తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 29 ఫిబ్రవరి 2024
February Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 29 ఫిబ్రవరి 2024

తెలుగులో 29 ఫిబ్రవరి 2024 కరెంట్ అఫైర్స్ అంశాలను చదవండి. వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం.

Advertisement

ఫ్రెంచ్ ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ పియర్ షిల్‌కు గార్డ్ ఆఫ్ హానర్

ఫ్రెంచ్ ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ పియర్ షిల్ ఇటీవలి భారత పర్యటన సందర్భంగా ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు. ఫిబ్రవరి 27 నుండి 29 వరకు భారతదేశ పర్యటనలో ఉన్న ఆయన, ఫిబ్రవరి 27 న నేషనల్ వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచే కార్యక్రమంతో ఈ పర్యటన ప్రారంభించారు, ఏ సంధర్బంగా దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన భారత సాయుధ దళాల అమర వీరులకు నివాళులర్పించారు.

తర్వాత భారత ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే మరియు సాయుధ దళాల ఇతర సీనియర్ సైనిక నాయకత్వంతో చర్చలు జరిపారు. వీరు ఇరు సైన్యాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంతో సహా వివిధ సమకాలీన సమస్యలపై ఆలోచనలు మరియు నిర్మాణాత్మక చర్చలు జరిపారు.

ఈ పర్యటనలో ఆయన భారత రక్షణ పరిశ్రమ ప్రతినిధులతో కూడా సంభాషించారు. రాజస్థాన్‌లోని పినాకా రాకెట్ లాంచింగ్ సిస్టమ్‌ను తిలకించారు, అలానే జైపూర్‌లోని సప్త శక్తి కమాండ్‌ను కూడా సందర్శించి సీనియర్ సైనిక కమాండర్లతో సంభాషించారు. 29 ఫిబ్రవరిన ప్రతిష్టాత్మకమైన నేషనల్ డిఫెన్స్ కాలేజీలో అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు.

  • గతంలో 2022 లో మాజీ ఫ్రెంచ్ నేవీ చీఫ్ అడ్మిరల్ పియరీ వాండియర్‌కు కూడా భారత పర్యటన సందర్భంగా ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ గౌరవం అందించారు.
  • హానర్ ఆఫ్ గార్డ్ లేదా సెరిమోనియల్ గార్డ్ అనేది సాధారణంగా మిలిటరీ నుండి తీసుకోబడిన వ్యక్తుల సమూహం.
  • ప్రముఖల వివాహ వేడుక లేదా అధికారిక సందర్శన వంటి ప్రత్యేక సందర్భంలో సైనికుల బృందం చేత ఈ గౌరవం అందించబడుతుంది.
  • ఈ గౌరవం సైనిక ఫార్మాలిటీకి చిహ్నంగా, వారి ఉనికి లేదా ఆ సందర్భానికి గంభీరత మరియు గొప్పతనాన్ని జోడిస్తుంది.

ఈ ఉన్నత స్థాయి పర్యటన భారతదేశం మరియు ఫ్రాన్స్‌ల మధ్య, ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి పెరుగుతున్న వ్యూహాత్మక కలయికను సూచిస్తుంది. రెండు దేశాలు ఈ ప్రాంతంలో చైనా యొక్క దృఢమైన చర్యల గురించి ఆందోళనలను ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రాంతంలో ప్రాంతీయ స్థిరత్వాన్ని కొనసాగించడానికి ఇరుదేశాల మధ్య మెరుగైన రక్షణ సహకారం అవసరం.

ఉజ్బెకిస్థాన్ మారియన్ బయోటెక్ దగ్గు సిరప్‌ కలుషిత కేసులో 23 మందికి జైలు శిక్ష

68 మంది చిన్నారుల ప్రాణాలను బలిగొన్న మారియన్ బయోటెక్ దగ్గు సిరప్‌ కలుషిత కేసులో ఉజ్బెకిస్థాన్‌ న్యాయస్థానం ఒక భారతీయ పౌరుడితో సహా 23 మందికి రెండు నుండి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించింది. పన్ను ఎగవేత, నాసిరకం లేదా నకిలీ మందుల విక్రయం, కార్యాలయ దుర్వినియోగం, నిర్లక్ష్యం, ఫోర్జరీ మరియు లంచం వంటి వివిధ కేసుల కింద వీరికి శిక్ష విధించబడింది.

ఉజ్బెకిస్తాన్‌లో భారతదేశానికి చెందిన మారియన్ బయోటెక్ ఉత్పత్తి చేసిన మందులను విక్రయించిన క్యూరామాక్స్ మెడికల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగ్ రాఘవేంద్ర ప్రతార్‌కు అత్యధికంగా 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలానే దిగుమతి చేసుకున్న మందులకు లైసెన్సు ఇచ్చే బాధ్యతలను నిర్వర్తించిన మాజీ ఉజ్బెకిస్తాన్‌ సీనియర్ అధికారులకు కూడా సుదీర్ఘ శిక్షలు విధించారు.

కలుషిత దగ్గు సిరప్ తాగడం వల్ల మరణించిన 68 మంది పిల్లల కుటుంబాలకు, అలాగే వికలాంగులైన మరో నలుగురు పిల్లలకు $80,000 యూఎస్ డాలర్ల పరిహారం చెల్లించాలని తాష్కెంట్ కోర్టు నిర్ణయించింది. అలానే డ్రగ్ బారిన పడిన మరో ఎనిమిది మంది పిల్లల తల్లిదండ్రులు $16,000 నుండి $40,000 వరకు పరిహారం అందించాలని తీర్పు ఇచ్చింది. దోషుల్లో ఏడుగురి నుంచి ఈ పరిహారం సొమ్మును వసూలు చేయనున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటనలో పేర్కొంది.

  • ఇథిలీన్ గ్లైకాల్ అనే విషపూరిత పారిశ్రామిక ద్రావకంతో కలుషితమైన దగ్గు సిరప్‌ను పిల్లలు వినియోగించిన తర్వాత 2022 మరియు 2023లో ఈ మరణాలు సంభవించాయి.
  • సిరప్, డాక్-1 మాక్స్ పేరుతొ భారతదేశంలోని ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన మారియన్ బయోటెక్ వీటిని ఉత్పత్తి చేసింది.
  • ఉజ్బెకిస్తాన్‌లో క్యూరామాక్స్ మెడికల్ వీటిని స్థానికంగా పంపిణీ చేసింది.
  • ఈ కలుషితమైన దగ్గు సిరప్ కుంభకోణం ఉజ్బెకిస్తాన్‌లో రాజకీయ మరియు ప్రజల ఆగ్రహానికి దారితీసింది.
  • ఉజ్బెకిస్తాన్‌ ప్రభుత్వం  వెంటనే అన్ని మారియన్ బయోటెక్ ఉత్పత్తుల అమ్మకాలను ఆ దేశంలో తాత్కాలికంగా నిలిపివేసించి.
  • దాదాపు ఆరు నెలల సుదీర్ఘ విచారణ తర్వాత ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్ న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చింది.

ఈ కేసు ఔషధ పరిశ్రమలో బలమైన భద్రతా నిబంధనల యొక్క ప్రాముఖ్యతను మరియు సరిహద్దుల్లో పంపిణీ చేయబడిన మందుల నాణ్యత మరియు భద్రతను నిర్ధారించడానికి అంతర్జాతీయ సహకారం యొక్క అవసరాన్ని హైలైట్ చేస్తుంది.

కాన్పూర్‌లో దక్షిణాసియాలోనే అతిపెద్ద మందుగుండు సామగ్రి సముదాయం ప్రారంభం

అదానీ డిఫెన్స్ & ఏరోస్పేస్ భారతదేశంలోని సాయుధ బలగాలు, పారామిలిటరీ దళాలు మరియు పోలీసుల కోసం దేశంలో మొట్టమొదటి మందుగుండు-క్షిపణి తయారీ కాంప్లెక్స్‌ను ఆవిష్కరించింది. దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో అదానీ గ్రూప్ నిర్మిస్తున్న ఈ పరిశ్రమ దక్షిణాసియాలోనే అతిపెద్ద మందుగుండు సామగ్రి మరియు క్షిపణి సముదాయంగా నిలవనుంది.

రక్షణ తయారీలో భారతదేశం యొక్క స్వావలంబనకు గణనీయమైన ప్రోత్సాహంతో, అదానీ గ్రూప్, దాని అనుబంధ సంస్థ అయిన అదానీ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ దీనిని నిర్మిస్తుంది. ఇది దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రంగ మందుగుండు సామగ్రి మరియు క్షిపణి తయారీ సముదాయంగా అవతరించింది.

  • ఈ అత్యాధునిక మందుగుండు సామగ్రి తయారీ కేంద్రంను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరియు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే ప్రారంభించారు.
  • ఈ అతిపెద్ద మందుగుండు సామగ్రి తయారీ కేంద్రం, దిగుమతి చేసుకున్న ఆయుధాలపై భారతదేశం ఆధారపడటాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది.
  • ఈ కాంప్లెక్స్ భారత సైన్యం, పారామిలిటరీ బలగాలు మరియు పోలీసుల యొక్క క్లిష్టమైన అవసరాలను తీర్చడానికి 155ఎంఎం ఫిరంగి షెల్స్‌తో సహా అనేక రకాల మందుగుండు సామగ్రిని తయారు చేస్తుంది.
  • మొదటి దశలో దేశీయ ఉత్పత్తి కోసం 32 మందుగుండు సామగ్రి తయారీని జాబితా చేసింది. భవిష్యత్తులో ఈ సంఖ్యను విస్తరించే యోచనలో ఉన్నట్లు జనరల్ పాండే హైలైట్ చేశారు.
  • ఈ ప్రాజెక్ట్ సుమారు 4,000 ఉద్యోగాలను సృష్టించి, ఈ ప్రాంతంలో గణనీయమైన ఉపాధి అవకాశాలను అందిస్తుందని భావిస్తున్నారు.
  • ఈ చొరవ దేశీయ రక్షణ తయారీ సామర్థ్యాలను పెంపొందించడానికి ప్రభుత్వం యొక్క "మేక్ ఇన్ ఇండియా" పుష్‌తో జతకట్టింది.

జేకే జమాతే ఇస్లామీపై ఐదేళ్ల పాటు నిషేధాన్ని పొడిగించిన కేంద్రం

చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా చట్టం) 1967లోని సెక్షన్ 3(1) ప్రకారం భారత ప్రభుత్వం 'జమాత్-ఇ-ఇస్లామీ జమ్మూ కాశ్మీర్‌ని మరో 5 సంవత్సరాల పాటు 'చట్ట విరుద్ధమైన సంఘం'గా ప్రకటించింది. ఉగ్రవాదం మరియు వేర్పాటువాదానికి వ్యతిరేకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యొక్క జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తూ, ప్రభుత్వం జమాత్‌పై నిషేధాన్ని పొడిగించినట్లు కేంద్ర హోంమంత్రి చెప్పారు.

దేశం యొక్క భద్రత, సమగ్రత మరియు సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఈ సంస్థ తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు హోమ్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఘోరమైన పుల్వామా దాడి తరువాత జమాత్-ఇ-ఇస్లామీ జమ్మూ కాశ్మీర్‌ని 28 ఫిబ్రవరి 2019లో మొదటిసారి చట్టవిరుద్ధమైన సంఘంగా ప్రకటించారు. ఫిబ్రవరి 2019లో జేఐపై విధించిన ఐదేళ్ల నిషేధం గడువు ఈ ఏడాదితో ముగియడంతో ప్రభుత్వం దానిని మరో ఐదేళ్లకు పొడిగించింది.

జమాతే ఇస్లామీ జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదాన్ని ఇప్పటికి పెంచి పోషిస్తూనే ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తుంది. భారతదేశ సార్వభౌమాధికారం, భద్రత మరియు సమగ్రతకు విఘాతం కలిగించే విదంగా జమ్మూ మరియు కాశ్మీర్‌లో వేర్పాటువాదానికి ఆజ్యం పోస్తూ, భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. జమాతే ఇస్లామీ జమ్మూ కాశ్మీర్ మరియు దాని సభ్యులపై చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967తో సహా వివిధ సెక్షన్ల కింద అనేక క్రిమినల్ కేసులు ఇప్పటికే నమోదు చేయబడ్డాయి.

అయితే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ చావ్లా నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన ట్రిబ్యునల్ ఇప్పుడు జేఐపై నిషేధాన్ని సమర్థించేందుకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయో లేదో నిర్ణయిస్తుంది. ట్రిబ్యునల్ హోమ్ మంత్రిత్వ శాఖ సమర్పించిన సాక్ష్యాలను సమీక్షిస్తుంది. తీర్పును వెలువరించే ముందు జేఐ నుండి వాదనలు కూడా వింటుంది.

ఈ నిషేధంపై మానవ హక్కుల సంఘాలు గతంలో కాశ్మీర్‌లో ఉపా చట్టం ఉపయోగాన్ని విమర్శించాయి, "చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు" దాని విస్తృత మరియు అస్పష్టమైన నిర్వచనాలను ఉటంకిస్తూ. ఇటువంటి నిషేధాలు రాజకీయ అసమ్మతిని అణచివేస్తాయని మరియు ఈ ప్రాంతంలో శాంతి ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయని వారు నాడు వాదించారు.

అయితే ట్రిబ్యునల్ తీర్పు జమ్మూ కాశ్మీర్‌లో జేఐ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నిషేధాన్ని సమర్థిస్తే, సంస్థ ఈ ప్రాంతంలో చట్టబద్ధంగా పనిచేయదు. అయితే, ట్రిబ్యునల్ నిషేధానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే, జేఐ తన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించవచ్చు.

లోక్‌పాల్ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అజయ్ మాణిక్‌రావ్ ఖాన్విల్కర్

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ మాణిక్‌రావ్ ఖాన్విల్కర్‌ను లోక్‌పాల్ చైర్‌పర్సన్‌గా నియమించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో మార్చి 10న ప్రమాణం చేయించారు. జస్టిస్ ఖాన్విల్కర్ 2016 నుండి జూలై 2022 వరకు సుప్రీంకోర్టులో పనిచేశారు.

దాదాపు రెండేళ్లపాటు ఖాళీగా ఉన్న పోస్టును ప్రభుత్వం తాజాగా భర్తీ చేసింది. మే 27, 2022న పినాకి చంద్ర ఘోష్ ఈ పదవీ విరమణ చేయడంతో దాదాపు రెండేళ్లుగా ఈ పదవి ఖాళీగా ఉంది. జార్ఖండ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ప్రదీప్ కుమార్ మొహంతి తాత్కాలిక లోక్‌పాల్‌ చైర్‌పర్సన్‌గా ఇంత వరకు బాధ్యతలు స్వీకరించారు.

లోక్‌పాల్ చైర్‌పర్సన్‌తో పాటుగా ముగ్గురు న్యాయవ్యవస్థ సభ్యులు మరియు ఆరుగురు సభ్యులను లోక్‌పాల్‌లో ప్రభుత్వం నియమించింది. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి లింగప్ప నారాయణ స్వామి, అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సంజయ్ యాదవ్, కర్ణాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మరియు లా కమిషన్ చైర్‌పర్సన్ రీతు రాజ్ అవస్తీలు న్యాయవ్యవస్థ సభ్యులుగా ఉన్నారు.

నాన్-జుడీషియల్ సభ్యులలో మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర, గుజరాత్ మాజీ చీఫ్ సెక్రటరీ పంకజ్ కుమార్ మరియు మాజీ గ్రామీణాభివృద్ధి కార్యదర్శి అజయ్ టిర్కీ ఉన్నారు. ఈ నియామకాలు ఉన్నత స్థానాల్లో అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో లోక్‌పాల్‌ను పునరుజ్జీవింపజేస్తుందని భావిస్తున్నారు.

  • లోక్‌పాల్ మరియు లోకాయుక్త చట్టం 2013 లో ఏర్పాటు చేయబడింది.
  • ఇది ప్రధానమంత్రి, మంత్రులు మరియు పార్లమెంటు సభ్యులతో సహా ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తుంది.
  • అయితే రాజకీయ జోక్యంతో లోక్‌పాల్ పనితీరు గత పదేళ్లలో దాదాపు శున్యం. అవినీతి కేసుల విచారణలో జాప్యంపై ఈ సంస్థ అనేక విమర్శలను ఎదుర్కొంటోంది.

అస్సాం పబ్లిక్ ఎగ్జామినేషన్‌ బిల్లు 2024 ఆమోదం

అస్సాం పబ్లిక్ ఎగ్జామినేషన్ (రిక్రూట్‌మెంట్‌లో అన్యాయమైన మార్గాలను నిరోధించే చర్యలు) బిల్లు 2024, అస్సాం శాసనసభలో వాయిస్ ఓటు ద్వారా ఆమోదించబడింది. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రవేశపెట్టిన ఈ బిల్లు, రాష్ట్ర ప్రభుత్వం మరియు దాని వివిధ సంస్థలు నిర్వహించే రిక్రూట్‌మెంట్ పరీక్షలలో అక్రమాలను అరికట్టడానికి మరియు జరిమానా విధించడానికి కఠినమైన చర్యలను ప్రతిపాదించింది.

  • ఈ బిల్లు రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో ఎవరైనా అన్యాయానికి పాల్పడితే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు రూ. 10 కోట్ల వరకు జరిమానా విదిస్తుంది.
  • అంతేకాకుండా అన్యాయమైన మార్గాల్లో ప్రవర్తించిన పరీక్షకుడికి మూడేళ్ల వరకు జైలుశిక్ష మరియు కనీసం లక్ష జరిమానా మరియు చెల్లించడంలో విఫలమైతే మరో తొమ్మిది నెలల జైలు శిక్ష విధించబడుతుందని ఈ బిల్లు పేర్కొంది.
  • చీటింగ్‌కు పాల్పడిన అభ్యర్థులను రెండేళ్లపాటు ఏ పబ్లిక్ పరీక్షకు హాజరుకాకుండా డిబార్ చేయడానికి కూడా చట్టం అధికారులకు అధికారం ఇస్తుంది.
  • అనధికార కేంద్రాలలో పరీక్షలు నిర్వహించే వారికి జరిమానా విధించడం ద్వారా ఈ బిల్లు పరీక్షకులకు మించి తన పరిధిని విస్తరించింది.
  • పరీక్షా వేదికల దుర్వినియోగం మరియు వ్యవస్థీకృత చీటింగ్ కార్యకలాపాలను అరికట్టడం దీని లక్ష్యం.

ఈ చట్టం ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్ ప్రయోజనాల కోసం పబ్లిక్ పరీక్షలను లక్ష్యంగా చేసుకుంది. ఇది అర్హులైన అభ్యర్థులకు స్థాయిని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. రిక్రూట్‌మెంట్ పరీక్షలలో అన్యాయమైన మార్గాలు అస్సాంలో చాలా కాలంగా ఆందోళన కలిగిస్తున్నాయి, లీక్‌లు, వంచన మరియు వ్యవస్థీకృత చీటింగ్ రింగ్‌ల నివేదికలు ఉన్నాయి.

ఈ బిల్లుతో పాటుగా రాష్ట్రంలో 12వ తరగతి వరకు విద్యావ్యవస్థను నియంత్రించేందుకు కొత్త సంస్థను రూపొందించడం కోసం అస్సాం స్టేట్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ బిల్లు, 2024ను కూడా సభ ఆమోదించింది. ఇది పరీక్షలను నిర్వహించడం మరియు సర్టిఫికెట్లు అందజేయడం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తుంది. అయితే విద్యా సంస్థల పాఠ్యాంశాలు లేదా మూల్యాంకనాన్ని నిర్ణయించడంలో ఇది ప్రమేయం ఉండదు.

రాజ్యసభ ఎన్నికల ఫలితాలు 2024

56 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఫిబ్రవరి 27న జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 15 రాష్ట్రాల్లోని ఈ 56 స్థానాల్లో 41 స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరగగా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ మరియు కర్ణాటక వంటి రాష్ట్రాల సీట్లు కోసం ఎన్నికలు నిర్వహించారు.

గుజరాత్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, ఉత్తరాఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఒడిశాలోని 41 సీట్లు,  ఆయా పార్టీల అసెంబ్లీ ప్రాతినిధ్యం ఆధారంగా ఏకగ్రీవం అయ్యాయి.

  • గుజరాత్‌లోని నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగగా, నాలుగు స్థానాలను బీజేపీకి దక్కించుకుంది. ఇక్కడి నుంచి జేపీ నడ్డా, వజ్రాల వ్యాపారి గోవింద్‌భాయ్ ధోలాకియా, జస్వంత్ సింగ్ పర్మార్, మయాంక్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
  • ఉత్తరాఖండ్ రాష్ట్రం నుండి బీజేపీ అధ్యక్షుడు మహేష్ భట్ రాజ్యసభకు ఎన్నికయ్యారు.
  • ఛత్తీస్‌గఢ్‌ నుంచి బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ప్రతాప్ సింగ్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
  • హర్యానా నుండి బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ బరాలా రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
  • బీహార్‌లోని 6 స్థానాలకుఎన్నికలు జరగగా ఎన్‌డిఎకు చెందిన ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా, భారత కూటమికి చెందిన ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధించారు. బీజేపీ నుంచి ధర్మశీల గుప్తా, భీమ్ సింగ్, జేడీయూ నుంచి సంజయ్ కుమార్ ఝా ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ఆర్జేడీకి చెందిన మనోజ్ ఝా, సంజయ్ యాదవ్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అఖిలేష్ ప్రసాద్ సింగ్ విజయం సాధించారు.
  • మధ్యప్రదేశ్‌ నుండి మొత్తం 5 స్థానాలకు ఎన్నికలు జరగగా, బీజేపీకి చెందిన ఎల్ మురుగన్, ఉమేష్ నాథ్ మహరాజ్, మాయా నరోలియా, బన్షీలాల్ గుర్జార్, కాంగ్రెస్ నుంచి అశోక్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
  • మహారాష్ట్ర నుండి ఖాళీ ఉన్న నాలుగు స్థానాలకు అశోక్ చవాన్, మేధా కులకర్ణి మరియు డాక్టర్ అజిత్ గోప్‌చాడేలు బిజెపి నుండి ఎన్నికవ్వగా, ఎన్సీపీ నుంచి ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ నుంచి చంద్రకాంత్ హందోర్, శివసేన నుంచి మిలింద్ దేవరా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
  • రాజస్థాన్‌లో ఖాళీ ఉన్న మూడు రాజ్యసభ స్థానాలలో కాంగ్రెస్ తరపున సోనియా గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన రెండు బీజేపీకి చెందిన చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్ ఎగువ సభకు చేరుకున్నారు.
  • ఆంధ్రప్రదేశ్ నుండి  వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో వైవీ సుబ్బారెడ్డి, జి బాబురావు, ఎం రఘునాధ రెడ్డి ఎగువ సభకు చేరుకున్నారు.
  • తెలంగాణ రాష్ట్రంలోని మూడు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్‌కు చెందిన రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్‌ఎస్‌కు చెందిన వీ రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
  • ఒడిశా నుండి అందుబాటులో ఉన్న మూడు స్థానాలకు కేంద్ర మంత్రి అశ్వి వైష్ణవ్, బిజూ జనతాదళ్‌కు చెందిన దేబాశిష్ సామంత్రాయ్, సుభాశిష్ ఖుంటియాలు గెలుపొందారు.
  • హిమాచల్ ప్రదేశ్‌లో ఒక రాజ్యసభ సీటుకు జరిగిన ఎన్నికలో మెజారిటీ సంఖ్య ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఓడిపోయింది, ఈ పార్టీకి చెందిన తొమ్మిది మంది సభ్యులు క్రాస్ ఓటింగ్ చేయడంతో బిజెపి అభ్యర్థి హర్ష్ మహాజన్ విజయం సాధించారు.
  • ఉత్తరప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికల్లో అధికార బీజేపీ పార్టీ ఎనిమిది స్థానాలను గెలుచుకోగా, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) రెండు స్థానాల్లో విజయం సాధించింది.
  • కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ 3 రాజ్యసభ స్థానాలను దక్కించుకోగా, బీజేపీ ఒక సీటు గెలుపొందింది. వీరిలో కాంగ్రెస్ నుండి అజయ్ మాకెన్, డాక్టర్ సయ్యద్ నసీర్ హుస్సేన్, జిసి చంద్రశేఖర్ గెలుపొందారు. బీజేపీ నుండి నారాయణ బండేగే విజయం సాధించారు.
పార్టీ రాజ్యసభ సీట్లు
బీజేపీ 32
కాంగ్రెస్ 9
ఆమ్ ఆద్మీ పార్ట్ 3
బీజేడీ 2
ఆర్జేడీ 2
టీఎంసీ 4
వైఎస్ఆర్ కాంగ్రెస్ 3
జేడీయూ 1
శివసేన (షిండే వర్గం) 1
ఎన్సీపీ 1
బి.ఆర్.ఎస్. 1

రాజ్యసభ సభ్యులు నేరుగా ప్రజలచే ఎన్నుకోబడరు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులచే ఎన్నుకోబడతారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఓటు వేస్తారు. ఓటింగ్ ఫార్ములా కూడా పూర్తి భిన్నంగా ఉంటుంది. పార్టీల గెలుపు-ఓటమి ఫలితంతో సంబంధం లేకుండా శాసనసభలో పార్టీల వాటా ఆధారంగానే సీట్లు లభిస్తాయి. రాష్ట్రానికి లభించే రాజ్యసభ స్థానాల సంఖ్య దాని జనాభా ఆధారంగా ఉంటుంది. కాబట్టి, పెద్ద రాష్ట్రాల్లో చిన్న వాటి కంటే ఎక్కువ సీట్లు ఉంటాయి.

రాజ్యసభను శాశ్వత సభ అంటారు. ఇది లోక్‌సభ వలె ఐదేళ్లకు కాకుండా నిరంతరం కొనసాగుతుంది. అయితే ప్రతి రెండేళ్లకో సారి సభ్యులలో మూడింట ఒక వంతు మంది పదవీ విరమణ పొందుతారు, ప్రతి మూడవ సంవత్సరం ప్రారంభంలో తాజా ఎన్నికలు మరియు ప్రెసిడెంట్ నామినేషన్ ద్వారా ఆ ఖాళీలను భర్తీ చేస్తారు. ప్రతి సభ్యునికి ఆరు సంవత్సరాల పదవీకాలం ఉంటుంది.

మరో రెండు గ్యారెంటీ పథకాలను ప్రారంభించిన  సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు కొత్త గ్యారెంటీ పథకాలను ప్రారంభించింది. వీటిలో నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహ జ్యోతి పథకం మరియు ఇదే పథకం కింద రూ. 500 లకే డొమెస్టిక్ ఎల్‌పిజి అందించే పథకాలు ఉన్నాయి. ఈ రెండు పథకాలు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీలలో ఉన్నాయి.

అధికారిక అంచనాల ప్రకారం రూ. 500 లకే డొమెస్టిక్ ఎల్‌పిజి అందించే ఈ పథకం ద్వారా దాదాపు 40 లక్షల మంది వినియోగదారులకు ప్రయోజనం చేకూరునుంది. గత 5 ఏడాదిలో నుండి 8 లోపు గ్యాస్ సిలెండర్లు ఉపయోగించి, తెల్ల రేషన్ కార్డు కలిగిన వారందరు అర్హులు. ఈ పథకం మునపటి వినియోగం ఆధారంగా మాత్రమే పరిమిత సిలెండర్లు అందజేస్తారు.

రేవంత్‌రెడ్డి  తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 48 గంటల్లోనే డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మొదటి రెండు హామీలను నెరవేర్చారు. వీటిలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరియు ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేటు ఆసుపత్రుల్లో పేదల ఖర్చు పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంపుదల ఉన్నాయి.

  • ఎన్నికల ముందు గత ఏడాది సెప్టెంబరు 17న జరిగిన ప్రజా సంకల్పయాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రజలకు మొత్తం ఆరు హామీలను ప్రకటించారు.
  • డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఈ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు.
  • ఇంకా అమలు చేయని హామీలలో మహాలక్ష్మి పథకం కింద కుటుంబంలోని ప్రతి మహిళలకు నెలకు 2,500 రూపాయల సహాయం, రైతులకు 15 వేల పంటసాయం, రైతుకూలీలకు ఏడాదికి 12వేలు ఆర్థికసాయం, 4,000 రూపాయల వృద్ధాప్య పింఛను, ఇందిరమ్మ ఇల్లు వంటి హామీలు ఉన్నాయి.
  • తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 100 రోజుల్లోగా ఈ 6 హామీలు అమలు చేస్తామని నాడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

లాబ్రడార్ స్థానంలో బెల్జియన్ మాలినోయిస్‌ కుక్కలను భర్తీ చేసిన ఎన్ఎస్‌జీ

నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్‌జీ) క్రూరమైన బెల్జియన్ మాలినోయిస్ కుక్కను తన సాంప్రదాయ లాబ్రడార్ స్క్వాడ్ స్థానంలో భర్తీ చేసేందుకు ప్రణాళిక చేస్తుంది. ఇది వరకు ఉన్న విశ్వసనీయమైన లాబ్రడార్లు, వాటి స్నేహపూర్వక స్వభావానికి మరియు పేలుడు పదార్థాలను పసిగట్టడంలో నైపుణ్యానికి ప్రసిద్ధి చెందాయి.

అయితే ఎన్ఎస్‌జీ వీటి స్థానంలో మరింత బహుముఖ బెల్జియన్ మాలినోయిస్‌లను భర్తీ చేసేందుకు సిద్దమవుతుంది. ఈ తెలివైన మరియు అథ్లెటిక్ కుక్కలు పేలుడు పదార్థాలు మరియు మాదక ద్రవ్యాలను పసిగట్టడమే కాకుండా అనుమానితులను కూడా ట్రాక్ చేయగలవు.

గతంలో ఎన్ఎస్‌జీ ఈ కార్యకలాపాల కోసం ప్రత్యేక లాబ్రడార్ స్క్వాడ్‌లను మరియు దాడి మిషన్ల కోసం జర్మన్ షెపర్డ్‌లనుఉపయోగించేంది. బెల్జియన్ మాలినోయిస్ కుక్కలు ఈ రెండిటి స్థానంలో సింగిల్-యూనిట్ పరిష్కారాన్ని అందించనున్నాయి, తద్వారా వాటి లాజిస్టికల్ సంక్లిష్టతను మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

బెల్జియన్ మాలినోయిస్ కుక్కలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ప్రత్యేక దళాలలో కీలక భూమిక పోషిస్తున్నాయి. లాబ్రడార్‌లు పదవీ విరమణ వయస్సుకు చేరుకున్నందున ఎన్ఎస్‌జీ దశలవారీగా వాటిని తొలగిస్తోంది. కొత్త మాలినోయిస్ రిక్రూట్‌లకు ఆగస్టు 2023లో శిక్షణ ప్రారంభించింది. ఇవి త్వరలో ఎన్ఎస్‌జీ యొక్క కే9 స్క్వాడ్‌లో కీలక భాగం కానున్నాయి.

ఆచార్య లోకేష్ మునికి గ్లోబల్ జైన్ పీస్ అంబాసిడర్‌ గౌరవం

అహింసా విశ్వ భారతి మరియు వరల్డ్ పీస్ సెంటర్ వ్యవస్థాపకుడు ఆచార్య లోకేష్‌ను ' గ్లోబల్ జైన్ పీస్ అంబాసిడర్ ' అవార్డుతో సత్కరించారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ ప్రతిష్టాత్మక బిరుదును ఆయనకు ప్రదానం చేశారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి మరియు సామరస్యాన్ని పెంపొందించడంలో ఆచార్య లోకేష్‌జీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం ఇవ్వబడుతుంది.

కర్నాటకలోని హుబ్లీ వరూర్‌లోని జైన పుణ్యక్షేత్రమైన నవగ్రహ తీర్థ క్షేత్రంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, వైస్ ఛాన్సలర్ ఎస్ విద్యాశంకర్ కూడా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో పద్మావతి మాతా శక్తిపీఠం శంకుస్థాపన కూడా జరగనుంది.

రిలయన్స్ ద్వారా వంతరా అనే జంతు సంక్షేమ కార్యక్రమం ప్రారంభం

రిలయన్స్ ద్వారా "వంతరా" అనే జంతు సంక్షేమ కార్యక్రమం ప్రారంభించబడింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కేవలం వన్యప్రాణుల అభయారణ్యం యొక్క పరిధిని అధిగమించి, అవసరమైన జంతువులను రక్షించడం, పునరావాసం కల్పించడం, చికిత్స మరియు సంరక్షణ కోసం అంకితమైన సమగ్ర కేంద్రంగా సేవలు అందించనుంది.

  • ఈ కార్యక్రమం దేశీయంగా మరియు అంతర్జాతీయంగా గాయపడిన, దుర్వినియోగం చేయబడిన మరియు బెదిరింపులకు గురైన జంతువులను చురుకుగా కాపాడుతుంది.
  • జంతువులకు సాధ్యమైనంత ఉత్తమమైన వైద్య సహాయం అందేలా ఐసీయూ యూనిట్లు, ఎంఆర్ఐ మెషీన్‌లు మరియు సిటీ స్కానర్‌లతో సహా అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులో ఉంచుతుంది.
  • ప్రపంచ భాగస్వాములతో పరిశోధన మరియు సహకారం ద్వారా వన్యప్రాణుల సంరక్షణలో వంతరా కీలక పాత్ర పోషిస్తుంది.
  • దీని కోసం గుజరాత్‌లోని రిలయన్స్‌కు చెందిన జామ్‌నగర్ రిఫైనరీ కాంప్లెక్స్‌లోని గ్రీన్ బెల్ట్‌లో సహజమైన అడవి వాతావరణాన్ని పోలి ఉండేలా 3,000 ఎకరాల విస్తీర్ణంలో అభయారణ్యం రూపొందించింది.

ఈ కార్యక్రమంకు అనంత్ అంబానీ సారథ్యం వహిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇప్పటికే కీలక అడుగులు వేయడం ప్రారంభించింది. ఇప్పటికే 43 విభిన్న జాతుల నుండి 2,000 పైగా జంతువులను సంరక్షిస్తున్నారు. రిలయన్స్ యొక్క ఈ సాహసోపేతమైన చొరవను జంతు సంరక్షణకారులు, జంతు ప్రేముకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీని ప్రారంభించిన ప్రధాని మోదీ

భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌ పెర్రీని ఫిబ్రవరి 28న ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ప్రధాని తూత్తుకుడి నుంచి వర్చువల్ మోడ్‌లో ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇది దేశీయ సముద్ర రంగంలో హరిత సాంకేతిక పరిజ్ఞానానికి పెద్దపీట వేస్తూ, దేశీయంగా రూపొందించబడిన భారతదేశం యొక్క మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీ.

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ చేత నిర్మించబడిన ఈ హైడ్రోజన్ టమరాన్ ఫెర్రీ, 24 మీటర్ల పొడవుతో  పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్‌తో 50 మంది ప్రయాణీకులను సౌకర్యవంతంగా బట్వాడా చేయగల సామర్థ్యం కలిగి ఉంది. కఠినమైన పరీక్షల తరువాత దీనిని ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో సేవ కోసం మోహరించనున్నారు.

ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయం భారతీయ సముద్ర రంగంలో హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేయడానికి మరియు స్వీకరించడానికి దారి తీస్తుందని భావిస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ సముద్ర పరిశ్రమలో హైడ్రోజన్ ఇంధన సెల్ సాంకేతికతను విస్తృతంగా స్వీకరించడానికి మార్గం సుగమం చేస్తుంది, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.

ఈ హైడ్రోజన్ ఫెర్రీని ప్రారంభించడం భారతదేశం యొక్క స్వచ్ఛమైన ఇంధన లక్ష్యాల దిశగా కీలకమైన దశను సూచిస్తుంది. ఈ ప్రాజెక్ట్ 2070 నాటికి నికర-సున్నా ఉద్గారాలను సాధించాలనే భారతదేశ నిబద్ధతకు అనుగుణంగా ఉంది.

Advertisement

Post Comment