Advertisement
Daily Current affairs in Telugu : 14 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్
Telugu Current Affairs

Daily Current affairs in Telugu : 14 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్

Daily Current affairs in Telugu 14 December 2023. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో లియాండర్ పేస్ & అమృతరాజ్

భారత మాజీ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ మరియు విజయ్ అమృతరాజ్‌లు ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌కు ఎన్నికయిన మొదటి ఆసియా క్రీడాకారులుగా నిలవనున్నారు. టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ యొక్క వార్షిక అభిమానుల ఓటింగులో వీరు అగ్రస్థానంలో ఉండటంతో ఈ జాబితాలోకి ప్రవేశించడానికి విజేతగా నామినేషన్ పొందారు. వీరు వచ్చే ఏడాది జూలై 20న యూఎస్ఎలో ఈ వేడుకలో అధికారికంగా అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించనున్నారు. దీనితో టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ప్రాతినిధ్యం వహించే 28వ దేశంగా భారతదేశం అవతరిస్తుంది.

లియాండర్ పేస్ హాల్ ఆఫ్ ఫేమ్ యొక్క వార్షిక అభిమానుల ఓటులో ప్లేయర్ విభాగంలో ప్రవేశించడానికి విజేతగా నామినేషన్ పొందగా, విజయ్ అమృతరాజ్ కంట్రిబ్యూటర్ కేటగిరీలోకి చేర్చబడ్డారు. అంతర్జాతీయ టెన్నిస్ సంబంధించి అత్యుత్తమ సేవలు అందించిన కీడాకారులకు ఈ గౌరవం అందిస్తారు.

లియాండర్ పేస్ 1996 అట్లాంటా గేమ్స్‌లో భారతదేశం యొక్క ఏకైక ఒలింపిక్ పతకాన్ని(కాంస్యం) అందించిన పురుష క్రీడాకారునిగా చరిత్ర సృష్టించాడు. ఆయన భారత్  తరుపున వరుసగా రికార్డు స్థాయిలో ఏడు సార్లు ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్నాడు. లియాండర్ పేస్ 1999లో ప్రపంచ నంబర్ 1 డబుల్స్ ప్లేయరుగా అవతరించాడు. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో దాదాపు 462 వారాలు పేస్ తన ర్యాంకును నిలబెట్టుకున్నాడు. పేస్‌కు పురుషుల డబుల్స్‌లో ఎనిమిది గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు మరియు మిక్స్‌డ్ డబుల్స్‌లో 10 టైటిల్స్ సాధించాడు.

విజయ్ అమృతరాజ్ అంతర్జాతీయ టెన్నిస్ రంగానికి వివిధ హోదాల్లో సహకారం అందించారు. 1970లు మరియు 80లలో భారత టెన్నిస్‌కు ఆయన విశేష సేవలు అందించారు. 2001లో ఐక్యరాజ్యసమితి శాంతి దూతగా పనిచేసిన మొదటి భారతీయుడు అమృతరాజ్ నిలిచారు. 2006 నుండి ఆయన యొక్క విజయ్ అమృతరాజ్ ఫౌండేషన్ ద్వారా మహిళలు మరియు పిల్లలకు విద్యా, క్రీడా రంగాలలో సేవలు సహకారం అందిస్తున్నారు.

నౌకాదళంలోకి ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ తార్ముగ్లీ

తూర్పు నౌకాదళ కమాండ్ ఆధ్వర్యంలో విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డ్‌ నుండి ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ అయిన ఐఎన్ఎస్ తార్ముగ్లీ భారత నావికాదళంకు అందించబడింది. డిసెంబర్ 14న జరిగిన ఈ వేడుకకు మెటీరియల్ చీఫ్ వైస్ అడ్మిరల్ సందీప్ నైతానీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఐఎన్ఎస్ తార్ముగ్లీ ఇప్పటి వరకు మూడు పేర్లతో రెండు దేశాల నౌకాదళాలలో సేవలు అందించింది. ఇది మొదట ఇండియన్ నేవీలో ట్రింకాట్ క్లాస్ షిప్ అయిన ఐఎన్ఎస్ తిల్లాన్‌చాంగ్‌గా కమీషన్ చేయబడింది. దీనిని 2006 లో దౌత్యపరమైన విస్తరణలో భాగంగా మాల్దీవుల జాతీయ రక్షణ దళానికి బహుమతిగా అందించారు. వారు దీనిని ఎంసీజిఎస్ హురావీ పేరుతొ 2023 వరకు ఉపయోగించారు. అయితే ఈ ఏడాది మొదటిలో ఇది తిరిగి ఇండియాకు బదిలీ చేయబడింది.

ఈ నౌక గత ఆరు నెలలుగా విశాఖపట్నంలోని నేవల్ డాక్‌యార్డ్‌లో భారత నావికాదళం ద్వారా విస్తృతమైన మరమ్మతులు మరియు అప్‌గ్రేడేషన్‌లకు గురైంది. 2023 డిసెంబర్ 14న విశాఖపట్నంలో ‘ఐఎన్ఎస్ తార్ముగ్లి’గా తిరిగి ప్రారంభించబడింది. ఐఎన్ఎస్ తార్ముగ్లీకి సీడీఆర్ సత్పాల్ సింగ్ సాంగ్వాన్ నాయకత్వం వహిస్తున్నారు. ఇది నావల్ ఆఫీసర్-ఇన్-ఛార్జ్ (ఆంధ్రప్రదేశ్) కింద పనిచేస్తుంది. దీనికి అండమాన్ లోని ఒక ద్వీపం పేరు పెట్టబడింది. ఇది భారతదేశ తూర్పు తీరం వెంబడి ఉన్న కేజీ బేసిన్ ప్రాంతంలో తీరప్రాంత నిఘా నౌకగా సేవలు అందించనుంది.

నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2023 నామినేషన్లు

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టిలు జాతీయ క్రీడా అవార్డులు 2023లో ప్రతిష్టాత్మకమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నకు ఎంపికయ్యారు. ఖేల్ రత్న భారత ప్రభుత్వం అందించే అత్యున్నత క్రీడా గౌరవం. ఇప్పటి వరకు ఐదుగురు బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఈ అవార్డు అందుకున్నారు. వారిలో పుల్లెల గోపీచంద్ (2001), సైనా నెహ్వాల్ (2010), పివి సింధు (2016), ప్రమోద్ భగత్ (2021) మరియు కృష్ణ నగర్ (2021) ఉన్నారు.

చిరాగ్ శెట్టి మరియు సాత్విక్‌సాయిరాజ్ ఈ ఏడాది మూడు బీడబ్ల్యుఎఫ్ టైటిళ్లను గెలుచుకున్నారు. వీటిలో స్విస్ ఓపెన్, ఇండోనేషియా ఓపెన్ మరియు కొరియా ఓపెన్ ఉన్నాయి. వీటిలో పాటుగా ఈ ఏడాది అక్టోబర్‌లో హాంగ్‌జౌలో జరిగిన ఆసియా గేమ్స్‌లో బ్యాడ్మింటన్‌లో భారతదేశానికి మొదటి బంగారు పతకాన్ని అందించారు, ఈ ఏడాది ఏప్రిల్‌లో బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్‌లను కైవసం చేసుకోవడం ద్వారా చరిత్ర సృష్టించారు. దీనితో పాటుగా ఈ అక్టోబర్‌లో బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని సాధించిన మొదటి భారతీయ డబుల్స్ జోడీగా చరిత్రలో నిలిచారు.

వీరితో పాటుగా క్రికెటర్ మహ్మద్ షమీ, ఆర్చర్ అదితి స్వామి, స్టీపుల్‌ఛేజర్ పారుల్ చౌదరి, షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ మరియు రెజ్లర్ యాంటిమ్ పంఘల్ మొదలైన వారు అర్జున అవార్డు కోసం సిఫార్సు చేయబడ్డారు. అలానే యువ భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానానంద యొక్క కోచ్ ఆర్బీ రమేష్ ప్రతిష్టాత్మకమైన ద్రోణాచార్య అవార్డుకి ఎంపికయ్యారు. ఈ ఏడాది జాతీయ క్రీడా అవార్డులకు ఎంపిక అయినా క్రీడాకారుల నామినేషన్ జాబితా కింద ఇవ్వడం జరిగింది.

  • మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు: సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి (బ్యాడ్మింటన్)
  • అర్జున అవార్డు: మహ్మద్ షమీ (క్రికెట్), అజయ్ రెడ్డి (అంధుల క్రికెట్) ఓజాస్ ప్రవీణ్ డియోటాలే (విలుకాడు), అదితి గోపీచంద్ స్వామి (విలుకాడు), శీతల్ దేవి (పారా ఆర్చరీ), పారుల్ చౌదరి మరియు ఎం శ్రీశంకర్ (అథ్లెటిక్స్), మహ్మద్ హుసాముద్దీన్ (బాక్సింగ్), ఆర్ వైశాలి (చెస్), దివ్యకృతి సింగ్ మరియు అనుష్ అగర్వాలా (ఈక్వెస్ట్రియన్), దీక్షా దాగర్ (గోల్ఫ్), క్రిషన్ బహదూర్ పాఠక్ (హాకీ), ​​సుశీల చాను (హాకీ), ​​పింకీ (లాన్ బాల్), ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (షూటింగ్), ఆంటిమ్ పంఘల్ (రెజ్లింగ్), ఐహికా ముఖర్జీ (టేబుల్ టెన్నిస్).
  • ద్రోణాచార్య అవార్డు : గణేష్ ప్రభాకరన్ (మల్లాఖాంబ్), మహావీర్ సైనీ (పారా అథ్లెటిక్స్), లలిత్ కుమార్ (రెజ్లింగ్), RB రమేష్ (చెస్), శివేంద్ర సింగ్ (హాకీ).
  • ధ్యన్ చంద్ లైఫ్‌టైమ్ అవార్డు : కవిత (కబడ్డీ), మంజుషా కన్వర్ (బ్యాడ్మింటన్) వినీత్ కుమార్ శర్మ (హాకీ).

భారతదేశ అత్యుత్తమ నగరాల జాబితాలో హైదరాబాద్

గ్లోబల్ కన్సల్టెంట్ అయిన మెర్సర్ విడుదల చేసిన 2023 జీవన నాణ్యత (క్వాలిటీ ఆఫ్ లివింగ్ సిటీ) ర్యాంకింగ్‌లో భారతదేశం నుండి హైదరాబాదు అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఉన్న భారతీయ నగరాల జాబితాలో హైదరాబాద్‌ 153వ స్థానంలో నిలవగా, పూణె (154), బెంగళూరు (156), చెన్నై (161), ముంబై (164), కోల్‌కతా (170), మరియు న్యూఢిల్లీ (172) ఉన్నాయి.

ఈ సంవత్సరం అత్యంత నాణ్యమైన జీవనాన్ని అందించే టాప్ 10 నగరాలలో పశ్చిమ ఐరోపా నుండి 7 నగరాలు, పసిఫిక్ నుండి 2 మరియు ఉత్తర అమెరికా నుండి ఒక నగరం ఉన్నాయి. ఈ జాబితాలో వియన్నా (ఆస్ట్రియా) ర్యాంకింగ్‌లో అగ్రస్థానం దక్కించుకోగా, ఆ తర్వాత జ్యూరిచ్ (స్విట్జర్లాండ్) మరియు న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ వరుసగా రెండు మరియు మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో జీవన నాణ్యత తక్కువగా ఉన్న ప్రదేశాలలో అత్యధికం ఆఫ్రికన్ నగరాలు ఉన్నాయి. పోర్ట్ లూయిస్ (మారిషస్‌) ఆఫ్రికా నుండి అత్యంత సురక్షితమైన నగరంగా ప్రపంచవ్యాప్తంగా 88వ స్థానంలో నిలిచింది.

మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా నగరాల్లోని జీవన పరిస్థితులను అంచనా వేసే వార్షిక నివేదిక. ఈ ర్యాంకింగ్ 10 వర్గాలుగా వారీగా దాదాపు 39 అంశాల యొక్క వివరణాత్మక అంచనాపై ర్యాంకింగ్ అందిస్తుంది. వీటిలో ఆయా నగరాల రాజకీయ స్థిరత్వం, సామాజిక స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం, జాబ్ మార్కెట్, మరియు జీవన వ్యయాలు వంటి అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటుంది.

  1. వియన్నా (ఆస్ట్రియా)
  2. జ్యూరిచ్ (స్విట్జర్లాండ్.
  3. ఆక్లాండ్ (న్యూజిలాండ్)
  4. కోపెన్‌హాగన్ (డెన్మార్క్)
  5. జెనీవా (స్విట్జర్లాండ్)
  6. ఫ్రాంక్‌ఫర్ట్ (జర్మనీ)
  7. మ్యూనిచ్ (జర్మనీ)
  8. వాంకోవర్ (కెనడా)
  9. సిడ్నీ (ఆస్ట్రేలియా)
  10. డ్యూసెల్డార్ఫ్ (జర్మనీ)

Post Comment