ఏటీపీ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో డానియల్ మెద్వెదేవ్ నంబర్ వన్
ఏటీపీ పురుషుల టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో రష్యాకు చెందిన డేనియల్ మెద్వెదేవ్ నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. ఏటీపీ ర్యాంకింగ్ ప్రారంభించిన నుండి నెంబర్ వన్ ర్యాంకును పొందిన 27వ ఆటగాడుగా డేనియల్ మెద్వెదేవ్ నిలిచాడు. అలానే యెవ్జెనీ కఫెల్నికోవ్ మరియు మరాట్ సఫిన్ తర్వాత రష్యా నుండి ఈ ఘనత సాధించిన మూడవ వ్యక్తిగా రికార్డుకెక్కాడు.
పారా ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పూజా జాత్యన్'కు రజతం
దుబాయిలో జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ పారాలో పూజా జాత్యన్ చారిత్రాత్మక రజతం గెలుచుకుంది. దీనితో పారా వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత విభాగంలో రజతం సాధించిన మొదటి భారతీయురాలుగా చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో ఇటలీకి చెందిన ప్యాట్రిల్లి విన్సెంజా చేతిలో ఓడిపోవడంతో రజతం సొంతం చేసుకుంది.
ఫిఫా మరియు యూఈఎఫ్ఏ లలో రష్యా ఫుట్‌బాల్ జట్లకు నిషేధం
ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఫిఫా) మరియు యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ (యూఈఎఫ్ఏ) లు నిర్వహించే వార్షిక క్లబ్ ఫుట్‌బాల్ పోటీలలో రష్యన్ జాతీయ ఫుట్‌బాల్ జట్లు, ఫుట్‌బాల్ క్లబ్'లు పాల్గునకుండా నిషేధం విధించాయి. ఉక్రెయిన్ పైన రష్యా చేస్తున్న ఏకపక్ష యుద్దానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నాయి.
12వ ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ మార్చి 4 నుండి ప్రారంభం
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ యొక్క పన్నెండవ ఎడిషన్, 4 మార్చి 2022 నుండి 3 ఏప్రిల్ 2022 లో మధ్య న్యూజిలాండ్‌లో జరగనుంది. ప్రారంభ మ్యాచ్ తౌరంగలోని బే ఓవల్ వేదికగా ఆతిథ్య వెస్టిండీస్ జట్ల మధ్య జరగనుంది. 31 రోజుల పాటు జరిగే ఈ ప్రపంచ టోర్నమెంటులో ఎనిమిది దేశాలు 31 మ్యాచ్‌ల్లో తలపడతాయి. ఆక్లాండ్, క్రైస్ట్‌చర్చ్, డునెడిన్, హామిల్టన్, టౌరంగ మరియు వెల్లింగ్‌టన్ నగరాలు ఆరు వేర్వేరు వేదికల్లో మ్యాచ్‌లకు ఆతిధ్యం ఇవ్వనున్నాయి. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా మరియు వెస్టిండీస్ మహిళా క్రికెట్ జట్లు ఈ టోర్నీలో టైటిల్ కోసం పోటీపడుతున్నాయి.
వివో ప్రో కబడ్డీ లీగ్ 2022 విజేతగా దబాంగ్ ఢిల్లీ
వివో ప్రో కబడ్డీ సీజన్ 8 ఫైనల్‌లో దబాంగ్ ఢిల్లీ 37-36తో పాట్నా పైరేట్స్‌ను ఓడించి, తొలి ప్రో కబడ్డీ టైటిల్‌ను సొంతంచేసుకుంది. ఆటగాళ్లలో ఆల్‌రౌండర్ విజయ్, స్టార్ రైడర్ నవీన్ కుమార్ వరుసగా 14 పాయింట్లు, 13 పాయింట్లు సాధించి సూపర్ 10లను దక్కించుకున్నారు.
ఆరు ప్రపంచకప్‌లు ఆడిన తొలి మహిళగా క్రికెటరుగా మిథాలీ రాజ్ రికార్డు
భారత మహిళా క్రికెట్ కెప్టెన్, మిథాలీ రాజ్ ఆరు ప్రపంచకప్‌లలో పాల్గొన్న తొలి మహిళ క్రికెటరుగా నిలిచింది. సచిన్ టెండూల్కర్ మరియు జావేద్ మియాందాద్ తర్వాత ఆరు ప్రపంచకప్ ఆడిన మూడో క్రికెటర్ ఆమె. ఆమె 2000, 2005, 2009, 2013, 2017 మరియు ప్రస్తుతం జరుగుతున్న 2022లో ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఈవెంట్లలో భారత్ మహిళా జట్టు తరుపున ప్రాతినిధ్యం వహించింది.
అదే విధంగా మిథాలీ రాజ్ ఐసిసి మహిళల ప్రపంచ కప్‌లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన రికార్డును కూడా బద్దలు కొట్టింది. ఇది వరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బెలిండా క్లార్క్ పేరిట ఉండేది. 39 ఏళ్ల మిథాలీ 24 ప్రపంచ కప్ గేమ్‌లలో దేశానికి నాయకత్వం వహించింది, వీటిలో 14 విజయాలు, 8 ఓటములు ఉండగా ఒకటి ఫలితం తేలని మ్యాచు ఉంది.
కపిల్ దేవ్ 434 టెస్టు వికెట్ల రికార్డును అధిగమించిన రవిచంద్రన్ అశ్విన్
శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, భారత పేస్ బౌలింగ్ దిగ్గజం కపిల్ దేవ్ 434 వికెట్ల రికార్డును అధిగమించాడు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో, శ్రీలంక ఫాలో-ఆన్ ఇన్నింగ్స్‌లో చరిత్ అసలంకను అవుట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ రికార్డును అధిగమించాడు. కపిల్ దేవ్ ఈ మార్కును చేరుకునేందుకు 131 టెస్టులు ఆడగా, అశ్విన్ కేవలం 81వ టెస్టు ద్వారా ఈ రికార్డును చేరుకున్నాడు. అశ్వినుకు ముందు 619 టెస్ట్ వికెట్లతో అనిల్ కుంబ్లే మొదటి స్థానంలో ఉన్నాడు.
కపిల్ దేవ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును బద్దలు కొట్టిన రిషబ్ పంత్
బెంగుళూరులో జరిగిన 2వ టెస్టు 2వ రోజున 28 బంతుల్లో 50 పరుగులు సాధించిన రిషబ్ పంత్, సుదీర్ఘమైన ఫార్మాట్‌లో భారత బ్యాటర్‌గా కపిల్ దేవ్ యొక్క 40 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. దీనితో ఇండియా తరుపున 1982 పాకిస్తాన్ పై కపిల్ చేసిన 30 బంతుల్లో 50 పరుగుల ఫాస్టెస్ట్ టెస్ట్ ఫిఫ్టీ రికార్డు తుడిసిపెట్టుకుపోయింది.
సురేష్ రైనాకు మాల్దీవ్స్ 'స్పోర్ట్స్ ఐకాన్' అవార్డు
భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనాను ఇటీవల మాల్దీవులు ప్రభుత్వం స్పోర్ట్స్ ఐకాన్ అవార్డుతో సత్కరించింది. ఈ కార్యక్రమంలో మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్, క్రీడా మంత్రులు, ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారులు మరియు మాల్దీవుల అథ్లెట్లు పాల్గున్నారు.
ప్రపంచ నెంబర్ వన్ ఆష్లీ బార్టీ టెన్నిస్‌కు రిటైర్మెంట్
ఆస్ట్రేలియా మహిళా టెన్నిస్ క్రీడాకారిణి ఆష్లీ బార్టీ 25 ఏళ్ల వయసులో టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచ మహిళల టెన్నిస్ ర్యాంకింగులో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఆమె ఇప్పటికే మూడు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంది. ఆష్లీ బార్టీ 2019లో ఫ్రెంచ్ ఓపెన్, 2021లో వింబుల్డన్ మరియు 2022లో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచింది.
ఒడిశాలో 20వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్
20వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు 2022 పోటీలు ఒడిశా కళింగ స్టేడియంలో మార్చి 28-31 మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ క్రీడల్లో దేశవ్యాప్తంగా దాదాపు 982 పారా అథ్లెట్లు పాల్గున్నారు. ఇందులో టోక్యో 2020 పారాలింపిక్ మెడల్ విజేతలు దేవేంద్ర ఝఝరియా, శరద్ కుమార్ మరియు సుందర్ సింగ్ గుర్జార్'లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ 2022 విజేతగా పీవీ సింధు
స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ 2022 మహిళల సింగిల్స్ టైటిల్‌ను పీవీ సింధు సొంతం చేసుకుంది. ఫైనల్ పోరులో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్‌ను ఓడించడం ద్వారా విజేతగా నిలిచింది. 49 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో భారత ఏస్ షట్లర్ పివి సింధు 21-16, 21-8తో థాయ్ ప్రత్యర్థి బుసానన్ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్‌ను చిత్తు చేసింది. ఈ సీజన్లో సింధుకు ఇది రెండవ టైటిల్, ఇదివరకే ఈ ఏడాది జనవరిలో సయెద్ మోడీ ఇండియా ఇంటర్నేషనల్ ట్రోఫీను ఆమె దక్కించుకుంది. అలానే సైనా నెహ్వాల్ (2011, 2012) తర్వాత భారత్ నుండి స్విస్ ఓపెన్ గెలుచుకున్న రెండవ క్రీడాకారిణిగా సింధు నిలిచింది.
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు
బీబీసీ (బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్) ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డును మీరాబాయి చాను దక్కించుకుంది. క్రీడారంగంలో అత్యద్భుత ప్రతిభ కనబరిచిన భారత క్రీడాకారులను సత్కరించే ఈ అవార్డును 2020 లో ప్రారంభించారు. ఈ అవార్డు యొక్క మొదటి ఎడిషన్ విజేతగా పీవీ సింధు నిలిచింది. రెండవ ఎడిషన్ విజేతగా కోనేరు హంపీ నిలవగా అంజు బాబీ జార్జ్‌కు జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది.
తాజాగా 28 మార్చి 2022న జరిగిన అవార్డుల వేడుకలో, మీరాబాయి చాను ఈ ఏడాదికి ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించబడింది. అలానే మాజీ వెయిట్ లిఫ్టర్, పద్మశ్రీ గ్రహీత కర్ణం మల్లేశ్వరికి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును అందజేశారు.