Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 20 అక్టోబర్ 2023
Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 20 అక్టోబర్ 2023

రోజువారీ తెలుగు కరెంట్ అఫైర్స్ 20 అక్టోబర్ 2023, తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి  వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

ఇండియన్ నేవీకి ఐఎన్ఎస్ ఇంఫాల్ స్టెల్త్ డిస్ట్రాయర్ డెలివరీ

మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ ద్వారా నిర్మించబడిన ఐఎన్ఎస్ ఇంఫాల్ అక్టోబర్ 20న భారత నౌకాదళానికి అందించబడింది. ఐఎన్ఎస్ ఇంఫాల్ ప్రాజెక్ట్ 15బీ లో మూడవ తరగతి స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్. దీనిని యార్డ్ 12706 (ఇంఫాల్) అని కూడా పిలుస్తారు.

ఇండియన్ నేవీ యొక్క వార్‌షిప్ డిజైన్ బ్యూరోచే రూపొందించబడిన ఈ యుద్ధ నౌకను ముంబైలోని మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. ఈ నౌక పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడింది. ఇది ప్రపంచంలోని అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన యుద్ధనౌకలలో ఒకటి. గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ అయిన ఇంఫాల్, అత్యాధునిక ఆయుధాలు మరియు సెన్సార్‌లతో కూడిన శక్తివంతమైన నౌకగా నిర్మించబడింది.

ఇందులో ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు, యాంటీ షిప్ క్షిపణులు మరియు టార్పెడోలు, నాలుగు గ్యాస్ టర్బైన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ నౌక గరిష్టంగా 30 నాట్స్ (56 కిమీ/గం) వేగంతో ముందుకు కదలగలదు. ఈ నౌకలో 75% స్వదేశీ ఆయుధాలు అమర్చబడ్డాయి, ఇందులో మీడియం రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్స్ (బెల్, బెంగళూరు), బ్రహ్మోస్ సర్ఫేస్-టు-సర్ఫేస్ మిస్సైల్స్ (బ్రహ్మోస్ ఏరోస్పేస్, న్యూ ఢిల్లీ), స్వదేశీ టార్పెడో ట్యూబ్ లాంచర్లు (లార్సెన్ & లాంచర్) ఉన్నాయి.

ఐఎన్ఎస్ ఇంఫాల్ తయారీ డీల్ 19 మే, 2017న ప్రారంభమైనది. ఈ ఓడ నిర్మణం 20 ఏప్రిల్ 2019న పూర్తిఅయ్యి నీటిలోకి ప్రయోగించబడింది. 2023 ఏప్రిల్ 28న తన తొలి సముద్ర ట్రయల్స్ కోసం ఓడ బయలుదేరింది. తర్వాత కేవలం ఆరు నెలల రికార్డు వ్యవధిలో డెలివరీకి దారితీసింది.

బెంగళూరు మెట్రో పర్పుల్ లైన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 20, 2023న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా బెంగళూరు మెట్రో పర్పుల్ లైన్‌లో మిగిలిన రెండు స్ట్రెచ్‌ల కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించారు. రెండు స్ట్రెచ్‌లు, బైయప్పనహళ్లి-కెఆర్ పురం మరియు కెంగేరి-చల్లఘట్ట, అధికారిక ప్రారంభోత్సవం లేకుండానే అక్టోబర్ 9, 2023న ప్రజలకు తెరవబడ్డాయి. ఈ రెండు స్ట్రెచ్‌ల ప్రారంభంతో, పర్పుల్ లైన్ యొక్క మొత్తం కార్యాచరణ పొడవు ఇప్పుడు 37 స్టేషన్‌లతో 43.49 కి.మీ. కి చేరింది.

పర్పుల్ లైన్ బెంగళూరులో పొడవైన మెట్రో లైనుగా అవతరించింది. ఈ లైన్ ఇప్పుడు వైట్‌ఫీల్డ్ (కడుగోడి)ని చల్లఘట్టకు కలుపుతుంది. ఇది నగరం యొక్క తూర్పు మరియు పశ్చిమ శివారు ప్రాంతాలను కవర్ చేస్తుంది. ఈ లైన్ ద్వారా రోజుకు 8 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని అంచనా. పర్పుల్ లైన్ ప్రారంభం బెంగళూరు ప్రజా రవాణా వ్యవస్థకు ఒక ముఖ్యమైన పరిణామం. నగరంలో ట్రాఫిక్ రద్దీని, కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ లైన్ దోహదపడుతుంది. ఇది ప్రజలు నగరం చుట్టూ ప్రయాణించడానికి అనుకూలమైన మరియు సరసమైన మార్గాన్ని కూడా అందిస్తుంది.

బెంగుళూరులో ప్రస్తుతం రెండు నమ్మ మెట్రో లైన్లు పనిచేస్తున్నాయి. అవి నమ్మ మెట్రో గ్రీన్ లైన్ మరియు నమ్మ మెట్రో పర్పుల్ లైన్. నమ్మ మెట్రో గ్రీన్ లైన్ వాయువ్య దిశలో నాగసంద్ర నుండి దక్షిణాన సిల్క్ ఇన్స్టిట్యూట్ వరకు విస్తరించి ఉంది. మొత్తం 30.5 కి.మీ. అయితే, పొడిగింపు పని నిర్మాణంలో ఉంది. రెండవ పర్పుల్ లైన్ బైయప్పనహళ్లి-కెఆర్ పురం మరియు కెంగేరి-చల్లఘట్టను కవర్ చేస్తుంది.

తొలి నమో భారత్ రైలు ప్రారంభించిన ప్రధాని మోడీ

ఉత్తరప్రదేశ్‌లో భారతదేశపు మొట్టమొదటి సెమీ-హై స్పీడ్ ప్రాంతీయ రైలు సర్వీస్ 'నమో భారత్'ను ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 20న జెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీ-మీరట్ కారిడార్‌లో అందుబాటులోకి తెచ్చిన భారతదేశం యొక్క ఈ మొట్టమొదటి రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌ (RRTS) రైళ్లను గతంలో ర్యాపిడ్ రైలు సర్వీస్‌ (ర్యాపిడ్ఎక్స్)గా పరిగణించారు. అయితే తాజాగా వీటికి నమో భారత్ రైళ్లుగా నామకరణం చేశారు.

ఢిల్లీ-మీరట్ కారిడార్‌లో మొత్తం 82.15 కి.మీ పరిధిలో ఈ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌ మార్గం అభివృద్ధిలో ఉండగా, ప్రస్తుతం సాహిబాబాద్ మరియు దుహై డిపోల మధ్య 17-కిమీ ప్రాధాన్యతా విభాగం ప్రారంభించబడింది. అయితే ఈ మొత్తం కారిడార్ జూన్ 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. నమో భారత్ రైళ్లు గంటకు గరిష్టంగా 160 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి.

నమో భారత్ రైలులో 72 మంది ప్రయాణికుల సీటింగ్ కెపాసిటీతో రెండు మహిళల కోచ్‌లు మరియు మిగతావి ప్రీమియం కోచ్‌లుగా అందుబాటులో ఉంచారు. రైలులోని ఇతర కోచ్‌లలో మహిళలకు అదనంగా 10 సీట్లు కూడా కేటాయించబడ్డాయి. వ్యక్తిగత వాహనాల ద్వారా ప్రయాణించే ప్రయాణికులను ఆర్ఆర్టీస్‌కి మారేలా ప్రోత్సహించేందుకు ప్రతి ర్యాపిడ్ఎక్స్ రైలులో ప్రీమియం కోచ్‌లను అందుబాటులో ఉంచారు. వీటిలో మొబైల్ మరియు ల్యాప్‌టాప్‌ల కోసం ఛార్జింగ్ పాయింట్‌లతో కూడిన కుషన్డ్ రిక్లైనింగ్ సీట్లను అమర్చారు.

కఠినమైన భూభాగాల్లో డ్రోన్ ద్వారా మందులు పంపిణి

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) అక్టోబర్ 19న హిమాచల్ ప్రదేశ్‌లో లాహౌల్ మరియు స్పితి జిల్లాలో డ్రోన్‌ను ఉపయోగించి 20 కిలోమీటర్ల పరిధిలో 100 యూనిట్లకు పైగా అవసరమైన మందులను విజయవంతంగా రవాణా చేసింది. ఈ డ్రోన్ డెలివరీ సాధారణ రోడ్డు ప్రయాణ సమయాన్ని 120 నిమిషాల నుండి 26 నిమిషాలకు తగ్గించింది. ట్రయిల్ రన్‌గా నిర్వహించిన ఈ ప్రయత్నం విజయవంతం అయ్యింది.

కీలాంగ్‌లోని ప్రాంతీయ ఆసుపత్రుల నుండి సిస్సు, గోంధాల్, థియోర్ట్, థోలాంగ్, జహల్మా, గెమూర్, దర్చా, శంషా వంటి ప్రదేశాలతో సహా ప్రాంతంలోని ఎనిమిది కంటే ఎక్కువ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన వైద్య సదుపాయాల పంపిణీని క్రమబద్ధీకరించడం ఐసిఎంఆర్ లక్ష్యం.

ఈ ప్రారంభ డ్రోన్ డెలివరీ ట్రయిల్ కీలాంగ్‌లోని పోలీస్ గ్రౌండ్స్ నుండి జిల్లా ఆసుపత్రికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న తోలాంగ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి యాంటీబయాటిక్స్, యాంటిపైరెటిక్స్ మరియు మల్టీవిటమిన్‌లతో సహా 100 యూనిట్లకు పైగా అవసరమైన మందులను విజయవంతంగా రవాణా చేసింది.

ఐసిఎంఆర్ చాలా సంవత్సరాలుగా డ్రోన్ ఆధారిత డెలివరీ సిస్టమ్‌లను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోంది. ఈ ట్రయిల్ రన్ విజయవంతం కావడంతో, ఇప్పుడు డ్రోన్ ఆధారిత డెలివరీ వ్యవస్థను భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని యోచిస్తోంది. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న మిలియన్ల మంది ప్రజలకు ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది.

ఇది వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ కూడా ఈ డ్రోన్ డెలివరీ ట్రయిల్స్ నిర్వహించింది. ఈ డ్రోన్ 10 కిలోమీటర్ల పర్వత భూభాగంలో ప్రయాణించి గతంలో రోడ్డు మార్గంలో అందుబాటులో లేని గ్రామానికి మందులను అందించింది.

దేశంలో మెరుగుపడిన చైల్డ్ సెక్స్ రేషియో, సెక్స్ రేషియో ఎట్ బర్త్

బాలికలు మరియు మహిళలపై లింగ వివక్షను పరిష్కరించడంలో దేశం యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించడానికి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా అక్టోబర్ 18, 2023న సెంట్రల్ సూపర్‌వైజరీ బోర్డ్ 29వ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో దేశంలో క్షీణిస్తున్న చైల్డ్ సెక్స్ రేషియో (సీఎస్ఆర్) మరియు సెక్స్ రేషియో ఎట్ బర్త్ (ఎస్ఆర్‌బి) కోసం చర్చలు జరిపారు.

ఈ సభను ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర ఆరోగ్య మంత్రి, దేశంలో లింగ సమానత్వం వైపు దేశం ప్రయాణం పట్ల ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. తాజా శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే  (SRS) 2020 నివేదికను ఉటంకిస్తూ, సెక్స్ రేషియో ఎట్ బర్త్ విషయంలో గణనీయమైన పురోగతిని మంత్రి ప్రకటించారు. ఈ డేటా 2017-19లో 904 నుండి 2018-20లో 907కి ప్రశంసనీయమైన మూడు పాయింట్ల మెరుగుదలని వెల్లడించింది.

సర్వే చేయబడిన 22 రాష్ట్రాలలో 12 రాష్ట్రాలలో ఈ మెరుగుదల కనబడినట్లు మంత్రి ప్రకటించారు. ఈ రాష్ట్రాలు గర్భధారణకు ముందు మరియు ప్రసవానికి ముందు రోగనిర్ధారణ పద్ధతులు (నియంత్రణ మరియు దుర్వినియోగం నివారణ) చట్టం, 1994 (PC&PNDT చట్టం) మరియు బేటీ బచావో బేటీ పఢావో పథకం అమలు చేయడంతో ఈ ఫలితాలు పొందినట్లు తెలిపారు.

అంతేకాకుండా, 2015లో ఐదు పాయింట్ల గ్యాప్‌తో పోలిస్తే 2020లో లింగ వ్యత్యాసం రెండు పాయింట్ల తగ్గుదలని తాజా శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే నివేదిక సూచించిందని ఆయన తెలియజేశారు. పది రాష్ట్రాలు లింగ అంతరాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాయి, ఇది స్త్రీ మనుగడ రేటును సానుకూలంగా ప్రభావితం చేసిందని ఆయన పేర్కొన్నారు.

అయితే ఆయన ఐవీఎఫ్, నాన్-ఇన్వాసివ్ ప్రినేటల్ టెస్ట్ మరియు కాంపాక్ట్ డయాగ్నొస్టిక్ పరికరాలు వంటి ఆధునిక సాంకేతికతల ద్వారా ఎదురయ్యే సవాళ్లను కూడా నొక్కిచెప్పారు. ఇవి కుటుంబ సమతుల్యత అనే సాకుతో సెక్స్ ఎంపికను సులభతరం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. ఈ సాంకేతికతలు వాటి సానుకూల వైద్య అనువర్తనాలు ఉన్నప్పటికీ, అధిక దుర్వినియోగం అయ్యే అవకాశం ఉన్నట్లు, తద్వారా లింగ అసమతుల్యతను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

పీసీ&పిఎన్డీటీ చట్టం ప్రకారం, లింగ నిర్ధారణ మరియు ఎంపిక కోసం వైద్య సాంకేతికతలను దుర్వినియోగం చేయడాన్ని నిరోధించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించారు. CSB సభ్యులు చట్టం అమలు పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించడానికి మరియు దేశంలో ఆడపిల్లలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు సెంట్రల్ సూపర్‌వైజరీ బోర్డ్ కృషి చేయాలనీ కోరారు.

ఈ సంధర్బంగా హర్యానా, రాజస్థాన్, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఈ విషయంలో తీసుకున్న చురుకైన చర్యలను డాక్టర్ మాండవ్య ప్రశంసించారు. లింగ-పక్షపాత లింగ ఎంపికను ఎదుర్కోవడానికి స్టింగ్ ఆపరేషన్‌లు మరియు ఇన్‌ఫార్మర్ పథకాలతో సహా వారి వినూత్న వ్యూహాలను ఆయన ప్రశంసించారు. మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటిని అనుచరించాలని కోరారు.

గుజరాత్‌లోని ధోర్డో గ్రామంకు బెస్ట్ టూరిజం అవార్డు

గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని ధోర్డో గ్రామం 2023లో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్‌డబ్ల్యుటీఓ) ద్వారా ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా అవార్డు పొందింది. ఇటీవల ఐక్యరాజ్యసమితి యొక్క ప్రపంచ పర్యాటక సంస్థ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా జాబితా చేయబడ్డ 54 ఉత్తమ పర్యాటక గ్రామాల జాబితాలో ఈ గ్రామం చేర్చబడింది.

గ్రామీణ ప్రాంతాలను పెంపొందించడంలో, ప్రకృతి దృశ్యాలు, సాంస్కృతిక వైవిధ్యం, స్థానిక విలువలు మరియు పాక సంప్రదాయాలను పరిరక్షించడంలో ముందున్న గ్రామాలను ఈ అవార్డు గుర్తిస్తుంది. కచ్‌లో ఉన్న ధోర్డో గ్రామం సుసంపన్నమైన సంస్కృతికి మరియు బన్నీ ఆతిథ్యానికి ప్రసిద్ధి చెందింది.

ధోర్డో వార్షిక రాన్ ఉత్సవ్‌కు నిలయం, ఇది ఈ ప్రాంతం యొక్క సాంప్రదాయ కళ, ఇది సంగీతం మరియు చేతి కదలికల ద్వారా ప్రదర్శించే సాంస్కృతిక ఉత్సవం. ఈ పండుగ స్థానిక కమ్యూనిటీలకు ఆదాయాన్ని సంపాదించడానికి, వారి సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి ఒక వేదికను అందిస్తుంది. అలానే ఈ ప్రాంతంలో ఉన్న విశాలమైన తెల్ల ఉప్పు ఎడారి 'గ్రేట్ రాన్ ఆఫ్ కచ్' కూడా ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఉప్పు ఎడారి.

ఆంధ్ర ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ట్యాబ్‌లో సందేహ నివృత్తి యాప్‌

ఆంధ్రప్రదేశ్‌ విద్యా శాఖ పాఠశాల విద్యార్థుల సందేహాలను క్లియర్ చేయడంలో సహాయపడటానికి ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్-ఆధారిత డౌట్ క్లియరింగ్ యాప్ బాట్‌ను వారి ట్యాబ్‌లలో ఇనస్టాల్ చేస్తున్నట్లు నివేదించింది. దీని కోసం ప్రభుత్వం కన్వేజీనియస్ ఏఐ సొల్యూషన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్‌లకు సరఫరా చేయబడిన అన్ని టాబ్లెట్‌లలో ఈ డౌట్ క్లియరెన్స్ బాట్ పొందుపర్చబడుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ వంటి సబ్జెక్టులకు సంబంధించిన సందేహాలను క్లియర్ చేయడంలో ఈ యాప్ సహాయపడుతుంది.

విద్యార్థులు వారి ప్రశ్నలను టెక్స్ట్ లేదా వాయిస్ ఫార్మాట్‌లో అడిగిన సందర్భంలో ఈ యాప్ వారికి సమగ్రమైన సమాధానాన్ని అందిస్తుంది. విద్యార్థుల అభ్యాస అంతరాలను గుర్తించడంలో మరియు వారికి లక్ష్య మద్దతును అందించడంలో ఈ యాప్ ఉపాధ్యాయులకు సహాయపడుతుందని కూడా భావిస్తున్నారు.

స్మార్ట్ టెక్ ప్రాజెక్ట్‌లో యూకే, తమిళనాడు భాగస్వామ్య ఒప్పందం

యూకే మరియు తమిళనాడులు స్మార్ట్ టెక్ సస్టెయినబుల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌లో కలిసి పని చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి. స్థిరమైన నీరు, వ్యర్థాలు మరియు వనరుల నిర్వహణ కోసం స్మార్ట్ టెక్నాలజీ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. స్మార్ట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ యూజింగ్ ఐఓటీ టెక్నాలజీస్ ఫర్ ఎ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్" పేరుతో ఈ ప్రాజెక్ట్ అమలు చేయబడుతుంది. ఈ ప్రాజెక్ట్ యూకే-మద్దతుగల ఫ్రాంటియర్ టెక్నాలజీ లైవ్ స్ట్రీమింగ్ (FTL) ప్రోగ్రామ్‌లో భాగంగా ఎంపిక చేయబడింది.

నీరు మరియు వ్యర్థాల నిర్వహణ, అలాగే పర్యావరణ నాణ్యతపై నిజ-సమయ డేటాను సేకరించడానికి సెన్సార్లను ఉపయోగించడం ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ డేటా ట్రెండ్‌లు మరియు నమూనాలను గుర్తించడానికి విశ్లేషించబడుతుంది, ఇది వనరుల కేటాయింపు మరియు నిర్వహణ గురించి సమాచార నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించబడుతుంది.

ఈ ప్రాజెక్ట్ వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడానికి స్మార్ట్ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తోంది. వ్యర్థ సేకరణ వాహనాల కదలికను ట్రాక్ చేయడానికి సిస్టమ్ సెన్సార్‌లను ఉపయోగిస్తుంది మరియు వాటి మార్గాలను ఆప్టిమైజ్ చేయడానికి ఈ సమాచారాన్ని ఉపయోగిస్తుంది. ఇది ఇంధన వినియోగం మరియు ఉద్గారాలను తగ్గించడానికి సహాయపడుతుంది.

మాగ్నస్‌ను ఓడించిన మూడో భారతీయుడుగా కార్తికేయ మురళి

ఖతార్ మాస్టర్స్‌లో 24 ఏళ్ల భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ కార్తికేయ మురళి, క్లాసికల్ చెస్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించిన మూడవ భారతీయ ఆటగాడిగా నిలిచాడు. హరికృష్ణ, విశ్వనాథన్ ఆనంద్ తర్వాత కార్ల్‌సెన్‌ను ఓడించిన ఘనత కార్తికేయ మురళి దక్కించుకున్నాడు.

జమ్మూ కాశ్మీర్‌లో మొదటి విస్టాడోమ్ రైలు సర్వీస్ ప్రారంభం

జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మరియు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ 19 అక్టోబర్ 2023 న కాశ్మీర్‌లో మొదటి విస్టాడోమ్ రైలు సర్వీసును శ్రీనగర్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభించారు. ఈ ఎయిర్ కండిషన్డ్ విస్టాడోమ్ కోచ్‌లతో కూడిన రైలును సెంట్రల్ కాశ్మీర్‌లోని బుద్గామ్ రైల్వే స్టేషన్ నుండి జమ్మూ డివిజన్‌లోని రాంబన్ జిల్లాలోని బనిహాల్ వరకు భారతీయ రైల్వే నడుపుతోంది.

Post Comment