వైఎస్ఆర్ సీపీ మ్యానిఫెస్టో 2024ను తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత సీఎం జగన్ ఏప్రిల్ 27న విడుదల చేశారు. గడిచిన 58 నెలల కాలంలో తమ పార్టీ హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న నవరత్నాలు వచ్చే 5 ఏళ్లూ కొనసాగిస్తూ, మరిన్ని కొత్త పథకాలు ప్రకటించారు.
తమ దృష్టిలో మ్యానిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం అని, దాన్ని తాము భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావించామని అన్నారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయాల్లో, అధికారి దగ్గర తమ మ్యానిఫెస్టో ఉందని, మ్యానిఫెస్టోను ప్రతీ ఇంటికి పంపించామని, ఓ ప్రొగ్రెస్ కార్డు మాదిరి పథకాలు అమలుచేశామని చెప్పుకున్నారు.
కరోనా కష్ట కాలంలోనూ తాము మ్యానిఫెస్టో అమలు చేశామని, మ్యానిఫెస్టో అమలుకు కరోనా కాలంలో ఎలాంటి సాకులు చూపలేదని జగన్ అన్నారు. గ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్పామని అన్నారు. ఐదేళ్ల కాలంలో 99శాతం హామీలు అమలు చేశామని జగన్ చెప్పారు. రూ. 2లక్షల 70కోట్లను డీబీటీ ద్వారా ప్రజలకు సాధికారత కల్పించామని పేర్కొన్నారు.
మహిళా సంక్షేమం
- వైయస్ఆర్ చేయూత కింద 33.15 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ప్రతి ఏటా రూ.18,750 చొప్పున 4 విడతల్లో రూ.75 వేలు అందజేశారు. వచ్చే 5 ఏళ్ళు ఈ పథకం కొనసాగిస్తున్నారు.
- జగనన్న అమ్మఒడి కింద పిల్లలను బడులకు పంపే పేద తల్లులకు ఏటా రూ.15వేలు చొప్పున అంజేశారు. వచ్చే 5 ఏళ్లలో ఏటా రూ.17వేల చొప్పున పెంచుతూ ఈ పథకం కొనసాగనుంది.
- గడిసిన ఐదేళ్లలోపేదలందరికీ పక్కా ఇళ్లు కట్టించారు. మొత్తం 22.5 లక్షల ఇళ్లనిర్మాణం చేపట్టగా, ఇప్పటికే 9.2 లక్షలకు పైగా పూర్తి చేసారు. వచ్చే 5 ఏళ్లలో మిగిలిపోయిన మరో 10 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు.
- వైయస్ఆర్ కాపు నేస్తం కింద గడిసిన 5 ఏళ్లలో 4.63 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ప్రతి ఏటా రూ.15,000 చొప్పున 4 విడతల్లో రూ.60 వేలు అందజేశారు. ఈ పథకం కూడా వచ్చే ఐదేళ్లకు కొనసాగనుంది.
- వైయస్ఆర్ ఆసరా కింద అక్కచెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం రూ.25,571 కోట్లు రుణమాపీ చేసారు. రూ.3 లక్షల దాకా రుణాల మీద ‘0’ వడ్డీ కార్యక్రమం వచ్చే 5 ఏళ్లు కూడా కొనసాగుతుంది.
- పట్టణ పేదలకు 300 చదరపు అడుగుల ఇళ్లపై అప్పుల భారాన్ని ప్రభుత్వమే భరించి, వారి సొంతింటి కల సాకారం చేశారు. వచ్చే 5 ఏళ్లలో రూ.1,000 కోట్లు ఏటా ఇస్తూ, రూ.2,000 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి, పట్టణ ప్రాంతాల్లో, మధ్యతరగతి వారి కోసం దశలవారీగా ఎంఐజీ లేఅవుట్ల అభివృద్ధి చేయనున్నారు.
- వైయస్ఆర్ ఈబీసీ నేస్తం కింద ఈ 5 ఏళ్లలో ఇప్పటికే 4.95 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.1,877 కోట్లు అందించారు. వచ్చే 5 ఏళ్లలో కూడా పథకం కొనసాగనుంది.
- వైయస్ఆర్ కళ్యాణమస్తు -షాదీ తోఫా కింద ఈ 5 ఏళ్లలో ఇప్పటికే 56 వేల మంది చెల్లెమ్మలకు రూ.427 కోట్లు అందజేశారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ చెల్లెమ్మల వివాహానికి రూ.లక్ష, బీసీ చెల్లెమ్మలకు రూ.50 వేలు వచ్చే ఐదేళ్లు కూడా కొనసాగనుంది.
పింఛన్ల కొనసాగింపు
- వైయస్ఆర్ పెన్షన్ కానుక కింద ప్రస్తుతం అందించే రూ.3,000 పెన్షన్, వచ్చే ఐదేళ్లలో రూ.3,500కు పెంచనున్నారు.
- జనవరి 2028 నుంచి రూ.250 పెంచి రూ.3,250, అలానే జనవరి 2029 నుంచి మరో రూ.250 పెంచి రూ.3,500 అందజేయనున్నారు.
- ఈ పథకం కోసం ఏటా రూ.24,000 కోట్ల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.
- ఈ పెన్షన్లు ఇంటి వద్దనే వాలంటీర్ల ద్వారా ఇచ్చే కార్యక్రమం వచ్చే 5 ఏళ్లూ కొనసాగనుంది.
స్వయం ఉపాధికి ప్రోత్సాహం
- వైయస్ఆర్ మత్స్యకార భరోసా ద్వారా ఇప్పటికే 2.43 లక్షల మందికి రూ.538 కోట్లు అందజేశారు.
- ఈ పథకం ద్వారా 5 విడతల్లో ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున రూ.50 వేలు లబ్ధి చేకూరింది.
- ఈ పథకాన్ని కొనసాగిస్తూ వచ్చే 5 ఏళ్లలో ఒక్కొక్కరికీ మరో రూ.50 వేలు అందజేయనున్నారు.
- మత్స్యకారుల బోట్లకు డీజిల్ సబ్సిడీని లీటరుకు రూ.6 నుంచి రూ.9కి పెంచి అందజేస్తున్నారు.
- డెడికేటెడ్ పెట్రోల్ బంకుల్లో డీజిల్ నింపుకొనేటప్పుడే ఈ సబ్సిడీ ఇచ్చేలా ఏర్పాటు చేశారు.
- మత్స్యకారుల బంగారు భవిత కోసం 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మిస్తున్నారు.
యువత – ఉపాధి
- రాష్ట్రంలో 175 స్కిల్ హబ్లు, 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, ఒక స్కిల్ యూనివర్సిటీన అభివృద్ధి.
- వీటిలో నైపుణ్య శిక్షణ పొందే యువతకు ప్రతి నెలా పైడ్ ఇంటెర్షిప్ అందజేయనున్నారు. అబ్బాయిలకు రూ.2,500, అమ్మాయిలకు రూ.3,000.
- ఇప్పటికే గ్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా 1,35,819 శాశ్వత ఉద్యోగాలు కల్పించారు.
- ప్రతి 50 ఇళ్లకో వాలంటీర్ చొప్పున రాష్ట్ర వ్యాప్తం గా 2.66 లక్షల వాలంటీర్ల నియామకం.
- అన్ని రంగాలలో గడిచిన 5 ఏళ్లలో 6.48 లక్షల ఉద్యోగాలు కల్పన. పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం.
- వచ్చే ఐదేళ్లలో క్రమం తప్పకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 మొదలైన పోటీ పరీక్షలకు నోటిఫికేషన్లు ప్రకటించి, యూపీఎస్సీ తరహాలో నిర్దిష్ట సమయంలో పరీక్షల నిర్వహణ.
- తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రణాళిక.
- విశాఖలో స్టార్టప్ హబ్, ప్రతి జిల్లా కేంద్రం లో స్కిల్ కాలేజీ, ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్ ఏర్పాటుకు ప్రణాళిక.
- పదో తరగతి డ్రాపవుట్లు, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థు లను ఒకే క్యాంపస్లోకి తీసుకొచ్చి శిక్షణ ఇచ్చేలా స్కిల్ హబ్స్ ఏర్పాటు.
- ప్రతి జిల్లాలోనూ క్రీడా మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ, విశాఖలో ప్రపంచ స్థాయి క్రీడా స్టేడియం నిర్మాణం.
- స్థానిక క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమం కొనసాగింపు.
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వ బడుల్లోని విద్యార్థు లకు బోధించేందుకు ఇంజినీరింగ్ విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్ ఎక్స్‌పర్టులుగా నియమిస్తూ, వారికి రూ.12వేల స్టైపెండ్, క్రెడిట్లు అందజేత.
ఆటో / టాక్సీ డ్రైవర్లకు చేయూత
- సొంత ఆటో, టాక్సీ నడిపే వారికి వైయస్ఆర్ వాహనమిత్ర ద్వారా ఏటా రూ.10వేల చొప్పున ఆర్థికసాయం అందజేత. వచ్చే ఐదేళ్లకు ఇది కొనసాగింపు.
- సొంత టిప్పర్/లారీ నడిపే వారికి కూడా ఈ పథకం వర్తింపు.
- ఆటో, మ్యాక్సీక్యాబ్, ట్యాక్సీ, టిప్పర్/లారీ డ్రైవర్లు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.10 లక్షల బీమా అందజేత.
- ఆటో, ట్యాక్సీ, లారీ కొనుగోలు కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే వారికి రూ.3 లక్షల వరకు 6% వడ్డీతో రుణాలు.
న్యాయవాదుల సంక్షేమం
- వైయస్ఆర్ లా నేస్తం ద్వారా జూనియర్ న్యాయవాదులకు మూడేళ్లపాటు ప్రతి నెలా రూ.5 వేలు స్టైపెండ్ అందజేశారు.
- వచ్చే ఐదేళ్ల కాలానికి ఈ పథకం కొనసాగింపు.
- న్యాయవాదుల వెల్ఫేర్ ఫండ్ కోసం రూ.100 కోట్లు కేటాయింపు.
చేనేత కార్మికుల సంక్షేమం
- గడిచిన 5 ఏళ్లలో నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.3,706 కోట్లు ఖర్చువైయస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికీ ఏటా రూ.24వేల చొప్పున 5 ఏళ్లలో రూ.1.20 అందజేశారు. వచ్చే ఐదేళ్లకు ఈ పథకం కొనసాగింపు.
- పద్మశాలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు.
- ఆప్కోకు (గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో సహా) రూ.468 కోట్లు చెల్లింపు.
విద్యారంగం
- ప్రభుత్వ బడుల్లో నాడు–నేడు, ఇంగ్లీష్ మీడియం, 6వ తరగతి నుంచి డిజిటల్ క్లాస్ రూములు అభివృద్ధి.
- 8వ తరగతి పిల్లలకు ఉచిత ట్యాబులు అందజేత.
- 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ, సబ్జెక్ట్ టీచర్, బైలింగ్వల్ టెక్స్ బుక్స్ , బైజూస్ కంటెంట్, సీబీఎస్ఈ నుంచి ఐబీ సిలబస్ వరకు ప్రయాణం.
- 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న 10 లక్షల మంది విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ నాప్‌కిన్స్ అందజేత.
- ప్రతి మండలంలోనూ ఒక బాలికల జూనియర్ కాలేజీ ఏర్పాటు చేశారు.
- జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన, మనబడి నాడు–నేడు, జగనన్న గోరుముద్ద వంటి పథకాలు అమలు.
- 2025 నుంచి ఒకటో తరగతికి ఐబీ విద్యావిధానం. ఇలా ప్రతి ఏడాది ఒక క్లాస్ పెంచుకుంటూ 2035 నాటికి పదో తరగతి విద్యార్థు లకు ఐబీ ఎడ్యుకేషన్ అందుబాటులోకి.
- వచ్చే 5 ఏళ్లలో అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన కొనసాగింపు.
వ్యవసాయ రంగం
- గడిచిన 5 ఏళ్లలో రైతుల సంక్షేమం కోసం రూ.1,84,567 కోట్లు ఖర్చు చేశారు.
- వైయస్ఆర్ రైతు భరోసా కింద ఇప్పుడు ఏటా ఇస్తున్న రూ.13,500 పెట్టుబడి సాయం రూ.16,000కు పెంపు.
- ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పంట రుణాల పథకాలు కొనసాగింపు.
- దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు, అటవీ, దేవాదాయ భూముల సాగుదారులకూ ‘రైతు భరోసా’ అమలు.
- వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల ఉచిత కరెంట్ అందజేత.
- వైయస్ఆర్ జలకళ ద్వారా ఉచితంగా బోర్లు వేసేందుకు ప్రణాళిక.
- రూ.3వేల కోట్లతో ధరల స్థిరీ కరణ నిధి ఏర్పాటు, వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ రద్దు.
- ఆక్వా జోన్లో ఉన్న 10 ఎకరాలలోపు ఆక్వా రైతులకు కరెంటు యూనిట్ రూ.1.50కే వసూలు.
- రూ.2వేల కోట్లతో ప్రకృతి విపత్తు ల సహాయ నిధి ఏర్పాటు.
- వైయస్ఆర్ బీమా ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.7 లక్షలు అందజేత.
- ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు, జిల్లా స్థాయిలో ఫుడ్ ప్రాసెసిం గ్ యూనిట్లు అవసరం మేరకు ఏర్పాటు.
- భూ యజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతులకు పంటపై హక్కు ఉండేలా (11 నెలలకు మించకుండా) రైతుల భూములకు రక్షణ కల్పిస్తూ చట్టం సవరణ.
- సులభతరమైన విధానంలో కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలు (సీసీఆర్‌సీ కార్డులు) గ్రామ సచివాలయాల్లోనే జారీ.
- కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద పెట్టు బడి సొమ్ము అందజేత.
- రైతులకు విత్తనం నుంచి పంట విక్రయం వరకు అన్ని సేవలూ వారి ఊళ్లోనే అందించేందుకు 10,778 వైయస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు.
- రాష్ట్ర వ్యాప్తంగా 162 కొత్త వైయస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబులు ఏర్పాటు.
- వైయస్ఆర్ యంత్రసేవ ద్వారా ప్రతి ఆర్బీకే స్థాయిలోనూ సీహెచ్‌సీల ద్వారా యంత్రాలు అందుబాటులోకి.
- ఈ–క్రాప్ బుకింగ్, చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ, వైయస్ఆర్ పశు బీమా అమలు.
- వైయస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ కింద 340 వాహనాలు అందుబాటులోకి.
- చేపలు, రొయ్యల మార్కెటింగ్ కోసం 2,151 ఫిష్ ఆంధ్రా రిటైల్ దుకాణాలు ఏర్పాటు.
- పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రణాళిక.
- ఆర్బీకే స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు.
- వచ్చే 5 ఏళ్లూ రైతు సంక్షేమ, అభివృద్ధి పథకాలు కొనసాగింపు.
వైద్యరంగం
- వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం.
- వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ వార్షికాదాయ పరిమితి రూ.5 లక్షలకు పెంపు.
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుమారు 54 వేల మంది వైద్య సిబ్బంది నియామకం.
- ఆరోగ్య ఆసరా ద్వారా చికిత్స అనంతరం కోలుకునే సమయంలో ఆ కుటుంబానికి ఆర్థిక సాయం.
- ఈ పథకం కింద రోజుకు రూ.225, గరిష్టంగా నెలకు రూ.5,000 వరకు చెల్లింపు.
- దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10,000 వరకు పింఛన్ అందజేత.
- ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ లాంటి ప్రాణాం తక వ్యాధులకూ ఉచితంగా వైద్యం.
- ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1059 నుంచి 3,257కు పెంపు. నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్య 919 నుంచి 2,309కి పెంపు.
- 104, 108 సేవల కోసం కొత్తగా 1,704 వాహనాలు, 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు అందుబాటులోకి.
- అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డబ్ల్యూ హెచ్ఓ / జీఎంపీ ప్రమాణాలున్న మందులు అందుబాటులోకి.
- వైద్యం కోసం డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా విలేజ్ క్లినిక్స్‌తో అనుసంధానమై ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం అమలు.
- 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం.
- 10,132 విలేజ్ హెల్త్ క్లినిక్స్, పట్టణ ప్రాంతాల్లో 542 అర్బన్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు.
- ఉద్దానం కిడ్నీ వ్యాధుల సమస్యకు శాశ్వత పరిష్కారం. ఇప్పటికే రూ.785 కోట్లతో వైయస్ఆర్ సుజలధార మంచినీటి ప్రాజెక్టు నిర్మాణం.
- పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ - సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం.
- వెలిగొండ ప్రాజెక్టు 2 టన్నెళ్లను పూర్తి. ప్రకాశం, నెల్లూరు , వైయస్ఆర్ జిల్లాల్లోని ఫ్లోరరైడ్ ప్రభావిత మండలాల్లో 15.25 లక్షల జనాభాకు సురక్షిత తాగునీరు అందజేత.
- వచ్చే ఐదేళ్లలో హృద్రోగ బాధితుల కోసం విశాఖ, గుంటూరు, కర్నూలులో 3 వైద్య హబ్స్ ఏర్పాటు.
- గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు అందుబాటులోకి.
ఎస్సీ, ఎస్టీ సంక్షేమం
- ఎస్సీలకు డీబీటీ ద్వారా గడిచిన 5 ఏళ్లలో ఇప్పటికే రూ.45,412 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.23,469 కోట్లు అందజేత.
- ఎస్సీలకు 3 (మాల, మాదిగ, రెల్లి తదితర కులాలకు) విడివిడి కార్పొరేషన్లు ఏర్పాటు.
- అసైన్డ్ భూములపైశాశ్వత హక్కులు కల్పించారు.
- 500 మంది గిరిజన జనాభా ఉన్న ప్రతి తండా, గూడెంను పంచాయతీగా వర్గీకరిస్తూ 165 గ్రామ పంచాయతీల ఏర్పాటు.
- ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గిరిజన తండాల్లో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్.
- గిరిజన ప్రాంతాల్లోని 497 సచివాలయాల్లో అన్ని ఉద్యోగాలూ స్థానిక గిరిజనులతో భర్తీ.
- గిరిజనులకు ప్రత్యేకంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలు ఏర్పాటు.
- పార్వతీపురం, పాడేరులో రెండు మెడికల్ కాలేజీలు, కురుపాంలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ, సాలూరులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు.
- సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, దోర్నాల, బుట్టాయి గూడెంలో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం.
- అటవీ భూములను సాగుచేసుకునే రైతులకు ఆర్వోఎఫ్ఆర్, డీకేటీ పట్టాలు అందజేత. తద్వారా 1.54 లక్షల గిరిజన కుటుంబాలకు 3.22 లక్షల ఎకరాల భూమి పంపకం.
- విజయవాడలో రూ.404 కోట్లతో 206 అడుగుల అంబేద్కర్ ‘సామాజిక న్యాయ మహాశిల్పం’ నిర్మాణం.
- రాష్ట్ర స్థాయిలో ఒక చైర్మన్, ఐదుగురు సభ్యులతో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు.
బీసీ సంక్షేమం
- బీసీ సంక్షేమం కోసం గడిసిన 5 ఏళ్లలో డీబీటీ ద్వారా రూ.1.28 లక్షల కోట్ లు, నాన్ డీబీటీ ద్వారా రూ.53 వేల కోట్లు అందజేత.
- బీసీ ఉప ప్రణాళిక అమలు.
- శాశ్వత ప్రాతిపాదికన బీసీ కమిషన్ ఏర్పాటు.
- బీహార్ తర్వాత దేశంలో కుల సర్వే నిర్వహించిన రెండవ రాష్ట్రంగా అవతరణ.
- బీసీల్లో ఉప కులాలకు 56 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు.
ఇతర కులాల సంక్షేమం
- కాపు సంక్షేమం కోసం గడిసిన 5 ఏళ్లలో రూ.10వేల కోట్లు కేటాయించారు, అయితే రూ.34 వేల కోట్లకుపైగా కాపు కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేసారు.
- ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆర్యవైశ్య సత్రాలు నడిపే హక్కు వారికే అందించారు.
- దేవాలయాల్లో క్షురకర్మ చేసే నాయీ బ్రాహ్మణులకు కనీసం రూ.20 వేల గౌరవ వేతనం.
- ఆలయాల పాలక మండళ్లలో మొదటిసారిగా నాయీ బ్రాహ్మణులకు చోటు.
- నాయీ బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, షాపులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
- వక్ బోర్డ్, ముస్లిం మైనార్టీల ఆస్తుల రీసర్వే నిర్వహణ, పరిరక్షణ
- హజ్ యాత్రకు ఆర్థిక సాయం అందజేత.
- ఇమామ్లకు రూ.10 వేలు, మౌజమ్లకు రూ.5 వేలు పెంచిన గౌరవ వేతనం.
- పాస్టర్లకు వివాహ రిజిస్ట్రార్ లైసెన్స్ సచివాలయ స్థాయిలోనే అప్లికే షన్, సర్టిఫికెట్ డెలివరీ అయ్యేలా సులభతరం.
- పాస్టర్లకు మొట్టమొదటిసారిగా రూ.5వేల గౌరవవేతనం అందజేత.
- హోలీ ల్యాండ్ వెళ్లే క్రిస్టియన్లకు ఆర్థిక సాయం.
- వచ్చే 5 ఏళ్లలో క్రిస్టియన్ల ప్రార్థనా స్థలాల నిర్వహణకు ప్రత్యేక నిధి.
- అర్చకులకు రిటైర్‌మెంట్ విధానం రద్దు.
- 5,416 ఆలయాలకు నిత్య ధూప, దీప, నైవేద్యాలకు నిధులు అందజేత.
- జగనన్న తోడు ద్వారా కులవృత్తిదారులు, చిరువ్యాపారులకు గుర్తింపు కార్డులు, సున్నావడ్డీకే రూ.10వేల రుణ సదుపాయం.
- జగనన్న తోడు ద్వారా వచ్చే ఐదేళ్లలో సున్నావడ్డీకే రూ.15వేల రుణ సదుపాయం.
- షాపులున్న నాయీ బ్రాహ్మణులు, టైలర్లు , రజకులకు ఏటా రూ.10వేల చొప్పున ఆర్థికసాయం. ఈ పథకం కూడా కొనసాగింపు.
ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం
- ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంపు.
- ఓపీఎస్ విధానానికి వెళ్లలేకపోయినా, ఉద్యోగుల భద్రత, భవిష్యత్తరాలు, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టు కొని గ్యారెంటీడ్ పెన్షన్ విధానం (జీపీఎస్) అమలు.
- ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ విలీనం.
- పోలీసులకు వీక్లీఆఫ్ అమలు.
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఆప్కాస్ ఏర్పాటు.
- ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు తమ సొంత జిల్లాలోనే ఇళ్ల స్థలాలు.
- వచ్చే ఐదేళ్లలో రూ.25 వేల వరకు జీతంపొందే ఆప్కాస్,అంగన్వాడీలు, ఆశావర్కర్లు , ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు అన్ని నవరత్న పథకాలు వర్తింపు.
ఇతర సంక్షేమ మరియు అభివృద్ధి పనులు
- ఎమ్ఎస్ఎమ్ఈలకు రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలు అందజేత.
- రూ.20,000 కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు , 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అభివృద్ధి.
- రూ.4,592 కోట్లతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మణం.
- వచ్చే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి.
- పత్తికొండ, డోన్, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లో 77 చెరువుల అనుసంధానం పూర్తి.
- వచ్చే ఐదేళ్లలో ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరుపై ప్రత్యేక శ్రద్ద.
- రాష్ట్ర రోడ్ల మరమ్మతులు, అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ.
- రోడ్లు, పార్కులు, డరై్నేజీ వంటి మౌలిక సదుపాయాలతో స్మార్ట్ సిటీలుగా జిల్లా కేంద్రాలను అభివృద్ధి చేసేలా తొలి దశలో రూ.2,000 కోట్ల కేటాయింపు.
- ప్రతి జిల్లాలో పీపీపీ పద్ధతిలో ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేసే దిశగా అడుగులు
- వచ్చే ఐదేళ్లలో భూముల రీసర్వే పూర్తి.
- ఎడెక్స్‌ద్వారా మరిన్ని ఆన్లైన్ వర్టికల్స్, ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలతో సర్టిఫికేషన్ కోర్సులు.
- గిగ్ వర్కర్స్ (స్విగ్గీ, జొమాటో, అమెజాన్ వంటి సంస్థల్లోని డెలివరీ బాయ్స్ ) ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5 లక్షల బీమా.
- 60% ఖర్చును ప్రభుత్వమే భరిస్తూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలిచ్చే కార్యక్రమానికి శ్రీకారం.
- 10.40 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు రూ.906 కోట్లు అందజేత.
- 2024లో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఏర్పడగానే విశాఖ పరిపాలనా రాజధానిగా పాలన.
- అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి.