విద్యాలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సమస్యలతో ఉన్నత విద్యకు దూరమౌతున్న విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం చక్కని సౌలభ్యం అందుబాటులోకి తెచ్చింది. విద్యారుణం అంటే ఒకప్పుడు బ్యాంకుల చుట్టూ కాళ్ళరిగేలా తిరగాలనే అభిప్రాయాన్ని తోచిపుచ్చుతూ, విద్యాలక్ష్మి పథకం ద్వారా అన్ని బ్యాంకులను ఒకే వేదికలో అందుబాటులో ఉంచింది.
విద్యారుణం పొందాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాలనే అపోహ ఉండే విద్యార్థులు, నేడు ఆ అవసరం లేకుండా ఇంటి నుంచి నేరుగా దరఖాస్తు చేసుకుని రుణం పొందే అవకాశం ఈ పథకం కల్పిస్తోంది. కేంద్ర ఆర్థికశాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఏబీఏ) సంయుక్తంగా విద్యాలక్ష్మి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఎన్‌ఎస్‌డీఎల్ ఈ-గవర్నెన్స్ వ్యవస్థ ద్వారా ఈ పథకాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
విద్యాలక్ష్మి పథకం పూర్తి వివరాలు
కేంద్ర ఆర్థికశాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఏబీఏ) సంయుక్తంగా విద్యాలక్ష్మి పోర్టల్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ వేదికలో దాదాపు 38 కి పైగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి.
ఎడ్యుకేషన్ లోన్ కోసం ధరఖాస్తు చేసుకునే విద్యార్థులకు, ఎంపిక చేసుకున్న కోర్సు, కళాశాల ఆధారంగా 127 రకాల విద్యారుణ పథకాలను అందుబాటులో ఉంచారు. అర్హుత ఉండే విద్యార్థులకు 15 రోజుల్లో ఈ వేదిక ద్వారా విద్యా రుణం మంజూరు చేస్తారు.
విద్యాలక్ష్మి పథకం ద్వారా గరిష్టంగా 10 లక్షల వరకు రుణం మంజూరు చేస్తారు. 7.5 లక్షలు దాటే రుణాలకు సొంత పూచికత్తులు సమర్పించాల్సి ఉంటుంది. 4.5 లక్షల వరకు లేదా 4.5 లక్షల లోపు రుణాలకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ అందిస్తుంది. మహిళా విద్యా ప్రోత్సహకంలో భాగంగా మహిళా విద్యార్థులకు అదనపు రాయితీలను కల్పిస్తుంది.
ఇంటర్, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్, మెడిసిన్, పీజీ డిప్లొమా ప్రొఫెషనల్ కోర్సులు, కాస్ట్ అకౌంటెన్సీ, ఛార్టెడ్ అకౌంట్, ఐఐఎం మేనేజ్‌మెంట్, ఐఐటీ, వృత్తి విద్యా కోర్సులు, విమానయాన రంగానికి సంబంధించిన కోర్సులు చదివే వారికి ఈ పథకం ద్వారా రుణాలు ఇస్తున్నారు. యూజీసీ, ఏఐసీటీఈ ఇతర ప్రభుత్వ అధీకృత సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వారికి ఈ రుణాలు అందిస్తారు.
విద్యాలక్ష్మి లోన్ కోసం అప్లై చేయండి
అర్హుత ఉండే విద్యార్థులు విద్యాలక్ష్మి (www.vidyalakshmi.co.in) పోర్టల్ ద్వారా సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఫోన్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడీ సహాయంతో విద్యాలక్ష్మి పోర్టల్ యందు అకౌంట్ రూపొందించుకోవాలి.
రెండవ దశలో విద్యా రుణానికి సంబంధించిన కామన్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ఫారం (CELAF) పూరించాల్సి ఉంటుంది. ఈ దశలో మీకు అందుబాటులో ఉండే రుణ పథకాలు, వాటిని అందించే బ్యాంకుల జాబితా అందుబాటులో ఉంటుంది.
చివరిగా మీరు రుణం కోసం దరఖాస్తు చేసుకోబోయే బ్యాంకును, మీకు సరిపోయే రుణ పథకాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడు గరిష్టంగా మూడు బ్యాంకులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు.
వచ్చిన దరఖాస్తులను పలు దశల వెరిఫికేషన్ తర్వాత ఖచ్చితత్వంతో ఉండే అభ్యర్థుల బ్యాంకు అకౌంట్లలో రుణాన్ని 15 రోజుల్లో జమ చేస్తారు. ఒకవేళ దరఖాస్తు తిరస్కరించబడితె దానికి తగు కారణంతో విద్యార్థికి సమాచారం అందిస్తారు. 7.5 లక్షలకు దాటి విద్యా రుణం కావాలనుకునే వారు, సొంత పూచికత్తులు సమర్పించాల్సి ఉంటుంది.
విద్యా రుణాల వడ్డీ రేట్లు బ్యాంకు నుండి బ్యాంకుకు వేరుగా ఉంటాయి. బ్యాంకును ఎంపిక చేసుకునే సమయంలో ఈ విషయం విద్యార్థులు గమనించాలి. రుణం కోసం చేసుకున్న దరఖాస్తును, విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా ట్రాక్ చెయ్యొచ్చు.
విద్యా రుణం తిరుగు చెల్లింపు విధానాన్ని కూడా విద్యార్థులు బ్యాంకుకు తెలపాల్సి ఉంటుంది. ఋణం తీసుకున్న నెల నుండి ఈఏంఐ పద్దతిలో చేల్లిస్తారా లేదా మొరటోరియం పద్దతి ద్వారా ఉద్యోగంలో చేరాక చెల్లిస్తారా అనే విషయం తెలపాల్సి ఉంటుంది.
విద్యాలక్ష్మి దరఖాస్తుతో జత చేయాల్సిన సర్టిఫికేట్లు
- చదివిన విద్యాసంస్థ నుంచి బదిలీ ధ్రువపత్రం (టీసీ).
- మార్కుల జాబితా (ఉత్తీర్ణత సర్టిఫికెట్).
- ఇంతవరకు పొందిన ఉపకార వేతన పత్రాలు.
- ఉన్నత విద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్షా ర్యాంకు కార్డు.
- ప్రవేశ అనుమతి పత్రాలు (అడ్మిషన్ సర్టిఫికెట్).
- చదవాల్సిన కోర్సుకు చెందిన ఫీజుల అంచనా వివరాలు.
- తల్లి/ తండ్రి/ సంరక్షుడు/ విద్యార్థికి సంబంధించిన పాస్ ఫోటోలు.
- విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారి వేతన ధ్రువపత్రాలు, ఆస్తి వివరాలు.
- నివాస ధృవీకరణ కోసం ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ లాంటివి జత చేయాలి.