ఇటలీ విదేశాంగ మంత్రి లుయిగి డి మైయో భారత పర్యటన
ఇటలీ విదేశాంగ వ్యవహారాలు మరియు అంతర్జాతీయ సహకార మంత్రి లుయిగి డి మైయో, మే 4 నుండి మే 6 మధ్య మూడు రోజులు ఇండియాలో పర్యటించారు. ఇది మంత్రి డి మైయో యొక్క మొదటి భారతదేశ పర్యటన. ఈ అధికార పర్యటనలో ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అదేవిదంగా నవంబర్ 2020లో వర్చువల్ సమ్మిట్‌లో ప్రారంభించబడిన యాక్షన్ ప్లాన్ 2020-24 అమలులో పురోగతిని సమీక్షిస్తారు.
ఈ పర్యటనలో ఆయన వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్‌తో కూడా సమావేశమయ్యారు. అలానే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో కూడా భేటీ అయ్యారు. భారత్, ఇటలీల మధ్య ఎప్పటి నుండో వాణిజ్యం మరియు పెట్టుబడి సంబంధాలు కొనసాగుతున్నాయి. అలానే రక్షణ మరియు భద్రత, హరిత ఇంధనం మరియు సైన్స్ & టెక్నాలజీ వంటి ప్రాధాన్యతా రంగాలలో ఇరు దేశాలు పరస్పర సహాయాన్ని అంది పుచ్చుకుంటున్నాయి.
శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స రాజీనామా
శ్రీలంకలో చోటుచేసుకున్న తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభంతో ఆ దేశ ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేశారు. దేశంలో రోజురోజుకి పెరుగుతున్న ద్రవ్యోల్బణంను నియంత్రించడంలో శ్రీలంక ప్రభుత్వం విఫలమైంది. దీని కారణంగా ఆ దేశంలో పెద్దఎత్తున ప్రజా నిరసనలు వెల్లువెత్తడంతో రాజపక్స రాజీనామా చేయాల్సి వచ్చింది. 1948 లో స్వాతంత్ర దేశంగా అవతరించిన తర్వాత శ్రీలంకలో చోటు చేసుకున్న అతిపెద్ద ఆర్థిక సంక్షోభం ఇది.
దక్షిణ కొరియా అధ్యక్షుడిగా యూన్ సుక్-యోల్
సియోల్ నేషనల్ అసెంబ్లీలో జరిగిన భారీ వేడుకల నడుమ యూన్ సుక్ - యోల్ దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో యూన్ సుక్ - యోల్ అతి కొద్దీ మెజారితో గెలిపొందినారు. ఈ ప్రమాణ స్వీకార వేడుకకు చైనా వైస్ ప్రెసిడెంట్ వాంగ్ కిషన్, జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ భర్త డగ్ ఎంహాఫ్ హాజరయ్యారు.
శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే
రాజకీయ ప్రతిష్టంభన మరియు ఆర్థిక సంక్షోభంతో సతమౌతున్న శ్రీలంకలో పరిపాలన స్థిరత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే, మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘేను శ్రీలంక నూతన ప్రధానిగా నియమించారు. రణిల్ విక్రమసింఘేను శ్రీలంక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం ఇది ఆరువసారి. ఈయన గతంలో 1993-94, 2001-04, 2015-18, 2018-19 సంవత్సరాల మధ్య ప్రధానిగా పనిచేసారు. విక్రమసింఘే యొక్క యునైటెడ్ నేషనల్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే సీట్ల సంఖ్యా లేకున్నా ఆయన్ని ప్రధానిగా నియమిస్తూ గోటబయ నిర్ణయం తీసుకున్నారు.
ఫ్రాన్స్ కొత్త ప్రధానమంత్రిగా ఎలిసబెత్ బోర్న్
ఎలిసబెత్ బోర్న్ ఫ్రాన్స్ యొక్క నూతన ప్రధాన మంత్రిగా నియమితులయ్యారు. దీనితో ఆ దేశంలో ఆ పదవిని నిర్వహించిన రెండవ మహిళగా అవతరించారు. ప్రస్తుత ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ యొక్క మునుపటి ప్రభుత్వంలో ఈమె కార్మిక మంత్రిగా పనిచేసారు.
అన్నా ఖబాలే దుబాకు ప్రపంచ అత్యుత్తమ నర్సుగా గౌరవం
కెన్యాకు చెందిన జెండర్ జస్టిస్ ఛాంపియన్ మరియు విద్యావేత్త అన్నా ఖబలే దుబా ప్రపంచ ఉత్తమ నర్సు కిరీటం దక్కించుకున్నారు. మార్సబిట్ కౌంటీ రెఫరల్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తున్న ఈమె ఆస్టర్ గార్డియన్ గ్లోబల్ నర్సింగ్ మొదటి ఎడిషన్ అవార్డును సొంతం చేసుకుంది. ఈమె మహిళా కనీస వివాహ వయసు మరియు స్త్రీ జననేంద్రియ వికృతీకరణకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది. 19 మంది పిల్లలతో కూడిన తన కుటుంబంలో ప్రాథమిక పాఠశాల స్థాయిని దాటిన ఏకైక బాలికగా అన్నా ఖబలే దుబా నిలిచారు.
సోమాలియా కొత్త అధ్యక్షుడిగా హసన్ షేక్ మొహముద్
సోమాలియా మాజీ అధ్యక్షుడు హసన్ షేక్ మొహముద్ రెండవసారి ఆ దేశ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఎన్నో రాజకీయ సంక్షోభాల మధ్య సుదీర్ఘకాలం కొనసాగిన ఎన్నికలలో దేశ ఎంపీలకు మాత్రమే అవకాశం ఉన్న తుది ఓటు ద్వారా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1960లో సోమాలియాలో రాష్ట్రపతి కార్యాలయం ఏర్పాటైనప్పటి నుంచి 9 మంది అధికారిక అధ్యక్షులుగా పనిచేసారు. అధ్యక్షుడుగా ఎన్నికయిన వారు సోమాలియా దేశాధినేతగా మరియు సాయుధ దళాల కమాండర్-ఇన్-చీఫ్'గా వ్యవహరిస్తారు.
బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి చైనా ఆతిథ్యం
మే 19 జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల వర్చువల్ సమావేశానికి చైనా స్టేట్ కౌన్సిలర్ మరియు విదేశాంగ మంత్రి వాంగ్ యీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాల్గున్నారు. వచ్చే నెలలో జరగబోయే బ్రిక్స్ 2022 సమావేశాలు చైనాలో జరగబోతున్నాయి. బ్రిక్స్ అనేది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రిక దేశాలతో కూడిన కూటమి. ఇది 2006 లో స్థాపించబడింది. బ్రిక్స్ ప్రభుత్వ అధినేతలు ఏటా అధికారిక శిఖరాగ్ర సమావేశాలలో సమావేశమవుతారు. దీని ప్రధాన కార్యాలయం షాంఘై (చైనా) లో ఉంది.
ఎవరెస్ట్‌ను 16 సార్లు అధిరోహించిన మొదటి విదేశీయుడుగా కెంటన్ కూల్
బ్రిటీష్ అధిరోహకుడు కెంటన్ కూల్ 16వ సారి ప్రపంచంలోని ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి అత్యధికసార్లు మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి విదేశీ పర్వతారోహకుడిగా నిలిచాడు. ఇది వరకు ఈ రికార్డు అమెరికాకు చెందిన డవ్ హహ్న్ (15 సార్లు) పేరిట ఉండేది.
తూర్పు తైమూర్ అధ్యక్షుడిగా జోస్ రామోస్-హోర్టా
మాజీ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత జోస్ రామోస్ - హోర్టా తూర్పు తైమూర్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆగ్నేయాసియా దేశమైన తూర్పు తైమూర్ 1975లో పోర్చుగల్ నుండి మరియు 2002లో ఇండోనేషియా ఆక్రమణ నుండి బయటపడి స్వాతంత్ర రాజ్యాంగ అవతరించింది. జోస్ రామోస్ - హోర్టా ఇదివరకు 2007-12 మధ్యకాలంలో ఆ దేశ అధ్యక్షులుగా పనిచేసారు.
క్వాడ్ లీడర్స్ సమ్మిట్ 2022
జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా మరియు యూఎస్ దేశాధినేతలు 2022 క్వాడ్ శిఖరాగ్ర భేటీ కోసం టోక్యోలో సమావేశం అయ్యారు. ఈ సమావేశాలకు భారత్ ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బిడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా మరియు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్'లు హాజరయ్యారు.
క్వాడ్ (క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్) అనేది ఇండో-పసిఫిక్ దేశాలకు సంబంధించి ప్రాంతీయ దౌత్య మరియు ఆర్థిక సంబంధాలను మరింతగా మెరుగుపర్చేందుకు ఏడ్పడ్డ కూటమి. ఇందులో ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్'లు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ కూటమి 2007 లో మొదటిసారి స్థాపించబడింది. వివిధ కారణాలతో 2008 లో కనుమరుగయినా, తిరిగి 2017 లో పునఃప్రారంభించబడింది.
వాస్తవానికి మొదటి “క్వాడ్ లీడర్స్ సమ్మిట్” 24 మార్చి 2021న జరిగింది. దీనికి యూఎస్ అధ్యక్షుడు జో బిడెన్ హోస్ట్ చేశారు. ఈ ఏడాది జపాన్ ఈ సమావేశాలకు ఆతిధ్యం ఇచ్చింది. 2023 క్వాడ్ లీడర్స్ సమ్మిట్ ఆస్ట్రేలియాలో నిర్వహించనున్నారు.
"ఇండో-పసిఫిక్" అనేది హిందూ మహాసముద్రం నుండి తూర్పు ఆసియా సముద్ర తీరాల మీదుగా పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం వరకు విస్తరించి ఉన్న సముద్ర ప్రాంతాన్ని సూచిస్తుంది. ఈ ప్రాంతంపై చైనా వ్యూహాత్మక సైనిక మరియు ఆర్థిక ఆక్రమణను నివారించేందుకు క్వాడ్ దేశాలు కూటమిగా ఏర్పడ్డాయి.
ఆస్ట్రేలియా తదుపరి ప్రధానమంత్రిగా ఆంథోనీ అల్బనీస్
2022 ఆస్ట్రేలియా ఫెడరల్ ఎన్నికలలో స్కాట్ మోరిసన్ నేతృత్వంలోని పాలక కూటమిని ఓడించడం ద్వారా లేబర్ పార్టీకి చెందిన ఆంథోనీ అల్బనీస్ తదుపరి ఆస్ట్రేలియా ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసారు. వాతావరణ మార్పుల పై ప్రత్యేక యాక్షన్ ప్లాన్ మరియు ఉద్యోగుల వేతనాల పెంపు వంటి ప్రజాకర్షణ హామీల ద్వారా ఆస్ట్రేలియా 31 వ ప్రధానిగా ఆంథోనీ అల్బనీస్ బాధ్యతలు స్వీకరించారు.