ఐక్యరాజ్యసమితి వాలంటీర్ల కార్యక్రమం : స్వచ్ఛంద సేవకులుగా చేరండి
Career Guidance Volunteer Programs

ఐక్యరాజ్యసమితి వాలంటీర్ల కార్యక్రమం : స్వచ్ఛంద సేవకులుగా చేరండి

ఐక్యరాజ్యసమితి వాలంటీర్ల కార్యక్రమంను యునైటెడ్ నేషన్స్ (ఐక్యరాజ్య సమితి) ఆఫర్ చేస్తుంది. ఈ ప్రోగ్రాం ద్వారా ప్రపంచ శాంతి మరియు అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ ప్రోగ్రాం కోసం ఏటా జాతీయ మరియు అంతర్జాతీయంగా సగటున 7,000 మంది వాలంటీర్లను స్వచ్ఛందంగా సమీకరిస్తుంది.

Advertisement

ఐక్యరాజ్యసమితి వాలంటీర్ల కార్యక్రమం ద్వారా ఎంపికైన వాలంటీర్లు వివిధ దేశాలలో ఐక్యరాజ్య సమితి చేపట్టే యుఎన్ శాంతి పరిరక్షణ కార్యకలాపాలతో పాటుగా ఇతర మానవతా ప్రాజెక్టుల యందు సేవలు అందిస్తారు. ఈ కార్యక్రమాలు 6 నెలల నిడివి నుండి గరిష్టంగా ఏడాది వరకు ఉంటాయి.

యూఎన్ వాలంటీర్లు స్వదేశంలో జాతీయ వాలంటీర్లుగా లేదా వారి స్వదేశానికి బయట అంతర్జాతీయ వాలంటీర్లుగా లేదా ఇంటర్నెట్ ద్వారా పనిచేసే ఆన్‌లైన్ వాలంటీర్లుగా స్వచ్ఛందంగా సేవలు అందించే అవకాశం కల్పిస్తుంది. ఈ సమయంలో వాలంటీర్లకు వాలంటీర్ లివింగ్ అలవెన్స్ (VLA) తో పాటుగా ఫైనాన్సియల్ అసిస్టెన్స్ అందిస్తుంది.

యునైటెడ్ నేషన్స్ వాలంటీర్స్ (UNV) ప్రోగ్రాంకు ఎంపికవ్వడం సామాన్య విషయం కాదు. యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీలతో పనిచేసే అవకాశం కొద్దీ మందికే దొరుకుతుంది. జాతీయ యుఎన్ వాలంటీర్‌గా మీరు అంతర్జాతీయంగా ఇతర ఐక్యరాజ్యసమితి నిపుణులతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది. వివిధ దేశాల స్థానిక భాషలు మరియు సంస్కృతిపై మీ జ్ఞానాన్ని పంచుకోవచ్చు.

అంతే కాకుండా ఆయా దేశల సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులపై అంతర్గత అవగాహనను పెంపొందించుకోవచ్చు. వీటన్నిటికీ మించి మీ మాతృదేశం తరుపున ప్రపంచ దేశాలకు సేవ చేసే అరుదైన అదృష్టం మీకు లభిస్తుంది.

నాలుగు రకాల యూఎన్‌వి అసైన్‌మెంట్స్

స్పెషలిస్ట్ వాలంటీర్లు: ఈ కేటగిరిలో వివిధ విభగాలలో వృత్తి పరమైన అనుభవం కలిగిన నిపుణులను ఎంపిక చేస్తారు. వీరు యునైటెడ్ నేషన్స్ చేపట్టే అత్యున్నత స్థాయి ప్రాజెక్టులలో వృత్తి నిపుణులుగా సేవలు అందిస్తారు. ఈ ప్రోగ్రాంలో ఎంపికవ్వాలంటే ప్రొఫెషనల్ టెక్నికల్ స్కిల్స్ తో పాటుగా కనీసం బ్యాచిలర్ డిగ్రీ లేదా సమానమైన ప్రొఫెషనల్ అనుభవంఅవసరం.

కమ్యూనిటీ వాలంటీర్లు: ఈ కేటగిరిలో స్థానిక కమ్యూనిటీ స్థాయిలో అనుభందం ఉన్న వ్యక్తులను ఎంపిక చేస్తారు. వీరు తమ స్థానిక పరిస్థితులపై పూర్తి అవగాహనా కలిగి ఉండి..సొంత టీంతో అదే ప్రాంతానికి సంబంధించిన పనులు చేయాల్సి ఉంటుంది. ఈ కేటగిరిలో ఎంపిక అయ్యేందుకు కనీసంగా ఉన్నత పాఠశాల డిప్లొమాను కలిగి ఉండాలి.

యూత్ వాలంటీర్స్: యూత్ వాలంటరింగ్ వ్యవస్థను యునైటెడ్ నేషన్స్ గట్టిగా ప్రోత్సహిస్తుంది. 18 నుండి 29 ఏళ్ళ మధ్య ఉండే యువకులను యునైటెడ్ నేషన్స్ సేవ కార్యక్రమాల్లో భాగం చేయాలనే ఆలోచనతో దీన్ని తీసుకొచ్చారు.

యుఎన్ యూత్ వాలంటీరుగా, వీరు తమ స్వంత దేశంలో లేదా ప్రపంచవ్యాప్తంగా ఉండే స్థానిక కమ్యూనిటీలకు..  ఆరోగ్యకరమైన, సురక్షితమైన జీవితాలను గడపడానికి అలానే వర్తమాన మరియు భవిష్యత్తు సవాళ్లను మెరుగ్గా ఎదుర్కోవడానికి అవసరమయ్యే సహాయం చేస్తారు. ఇందులో మానవ హక్కులలు, వాతావరణ మార్పులు, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, విపత్తు నిర్వహణ, శాంతిని నిర్మించడం వంటి అనేక అంశాలు ఉంటాయి.

యూఎన్  యూత్ వాలంటీర్ అసైన్‌మెంట్‌లు కనిష్టంగా ఆరు నుండి గరిష్టంగా 24 నెలల నిడివితో ఉంటాయి. విద్యాసంస్థలు స్పాన్సర్ చేసే యూఎన్ యూత్ వాలంటీర్లను... యూఎన్ యూత్ యూనివర్సిటీ వాలంటీర్స్ అంటారు. ఈ ప్రోగ్రామ్స్ 3 నుండి 6 నెలల వ్యవధితో ఉంటాయి.

ఇతర వాలంటీర్స్ : ఈ కేటగిరిలో యూఎన్ వాలంటీర్ పింఛను అందుకుంటున్న లేదా ఇతర ప్రైవేట్ ఆదాయ మార్గాలను కలిగి ఉన్న, మరియు స్వచ్ఛంద జీవన భృతిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్న అనుభవజ్ఞులైన వాలంటీర్లను ఈ కేటగిరిలో తీసుకుంటారు.

యూఎన్ వాలంటీర్ ప్రోగ్రాంకు ఎవరు అర్హులు ..?

యునైటెడ్ నేషన్స్ వాలంటీర్స్ ప్రోగ్రాంకు అసైన్‌మెంట్ చేసేందుకు ఎటువంటి నిర్దిష్ట అర్హుత ప్రమాణం లేదు. యునైటెడ్ నేషన్స్ కార్యక్రమాలు గ్రామీణ కమ్యూనిటీ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి నగరాల వరకు నిర్వహించబడతాయి.

చేసే ప్రతి కార్యక్రమానికి విభిన్నమైన వాలంటీర్ల అవసరం ఉంటుంది. దీనిని దృష్టిలో పట్టుకొని యునైటెడ్ నేషన్స్ కొన్ని పరిమిత అర్హుత ప్రమాణాలను నిర్ణహించింది. వీటిలో కనీస స్థాయి ఉన్నత విద్యతో పాటుగా వృత్తిపరమైన సామర్థ్యం మరియు కొన్ని వ్యక్తిగత అర్హతలు ఉన్నాయి.

  • జాతీయ యూఎన్ వాలంటీర్‌కు కనీస వయస్సు 22 ఏళ్ళు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.
  • చాలా అసైన్‌మెంట్‌లకు ఉన్నత సాంకేతిక డిప్లొమా, బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ అవసరం. కమ్యూనిటీ వాలంటీర్లకు హైస్కూల్ డిప్లొమా సరిపోతుంది.
  • అలానే కనీసం రెండేళ్ల సంబంధిత వృత్తి పరమైన అనుభవం అవసరం.
  • జాతీయ యూఎన్ వాలంటీర్లకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్థానిక భాషలలో సమర్థవంతంగా చదవటం, వ్రాయటం మరియు మాట్లాడటం తెలియాలి.
  • వాలంటీర్లు తాము నివసిస్తున్న దేశానికి సంబంధించి చట్టబద్దమైన నివాస ధృవపత్రం కలిగి వుండాలి.

వీటితో పాటుగా వాలంటీర్లు వ్యక్తిగతంగా అత్యున్నత విలువలతో కూడిన ఉత్తములై ఉండాలి. స్వచ్ఛందంగా పని చేసేందుకు బలమైన నిబద్ధతను ప్రదర్శించాలి. బహుళ సాంస్కృతిక వాతావరణంలో పనిచేయడానికి సుముఖత ఉండాలి. వివిధ సంస్కృతుల వైవిధ్యంపై గౌరవం కలిగివుండాలి. క్లిష్ట పరిస్థితులలో చిరునవ్వుతో సేవ చేయగలిగే ఓర్పు ఉండాలి.

ఎంపిక ఇంటర్వ్యూలో ఈ అంశాలనే ప్రధానంగా అభ్యర్థులలో గమనిస్తారు. వీటితో పాటుగా స్వచ్చంద సేవ పట్ల అభ్యర్థి వైఖరి, టీమ్ స్ఫూర్తి, అభ్యర్థి యొక్క నాయకత్వ మరియు వ్యక్తిగత లక్షణాలు అలానే అభ్యర్థి కలిగిఉండే సాంకేతిక నైపుణ్యాలను అంచనా చేసి అర్హులను ఎంపిక చేస్తారు.

Advertisement

Post Comment