తెలుగు కరెంట్ అఫైర్స్ జనవరి 2023 : అంతర్జాతీయ అంశాలు
Telugu Current Affairs

తెలుగు కరెంట్ అఫైర్స్ జనవరి 2023 : అంతర్జాతీయ అంశాలు

2023 జనవరి నెలకు సంబంధించిన సమకాలిన అంతర్జాతీయ అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే, బ్యాంకింగ్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి వివిధ పోటీ పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులకు ఈ అంశాలు ఉపయోగపడతాయి.

యూరోపియన్ యూరోను కరెన్సీగా స్వీకరించిన క్రొయేషియా

యూరోపియన్ యూనియన్ యొక్క సరికొత్త సభ్య దేశమైన క్రొయేషియా 1 జనవరి 2023 నుండి యూరోను కరెన్సీగా స్వీకరించింది. 2015లో లిథువేనియా చేరిన తర్వాత యూరోజోన్‌లో జాయిన్ అయినా 20వ సభ్య దేశంగా అవతరించింది. దీనితో పాటుగా 4 మిలియన్ల క్రొయేషియా జనాభాను ఐరోపా సరిహద్దు రహిత స్కెంజెన్ జోన్‌లో చేర్చింది. క్రొయేషియా రాజధాని నగరం జగ్రెబ్.

క్రొయేషియా 2003 లో ఈయూ సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుంది. 2005 నుండి 2011 వరకు ఇది అనేక చర్చలతో పెండింగులో ఉంచబడింది. 9 డిసెంబర్ 2011న ఈయూ మరియు క్రొయేషియా నాయకులు చేరిక ఒప్పందంపై సంతకం చేశారు. 1 జూలై 2013న 27వ ఈయూ సభ్య దేశంగా క్రొయేషియా అవతరించింది.

యూరోపియన్ యూనియన్ అనేది ఐరోపాలో ఉన్న 27 సభ్య దేశాలతో కూడిన అత్యున్నత ఖండాంతర రాజకీయ మరియు ఆర్థిక సంఘం. దీనిని 1 నవంబర్ 1993 లో ఏర్పాటుచేశారు. ఈయూ మొత్తం వైశాల్యం 4,233,255.3 కిమీ². మొత్తం జనాభా సుమారు 447 మిలియన్లు. యూరోపియన్ యూనియన్ దేశాల మధ్య ఎటువంటి సరిహద్దు పరిమితులు ఉండవు. ఆయా దేశాల మధ్య సరిహద్దు దాటేందుకు వీసా అవసరం ఉండదు.

27 ఈయూ దేశాలు : ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, క్రొయేషియా, రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగరీ, ఐర్లాండ్, ఇటలీ, లాట్వియా, లిథువేనియా, లక్సెంబర్గ్, మాల్టా, నెదర్లాండ్స్, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, పోర్చుగల్, , స్లోవేనియా, స్పెయిన్ మరియు స్వీడన్.

బ్రెజిల్ అధ్యక్షుడిగా లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా

లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా జనవరి 1న బ్రెజిల్ అధ్యక్షుడిగా మూడవసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. లూలా డా సిల్వా గతంలో 2003 నుండి 2010 వరకు బ్రెజిల్‌కు నాయకత్వం వచించాడు. మిలియన్ల మంది బ్రెజిలియన్లు పేదరికం నుండి తప్పించుకోవడానికి సహాయం చేసిన నాయకుడిగా ఘనత పొందారు.

లూలా డా సిల్వా గతంలో మనీలాండరింగ్‌ సంబంధించి భారీ అవినీతి కుంభకోణంలో చిక్కుకున్నాడు. సుమారు ఏడాదిన్నర జైలు జీవితం గడిపాడు. అయితే 2019లో ఈ కేసు కొట్టివేయబడింది. ఈ కేసులో న్యాయమూర్తి పక్షపాతంతో వ్యవహరించారనే కారణంతో ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం అతని నేరారోపణను రద్దు చేసింది.

చైనాలో తొలి సెమీ హైస్పీడ్ హైడ్రోజన్ రైలు ప్రారంభం

అర్బన్ రైల్వేస్ కోసం ఆసియాలో మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైళ్లను ప్రారంభించిన దేశంగా చైనా అవతరించింది. గంటకు160 కిమీ గరిష్ట వేగంతో నడిచే ఈ రైళ్లు, ఒకసారి రీఫిల్ చేస్తే 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించనున్నాయి. ఈ రైళ్లను చైనా రైల్వే రోలింగ్ స్టాక్ కార్పొరేషన్ లిమిటెడ్ రూపొందించింది.

ప్రపంచ మొదటి హైడ్రోజన్ రైలును జర్మనీ 2021లో ప్రారంభించింది. ఇది ఒకసారి ఇంధనం నింపితే దాదాపు 1175 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంది. హైడ్రోజన్ రైళ్లు రాబోయే కాలంలో పర్యావరణ కాలుష్యం తగ్గించడంలో, శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడంలో గణనీయమైన పాత్రను పోషించనున్నాయి. కర్బన ఉద్గారాల తగ్గించేందుకు ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ నడుం బిగించడంతో హైడ్రోజన్ ఆధారిత రవాణా వ్యవస్థ ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

ఇండియా కూడా డిసెంబర్ 2023 నాటికి హెరిటేజ్ మార్గాల్లో హైడ్రోజన్ రైళ్లను నడిపేందుకు సిద్దమవుతుంది. భారతదేశంలో హైడ్రోజన్‌తో నడిచే కొత్త రైళ్లకు వందే మెట్రో అని పేరు పెట్టనున్నారు. 1950-1960ల నుండి ఉపయోగించబడుతున్న ప్రస్తుత లాట్ రైళ్లతో వీటిని భర్తీ చేయనున్నారు. హైడ్రోజన్ రైళ్లు కర్బన ఉద్గారాలను భారీగా తగ్గించడంలో మరియు వాతావరణ లక్ష్యాలను సాధించడంలో దేశానికి సహాయపడతాయి.

యూరోపియన్ యూనియన్ అధ్యక్ష హోదాలో స్వీడన్

2023 మొదటి ఆరు నెలలకు సంబంధించి యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ యొక్క రొటేటింగ్ ప్రెసిడెన్సీని స్వీడన్ స్వీకరించింది. ఈయూ కౌన్సిల్ ఆఫ్ ప్రెసిడెన్సీ హోదా ప్రతి ఆరు నెలలకు ఈయూ సభ్య దేశాల మధ్య మారుతుంది. గడిసిన ఆరు నెలలలో ఈ హోదా చెక్ రిపబ్లిక్ చేతిలో ఉండేది. ఆరు నెలల వ్యవధిలో ఈయూ సంబంధించి అధికారిక కార్యక్రమాలను స్వీడన్ అధ్యక్షతన జరుపబడతాయి.

యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ యొక్క రొటేటింగ్ ప్రెసిడెన్సీ హోదాను ప్రతి ఆరు నెలలకు ఒక సభ్య దేశం స్వీకరిస్తుంది. ప్రెసిడెన్సీ రొటేషన్ ప్రతి సంవత్సరం జనవరి 1 మరియు జూలై 1 న జరుగుతుంది. ఈయూలో ప్రస్తుతం 27 సభ్య దేశాలు ఉన్నాయి.

ప్రిన్స్ హ్యారీ "స్పేర్" పుస్తకం విడుదల

బ్రిటిష్ రాజకుటుంబ సభ్యుడైన ప్రిన్స్ హ్యారీ యొక్క "స్పేర్" పుస్తకం మార్కెట్లోకి విడుదల అయ్యింది. తన కుటుంబ సభ్యులు పిలిచే స్పేర్ పేరుతో తన జ్ఞాపకాలను ఈ పుస్తకంలో పొందుపర్చాడు. పెంగ్విన్ రాండమ్ హౌస్ నుండి పబ్లిష్ అయినా ఈ పుస్తకాన్ని అవార్డ్ విన్నింగ్ జర్నలిస్ట్ రచయిత జేఆర్ మోహ్రింగర్ రచించారు.

స్పేర్ పుస్తకంలో ప్రిన్స్ హ్యారీ యొక్క చిన్ననాటి జ్ణాపకాల నుండి క్వీన్ ఎలిజబెత్ II అంత్యక్రియల వరకు అన్ని అంశాలను చర్చించారు. ప్రస్తుతం ఈ పుస్తకం అత్యంత వేగంగా అమ్ముడవుతున్న నాన్-ఫిక్షన్ పుస్తకం'గా మారింది. ప్రిన్స్ హ్యారీ, కింగ్ చార్లెస్ III మరియు అతని మొదటి భార్య డయానా, వేల్స్ యువరాణికి చిన్న కుమారుడు. ఈయన బ్రిటీష్ సింహాసనం యొక్క వారసత్వ వరుసలో ఐదవవాడు.

రాజ కుటుంభ సంప్రదాయాలకు వ్యతిరేకంగా మేఘన్ మార్కెల్‌తో ప్రేమ వివాహం చేసుకోవడం వలన ప్రిన్స్ హ్యారీ గత కొద్దీ ఏళ్లుగా బ్రిటిస్ రాజవంశానికి దూరంగా ఉన్నాడు. రాజకుటుంబ సంప్రదాయాలను, వారసత్వా ఆదాయాన్ని వదులుకున్నాడు. ప్రస్తుతం మేఘన్ మార్కెల్‌తో కలిసి కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నారు. వీరి ప్రేమ కథకు సంబంధించి హ్యారీ & మేఘన్ పేరుతొ వచ్చిన నెట్‌ఫ్లిక్స్‌ వెబ్ సిరీస్ కోసం దాదాపు $100 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కూర్చుకున్నారు.

న్యూజిలాండ్‌ ప్రధాని పదవికి జసిందా ఆర్డెర్న్‌ రాజీనామా

న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జసిండా ఆర్డెర్న్ వచ్చే ఫిబ్రవరి 7న పదవీ విరమణ చేయనున్నట్లు ప్రకటించారు. కరోనా పాండమిక్ సమయంలో దీటైన పాలసీతో ప్రపంచ దేశాలను ఆకర్షించిన జసిండ, కొద్దీ కాలంలోనే చక్కని పని తీరుతో ఉత్తమ ప్రధానిగా గుర్తింపు పొందారు. గత ఆరేళ్లుగా ఆమె న్యూజీలాండ్ ప్రధాని బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఈ ఏడాది అక్టోబరులో న్యూజీలాండ్ సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. కాగా ప్రధానిగా ఇంకా తనకు కొనసాగే సామర్థ్యం లేదనే కారణంతో పదవి నుండి వైదొలుగుతున్నారు. అలానే త్వరలో జరిగే ఎన్నికలలో పాల్గొనే అవకాశం లేనట్లు వెల్లడించారు. జసిందా ఆర్డెర్న్ 2017లో, 37ఏళ్ళ చిన్న వయసులో న్యూజిలాండ్ ప్రధాన మంత్రిగా ఎన్నికైన ఘనత దక్కించుకున్నారు.

2023 అంతర్జాతీయ విద్యా దినోత్సవం ఆఫ్ఘన్ బాలికలకు అంకితం

యునెస్కో ఈ ఏడాది అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని ఆఫ్ఘనిస్తాన్‌లో విద్యా హక్కును కోల్పోయిన బాలికలు మరియు మహిళలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించింది. వారి విద్యపై విధించిన ఆంక్షల నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. ఈ ఏడాది అంతర్జాతీయ విద్యా దినోత్సవం 'To Invest in People, Prioritize Education' అనే థీమ్‌తో నిర్వహించబడింది.

తాలిబన్ల అధికారంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశంలో భారీ స్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి. తాలిబాన్ విజయం ఆఫ్ఘనిస్తాన్‌ను మానవతా సంక్షోభం నుండి విపత్తు వైపు నడిపిస్తుంది. ఉపాధి, నివాసాలు కోల్పోయిన మిలియన్ల మంది ఆఫ్ఘన్‌లు తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు.

Post Comment