ముఖ్యమైన రోజులు మరియు తేదీలు జూన్ 2023 కోసం చదవండి. జూన్ నెలలో జరుపుకునే వివిధ జాతీయ దినోత్సవాలు మరియు అంతర్జాతీయ దినోత్సవాల వివరాలు తెలుసుకోండి. ప్రముఖుల పుట్టిన రోజులు, మరణాల సమాచారం కూడా పొందండి. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది.
గ్లోబల్ పేరెంట్స్ డే | జూన్ 1
పిల్లల కోసం తల్లిదండ్రులు చూపే నిస్వార్థ నిబద్ధతను మరియు జీవితకాల త్యాగలను గుర్తుచేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 1 న గ్లోబల్ పేరెంట్స్ డే జరుపుకుంటారు. ఐ క్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2012లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులందరినీ గౌరవించటానికి జూన్ 1వ తేదీని మొట్టమొదటిసారిగా గ్లోబల్ పేరెంట్స్ డేగా ప్రకటించింది.
ప్రపంచ పాల దినోత్సవం | జూన్ 1
ప్రపంచ పాల దినోత్సవంను యేటా జూన్ 1వ తేదీన జరుపుకుంటారు. దీనిని ఐక్యరాజ్యసమితి యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ద్వారా 2001 లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రధానంగా ప్రపంచ ఆహార ఉత్పత్తిలో పాలు మరియు పాల ఉత్పత్తుల ప్రాముఖ్యతను గుర్తుచేసేందుకు జరుపుకుంటారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారునిగా ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, పాకిస్థాన్ మరియు బ్రెజిల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం | జూన్ 2
తెలంగాణా ఆవిర్భావ లేదా తెలంగాణా అవతరణ దినోత్సవంను అధికారికంగా యేటా జూన్ 2వ తేదీన జరుపుకుంటారు. 02 జూన్ 2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి భారతదేశ 28వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటుకు గుర్తుగా ఈ వేడుకను నిర్వహిస్తారు. ఈ రోజున తెలంగాణ రాష్ట్ర చరిత్రలో 1969 నుండి ఎన్నో ఏళ్లుగా కొనసాగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి శుభం కార్డు పడింది.
ఇంటర్నేషనల్ సెక్స్ వర్కర్స్ డే | జూన్ 2
అంతర్జాతీయ వోర్స్ డే లేదా ఇంటర్నేషనల్ సెక్స్ వర్కర్స్ డే ప్రతి సంవత్సరం జూన్ 2 న జరుపుకుంటారు. ఇది ప్రధానంగా సెక్స్ వర్కర్లను గౌరవించడానికి మరియు వారి దోపిడీ పూరిత పని పరిస్థితులపై అవగాహనా కల్పించేందుకు నిర్వహిస్తారు.
ప్రపంచ సైకిల్ దినోత్సవం | జూన్ 3
ఏటా జూన్ 3వ తేదీని ప్రపంచ సైకిల్ దినోత్సవంగా జారుకుంటారు. ఏప్రిల్ 2018లో, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ 3ని అంతర్జాతీయ ప్రపంచ సైకిల్ దినోత్సవంగా ప్రకటించింది. ఈ రోజును సైక్లింగ్ సంప్రదాయాన్ని కొనసాగించేందుకు, అలానే మానవ ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో దాని ముఖ్యమైన పాత్రను గుర్తించేందుకు ఈ కార్యక్రమంను జరుపుకుంటారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం | జూన్ 5
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏటా జూన్ 5న జరుపుకుంటారు. ఈ కార్యక్రమం ప్రధానంగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలలో అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) నేతృత్వంలో భాగంగా 1973 నుండి ఏటా ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తుంది.
వరల్డ్ ఫెస్ట్ డే | జూన్ 6
ప్రపంచ తెగుళ్ల దినోత్సవాన్ని ఏటా జూన్ 6 న జరుపుకుంటారు. దీనిని వరల్డ్ పెస్ట్ అవేర్‌నెస్ డే అని కూడా అంటారు. ఈ కార్యక్రమం పెస్ట్ మేనేజ్‌మెంట్ ఆవశ్యకత గురించి ప్రజలలో అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తారు. ఇది మొదటిసారి 2017 లో బీజింగులో నిర్వహించారు.
వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే | జూన్ 7
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవంను ఏటా జూన్ 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. ఆహార భద్రతపై అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి 2018లో ఈ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న జనాభాకు తగ్గట్లు ఆహార ఉత్పత్తి చేయడంతో పాటుగా వాటి దుబారాను తగ్గించేందుకు అలానే ఆహార శుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే | జూన్ 8
ప్రతి సంవత్సరం జూన్ 8వ తేదీని ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డేగా జరుపుకుంటారు. బ్రెయిన్ ట్యూమర్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. జర్మన్ బ్రెయిన్ ట్యూమర్ అసోసియేషన్ ఈ అంతర్జాతీయ స్మారక దినోత్సవాన్ని 2000 సంవత్సరంలో బ్రెయిన్ ట్యూమర్ రోగులకు మరియు వారి కుటుంబాలకు నివాళిగా ప్రారంభించింది.
వరల్డ్ ఓషన్స్ డే | జూన్ 8
ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం ఏటా జూన్ 8న నిర్వహిస్తారు. మానవ దైనందిన జీవితంలో మహాసముద్రాల పాత్ర యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
వరల్డ్ అక్రెడిటేషన్ డే | జూన్ 9
ఇంటర్నేషనల్ లాబొరేటరీ అక్రిడిటేషన్ కోఆపరేషన్ (ILAC) మరియు ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ ఫోరమ్ (IAF) సంయుక్త చొరవతో ప్రతి సంవత్సరం జూన్ 9వ తేదీన ప్రపంచ అక్రిడిటేషన్ డేని జరుపుకుంటారు. ప్రపంచ అక్రిడిటేషన్ డే అనేది ఆర్థిక వ్యవస్థలో అక్రిడిటేషన్ విలువను హైలైట్ చేయడానికి రూపొందించబడింది.
ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం | జూన్ 12
ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ప్రతి ఏటా జూన్ 12న నిర్వహించబడుతుంది. బాల కార్మిక వ్యవస్థను నిరోధించడానికి అంతర్జాతీయ కార్మిక సంస్థ దీనిని 2002లో ప్రారంభించింది. ఈ రోజున శ్రమ దోపిడీకి గురిఅయ్యే బాలకార్మికుల గురించి ప్రజలలో అవగాహనాకల్పిస్తారు.
అంతర్జాతీయ అల్బినిజం అవేర్‌నెస్ డే | జూన్ 13
అంతర్జాతీయ అల్బినిజం అవేర్‌నెస్ డేను ఏటా జూన్ 13వ తేదీన నిర్వహిస్తారు. అల్బినిజం ఉన్న వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వివక్షలను ఎదుర్కొంటున్నారు. ఈ అవగహన దినోత్సవం ద్వారా అల్బినిజం వ్యక్తుల యందు తప్పుడు నమ్మకాలు మరియు అపోహలను తొలగించడానికి ప్రయత్నిస్తారు. ఈ వేడుకకు చెందిన తీర్మానాన్ని డిసెంబర్ 18, 2014న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది.
అల్బినిజం అనేది జన్యుపరమైన వారసత్వ రుగ్మత. శరీరంలో మెలనిన్ అనే వర్ణద్రవ్యం లోపం వలన చర్మం, వెంట్రుకలు మరియు కళ్ళు వంటివి సహజ వర్ణాన్ని కోల్పోతాయి. మెలనిన్ ఉత్పత్తిని ప్రభావితం చేసే కొన్ని జన్యువుల ఉత్పరివర్తనాల వల్ల ఈ అరుదైన జన్యుపరమైన పరిస్థితి ఏర్పాటుడుతుంది.
ప్రపంచ రక్తదాతల దినోత్సవం | జూన్ 14
ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 14న జరుపుకుంటారు. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలను కాపాడటంపై అవగాహన కల్పించడం కోసం ఈ వేడుకను నిర్వహిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్ సంయుక్త చొరవతో 2005లో మొదటిసారిగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
గ్లోబల్ విండ్ డే | జూన్ 15
గ్లోబల్ విండ్ డే లేదా వరల్డ్ విండ్ డేను ఏటా జూన్ 15వ తేదీన నిర్వహిస్తారు. దీనిని పవన శక్తి యొక్క అవకాశాలను గుర్తించడానికి మరియు మానవాళి జీవితంలో దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేచేందుకు దీనిని నిర్వహిస్తారు. ఈ వేడుకను మొదటిసారిగా 2007లో యూరోపియన్ విండ్ ఎనర్జీ అసోసియేషన్ నిర్వహించింది.
ప్రపంచ సముద్ర తాబేలు దినోత్సవం | జూన్ 16
ప్రపంచ సముద్ర తాబేలు దినోత్సవాన్ని ఏటా జూన్ 16వ తేదీన జరుపుకుంటారు. ఈ వేడుకను సముద్ర తాబేళ్ల ప్రాముఖ్యతను గౌరవించడానికి మరియు ఆ జాతి సంరక్షణ ప్రాధాన్యతను తెలియజేయడానికి జరుపుకుంటురు. 2021 లెక్కల ప్రకారం ప్రపంచ సముద్ర తాబేళ్ల సంఖ్య దాదాపు 6.5 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఏటా మహాసముద్రాలలో 8 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ డంప్ అవుతుండటంతో వీటి మనుగడ ప్రశ్నర్ధకంగా మారుతుంది.
ఆటిస్టిక్ ప్రైడ్ డే | జూన్ 18
ఆటిస్టిక్ ప్రైడ్ డే అనేది ఆటిస్టిక్ వ్యక్తుల కోసం ప్రతి సంవత్సరం జూన్ 18న నిర్వహించబడే ఒక అంతర్జాతీయ వేడుక. ఇది ఆటిజం గురించి అవగాహన కల్పించడానికి మరియు వారి యందు సమాజంలో సానుకూల మార్పులను తీసుకురావడంలో భాగంగా దీనిని నిర్వహిస్తారు.
ఆటిజం లేదా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) అనేది నాడీ వ్యవస్థపై ప్రాభవం చూపే రుగ్మత. ఇది వ్యక్తుల కమ్యూనికేషన్ మరియు అసహజ ప్రవర్తన సమస్యలను సృష్టిస్తుంది. ద్దెని ద్వారా ఆయా వ్యక్తుల భావోద్వేగ, సామాజిక మరియు శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఒక రకమైన జన్యులోపం వలన పుట్టుకతోనే సంభవిస్తుంది.
నేషనల్ రీడింగ్ డే | జూన్ 19
ప్రతి సంవత్సరం, కేరళలో లైబ్రరీ మరియు అక్షరాస్యత ఉద్యమ పితామహుడిగా పరిగణించబడే పుతువాయిల్ నారాయణ పనికర్ గౌరవార్థం జూన్ 19 ని జాతీయ పఠన దినోత్సవంగా జరుపుకుంటారు. ఇది ప్రజలలో అక్షరాస్యత మరియు పఠన సంస్కృతిని ప్రోత్సహించడంలో భాగంగా నిర్వహిస్తారు.
ప్రపంచ శరణార్థుల దినోత్సవం | జూన్ 20
ప్రపంచ శరణార్థుల దినోత్సవం అనేది ఐక్యరాజ్యసమితిచే ప్రతి సంవత్సరం జూన్ 20న నిర్వహించబడే అంతర్జాతీయ దినోత్సవం. ఇది ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణ లేదా వేధింపులు, యుద్దాలు కారణంగా స్వదేశాన్ని విడిచిపెట్టవలసి వచ్చిన వ్యక్తులకు బలం, దైర్యం మరియు భరోసాను అందించేందుకు జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా 20 జూన్ 2001న ఐక్యరాజ్యసమితి ప్రారంభించింది.
ఇంటర్నేషనల్ యోగ డే | జూన్ 21
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏటా జూన్ 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. 2014లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం తరువాత 2015 నుండి ఏటా ఈ వేడుక నిర్వహిస్తున్నారు. ప్రజల శారీరక, మానసిక మరియు భావోద్వేగ స్థితిని పెంపొందించే యోగాను ప్రజల దైనందిక జీవిన విధానంలో భాగం చేయడమే లక్ష్యంగా ఈ వేడుకను జరుపుకుంటున్నారు. యోగా అనేది ప్రాచీన భారతదేశంలో ఉద్భవించిన శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక అభ్యాసం.
వరల్డ్ మ్యూజిక్ డే | జూన్ 21
ప్రపంచ సంగీత దినోత్సవం లేదా మేక్ మ్యూజిక్ డేను ఏటా జూన్ 21వ తేదీన జరుపుకుంటారు. ఈ వేడుకను సంగీతం యొక్క ఔనుత్యాన్ని తెలియజెప్పేందుకు మరియు ప్రపంచవ్యాప్తంగా సంగీతాన్ని కెరీరుగా ఎంపిక చేసుకున్న వర్ధమాన, యువ మరియు వృత్తిపరమైన సంగీతకారులను ఉత్సాహపర్చేందుకు జరుపుకుంటారు.
జూన్ 21న జరుపుకునే ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ఫెటే డి లా మ్యూజిక్ అని కూడా అంటారు. ఇది 1982 లో ఫ్రాన్స్ మంత్రి జాక్ లాంగ్ ప్రారంభించారు. అప్పటి నుండి, ఈ రోజును ప్రతి సంవత్సరం ప్రపంచ సంగీత దినోత్సవంగా జరుపుకుంటారు.
ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం | జూన్ 21
ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21 వ తేదీన నిర్వహిస్తారు. సముద్రాలు, తీర ప్రాంతాలు, సరస్సులు మరియు నదుల భౌతిక లక్షణాల అధ్యయనాన్ని హైడ్రోగ్రాఫీ అంటారు. ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం హైడ్రోగ్రఫీ యొక్క ప్రాముఖ్యత మరియు ఆ శాస్త్రంపై అవగాహన పెంచడానికి రూపొందించబడింది. దీనిని మొదటిసారిగా 2005 లో ప్రారంభించారు.
వరల్డ్ రెయిన్‌ఫారెస్ట్ డే | జూన్ 22
ప్రపంచ రెయిన్‌ఫారెస్ట్ డే ఏటా జూన్ 22వ తేదీన జరుపుకుంటారు. రెయిన్‌ఫారెస్ట్‌లు జీవరాశికి ఏవిధంగా సహాపడుతున్నాయో అవగాహనా కల్పించేందుకు ఈ వేడుకను నిర్వహిస్తారు. ఈ వేడుక రెయిన్‌ఫారెస్ట్ పార్టనర్‌షిప్ ద్వారా 2017లో స్థాపించబడింది. భూమి యొక్క అత్యంత విలువైన వనరులలో ఒకటైన వర్షారణ్యాల సంరక్షణే ప్రధాన ధేయంగా ఈ కార్యక్రమం జరుపుకుంటారు.
యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే | జూన్ 23
ఐక్యరాజ్యసమితి పబ్లిక్ సర్వీస్ డేని ప్రతి సంవత్సరం జూన్ 23వ తేదీన జరుపుకుంటారు. యూఎన్ పబ్లిక్ సర్వీస్ డేని 2003 యొక్క ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ యొక్క తీర్మానం ద్వారా ప్రారంభించారు. ఈ వేడుకను ప్రజలలో సమాజ సేవ యొక్క విలువ మరియు దాని అవసరాన్ని తెలియజెప్పేందుకు నిర్వహిస్తారు. అలానే పబ్లిక్ సర్వెంట్ల పనిని గుర్తిస్తూ, ప్రభుత్వ రంగంలో పనిచేసేందుకు ప్రజలలో ఉత్సుకత కల్పిస్తారు.
అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం | జూన్ 23
ఏటా జూన్ 23వ తేదీని అంతర్జాతీయ వితంతువుల దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంను 2011 లో ప్రారంభించింది. అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం అనేది "అనేక దేశాలలో లక్షలాది మంది వితంతువులు, వారిపై ఆధారపడిన వారు, అలానే వారు ఎదుర్కొంటున్న పేదరికం, అన్యాయాన్ని పరిష్కరించేందుకు మరియు భరోసా కల్పించేందుకు రూపొందించబడ్డ కార్యక్రమం. దీని మొదటిగా 2005 లో లూంబా ఫౌండేషన్ ప్రారంభించింది.
అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం | జూన్ 23
అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం లేదా ప్రపంచ ఒలింపిక్ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 23 వ తేదీన జరుపుకుంటారు. ఈ రోజున జాతీయ ఒలింపిక్ కమిటీలు ప్రపంచవ్యాప్తంగా క్రీడలు, సాంస్కృతిక మరియు విద్యా కార్యకలాపాలను నిర్వహిస్తాయి. ఇది జూన్ 23, 1894 లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) స్థాపనకు గుర్తుగా జరుపుకుంటారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని లాసాన్ నగరంలో ఉంది.
ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది సీఫేరర్ | జూన్ 25
అంతర్జాతీయ వాణిజ్యం మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నావికులు చేసే అమూల్యమైన సహకారాన్ని గుర్తిస్తూ, ప్రతి సంవత్సరం జూన్ 25వ తేదీన "నావికుల దినోత్సవం" జరుపుకుంటారు. 2010లో ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ (IMO) జూన్ 25ని అంతర్జాతీయ సముద్రయాన దినోత్సవంగా నిర్ణయించింది. రోజువారీ జీవితంలో మనం ఉపయోగించే దాదాపు ప్రతిదీ సముద్ర రవాణా ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రజలకు చేర్చే నావికుల గౌరవార్థం ఈ వేడుకను జరుపుకుంటారు.
వరల్డ్ ఎమ్ఎస్ఎమ్ఈ డే | జూన్ 27
సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల దినోత్సవంను ఏటా జూన్ 27వ తేదీన నిర్వహిస్తారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఏప్రిల్ 2017లో జూన్ 27ని ప్రపంచ MSME దినోత్సవంగా ప్రకటించింది. భారతదేశంలో వ్యవసాయం తర్వాత MSMEలు రెండవ అతిపెద్ద ఉపాధిని కల్పించే రంగంగా వర్థిల్లుతున్నాయి. వీటి గౌరవార్థం ఈ వేడుకను నిర్వహిస్తారు.
నేషనల్ స్టాటిస్టిక్స్ డే | జూన్ 29
భారతదేశంలో ప్రతి సంవత్సరం జూన్ 29న జాతీయ గణాంకాల దినోత్సవం జరుపుకుంటారు. దివంగత ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహలనోబిస్ జయంతి జ్ఞాపకార్థం జూన్ 29ని జాతీయ గణాంకాల దినోత్సవంగా భారత ప్రభుత్వం నియమించింది.
ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్ డే | జూన్ 30
ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్ డేను ఏటా జూన్ 30వ తేదీన జరుపుకుంటారు. ఆస్టరాయిడ్ డే అనేది వార్షిక గ్లోబల్ ఈవెంట్, ఇది 1908లో తుంగుస్కా సంఘటన వార్షికోత్సవం సందర్భంగా జూన్ 30న నిర్వహించబడుతుంది. 1908 లో రష్యాలోని సైబీరియాలో ఒక ఉల్కాపాతం 2,150 కిమీ² అటవీప్రాంతాన్ని బూడిద చేసింది. ఉల్క ప్రభావ ప్రమాదం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం మరియు సంక్షోభ కమ్యూనికేషన్ చర్యల గురించి ప్రజలకు తెలియజేయడం లక్ష్యంగా ఈ అవగాహనా దినోత్సవాన్ని నిర్వహిస్తారు.