January 07, 2024 Current affairs in Telugu | రోజువారీ కరెంట్ అఫైర్స్
January Telugu Current Affairs

January 07, 2024 Current affairs in Telugu | రోజువారీ కరెంట్ అఫైర్స్

January 07, 2024 Current affairs in Telugu. పోటీ పరీక్షల రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో పొందండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షల కొరకు సిద్దమవుతున్న ఆశావహులకు ఉపయోగపడతాయి

Advertisement

విద్యార్థుల కోసం ప్రేరణ కార్యక్రమం ప్రారంభించిన విద్యా శాఖ

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, పాఠశాల విద్యార్థుల కోసం ప్రేరణ అనే ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రాంను ప్రారంభించింది. ఈ కార్యక్రమంను జాతీయ విద్యా విధానం 2020కు అనుగుణంగా విద్యార్థులలో అనుభవపూర్వక విద్యను (హెరిటేజ్ ఇన్నోవేషన్‌) పెంపొందించే లక్ష్యంతో రూపొందించింది.

ప్రేరణ అనేది 9 నుండి 12 తరగతుల విద్యార్థుల కోసం రూపొందించబడిన వారం రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ సాంప్రదాయ తరగతి గది పద్ధతుల స్థానంలో ప్రయోగాత్మక కార్యకలాపాలు, ప్రాజెక్ట్‌లు మరియు ఫీల్డ్ విజిట్‌ల ద్వారా నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో స్వావలంబన, ధైర్యం, కృషి, కరుణ మరియు ఐక్యత వంటి ముఖ్యమైన విలువలను పెంపొందించడంపై దృష్టి పెడుతుంది.

ఈ కార్యక్రమం భారతదేశంలోని పురాతన నగరాలలో ఒకటైన వాద్‌నగర్‌ (గుజరాత్) లోని చారిత్రాత్మకమైన పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఈ వెర్నాక్యులర్ స్కూల్ 1888లో స్థాపించబడింది. విద్యార్థులు ఈ ప్రోగ్రామ్ కోసం ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి వారం 20 మంది విద్యార్థులతో కూడిన బ్యాచ్ (10 మంది బాలురు మరియు 10 మంది బాలికలు) హాజరు కావడానికి ఎంపిక చేయబడతారు.

ఈ రోజువారీ ప్రోగ్రామ్ షెడ్యూల్‌లో భాగంగా యోగా, మైండ్‌ఫుల్‌నెస్ మరియు మెడిటేషన్ సెషన్‌లు నిర్వహిస్తారు. వీటికి అదనంగా ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ నేపథ్య సెషన్‌లు, ఆసక్తికరమైన అభ్యాస కార్యకలాపాలు ఉంటాయి. సాయంత్రం నిర్వహించే కార్యకలాపాలలో పురాతన మరియు వారసత్వ ప్రదేశాల సందర్శనలు, స్ఫూర్తిదాయకమైన చలనచిత్ర ప్రదర్శనలు, మిషన్ లైఫ్ వంటి సృజనాత్మక కార్యకలాపాలు, టాలెంట్ షోలు మొదలైనవి నిర్వహిస్తారు.

రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ 2023 విజేతలు

యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ 'రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్' 2023ని జనవరి 4న ప్రకటించింది. ఈ అవార్డులను 09 జనవరి 2024 న రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి చేతుల మీదగా అందజేశారు. ఈ ఏడాది ఈ అవార్డును బెంగళూరులోని జైన్ యూనివర్సిటీ మరియు ఒడిషా మైనింగ్ కార్పొరేట్ లిమిటెడ్ అందుకున్నాయి.

  • బెంగళూరు జైన్ యూనివర్సిటీ : వర్ధమాన / యువ ప్రతిభను గుర్తించడం మరియు పెంపొందించడం కోసం.
  • ఒడిషా మైనింగ్ కార్పొరేట్ లిమిటెడ్ : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద క్రీడలకు ప్రోత్సాహం కల్పించినందుకు.

రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ అనేది క్రీడల ప్రోత్సాహం మరియు అభివృద్ధిలో కృషి చేసే కార్పొరేట్ సంస్థలకు (ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగం), క్రీడా నియంత్రణ బోర్డులు, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో క్రీడా సంస్థలు, స్వచ్చంద సంస్థలకు అందించబడుతుంది.

భారతదేశ జాతీయ క్రీడా పురస్కారాలలో భాగంగా అందించే ఆరు ప్రధాన అవార్డులు అయిన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు, మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీతో పాటుగా రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ కూడా అందులో భాగం.

ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వికాస్ షీల్‌

మనీలాలోని ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సీనియర్ బ్యూరోక్రాట్ వికాస్ షీల్ నియమితులయ్యారు. వికాస్ షీల్, ఛత్తీస్‌గఢ్ కేడరుకు చెందిన 1994-బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. ప్రస్తుతం ఈయన జల్ శక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని జల్ జీవన్ మిషన్‌లో అదనపు కార్యదర్శి మరియు మిషన్ డైరెక్టర్‌గా ఉన్నారు. వికాస్ షీల్ సహా మరో ఏడుగురు సివిల్ సర్వెంట్లను విదేశాల్లోని కీలక పోస్టుల్లో నియమించారు.

  • సీనియర్ బ్యూరోక్రాట్ కళ్యాణ్ రెవెల్లా బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయంలో కౌన్సెలర్ (ఎకనామిక్)గా నియమితులయ్యారు.
  • ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన 2002-బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన సెంథిల్ పాండియన్ సి, జెనీవాలోని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యందు అంబాసిడర్/ పర్మనెంట్ మిషన్ ఆఫ్ ఇండియా పదవికి నియమించబడ్డారు.
  • తమిళనాడు కేడర్‌కు చెందిన 2005 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఎం బాలాజీ, బ్రస్సెల్స్‌లోని భారత రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌గా నియమితులయ్యారు.
  • 2004 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి పర్వీన్ కుమార్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (వాషింగ్టన్ డీసీ) కి  ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా నియమితులయ్యారు.
  • 2012 బ్యాచ్ ఇండియన్ ట్రేడ్ సర్వీస్ అధికారి అయిన తనూ సింగ్, జెనీవాలోని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యందు పర్మనెంట్ మిషన్ ఆఫ్ ఇండియాగా నియమితులయ్యారు.
  • సీనియర్ అధికారి స్మితా సారంగి, మనీలాలోని ఎడిబి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కి సలహాదారుగా మూడేళ్ల కాలానికి నియమితులైనారు.

భారత ఒలింపిక్ సంఘం సీఈవోగా రఘురామ్ అయ్యర్

ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు రాజస్థాన్ రాయల్స్ మాజీ అధికారి రఘురామ్ అయ్యర్‌ నియమించబడ్డారు. క్రీడా రంగంలో ఆయనుకున్న అనుభవం, స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ మరియు అడ్మినిస్ట్రేషన్‌లో అతని ట్రాక్ రికార్డు ఈ హోదా వరించేలా సహాయపడ్డాయి.

భారత ఒలింపిక్ సంఘం అనేది భారతదేశంలో ఒలింపిక్ క్రీడలు మరియు కామన్వెల్త్ క్రీడలకు సంబందించిన పాలకమండలి. ఇది భారతదేశంలో క్రీడా ఈవెంట్లను నిర్వహించడంతో పాటుగా ఒలింపిక్ క్రీడలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులను ఎంపిక చేసే బాధ్యతను కలిగి ఉంటుంది. ఇది 1927లో ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. దీని ప్రస్తుత అధ్యక్షురాలుగా పీటీ ఉష బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

వీర్ గాథ ప్రాజెక్టులో 1.36 కోట్ల మంది పాఠశాల విద్యార్థులు భాగస్వామ్యం

డిఫెన్స్ మినిస్ట్రీ నిర్వహించిన వీర్ గాథ ప్రాజెక్ట్ యొక్క 3వ ఎడిషన్‌లో దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు యుటిల నుండి 1.36 కోట్ల మంది పాఠశాల విద్యార్థులు పాల్గొన్నట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విద్యార్థులు సాయుధ దళాల అధికారులు/సిబ్బంది యొక్క ధైర్యసాహసాలు మరియు త్యాగాలను గౌరవిస్తూ పద్యాలు, పెయింటింగ్‌లు, వ్యాసాలు మరియు వీడియోలు పంపించినట్లు వెల్లడించింది. వీటిని గ్యాలంట్రీ అవార్డ్స్ పోర్టల్ ద్వారా స్వీకరించారు.

ప్రాజెక్ట్ వీర్ గాథ, 2021లో గ్యాలంట్రీ అవార్డ్స్ పోర్టల్ ద్వారా స్థాపించబడింది. ఇది గ్యాలంట్రీ అవార్డు గ్రహీతల ధైర్య సాహసాలను, వారి జీవిత కథలను విద్యార్థులతో పంచుకునే ఒక కార్యక్రమం. విద్యార్థులలో దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించడానికి, వారిలో పౌర స్పృహ విలువలు పెంపొందించడానికి నిర్వహిస్తున్నారు. వీర్ గాథా ప్రాజెక్ట్ యొక్క రెండు ఎడిషన్లు వరుసగా 2021 మరియు 2022లో నిర్వహించబడ్డాయి.

దీనికి అదనంగా దేశంలోని గ్యాలంట్రీ అవార్డు విజేతల గురించి పాఠశాల విద్యార్థులలో అవగాహన తీసుకురావడానికి, రక్షణ మంత్రిత్వ శాఖ, దాని ఫీల్డ్ ఆర్గనైజేషన్లు లేదా ఆర్మీ/నేవీ/వైమానిక దళం ద్వారా, పాఠశాలలో వర్చువల్/ ముఖాముఖి అవగాహన కార్యక్రమాలు/సెషన్లను నిర్వహించి, విజేతలకు నగదు బహుమతి అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విద్యా మంత్రిత్వ శాఖ & రక్షణ మంత్రిత్వ శాఖలు ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి.

జల్ జీవన్ మిషన్ కింద 14 కోట్ల గ్రామీణ కుటుంబాలకు నీటి కనెక్షన్‌లు

జల్ జీవన్ మిషన్ కింద ఈ ఏడాది మొదటి వారానికి 14 కోట్ల (72.71%) గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్‌లు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ముఖ్యమైన మైలురాయిని ఈ కార్యక్రమం ప్రారంభించిన కేవలం నాలుగు సంవత్సరాలలోనే సాధించినట్లు పేర్కొంది. ఈ ముఖ్యమైన విజయం గ్రామీణాభివృద్ధిలో ఒక నమూనా మార్పును తీసుకొస్తుందని భావిస్తుంది.

జల్ జీవన్ మిషన్, 15 ఆగస్ట్ 2019లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకం 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని గృహాలకు వ్యక్తిగత గృహ కుళాయి కనెక్షన్ల ద్వారా సురక్షితమైన మరియు తగినంత త్రాగునీటిని అందించడానికి ఉద్దేశించబడింది. దీనికి సంబంధించి ఈ ఏడాది మొదటి వారానికే 72.71 శాతం మార్కుని చేరుకుంది. ఈ ఏడాది చివరి నాటికి వంద శాతం లక్ష్యాన్ని చేరుకోనుంది.

జల్ జీవన్ మిషన్ కింద ప్రస్తుతం గోవా, తెలంగాణా, హర్యానా, గుజరాత్, పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు 100 శాతం కవరేజీని సాధించాయి. మూడు కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, డామన్ & డయ్యు మరియు దాద్రా నగర్ హవేలీ మరియు అండమాన్ నికోబర్ దీవులు కూడా 100 శాతం కవరేజీ నమోదు చేసాయి. మిజోరం 98.68%, అరుణాచల్ ప్రదేశ్ 98.48% మరియు బీహార్ 96.42% సమీప భవిష్యత్తులో ఈ మైలురాయి సాధించే దిశగా ఉన్నాయి.

ఈ కార్యక్రమం కింద కేవలం గృహ కనెక్షన్లు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా 9.24 లక్షల (90.65%) పాఠశాలలు మరియు 9.57 లక్షల (86.63%) అంగన్‌వాడీ కేంద్రాలలో కుళాయి నీటి సరఫరాను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనితో పాటుగా హర్ ఘర్ జల్ చొరవ కింద గణనీయమైన సామాజిక-ఆర్థిక ప్రయోజనాలను తీసుకొచ్చారు. ఇది ప్రధానంగా గ్రామీణ మహిళలకు ప్రతిరోజూ నీటిని సేకరించే కష్టతరమైన పని నుండి విముక్తి కల్పించింది. ఈ ఆదా చేసిన సమయం వారి ఆదాయాన్ని పెంచే కార్యకలాపాలు, నైపుణ్యాభివృద్ధి మరియు పిల్లల విద్యకు మద్దతుగా నిలుస్తుంది.

హర్ ఘర్ జల్ అనేది 2019లో జల్ జీవన్ మిషన్ కింద భారత ప్రభుత్వ జల్ శక్తి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పథకం. ఇది 2024 నాటికి దీర్ఘకాలిక ప్రాతిపదికన ప్రతి గ్రామీణ ఇంటికి, తలసరి రోజుకు క్రమం తప్పకుండా 55 లీటర్ల పంపు నీటిని అందించాలనే లక్ష్యంతో ప్రారంభించారు.

Advertisement

Post Comment