అన్ని పంచాయతీల్లో కమ్యూనిటీ లైబ్రరీలను కలిగిన జిల్లాగా జమ్తారా
జార్ఖండ్‌లోని జమ్తారా డిస్ట్రిక్ట్, అన్ని గ్రామ పంచాయతీలలో కమ్యూనిటీ లైబ్రరీలను కలిగి ఉన్న దేశంలోని ఏకైక జిల్లాగా అవతరించింది. ఈ జిల్లా పరిధిలో ఉన్న 118 గ్రామ పంచాయతీలలో కమ్యూనిటీ లైబ్రరీలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ ఘనత దక్కించుకుంది. ఈ కమ్యూనిటీ లైబ్రరీలు విద్యార్థుల కోసం ప్రతి రోజు ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు అందుబాటులో ఉంటాయి.
అస్సాంలో కౌ అంబులెన్స్ సేవ ప్రారంభం
అస్సాంలోని దిబ్రూఘర్ జిల్లాలో అనారోగ్య మరియు గాయపడిన ఆవుల కోసం అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించబడింది. గోపాల్ గౌషాలా నిర్వహించనున్న ఈ సర్వీస్‌ను డిబ్రూఘర్ డిప్యూటీ కమిషనర్ బిస్వజిత్ పెగు ప్రారంభించారు. ఈశాన్య ప్రాంతంలో ఇది మొదటి ఆవు అంబులెన్స్ సేవగా పేర్కొన్నారు. ఆవుల సంరక్షణ కోసం పనిచేస్తున్న స్థానిక 'గౌశాల' లేదా చౌ షెల్టర్ 2020లో ఆవుల కోసం ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేసింది.
ప్రధాని నరేంద్ర మోడీ యూరప్ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా, మూడు యూరోపియన్ దేశాలు డెన్మార్క్, జర్మనీ, మరియు ఫ్రాన్స్ లను సందర్శించారు. ఈ పర్యటనలో ఆయన మొదటిగా డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్‌సెన్'తో భేటీ అయ్యారు. తర్వాత బెర్లిన్‌లో జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్‌తో మోడీ సమావేశమయ్యారు. చివరిగా పారిస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను కలిశారు. ఈ పర్యటన ప్రధానంగా వాణిజ్యం, ఇంధనం మరియు గ్రీన్ టెక్నాలజీతో సహా అనేక రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను మరియు పెట్టుబడులను పెంపొందించే లక్ష్యంతో కొనసాగింది.
అదే విదంగా పెన్‌హాగన్‌లో జరిగిన రెండవ ఇండియా-నార్డిక్ శిఖరాగ్ర సమావేశంలో మోడీ పాల్గున్నారు. ఈ సమావేశంకు హాజరైన ఫిన్‌లాండ్, ఐస్‌లాండ్, స్వీడన్, నార్వే మరియు డెన్మార్క్‌లకు చెందిన నాయకులతో భేటీ అయ్యారు. ఈ పర్యటనలో ఉక్రెయిన్ సంక్షోభం ప్రముఖంగా కనిపించింది.
రాజస్థాన్‌లోని 'మియాన్ కా బడా' రైల్వే స్టేషన్ పేరు మార్పు
రాజస్థాన్ ' మియాన్ కా బడా ' రైల్వే స్టేషన్‌ను ' మహేష్ నగర్ హాల్ట్'గా పేరు మార్చుతూ రైల్వే మంత్రిత్వశాఖ ఉత్తర్వలు జారీ చేసింది. నూతనంగా పునఃనిర్మించిన ఈ స్టేషన్ ప్రారంభ వేడుకకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి తదితరులు హాజరయ్యారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వ స్టార్టప్ పాలసీని ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 13న మధ్యప్రదేశ్ ప్రభుత్వ స్టార్టప్ పాలసీ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ -2022ని వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు. కొత్తగా తీసుకొచ్చిన ఈ పాలసీ ద్వారా మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్టార్టప్‌లకు అద్దె మరియు ఉద్యోగుల జీతాలపై రాయితీలు అందివ్వనుంది. ఈ కార్యక్రమంకు కార్యక్రమానికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీనియర్ అధికారులు మరియు స్టార్టప్ వ్యవస్థాపకులు హాజరయ్యారు.
152 ఏళ్ల నాటి దేశద్రోహ చటంపై సమీక్ష కోరిన సుప్రీంకోర్టు
మహాత్మా గాంధీ మరియు స్వాతంత్ర్య ప్రచారానికి సంబంధించిన ఇతర నాయకులపై బ్రిటిష్ వలస ప్రభుత్వం ఉపయోగించిన 152 ఏళ్ల నాటి దేశద్రోహ చట్టాన్ని సమీక్ష కోరుతూ, దాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలంటూ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి పునఃపరిశీలన ముగిసే వరకు సెక్షన్ 124-Aగా పిలవబడే చట్టం పరిధిలో ఎటువంటి కేసులు నమోదు చేయకూడదని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ ప్రకటన జారీచేశారు. ఈ చట్టం ప్రభుత్వంపై ఎవరైనా ద్వేషం, ధిక్కారం లేదా అసంతృప్తిని కలిగించే వ్యక్తులకు జీవిత ఖైదు విధించేందుకు రూపొందించబడింది.
ప్రస్తుతం ఈ చట్టాన్ని అధికారంలో ఉన్న అన్ని భారతీయ రాజకీయ పార్టీలు దుర్వినియోగం చేస్తున్నాయి. ఈ చట్టాన్ని ఆసరాగా చేసుకుని సామాజిక కార్యకర్తలు, రచయితలు మరియు విద్యార్థులను జైలుపాలు చేస్తున్నాయి. దేశద్రోహ చట్టాన్ని ప్రబలంగా దుర్వినియోగం చేస్తున్నారని లా కమిషన్ ఆఫ్ ఇండియా మరియు సుప్రీంకోర్టు కూడా వివిధ సమయాల్లో వ్యాఖ్యానించాయి.
గోధుమ ఎగుమతులపై నిషేధం విధించిన భారత ప్రభుత్వం
ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా, ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొంటూ, గోధుమల ఎగుమతులను భారత ప్రభుత్వం తక్షణమే నిషేధించింది. భారతీయ గోధుమలను దిగుమతి చేసుకున్న ప్రధాన దేశాల్లో బంగ్లాదేశ్, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక, యెమెన్, ఆఫ్ఘనిస్తాన్, ఖతార్, ఇండోనేషియా, ఒమన్ మరియు మలేషియా వంటివి ఉన్నాయి. గోధుముల ఎగుమతిలో ప్రథమ స్థానంలో ఉన్న ఉక్రెయిన్ నుండి సరఫరా ఆగడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రత సమస్య నెలకొంది.
హైదరాబాద్‌లో నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో కొత్తగా నిర్మించిన నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ లాబొరేటరీ (NCFL)ని ప్రారంభించారు. ఇది సైబర్ క్రైమ్ కేసుల త్వరితగత విచారణకు సహాయపడనుంది.
పీఎం మోదీ నేపాల్ పర్యటన
నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ సందర్శించారు. ఈ క్రమంలో 2566వ బుద్ధ జయంతి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రధాని నరేంద్ర మోదీ బుద్ధుని జన్మస్థలమైన లుంబినీ సందర్శించారు. లుంబినీలోని మహామాయాదేవి ఆలయంలో ప్రార్థనలు జరిపారు. అలానే బుద్ధ జయంతి సందర్భంగా నేపాల్ ప్రభుత్వం నిర్వహించే వివిధ వేడుకలకు ప్రధాని మోదీ కూడా హాజరుకానున్నారు. అలానే ఇరుదేశాల అధ్యక్షలు కొన్ని ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేసారు. ఇందులో ప్రధానంగా..
బౌద్ధ అధ్యయనాల కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) మరియు లుంబినీ బౌద్ధ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. అలానే ఖాట్మండు విశ్వవిద్యాలయం మరియు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ అవగాహన ఒప్పందం జరగగా, అరుణ్ 4 ప్రాజెక్ట్ అభివృద్ధి మరియు అమలు కోసం SJVN లిమిటెడ్ మరియు నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (NEA) మధ్య మరో ఒప్పందం చోటు చేసుకుంది.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నాలుగు రోజుల జమైకా పర్యటన
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నాలుగు రోజుల జమైకా పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. ప్రసంగం పూర్తయిన తర్వాత, సెనేట్ అధ్యక్షుడు మరియు హౌస్ స్పీకర్ సమక్షంలో రాష్ట్రపతి కోవింద్ సందర్శకుల పుస్తకంపై సంతకం చేసారు. రైల్వేలు, వ్యవసాయం, ఆతిథ్యం మరియు పర్యాటక రంగాల్లో ఇరుదేశాల మధ్య సహకారం మరియు పరస్పర అవగాహనతో పనిచేయాలని ఆశాభావం వ్యక్తం చేసారు.
జమైకాలో భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి. ఆయనతో పాటు ఆయన భార్య ప్రథమ మహిళ సవితా కోవింద్, కుమార్తె స్వాతి కోవింద్, కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి, లోక్‌సభ ఎంపీ రమాదేవి, సతీష్ కుమార్ గౌతమ్, సెక్రటరీ స్థాయి అధికారులు ఉన్నారు. అలానే జమైకాలోని భారత హైకమీషనర్ మసాకుయ్ రంగ్‌సంగ్ మరియు అతని జీవిత భాగస్వామి జింగ్‌చార్వాన్ రంగ్‌సంగ్ హాజరయ్యారు.
త్రిపుర కొత్త ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం
త్రిపుర బీజేపీ అధ్యక్షుడు మరియు రాజ్యసభ సభ్యుడు అయిన మాణిక్ సాహా ఆ రాష్ట్ర 11వ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో, వివిధ స్థానిక రాజకీయ సమీకరణాల దృష్ట్యా ప్రస్తుత ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ స్థానంలో మాణిక్ సాహా నియమితులయ్యారు. సాహాతో ఆ రాష్ట్ర గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ గోప్యతా ప్రమాణం చేయించారు.
నేపాల్‌లో భారత రాయబారిగా నవీన్ శ్రీవాస్తవ
నేపాల్‌లో భారత్ కొత్త రాయబారిగా నవీన్ శ్రీవాస్తవను నియమిస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మే 16న ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ పర్యటనకు ముందు ఈ నియామకం జరిగింది. నవీన్ శ్రీవాస్తవ ఇదివరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా ఉండేవారు.
గుజరాత్'లో మొదటి వాద్‌నగర్ అంతర్జాతీయ సదస్సు
ప్రపంచ మ్యూజియం దినోత్సవం సందర్భంగా మే 18 తేదీన గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో 'వాద్‌నగర్ అంతర్జాతీయ సదస్సు'ను గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రారంభించారు. భారత పురావస్తు వారసత్వం, సంస్కృతిని ప్రపంచ వేదికపై ప్రచారం చేసేందుకు ఈ వేదికను ఉపయోగించుకున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో యునెస్కో, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వంతో పాటు దేశంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు భాగస్వామ్యామయ్యాయి.
అమెరికా నేతృత్వంలోని ఇండో-పసిఫిక్ ఆర్థిక కూటమిలో భారత్
అమెరికా నేతృత్వంలోని ఇండో-పసిఫిక్ ఆర్థిక కూటమిలో భారత్ చేరింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇండో - పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపీఈఎఫ్)లోకి భారతదేశ ప్రవేశాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇండో-పసిఫిక్ ఆర్థిక కూటమి 23 మే 2022 న ప్రారంభించబడింది. ఇందులో ఇండియాతో పాటుగా మరో 12 దేశాలు కూటమిగా ఉన్నాయి. ఈ కూటమికి యునైటెడ్ స్టేట్స్ నేతృత్వం వహిస్తుంది.
ఈ కూటమిలో ఆస్ట్రేలియా, బ్రూనై, ఫిజీ, భారతదేశం, ఇండోనేషియా, జపాన్, దక్షిణ కొరియా, మలేషియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం మరియు యూఎస్ దేశాలు ఉన్నాయి. ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా ఆయా దేశాల జనాభా మరియు స్థూల దేశీయోత్పత్తి రెండింటిలోనూ పరస్పర ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు పనిచేయనున్నారు.