బ్యాచిలర్ డిగ్రీ తరువాత పోస్టు గ్రాడ్యుయేషన్ చేయాలనుకునే వారికీ దేశ వ్యాప్తంగా వందల కొలది పీజీ ప్రవేశ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో రాష్ట్ర పరిధిలో నిర్వహించే కామన్ పీజీ సెట్ల నుండి సెంట్రల్ యూనివర్శిటీలు, ఆల్ ఇండియా యూనివర్శిటీలు, ప్రైవేట్ ఇనిస్టిట్యూట్లు, డ్రీమ్డ్ యూనివర్సిటీ నిర్వహించే వివిధ అడ్మిషన్ సెట్స్ మీరు రాసేందు అవకాశం ఉంది.
సీయూఈటీ ఎగ్జామ్, ఏపీ పీజీసెట్, టీఎస్ సీపీగెట్, గీతం అడ్మిషన్ టెస్ట్, ఇగ్నో ఓపెన్‌మ్యాట్ ఎగ్జామ్, ఢిల్లీ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, జేఎన్‌యూఈఈ ఎగ్జామ్, ఐఐఎఫ్‌టీ ఎగ్జామ్, నెస్ట్ ఎగ్జామ్, ఐఐటీ జామ్, నిఫ్ట్ అడ్మిషన్ టెస్ట్ వంటి పాపులర్ యూనివర్శిటీ ప్రవేశ పరీక్షల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. మీరు చేరాలనుకునే పీజీ కోర్సు, ఆర్థిక పరిస్థితి, మీ పఠన సామర్ధ్యం ఆధారంగా ఉత్తమ ప్రవేశ పరీక్షను ఎంపిక చేసుకోండి.
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ ఎగ్జామ్)
సీయూఈటీ అనగా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని అర్ధం. గతంలో ఈ పరీక్షను సీయూసెట్ పేరుతొ నిర్వహించే వారు. సీయూఈటీ ప్రవేశ పరీక్ష ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 44 సెంట్రల్ యూనివర్శిటీల యందు యూజీ మరియు పీజీ కోర్సుల యందు ప్రవేశం పొందొచ్చు. తెలుగు రాష్ట్రాలలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యందు అడ్మిషన్ పొందేందుకు ఈ పరీక్ష రాయాల్సిందే.
సీయూఈటీ పరీక్ష ద్వారా కేవలం సెంట్రల్ యూనివర్సిటీల యందె కాకుండా స్టేట్, ప్రైవేట్ మరియు వివిధ డ్రీమ్డ్ యూనివర్శిటీల యందు కూడా ప్రవేశం పొందొచ్చు. ఈ అవకాశం సీయూఈటీ కోసం జాబితా చేయబడ్డ సదురు యూనివర్శిటీలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ జాబితా సీయూఈటీ పోర్టల్ యందు అందుబాటులో ఉంటుంది.
దేశంలో ఉన్నత విద్యకు సంబంధించి పరిశోధనాత్మక ప్రోగ్రాంలకు సెంట్రల్ యూనివర్సిటీలు కేంద్ర బిందువుగా ఉన్నాయి. ప్రతిభావంతులైన పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ దేశానికి వెలకట్టలేని మానవ వనరులను అందిస్తున్నాయి. ఈ కారణంగానే కేంద్ర విశ్వవిద్యాలయాలకు సంబంధించి జరిగే సీయూఈటీ పరీక్షకు విద్యార్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు.
ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ పీజీసెట్)
ఏపీ యూనివర్సిటీలు మరియు వాటి అనుబంధ పీజీ కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేట్ ప్రవేశాలు కల్పించేందుకు ఏపీ పీజీసెట్ నిర్వహిస్తారు. గతంలో యూనివర్సిటీల వారీగా నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షల స్థానంలో గత రెండేళ్లుగా ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలో ఉన్న 16 రాష్ట్ర యూనివర్సిటీలు మరియు వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో దాదాపు 145 కి పైగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు.
రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ ప్రవేశ పరీక్షను యోగి వేమన యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ సెట్ చైర్మనుగా యోగి వేమన యూనివర్సిటీ వీసీ మునగల సూర్యకలావతి, కన్వినరుగా వై. నజీర్ అహ్మద్ వ్యవహరించనున్నారు. ఈ పరీక్ష సీబీటీ విధానంలో నిర్వహిస్తారు.
రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. యూనివర్సిటీ వారీగా అందుబాటులో ఉన్న సీట్లలో 85% శాతం సీట్లు స్థానిక విద్యార్థులకు కేటాయిస్తారు. అర్హులైన విద్యార్థులు గడువులోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోండి.
కామన్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ సీపీగెట్)
సీపీగెట్ పరీక్షను తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, మహాత్మ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన మరియు జెఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీలలో పీజీ, పీజీ డిప్లొమా మరియు ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సుల యందు ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు.
టీఎస్ సీపీగెట్ ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించబడుతుంది. ఎంపీ.ఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ మినహా మిగతా అన్ని పేపర్లు 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో 100 మార్కులకు జరుగుతాయి. 100 ప్రశ్నలను 90 నిముషాల వ్యవధిలో సమాధానం చేయాల్సి ఉంటుంది.
ఇగ్నో ఓపెన్‌మ్యాట్ ఎగ్జామ్
ఇగ్నో ఓపెన్‌మ్యాట్ పరీక్షను ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో మానేజ్మెంట్ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్షను నేషన్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఈ పరీక్ష జాతీయ స్టేయిలో ఏటా రెండు సార్లు జరుగుతుంది.
50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఆసక్తి, అర్హుత ఉన్న అభ్యర్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.
ఢిల్లీ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (డీయూఈటీ)
డీయూఈటీ పరీక్షను ఢిల్లీ యూనివర్సిటీలో యూజీ, పీజీ మరియు పీహెచ్డీ/ఎంఫిల్ అడ్మషన్లు కల్పించేందుకు నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు ఢిల్లీ యూనివర్సిటీ ఉమ్మడిగా ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తాయి. ఢిల్లీ యూనివర్సిటీలో యందు అందుబాటులో ఉండే సీట్లలో దాదాపు 50% శాతం ఈ ప్రవేశ పరీక్ష ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు. మిగతా 50 శాతం సీట్లు అకాడమిక్ మెరిట్ ఆధారంగా భర్తీచేస్తారు.
ఢిల్లీ యూనివర్సిటీ దేశంలో ఎందరో రాజకీయ నాయకులను, వ్యాపారవేత్తలను, బాలీవుడ్ నటులను అందించింది. ఢిల్లీ యూనివర్సిటీకి హస్తిన నగర వ్యాప్తంగా 16 ఫాకల్టీ డిపార్టుమెంట్స్, 86 అకాడమిక్ డిపార్టుమెంట్స్, 77 అనుబంధ కాలేజీలు మరో ఐదు ఇతర ఇనిస్టిట్యూట్లు కలిగి ఉంది. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో ఏటా దాదాపు లక్షా ముప్పైవేల మంది విద్యార్థులు యూజీ, పీజీ కోర్సులు పూర్తిచేస్తున్నారు.
జేఎన్‌యూఈఈ ఎగ్జామ్
జేఎన్‌యూఈఈ పరీక్షను జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు రీసెర్చ్ ప్రోగ్రాంలలో అడ్మిషన్లు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఉన్నత విద్య అందిస్తున్న ఇండియన్ యూనివర్సిటీలలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ టాప్ 2లో ఉంటుంది.
పీజీ కోర్సులకు, పరిశోధనాత్మక కోర్సులకు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ కంచుకోట. యూనివర్సిటీ అనుబంధంగా 12 రీసెర్చ్ & డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్లు, 6 డిఫెన్స్ ఇనిస్టిట్యూట్లు దేశంలో విద్యా సేవలు అందిస్తున్నాయి.
ఐఐఎఫ్‌టీ ఎగ్జామ్
ఐఐఎఫ్‌టీ (IIFT) పరీక్షను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ యందు ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సు సంబంధించి ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఇండియాలో ఢిల్లీ, కోలకతా మరియు కాకినాడలో ఐఐఎఫ్‌టీ ఇనిస్టిట్యూట్లలను కలిగి ఉంది.
ఐఐఎఫ్‌టీ ఎంబీఏ ఇంటెర్నేషన బిజినెస్ కోర్సును రెండేళ్ల నిడివితో 6 సెమిస్టర్లగా అందిస్తుంది. ఈ ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సును ప్రధానంగా టెక్నాలజీ వాణిజ్యంలో భారత పారిశ్రామిక సామర్ధ్యాన్ని వ్యూత్మకంగా బలపర్చేందుకు, ఆర్థిక మరియు సాంకేతిక సహకారంతో కొన్ని సంస్థాగత వాణిజ్య సంక్లిష్టతలను పరిష్కరించేందుకు అవసరమయ్యే నాణ్యమైన మానవ వనురులను రూపొందించే లక్ష్యంతో అందిస్తుంది.
నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్ ఎగ్జామ్)
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (నైసర్ భువనేశ్వర్) మరియు యూనివర్సిటీ ఆఫ్ ముంబై -డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ యందు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు.
నెస్ట్ అనగా నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ అని అర్ధం. నెస్ట్ ప్రవేశ పరీక్షలో అర్హుత సాధించడం ద్వారా పై రెండు యూనివర్సిటీలలో బయాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ సబ్జెక్టుల యందు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ అడ్మిషన్ పొందొచ్చు. సైన్స్ రీసెర్చ్ కోర్సులకు సంబంధించి ప్రధాన భూమిక పోషిస్తున్న ఈ రెండు యూనివర్సిటీలలో అడ్మిషన్ కోసం దేశ వ్యాప్తంగా వేల మంది సైన్స్ విద్యార్థులు ఏటా పోటీపడుతుంటారు.
జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (ఐఐటీ జామ్)
జామ్ అనగా జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ అని అర్ధం. జామ్ పరీక్షలో అర్హుత పొందిన వారు దేశంలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మరియు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్) లలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసే అవకాశం దక్కించుకుంటారు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యను అందించే ఐఐటీల్లో పీజీ చేయడం సాధారణ విషయం కాదు. ఈ అదృష్టం దక్కించుకోవాలంటే జామ్ పరీక్షను ఛేదించాల్సిందే.
ఈ పరీక్షలో అర్హుత సాధించడం ద్వారా ఐఐటీ, ఐఐఎస్ లలో మాస్టర్ ఆఫ్ సైన్స్ (రెండేళ్లు), మాస్టర్ ఇన్ ఎకనామిక్స్ (రెండేళ్లు), జాయింట్ ఎంఎస్సీ-పీహెచ్డీ, ఎంఎస్సీ-పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ మరియు పోస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రాంలలో ప్రవేశాలు పొందొచ్చు. 55 శాతం మార్కులతో సంబంధిత బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.
నిమ్‌సెట్ ఎగ్జామ్
నిమ్‌సెట్ అనగా నిట్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అర్ధం. నిమ్‌సెట్ ప్రవేశ పరీక్షలో అర్హుత పొందటం ద్వారా కేంద్రప్రభుత్వం ఆధీనంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) లలో మూడేళ్ళ ఎంసీఏ కోర్సులో అడ్మిషన్ పొందొచ్చు.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (ఎన్ఐటీలు) జాతీయ ప్రాముఖ్యతతో ఏర్పాటు చేయబడ్డ కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని పబ్లిక్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లు. వీటిని 2007 లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NITSER) చట్టం ద్వారా స్థాపించారు. ప్రస్తుతం దేశంలో 31 ఎన్ఐటీలు ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇంజనీరింగ్, ఇతర యూజీ, పీజీ మరియు డాక్టోరల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి.
నిమ్‌సెట్ ప్రవేశ పరీక్షను ప్రధానంగా అగర్తల, అలహాబాద్, భోపాల్, జంషెడ్‌పూర్, కురుక్షేత్ర, రాయ్‌పూర్, సూరత్‌కల్, తిరుచిరాపల్లి (తిరుచ్చి), మరియు వరంగల్ యందు గల 9 ఎన్ఐటీల యందు మూడేళ్ళ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సుల యందు అడ్మిషన్ కల్పించేందుకు నిర్వహిస్తారు. అయితే జంషెడ్‌పూర్, వరంగల్ ఎన్ఐటీలు రెండేళ్ల తర్వాత పీజీ డిప్లొమా సర్టిఫికెట్‌తో కోర్సు నుండి వైదొలిగేందుకు అవకాశం కల్పిస్తున్నాయి
నిఫ్ట్ అడ్మిషన్ టెస్ట్
నిఫ్ట్ ప్రవేశ పరీక్ష ద్వారా దేశ వ్యాప్తంగా 16 నిఫ్ట్ కళాశాలలో ఫ్యాషన్ డిజైనింగ్ మరియు ఫ్యాషన్ టెక్నాలజీ కి సంబందించిన యూజీ మరియు పీజీ కోర్సుల యందు అడ్మిషన్ పొందొచ్చు. దేశంలో ఉన్న నిఫ్ట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ అఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) ఇనిస్టిట్యూట్లలో ఫ్యాషన్ డిజైనింగ్ మరియు ఫ్యాషన్ టెక్నాలజీ కి సంబందించిన యూజీ మరియు పీజీ కోర్సుల యందు ప్రవేశాలు కల్పించేందుకు నిఫ్ట్ ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుంది.
విభిన్న భౌగోళిక ప్రదేశాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న వస్త్రధారణ, విభిన్న ప్రాచీన కళలతో ఫ్యాషన్ పరంగా ఏకత్వంలో భిన్నత్వాన్ని కనబరిచే భారత ఫ్యాషన్ ఇండస్ట్రీలో, సుజనాత్మకత ఉన్నవారికి అవకాశాలకు కొదవు లేదు. విభిన్న వైవిద్యలతో నిండిన భారత్ ఫ్యాషన్ రంగాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆలోచనతో 1986 లో భారత ప్రభుత్వం టెక్సటైల్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిఫ్ట్ లను స్థాపించింది.
2006లో భారత ప్రభుత్వం ద్వారా చట్టబద్దమైన స్వయం ప్రతిపత్తిని పొందిన నిఫ్ట్..ఇప్పుడు దేశ వ్యాప్తంగా 16 క్యాంపస్ లు కలిగిఉంది. ఈ 16 ఇనిస్టిట్యూట్లలో దాదాపు 2370 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉన్నత కెరీర్ ఆశించే వేలాది మంది విద్యార్థులు ఎదురు చూసే ఈ నిఫ్ట్ ప్రవేశ పరీక్ష కోసం పూర్తి వివరాలు తెలుసుకుందాం.
గీతం యూనివర్శిటీ అడ్మిషన్ టెస్ట్
గాట్ (GAT) ప్రవేశ పరీక్షను గీతం యూనివర్సిటీలో వివిధ యూజీ మరియు పీజీ అడ్మిషన్లు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్ష అర్హుత సాధించడం ద్వారా బీటెక్, ఎంటెక్ తో పాటుగా ఫార్మసీ, ఆర్కిటెక్చర్, మానేజ్మెంట్, లా, నర్సింగ్ మరియు మరికొన్ని హోమ్ సైన్సెస్ కోర్సులలో సీట్ దక్కించుకోవచ్చు.
గీతం యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్ విశాఖపట్నంతో పాటుగా హైదరాబాద్ మరియు బెంగుళూరులో మరో రెండు అనుబంధ క్యాంపుస్లు కలిగి ఉంది. దేశంలో ఉన్న డ్రీమ్డ్ యూనివర్సిటీలలో దేశీయంగా, అంతర్జాతీయంగా గీతం యూనివర్సిటీకి మంచి గుర్తింపు ఉంది. అంతర్జాతీయంగా దాదాపు 25 యూనివర్సిటీలతో కలిసి పనిచేస్తుంది.