Advertisement
జాతీయ అంశాలు | జనవరి 2022
Telugu Current Affairs

జాతీయ అంశాలు | జనవరి 2022

మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రధాని శంకుస్థాపన

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు. 700 కోట్ల అంచనా వ్యయంతో జిల్లాలోని సర్ధానా పట్టణం శివార్లలోని సలావా మరియు కైలీ గ్రామాలలో యూనివర్సిటీని స్థాపించనున్నారు. ధ్యాన్ చంద్ భారతీయ హాకీ సూపర్ స్టారుగా ప్రసిద్ధి. ఈయన్ను అభిమానంగా హాకీ విజర్డ్ లేదా మాంత్రికుడిగా సంబోధిస్తారు. ధ్యాన్ చంద్ 1928, 1932, మరియు 1936 ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, విజేతగా నిలిచాడు.

హైదరాబాద్‌ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ 'నుమాయిష్ 2022'

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హైదరాబాద్‌లో 81వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ' నుమాయిష్ 2022'ను ప్రారంభించారు. నుమాయిష్ (Numaish) ఎగ్జిబిషన్ ఏటా తెలంగాణాలోని హైదరాబాద్‌లో జరిగే వార్షిక వినియోగదారుల ప్రదర్శన. ఈ ఎగ్జిబిషన్ నాంపల్లిలోని 23 ఎకరాల శాశ్వత వేదికలో ఏటా 46 రోజుల పాటు నిర్వహించబడే ప్రపంచంలోని ఏకైక ఈవెంట్‌గా ప్రసిద్ధికెక్కింది. ఈ ఏడాది 1 జనవరి  నుండి ఫిబ్రవరి 15 వరకు ఈ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు.

ఈ ఎగ్జిబిషన్ ద్వారా వివిధ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ శాఖలు అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రజలకు చేరువయ్యేందుకు ఉపయోగించుకుంటాయి. దీనిని మొదట గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా సి రాజగోపాలాచారి ప్రారంభించారు. 1949 నుండి ఇది ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌గా పేరు మార్చబడింది. 2009లో దీని పేరు నుమాయిష్‌గా మార్చబడింది. నుమాయిష్‌ అనగా Numaish Masnuāt-e-Mulki (స్థానిక ఉత్పత్తుల ప్రదర్శన) అని అర్ధం.

ఒడిశా బాల్య వివాహ రహిత జిల్లాగా గంజాం

ఒడిశాలోని గంజాం జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా ప్రకటిస్తున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ విజయ్ అమృత కులంగే తెలిపారు. ఒడిశా రాష్ట్రంలో బాల్య వివాహ రహిత జిల్లాగా ప్రకటించిన మొదటి జిల్లా గంజాం చరిత్రకెక్కింది. ఈ జిల్లా పరిధిలో 3,309 గ్రామాలు, 503 గ్రామ పంచాయతీలు బాల్య వివాహ రహితంగా ఉన్నట్లు వెల్లడించారు. బాల్య వివాహలను రూపుమాపేందుకు ఈ జిల్లా అడ్మినిస్ట్రేషన్ 2019 లో ప్రారంభించిన నిర్భయ కాధీ ప్రోగ్రాంలో భాగంగా యూనిసెఫ్ సహాయ సహకారాలతో ఈ అద్భుతాన్ని సాధించారు.

దేశంలో మొదటి ఎల్‌పిజి ఎనేబుల్డ్ & స్మోక్ ఫ్రీ స్టేట్‌గా హిమాచల్ ప్రదేశ్

దేశంలో మొదటి ఎల్‌పిజి ఎనేబుల్డ్ & స్మోక్ ఫ్రీ స్టేట్‌గా హిమాచల్ ప్రదేశ్ రికార్డుకెక్కింది. ఈ అరుదైన ఘనతను కేంద్రం ఉజ్వల పథకంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన గ్రాహిణి సువిధ యోజన ద్వారా ఈ మైలురాయిని సాధించారు. కట్టెల పొయ్యలను వదిలించుకోవడానికి ప్రభుత్వం ఉజ్వల పథకాన్ని ప్రవేశపెట్టింది. అలానే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను ఆదుకునేందుకు గ్రాహిణి సువిధ పథకాన్ని ప్రవేశపెట్టారు.

హైద్రాబాదులో భారతదేశపు మొదటి 'ఓపెన్ రాక్‌' మ్యూజియం ప్రారంభం

కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ భారతదేశపు మొట్టమొదటి 'ఓపెన్ రాక్ మ్యూజియం'ని హైద్రాబాదులోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ - నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-NGRI) ప్రాంగణంలో ప్రారంభించారు. ఈ మ్యూజియంలో భారతదేశంలోని వివిధ కాలాల నాటి 35 రకాల విభిన్న రాళ్లను ప్రదర్శనకు ఉంచారు. విభిన్న రాళ్లపై ప్రజలకు అవగహన కల్పించేందుకు ఈ మ్యూజియం ఏర్పాటు చేసారు.

ఉత్తరప్రదేశ్‌కు నేషనల్ వాటర్ అవార్డు

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ యొక్క నేషనల్ వాటర్ అవార్డ్ 2020 ను ఉత్తరప్రదేశ్ కైవసం చేసుకుంది. భారతదేశంలో జలవనరుల నిర్వహణకు సంబంధించి సమగ్ర విధానాన్ని అవలంబించినందుకుగానూ ఇది అవార్డు అందిస్తారు. నేషనల్ వాటర్ అవార్డును 2018 నుండి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అందిస్తుంది.

ఈశాన్య భారత్'లో మొదటి జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు

ఈశాన్య రాష్ట్రాలలో మొదటి జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలును కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. మణిపూర్ నుండి అస్సాం మీదుగా త్రిపురను కలిపే మొదటి జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలును 08 జనవరి 2022న రైల్వే బోర్డు నుండి వీడియో లింక్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు.

జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ అనేది శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కి 'డౌన్-స్కేల్' వెర్షన్‌గా పరిగణించవచ్చు. ఇవి ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలను కలుపుతూ, తక్కువ టిక్కెట్ ధరతో ప్రీమియం ప్రయాణ అనుభూతిని అందించే ఇంటర్-సిటీ సూపర్‌ఫాస్ట్ రైళ్లు. దీన్ని సామాన్యుల శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌. దేశంలో ప్రస్తుతం ప్రధాన నగరాలు మరియు పట్టణాలను కలుపుతూ 23 జతల జన శతాబ్ది రైళ్లు నడుస్తున్నాయి.

కెవాడియా రైల్వే స్టేషన్‌కు ఏక్తా నగర్ రైల్వే స్టేషన్‌గా పేరు మార్పు

గుజరాత్‌లోని నర్మదా జిల్లాకు చెందిన కేవడియా రైల్వే స్టేషన్ పేరును ఏక్తా నగర్ రైల్వేగా మార్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. రైల్వే స్టేషన్ కోడ్ KDCY నుండి EKNR కు మార్చబడింది.

గణతంత్ర దినోత్సవ ఆరంభ వేడుకల తేదీ మార్పు

దేశంలో ఇకముందు గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 23 నుండి ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదివరకు ఏటా జనవరి 24 న ప్రారంభమయ్యే గణతంత్ర దినోత్సవ వేడుకలు, ఈ ఏడాది నుండి సుభాష్ చంద్ర జన్మదిన గౌరవార్థం జనవరి 23 నుండి ప్రారంభించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి 23 న ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. నేతాజీ జయంతిని ఏటా పరాక్రమ్ దివాస్'గా జరుపుకుంటారు.

ఆస్కార్ రేసులో సూర్య 'జై భీమ్', మోహన్ లాల్ 'మరక్కర్' చిత్రాలు

తమిళ నటుడు సూర్య నటించిన లీగల్ డ్రామా 'జై భీమ్' మరియు మోహన్‌లాల్ యొక్క మలయాళ యాక్షన్ చిత్రం 'మరక్కర్' చిత్రాలు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయినా భారతీయ సినిమాలుగా నిలిచాయి. 94వ అకాడమీ అవార్డ్స్‌లో నామినేట్ కావడానికి పోటీలో ఉన్న 276 చిత్రాల షార్ట్‌లిస్ట్‌లో  ఈ రెండు చోటు దక్కించుకున్నాయి. 94వ అకాడమీ అవార్డుల వేడుక 27 మార్చి 2022 న జరగనుంది.

13 కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్ జిల్లాల సంఖ్య 26కి చేరింది. కొత్త జిల్లాలను పార్లమెంటరీ నియోజకవర్గాల ఆధారంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండు జిల్లాలుగా విడిపోనున్న విశాఖపట్నంలోని అరకు లోక్‌సభ నియోజకవర్గంతో సహా ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 24 లోక్‌సభ నియోజకవర్గాలను జిల్లాలుగా మారుస్తున్నారు. దీనికి సంబంధించి కొత్త, పాత జిల్లాలు మరియు వాటి జిల్లా కేంద్రాల తో కూడిన జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది.

1. శ్రీకాకుళం - శ్రీకాకుళం
2. విజయనగరం - విజయనగరం
3. మన్యం జిల్లా - పార్వతీపురం (కొత్తది)
4. అల్లూరి సీతారామ రాజు జిల్లా - పాడేరు (కొత్త)
5. విశాఖపట్నం - విశాఖపట్నం
6. అనకాపల్లి - అనకాపల్లి (కొత్త)
7. కాకినాడ - కాకినాడ (కొత్తది)
8. కోన సీమ - అమలాపురం (కొత్త)
9. తూర్పుగోదావరి - రాజమహేంద్రవరం
10. పశ్చిమ గోదావరి - భీమవరం
11. ఏలూరు - ఏలూరు (కొత్తది)
12. కృష్ణా - మచిలీపట్నం
13. ఎన్టీఆర్ జిల్లా - విజయవాడ (కొత్త)
14. గుంటూరు - గుంటూరు
15. బాపట్ల - బాపట్ల (కొత్తది)
16. పల్నాడు - నర్సరావుపేట (కొత్త)
17. ప్రకాశం - ఒంగోలు
18. SPS నెల్లూరు - నెల్లూరు
19. కర్నూలు - కర్నూలు
20. నంద్యాల - నంద్యాల (కొత్తది)
21. అనంతపురం - అనంతపురం
22. శ్రీ సత్యసాయి జిల్లా - పుట్టపర్తి (కొత్త)
23. వైఎస్ఆర్ కడప - కడప
24. అన్నమయ్య జిల్లా - రాయచోటి (కొత్త)
25. చిత్తూరు - చిత్తూరు
26. శ్రీ బాలాజీ జిల్లా. - తిరుపతి (కొత్త)

Post Comment