Advertisement
28th డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్ | Today Current affairs in Telugu
Telugu Current Affairs

28th డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్ | Today Current affairs in Telugu

28th December 2023 Current affairs in Telugu. పోటీ పరీక్షల రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో పొందండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షల కొరకు సిద్దమవుతున్న ఆశావహులకు ఉపయోగపడతాయి.

నేషనల్ ట్రాన్సిట్ పాస్‌ను ప్రారంభించిన భూపేందర్ యాదవ్

కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ దేశవ్యాప్తంగా కలప, వెదురు మరియు ఇతర అటవీ ఉత్పత్తుల సులభతర రవాణా కోసం నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ (ఎన్‌టిపిఎస్‌) అనే వన్ నేషన్-వన్ పాస్‌ను ప్రారంభించారు. ఈ చొరవ దేశవ్యాప్తంగా మొక్కల పెంపకందారులకు, రైతులకు ఏకీకృత ఆన్‌లైన్ మోడ్‌ను అందించడం ద్వారా కలప రవాణా అనుమతుల జారీని క్రమబద్ధీకరిస్తుంది, అలానే సంబంధిత వ్యాపారాన్ని సులభతరం చేయడానికి దోహదం చేస్తుంది.

ఎన్‌టిపిఎస్‌ ప్రవేశపెట్టడానికి ముందు అటవీ ఉత్త్పతుల రవాణా సమయంలో వివిధ రాష్ట్రాల నుండి ప్రత్యేక రవాణా అనుమతులను పొందాల్సి ఉండేది. దీని వలన రాష్ట్రాల అంతటా కలప మరియు అటవీ ఉత్పత్తులను రవాణా చేయడంలో అడ్డంకులు ఏర్పడేవి. ప్రతి రాష్ట్రం దాని స్వంత రవాణా నిబంధనలను కలిగి ఉండటం వలన, కలప లేదా అటవీ ఉత్పత్తులను రాష్ట్రాల అంతటా రవాణా చేయడానికి, ప్రతి రాష్ట్రంలో జారీ చేయబడిన ప్రత్యేక రవాణా పాస్‌ను పొందవలసి ఉండేది. ఈ కొత్త చొరవ వన్ నేషన్-వన్ పాస్‌ సదుపాయంతో ఈ ప్రక్రియను సులభతరం చేస్తుంది.

ఎన్‌టిపిఎస్‌ దీనికి సంబంధించి అతుకులు లేని రవాణా అనుమతులను అందిస్తుంది. అలానే ప్రైవేట్ భూములు, ప్రభుత్వ యాజమాన్యంలోని అటవీ మరియు ప్రైవేట్ డిపోల వంటి వివిధ వనరుల నుండి సేకరించిన కలప, వెదురు మరియు ఇతర అటవీ ఉత్పత్తుల యొక్క అంతర్-రాష్ట్ర రవాణా కోసం ప్రత్యేక రికార్డులను నిర్వహిస్తుంది. ప్రస్తుతం 25 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ఉత్పత్తిదారులు, రైతులు మరియు రవాణాదారుల కోసం దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు.

పబ్లిక్ సెక్టార్ రిక్రూట్‌మెంట్ కోసం కొత్త బోర్డును ఏర్పాటు చేసిన కేరళ

రాష్ట్రంలో ప్రభుత్వ రంగ రిక్రూట్‌మెంట్‌లో పారదర్శకత మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కొత్తగా కేరళ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ అండ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్‌ను ఏర్పాటు చేశారు. ఈ బోర్డు కేరళలోని పబ్లిక్ సెక్టార్ యూనిట్‌ల కోసం న్యాయమైన మరియు పారదర్శకమైన రిక్రూట్‌మెంట్ ప్రక్రియలను నిర్వహించే స్వయంప్రతిపత్త సంస్థగా సేవలు అందిస్తుంది.

రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ బోర్డు ఏర్పాటు చేయబడింది. బోర్డు నిర్వహించే రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పారదర్శకతతో అన్ని రకాల రిజర్వేషన్ నియమాలకు కట్టుబడి ఉంటుంది. ఈ బోర్డు పరిశ్రమ మరియు వాణిజ్య శాఖ యొక్క పరిపాలనా నియంత్రణలో ఉన్న 20 ప్రభుత్వ రంగ సంస్థలలో వివిధ పోస్టుల ఎంపిక ప్రక్రియకు బాధ్యత వహిస్తుంది.

భారతదేశ క్రిప్టో హబ్‌గా ఢిల్లీకి అగ్రస్థానం

ఢిల్లీ, దేశంలోనే అత్యధిక శాతం క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులను కలిగి ఉన్నట్లు ప్రముఖ భారతీయ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ యా కాయిన్ స్విచ్ వెల్లడించింది. ఇది దేశంలో 8.8 శాతం వాటాను క్లెయిమ్ చేస్తూ, ముంబై కంటే ఆధిక్యంలో ఉందని ఈ సంస్థ వెల్లడించింది. దేశంలో వచ్చిన మొత్తం క్రిప్టో పెట్టుబడులలో 20 శాతం ఢిల్లీ, బెంగుళూరు మరియు ముంబైలలో కేంద్రీకృతమైనట్లు ఈ క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ నివేదించింది.

కాయిన్‌స్విచ్ నివేదిక ప్రకారం, ఈ ఏడాది భారతదేశం యొక్క క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారుల సంఖ్య 1.9 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో క్రిప్టో మార్కెట్‌లో మహిళల భాగస్వామ్యం 9% ఉన్నట్లు తెలిపింది. ఢిల్లీ మరియు హైదరాబాద్‌లలో అత్యధిక మహిళా పెట్టుబడిదారులు ఉన్నట్లు తెలిపింది. అలానే మొత్తం పెట్టుబడిదారులలో దాదాపు 75% పెట్టుబడిదారులు 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు. 34.27% పెట్టుబడిదారులు 26 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నట్లు పేర్కొంది.

చైనా యొక్క లాంగ్ మార్చ్-11 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

చైనా యొక్క లాంగ్ మార్చ్-11 క్యారియర్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. మూడు ఉపగ్రహాలతో దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని తైయువాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుండి ఈ రాకెట్‌ను ప్రయోగించింది. ఈ ఉపగ్రహాలను ప్రధానంగా అంతరిక్ష శాస్త్ర సాంకేతిక ప్రయోగాల కోసం వినియోగించనున్నారు. ఇది లాంగ్ మార్చ్ క్యారియర్ రాకెట్ సిరీస్‌లో 503వ మిషన్.

లాంగ్ మార్చ్ 11 రాకెట్‌ను చైనా అకాడమీ ఆఫ్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. ఇది 20.8 మీటర్ల పొడవు, 58 మెట్రిక్ టన్నుల లిఫ్ట్‌ఆఫ్ బరువు మరియు 2 మీటర్ల వ్యాసంతో ఉంటుంది. ఇది తక్కువ-భూమి కక్ష్యలోకి ఉపగ్రహాలను రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది.

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రైల్వే స్టేషన్‌ పేరు మార్పు

కొత్తగా పునఃనిర్మించిన ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య రైల్వే జంక్షన్ అధికారికంగా అయోధ్య ధామ్ జంక్షన్‌గా పేరు మార్చబడింది. వచ్చే జనవరిలో ప్రారంభం కానున్న అయోధ్య రామ మందిరంకు వచ్చే భక్తుల సౌలభ్యం కోసం ఈ రైల్వే స్టేషన్ ఆధునీకరించారు. దీనిని ఈ ఏడాది డిసెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు.

ఈ పేరు మార్పు, శ్రీరాముని జన్మస్థలంగా మరియు ప్రముఖ హిందూ తీర్థయాత్రగా అయోధ్య యొక్క గౌరవప్రదమైన స్థితిని ప్రతిబింబిస్తుంది. అయోధ్యను ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కేంద్రంగా చూసే అనేక మంది భక్తులు మరియు నివాసితుల మనోభావాలతో ఇది సరితూగుతుంది. ఈ కొత్త పేరు అయోధ్య యొక్క ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా, ముఖ్యంగా మతపరమైన పర్యాటక ప్రాంతాన్ని బలపరుస్తుంది.

చట్టవిరుద్ధమైన సంఘంగా ముస్లిం లీగ్ జమ్మూ కాశ్మీర్

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ముస్లిం లీగ్ జమ్మూ కాశ్మీర్ (మసరత్ ఆలం వర్గం)ను ఉపా చట్టం కింద చట్టవిరుద్ధమైన సంఘంగా ప్రకటించింది. ఈ సంస్థ మరియు దాని సభ్యులు దేశ వ్యతిరేక మరియు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో వేర్పాటువాద కార్యకలాపాలకు, తీవ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నట్లు పేర్కొంది. అలానే ఈ వర్గం జమ్మూ మరియు కాశ్మీర్ ప్రాంతంలో ప్రత్యేక ఇస్లామిక్ పాలనను స్థాపించడానికి ప్రజలను ప్రేరేపిస్తున్నట్లు ఆరోపించింది.

ఈ సంస్థపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం 1967, ఐపీసీ 1860, ఆయుధాల చట్టం 1959 మరియు రణబీర్ పీనల్ కోడ్ 1932లోని వివిధ సెక్షన్ల కింద అనేక క్రిమినల్ కేసులు నమోదు చేసింది. దీనితో పాటుగా ఈ ప్రాంతంలో తీవ్రవాదానికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేసేందుకు అన్‌లాఫుల్ అసోసియేషన్ కింద రెండు సంస్థలను,  టెర్రరిస్ట్ సంస్థల కింద్ మరో నాలుగు సంస్థలను నిషేదించింది. వీటికి సంబందించిన ఆరు వ్యక్తులను ఉగ్రవాదులుగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Post Comment