తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 12 అక్టోబర్ 2023
Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 12 అక్టోబర్ 2023

రోజువారీ తెలుగు కరెంట్ అఫైర్స్ 12 అక్టోబర్ 2023, తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి  వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

Advertisement

ఉత్తరాఖండ్‌లో 4200 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలో దాదాపు రూ. 4200 విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. ఇటీవలే సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వైబ్రంట్ విలేజ్ స్కీమ్ కింద వీటిని అభివృద్ధి చేయనున్నారు. వీటిలో విద్య, ఎడ్యుకేషన్, ఆరోగ్య సంబంధిత మౌలికసదుపాయాల ప్రాజెక్టులు ఉన్నాయి.

ఈ సంధర్బంగా ప్రశంగించిన ప్రధాని, ఆధునిక సౌకర్యాలతో సైన్యాన్ని బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. భారతదేశం అభివృద్ధిలో కొత్త శిఖరాలకు దూసుకుపోతోందని, దేశం నుండి పేదరిక నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం పని చేస్తుందని, ఫలితంగా కేవలం ఐదేళ్లలో 13.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని ఆయన అన్నారు.

ఉత్తరాఖండ్‌ను అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి మరియు సామాన్య ప్రజల జీవితాలను సులభతరం చేయడానికి ప్రభుత్వం పూర్తి అంకితభావంతో పనిచేస్తుందని ఆయన అన్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల నివారణకు 4,000 కోట్ల రూపాయలను వెచ్చిస్తామని మోదీ చెప్పారు.

ఈ పర్యటనలో ఆయన పిథోరఘర్‌లోని జోలింగ్‌కాంగ్‌లోని పార్వతి కుండ్ వద్ద ప్రార్థనలు చేశారు. అక్కడి నుంచి గుంజి గ్రామానికి చేరుకున్న ప్రధాని అక్కడ స్థానికులతో మమేకమై స్థానిక ఉత్పత్తుల క్రాఫ్ట్ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. గుంజిలో ఆర్మీ, ఐటీబీపీ మరియు బీఆర్ఒ సిబ్బందితో కూడా ప్రధాని సంభాషించారు. అల్మోరాలోని ప్రసిద్ధ జగేశ్వర్ ఆలయంలో కూడా ఆయన ప్రార్థనలు చేశారు.

పారిస్‌లో 5వ ఇండో-ఫ్రెంచ్ డైలాగ్

ఇండియా మరియు ఫ్రాన్స్ రక్షణ మంత్రులు అంతరిక్షం, సైబర్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సముచిత డొమైన్‌లలో సంభావ్య సహకారం గురించి పారిస్‌లో జరిగిన 5వ ఇండో-ఫ్రెంచ్ డైలాగ్ సందర్బంగా సమీక్షించారు. అలానే ఇరు దేశాల రక్షణ పరిశ్రమల మధ్య సహకారాన్ని మరింతగా పెంచుకునే మార్గాలను కూడా చర్చించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న రక్షణ ప్రాజెక్టులను కూడా మంత్రులు సమీక్షించారు.

ఈ సమావేశానికి భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఫ్రెంచ్ సాయుధ దళాల మంత్రి సెబాస్టియన్ లెకోర్నుఅధ్యక్షత వహించారు. ఈ ఏడాదికి ఇండో-ఫ్రెంచ్ వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రారంభమై 25 సంవత్సరాలు పూర్తికానుంది. 26 జనవరి 1998న ఆనాటి ప్రెంచ్ ప్రెసిడెంట్ చిరాక్ భారతదేశ పర్యటన సందర్భంగా దీనిని ప్రారంభించారు. ఇది రక్షణ, పౌర అణుశక్తి, అంతరిక్షం మరియు భద్రత (సైబర్, తీవ్రవాదం, ఇండో-పసిఫిక్ నిఘా) రంగాలలో సన్నిహిత సహకారం ప్రారభించబడింది.

రెండు రోజుల యూరోప్ పర్యటన నిమిత్తం అక్టోబర్ 10, 2023న పారిస్ చేరుకున్న రక్షా మంత్రి అక్కడి భారతీయ కమ్యూనిటీతో సంభాషించారు. రెండు దేశాల పర్యటనలో భాగంగా రోమ్‌లో ఇటలీ రక్షణ మంత్రి మిస్టర్ గైడో క్రోసెట్టోతో చర్చలు జరిపారు. భద్రత మరియు రక్షణ విధానం, పరిశోధన, సైనిక రంగంలో విద్య, సముద్ర డొమైన్ అవగాహన, రక్షణ సమాచారాన్ని పంచుకోవడం మరియు పారిశ్రామిక సహకారం వంటి విభిన్న రక్షణ రంగాలలో ద్వైపాక్షిక సహకారంపై ఒక ఒప్పందంపై సంతకం చేశారు.

ఈ పర్యటనలో ఆయన రోమ్‌లో ఇటాలియన్ డిఫెన్స్ కంపెనీల సీఈఓలు మరియు ఇతర అగ్ర పరిశ్రమ నాయకులతో సమావేశమయ్యారు. రెండవ రోజు పారిస్ సమీపంలోని జెన్నెవిలియర్స్‌లోని సఫ్రాన్ ఇంజిన్ డివిజన్ యొక్క పరిశోధన కేంద్రాన్ని సందర్శించి, ఏరో-ఇంజిన్ టెక్నాలజీలో తాజా పరిణామాలను వీక్షించారు. ఇక్కడే అగ్రశ్రేణి ఫ్రెంచ్ రక్షణ కంపెనీల సీఈఓలతో కూడా సమావేశమయ్యారు.

ఫ్రాన్స్ మరియు భారతదేశం గత 25 సంవత్సరాలుగా అన్ని స్థాయిలలో స్థిరమైన, వివరణాత్మక సంబంధాలు కలిగి ఉన్నాయి. 2016లో భారతదేశం 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు నుండి, ముంబైలో 6 స్కార్పెన్-తరగతి జలాంతర్గాముల నిర్మాణం వరకు ఈ భాగస్వామ్య సహకారం కొనసాగుతుంది. ఫ్రెంచ్ మరియు భారతీయ సైన్యాల మధ్య తరచుగా జరిగే శక్తి, వరుణ, పెగసే, గరుడ వంటి ఉమ్మడి సైనిక విన్యాసాల ద్వారా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో బలమైన సహకారాన్ని అందిపుచ్చుకుంటున్నాయి.

భారత్, చైనాల మధ్య 20వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు

భారతదేశం మరియు చైనా తమ 20వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి సమావేశాన్ని అక్టోబర్ 9, 10 తేదీలలో తూర్పు లడఖ్ సెక్టార్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) కు ఇండియా వైపున ఉన్న మోల్డో-చుషుల్‌లో నిర్వహించాయి. ఈ సందర్బంగా తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి మిగిలిన సమస్యలపై ముందస్తు మరియు పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ఇరుదేశాలు నిర్మాణాత్మక పద్ధతిలో తమ అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నాయి.

ఈ ఏడాది ఆగస్టు 13-14 తేదీల్లో జరిగిన చివరి రౌండ్ కార్ప్స్ కమాండర్ల సమావేశంలో సాధించిన పురోగతిపై కూడా సమీక్షించారు. మధ్యంతర సరిహద్దు ప్రాంతాలలో శాంతి మరియు ప్రశాంతతను కొనసాగించడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. ఈ సమావేశం సుహృద్భావ, సానుకూల వాతావరణంలో జరిగింది. మిగిలిన సమస్యల పరిష్కారానికి సంప్రదింపులు, చర్చలు కొనసాగించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.

ఇరుదేశాల మధ్య జరిగిన కార్ప్స్ కమాండర్ స్థాయి 20వ రౌండ్ సమావేశం ఒక సానుకూల పరిణామం. భారతదేశం మరియు చైనాలు తమ విభేదాలను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవడానికి కట్టుబడి ఉన్నాయని ఇది చూపిస్తుంది. ఈ సమావేశం ఇరుపక్షాల మధ్య విశ్వాసం మరియు నమ్మకాన్ని పెంపొందించే అవకాశాన్ని కూడా అందిస్తుంది. అయితే తూర్పు లడఖ్ సెక్టార్‌లో డిస్‌ఎంగేజ్‌మెంట్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇంకా పరిష్కరించాల్సిన కొన్ని ఘర్షణ పాయింట్లు ఉన్నాయి.

ఆపరేషన్ అజయ్ 2023 : ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం

ఆపరేషన్ అజయ్ 2023 అనేది ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం కారణంగా ఇజ్రాయిల్ యందు చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తరలించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక ఆపరేషన్. ఇజ్రాయెల్ - పాలస్తీనాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ యందు పెద్ద సంఖ్యలో విదేశీయులు చిక్కుకుపోయారు. వీరిలో భారతీయుల సంఖ్య దాదాపు 18 వేలు ఉన్నట్లు ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. వారిని స్వదేశానికి రప్పించేందుకు భారత రక్షణ దళాల సహాయంతో ఈ ఆపరేషన్ నిర్వహిస్తుంది.

ఈ ఆపరేషన్ అక్టోబర్ 12, 2023న ప్రారంభించబడింది. ఇజ్రాయెల్ నుండి భారతీయ పౌరులతో కూడిన మొదటి చార్టర్ విమానం 13 అక్టోబర్ 2023న 211 మంది పెద్దలు మరియు ఒక శిశువుతో బెన్ గురియన్ విమానాశ్రయం నుండి ఢిల్లీ చేరుకుంది. 14 అక్టోబర్ 2023న ఇద్దరు శిశువులతో సహా 235 మంది భారతీయులు ఇండియాకు చేరుకున్నారు. ఇజ్రాయెల్ నుండి స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయ పౌరులందరినీ తరలించడానికి కట్టుబడి ఉన్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.

భారత ప్రభుత్వం ఇటీవలే కాలంలో విదేశీ సంక్షోభాల సమయంలో భారత పౌరుల తరలింపు కోసం వివిధ ఆపరేషన్లు చేపట్టింది. అందులో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ పతనం మరియు తాలిబాన్‌ ఆక్రమణ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతీయ పౌరులను తరలించడానికి భారత సాయుధ దళాలలు చేపట్టిన ఆపరేషన్ దేవి శక్తి వంటివి ఉన్నాయి. ఉక్రెయిన్‌పై 2022 రష్యా దాడి సమయంలో భారత పౌరులను రక్షించడానికి చేపట్టిన ఆపరేషన్ గంగా, 2023 సూడాన్ సంఘర్షణ సమయంలో చేపట్టిన ఆపరేషన్ కావేరి వంటివి కూడా ఉన్నాయి.

నోయిడాలో 6వ వార్షిక టెక్నాలజీ కాన్ఫరెన్స్ ఇన్ఫినిటీ 2023

6వ వార్షిక టెక్నాలజీ కాన్ఫరెన్స్ ఇన్ఫినిటీ 2023 నోయిడాలో అక్టోబర్ 12-13 తేదీలలో నిర్వహించబడింది. అమిటీ బిజినెస్ స్కూల్, అమిటీ యూనివర్సిటీఉత్తరప్రదేశ్ నోయిడా క్యాంపస్ దీనిని నిర్వహించింది. ఫ్యూచరిస్టిక్ బిజినెస్‌ల కోసం డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్: ఎమర్జింగ్ టెక్నాలజీస్ లీడింగ్ గ్రోత్ అండ్ సస్టైనబిలిటీ అనే అంశంపై ఈ కాన్ఫరెన్స్ జరిగింది.

ఈ సదస్సుకు పరిశ్రమల ప్రముఖులు, విద్యావేత్తలు మరియు విద్యార్థులతో సహా 2,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సులో కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సమావేశంలో కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, బ్లాక్‌చెయిన్ మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌తో సహా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చలు మరియు వర్క్‌షాప్‌లు నిర్వహించబడ్డాయి. సాంకేతికత మరియు స్టార్టప్ రంగాలలో భారతదేశ భవిష్యత్తుకు అనుగుణంగా యువ నైపుణ్యాల బలోపేతం లక్ష్యంతో ఈ సమావేశం ముగిసింది.

ఆస్కార్ లైబ్రరీ కలెక్షన్‌లో ది వ్యాక్సిన్ వార్ స్క్రిప్ట్

ప్రముఖ భారతీయ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి యొక్క ది వ్యాక్సిన్ వార్ యొక్క స్క్రిప్ట్, ఆస్కార్ లైబ్రరీ యొక్క శాశ్వత కోర్ సేకరణ ఉంచేందుకు అంగీకరించబడింది. అకాడమీ కలెక్షన్స్ అనేది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ యొక్క శాశ్వత ఆర్కైవ్. ఇది చలనచిత్ర చరిత్రకు సంబంధించిన అరుదైన స్క్రిప్ట్‌లు, స్క్రీన్‌ప్లేలు సేకరించి భద్రపరుస్తుంది. ఇందులో చోటు లభించడం ఒక ప్రతిష్టాత్మకమైన గౌరవం.

ది వ్యాక్సిన్ వార్ అనేది కోవిడ్-19 సమయంలో భారత్ సంస్థలు అభివృద్ధి చేసిన కోవాక్సిన్ యొక్క కల్పిత చిత్రం. ఈ చిత్రం సెప్టెంబర్ 30, 2023న విడుదలై సినీ విమర్శుకుల నుండి మిశ్రమ స్పందన పొందింది. ఈ చిత్రం శాస్త్రీయ ప్రక్రియ యొక్క వాస్తవిక చిత్రణ మరియు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన భారతీయ శాస్త్రవేత్తల హృదయాన్ని కదిలించే కథతో ప్రశంసలు అందుకుంది.

ఐఏసీసీ జాతీయ అధ్యక్షుడిగా పంకజ్ బోహ్రా

ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జాతీయ అధ్యక్షుడిగా అహ్మదాబాద్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ పంకజ్ బోహ్రా బాధ్యతలు స్వీకరించారు. నాలుగు దశాబ్దాలకు పైగా వృత్తిపరమైన అనుభవం కలిగిన ఈయన ప్రస్తుతం పంకజ్ బోహ్రా & కో చార్టర్డ్‌లో సీనియర్ భాగస్వామిగా పనిచేస్తున్నారు.

ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది 1968లో స్థాపించబడిన ఒక లాభాపేక్ష రహిత సంస్థ. ఇది భారతదేశం-యుఎస్ ఎకనామిక్ ఎంగేజ్‌మెంట్‌ను కలిపే అపెక్స్ ద్వైపాక్షిక ఛాంబర్. ఐఏసీసీ 1,500 మంది సభ్యులతో పాన్-ఇండియా ఉనికిని కలిగి ఉంది. భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య వాణిజ్యం మరియు పెట్టుబడులను ప్రోత్సహించడం మరియు మెరుగుపరచడం దీని లక్ష్యం.

న్యూఢిల్లీలో ఇండియా జ్యువెలరీ షాపింగ్ ఫెస్టివల్

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ భారతదేశ జ్యువెలరీ షాపింగ్ ఫెస్టివల్ (IJSF) 2023ని న్యూ ఢిల్లీలో అక్టోబర్ 11, 2023న ప్రారంభించారు. ఈ ఫెస్టివల్ భారతదేశంలోని 300 నగరాల్లో అక్టోబర్ 15 నుండి నవంబర్ 22, 2023 వరకు విడతల వారీగా నిర్వహించబడుతుంది. ఇండియా జ్యువెలరీ షాపింగ్ ఫెస్టివల్ అనేది ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ మరియు భారత ప్రభుత్వం యొక్క ఉమ్మడి చొరవ. ఈ ఈవెంట్ భారతదేశంలో ఆభరణాల విక్రయాలను ప్రోత్సహించడం మరియు భారతీయ ఆభరణాల పరిశ్రమను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇండియా జ్యువెలరీ షాపింగ్ ఫెస్టివల్ దేశ వ్యాప్తంగా 200 నగరాలలో 3000 మంది రిటైలర్ల ద్వారా రూ.1,20,000 కోట్ల విలువైన వ్యాపారాన్ని నమోదు చేస్తుందని భావిస్తున్నారు. ఈ పండుగ ఆభరణాల పరిశ్రమలో భారీ ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఈ ఈవెంట్ ఆభరణాల కొనుగోళ్లపై పలు రకాల తగ్గింపులు మరియు ఆఫర్‌లను కూడా అందిస్తున్నారు.

మహారాష్ట్రలో స్వతంత్ర ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, కేంద్ర ప్రభుత్వ తరహాలో మహారాష్ట్రకు స్వతంత్ర షెడ్యూల్డ్ తెగల కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపారు. ముంబైలో జరిగిన రాష్ట్ర గిరిజన సలహా మండలి సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. దీంతో పాటు ఆ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ, జనాభా ప్రకారం నిధులు మంజూరు, గిరిజన జిల్లాల తాలూకాల్లో ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభం, తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

ఈ ఎస్టీ కమిషన్ మహారాష్ట్రలోని షెడ్యూల్డ్ తెగల హక్కులు మరియు ప్రయోజనాలను పరిరక్షించే బాధ్యత వహించే స్వయంప్రతిపత్త సంస్థగా ఉంటుంది. షెడ్యూల్డ్ తెగలపై వివక్ష మరియు మానవ హక్కుల ఉల్లంఘన ఫిర్యాదులను విచారించే అధికారం కమిషన్‌కు ఉంటుంది. షెడ్యూల్డ్ తెగల కోసం ప్రభుత్వ పథకాలు మరియు కార్యక్రమాల అమలును పర్యవేక్షించేందుకు కూడా ఇది బాధ్యత వహిస్తుంది.

Advertisement

Post Comment