్నోవేటివ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ విభాగంలో గోల్డ్ అవార్డు అందుకుంది.
స్వామిత్వ స్కీమ్, గ్రామీణ భారతదేశానికి ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ ధ్రువీకరణ పరిష్కారాన్ని అందించడం కోసం మరియు వారి నివాస ఆస్తులపై అధికారిక హక్కులు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ఏప్రిల్ 24, 2020లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకం కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర రెవెన్యూ శాఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మరియు సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో అమలు చేయబడుతుంది. ఈ పథకం అమలు కోసం రాష్ట్రాలు, సర్వే ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందంపై సంతకం చేయాలి. ఇప్పటివరకు 31 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు సంతకం చేసాయి.
స్వామిత్వ స్కీమ్ కింద రూపొందించబడిన మ్యాప్‌లు గ్రామీణ అబాదీ ప్రాంతాల్లోని ఆస్తుల డిజిటల్ చిత్రాలను సంగ్రహించే జియో-రిఫరెన్స్ మ్యాప్‌లుగా ఉపయోగపడనున్నాయి. వీటికి అదనంగా, ఇ-పంచాయత్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ కింద, పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ ఎం-యాక్షన -సాఫ్ట్ అనే మొబైల్ ఆధారిత పరిష్కారాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది.
ఈ పథకం కింద 2021 నుండి 2025 వరకు దేశవ్యాప్తంగా సుమారు 6.62 లక్షల గ్రామాలను ఈ పథకంలో సర్వే చేయనున్నారు. గ్రామీణ ఆస్తి డేటాను సేకరించేందుకు డ్రోన్‌లతో సహా విభిన్న సాంకేతికతలు ఉపయోగిస్తున్నారు. ఈ పథకం యొక్క ప్రారంభ దశ 2020-21లో మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, పంజాబ్ మరియు రాజస్థాన్‌లోని ఎంపిక చేసిన గ్రామాలలో అమలు చేయబడింది.
ప్రస్తుతం స్వామిత్వ స్కీమ్, హర్యానా, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి, అండమాన్ మరియు నికోబార్ దీవులు మరియు గోవాలలో 100 శాతం పూర్తి చేసుకుంది. 2.90 లక్షల గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయి, 1.06 లక్షల గ్రామాలకు 1.66 కోట్ల ఆస్తి కార్డులు సిద్ధం చేశారు.
2023లో మహిళలపై నేరాలకు సంబంధించి 28,811 ఫిర్యాదులు
జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు), గత ఏడాది మహిళలపై నేరాలకు సంబంధించి 28,811 ఫిర్యాదులను స్వీకరించినట్లు పేర్కొంది. ఎన్‌సిడబ్ల్యు 2023 డేటా ప్రకారం దేశంలో వేధింపులతో కూడిన గౌరవ హక్కు కేటగిరీలో అత్యధిక సంఖ్యలో ఫిర్యాదులు అందగా, రెండవ స్థానంలో గృహ హింస పిర్యాదులు ఉన్నాయి. మహిళలకు సంబంధించి దేశంలో నమోదు కాబడ్డ మొత్తంలో ఫిర్యాదులలో 55 శాతం ఉత్తరప్రదేశ్ నుండి ఉన్నట్లు వెల్లడించింది.
- వ్యక్తిగత వివక్ష : 8,540 ఫిర్యాదులు
- గృహ హింస : 6,274 ఫిర్యాదులు
- వరకట్న వేధింపులు : 4,797 ఫిర్యాదులు
- వ్యక్తిగత వేధింపులు : 2,349 ఫిర్యాదులు
- మహిళలపై పోలీసు ఉదాసీనత : 1,618 ఫిర్యాదులు
- అత్యాచారం : 1,537 ఫిర్యాదులు
- లైంగిక వేధింపు : 805 ఫిర్యాదులు
- సైబర్ క్రైమ్ : 605 ఫిర్యాదులు
- స్టాకింగ్ : 472 ఫిర్యాదులు
- పరువు హత్యలు/నేరాలు : 409 ఫిర్యాదులు
మహిళలపై నేరాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 16,109, ఢిల్లీలో 2,411, మహారాష్ట్రలో 1,343 ఫిర్యాదులు నమోదయ్యాయి. బీహార్‌లో 1,312, మధ్యప్రదేశ్‌లో 1,165, హర్యానాలో 1,115, రాజస్థాన్‌లో 1,011, తమిళనాడులో 608, పశ్చిమ బెంగాల్‌లో 569, కర్ణాటకలో 501 ఫిర్యాదులు నమోదు కబడ్డాయి.
జాతీయ మహిళా కమిషన్ అనేది మహిళల ప్రయోజనాలను రక్షించడం మరియు ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేయబడ్డ భారతదేశంలోని అత్యున్నత జాతీయ స్థాయి సంస్థ. దీనిని 1992 లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దీని ప్రస్తుత చైర్‌పర్సన్‌గా రేఖా శర్మ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
2023లో 94.70% కేసుల్లో నేరారోపణ రేటు సాధించిన ఎన్ఐఎ
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) 2023 ఏడాదిలో 94.70% అసాధారణ నేరారోపణ రేటును సాధించినట్లు వెల్లడించింది. ఎన్ఐఎ గత ఏడాది మొత్తం 68 కేసులను నమోదు చేయగా, 625 మంది నిందితులను అరెస్టు చేయడంతో పాటుగా, వారికి సంబందించిన 56 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు నివేదించింది. ఇది 2022లో అరెస్టయిన 490 మంది నిందితులతో పోలిస్తే దాదాపు 28 శాతం పెరుగుదల నమోదైనట్లు పేర్కొంది. ఎన్ఐఎ ఈ ఏడాది అరెస్ట్ చేసిన కేసుల్లో
- ఐఎస్ఐఎస్ కేసులలో అరెస్ట్ అయిన వారు - 65 మంది
- జిహాదీ టెర్రర్ కేసులకు సంబంధించి - 114 మంది
- మానవ అక్రమ రవాణా కేసులు - 45 మంది
- ఉగ్రవాద, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన వారు - 28 మంది
- వామపక్ష తీవ్రవాద కేసులు - 76 మంది
ఎన్ఐఎ 2023లో తీవ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు, మాదకద్రవ్యాల స్మగ్లర్లు, మానవ అక్రమ రవాణాదారులు మరియు జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేసే ఇతర నేరస్థులకు కట్టిడి చేయడంలో విజయవంతమైంది. గత ఏడాది నమోదు చేసిన మొత్తం 68 కేసులలో జిహాదీ టెర్రర్‌కు సంబంధించిన 18 కేసులు, జమ్మూ & కాశ్మీర్ తీవ్రవాదినికి సంబందించి 3 కేసులు, వామపక్ష తీవ్రవాదులకు సంబంధించిన 12 కేసులు ఉన్నాయి.
అలానే పంజాబ్‌లో ఉగ్రవాద మరియు వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన మరో ఏడు కేసులు, ఈశాన్య ప్రాంతానికి సంబంధించిన ఐదు కేసులు మరియు నకిలీ కరెన్సీ నోట్లకు సంబంధించి 3 కేసులు ఉన్నాయి. గత ఏడాది బంగ్లాదేశ్‌తో ముడిపడి ఉన్న మానవ అక్రమ రవాణాపై కూడా ఎన్ఐఎ దృష్టి సారించింది.
వీటితో పాటుగా ఎన్ఐఎ గత ఏడాది నాలుగు తీవ్రవాద సంస్థలను కూడా నిషేదించింది. వీటిలో ది రెసిస్టెన్స్ ఫోర్స్ , పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్, జమ్మూ & కాశ్మీర్ గజ్నవీ ఫోర్స్ మరియు ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ వంటివి ఉన్నాయి. అలానే నిషేధిత సిపిఐ (మావోయిస్ట్), పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు మరియు సానుభూతిపరులపై అణిచివేత మరియు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై నిషేధం వంటివి ఉన్నాయి. ఇందులో రెండు దశాబ్దాల పరారీలో ఉన్న పీఎల్‌ఎఫ్ సుప్రీమో దినేష్ గోప్ అరెస్ట్ అంశం కూడా ఉంది.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది భారతదేశంలోని ప్రత్యేక ఉగ్రవాద నిరోధక చట్టాన్ని అమలు చేసే సంస్థ. ఎన్ఐఎ 2008లో న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. ఇది కేంద్ర హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు, రాష్ట్రాల ప్రత్యేక అనుమతి లేకుండా రాష్ట్రాల అంతటా ఉగ్రవాద సంబంధిత నేరాల దర్యాప్తు చేసే అధికారం కలిగిఉంది. దీని ప్రస్తుత చీఫ్ యోగేష్ చందర్ మోడీ.
మహారాష్ట్ర తొలి మహిళా డీజీపీగా రష్మీ శుక్లా
1988 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిణి రష్మీ శుక్లా మహారాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా బాధ్యతలు స్వీకరించారు. రష్మీ శుక్లా ప్రస్తుతం న్యూఢిల్లీలోని సశాస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఈమె గతంలో మహారాష్ట్రలో అనేక కీలక పదవులను నిర్వహించారు, ఇందులో పూణే పోలీసు కమిషనర్‌గా మరియు రాష్ట్ర ఇంటెలిజెన్స్ వింగ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.
రష్మీ శుక్లా, మహారాష్ట్ర ఇంటెలిజెన్స్ వింగ్ డైరెక్టర్‌గా పని చేసిన సంధర్భంలో కొంతమంది సీనియర్ రాజకీయ నాయకుల అక్రమ ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి ఆమెపై మూడు కేసులు నమోదయ్యాయి. శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు ఏక్‌నాథ్ ఖడ్సేల ఫోన్‌లను ట్యాప్ చేసినట్లు శుక్లా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆమెపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను గత ఏడాది కోర్టు రద్దు చేయగా, దర్యాప్తు సంస్థకు బదిలీ చేసిన ఒక కేసు కూడా ముగిసింది. దీనితో 2021లో సెంట్రల్ డిప్యూటేషన్‌కు వెళ్లిన ఆమె తిరిగి సొంత రాష్ట్రానికి చేరుకున్నారు.
మహిళల సామాజిక పారిశ్రామిక చేరికలో చెన్నై అగ్రస్థానం
డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ (డీఈఐ) సొల్యూషన్స్‌లో అగ్రగామిగా ఉన్న అవతార్ గ్రూప్ నిర్వహించిన సిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా ఇండెక్స్‌లో చెన్నై నగరం మహిళలకు అత్యుత్తమ నగరంగా నిలిచింది. ఈ ర్యాంకింగ్స్‌లో చెన్నై అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడం ఇది వరుసగా రెండో సారి. ఈ నివేదిక మిలియన్-ప్లస్ జనాభా విభాగంలో 49 నగరాలను, మిలియన్ కంటే తక్కువ జనాభా విభాగంలో 64 నగరాలలో అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం కవర్ చేసిన రెండు కేటగిరీలలో తమిళనాడు నుండి రెండు నగరాలు అగ్రస్థానంలో నిలిచాయి.
మిలియన్ ప్లస్ విభాగంలో చెన్నై అగ్రస్థానంలో ఉండగా, మిలియన్ కంటే తక్కువ విభాగంలో తిరుచిరాపల్లి అగ్రస్థానం దక్కించుకుంది. ఈ ర్యాంకింగులో మిలియన్ ప్లస్ విభాగంలో చెన్నై, బెంగళూరు, పూణే, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, అహ్మదాబాద్, ఢిల్లీ, కోయంబత్తూర్ మరియు జైపూర్ నగరాలు టాప్ 10 జాబితాలో ఉన్నాయి. మిలియన్ కంటే తక్కువ జనాభా విభాగంలో తిరుచిరాపల్లి, వెల్లూరు, కొచ్చి, తిరువనంతపురం, సిమ్లా, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, గురుగ్రామ్ మరియు పుదుచ్చేరిలు టాప్ 10 జాబితాలో ఉన్నాయి.
ఈ పరిశోధన జూలై 2023 నుండి డిసెంబర్ 2023 మధ్య బహిరంగ సర్వే మరియు ఫోకస్ గ్రూప్ డిస్కషన్స్ ద్వారా జరిగింది. ఇందులో దేశవ్యాప్తంగా 1200 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ ర్యాంకింగ్ సిటీ ఇన్‌క్లూజన్ స్కోర్ (CIS), సామాజిక చేరిక స్కోరు (SIS), ఇండస్ట్రియల్ ఇన్‌క్లూజన్ స్కోర్ (IIS) మరియు సిటిజన్ ఎక్స్‌పీరియన్స్ స్కోర్ (CES) అనే అంశాల ఆధారంగా రూపొందించబడింది.
మహిళల ప్రపంచ 5 కి.మీ రికార్డును బద్దలు కొట్టిన బీట్రైస్ చెబెట్
వార్షిక కర్సా డెల్స్ నాసోస్ రోడ్ రేస్‌లో కెన్యాకు చెందిన బీట్రైస్ చెబెట్ 14:12 నిముషాలలో మహిళల 5 కిమీ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. దీనితో 2021 సెప్టెంబర్‌లో ఇథియోపియాకు చెందిన సెన్‌బెరే టెఫెరి నెలకొల్పిన 14:29 మహిళల ప్రపంచ రికార్డు అధిగమించబడింది. పురుషుల రేసులో స్విట్జర్లాండ్‌కు చెందిన డొమినిక్ లోబాలు 13:12 నిముషాలతో కెన్యాకు చెందిన మాథ్యూ కిప్‌కోచ్ కిప్రుటోపై విజయం సాధించాడు.
రోడ్ రేస్‌లో టాప్ 5 మహిళలు
1 బీట్రైస్ చెబెట్ (కెఇఎన్) 14:13
2 ఎజెగయేహు తాయే (ఇటిహెచ్) 14:21
3 లిలియన్ కసైత్ రెంగెరుక్ (కెఎన్) 14:26
4 జాయ్ చెప్టోయెక్ (యుజిఎ) 14:28
5 మదీనా ఈసా (ఇటిహెచ్) 14:40
రోడ్ రేస్‌లో టాప్ 5 పురుషులు
1 డొమినిక్ లోబాలు (SUI) 13:12
2 మాథ్యూ కిప్‌కోచ్ కిప్రుటో (కెఎన్) 13:18
3 అబ్దెసమద్ ఓఖెల్ఫెన్ (ESP) 13:27
4 మొహమ్మద్ అబ్దిలాహి (GER) 13:32
5 ఫ్లావియన్ స్జోట్ (FRA)
81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు విజేతలు
81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక జనవరి 7న కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లోని ది బెవర్లీ హిల్టన్ యందు నిర్వహించబడింది. ఇది 2023 ఏడాదికి సంబంధించి అమెరికన్ చలనచిత్రం మరియు టెలివిజన్ నిర్మాణాలకు సంబంధించిన అవార్డుల వేడుక. ఈ అవార్డుల నామినీలను డిసెంబర్ 11, 2023న ప్రకటించారు. ఈ ఏడాది బార్బీ మరియు సక్సెషన్ చిత్రాలు తొమ్మిదేసి చెప్పున అత్యధిక నామినేషన్‌లు దక్కించుకోగా, ఒపెన్‌హైమర్ ఎనిమిది నామినేషన్లతో రెండో స్థానంలో నిలిచింది.
ఇది 2023లో హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ రద్దు చేయబడిన తర్వాత జరిగిన మొదటి గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక. జూన్ 12, 2023న డిక్ క్లార్క్ ప్రొడక్షన్స్ మరియు ఎల్‌డ్రిడ్జ్ దీని పూర్తి హక్కులను స్వాధీనం చేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు జో కోయ్ ఈ వేడుకకు హోస్ట్‌గా వ్యవహరించారు.
- ఉత్తమ చిత్రం (డ్రామా) : ఓపెన్‌హైమర్
- ఉత్తమ చిత్రం (కామెడీ) : పూర్ థింగ్స్
- ఉత్తమ చిత్రం (యానిమేటెడ్) : ది బాయ్ అండ్ ది హెరాన్
- ఉత్తమ విదేశీ భాష చిత్రం : అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ (ఫ్రాన్స్)
- ఉత్తమ చిత్రం (సినిమాటిక్) : బార్బీ
- ఉత్తమ నటుడు : సిలియన్ మర్ఫీ & జె . రాబర్ట్ (ఓపెన్‌హైమర్)
- ఉత్తమ నటి : లిల్లీ గ్లాడ్‌స్టోన్ (కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్)
- ఉత్తమ దర్శకుడు : క్రిస్టోఫర్ నోలన్ (ఒపెన్‌హీమర్)
- ఉత్తమ స్క్రీన్ ప్లే : జస్టిన్ ట్రియెట్ & ఆర్థర్ హరారి (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్)
- బెస్ట్ ఒరిజినల్ స్కోర్ : లుడ్విగ్ గోరాన్సన్ (ఒపెన్‌హైమర్)
- ఉత్తమ ఒరిజినల్ సాంగ్ : బిల్లీ ఎలిష్ & ఫిన్నేస్ ఓ'కానెల్ (వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ - బార్బీ)