స్పోర్ట్స్ అఫైర్స్ | జనవరి  2022
Telugu Current Affairs

స్పోర్ట్స్ అఫైర్స్ | జనవరి 2022

U19 ఆసియా కప్ విజేతగా భారత్

అండర్ 19 ఆసియా కప్‌ విజేతగా రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి భారత్ తన ఆధిపత్యాన్ని పునరుద్ఘాటించింది. దుబాయిలో జరిగిన తుదిపోరులో ప్రత్యర్థి శ్రీలంకను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి రికార్డు స్థాయిలో ఎనిమిదో అండర్ 19 ఆసియా టైటిల్‌ భారత్ సొంతం చేసుకుంది.

Advertisement

తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ పదవికి రూపా గురునాథ్ రాజీనామా

తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షురాలు రూపా గురునాథ్ తన పదవి నుండి వైదొలిగారు. తన వ్యాపారం మరియు వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టడానికి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో ఒక రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షురాలిగా పనిచేసిన మొదటి మహిళగా రూపా గురునాథ్ రికార్డుకెక్కారు. ఈమె 31 డిసెంబర్ 2019 లో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించారు. అధ్యక్షరాలుగా ఈమె ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ తో పాటుగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్, తమిళనాడు ప్రీమియర్ లీగులను విజయవంతంగా నిర్వహించారు.

వింటర్ ఒలింపిక్స్‌లో 2 ఈవెంట్‌లకు అర్హత పొందిన మొదటి భారతీయుడిగా ఆరిఫ్ మహమ్మద్

ఈ ఏడాది ఫిబ్రవరి 4 నుండి 20 వరకు బీజింగ్‌లో జరగనున్న వింటర్ ఒలింపిక్స్‌లో రెండు వేర్వేరు ఈవెంట్‌లకు అర్హత సాధించిన తోలి భారతదేశపు అథ్లెట్'గా ఆల్పైన్ స్కీయర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ చరిత్రకెక్కాడు. 31 ఏళ్ల ఆరిఫ్ ఖాన్, పురుషుల జెయింట్ స్లాలోమ్ ఈవెంట్‌లో 2022 వింటర్ ఒలింపిక్స్ కోటా స్థానాన్ని పొందాడు. ఆరిఫ్ ఇదివరకే ఆల్పైన్ స్కీయర్ స్లాలోమ్ కేటగిరిలో అర్హుత పొంది ఉన్నాడు.

రోహన్ బోపన్న, రామనాథన్'లకు అడిలైడ్ డబుల్స్ టైటిల్

అడిలైడ్ ఇంటర్నేషనల్ ఏటీపీ 250 ఈవెంట్‌లో భారతదేశానికి చెందిన రోహన్ బోపన్న మరియు రామ్‌కుమార్ రామనాథన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నారు. రోహన్ బోపన్నకు 20వ ఏటీపీ డబల్ టైటిల్ కాగా, భారత ఆటగాడిగా రామ్‌కుమార్ రామనాథన్‌కు ఇది మొదటిది. ఇదిలా ఉండగా ఆష్లీ బార్టీ మరియు గేల్ మోన్‌ఫిల్స్ వరుసగా మహిళల మరియు పురుషుల అడిలైడ్ ఇంటర్నేషనల్ ఏటీపీ సింగిల్స్ ఛాంపియన్‌లుగా నిలిచారు.

ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా టాటా గ్రూప్

భారతదేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన టాటా గ్రూప్, చైనీస్ మొబైల్ తయారీదారు వివో స్థానంలో ఈ సంవత్సరం నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క టైటిల్ స్పాన్సర్‌గా ఉండనున్నట్లు ఐపీఎల్ పాలక మండలి చైర్మెన్ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు. చైనీస్ మొబైల్ తయారీదారు కంపెనీ వివో గతంలో 2018 నుండి 2022 ఏడాదికి గాను 2,200 కోట్లకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను దక్కించుకుంది. 2020 గాల్వాన్ లోయ ఘటన తర్వాత రాజకీయ కారణాలతో గత రెండేళ్లు డ్రీమ్ 11 ఈ హక్కులను దక్కించుకుంది.

లెజెండ్స్ లీగ్ క్రికెట్ అంబాసిడర్‌గా ఝులన్ గోస్వామి

మహిళా సాధికారత కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు గాను లెజెండ్స్ లీగ్ క్రికెట్ అంబాసిడర్‌గా భారత మహిళా పేసర్ ఝులన్ గోస్వామిని నియమించుకుంది. క్రికెట్‌లో మహిళల భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించడానికి గాను ఈ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

ఒలింపిక్ పతక విజేత స్ప్రింటర్ డియోన్ లెండోర్ మృతి

ట్రినిడాడ్ మరియు టొబాగోకు చెందిన ఒలింపియన్ డియోన్ లెండోర్ అమెరికాలోని టెక్సాస్‌లో కారు ప్రమాదంలో 29 సంవత్సరాల వయస్సులో మరణించారు. లెండోర్ 2012, 2016 మరియు 2020 ఒలింపిక్స్‌లో ట్రినిడాడ్ మరియు టొబాగో తరుపున ప్రాతినిథ్యం వహించాడు. లెండోర్ 2016 ప్రపంచ 4x400 మీటర్ల రన్నింగు యందు సిల్వర్ పతకం, 2020 ఒలింపిక్స్‌లో అదే కేటగిరిలో బ్రోన్జ్ పతక విజేతగా నిలిచాడు.

వెయిట్ లిఫ్టింగ్ హై-పెర్ఫార్మెన్స్ డైరెక్టర్‌గా అవీనాష్ పండూ

భారత్ వెయిట్‌లిఫ్టింగ్‌కు మొదటి హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్‌గా మారిషస్ దేశస్థుడు అవీనాష్ పండూ నియామకాన్ని భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదించింది. 2024 పారిస్‌లో జరిగే ఒలింపిక్ క్రీడల వరకు ఆయన ఇండియా వెయిట్‌లిఫ్టింగ్‌కు హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్‌గా ఉండనున్నారు.

భారత టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన విరాట్ కోహ్లి

ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ తర్వాత భారత జట్టు టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించాడు. విరాట్ కోహ్లీ 2014 లో టెస్ట్ క్రికెట్ కెప్టెనుగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి 2022 మధ్య 68 టెస్టులకు నాయకత్వం వహించగా 58.82 (40 విజయాలు) విజయ శాతంతో భారతదేశం యొక్క అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా నిలిచాడు. అలానే ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ విజయం సాధించిన మొదటి ఆసియా కెప్టెనుగా నిలిచాడు.

బ్యాడ్మింటన్ అండర్-19 బాలికల విభాగంలో తస్నిమ్ మీర్ ప్రపంచ నంబర్ 1

గుజరాత్‌కు చెందిన 16 ఏళ్ల తస్నిమ్ మీర్ తాజా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) జూనియర్ ర్యాంకింగ్స్‌లో 10,810 పాయింట్లతో అండర్-19 (U-19) బాలికల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ సాధించిన మొదటి భారతీయురాలుగా నిలిచింది. ఆమె తర్వాత రష్యాకు చెందిన మారియా గొలుబెవా, స్పెయిన్‌కు చెందిన లూసియా రోడ్రిగ్జ్ ఉన్నారు.

రాబర్ట్ లెవాండోస్కీ కి ఫిఫా ది బెస్ట్ మెన్స్ ప్లేయర్ అవార్డు

బేయర్న్ మ్యూనిచ్ యొక్క పోలిష్ స్ట్రైకర్ రాబర్ట్ లెవాండోవ్స్కీ 2021 కి ఫిఫా బెస్ట్ మెన్స్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు, మహిళల కేటగిరిలో  సోమవారం బార్సిలోనా యొక్క స్పానిష్ మిడ్‌ఫీల్డర్ అలెక్సియా పుటెల్లాస్ ఫిఫా బెస్ట్ ఉమెన్స్ ప్లేయర్ బహుమతిని గెలుచుకుంది.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అవార్డులు 2021

  • పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ : షాహీన్ అఫ్రిది (పాకిస్తాన్)
  • పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ : జో రూట్ (ఇంగ్లాండ్)
  • పురుషుల వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ : బాబర్ ఆజం (పాకిస్తాన్)
  • పురుషుల టీ20I క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ : మహ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్)
  • పురుషుల ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ : జననేమన్ మలన్ (దక్షిణాఫ్రికా)
  • మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ : స్మృతి మంధాన (ఇండియా)
  • మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ : లిజెల్ లీ (దక్షిణాఫ్రికా)
  • మహిళల టీ20I క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ : టామీ బ్యూమాంట్ (ఇంగ్లాండ్)
  • మహిళా ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ : ఫాతిమా సనా (పాకిస్తాన్)
  • అంపైర్ ఆఫ్ ది ఇయర్ : మరైస్ ఎరాస్మస్ (దక్షిణాఫ్రికా)

సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్‌ టైటిల్ విజేతగా పీవీ సింధు

సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌ మహిళల సింగిల్స్‌ విజేతగా పివి సింధు నిలిచింది. లక్నోలో జరిగిన ఫైనల్‌లో ప్రపంచ 84వ ర్యాంకర్ మాళవిక బన్సోద్‌ను ఓడించి 2019 తర్వాత తన మొదటి టైటిల్‌ను గెలుచుకుంది.

లక్నో సూపర్ జెయింట్స్ పేరుతో లక్నో ఐపీఎల్ జట్టు

ఈ ఏడాది కొత్తగా  ఇండియన్ ప్రీమియర్ లీగ్ అడుగుపెడుతున్న లక్నో ఫ్రాంచైజీ, తన అభిమానుల కోరికమేరకు తమ జట్టు పేరును 'లక్నో సూపర్ జెయింట్స్' గా ప్రకటించింది. ఈ ప్రకటనను ఈ జట్టుయజమాని సంజీవ్ గోయెంకా వీడియో సందేశం ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ కోత్త ఫ్రాంచైజీ రాబోయే 2022 సీజన్ కోసం ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ మరియు అన్‌క్యాప్ చేయని భారత లెగ్-స్పిన్నర్ రవి బిష్ణోయ్‌లను కొనుగోలు చేయడంతో పాటుగా భారత బ్యాట్సమెన్ కేఎల్ రాహుల్'ను తమ జట్టు కెప్టెనుగా ప్రకటించింది.

మిచెల్ స్టార్క్'కు అలన్ బోర్డర్ మెడల్

ఆస్ట్రేలియా సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ తన తొలి అలన్ బోర్డర్ పతకాన్ని అందుకున్నాడు. అలానే ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఆష్లీ గార్డనర్, బెలిండా క్లార్క్ అవార్డును గెలుచుకున్న మొదటి స్వదేశీ క్రికెటరుగా నిలిచింది. ఈ రెండు అవార్డును క్రికెట్  ఆస్ట్రేలియా (CA) అందించే అవార్డులలో అత్యుత్తమవిగా భావిస్తారు.

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 పురుషుల సింగిల్స్ విజేతగా రాఫెల్ నాదల్

ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో 35 ఏళ్ల స్పెయిన్‌ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్, రష్యా క్రీడాకారుడు డానియల్ మెద్వెదేవ్‌ను ఓడించి రికార్డు స్థాయిలో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. దీనితో పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధికంగా 21వ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్‌తో తన తోటి క్రీడాకారులు రోజర్ ఫెదరర్ మరియు నొవాక్ జకోవిచ్‌లను అధిగమించాడు.  ఫైనల్‌లో రాఫెల్ నాదల్ 2-6, 6-7(5), 6-4, 6-4, 7-5తో డేనియల్ మెద్వెదేవ్‌ను ఓడించి ఈ అద్భుతం సాధించాడు. ఐదు గంటల 24 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1:11 గంటలకు ముగిసింది.

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 మహిళల సింగిల్స్ విజేతగా ఆష్లీ బార్టీ

ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళా సింగిల్స్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా టెన్నిస్ క్రీడాకారిణి ఆష్లీ బార్టీ 6-3, 7-6 (2)తో యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన డేనియెల్ కాలిన్స్‌పై గెలిచి తన మొదటి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ సొంతం చేసుకుంది. దీనితో 1978 తరువాత ఆస్ట్రేలియన్ ఓపెన్ దక్కించుకున్న మొదటి ఆస్ట్రేలియన్ క్రీడాకారిణిగా నిలిచింది. కెరీర్ పరంగా తనకి ఇది మూడవ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌. ఇది వరకు 2019 లో వింబుల్డెన్, 2021 లో ఫ్రెంచ్ ఓపెన్ దక్కించుకుంది.  అలానే దాదాపు 100 వారాలుగా ప్రపంచ టెన్నిస్ నెంబర్ 1 ర్యాంకరుగా నిలిచింది.

Advertisement

Post Comment