తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 09 మార్చి 2024
March Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 09 మార్చి 2024

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 09 మార్చి 2024. పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం.

రికెన్ యమమోటోకు 2024 ప్రిట్జ్‌కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్‌

ప్రముఖ జపనీస్ ఆర్కిటెక్ట్ రికెన్ యమమోటో 2024 ఏడాదికి గాను ప్రిట్జ్‌కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్‌ గెలుచుకున్నారు. ప్రిట్జ్‌కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్‌ ఆర్కిటెక్చర్‌ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుగా పరిగణించబడుతుంది. రికెన్ యమమోటో ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న 9వ జపనీస్ ఆర్కిటెక్ట్‌గా నిలిచాడు. ఈ అవార్డు యోకోసుకా మ్యూజియం ఆఫ్ ఆర్ట్ నిర్మాణం కోసం ఆయన అందుకున్నారు.

  • యమమోటో 1945లో చైనాలోని బీజింగ్‌లో జపాన్ తల్లిదండ్రులకు జన్మించారు.
  • 1967లో నిహాన్ విశ్వవిద్యాలయం నుండి తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసారు.
  • 1971లో టోక్యో యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ నుండి మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు.
  • 2000 నుండి 2011 వరకు యోకోహామా నేషనల్ యూనివర్శిటీలో మరియు నిహాన్ విశ్వవిద్యాలయం యొక్క గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారు.
  • 2008లో 25వ ఫుకుషిమా ఆర్కిటెక్చర్ కల్చర్ అవార్డు అందుకున్నారు.
  • 2010లో యోకోసుకా మ్యూజియం ఆఫ్ ఆర్ట్ కోసం జపాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ అవార్డు అందుకున్నారు.
  • 2013లో ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్కిటెక్చర్ ద్వారా అకాడెమీషియన్‌గా నియమించబడ్డారు.

ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ అనేది ఆర్కిటెక్చర్ రంగంలో అత్యంత ముఖ్యమైన అవార్డుగా పరిగణించబడుతుంది. దీనిని 1979లో అమెరికన్ వ్యవస్థాపకుడు జే ఆర్థర్ ప్రిట్జ్‌కర్ మరియు అతని భార్య సిండి స్థాపించారు.  ఈ అవార్డుకు ప్రిట్జ్‌కర్ కుటుంబం నిధులు సమకూరుస్తుంది, హయత్ ఫౌండేషన్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.

ఇది ప్రపంచంలోని ప్రముఖ నిర్మాణ పురస్కారాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీనిని తరచుగా ఆర్కిటెక్చర్ నోబెల్ బహుమతి అని పిలుస్తారు. ఈ అవార్డు గ్రహీతకు $100,000 యూఎస్ డాలర్ల ప్రైజ్ మనీ, సైటేషన్ సర్టిఫికేట్ మరియు ఒక కాంస్య పథకం అందిస్తారు.

తొలి నేషనల్ క్రియేటర్స్ అవార్డులను అందజేసిన ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోదీ తొలి నేషనల్ క్రియేటర్స్ అవార్డులను విజేతలకు  అందజేశారు. ఈ అవార్డుల వేడుక న్యూఢిల్లీలోని భారత్ మండపంలో మార్చి 8న నిర్వహించబడింది. వివిధ రంగాలలోని కంటెంట్ సృష్టికర్తల ప్రతిభను మరియు వారి ప్రభావాన్ని ఈ అవార్డులు గుర్తిస్తాయి.

తొలి నేషనల్ క్రియేటర్స్ అవార్డుల కోసం ప్రభుత్వం దరఖాస్తు కోరగా 20 విభిన్న కేటగిరీలలో 1.5 లక్షలకు పైగా నామినేషన్లు వచ్చాయి. వీరిలో పబ్లిక్ వోటింగ్ ఆధారంగా ముగ్గురు అంతర్జాతీయ సృష్టికర్తలతో సహా 23 మంది విజేతలను నిర్ణయించారు. ఉత్తమ కథకుడి అవార్డుతో సహా ఇరవై విభాగాలలో ఈ అవార్డు అందించబడింది.

  • బెస్ట్ ఇంటర్నేషనల్ క్రియేటర్ అవార్డు : కిరీ పాల్ (టాంజానియా), డ్రూ హిక్స్ (అమెరికా), కాసాండ్రా మే స్పిట్‌మన్ (జర్మనీ)
  • న్యూ ఇండియా ఛాంపియన్ అవార్డు : అభి మరియు న్యూ
  • ఉత్తమ కథకురాలి అవార్డు : కీర్తికా గోవిందసామి
  • డిస్ట్రప్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు : రణవీర్ అల్లాబాడియా
  • గ్రీన్ ఛాంపియన్ అవార్డు : పంక్తి పాండే  (మిషన్ లైఫ్ సందేశం కోసం)
  • ఉత్తమ సృజనాత్మక అవార్డు :  జయ కిషోరి (సామాజిక మార్పు కోసం)
  • అత్యంత ప్రభావవంతమైన అగ్రి సృష్టికర్త : లక్ష్య దాబాస్
  • కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు : మైథిలీ ఠాకూర్‌
  • ఉత్తమ ప్రయాణ సృష్టికర్త అవార్డు : కమియా జానీ (కర్లీ టేల్స్‌)
  • టెక్ క్రియేటర్ అవార్డు : గౌరవ్ చౌదరి (టెక్నికల్ గురూజీ)
  • స్వచ్ఛతా అంబాసిడర్ అవార్డు : మల్హర్ కలాంబే (క్లిన్ అప్ డ్రైవ్‌ల కోసం)
  • హెరిటేజ్ ఫ్యాషన్ ఐకాన్ అవార్డు : జాన్వీ సింగ్‌
  • బెస్ట్ క్రియేటివ్ క్రియేటర్- ఫిమేల్ అవార్డు : శ్రద్ధా
  • బెస్ట్ క్రియేటివ్ క్రియేటర్- మేల్ : ఆర్జే రౌనక్
  • ఫుడ్ కేటగిరీలో ఉత్తమ సృష్టికర్త అవార్డును కబితాస్ కిచెన్ గెలుచుకుంది.
  • విద్యా విభాగంలో ఉత్తమ సృష్టికర్త అవార్డును నమన్ దేశ్‌ముఖ్ అందుకున్నారు.
  • ఉత్తమ ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్ సృష్టికర్త అవార్డును అంకిత్ బైయన్‌పురియా అందించారు.
  • గేమింగ్ క్రియేటర్ అవార్డును నిశ్చయ్‌ (ట్రిగ్గర్డ్ ఇన్సాన్) అందుకున్నారు.
  • ఉత్తమ మైక్రో క్రియేటర్‌ అవార్డును అరిడామన్‌ అందుకున్నారు.
  • ఉత్తరాఖండ్‌కు చెందిన పియూష్ పురోహిత్‌ ఉత్తమ నానో సృష్టికర్త అవార్డు అందుకున్నారు.
  • బోట్ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ అయిన అమన్ గుప్తాకు బెస్ట్ సెలబ్రిటీ క్రియేటర్ అవార్డు లభించింది.

నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ యొక్క ఈ మొదటి ఎడిషన్ భారతదేశంలో కంటెంట్ సృష్టికర్తల యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను మరియు వారు సమాజంపై చూపే ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది.

డిజిటల్ ఎడ్యుకేషన్ సహకారం కోసం కాన్వా & సీబీఎస్ఈ మధ్య ఒప్పందం

భారతదేశంలో డిజిటల్ విద్యను శక్తివంతం చేయడానికి ప్రముఖ డిజైనింగ్ ప్లాటుఫారమ్ కాన్వా మరియు సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) చేతులు కలిపాయి. ఈ ఒప్పందం ఈ భాగస్వామ్యం దేశంలో డిజిటల్ సృజనాత్మకత అంతరాన్ని తగ్గించడంతో పాటుగా ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులలో డిజిటల్ సృజనాత్మకత నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యం పెట్టుకుంది.

  • కాన్వా ప్లాట్‌ఫారమ్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోవడంపై అధ్యాపకులకు శిక్షణ ఇవ్వడానికి ప్రోగ్రామ్ ప్రాధాన్యతనిస్తుంది.
  • ఈ శిక్షణా శ్రేణి యొక్క మొదటి దశలో దాదాపు 30,000 మంది ఉపాధ్యాయులు వినూత్న బోధనా పద్ధతుల గురించి శిక్షణ పొందుతారు.
  • తమ డిజిటల్ స్టోరీ టెల్లింగ్ సామర్థ్యాలను నిరంతరం మెరుగుపరచుకోవడానికి 'కాన్వా ఫర్ టీచర్స్' కమ్యూనిటీలో భాగం అవుతారు.

ఈ ఒప్పందం దేశంలోని సీబీఎస్ఈ పాఠశాలల్లోని 840,000 మంది అధ్యాపకులు మరియు 25 మిలియన్ల కంటే ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. కాన్వా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులను వారి తరగతి గదులలో విజువల్ కమ్యూనికేషన్‌ను ఏకీకృతం చేయడంలో శక్తివంతం చేస్తుంది.

కాన్వా ఫర్ ఎడ్యుకేషన్ అనేది ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు సిబ్బందికి ఒకే విధంగా అభ్యాస అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడిన ఒక డిజిటల్ ప్లాట్‌ఫారమ్. ఇది 70,000 కంటే ఎక్కువ విద్యా టెంప్లేట్‌లను కలిగి ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్ అధ్యాపకులకు వారి పాఠాలు, ప్రెజెంటేషన్‌లు మరియు పాఠశాల మెటీరియల్‌ కంటెంట్‌ను సృష్టించడాన్ని సులభతరం చేస్తుంది.

కేరళ పాఠశాలలో ఐరిస్ అనే హ్యూమనాయిడ్ టీచర్‌ ఆవిష్కరణ

కేరళలోని ఒక పాఠశాల మేకర్‌ల్యాబ్స్ సహకారంతో అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి ఎఐ టీచర్ రోబోట్ అయిన 'ఐరిస్'ని ఆవిష్కరించింది. ఈ ఆవిష్కరణ విద్యారంగంలో కృత్రిమ మేధస్సును సమగ్రపరచడానికి ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. తిరువనంతపురంలోని కేటీసిటీ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో విద్యార్థుల అభ్యాస అనుభవాలను మెరుగుపరచడానికి దీనిని రూపొందించారు.

నీతి ఆయోగ్-ప్రారంభించిన అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన ఈ హ్యూమనాయిడ్ రోబోట్ టీచర్‌, సాంప్రదాయ బోధనా పద్ధతులను విప్లవాత్మకంగా మార్చే అనేక లక్షణాలను కలిగి ఉంది. ఐరిస్ మూడు భాషలు మాట్లాడే సామర్థ్యంతో పాటుగా క్లిష్టమైన ప్రశ్నలను పరిష్కరించగల సామర్థ్యంతో, రోబోట్ ప్రతి విద్యార్థికి వ్యక్తిగతీకరించిన అభ్యాస ప్రయాణాన్ని అందిస్తుంది.

ఐరిస్ ఇతర ఫీచర్లలో వాయిస్ అసిస్టెన్స్, ఇంటరాక్టివ్ లెర్నింగ్ మాడ్యూల్స్, మానిప్యులేషన్ సామర్థ్యాలు మరియు మొబిలిటీ వంటివి ఉన్నాయి. అటల్ టింకరింగ్ ల్యాబ్‌ను స్థాపించడానికి ఈ ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ పాఠశాలకు కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల గ్రాంట్‌ను అందించింది.

  • భారతదేశంలో మొట్టమొదటి జెనరేటివ్ ఎఐ టీచర్ రోబోట్ పేరు ఐరిస్
  • దీనిని మేకర్‌ల్యాబ్స్ సహకారంతో అభివృద్ధి చేశారు.
  • నీతి ఆయోగ్-ప్రారంభించిన అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్ట్‌లో భాగంగా రూపొందించారు.
  • ఇది తిరువనంతపురంలోని కేటీసిటీ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో విద్యార్థుల అభ్యాస అనుభవాలను మెరుగుపరచడానికి దీనిని రూపొందించారు.
  • ఈ రోబోట్ టీచర్ ప్రతి విద్యార్థికి వ్యక్తిగతీకరించిన అభ్యాస ప్రయాణాన్ని అందిస్తుంది.

మరైస్ ఎరాస్మస్ అంతర్జాతీయ అంపైరింగ్ నుండి రిటైర్మెంట్

వెటరన్ దక్షిణాఫ్రికా అంపైర్ మరైస్ ఎరాస్మస్ తన విశిష్ట అంతర్జాతీయ అంపైరింగ్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. మార్చి 8న క్రైస్ట్‌చర్చ్‌లో ప్రారంభమైన న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా రెండో టెస్టు తన కెరీర్‌లో చివరి మ్యాచ్‌గా ఆయన ప్రకటించారు. ఈ టెస్ట్ అంపైరింగ్ బాధ్యతలు అనంతరం ఐసీసీ ఎలైట్ ప్యానల్ ఆఫ్ అంపైర్ల నుండి రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు వెల్లారించారు.

  • ఎరాస్మస్ బోలాండ్ క్రికెట్ జట్టు తరపున 1988 నుండి 1997 మధ్య ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.
  • ఎరాస్మస్ 2006లో దక్షిణాఫ్రికా మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా తన అంతర్జాతీయ అంపైరింగ్ ప్రారంభించారు.
  • ఎరాస్మస్ అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో కూడా అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.
  • ఎరాస్మస్ దాదాపు 18 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.
  • 2019 పురుషుల ప్రపంచ కప్ ఫైనల్‌తో సహా ఏడు గ్లోబల్ ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్‌కు అధికారిక అంపైరుగా వ్యవహరించారు.
  • ఎరాస్మస్ మూడుసార్లు ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్ (డేవిడ్ షెపర్డ్ ట్రోఫీ) అందుకున్నారు.

ఎరాస్మస్ యొక్క అంకితభావం మరియు నైపుణ్యం అతనికి ఆటగాళ్లు మరియు అభిమానుల గౌరవాన్ని సంపాదించిపెట్టాయి. ఎరాస్మస్ క్రికెట్ అంపైరింగ్‌లో నిజమైన లెజెండ్‌గా పరిగణించబడ్డారు. అతను అంతర్జాతీయ మ్యాచ్‌ల నుండి రిటైర్ అయినప్పటికీ, అతను మెంటర్‌షిప్ పాత్రల ద్వారా క్రికెట్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

గోవా అసెంబ్లీలో ఎస్టీల రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

గోవా అసెంబ్లీ నియోజకవర్గాల్లో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య పునర్వ్యవస్థీకరణను ప్రవేశపెట్టడానికి చట్టం & న్యాయ మంత్రిత్వ శాఖ యొక్క ప్రతిపాదనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు గోవా శాసనసభలో షెడ్యూల్డ్ తెగల కోసం రిజర్వు స్థానాలను ఏర్పాటు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం గోవా అసెంబ్లీలో ఎస్టీలకు ప్రత్యేకంగా సీట్లు ఏవీ లేవు.

ఈ బిల్లు గోవా శాసనసభలోని నియోజకవర్గాల పునర్విభజన ద్వారా గోవా శాసనసభలో షెడ్యూల్డ్ తెగలకు సరైన ప్రాతినిధ్యం కల్పించడం కోసం పార్లమెంటరీ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ఆర్డర్, 2008లో అవసరమైన సవరణలు చేయడానికి ఎన్నికల కమిషన్‌కు అధికారం ఇస్తుంది.

ఇది ఎన్నికల సంఘం షెడ్యూల్డ్ తెగల యొక్క సవరించిన జనాభా గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటుంది. రాజ్యాంగంలోని 170 మరియు 332 ఆర్టికల్స్ మరియు డిలిమిటేషన్ చట్టం, 2002లోని సెక్షన్ 8 యొక్క నిబంధనలకు సంబంధించి శాసనసభ నియోజకవర్గాన్ని తిరిగి సర్దుబాటు చేస్తుంది.

లెజిస్లేటివ్ అసెంబ్లీ నియోజకవర్గాల పునరుద్ధరణ ప్రయోజనం కోసం, భారత ఎన్నికల సంఘం దాని స్వంత విధానాన్ని నిర్ణయిస్తుంది. ఇది సివిల్ కోర్టు యొక్క నిర్దిష్ట అధికారాలను కలిగి ఉంటుంది. డీలిమిటేషన్ ఆర్డర్ మరియు దాని ఆపరేషన్ తేదీలలో చేసిన సవరణలను గెజిట్‌లో ప్రచురించడానికి ఇది భారత ఎన్నికల కమిషన్‌కు అధికారం ఇస్తుంది. సవరించిన డీలిమిటేషన్ ఆర్డర్ రద్దు చేసే వరకు ప్రస్తుత శాసనసభ రాజ్యాంగాన్ని ప్రభావితం చేయదు.

  • ఈ బిల్లు గోవా రాష్ట్రంలోని షెడ్యూల్డ్ తెగల రాజ్యాంగ హక్కులు పరిరక్షించబడుతున్నాయని నిర్ధారించడానికి, పార్లమెంటరీ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఆర్డర్ 2008ను సవరిస్తుంది.
  • అలానే షెడ్యూల్డ్ తెగల కోసం గోవా రాష్ట్ర శాసనసభలో సీట్లను కూడా పెంచుతుంది.
  • అలానే జనాభా గణన 2001 ప్రచురించిన తర్వాత షెడ్యూల్డ్ తెగలుగా ప్రకటించబడిన తెగలను లెక్కించడానికి సెన్సస్ కమిషనర్‌కు అధికారం ఇస్తుంది.
  • ఈ సెన్సస్ పూర్తయిన తర్వాత రాజ్యాంగంలోని ఆర్టికల్ 332 అనుసారం షెడ్యూల్డ్ తెగలకు చట్టసభలో ప్రాతినిధ్యం కల్పిస్తుంది.
  • ఈ ప్రతిపాదిత బిల్లు పేర్కొన్న డీలిమిటేషన్ ఆర్డర్‌లోని లోపాలను సరిదిద్దడానికి ఎన్నికల కమిషన్‌కు అధికారం ఇస్తుంది.

ఉన్నతి 2024 పథకంకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఉత్తర్ పూర్వ ట్రాన్సఫార్మేటివ్ ఇండస్ట్రీలైజషన్ స్కీమ్ (ఉన్నతి)కు మార్చి 7న ఆమోదం తెలిపింది. ఈ పథకం భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో పారిశ్రామిక వృద్ధిని మరియు ఉద్యోగ కల్పనను పెంపొందించడానికి ఉద్దేశించిన ఒక ప్రధాన కార్యక్రమం.

  • ఉత్త‌ర్ పూర్వ రూపాంతర పారిశ్రామికీకరణ పథకం వచ్చే పదేళ్ల కాలానికి అమలు చేయబడుతుంది.
  • ఈ పథకం వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో అమలు చేయబడుతుంది.
  • ఈ పథకం అమలు కోసం వచ్చే 10 ఏళ్ళ కాలానికి 10,037 కోట్ల ప్రతిపాదిత బడ్జెట్‌ను ఆమోదించింది.
  • కొత్త పరిశ్రమలు స్థాపించడానికి లేదా ఇప్పటికే ఉన్న పరిశ్రమల గణనీయమైన విస్తరణను చేపట్టడానికి ఈ పథకం ప్రోత్సాహకాలు అందిస్తుంది.
  • ఇది పూర్తిస్థాయి సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అవుతుంది.
  • ఈ పథకాన్ని రెండు భాగాలుగా విభజించాలని ప్రతిపాదించారు.
  • పార్ట్ A కింద అర్హత ఉన్న యూనిట్లకు రూ. 9737 కోట్లు ప్రోత్సాహకాలను అందిస్తుంది.
  • అలానే పార్ట్ B కింద ఉన్న యూనిట్లకు రూ. 300 కోట్లు కేటాయించింది.
  • వచ్చే పదేళ్ల వ్యవధిలో ఈ పథకం ద్వారా దాదాపు 83,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది.

ఉన్నతి పథకం ద్వారా ఈశాన్య ప్రాంతంలోని రాష్ట్రాల్లో పరిశ్రమల అభివృద్ధి మరియు లాభదాయకమైన ఉపాధిని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ఈ ప్రాంతం యొక్క మొత్తం సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళిక చేస్తుంది. ఈ చొరవ కొత్త పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈ ప్రాంతంలో తయారీ మరియు సేవా రంగాలలో ఉత్పాదక ఆర్థిక కార్యకలాపాలను సృష్టిస్తుంది.

Post Comment