Advertisement
ముఖ్యమైన రోజులు మరియు తేదీలు అక్టోబర్ 2023
Important Dates

ముఖ్యమైన రోజులు మరియు తేదీలు అక్టోబర్ 2023

ముఖ్యమైన రోజులు మరియు తేదీలు అక్టోబర్ 2023 కోసం చదవండి. అక్టోబర్ నెలలో జరుపుకునే వివిధ జాతీయ దినోత్సవాలు మరియు అంతర్జాతీయ దినోత్సవాల వివరాలు తెలుసుకోండి. ప్రముఖుల పుట్టిన రోజులు, మరణాల సమాచారం కూడా పొందండి. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది.

అంతర్జాతీయ కాఫీ దినోత్సవం - అక్టోబర్ 01

అంతర్జాతీయ కాఫీ దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 1 న నిర్వహిస్తారు. అంతర్జాతీయ కాఫీ డే అనేది కాఫీ రంగం యొక్క వైవిధ్యం, నాణ్యత మరియు అభిరుచికి సంబంధించిన వేడుక. కాఫీ ప్రేమికులు తమ పానీయాల ప్రేమను పంచుకోవడానికి మరియు సుగంధ పంటపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది రైతులకు మద్దతు ఇవ్వడానికి దీనిని నిర్వహిస్తారు. దీనిని మొదటిసారి 2015 లో ఇంటర్నేషనల్ కాఫీ ఆర్గనైజేషన్ ప్రారంభించింది.

అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం - అక్టోబర్ 01

అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని ఏటా అక్టోబర్ 1న నిర్వహిస్తారు. వృద్ధులకు మద్దతునిస్తూ వృద్ధుల శ్రేయస్సు,సమాజంలో వారి భాగస్వామ్యాన్ని గుర్తించి అభినందించడం కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అదే సమయంలో జాతీయ వృద్ధుల దినోత్సవం (నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే) ప్రతి సంవత్సరం ఆగస్టు 21న దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.

ప్రపంచ శాకాహార దినోత్సవం - అక్టోబర్ 01

ప్రతి సంవత్సరం అక్టోబరు 1న ప్రపంచ శాకాహార దినోత్సవంను జరుపుకుంటారు. మూగజీవాలపై మానవ ప్రేమను ప్రోత్సహించి, పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని కాపాడేదిశగా ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవం నిర్వహించబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా శాకాహారులను ఒక వేదికపైకి తీసుకువచ్చేందుకు 1970లలో ఉత్తర అమెరికా శాకాహార సొసైటీ దీనిని ప్రారంభించింది. 1977లో తొలిసారిగా అమెరికాలో ఈ దినోత్సవాన్ని ప్రారంభించగా, 1978 నుండి ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ దివాస్

పేన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA), భారత పౌరులలో పెన్షన్ మరియు పదవీ విరమణ ప్రణాళికను ప్రోత్సహించడానికి ఏటా అక్టోబర్ 1 వ తేదీని నేషనల్ పెన్షన్ సిస్టమ్ దివాస్ గా జరుపుకుంటుంది. దీనిని 2022 మొదటిసారి ప్రారంభించారు. సెప్టెంబర్ 2022 నాటికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలో మొత్తం 5.72 కోట్ల చందాదారులు రిజస్టర్ అయ్యాయి ఉన్నారు. వీరి నిర్వహణలో మొత్తం 7,99,467 కోట్ల ఆస్తులు ఆదా చేయబడి ఉన్నాయి.

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ అనేది ఇండియాలో పెన్షన్ సిస్టమ్ యొక్క పర్యవేక్షణ మరియు నియంత్రణ కోసం 2003లో ఏర్పాటు చేయబడింది. ఇది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ & డెవలప్‌మెంట్ అథారిటీ చట్టం 19 సెప్టెంబర్ 2013 పరిధిలో పనిచేస్తుంది. PFRDA ప్రభుత్వ ఉద్యోగులచే సభ్యత్వం పొందిన నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)ని నియంత్రిస్తోంది. ప్రస్తుతం PFRDA చైర్‌పర్సనుగా శ్రీ సుప్రతిమ్ బంద్యోపాధ్యాయ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ప్రపంచ నివాస దినోత్సవం - మొదటి సోమవారం

ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం అక్టోబరు మొదటి సోమవారాన్ని ప్రపంచ నివాస దినోత్సవంగా ప్రకటించింది. దీనిని 1985లో ఐక్యరాజ్యసమితి ప్రారంభించింది. 1986లో మొదటిసారిగా "ఆశ్రయం నా హక్కు" అనే థీమ్‌తో జరుపబడింది. ఆశ్రయం అనేది పౌరుల ప్రాథమిక హక్కు అనే విషయాన్ని గుర్తు చేసేందుకు దీనిని నిర్వహిస్తారు. మానవ ఆవాసాల భవిష్యత్తు కోసం దాని సామూహిక బాధ్యతను ప్రపంచానికి గుర్తు చేయడానికి కూడా ఇది ఉద్దేశించబడింది.

అంతర్జాతీయ అహింసా దినోత్సవం - అక్టోబర్ 02

మహాత్మా గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2న అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ వేడుకను 2007 యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా ప్రారంభించారు. ఈ రోజున అహింస సందేశాన్ని ప్రపంచ పౌరులలో పెంపొందిస్తారు. విద్య మరియు ప్రజా చైతన్యం ద్వారా మరియు శాంతి , సహనం ద్వారా ప్రజలలో అహింస సంస్కృతిని పెంపొందిస్తారు.

వరల్డ్ యానిమల్ వెల్ఫేర్ డే - అక్టోబర్ 04

ప్రతి సంవత్సరం అక్టోబర్ 4న ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా జంతువుల సంక్షేమ ప్రమాణాలను మెరుగుపరచడం గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 4న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ జంతు దినోత్సవం చరిత్ర 1925 నాటిది, సైనాలజిస్ట్ హెన్రిచ్ జిమ్మెర్‌మాన్ మార్చి 24, 1925న జర్మనీలోని బెర్లిన్‌లో మొదటి ప్రపంచ జంతు దినోత్సవాన్ని నిర్వహించారు.

వరల్డ్ స్పేస్ వీక్ - అక్టోబర్ 4 నుండి10

వరల్డ్ స్పేస్ వీక్ అనేది ప్రపంచవ్యాప్తంగా 95 దేశాలలో అక్టోబర్ 4 నుండి 10 వరకు జరుపుకునే అంతర్జాతీయ వార్షిక వేడుక. వరల్డ్ స్పేస్ వీక్ అధికారికంగా "సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అంతర్జాతీయ వేడుకగా నిర్వహిస్తారు. ఇది 6 డిసెంబర్ 1999 నాటి ఐక్యరాజ్యసమితి తీర్మానం ద్వారా ప్రారంభించబడింది. మానవ స్థితిని మెరుగుపరిచేందుకు అంతరిక్ష శాస్త్రం మరియు సాంకేతిక పరిజ్ఞానం యొక్క సహకారాన్ని స్మరించుకునేందుకు ఈ వేడుకను నిర్వహిస్తారు.

సాంకేతికంగా కూడా అక్టోబర్ 4 మరియు 10 తేదీలకు ప్రాముఖ్యత ఉంది. 4 అక్టోబరు 1957 లో మొదటి మానవ నిర్మిత ఉపగ్రహం స్పుత్నిక్ 1 అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబడింది. ఒక దశాబ్దం తరువాత, 10 అక్టోబరు 1967 లో, చంద్రుడు మరియు ఇతర ఖగోళ వస్తువులతో సహా బాహ్య అంతరిక్షం యొక్క అన్వేషణ సూత్రాలపై చేసిన నియంత్రణ ఒప్పందం అమల్లోకి వచ్చింది.

ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం - అక్టోబర్ 05

ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవంను ప్రతి సంవత్సరం అక్టోబర్ 5న జరుపుకుంటారు. ఇది ఉపాధ్యాయుల హక్కులు మరియు బాధ్యతలు గుర్తుచేసేందుకు మరియు వారి సేవలు గుర్తించేందుకు ఏర్పాటు చేసుకున్న అంతర్జాతీయ వేడుక. ఐక్యరాజ్యసమితి తీర్మానం ద్వారా దీనిని 1994 నుండి జరుపుకుంటున్నారు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO), యూనిసెఫ్ మరియు ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ (EI) భాగస్వామ్యంతో నిర్వహించబడుతుంది.

ఇండియాలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు. ఈ రోజున విద్యార్థులు, ప్రభుత్వాలు ఉపాధ్యాయల సేవలు స్మరించుకుని వారికీ సన్మానిస్తారు.

వరల్డ్ కాటన్ డే - అక్టోబర్ 07

ప్రపంచ పత్తి దినోత్సవంను ప్రతి ఏడాది అక్టోబర్ 7వ తేదీన జరుపుకుంటారు. ప్రపంచ పత్తి దినోత్సవంను 2019 లో ప్రపంచ వాణిజ్య సంస్థ మొదటిసారి ప్రతిపాదించింది. తర్వాత దశలో దీనికి ఐక్యరాజ్యసమితి సమ్మతి తెలియజేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు స్థిరమైన ఉపాధిని అందించే పత్తి యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసేందుకు ఈ వేడుకను నిర్వహిస్తారు. భారతదేశం పత్తి ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న పత్తిలో 40 నుండి 50 శాతం భారత్, చైనాల నుండి నమోదు అవుతుంది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే - అక్టోబర్ 08

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ప్రతి సంవత్సరం అక్టోబర్ 8 న జరుపుకుంటారు. భారతీయ గగనతలాన్ని సురక్షితంగా ఉంచడంతో పాటుగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించడం ద్వారా అవిశ్రాంతంగా దేశాన్ని రక్షించే భారత వైమానిక దళంకు నివాళులర్పించే రోజుగా దీనిని జరుపుకుంటారు.

నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ - అక్టోబర్ మొదటి వారం

భారతదేశంలో ప్రతి సంవత్సరం అక్టోబరు 2 నుండి 8వ తేదీ వరకు జాతీయ వన్యప్రాణుల వారోత్సవాలు జరుపుకుంటారు. ఈ వారంలో భారతదేశ వృక్ష సంపదను, జంతు సంపదను రక్షించడం మరియు సంరక్షించడం లక్ష్యంగా అవగాహన పెంపొందిస్తారు.

ప్రపంచ తపాలా దినోత్సవం - అక్టోబర్ 09

ప్రతి సంవత్సరం అక్టోబర్ 9వ తేదీన ప్రపంచ తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటారు. స్విస్ రాజధాని బెర్న్‌లో 1874లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (UPU) స్థాపన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం అక్టోబర్ 9న ప్రపంచ తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున ముందు తరం గ్లోబల్ కమ్యూనికేషన్స్ విప్లవానికి నాంది పలికిన తపాలా సేవలను స్మరించుకుంటారు.

వరల్డ్ మెంటల్ హెల్త్ డే - అక్టోబర్ 10

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంను ప్రతి సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన జరుపుకుంటారు. వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ (WFMH) ప్రతి సంవత్సరం విభిన్న థీమ్‌తో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ వేడుకను మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడంతో పాటుగా  మానసిక రోగులకు మద్దతు తెలిపేందుకు నిర్వహిస్తారు.

ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది గర్ల్ చైల్డ్ - అక్టోబర్ 11

అంతర్జాతీయ బాలికా దినోత్సవంను ప్రతి ఏడాది అక్టోబరు 11 వ తేదీన జరుపుకుంటారు. డిసెంబర్ 19, 2011 ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా ఇది ప్రారంభించబడింది. ఈ వేడుకను బాలికల హక్కులు మరియు బాలికలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లపై అవగాహనా పెంపొందించేందుకు నిర్వహిస్తారు.

ప్రపంచ గుడ్డు దినోత్సవం - రెండవ శుక్రవారం

ప్రపంచ గుడ్డు దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండవ శుక్రవారం నాడు జరుపుకుంటారు. ఈ వేడుకను మొదటిసారి 1996లో వియన్నాలో ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ (IEC) ప్రారంభించింది. మానవ పోషణలో గుడ్ల ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

గ్లోబల్ హ్యాండ్‌వాషింగ్ డే - అక్టోబర్ 15

ప్రతి సంవత్సరం అక్టోబరు 15న గ్లోబల్ హ్యాండ్‌వాషింగ్ డే ను నిర్వహిస్తారు. మానవ ఆరోగ్యంలో చేతి పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహనా కల్పించేందుకు ఈ వేడుకను నిర్వహిస్తారు. మొదటి గ్లోబల్ హ్యాండ్‌వాషింగ్ డే 2008లో నిర్వహించబడింది.

ప్రపంచ విద్యార్థుల దినోత్సవం - అక్టోబర్ 15

ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని ఏటా అక్టోబర్ 15 న జరుపుకుంటారు. ఈ వేడుకను భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి జ్ఞాపకార్థం నిర్వహిస్తారు. అబ్దుల్ కలాం అక్టోబర్ 15, 1931న భారతదేశంలోని పాంబన్ ద్వీపంలోని రామేశ్వరం పుణ్యక్షేత్రంలో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించారు.

అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం - అక్టోబర్ 15

ఐక్యరాజ్యసమితి గ్రామీణ మహిళల అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న జరుపుకుంటారు. ఈ రోజు మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే లక్షలాది మంది మహిళలకు అంకితం చేయబడింది, ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల సాధికారతను గుర్తించి, సన్మానిస్తారు.

ప్రపంచ ఆహార దినోత్సవం - అక్టోబర్ 16

ప్రపంచ ఆహార దినోత్సవం కోసం చిత్ర ఫలితం ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న జరుపుకుంటారు . 1945లో ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) స్థాపన వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు జరుపుకుంటారు. 2014 లో ప్రారంభించిన ఈ వేడుకను ఐక్యరాజ్యసమితిచే అధికారిక గుర్తింపు పొందిన దాదాపు150 దేశాలు నిర్వహిస్తాయి.

వరల్డ్ స్టాటిస్టిక్స్ డే | అక్టోబర్ 20 (ఐదేళ్లకి ఒకసారి)

వరల్డ్ స్టాటిస్టిక్స్ డే ను ఐదేళ్లకోసారి అక్టోబర్ 20 వ తేదీన నిర్వహిస్తారు. ఈ వేడుకను 3 జూన్ 2010 ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా ప్రారంభించారు. ఈ వేడుక చివరిగా 2020 నిర్వహించారు. మానవ జీవితాల్లో గణాంకాల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

అదే సమయంలో ఇండియాలో నేషనల్ స్టాటిస్టిక్ డేను స్టాటిస్టిక్స్ మరియు ఎకనామిక్ ప్లానింగ్ రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహలనోబిస్ యొక్క జన్మదిన జ్ఞాపకార్థంగా ఏటా జూన్ 29న జరుపుకుంటారు.

ఐక్యరాజ్యసమితి దినోత్సవం - అక్టోబర్ 24

ఐక్యరాజ్యసమితి దినోత్సవంను ప్రతి ఏడాది అక్టోబర్ 24 వ తేదీన జరుపుకుంటారు. ఈ వేడుకను 1945లో ఐక్యరాజ్యసమితి అధికారికంగా ఉనికిలోకి వచ్చిన తేదీ జ్ఞాపకార్థం నిర్వహిస్తారు. 1947లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అక్టోబర్ 24ని, ఐక్యరాజ్యసమితి యొక్క చార్టర్ యొక్క వార్షికోత్సవంగా ప్రకటించింది.

ఐక్యరాజ్యసమితి అనేది అంతర్జాతీయ దేశాల మధ్య శాంతి మరియు భద్రత, స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించడం కోసం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1945 లో ఏర్పాటు చేయబడింది. ఇది ప్రపంచ దేశాల మధ్య అంతర్జాతీయ సహకారం మరియు దేశాల చర్యలను సమన్వయం చేసే ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఐక్యరాజ్యసమితిలో ప్రస్తుతం 193 సభ్య దేశాలు ఉన్నాయి.

ప్రపంచ పోలియో దినోత్సవం - అక్టోబర్ 24

ప్రపంచ పోలియో దినోత్సవంను ఏటా అక్టోబర్ 24వ తేదీన నిర్వహిస్తారు. ఈ వేడుకను పోలియో వ్యాధిపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తారు. పోలియో నిర్మూలన ప్రకటన 1988లో ఆమోదించబడినప్పటి నుండి, బిలియన్ల మంది పిల్లలు పోలియో రహిత జీవితాన్ని బహుమతిగా పొందుతున్నారు.

వరల్డ్ సిటీస్ డే - అక్టోబర్ 31

ప్రపంచ నగరాల దినోత్సవంను ప్రతి ఏడాది అక్టోబర్ 31న నిర్వహిస్తారు. ప్రపంచ పట్టణీకరణపై అంతర్జాతీయ సమాజం యొక్క ఆసక్తిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ వేడుక నిర్వహిస్తారు. దీని మొదటిసారి 2014 ఐక్యరాజ్యసమితి తీర్మానం ద్వారా ప్రారంభించారు.

నేషనల్ యూనిటీ డే - అక్టోబర్ 31

భారతదేశంలో 2014 నుండి ప్రతి సంవత్సరం అక్టోబరు 31 న రాష్ట్రీయ ఏక్తా దివస్ లేదా జాతీయ ఐక్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో ప్రధాన పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2014లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 143వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజును జాతీయ ఐక్యతా దినోత్సవంగా నిర్వహించారు.

Post Comment