29th December 2023 Current affairs in Telugu. పోటీ పరీక్షల రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో పొందండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షల కొరకు సిద్దమవుతున్న ఆశావహులకు ఉపయోగపడతాయి.
నావికాదళం అడ్మిరల్స్ కోసం కొత్త ఎపాలెట్‌స్
భారతీయ నౌకాదళం ఇటీవల తన అడ్మిరల్స్ ఎపాలెట్‌ల కోసం ఒక కొత్త డిజైన్‌ను ఆవిష్కరించింది. ఇవి ఛత్రపతి శివాజీ మహారాజ్ నావికా దళం మరియు రాజముద్రను ప్రతిధ్వనించే అంశాలతో డిజైన్ చేయబడ్డాయి. ఈ డిజైన్‌లో గోల్డెన్ నేవీ బటన్, ఎనిమిది కార్డినల్ దిశలను సూచించే అష్టభుజి, నేవీ యొక్క రైసన్ డిట్రేను నొక్కి చెప్పే కత్తి & దీర్ఘకాల దృష్టిని సూచించే టెలిస్కోప్ వంటివి ఉన్నాయి. ఈపాలెట్‌లు భారతదేశం యొక్క గొప్ప సముద్ర వారసత్వం నుండి ప్రేరణ పొంది రూపొందించారు.
- వలసరాజ్యాల కాలం నాటి కిరీటం స్థానంలో గోల్డెన్ బటన్ భారతదేశం యొక్క స్వావలంబన మరియు అచంచలమైన సంకల్పాన్ని సూచిస్తుంది.
- ఎనిమిది కార్డినల్ దిశలచే ప్రేరణ పొందిన అష్టభుజి ఆకారం నౌకాదళం యొక్క సమగ్ర దృష్టి మరియు చేరువకు ప్రతీక.
- క్రాస్డ్ స్వోర్డ్ మరియు టెలిస్కోప్ చిహ్నాలు నావికాదళం యొక్క ద్వంద్వ స్వభావాన్ని సూచిస్తాయి. కత్తి దాని తిరుగులేని సంకల్పాన్ని సూచిస్తే, టెలిస్కోప్ దాని వ్యూహాత్మక దూరదృష్టిని హైలైట్ చేస్తుంది.
ఈ కొత్త ఎపాలెట్‌లు కేవలం దృశ్య మార్పు కోసం కంటే వలసరాజ్యాల అవశేషాలను తొలగించడానికి మరియు భారతదేశం యొక్క ప్రత్యేకమైన సముద్ర వారసత్వాన్ని స్వీకరించడానికి డిజైన్ చేసినట్లు తెలుస్తుంది.మరాఠా యోధ రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిహ్నంలోని అంశాలు భారతదేశం యొక్క సముద్ర పరాక్రమం మరియు వ్యూహాత్మక ఆలోచనలకు నివాళులర్పిస్తూ సూక్ష్మంగా దీనిలో పొందుపరచబడ్డాయి.
ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆధ్వర్యంలో, మరాఠా నావికాదళం 500 కంటే ఎక్కువ నౌకలతో క్రూరమైన శక్తిగా నాడు అభివృద్ధి చెందింది. తన ఆధునిక నౌకాదళంతో, శివాజీ ఉత్తర కొంకణ్‌లోని అప్పటి పాలకులు సిద్దిల నుండి టేల్, ఘోసాలే, దండా మరియు రాజపురి వంటి కీలకమైన కోటలను జయించగలిగాడు. కొంకణ్ తీరం వెంబడి విజయదుర్గ్, సింధుదుర్గ్ మరియు అనేక ఇతర తీరప్రాంత కోటలను కూడా నిర్మించాడు. వీటితో పాటుగా గూఢచార సేకరణ కోసం కొన్ని వ్యూహాత్మక నౌకా స్థావరాలను కూడా నాడు అభివృద్ధి చేశాడు.
సిఐఎస్‌ఎఫ్ మొదటి మహిళా డైరెక్టర్ జనరల్‌గా నీనా సింగ్
రాజస్థాన్ రాష్ట్ర మొదటి మహిళా ఐపీఎస్ అధికారిణి నీనా సింగ్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ యొక్క మొదటి మహిళా చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ గౌరవప్రదమైన స్థానానికి నాయకత్వం వహించిన మొదటి మహిళగా ఒక చారిత్రాత్మక మైలురాయిని లిఖించారు. గతంలో స్పెషల్ డిజిగా పనిచేసిన నీనా సింగ్, 2023 ఆగస్టు 31న పదవీ విరమణ చేశారు.
నీనా గతంలో రాజస్థాన్ రాష్ట్ర పోలీసు దళంలో ఆరుగురు డీజీ-ర్యాంక్ అధికారులలో ఉన్నత పోలీసు పోస్టును నిర్వహించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది. అలానే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)లో ఆమె ఆరేళ్ళు సేవలు అందించారు. ఈ సమయంలో షీనా బోరా హత్య మరియు జియా ఖాన్ ఆత్మహత్య వంటి ఉన్నత స్థాయి కేసులను ఆమె పర్యవేక్షించారు.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రింద భారతదేశంలోని ఒక సమాఖ్య పోలీసు సంస్థ. ఇది కేంద్ర సాయుధ పోలీసు బలగాలలో ఒకటి. ఇది భారతదేశం అంతటా ఉన్న 356 పారిశ్రామిక యూనిట్లు, ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మరియు సంస్థలకు భద్రతను అందిస్తుంది. దీనిని 1969లో స్థాపించారు.
ఐటీబీపీ నూతన డైరెక్టర్ జనరల్‌గా రాహుల్ రస్గోత్రా
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) కొత్త డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి రాహుల్ రస్గోత్రా నియమితులయ్యారు. రాహుల్ రస్గోత్ర మణిపూర్ కేడర్‌కు చెందిన 1989-బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి. రాహుల్ రస్గోత్రా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)లో ప్రత్యేక డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు.
ఇండో -టిబెటన్ బోర్డర్ పోలీస్ అనేది టిబెట్ అటానమస్ రీజియన్‌తో సరిహద్దుల వెంబడి మోహరించిన ఒక ప్రత్యేక సరిహద్దు రక్షణ దళం. ఇది ఐదు కేంద్ర సాయుధ పోలీసు బలగాలలో ఒకటి. దీనిని 1962లో ఏర్పాటు చేసారు. ఇది జమ్మూ & కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్‌ల వెంబడి భారతదేశం-చైనా సరిహద్దును కాపాడుతోంది. వీరు జమ్మూ & కాశ్మీర్‌లోని కారకోరం పాస్ నుండి అరుణాచల్ ప్రదేశ్‌లోని జాచెప్ లా వరకు మోహరించి ఉంటారు.
సిఆర్‌పిఎఫ్ నూతన డైరెక్టర్ జనరల్‌గా అనీష్ దయాళ్ సింగ్
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) నూతన డైరెక్టర్ జనరల్‌గా అనిష్ దయాల్ సింగ్ నియమితులయ్యారు. అనిష్ దయాల్ ఇదివరకు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)కి నేతృత్వం వహించారు. అనిష్ దయాల్ మణిపూర్ కేడర్‌కు చెందిన 1988-బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనేది భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారం క్రింద భారతదేశంలోని రిజర్వ్ జెండర్‌మేరీ మరియు అంతర్గత పోరాట దళం. ఇది ఐదు కేంద్ర సాయుధ పోలీసు బలగాలలో ఒకటి. దీనిని 1939లో ఏర్పాటు చేశారు. ఇది దేశంలో శాంతిభద్రతలను మరియు తిరుగుబాటు వ్యవహారాలను ఎదుర్కోవడానికి రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు సహాయం అందిస్తుంది.
సెంట్రల్ ఫైర్ సర్వీస్, సివిల్ డిజిగా వివేక్ శ్రీవాస్తవ
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్ మరియు హోంగార్డుల డైరెక్టర్ జనరల్‌గా వివేక్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. వివేక్ శ్రీవాస్తవ గుజరాత్ కేడర్‌కు చెందిన 1989-బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి. ఈయన జూన్ 30, 2025 వరకు అంటే అతని పదవీ విరమణ తేదీ వరకు ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. వీరు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తరపున పౌర రక్షణ, హోంగార్డులు మరియు అగ్నిమాపక సేవలను పెంచడం, శిక్షణ & సన్నద్ధం చేయడం వంటి విధులు నిర్వర్తిస్తారు.
డైరెక్టరేట్ జనరల్, సివిల్ డిఫెన్స్‌ను 1962 నవంబర్ 17న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో స్థాపించబడింది. 7 జనవరి 2003 నుండి దీనికి విపత్తు నిర్వహణ విభాగం జోడించబడింది. 2004లో దీనిని డైరెక్టర్ జనరల్, నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫోర్స్ మరియు సివిల్ డిఫెన్స్‌గా మార్పు చేసారు. తిరిగి 2006లో డైరెక్టర్ జనరల్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ & సివిల్ డిఫెన్స్‌గా నియమించబడింది. అయితే 2014 ఇది డైరెక్టర్ జనరల్, ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ మరియు హోంగార్డ్స్‌గా పేరుతొ సేవలు అందిస్తుంది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అడ్వైజరీ ప్యానెల్‌కు అక్కల సుధాకర్
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ బిల్డర్ అక్కల సుధాకర్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అడ్వైజరీ ప్యానెల్‌కు నియమితులయ్యారు. ఈ ప్రతిష్టాత్మక నియామకం వచ్చే రెండు సంవత్సరాల కాలానికి అమలులో ఉంటుంది. అక్కల సుధాకర్ హైదరాబాద్‌లోని మంచిర్యాల జిల్లాకు చెందిన వారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అనేది భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖలోని చట్టబద్ధమైన చలనచిత్ర-ధృవీకరణ సంస్థ. "సినిమాటోగ్రాఫ్ చట్టం 1952లోని నిబంధనల ప్రకారం చలనచిత్రాల పబ్లిక్ ఎగ్జిబిషన్‌ను నియంత్రిస్తుంది. దీనిని 1951లో స్థాపించారు. ప్రస్తుత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్‌గా ప్రసూన్ జోషి సేవలు అందిస్తున్నారు.
నౌకాదళంలోకి నాల్గవ మిస్సైల్ కమ్ ఎమ్యునిషన్ బార్జ్
భారతీయ నావికాదళం ఇటీవల తన నాల్గవ మిస్సైల్ కమ్ ఎమ్యునిషన్ బార్జ్, ఎల్ఎస్ఎఎం 10 (యార్డ్ 78) ప్రవేశపెట్టింది. డిసెంబర్ 28న ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో దీనిని నౌకాదళానికి అందజేశారు. వీటిని విశాఖపట్నానికి చెందిన సెకాన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేశాయి. ఈ బార్జ్ మోడల్ టెస్టింగ్ విశాఖపట్నంలోని నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీలో జరిగింది. ఈ బార్జ్‌లు భారత ప్రభుత్వ యొక్క మేక్ ఇన్ ఇండియా చొరవలో భాగం.
రక్షణ మంత్రిత్వ శాఖ 19 ఫిబ్రవరి 2021లో విశాఖపట్నానికి చెందిన సెకాన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఒప్పందంపై సంతకం చేసింద. ఈ ఎంఓయూ ప్రకారం సదురు సంస్థ 08 మిస్సైల్ కమ్ ఎమ్యునిషన్ బార్జ్‌లు రూపొందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం నాలుగు బార్జ్‌లు డెలివిరీ చేయబడ్డాయి. రాబోయే సంవత్సరాల్లో మిగిలిన నాలుగు అందించబడతాయి.
మిస్సైల్ కమ్ ఎమ్యునిషన్ బార్జ్ అనేది క్షిపణులు, మందుగుండు సామాగ్రి మరియు ఇతర కీలకమైన సామాగ్రిని భారత నౌకాదళానికి రవాణా చేయడానికి మరియు నిల్వ చేయడానికి రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన నౌక. ఇవి నావికాదళ యుద్ధనౌకల యొక్క కార్యాచరణ సంసిద్ధతను నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.