26th December 2023 Current affairs in Telugu. పోటీ పరీక్షల రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో పొందండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షల కొరకు సిద్దమవుతున్న ఆశావహులకు ఉపయోగపడతాయి.
భారత నౌకాదళంలోకి స్టెల్త్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ ఇంఫాల్
డిసెంబర్ 26న భారత నౌకాదళంలోకి స్టెల్త్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ ఇంఫాల్ ప్రవేశపెట్టబడింది. ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో జరిగిన కార్యక్రమంలో రక్ష మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో దీనిని నౌకాదళానికి అందించారు. స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ అయిన ఐఎన్ఎస్ ఇంఫాల్ 75% స్వదేశీ సాంకేతికతతో, మెరుగైన స్టెల్త్ ఫీచర్లు మరియు అత్యాధునిక పరికరాలతో రూపొందించబడింది.
ఐఎన్ఎస్ ఇంఫాల్, విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్‌లలో మూడవది. దీనిని ఇండియన్ నేవీ యొక్క వార్‌షిప్ డిజైన్ బ్యూరో రూపొందించింది, ముంబైలోని మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ చేత నిర్మించబడింది. ఈ యుద్ధ నౌక 163 మీటర్ల పొడవు, 17 మీటర్ల వెడల్పుతో 7,400 టన్నుల స్థానభ్రంశం కలిగి ఉంది. ఇది భారతదేశంలో నిర్మించిన అత్యంత శక్తివంతమైన యుద్ధనౌకలలో ఒకటి. ఇది కంబైన్డ్ గ్యాస్ & గ్యాస్ కాన్ఫిగరేషన్‌లో నాలుగు శక్తివంతమైన గ్యాస్ టర్బైన్‌ల ద్వారా నడపబడుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 30 నాటికల్ మైళ్ళు.
ఐఎన్ఎస్ ఇంఫాల్ హిందూ మహాసముద్ర ప్రాంతంలో మరింత స్థిరమైన మరియు సురక్షితమైన సముద్ర వాతావరణానికి దోహదపడుతుంది. దీని సామర్థ్యాలు సంభావ్య బెదిరింపులను అరికట్టేందుకు మరియు దేశాల మధ్య శాంతియుత సహకారాన్ని పెంపొందించేందుకు సహాయపడుతుంది. ఈ శక్తివంతమైన నౌక భారతదేశం యొక్క ఉనికిని మెరుగుపర్చడంతో పాటుగా ఈ ప్రాంతంలో తన ప్రయోజనాలను కాపాడుతుందని భావిస్తున్నారు.
ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024
11వ ఎడిషన్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024, ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ స్కిల్స్, వర్క్, మోన్‌బిలిటీ' అనే శీర్షికతో డిసెంబర్ 20న విడుదల చేయబడింది. ఈ నివేదిక ఉపాధి రేటు, రాష్ట్రాల వారీగా ఉపాధి పోకడలు, అభివృద్ధి చెందుతున్న నైపుణ్య ధోరణులు, లింగ వైవిధ్యం వంటి అంశాలకు సమ్బదించిన తాజా డేటాను అందిస్తుంది. దేశంలో నైపుణ్యం అంతరాన్ని తగ్గించడానికి మరియు భవిష్యత్ ఉద్యోగ మార్కెట్‌కు యువతను సిద్ధం చేయడానికి భారతీయ విద్య మరియు శిక్షణా వ్యవస్థ మెరుగుపరచాల్సిన అంశాలను కూడా ఈ నివేదిక హైలైట్ చేస్తుంది.
ఈ నివేదిక వీబాక్స్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ మరియు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్శిటీలతో సహా వివిధ ఏజెన్సీలతో కలిసి ప్రచురించబడింది. భారతదేశం అంతటా వీబాక్స్ నేషనల్ ఎంప్లాయబిలిటీ టెస్టులలో పాల్గొన్న 3.88 లక్షల మంది అభ్యర్థుల అభిప్రాయం ఆధారంగా ఇది రూపొందించబడింది. అదనంగా ఈ నివేదిక 15 విభిన్న పరిశ్రమలకు చెందిన 152 కార్పొరేషన్ల నుండి అంతర్దృష్టులను తీసుకుంది.
- ఈ నివేదిక కుత్రిమ మేధస్సు అభివృద్ధిలో భారత్ అగ్రదేశాలతో పోటీపడుతున్నట్లు నివేదించింది. ఆగస్టు 2023 నాటికి దేశంలో 4.16 లక్షల మంది ఎఐ నిపుణులు ఉన్నట్లు తెలిపింది. ఈ సంఖ్య పెరుగుతున్న డిమాండ్ ప్రకారం 2026 నాటికి 1 మిలియన్‌కు చేరుకుంటుందని పేర్కొంది.
- కుత్రిమ మేధస్సు నైపుణ్యం వ్యాప్తి మరియు ప్రతిభ ఏకాగ్రతలో భారతదేశం మొదటి స్థానంలో ఉందని నివేదించింది.
- భారతదేశంలో మొత్తం యువ ఉపాధి అవకాశాలు 51.25%కి మెరుగుపడినట్లు నివేదించింది. ఈ అంశంలో హర్యానా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి.
- కేరళ, మరియు తెలంగాణలలో అధిక యువ ఉద్యోగావకాశాలు ఉన్నట్లు వెల్లడించింది.
- ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024 ప్రకారం కేరళ పని చేయడానికి అత్యంత ప్రాధాన్య రాష్ట్రంగా నిలిచింది.
- వయస్సు వారీగా చుస్తే 18-21 సంవత్సరాల వయస్సు గలవారిలో అత్యధికంగా 85.45% మంది తెలంగాణాలో ఉపాధి పొందగా 74.93% తో కేరళ రెండవ స్థానంలో ఉంది.
- 22 నుండి 25 ఏళ్ళ యువ ప్రతిభావంతుల్లో ఉత్తర ప్రదేశ్ మరియు మహారాష్ట్రలు అగ్రస్థానంలో ఉన్నాయి. 26-29 సంవత్సరాల వయస్సు గలవారిలో గుజరాత్ అగ్రస్థానంలో ఉంది.
- అత్యధిక ఉపాధి యోగ్యమైన వనరుల సేకరణలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. ఐటి, ఫైనాన్స్, హెల్త్‌కేర్, ఆటోమోటివ్ మరియు తయారీ రంగాల్లో విజృంభిస్తున్న డిమాండ్‌ను తక్షణమే తీర్చగల అద్భుతమైన టాలెంట్ పూల్ ఆంధ్రప్రదేశ్‌లో ఉందని నివేదిక పేర్కొంది.
- కంప్యూటర్ నైపుణ్యాలను పెంపొందించడంలో నగరాలలో జాబితాలో తిరువనంతపురంమొదటి స్థానాన్ని పొందగా, రాష్ట్రాలలో కేరళ మూడవ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఈ కేటగిరిలో టాప్ 2లో ఉన్నాయి.
- పురుషులు మరియు మహిళలు ఇద్దరూ పని చేయడానికి ఇష్టపడే నగరాల్లో కొచ్చి మరియు తిరువనంతపురం వరుసగా రెండవ మరియు నాల్గవ స్థానంలో నిలిచాయి.
రఘురామ్ రాజన్ కొత్త పుస్తకం 'బ్రేకింగ్ ది మోల్డ్' విడుదల
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొత్త పుస్తకం 'బ్రేకింగ్ ది మోల్డ్ - రీఇమేజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్' ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేయబడింది. పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ద్వారా విడుదల చేయబడిన ఈ పుస్తకం భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు అవకాశాలను వివరిస్తుంది. రాజన్ ఈ ప్రాజెక్ట్‌లో ఆర్థికవేత్త రోహిత్ లాంబాతో కలిసి పనిచేశారు.
- రఘురామ్ రాజన్ ఇదివరకు 2017లో 'ఐ డూ వాట్ ఐ డూ-ఆన్ రిఫార్మ్, రెటోరిక్ అండ్ రిసాల్వ్' అనే పుస్తకాన్ని రాశారు. ఈ నాన్ ఫిక్షన్ పుస్తకం హార్పర్ కాలిన్స్ ఇండియా ద్వారా నాడు ప్రచురించబడింది. ఈ పుస్తకం రాజన్ గవర్నర్‌గా పనిచేసిన సమయంలో చేసిన ప్రసంగాల సమాహారం.
- భారత ఆర్థిక వ్యవస్థపై రంజన్ రాసిన మరో పుస్తకం 'ఫాల్ట్ లైన్స్: హౌ హిడెన్ ఫ్రాక్చర్స్ స్టిల్ థ్రెటెన్ ది వరల్డ్ ఎకానమీ'. ఇది ఫైనాన్షియల్ టైమ్స్ బిజినెస్ బుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా గెలుచుకుంది.
- ఉదారవాద ప్రజాస్వామ్య విలువలపై రాసిన 'ది థర్డ్ పిల్లర్' కూడా 2019 బిజినెస్ బుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ కోసం షార్ట్ లిస్ట్ చేయబడింది.
లక్నోలో భారతదేశపు మొట్టమొదటి ఎఐ సిటీ
ఉత్తరప్రదేశ్ లక్నోలో భారతదేశంలోని మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నగరాన్ని నిర్మించడానికి మరియు కుత్రిమ మేధస్సు పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడానికి యోచిస్తోంది. యూపీ చీఫ్ సెక్రటరీ డిఎస్ మిశ్రా నేతృత్వంలోని వివిధ శాఖల అధికారుల బృందం వచ్చే ఎనిమిది నెలల పాటు ఈ ప్రణాళికపై పని చేయనున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు దీనిపై వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చారు.
లక్నోలోని అమౌసి విమానాశ్రయానికి సమీపంలో ఉన్న 40 ఎకరాల భూమి ఈ ప్రాజెక్టుకు ప్రధాన కేంద్రం కానుంది. ఈ ప్రాజెక్టు ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి మౌలిక సదుపాయాలను సృష్టించడం, ఎఐ స్టార్ట్-అప్‌లకు మద్దతు అందించడం, ఎఐ పరిశ్రమను స్థాపించడం మరియు డేటా అనలిటిక్స్ మరియు పరిశ్రమకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇటీవలే విడుదల అయిన గ్రాండ్ వ్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం, గ్లోబల్ ఎఐ మార్కెట్ 2022లో $137 బిలియన్లకు చేరుకుంది. వచ్చే ఐదేళ్లలో ఈ రంగంలో 37.3 శాతం సమ్మేళనం వార్షిక వృద్ధి రేటును చూసే అవకాశం ఉన్నట్లు నివేదించింది.
ఉత్తరాఖండ్‌లో గైరోకాప్టర్ సఫారీ టూరిజం ప్రారంభం
ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ భారతదేశపు మొట్టమొదటి హిమాలయన్ గైరోకాప్టర్ ఎయిర్ సఫారీ టూరిజంను ప్రారంభించే ఆలోచనలో ఉంది. ఇది హిమాలయాల యొక్క ఉత్కంఠభరితమైన అందాలను అనుభవించడానికి అవకాశం కల్పిస్తుంది. ఇటీవలే ఉత్తరాఖండ్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో జరిగిన టూరిజం సెషన్‌లో ఇది ఆవిష్కరించబడింది.
ఈ సేవలు యోగా మరియు అడ్వెంచర్ కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందిన ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన రిషికేశ్‌లో ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఆటోగైరో, లేదా గైరోప్లేన్ అనేది రోటర్‌క్రాఫ్ట్ తరగతి చెందిన ఒక చిన్న హెలికాప్టర్. ఇది హెలికాప్టర్ వలె కాకుండా ఆటోరోటేషన్ ద్వారా ఎగురుతుంది.
నమ్మ కార్గో సేవలు ప్రారంభించిన కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ
కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 'నమ్మ కార్గో' పేరుతొ లాజిస్టిక్స్ సేవలు ప్రారంభించింది. ఈ కార్గో ట్రక్కులు రాష్ట్రవ్యాప్తంగా వ్యాపారాలు మరియు వ్యక్తుల కోసం సురక్షితమైన, వేగవంతమైన మరియు విశ్వసనీయ సేవలతో వస్తువులను రవాణా చేస్తాయి.
బెంగళూరు నగరంలోని పీణ్యలోని బసవేశ్వర బస్ స్టేషన్‌ను కార్గో ట్రక్కుల నిర్వహణ మరియు నిర్వహణ కోసం డిపోగా ఉపయోగించనున్నారు. ప్రస్తుతం 20 ట్రక్కులు దీని కోసం అందుబాటులోకి తెచ్చారు. నిజ-సమయ ట్రాకింగ్ మరియు సమర్థవంతమైన డెలివరీని నిర్ధారించడం కోసం ట్రక్కులకు జీపీఎస్ పరికరాలు అమర్చారు.
ఏపీఎస్ఎస్డీసీ ద్వారా 1.35 లక్షల మంది యువతకు సాధికారిత
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ గత నాలుగేళ్లలో 12.5 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు నివేదించింది. దీని ఫలితంగా ఇప్పటివరకు 1.35 లక్షల మందికి ఉపాధి తెలిపింది. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా 26 స్కిల్ కాలేజీలు, 192 స్కిల్ హబ్‌ల ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
ఇవి నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించడం లేదా స్వయం ఉపాధి అందించడం ద్వారా వారి జీవితాలను మార్చేందుకు సహాయం చేసినట్లు పేర్కొంది. అకడమిక్ డిపార్ట్‌మెంట్ పరిధిలో 2,40,979 శిక్షణా సమావేశాలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. దీని ద్వారా 1,35,184 మంది వ్యక్తులు ప్రయోజనం పొందారని, అదనంగా, 10,81,927 మంది విద్యార్థులు అకడమిక్స్ కోసం నమోదు చేసుకున్నట్లు వెల్లడించింది.
ఇటీవలే విడుదల అయిన ఇండియా స్కిల్స్ రిపోర్ట్ కూడా అత్యధిక ఉపాధి యోగ్యమైన వనరుల సేకరణలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. ఐటి, ఫైనాన్స్, హెల్త్‌కేర్, ఆటోమోటివ్ మరియు తయారీ రంగాల్లో విజృంభిస్తున్న డిమాండ్‌ను తక్షణమే తీర్చగల అద్భుతమైన టాలెంట్ పూల్ ఆంధ్రప్రదేశ్‌లో ఉందని నివేదిక పేర్కొంది.
తెలంగాణ గిగ్ వర్కర్లకు 5 లక్షల ప్రమాద బీమా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహార పంపిణీ, క్యాబ్‌లు మరియు ఆటోరిక్షాలు నడిపే గిగ్ కార్మికులకు 5 లక్షల ప్రమాద బీమా మరియు 10 లక్షల ఆరోగ్య రక్షణ హామీని ప్రకటించారు. ఇటీవలే క్యాబ్, ఆటోరిక్షా డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ల సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి, అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత కల్పిస్తుందని ప్రకటించారు.
రాజస్థాన్‌లో గిగ్ వర్కర్ల కోసం ప్రస్తుతం ఉన్న విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని, తదుపరి రాష్ట్ర బడ్జెట్ సెషన్‌లో సమర్థవంతమైన చట్టాన్ని ప్రవేశపెడుతుందని ఈ సంధర్బంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించే గ్రామసభల్లో క్యాబ్, ఆటోరిక్షా డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ అధికారులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో లేదా ఫిజికల్‌గా సమర్పించాలని ముఖ్యమంత్రి సూచించారు.