Daily Current affairs in Telugu 16 December 2023. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం
రాజస్థాన్ 14వ ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకుడు భజన్‌లాల్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. సంగనేర్ అసెంబ్లీ స్థానం నుండి తొలిసారి గెలిచినా ఈయనకు బీజేపీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేసింది. డిసెంబర్ 15న జరిగిన ఈ వేడుకలో భజన్ లాల్ శర్మతో పాటుగా డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి మరియు ప్రేమ్ చంద్ బైర్వాతో గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా భజన్‌లాల్ శర్మతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా ఇతర బీజేపీ నాయకులు హాజరయ్యారు.
దీంతో గత 25 ఏళ్లుగా రాజస్థాన్ రాజకీయాల్లో అశోక్ గెహ్లాట్, వసుంధర రాజే ముఖ్యమంత్రుల శకం ముగిసింది. 1998 నుండి ఇప్పటి వరకు అశోక్ గెహ్లాట్ మరియు వసుంధర రాజేలు ప్రతి ఏదేళ్లకోసారి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. రాజస్థాన్ రాష్ట్ర శాసనసభలోని మొత్తం 200 మంది శాసనసభ్యులను ఎన్నుకోవడానికి నవంబర్ 25 న ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3న విడుదల అయిన ఎన్నికల ఫలితాల ప్రకారం బీజేపీ 115 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 69 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది.
ఇండియా లాజిస్టిక్స్ పనితీరు సూచిక 2023
కేంద్ర వాణిజ్య & పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ “లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్ (లీడ్స్) 2023” నివేదికను డిసెంబర్ 16న న్యూఢిల్లీలో విడుదల చేశారు. లీడ్స్ నివేదిక 2018 నుండి ప్రపంచ బ్యాంకు యొక్క లాజిస్టిక్స్ పనితీరు సూచిక నమూనాతో కేంద్ర వాణిజ్య & పరిశ్రమల శాఖ రూపొందిస్తుంది. ఈ నివేదిక దేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో లాజిస్టిక్స్ పనితీరు మెరుగుదలకు సంబంధించిన అంతర్దృష్టులను అందిస్తుంది. ప్రస్తుత నివేదిక లీడ్స్ ఎడిషన్ యందు ఐదోవాది.
ఈ నివేదిక పాన్-ఇండియా ప్రాథమిక సర్వేపై ఆధారపడి రూపొందించబడింది. దాదాపు 750 జాతీయ, ప్రాంతీయ మరియు రాష్ట్ర సంఘాల సంప్రదింపుల తర్వాత ఈ సమగ్ర మూల్యాంకణం రూపొందించబడింది. ఈ నివేదిక మే మరియు జూలై 2023 మధ్య నిర్వహించబడిన సర్వే ఆధారంగా తయారు చేయబడింది.
ఈ నివేదిక లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్ సర్వీసెస్ మరియు ఆపరేటింగ్ మరియు రెగ్యులేటరీ ఎన్విరాన్‌మెంట్ వంటి కీలక అంశాల పనితీరు ఆధారంగా రూపొందించబడింది. ఈ నివేదిక దేశాన్ని కోస్టల్ గ్రూప్, ల్యాండ్‌లాక్డ్ గ్రూప్, ఈశాన్య గ్రూప్ మరియు కేంద్రప్రాంతాల గ్రూపుగా విభజించి ర్యాంకింగ్ అందించింది. ఈ ర్యాంకింగులో కూడా ఒక్కో గ్రూపును అచీవర్స్, ఫాస్ట్ మూవర్స్ మరియు ఆస్పైర్స్ పేర్లతో కేటగిరి చేసింది.
అచీవర్స్ | ఫాస్ట్ మూవర్స్ | ఆస్పైర్స్ | |
---|---|---|---|
కోస్టల్ గ్రూప్ | ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు | కేరళ, మహారాష్ట్ర | గోవా, ఒడిశా, పశ్చిమ బెంగాల్ |
ల్యాండ్‌లాక్డ్ గ్రూప్ | హర్యానా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ | మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ | బీహార్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ |
ఈశాన్య గ్రూప్ | అస్సాం, సిక్కిం, త్రిపుర | అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ | మణిపూర్, మేఘాలయ, మిజోరాం |
కేంద్రప్రాంతాలు | చండీగఢ్, ఢిల్లీ | అండమాన్ & నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరి | డామన్ & డయ్యు/ దాద్రా & నగర్ హవేలీ, జమ్ము & కాశ్మీర్, లడఖ్ |
ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ రుణ నివేదిక 2023
ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ రుణ నివేదిక 2023 (ఐడీఆర్ 2023), డిసెంబర్ 13న విడుదల చేయబడింది. ఈ నివేదిక 122 తక్కువ మరియు మధ్య-ఆదాయ దేశాల రుణ పోకడలు మరియు బాహ్య రుణ గణాంకాలపై సమగ్ర విశ్లేషణను అందిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు 2022లో రికార్డు స్థాయిలో $443.5 బిలియన్ల ప్రభుత్వ రుణాలు చెల్లించినట్లు ఈ నివేదిక వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరగడంతో ఇది మునుపటి సంవత్సరం కంటే 5% పెరుగుదలకు దారితీసినట్లు వెల్లడించింది.
2023 మరియు 2024లో ప్రపంచంలోని 24 పేద దేశాల యొక్క రుణ భారం 39% వరకు పెరగవచ్చని ఈ తాజా అంతర్జాతీయ రుణ నివేదిక తెలిపింది. రికార్డు స్థాయిలో రుణాలు అభివృద్ధి చెందుతున్న దేశాలను సంక్షోభంలో పడేస్తాయని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. పెరుగుతున్న వడ్డీ రేట్లతో ఆరోగ్యం, విద్య మరియు వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడం వంటి ప్రాథమిక అంశాలపై ఖర్చు చేసేందుకు ప్రభుత్వాలు ద్రవ్య లోటును ఎదుర్కొంటాయని నివేదించింది.
ఈ నివేదిక గత మూడేళ్లలో 10 అభివృద్ధి చెందుతున్న దేశాలలో 18 సావరిన్ డిఫాల్ట్‌లు జరిగాయని పేర్కొంది. ఇది గత రెండు దశాబ్దాలలో కలిపిన మొత్తం కంటే ఎక్కువని తెలిపింది. ఈ జాబితాలో ఘనా, శ్రీలంక మరియు జాంబియా వంటి దేశాలు ఉన్నట్లు వెల్లడించింది. పేద దేశాలకు సహాయం చేయడానికి రూపొందించబడిన ప్రపంచ బ్యాంక్ యొక్క ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ నుండి రుణం తీసుకోవడానికి 75 దేశాలు ప్రస్తుతం అర్హత కలిగి ఉన్నట్లు తెలిపింది. అయితే వీటిలో 11 దేశాలు ఇప్పటికే తీవ్రమైన రుణాల ఊబిలో చిక్కుకుపోయి ఉన్నట్లు కూడా పేర్కొంది.
గత కొద్దికాలంగా ప్రైవేట్ రుణదాతల నుండి ఫైనాన్సింగ్ తగ్గిపోవడంతో, ప్రపంచ బ్యాంక్ మరియు ఇతర బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులు అంతరాన్ని పూడ్చడంలో సహాయం చేసినట్లు పేర్కొంది. 2022లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు కొత్తగా $115 బిలియన్లు వీరు అందించినట్లు పేర్కొంది. వీటిలో దాదాపు సగం ప్రపంచ బ్యాంకు అందించింది. ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ ద్వారా, ప్రపంచ బ్యాంక్ ఈ దేశాలకు కొత్త ఫైనాన్సింగ్‌లో $16.9 బిలియన్లు అందించింది. దీనికి అదనంగా ఈ దేశాలకు $6.1 బిలియన్ల గ్రాంట్లను కూడా పంపిణీ చేసింది.
తాజా అంతర్జాతీయ రుణ నివేదిక ప్రచురణ, ప్రపంచ బ్యాంకు యొక్క 50వ వార్షికోత్సవ నివేదిక. ఇది ప్రపంచ బ్యాంక్ యొక్క అంతర్జాతీయ రుణ గణాంకాల డేటాబేస్ నుండి కీలక అంతర్దృష్టులను హైలైట్ చేస్తుంది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల బాహ్య రుణ డేటా యొక్క అత్యంత సమగ్రమైన మరియు పారదర్శక మూలం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం భారతదేశం యొక్క బాహ్య రుణ భారం డిసెంబర్ 2023 చివరి నాటికి 629.1 బిలియన్ డాలర్లగా ఉంది.
గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ రోడ్డు సేఫ్టీ 2023
ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన తాజా రహదారి భద్రత మూల్యాంకనం (గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ రోడ్డు సేఫ్టీ 2023) ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య 5 శాతం తగ్గినట్లు నివేదించింది. అయితే భారతదేశంలో వీటి సంఖ్య పెరుగుతున్నట్లు పేర్కొంది. రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 1.19 మిలియన్ల మంది మరణిస్తున్నట్లు తెలిపింది. ప్రతి నిముషానికి ఇద్దరు చెప్పున, రోజుకు 3,200 మంది ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నట్లు నివేదించింది.
- రోడ్డు ట్రాఫిక్ క్రాష్ ఫలితంగా ప్రతి సంవత్సరం సుమారు 1.19 మిలియన్ల మంది మరణిస్తున్నారు. 20 మరియు 50 మిలియన్ల మంది గాయాల పాలవుతున్నారు.
- రోడ్డు ప్రమాదాల మరణాలు మరియు కారణమయ్యే వారిలో అత్యధికంగా 5-29 సంవత్సరాల వయస్సు గల పిల్లలు మరియు యువకులు ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది.
- ప్రపంచ వ్యాప్తంగా 60% వాహనాలు కలిగిన మధ్య-ఆదాయ దేశాలలోనే 92 శాతం రోడ్డు ప్రమాదాలు సంభవించినట్లు పేర్కొంది.
- రోడ్డు ట్రాఫిక్ మరణాలు ఆఫ్రికన్ రీజియన్‌లో అత్యధికంగా, యూరోపియన్ ప్రాంతంలో అత్యల్పంగా ఉన్నాయి.
- 2022లో భారతదేశం అత్యధిక సంఖ్యలో 1.68 లక్షల మరణాలు నమోదు అయ్యాయి. అనగా సగటున రోజుకు 462 మరణాలు లేదా ప్రతి మూడు నిమిషాలకు ఒకరు.
- రోడ్డు ట్రాఫిక్ మరణాలలో సగానికి పైగా పాదచారులు, సైక్లిస్ట్‌లు మరియు మోటార్‌సైకిల్‌దారులు ఉన్నారు.
- రోడ్డు ప్రమాద బాధితులకు వైద్యం, సహాయం అందించేందుకు దేశాలు వాటి స్థూల దేశీయోత్పత్తిలో 3% నష్టపోతున్నాట్లు నివేదించింది.
- రోడ్డు ప్రమాదాలలో ఆడవారి కంటే, 3 రెట్ల మంది పురుషులు చనిపోతున్నారు.
- అత్యధిక రోడ్డు ప్రమాదాలకు అతివేగం, మద్యపానం కారణమౌతున్నట్లు పేర్కొంది.
సరైన హెల్మెట్ వాడకం వల్ల రోడ్డు ప్రమాదంలో మరణించే ప్రమాదాన్ని 6 రెట్ల కంటే ఎక్కువ తగ్గించవచ్చుని మరియు మెదడుకు గాయం ప్రమాదాన్ని 74% వరకు తగ్గించవచ్చుని ఈ నివేదిక పేర్కొంది. సీటు బెల్ట్ ధరించడం వలన వాహనంలో ప్రయాణించేవారిలో మరణ ప్రమాదాన్ని 50% వరకు తగ్గించవచ్చుని తెలిపింది. పిల్లలకు వాహనాలు దూరం పెట్టడం ద్వారా వారి మరణాలు 71% తగ్గుతాయిని వెల్లడించింది.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2030 నాటికి రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాల వల్ల ప్రపంచవ్యాప్తంగా మరణాలు మరియు గాయాల సంఖ్యను సగానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం సభ్య దేశాలు మరియు సంబంధిత రంగాలలో భాగస్వాములతో కలిసి పనిచేసేందుకు సిద్దమవుతుంది. దీని కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పని చేయడంతో పాటుగా జాతీయ రహదారి భద్రతా సంస్థల అధిపతుల ప్రపంచ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతుంది.
ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఉమ్మడిగా ఈ రోడ్ సేఫ్టీ కోలాబరేషన్ మెకానిజంకు అధ్యక్షత వహించనున్నాయి. ఇందులో భాగంగా కీలక భాగస్వాములతో కలిసి, యూఎన్ రహదారి భద్రతా వారాలు, రోడ్డు ట్రాఫిక్ బాధితుల కోసం వార్షిక ప్రపంచ దినోత్సవం వంటి హై ప్రొఫైల్ అడ్వకేసీ ఈవెంట్‌లను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
యూనిడ్రాయిట్‌కు ఎన్నికైన మొదటి భారత మహిళగా ఉమా శేఖర్
ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ యూనిఫికేషన్ ఆఫ్ ప్రైవేట్ లా (యూనిడ్రాయిట్) యొక్క గవర్నింగ్ కౌన్సిల్‌కు ఎన్నికైన భారతదేశపు మొదటి మహిళాగా ఉమా శేఖర్ నిలిచారు. దీనికి సంబంధించి ఇటలీలోని రోమ్‌లో జరిగిన ఎన్నికలలో, ఉమా శేఖర్ మొదటి రౌండ్‌లో 59 ఓట్లకు గాను 45 ఓట్లు దక్కించుకున్నారు. ఈ గవర్నింగ్ కౌన్సిల్‌కు ఎన్నిక కావడానికి 21 ఓట్లు అవసరం. దీనితో ఉమా శేఖర్ తన గవర్నింగ్ కౌన్సిల్ సీటును కైవసం చేసుకున్నారు. భారతదేశం 2024-28 కాలానికి ఈ గవర్నింగ్ కౌన్సిల్‌లో సభ్యదేశంగా ఉంటుంది.
ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది యూనిఫికేషన్ ఆఫ్ ప్రైవేట్ లా అనేది ఇటలీలోని రోమ్‌లో ఉన్న ఒక స్వతంత్ర అంతర్ ప్రభుత్వ సంస్థ. ఇది 1926లో స్థాపించబడింది. దీనిలో ప్రస్తుతం 65 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఇది సభ్య దేశాల మధ్య ప్రైవేట్ మరియు ప్రత్యేక వాణిజ్య చట్టాలను ఆధునికీకరించడం లేదా సమన్వయం చేస్తుంది.
- సెక్రటరీ జనరల్ : ప్రొఫెసర్ ఇగ్నాసియో టిరాడో
- అధ్యక్షుడు : ప్రొఫెసర్ మరియా చియారా మాలాగుటి
- అధికారిక భాష : ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్, జర్మన్