Advertisement
Elon Musk | తెలుగులో ఎలన్ మస్క్ బయోగ్రఫీ
Biographies

Elon Musk | తెలుగులో ఎలన్ మస్క్ బయోగ్రఫీ

ఎలన్ మస్క్ లైఫ్ స్టోరీ

'ఎలన్ మస్క్' ఏదో తెలుగు సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆ పేరులో ఒక సంచలనం ఉంది. ఆ పేరులో ఒక ఛాలెంజ్ ఉంది. ఆ పేరులో ఒక తెగుంపు ఉంది. ఈయన ప్రారంభించే కంపెనీలు ప్రపంచంలో 90% మందికి తెలియవు, ఈయన ఉత్పత్తులు సగటు మనిషి ఉపయోగించేవి కావు, కానీ ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలలో అగ్రస్థానంలో ఉంటాడు. నిత్యం ఏదో ఒక వార్తరూపంలో మీడియాలో కనిపిస్తూఉంటాడు. ఎప్పటికప్పుడు కొత్త ప్రకటనలతో ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు.

ఒక వ్యవస్థాపకుడుగా, ఒక పెట్టుబడిదారునిగా, ఒక వ్యాపారవేత్తగా ఈ ప్రపంచానికి పరిచయం ఉన్న ఎలన్ మస్క్'కు స్వతహాగా సాధ్యంకాని వాటిని సాధించడమంటే మహా ఇష్టం. ఈ ఆలోచనల్లో వచ్చినవే జిప్ 2, ఎక్స్.కామ్, పేపాల్, స్పేస్‌ఎక్స్‌, టెస్లా ఇలా చాలా, ఈ జాబితా ఇక్కడితో ఆగేది కాదు. వీటన్నింటి వెనుక ఉన్న కథ తెలుసుకోవాలంటే ఎలోన్ మస్క్ యొక్క జీవిత కథ తెలుసుకోవాలి.

ఎలన్ మస్క్ బాల్యం

ఎలన్ మస్క్, 28 జూన్ 1971 లో దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో నగరంలో జన్మించాడు. ఎరోల్ మస్క్ (దక్షిణాఫ్రికా) మరియు మాయే మస్క్ (కెనడా) దంపతుల ముగ్గురి సంతానంలో పెద్దవాడు. తండ్రి ఎరోల్ మస్క్ విజయవంతమైన వ్యాపారి మరియు రాజకీయ నాయకుడు, తల్లి మాయే మస్క్ ఒక మోడల్ మరియు డైటీషియన్. ఆర్థికంగా ఏ చింతలేని ఉన్నత వర్గానికి చెందిన కుటుంబం వీరిది. ఈ జంట 1980 లో విడాకులు తీసుకుంది. తల్లిదండ్రుల విడాకులు తర్వాత, మస్క్ ప్రిటోరియాలోనే తన తండ్రితో నివసించాడు.

ఎలన్ మస్క్ ప్రాథమిక విద్యాభ్యాసం ప్రిటోరియాలో నగరంలో పూర్తిచేసాడు. అప్పటిలో దక్షిణాఫ్రికాలో, హైస్కూల్ పూర్తిచేసిన విద్యార్థులు కొన్నాళ్ళు తప్పనిసరి సైనిక సేవలో ఉండాలనే నియమం ఉండేది. కాని ప్రభుత్వం యొక్క వర్ణవివక్ష వ్యవస్థ కారణంగా మస్క్ దక్షిణాఫ్రికా యొక్క తప్పనిసరి సైనిక సేవలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాడు. హైస్కూల్ నుండి పట్టభద్రుడయ్యాక దక్షిణాఫ్రికాను విడిచిపెట్టాలని నిశ్చయించుకున్నాడు. దీనితో తిరిగి కెనడాలోని తల్లి చెంతకు చేరుకున్నాడు.

ఎలన్ మస్క్ ఎడ్యుకేషన్

ఎలన్ మస్క్'కు చిన్ననాటి నుండి కంప్యూటింగ్ మరియు వీడియో గేమ్‌లపై విపరీతమైన ఆసక్తి ఉండేది. పదేళ్ల వయసులోనే ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు. 12 ఏళ్ళ వయసులో బ్లాస్టర్ అనే వీడియో గేమ్ రూపొందించాడు. మస్క్ తన ఉన్నత విద్యను యూఎస్'లో చేయాలనుకున్నాడు. దీనికోసం తల్లి ద్వారా కెనడా జాతీయతను పొందాడు. అలా కెనడియన్ పాస్‌పోర్టు ద్వారా అమెరికా యూనివర్సిటీల కోసం ధరఖాసు చేసుకున్నాడు.

1990లో ఒంటారియోలోని కింగ్‌స్టన్‌లోని క్వీన్స్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ లభించడంతో అందులో చేరాడు. రెండు సంవత్సరాల తరువాత,  పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి బదిలీ అయ్యాడు. ఇదే యూనివర్సిటీ నుండి 1997 లో ఫిజిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తిచేసాడు. అలానే వార్టన్ స్కూల్ నుండి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు.

మస్క్ పెన్సిల్వేనియాలో చదువుతున్న రోజుల్లో వేసవిలో సిలికాన్ వ్యాలీలో రెండు ఇంటర్న్‌షిప్‌ చేసాడు. ఇందులో ఒకటి ఎనర్జీ స్టోరేజ్ స్టార్టప్ 'పినాకిల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌'లో, ఇది శక్తివంతమైన ఎలక్ట్రోలిటిక్ అల్ట్రా కాపాసిటర్‌లకు సంబంధించింది. రెండవది రాకెట్ సైన్స్ గేమ్‌లకు సంబంధించిన పాలో ఆల్టో-ఆధారిత స్టార్టప్. ఈ ఇంటర్న్‌షిప్‌లు ఆయన భవిష్యత్తు జీవిత గమనాన్ని నిర్దేశించాయి. ఇవి రాబోయే కాలంలో ప్రారంభించే స్పేస్‌ఎక్స్‌, టెస్లాకు పునాదులుగా నిలిచాయి.

1995 లో గ్రాడ్యుయేషన్ చేస్తూనే కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో మెటీరియల్ సైన్స్‌లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (Ph.D.) ప్రోగ్రామ్‌ కోసం రిజిస్టర్ చేసుకున్నాడు. ఇదే సమయంలో నెట్‌స్కేప్‌లో ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. ఇక్కడ ఉద్యోగం దొరక్కపోవడంతో స్టాన్‌ఫోర్డ్ నుండి కొద్దిరోజుల్లోనే తప్పుకున్నాడు. బదులుగా గ్రాడ్యుయేషన్ పూర్తియ్యాక ఇంటర్నెట్ బూమ్‌లో చేరి, ఏదైనా ఇంటర్నెట్ స్టార్టప్‌ని ప్రారంభించలనుకున్నాడు.

ఎలన్ మస్క్ మొదటి స్టార్టప్‌

సిలికాన్ వ్యాలీ మహత్యం ఏమిటీలో తెలియదు కాని, అక్కడ అదుగ్గుపెట్టిన ప్రతి వ్యక్తిని వ్యవస్థాపక ఆలోచనలతో పేరేపిస్తుంది. ఎలన్ మస్క్ దానికి మినహాయింపు కాదు. సిలికాన్ వ్యాలీలో ఇంటర్న్‌షిప్‌ చేసే రోజుల నుండే ఆయనలో ఈ ఆలోచనలు పురుడుపోసుకున్నాయి. కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగ జీవితం కోసం ప్రయత్నం చేసినా, చివిరికి ఎంట్రప్రెన్యూర్ గానే కెరీర్ ప్రారంభించాడు

1995 లో సోదరుడు కింబాల్ మరియు స్నేహితుడు గ్రెగ్ కౌరీ సహాయంతో, తండ్రి నుండి తీసుకున్న నిధులతో వెబ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ జిప్2 ని స్థాపించారు. వార్తాపత్రిక ప్రచురణ సంస్థలకు ఇంటర్నెట్ సిటీ గైడ్‌ను అందించే ఈ సాఫ్ట్‌వేరును సిటీ మ్యాప్స్, రూట్ డైరెక్షన్స్ మరియు ఎల్లోపేజీలతో అభివృద్ధి చేశారు. పాలో ఆల్టోలోని ఒక చిన్న అద్దె కార్యాలయంలో ఈ వెంచర్‌ను ప్రారంభించారు. కొద్దీ రోజుల్లోనే ది న్యూయార్క్ టైమ్స్ మరియు చికాగో ట్రిబ్యూన్‌తో ఒప్పందాలను పొందారు. పగటిపూట దీనికోసం పనిచేస్తూ, రాత్రి సమయాన నూతన ప్రోజెక్టుల కోసం కోడింగ్ చేసేవాడు.

జిప్2 విజయవంతం అవ్వడంతో ఆ రంగంలో ఇదివరకే ఉన్న పోటీ సంస్థలు జిప్2 ను  దక్కించుకునే ప్రయత్నాలు చేసాయి. అందులో సిటీసెర్చ్ చివరి వరకు ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నాలను మస్క్ నిలువరించినా, మెజారిటీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమ్మతితో 1999 లో జిప్2ని కాంపాక్  కంపెనీకి అమ్మేయాల్సి వచ్చింది. $307 మిలియన్ల ఈ డీలులో  మస్క్ తన 7 శాతం వాటా కోసం $22 మిలియన్లు అందుకున్నాడు. గాని ఒక సంస్థకు సీఈఓ అవ్వాలనే తన కల అలానే ఉండిపోయింది.

ఎక్స్.కామ్ నుండి పేపాల్ వరకు

జిప్2ని అమ్మేసిన కొద్దీ నెలలలోనే ఎక్స్.కామ్ పేరుతో ఆన్‌లైన్ ఇ-మెయిల్ చెల్లింపు సంస్థను ప్రారంభించాడు. ఈ స్టార్టప్ ఫెడరల్ ఇన్సూరెన్స్ పొందిన మొదటి ఆన్‌లైన్ బ్యాంకుగా గుర్తించబడింది. ఈ సంస్థ ప్రారంభ నెలల్లో 200,000 మంది కస్టమర్‌లను సొంతం చేసుకుంది. అలానే సీఈఓ అవ్వాలనే ఎలన్ మస్క్ డ్రీమును కూడా నిజం చేసింది. గాని కొద్దిరోజుల్లోనే మస్క్, ఆ సంస్థ పెట్టుబడిదారుల అసంతృప్తికి గురయ్యాడు. ఫలితంగా సీఈఓగా తప్పుకోవాల్సి వచ్చింది.

ఇదే ఏడాది చివరిలో ఎక్స్.కామ్, మరో ఆన్‌లైన్ బ్యాంకింగ్ సంస్థ కన్ఫినిటీతో విలీనం చేయబడింది. ఈ రెండు సంస్థల విలీనం నుండి పేపాల్ ఉద్బవించింది. ఈ విలీన సంస్థకు సీఈఓగా తిరిగి ఎలన్ మస్క్ నిరయమించబడ్డాడు. ఇది జరిగిన జరిగిన కొద్ది నెలలకే మస్క్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వల్ల కంపెనీలో చీలిక ఏర్పడింది. ఫలితంగా కొన్ని సాంకేతిక సమస్యలు మరియు సరైన మానవ వనరులు, వ్యాపార నమూనా లేకపోవడంతో మరోసారి మస్క్ సీఈఓగా వైదొలగవలసి వచ్చింది. 2002లో పేపాల్ లోని $1.5 బిలియన్ల స్టాక్‌ను ఈబై సంస్థ కొనుగోలు చేసింది. అందులో 11.72% షేర్లతో అతిపెద్ద వాటాదారు అయిన మస్క్ $175.8 మిలియన్లను అందుకున్నాడు.

స్పేస్‌ఎక్స్‌ పుట్టుక

ఎలన్ మస్క్ జీవితాన్ని తీక్షణంగా గమనిస్తే ఆయన చేసే ముందు పనికి తర్వాత పనికి పోలిక ఉండదు. ఇదే ఆయన ప్రత్యేకత. పేపాల్ నుండి బయటపడ్డాక 2001 లో లాభాపేక్షలేని మార్స్ సొసైటీతో కలిసాడు. అంగారక గ్రహంపై మొక్కల కోసం గ్రోత్-ఛాంబర్‌ను ఉంచేవారి ప్రాజెక్టు మస్క్'ను ఆకర్షించింది. దానికి కోసం ఎలన్ సొంతంగా నిధులు చేకూర్చి పెట్టాడు.

2001లో గ్రీన్‌హౌస్ పేలోడ్‌లను అంతరిక్షంలోకి పంపించేందుకు పునర్నిర్మించిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను (ICBMలు) కొనుగోలు చేసేందుకు తన బృందంతో మాస్కోకు వెళ్ళాడు. అక్కడ ఎన్నో అవమానాల తర్వాత తిరిగి అమెరికాకు చేరుకున్న మస్క్, తక్కువ ధరలో రాకెట్లను నిర్మించగల కంపెనీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. తన సంపదలో దాదాపు $100 మిలియన్లు వెచ్చింది స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పోరేషన్‌ను స్థాపించాడు. దీనినే స్పేస్‌ఎక్స్‌గా బ్రాండింగ్ చేసాడు.

స్పేస్‌ఎక్స్ 2006 లో ఫాల్కన్ 1 రాకెట్‌ రూపంలో తన మొదటి ప్రయోగానికి ప్రయత్నించి, విఫలమయ్యింది. ఇలా ఎన్నో విఫల ప్రయత్నాల తర్వాత 2008లో ఫాల్కన్ 1ని భూకక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో విజయం సాధించింది. ఫలితంగా నాసా నుండి వివిధ రాకెట్లు రూపొందించేందుకు $1.6 బిలియన్ల వాణిజ్య రీసప్లై సర్వీసెస్ ప్రోగ్రామ్ కాంట్రాక్ట్‌ని పొందింది. ఈ క్రమంలో స్పేస్‌ఎక్స్ ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది, మరెన్నో పరిశోధనపై దృష్టిసారించింది. సాధారణ మనుషుల అంతరిక్ష విహారం కోసం ప్రయోగాలను ముమ్మరం చేస్తుంది.

ప్రపంచ మారుమూల ప్రాంతాలకు వేగవంతమైన శాటిలైట్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడానికి 2015లో స్టార్‌లింక్ కాన్సల్టెసెషన్ ప్రారంభించాడు. దీని కోసం వందల సంఖ్యలో స్టార్‌లింక్  ఉపగ్రహాలను అంతరిక్షంలో గుమ్మరించి, అతి వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను ప్రపంచానికి చవకగా అందించబోతున్నాడు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ సమస్తం కోల్పోయిన మస్క్ స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు అంతరాయం లేకుండా అందించబడ్డాయి. స్పేస్‌ఎక్స్ ప్రస్తుతం ఒక విలువైన పెట్టుబడి. దీని ప్రస్తుత మార్కెట్ విలువ అక్షరాలా $125 బిలియన్ డాలర్లు.

టెస్లాలో చేరిక

టెస్లా వాస్తవానికి 2003లో మార్టిన్ ఎబర్‌హార్డ్ మరియు మార్క్ టార్పెనింగ్‌లచే ప్రారంభించబడింది. వీరు 2004 లో సిరీస్ A పెట్టుబడిదారుల కోసం వెతుకున్న సందర్భంలో మస్క్ ఈ సంస్థలోకి ప్రవేశించాడు. సుమారు $6.5 మిలియన్లు పెట్టుబడి పెట్టడం ద్వారా ఆ కంపెనీలో మెజారిటీ వాటాదారుడు అయ్యాడు అదే క్రమంలో టెస్లా యొక్క డైరెక్టర్ల బోర్డులో ఛైర్మన్‌గా చేరాడు. తరువాత ఆ సంస్థ సీఈఓ అయ్యాడు. మస్క్ నాయకత్వంలో ఆ కంపెనీ ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా మారింది. 2021 నాటికీ ఈ కంపెనీ విలువ అక్షరాలా $600 బిలియన్ డాలర్లు .

టెస్లా ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలను ( ఎలక్ట్రిక్ కార్లు మరియు ట్రక్కులు ), ఎలక్ట్రిక్ బ్యాటరీలు, సోలార్ ప్యానెల్‌లు మరియు సోలార్ రూఫ్ టైల్స్ తయారు చేస్తుంది. 2021 చివరినాటికి ఈ సంస్థ మొత్తం 2.3 మిలియన్ కార్లను సేల్ చేసింది. 2021లో టెస్లా మార్కెట్ క్యాపిటలైజేషన్ $1 ట్రిలియన్‌కు చేరుకుంది. యూఎస్ యందు ఈ ఘనత సాధించిన ఆరవ కంపెనీగా టెస్లా అవతరించింది. టెస్లాకు మార్కెట్ బ్రాండ్ కల్పించడంలో మొత్తం క్రెడిట్ ఎలన్ మస్క్'కు చెందుతుంది. అదే సమయంలో టెస్లా ఆయన్ని ప్రపంచ కుభేరుల జాబితాలో అగ్రస్థానంలో నిలబెట్టింది.

ఎలన్ మస్క్ యొక్క ఇతర కంపెనీలు

ఎలన్ మస్క్ అంటే స్పేస్‌ఎక్స్‌ & టెస్లా మాత్రమే కాదు ఈ జాబితా చాల పెద్దది. 2006లో కజిన్స్ లిండన్ మరియు పీటర్ రైవ్ కలిసి సోలార్‌సిటీ మరియు టెస్లా ఎనర్జీ కంపెనీని ఏర్పాటు చేసాడు. ఇది 2013 నాటికి యునైటెడ్ స్టేట్స్‌లో సౌర విద్యుత్ అందించే రెండవ అతిపెద్ద సంస్థగా ఎదిగింది. 2016లో సోలార్‌సిటీని టెస్లాలో విలీనం చేసాడు. దీని కోసం $2 బిలియన్లకు పైగా వెచ్చించాడు. ఈ కొనుగోలు టెస్లా షేరును కుదేలు చేసింది. ఈ కొనుగోల వలన ఎలన్ మస్క్ మినహా టెస్లాకి ఏంటి లాభం అనే ప్రశ్న తలయెత్తింది. ఇది కోర్టుల వరకు వెళ్ళింది చివరికి రెండేళ్ల తర్వాత కోర్టు మస్క్‌కి అనుకూలంగా తీర్పునిచ్చింది.

ఇక 2016లో మానవ మెదడును కృత్రిమ మేధస్సు (AI) తో అనుసంధానించడానికి న్యూరోటెక్నాలజీ స్టార్టప్ కంపెనీ అయిన న్యూరాలింక్‌ను స్థాపించాడు. 2020 లో ఈ సంస్థ "ఫిట్‌బిట్" చిన్న పరికరాన్ని రూపొందించింది. ఇది పక్షవాతం, చెవుడు, అంధత్వం మరియు ఇతర వైకల్యాలను నయం చేయగలదు చెప్పుకొచ్చింది. ఈ ప్రకటన న్యూరో సైంటిస్టుల నుండి అనేక విమర్శలు అందుకుంది. టెక్నాలజీ రివ్యూ వాటిని "అత్యంత ఊహాజనిత" మరియు "న్యూరోసైన్స్ థియేటర్"గా అభివర్ణించింది.

2017లో భారీ సొరంగాలు, బోర్లు నిర్మించేందుకు ది బోరింగ్ కంపెనీని స్థాపించాడు. అలానే 2022 లో పాపులర్ సోషల్ మీడియా ట్విట్టరును చేజిక్కించుకునేందుకు ముందుకొచ్చాడు. 2009లో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో చేరినప్పటి నుండి, మస్క్ ట్విట్టర్ యొక్క క్రియాశీల వినియోగదారుగా ఉన్నాడు, ఈవేదికలో అతనికి 95 మిలియన్ల మంది అనుచరులు ఉన్నారు

2017 ప్రారంభంలో మస్క్ ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తిని ట్వీట్ చేశాడు. అప్పటి నుండి ఆ సంస్థలో షేర్లను కొనుగోలు చేయడం ప్రారంభించాడు. 2022 మార్చి నాటికీ ఆ కంపెనీలో 5% వాటాను కలిగి ఉన్నాడు. ఇదే ఏడాది ఏప్రిల్ నాటికీ మొత్తం 9.13% షేర్లతో, $2.64 బిలియన్ల విలువతో కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా నిలిచాడు. ఇదే నెల చివరిలో మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి $43 బిలియన్ల ఆఫర్‌ను అందించాడు, ట్విట్టర్ యొక్క 100% స్టాక్‌ను ఒక్కో షేరుకు $54.20 చొప్పున కొనుగోలు చేసేందుకు టేకోవర్ బిడ్‌ను ప్రారంభించాడు. దీనికి ట్విటర్ కూడా సమ్మతించింది. భవిష్యత్తులో ట్విటర్ మస్క్ సొంతం కానుంది. ఇలా చెప్పుకుంటూ పొతే ఈ జాబితా చాలా ఉంది. వ్యాపారం ఆయనకు వ్యసనం. అందుకే ఆయన వ్యాపారాలకు పుల్ స్టాప్ లేదు.

ఎలన్ మస్క్ వ్యక్తిగత జీవితం

ఎలోన్ మస్క్ యొక్క వ్యక్తిగత జీవితం కల్లోలభరితమైనది. ఆయన వ్యాపారంలో అనుచరించిన నియమాలనే వ్యక్తిగత జీవితంలో పాటించారు. అందుకే ఆయన జీవితం స్టాక్ మార్కెట్ సూచీలులా స్థిరమైనది కాదు. ఎలోన్ మస్క్ 2000 లో కుటుంబ జీవితంలోకి అడుగుపెట్టాడు. క్వీన్స్ యూనివర్శిటీలో చదువుకున్న రోజుల్లో పరిచయమైన జస్టిన్ విల్సన్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు మొత్తం ఐదుగురు సంతానం. వీరు 2008 లో విడాకులు తీసుకున్నారు.

ఎలోన్ మస్క్ కుటుంబ జీవితంపై తన తల్లిదండ్రుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఆయన జీవిత భాగస్వాముల సంఖ్య, తన కంపెనీల సంఖ్య కంటే ఎక్కువ ఉంటుంది. 2008 లో జస్టిన్ విల్సన్‌ను దూరమయ్యాక 2008లో హాలీవుడ్ నటి తాలూలా రిలేతో డేటింగ్ ప్రారంభించాడు. 2010 లో స్కాట్లాండ్‌లోని డోర్నోచ్ కేథడ్రల్‌లో ఆమెను వివాహం చేసుకున్నారు. చేసుకున్న రెండేళ్లకే ఈ బంధం నుండి విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఇది జరిగిన కొద్ది నెలలలో మళ్ళీ తిరిగి ఆమెనే వివాహం చేసుకున్నాడు. ఇది జరిగిన ఏడాదిలో ఈ జంట రెండు విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది.

తాలూలా రిలే అధ్యయనం ముగిసాక 2016 అమెరికన్ నటి అంబర్ హర్డ్‌తో డేటింగ్ ఆరోపణలు వచ్చాయి. వీరి ఎఫైర్ 2012 నుండి కొనసాగుతున్నట్లు ఆమె భర్త ఆరోపించారు. దీనిని ఇద్దరు మీడియా ముఖంగా ఖండించారు. ఇక 2018 నుండి కెనడియన్ మ్యూజిసియాన్ గ్రిమ్స్ తో డేటింగ్ కొనసాగిస్తున్నాడు. వీరిద్దరూ వివాహం చేసుకోకున్న, సరోగసీ ద్వారా ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

ముగింపు వ్యాఖ్యలు

ఎలోన్ మస్క్ మీడియాలో మరియు ఇంటర్నెట్ ప్రపంచంలో భారీ ప్రజాదరణ పొందిందిన బిలియనీర్. 2002లో పేపాల్ ఈబేకి విక్రయించబడినప్పుడు మస్క్ $175.8 మిలియన్లు సంపాదించాడు. 2012లో మొదటిసారి ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితాలో చోటు సంపాదించుకున్నాను. 2020 ప్రారంభంలో, మస్క్ నికర విలువ $27 బిలియన్లు. ఇదే సంవత్సరం చివరినాటికి అతని నికర విలువ $150 బిలియన్లు చేరుకుంది. ఇదే ఏడాది ఫేస్‌బుక్ సహ-వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌ను అధిగమించి ప్రపంచంలో మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచాడు.

ఒక వారం తర్వాత అతను మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను అధిగమించి రెండవ అత్యంత ధనవంతుడు అయ్యాడు. జనవరి 2021 నాటికీ $185 బిలియన్ల నికర విలువతో, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మస్క్ నిలిచాడు. నవంబర్ 2021 నాటికీ మస్క్ $300 బిలియన్లకు పైగా నికర విలువ కలిగిన మొదటి వ్యక్తిగా అవతరించాడు.

ఇంత సంపద కూడబెట్టిన ఎలోన్ మస్క్, ఈ ప్రపంచానికి ఏమైనా సాయం చేస్తున్నాడా అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. మస్క్ ఏరోజు బహిరంగ దాతృత్వాలు ప్రకటించలేదు. ఆయన సంపాదనలో 1శాతం సంపద కూడా ఆయన ధానం చేయలేదు అనే విమర్శలు ఉన్నాయి. నిజానికి ఆయన దాతృత్వాలు అన్ని ప్రపంచ భవిష్యత్తు మనుగడకు సంబంధించిన పరిశోధనలకే కేటాయించబడ్డాయి. మస్క్ ఫౌండేషన్ చేస్తున్న ఈ దాతృత్వాలు ద్వారా నేడు ప్రపంచ విపత్తు ప్రాంతాలలో సౌర-శక్తిని, ఇంటర్నెట్ సేవలను ఉచితంగా అందించే అవకాశం లబిస్తుంది.

మానవ అంతరిక్ష పరిశోధన, పీడియాట్రిక్స్, పునరుత్పాదక శక్తి మరియు వంటి రంగాలకు మస్క్ ఫౌండేషన్ ద్వారా మద్దతు అందిస్తున్నాడు. సైన్స్ మరియు ఇంజనీరింగ్ విద్యా లక్ష్యాల కోసం పనిచేస్తున్న సంస్థలకు సహకారం అందిస్తున్నాడు. అలానే శాస్త్రీయ పరిశోధన, విద్య సంబంధిత లాభాపేక్ష లేని వికీమీడియా ఫౌండేషన్ వంటి సంస్థలకు నేరుగా ఆర్థికసాయం కల్పిస్తున్నాడు. 2012లో గివింగ్ ప్లెడ్జ్ పై సంతకం చేసాడు. 2021లో టెస్లా యొక్క $5.7 బిలియన్ల షేర్లను దాతృత్వానికి విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించాడు.

ఎలోన్ మస్క్'ది పూర్తి స్వతంత్ర భావాలు ఉన్న వ్యక్తిత్వం. గీతగీచి కూర్చోపెట్టే రూల్స్ అంటే ఆయనకు ఇష్టం ఉండదు. మాట్లాడే మాట, చేసే పని ఖచ్చితంగా ఉండాలనేది ఆయన సిద్ధాంతం. ఎలోన్ మస్క్ పుట్టుకతోనే ధనవంతుడు కావొచ్చు, కాని ప్రపంచ బిలియనీర్ కావడం వెనుక కఠోరమైన శ్రమ ఉంది, ఎన్నో నిద్రలేని రాత్రలున్నాయి. అపరిమితమైన మానసిక వ్యధ ఉంది. ఊరికే ఎవరు ధనవంతులు కాలేరు..ఎలోన్ మస్క్ వలె బిన్నంగా ఆలోచించేవారికి మాత్రమే అది సాధ్యం అవుతుంది. చాలా మందికి కొత్తదనం అంటే భయం..కానీ అది మీకు ఎప్పటికి సరైన గమ్యానికే చేర్చుతుంది. మీ లక్ష్యం ఏంటో తెలిస్తే..దాన్ని ఛేదించే మార్గం మీకు తెలుస్తుంది. ఇదే ప్రశ్న మీరు తనని అడిగితే మార్స్ పైన తుదిశ్వాస విడవాలి అంటాడు... ఇదే ఎలోన్ మస్క్ మీకు ఇచ్చే సందేశం.

Post Comment