తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ : 13 అక్టోబర్ 2023
Telugu Current Affairs

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ : 13 అక్టోబర్ 2023

రోజువారీ తెలుగు కరెంట్ అఫైర్స్ 13 అక్టోబర్ 2023, తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి  వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

Advertisement

గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023లో భారతదేశం ర్యాంకు 111

గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (GHI) 2023లో భారతదేశం 28.7 స్కోర్‌తో 125 దేశాలలో 111వ ర్యాంక్‌లో నిలిచింది.  ఇది గత ఏడాది ర్యాంకు కంటే నాలుగు స్థానాలు తక్కువ. గత ఏడాది 107 ర్యాంకులో ఉన్న భారత్ ఈ ఏడాది 111 ర్యాంక్‌కు పడిపోయింది. తాజా నివేదిక భారతదేశాన్ని పొరుగున ఉన్న పాకిస్తాన్ , బంగ్లాదేశ్, నేపాల్ మరియు శ్రీలంక కంటే దిగువన ఉంచింది. ఈ జాబితాలో పాకిస్థాన్‌కు 102, బంగ్లాదేశ్‌కు 81, నేపాల్‌కు 69 మరియు శ్రీలంకకు 60వ స్థానాలలో నిలిచాయి.

గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఆకలి స్థాయిలను ట్రాక్ చేసే వార్షిక నివేదిక. దీనిని ఐర్లాండ్ మరియు జర్మనీకి చెందిన ప్రభుత్వేతర సంస్థలు కన్సర్న్ వరల్డ్‌వైడ్ మరియు వెల్ట్ హంగర్ హిల్ఫ్ రూపొందిస్తాయి. అయితే భారత ప్రభుత్వం గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఫలితాలను తిరస్కరించింది. ఈ పద్దతి తప్పు అని పేర్కొంది. అయితే, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది విశ్వసనీయమైన డేటాపై ఆధారపడిన గౌరవనీయమైన సూచిక అని నిపుణులు పేర్కొంటున్నారు.

గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023లో రక్షిత జాబితాలో బెలారస్, బోస్నియా & హెర్జెగోవినా, చిలీ, చైనా, క్రొయేషియాలు ఉండగా భయంకరమైన అకలితో యెమెన్ మడగాస్కర్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లు దిగువ మూడు స్థానాలలో నిలిచాయి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రధానంగా పోషకాహార లోపం, చైల్డ్ స్టంటింగ్, పిల్లల పోషకాహార లోపం మరియు పిల్లల మరణాల డేటా ఆధారంగా రూపొందించబడుతుంది.

ఈజిప్టు ప్రపంచ క్యాడెట్ చెస్ ఛాంపియన్‌షిప్‌కు భారత్ దూరం

ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య గాజా స్ట్రిప్‌లో కొనసాగుతున్న పరిస్థితులను ఉటంకిస్తూ అక్టోబర్ 14-23 వరకు ఈజిప్టులో జరగనున్న ప్రపంచ క్యాడెట్ చెస్ ఛాంపియన్‌షిప్ 2023 నుండి వైదొలుగుతున్నట్లు ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ప్రకటించింది. భారత ప్రభుత్వంతో చేర్చింది ఈ  తీసుకున్నట్లు ఏఐసీఎఫ్ తెలిపింది. ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేస్తుందని భావించిన భారత జట్టుకు ఇది నిరాశాజనక పరిణామం. అయితే ఆటగాళ్ల భద్రతే ప్రధానమని, ఏఐసీఎఫ్ నిర్ణయం ద్వారా అర్థమవుతుంది.

ఈ టోర్నమెంట్ కోసం భారత చదరంగ ఆటగాళ్లు, కోచ్‌ల సహా దాదాపు 80 మంది బృందం షర్మ్ ఎల్-షేక్‌కు వెళ్లాల్సి ఉంది, అయితే షర్మ్ ఎల్-షేక్ ఇజ్రాయెల్ సరిహద్దు నుండి 400 కి.మీ కంటే తక్కువ దూరంలో ఉండటంతో ఏఐసీఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది.

37%కి పెరిగిన భారతదేశ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం

దేశంలో మహిళా కార్మికుల భాగస్వామ్య రేటు ఈ ఏడాది 4.2 శాతం పెరిగి 37 శాతానికి చేరినట్లు స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ తన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్ 2022-23లో వెల్లడించింది. మహిళల దీర్ఘకాలిక సామాజిక-ఆర్థిక మరియు రాజకీయ అభివృద్ధికి ఉద్దేశించిన ప్రభుత్వ విధాన కార్యక్రమాల కారణంగా ఈ గణనీయమైన పెరుగుదల చోటుచేసుకుందని మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు మెరుగుదల భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు సమాజానికి సానుకూల పరిణామం. ఇది ఆర్థిక వృద్ధిని పెంచడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి మరియు పేదరికాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మహిళల సాధికారతకు మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి కూడా సహాయపడుతుంది. చైనా మరియు బ్రెజిల్ వంటి ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో మహిళా కార్మిక భాగస్వామ్య రేటు ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది. భారతదేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యంలో గణనీయమైన ప్రాంతీయ అసమానతలు కూడా ఉన్నాయి.

మైఖేల్ డగ్లస్‌కు సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

గోవాలో జరిగే 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రముఖ హాలీవుడ్ నటుడు మరియు నిర్మాత మైఖేల్ డగ్లస్‌ను సత్యజిత్ రే లైఫ్‌టైమ్ ఫిల్మ్ అవార్డుతో సత్కరించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అక్టోబర్ 13, 2023న ప్రకటించారు. మైఖేల్ డగ్లస్‌, వన్ ఫ్లూ ఓవర్ ది కోకిల నెస్ట్, వాల్ స్ట్రీట్, మరియు ఫాటల్ అట్రాక్షన్ వంటి హిట్ చిత్రాలలో నటించాడు. ఆయన ఉత్తమ నటనకు గాను రెండు ఆస్కార్ అవార్డులను కూడా గెలుచుకున్నారు.

సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ అనేది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ద్వారా స్థాపించబడిన అంతర్జాతీయ గౌరవం. ఇది అంతర్జాతీయ సినిమా రంగానికి విశిష్ట సేవలందించిన వ్యక్తులకు అందించే ప్రతిష్ట్మాక గౌరవం. దీనిని 1999 నుండి అందిస్తున్నారు. సత్యజిత్ రాయ్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత సినీ దర్శకుడు మరియు రచయిత. ప్రపంచ సినిమా చరిత్రలో 20వ శతాబ్దపు ఉత్తమ దర్శకుల్లో ఆయన ఒకరు.

రష్యా ఒలింపిక్ కమిటీని సస్పెండ్ చేసిన ఐఓసీ

తూర్పు ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతీయ క్రీడా సంస్థలను తమలో చేర్చుకోవడం ద్వారా ఒలింపిక్ చార్టర్‌ను ఉల్లంఘించినందుకు రష్యా ఒలింపిక్ కమిటీని అంతర్జాతీయ ఒలింపిక్ కౌన్సిల్ రద్దు చేసింది. ఒలింపిక్ కమిటీ తదుపరి నోటీసు వచ్చేవరకు ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ప్రకటించింది.

ఉక్రెయిన్ జాతీయ ఒలింపిక్ కమిటీ అధికారంలో ఉన్న ప్రాంతీయ క్రీడా సంస్థలు అయినా డోనెట్స్క్, ఖేర్సన్, లుహాన్స్క్ మరియు జపోరిజ్జియాలను తన భూభాగంకు సంబందించిన క్రీడా సంస్థలుగా రష్యా జాతీయ ఒలింపిక్ కమిటీ నోటిఫై చేసింది. ఇది ఒలింపిక్ చార్టర్ యొక్క ఉల్లంఘనకు దారి తీసింది. అలానే ఇది ఉక్రెయిన్ యొక్క ప్రాదేశిక సమగ్రతను కూడా ఉల్లంఘించింది. అయితే పారిస్‌లో జరిగే 2024 ఒలింపిక్స్‌తో పాటు మిలానో కోర్టినా 2026 వింటర్ గేమ్స్‌లో రష్యా పాస్‌పోర్ట్‌లతో అథ్లెట్లు పాల్గొనడం గురించి తగిన సమయంలో నిర్ణయిస్తామని ఐఓసీ తెలిపింది.

9వ జీ20 పార్లమెంటరీ స్పీకర్ల శిఖరాగ్ర సమావేశంను ప్రారంభించిన ప్రధాని

అక్టోబర్ 13, 2023న న్యూఢిల్లీలో నిర్వహించిన 9వ జీ 20 పార్లమెంటరీ స్పీకర్స్ సమ్మిట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సమ్మిట్ "21వ శతాబ్దంలో ప్రజాస్వామ్యం మరియు పార్లమెంటరీ వాదం" అనే అంశంపై జరిగింది. ఈ సమావేశం ద్వారకలోని ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. ఈ సమావేశం ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు కోసం పార్లమెంట్‌లు అనే థీమ్‌తో నిర్వహించారు.

ఈ సమ్మిట్‌కు అన్ని జీ20 సభ్య దేశాల నుండి పార్లమెంటరీ స్పీకర్లు, అలాగే అంతర్జాతీయ సంస్థలు మరియు పౌర సమాజానికి చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రజాస్వామ్యం మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడంలో పార్లమెంటుల పాత్ర, పార్లమెంటుల డిజిటలైజేషన్ యొక్క సవాళ్లు మరియు అవకాశాలు, లింగ సమానత్వం మరియు మహిళా సాధికారతను ప్రోత్సహించడంలో పార్లమెంటుల పాత్ర, ప్రపంచ సహకారాన్ని బలోపేతం చేయడంలో పార్లమెంటుల పాత్ర వంటి అంశాల యందు చర్చలు జరిగాయి.

రాజా కృష్ణమూర్తికి దలీప్ సింగ్ సౌండ్ అవార్డు

ఇండో-అమెరికన్ కాంగ్రెస్‌మెన్ రాజా కృష్ణమూర్తికి దలీప్ సింగ్ సౌండ్ అవార్డు లభించింది. ఈ అవార్డును ఆసియన్ అమెరికన్ యూనిటీ కోయలిషన్ ఆయన రాజకీయ నాయకత్వానికి గాను అందించింది. యునైటెడ్ స్టేట్స్‌లోని ఆసియా అమెరికన్లు, స్థానిక హవాయియన్లు మరియు పసిఫిక్ ద్వీపవాసుల ప్రయోజనాలను అభివృద్ధి చేయడంలో గణనీయమైన కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డును అందజేస్తారు.

ఆసియన్-అమెరికన్, స్థానిక హవాయి మరియు పసిఫిక్ ఐలాండర్ కమ్యూనిటీల ప్రయోజనాలను పురోగమింపజేయడంలో రాజా కృష్ణమూర్తి చేసిన ఆదర్శప్రాయమైన నిబద్ధతకు గుర్తింపుగా ఈ గౌరవం అందించబడింది. దలీప్ సింగ్ సౌండ్ అవార్డు అనేది యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్‌కు ఎన్నికైన మొదటి భారతీయ అమెరికన్ అయిన దలీప్ సింగ్ సౌండ్ పేరు మీద అందించబడుతుంది.

రైట్స్ లిమిటెడ్‌కు నవరత్న హోదా మంజూరు

భారత రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ కంపెనీ అయినా రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్‌కు నవరత్నహోదా మంజూరు చేయబడింది. రైట్స్ లిమిటెడ్‌ అనేది రైల్వేకి సంబంధించి 1974 న స్థాపించబడిన మల్టీడిసిప్లినరీ ఇంజినీరింగ్ మరియు కన్సల్టెన్సీ సంస్థ.

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ భారతదేశంలో రవాణా కన్సల్టెన్సీ మరియు ఇంజనీరింగ్ రంగంలో అగ్రగామిగా ఉంది. ఇది రైల్వేలు, హైవేలు, అర్బన్ ఇంజనీరింగ్ (మెట్రోలు) & విమానాశ్రయాలు, ఓడరేవులు, రోప్‌వేలు వంటి మౌలిక సదుపాయాల రంగంలో సేవలు అందిస్తుంది.

అలానే భారతీయ రైల్వేకి చెందిన మరో ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వే కనస్ట్రిక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్) కూడా నవరత్న హోదాను దక్కించుకుంది. 1976లో ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం ఇండియన్ రైల్వేస్ ద్వారా ఇది స్థాపించబడింది. ఇది భారతదేశం మరియు ఇతర దేశాలలో రైల్వే స్టేషన్‌ల పునరాభివృద్ధి, రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లకు బాధ్యత వహిస్తుంది.

భారతదేశంలో నవరత్న కంపెనీలు అనేవి రూ. వెయ్యి కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి ఆర్థిక స్వయంప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ రంగ సంస్థల సమూహం. భారత ప్రభుత్వం నుండి 1997లో తొమ్మిది పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (పిఎస్‌ఇ)కి మొదటిసారిగా నవరత్న బిరుదు లభించింది. ఒక కంపెనీకి "నవరత్న" హోదా మంజూరు కావాలంటే, అది వరుసగా మూడు సంవత్సరాల పాటు రూ. 5,000 కోట్ల కంటే ఎక్కువ నికర లాభాన్ని నివేదించాలి. ఈ రెండు సంస్థల చేరికతో ప్రస్తుతం ఈ జాబితాలో మొత్తం 16 ప్రభుత్వ రంగ సంస్థలు జాబితా చేయబడ్డాయి.

ఫోర్బ్స్ వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్స్ 2023 లిస్ట్‌లో ఎన్టీపీసీ

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, ఫోర్బ్స్ వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్స్ 2023 జాబితాలో ఫీచర్ చేయబడింది. ఈ జాబితాలో నిలిచిన ఏకైక భారతీయ సంస్థగా అవతరించింది. ఇది ప్రపంచంలోని టాప్ 700 కంపెనీలలో 261వ ర్యాంక్‌లో నిలిచింది. 58 దేశాలు మరియు భూభాగాలకు చెందిన 150,000 మంది ఉద్యోగులపై గ్లోబల్ సర్వే ఆధారంగా ఫోర్బ్స్ వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్స్ జాబితా రూపొందించబడింది.

ఉద్యోగుల పరిహారం, ప్రయోజనాలు, కెరీర్ డెవలప్‌మెంట్, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ మరియు వైవిధ్యం వంటి అనేక అంశాలలో వారి యజమానితో ఉద్యోగి సంతృప్తిని ఈ సర్వే కొలుస్తుంది. ఎన్టీపీసీ తన ఉద్యోగులకు సంతృపికరమైన వేతనాలు, సమగ్ర ఆరోగ్య సంరక్షణ కవరేజ్ మరియు వృత్తిపరమైన అభివృద్ధికి అవకాశాలతో సహా అనేక రకాల ప్రయోజనాలు మరియు ప్రోగ్రామ్‌లను అందిస్తుంది.

ముంబైలో 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశం

141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) సెషన్‌ను ఆక్టోబర్ 14న ముంబాయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సెషన్ క్రీడలకు సంబంధించిన వివిధ వాటాదారుల మధ్య పరస్పర చర్య మరియు జ్ఞానాన్ని పంచుకోవడానికి అవకాశాన్ని అందిస్తుంది.

ఐఓసీ సెషన్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యుల కీలక సమావేశంగా పరిగణించబడుతుంది. ఒలింపిక్ క్రీడల భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు ఐఓసీ సెషన్స్‌లో తీసుకోబడతాయి. దాదాపు 40 ఏళ్ల విరామం తర్వాత భారత్ రెండోసారి ఐఓసీ సెషన్‌ను నిర్వహించింది. ఇది వరకు ఐఓసీ యొక్క 86వ సెషన్ 1983లో న్యూఢిల్లీలో జరిగింది.

ఈ సెషన్‌లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు మిస్టర్ థామస్ బాచ్ మరియు ఐఓసీ ఇతర సభ్యులు, ప్రముఖ భారతీయ క్రీడా ప్రముఖులు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌తో సహా వివిధ క్రీడా సమాఖ్యల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

Advertisement

Post Comment