తెలుగులో వీక్లీ కరెంట్ అఫైర్స్ 03 ఏప్రిల్ 2023 | పోటీ పరీక్షల స్పెషల్
Telugu Current Affairs

తెలుగులో వీక్లీ కరెంట్ అఫైర్స్ 03 ఏప్రిల్ 2023 | పోటీ పరీక్షల స్పెషల్

వీక్లీ కరెంట్ అఫైర్స్ 03 ఏప్రిల్ 2023 తెలుగులో ఉచితంగా పొందండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే, బ్యాంకింగ్ వంటి వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఔత్సాహికుల కోసం తాజాగా చోటు చేసుకున్న జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను పోటీ పరీక్షల దృక్కోణంలో అందిస్తున్నాం.

Advertisement

అసోచామ్ నూతన అధ్యక్షుడిగా అజయ్ సింగ్

స్పైస్‌జెట్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్, అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) యొక్క నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే అసోచామ్ అధ్యక్షుడుగా పదవీకాలాన్ని పూర్తి చేసిన సుమంత్ సిన్హా స్థానంలో ఈ నూతన బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అనేది న్యూ ఢిల్లీలో ఉన్న ప్రభుత్వేతర వాణిజ్య మరియు న్యాయవాద సమూహం. ఈ సంస్థ భారతదేశంలో వ్యాపార మరియు వాణిజ్య సమస్యలు మరియు కార్యక్రమాల మధ్య ఇంటర్‌ఫేస్‌గా పనిచేస్తుంది. దేశీయ వ్యాపార సంస్థలకు అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడంలో ఈ అసోసియేషన్ ప్రత్యేక పాత్ర వహిస్తుంది. దీనిని 1920లో డాక్టర్ నిరంజన్ హిరానందని స్థాపించారు.

స్టార్ స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా రణ్‌వీర్ సింగ్‌

ప్రముఖ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌, స్టార్ స్పోర్ట్స్ ఇండియా నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా సంతకం చేశారు. ప్రస్తుతం ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో పాటుగా ఇతర స్టార్ స్పోర్ట్స్ క్రీడా ఈవెంట్‌ల ప్రచారాలలో కూడా పాల్గొంటాడు. ఈ జాబితాలో త్వరలో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, ప్రీమియర్ లీగ్, ప్రో కబడ్డీ, ఆసియా కప్ మరియు ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ వంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉన్నాయి.

ప్రజాస్వామ్య శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మార్చి 29న నిర్వహించిన ప్రజాస్వామ్య శిఖరాగ్ర సదస్సులో వర్చువల్‌గా, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక సవాళ్లు ఉన్నప్పటికీ నేడు భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజాస్వామ్యం అనేది పౌరుల నమ్మకంపై ఆధారపడి ఉంటుందని, వారి అవసరాలు మరియు ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యమని వెల్లడించారు. భారతదేశంలో పాలకులు వారసత్వంగా లేరని, భారతదేశం నిజానికి ప్రజాస్వామ్యానికి తల్లి అని మోదీ అభివర్ణించారు.

29 మరియు 30 తేదీలలో యునైటెడ్ స్టేట్స్ నిర్వహించే ఈ సమ్మిట్ ఫర్ డెమోక్రసీ 2023కి దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఆతిథ్యం ఇస్తున్నారు. సహ-హోస్ట్‌లుగా నెదర్లాండ్స్, కోస్టా రికా, జాంబియా దేశాలు వ్యవహరిస్తున్నాయి. గ్రీస్, ఇజ్రాయెల్, ఇటలీ, కెన్యా, క్రొయేషియా మరియు తైమూర్-లెస్టే అనే ఆరు దేశాల అధ్యక్షులు మరియు ప్రధానమంత్రులు కూడా శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించారు. ఈ సమావేశానికి పాకిస్తాన్ గైర్హాజరు అయ్యింది.

సమ్మిట్ ఫర్ డెమోక్రసీ అనేది "స్వదేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి మరియు విదేశాలలో నిరంకుశ పాలనలను ఎదుర్కోవడానికి" యునైటెడ్ స్టేట్స్ నిర్వహించే వర్చువల్ సమ్మిట్. దీనికి సంబంధించి మొదటి శిఖరాగ్ర సమావేశం డిసెంబర్ 9-10, 2021లో జరిగింది. ప్రస్తుతం జరుగుతున్నది రెండవది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం మరియు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రక్షించడం, అవినీతిని పరిష్కరించడం, మానవ హక్కుల పట్ల గౌరవాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం.

ఐడబ్ల్యుఎఫ్ వరల్డ్ యూత్ ఛాంపియన్‌షిప్‌లో భారత వెయిట్‌లిఫ్టర్‌కి కాంస్యం

అల్బేనియాలోని డ్యూరెస్‌లో జరిగిన ఐడబ్ల్యుఎఫ్ వరల్డ్ యూత్ ఛాంపియన్‌షిప్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ భరాలీ బెడబ్రేట్, పురుషుల 67 కిలోల కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 15 ఏళ్ల భరాలీ బెడబ్రేట్, మొత్తం 267kg (119kg+148kg) బరువును ఎత్తి మూడవ స్థానంలో నిలిచాడు. 13-17 సంవత్సరాల మధ్య వయస్సు గల లిఫ్టర్లు వరల్డ్ యూత్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు అర్హులు.

అర్మేనియాకు చెందిన సెరియోజా బర్సెఘ్యాన్ 275 కేజీలు (128 కేజీ+147 కేజీలు) మరియు సౌదీ అరేబియాకు చెందిన మహ్మద్ అల్ మార్జౌక్ 270 కేజీలు (119 కేజీలు+148 కేజీలు) వరుసగా బంగారు, రజత పతకాలను గెలుచుకున్నారు. కాంటినెంటల్ మరియు వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లలో స్నాచ్, క్లీన్ & జెర్క్ మరియు టోటల్ లిఫ్ట్‌లకు విడివిడిగా పతకాలు ఇవ్వబడతాయి, అయితే ఒలింపిక్ క్రీడలలో మొత్తం లిఫ్ట్‌కు కేవలం ఒక పతకం మాత్రమే ఇవ్వబడుతుంది.

చండీగఢ్‌లో జీ20 రెండో వ్యవసాయ ప్రతినిధుల సమావేశం

భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీలో అగ్రికల్చరల్ వర్కింగ్ గ్రూప్ (AWG) రెండవ అగ్రికల్చరల్ డిప్యూటీస్ మీటింగ్ 2023ను మార్చి 29 నుండి 31 మధ్య చండీగఢ్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి 19 సభ్య దేశాలు, 10 ఆహ్వానించబడిన దేశాలు మరియు 10 అంతర్జాతీయ సంస్థల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన మొదటి అగ్రికల్చర్ డిప్యూటీస్ మీటింగ్ ఇండోర్‌లో, 15 ఫిబ్రవరి 2023న జరపబడింది.

ఈ కార్యక్రమంలో నాలుగు వ్యవసాయ నేపథ్య రంగాలపై దృష్టి సారించారు. అందులో మొదటిది ఆహార భద్రత మరియు పోషకాహారం, రెండోవది వాతావరణ స్మార్ట్ విధానంతో స్థిరమైన వ్యవసాయం, మూడవది సమగ్ర వ్యవసాయ విలువ గొలుసులు, ఇక చివరిగా ఆహార, వ్యవసాయ రంగాల్లో డిజిటలైజేషన్ అంశాలు ఉన్నాయి.

ముంబైలో మొదటి ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్‌రావ్ కరద్, మొదటి ట్రేడ్ & ఇన్వెస్ట్‌మెంట్ వర్కింగ్ గ్రూప్‌ మీటింగ్‌ను మార్చి 29న ముంబైలో ప్రారంభించారు. ఈ సమావేశానికి జీ20 సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాలు, ప్రాంతీయ సమూహాలు మరియు అంతర్జాతీయ సంస్థల నుండి 100 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.

మొదటి సెషన్‌లో, 'ట్రేడ్ ఫర్ గ్రోత్ అండ్ ప్రోస్పెరిటీ' అంశంపై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ (IEG), ఢిల్లీ, వరల్డ్ బ్యాంక్ (WB), మరియు యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ (UNESCAP) ప్రెజెంటేషన్‌ అందించాయి. రెండవ సెషన్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ & యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ ద్వారా 'ట్రేడ్ అండ్ రెసిలెంట్ గ్లోబల్ వాల్యూ చెయిన్స్' అనే అంశంపై ప్రదర్శన ఇచ్చారు.

ఎలిఫెంటా కేవ్స్ వరకు ఈత కొట్టిన మొదటి వ్యక్తిగా కృష్ణ ప్రకాష్

'డ్రౌనింగ్ ప్రివెన్షన్ అవేర్‌నెస్' ప్రచారంలో భాగంగా, ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి కృష్ణ ప్రకాష్, గేట్‌వే ఆఫ్ ఇండియా నుండి ముంబైలోని ఎలిఫెంటా గుహలకు ఈదుకుంటూ వెళ్లిన మొదటి వ్యక్తిగా నిలిచారు. 16.20 కిలోమీటర్ల ఈ యాత్రను కేవలం 5 గంటల 26 నిమిషాల్లో పూర్తి చేసిన తొలి వ్యక్తిగా నిలిచారు. డ్రౌనింగ్ ప్రివెన్షన్ అవేర్‌నెస్ అనేది 1-24 సంవత్సరాల వయస్సు గల పిల్లలు మరియు యువకులు నీటిలో మునిగిపోకుండా అవగహన కల్పించే కార్యక్రమం. దీనిని ఏటా జూలై 25న నిర్వహిస్తారు. 2021లో యూఎన్ జనరల్ అసెంబ్లీ దీనిని ప్రారంభించింది.

2017లో ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్‌ను పూర్తిచేసిన తర్వాత ఈయన ఐరన్‌మ్యాన్‌గా ప్రసిద్ధి చెందాడు. ట్రయాథ్లాన్‌ ఈవెంట్‌లో భాగంగా 15 గంటల వ్యవధిలో 3.8 కిలోమీటర్ల ఈత, 180.2 కిలోమీటర్ల సైకిల్ రైడ్ మరియు 42.2 కిలోమీటర్ల పరుగును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏ ఘనత సాధించిన మొదటి సివిల్ సర్వెంట్ ఆఫీసరుగా గుర్తింపు పొందాడు.

నవీన్ జిందాల్‌కి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

డల్లాస్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం, భారతీయ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందించింది. ఈ అవార్డును 25 మార్చి 2023న విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక వేడుకలో అందుకున్నారు. వ్యాపార, రాజకీయ, విద్యారంగంలో ఆయన సేవలకు గాను ఈ గౌరవాన్ని అందించారు. 1992లో ఇదే యూనివర్సిటీ నుంచి నవీన్ జిందాల్‌ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఈ అవార్డు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పూర్వ విద్యార్ధులకు అందించే అత్యున్నత గౌరవంగా పరిగణించబడుతుంది.

గ్రామీణ నిరుద్యోగుల కోసం 'క్యాప్టివ్ ఎంప్లాయ్‌మెంట్' పథకం

దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్య యోజన కింద 'క్యాప్టివ్ ఎంప్లాయ్‌మెంట్' అనే నూతన కార్యక్రమాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్, మార్చి 28న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ ప్రోగ్రాం కింద 31,000 మందికి పైగా గ్రామీణ యువతకు వివిధ అంశాల యందు నైపుణ్య శిక్షణ అందివ్వనున్నారు. శిక్షణ పొందిన యువతకు వారి కంపెనీ లేదా అనుబంధ సంస్థలో ఉపాధి కల్పిస్తారు.

దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్య యోజన కింద గ్రామీణ యువతకు జీవనోపాధి కల్పించడం కోసం, ప్రభుత్వం 19 మంది పరిశ్రమ, శిక్షణ సంస్థల యజమానులతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఎంపిక చేయబడిన క్యాప్టివ్ ఎంప్లాయర్‌లు గ్రామీణ పేద యువతకు వారి సంబంధిత పరిశ్రమలతో పాటుగా ఆతిథ్యం, ​​దుస్తులు & వస్త్రాలు, తయారీ, ఐటీ, టెలికాం, రిటైల్, పవర్ మొదలైన వాటిలో శిక్షణను అందిస్తారు.

దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అనేది నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క ప్లేస్‌మెంట్ లింక్డ్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమం గ్రామీణ పేద యువతకు ఉపాధి కల్పిస్తుంది. ఇది 25 సెప్టెంబర్ 2014న ప్రారంభించబడింది. ఈ కార్యక్రమం ప్రస్తుతం 27 రాష్ట్రాలు, 4 యుటిలలో 877 ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలతో, 2,369 శిక్షణా కేంద్రాల ద్వారా అమలు చేయబడుతుంది.

ఢిల్లీలో మొదటి అంతర్జాతీయ క్వాంటం కమ్యూనికేషన్ కాన్‌క్లేవ్

మార్చి 27-28 తేదీలలో న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 'ఫస్ట్ ఇంటర్నేషనల్ క్వాంటం కమ్యూనికేషన్ కాన్‌క్లేవ్'ను నిర్వహించారు. రైల్వేల మంత్రి అశ్విని వైష్ణవ్ మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ చౌహాన్‌లు ఈ కాన్‌క్లేవ్ ప్రారంభించారు. ఈ సమావేశంలో క్వాంటం కమ్యూనికేషన్ టెక్నాలజీలలో తాజా పురోగతుల గురించి చర్చలు జరిపారు.

ఈ కార్యక్రమాన్ని టెలికమ్యూనికేషన్స్ స్టాండర్డ్స్ డెవలప్‌మెంట్ సొసైటీ ఇండియా మరియు సిడాట్ కలిసి నిర్వహించాయి. ఇదే వేదిక ద్వారా పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ టెలికాం స్కిల్ ఎక్సలెన్స్ అవార్డులను కూడా అందించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అందించే ఈ అవార్డులను టెలికాం రంగంలో అత్యుత్తమ సేవలు అందించే సంస్థలకు అందజేస్తారు.

  • స్టెరిలైట్ టెక్నాలజీస్ లిమిటెడ్ (పూణే) : టెలికాం రంగంలో పూణే నైపుణ్యాభివృద్ధి సేవలు
  • విహాన్ నెట్‌వర్క్స్ లిమిటెడ్ (గురుగ్రామ్) : గ్రామీణ ప్రాంతాలలో సౌరశక్తితో నడిచే 4జీ ర్యాన్ యొక్క సాంకేతిక అభివృద్ధి
  • క్యూన్యూ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (బెంగళూరు) : క్వాంటం కమ్యూనికేషన్ మరియు సెక్యూరిటీ సొల్యూషన్‌లో సేవలు
  • ధృవ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ (హైదరాబాద్) : శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలో సేవలు
  • ఇంటోట్ టెక్నాలిజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎర్నాకులం) :  సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ రేడియో రిసీవర్ అభివృద్ధి కోసం

ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిని తాకిన భారతీయ ఎగుమతులు

2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ మొత్తం ఎగుమతులు $750 బిలియన్ల ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిని అధిగమించినట్లు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఈ ఘనతను స్వాతంత్ర్యం వచ్చిన 75వ సంవత్సరంలో, మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటున్న సమయంలో సాధించడం సంతోషకరమని ఆనందం వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీలో జరిగిన అసోచామ్ వార్షిక సెషన్ 2023లో ప్రసంగించిన ఆయన, భారతదేశం యొక్క పోటీతత్వాన్ని బలోపేతం చేయడంలో తమ ప్రభుత్వం విజయవంతమైందని, ప్రపంచం మొత్తం మాంద్యంలో ఉన్నప్పటికీ, మెజారిటీ అభివృద్ధి చెందిన దేశాలలో ద్రవ్యోల్బణం ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉన్నప్పటికీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు పురోగమనంతో ముందుకు సాగుతుందని వెల్లడించారు. బలమైన స్థూల ఆర్థిక వ్యవస్థ, దృఢమైన విదేశీ మారక నిల్వలు, తక్కువ ద్రవ్యోల్బణం దేశ విజయ రహస్యాలని వెల్లడించారు.

నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్, పీఎం గతి శక్తి, యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్‌ఫేస్ ప్లాట్‌ఫారమ్ మొదలైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు చక్కని ఫలితాలను అందించినట్లు వెల్లడించారు. ఆస్ట్రేలియా మరియు యుఎఇతో భారతదేశం సంతకం చేసిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టిఎ) ద్వారా మూడు దేశాల పారిశ్రామిక అభివృద్ధికి దోహద పడనుందని తెలియజేసారు.

నాగాలాండ్ మున్సిపల్ చట్టం 2001 రద్దుకు తీర్మానం

నాగాలాండ్ మున్సిపల్ చట్టం 2001ని తక్షణమే రద్దుచేసే తీర్మానానికి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది అలానే కొత్త చట్టం ఏర్పాటుకు నడుంబిగించింది. వివాదాస్పదమైన ఈ బిల్లు 2016 నుండి ఆ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఆటంకం కల్గిస్తుంది. నాగాలాండ్ మున్సిపల్ చట్టం 2021ని సమీక్షించాలని డిమాండ్ చేస్తూ వివిధ గిరిజన హోహోలు మరియు పౌర సంఘాల నుండి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

నాగాలాండ్ మున్సిపల్ చట్టం 2001 అమలు "ఆర్టికల్ 371-A యొక్క స్ఫూర్తికి విరుద్ధంగా నడుస్తుందనే ప్రజల అభిప్రాయం కారణంగా" ఇది వివాదాస్పదమౌతుంది. మున్సిపాలిటీలు మరియు టౌన్ కౌన్సిల్‌లలో మహిళలకు 33% రిజర్వేషన్‌కు సంబంధించిన భారత రాజ్యాంగంలోని పార్ట్ IX A నిబంధనల నుండి నాగాలాండ్‌ను మినహాయిస్తూ 2012 సంవత్సరంలో ఈ రాష్ట్ర అసెంబ్లీ ఒక తీర్మానం చేసింది. దీనిని తిరిగి 2016లో రద్దు చేసింది.

ఈ తీర్మానం రద్దు తర్వాత 2017లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో పెద్దఎత్తున హింసాత్మక ఆందోళనలు చోటు చేసుకున్నాయి. వివిధ గిరిజన సంస్థలు/హోహోలు ప్రభుత్వ యంత్రాంగాన్ని బహిష్కరించాయి. దీనితో స్థానిక సంస్థల ఎన్నికలు రద్దు చేయబడ్డయి. ఇది జరిగిన 4ఏళ్ళ తర్వాత మార్చి 9, 2022న వివిధ గిరిజన సంస్థలు మరియు ప్రభుత్వం మధ్య రాష్ట్ర స్థాయి సంప్రదింపులు జరిగి, రాజ్యాంగంలోని 74వ సవరణ చట్టం ప్రకారం ఎన్నికలను నిర్వహించాలని తీర్మానించారు.

సుప్రీం కోర్టు కూడా ఆ రాష్ట్రంలో తక్షణమే స్థానిక ఎన్నికల జరపాలనే ఆదేశాలు జారీ చేయడంతో నాగాలాండ్ ప్రభుత్వం ఎన్నికలకు సిద్దమయ్యింది. దీనితో వివిధ గిరిజన సంస్థలు నాగాలాండ్ మున్సిపల్ చట్టం 2001ను "ఆర్టికల్ 371-A యొక్క నిబంధనలకు అనుగుణంగా" సవరించాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి. ఈ తలనొప్పి పడలేక ప్రభుత్వం ఏకంగా 2001 మున్సిపల్ చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్త చట్టాన్ని రూపొందించేందుకు ఆదేశాలు జారీచేసింది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371A అనేది నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదాను, హక్కులను కల్పిస్తుంది. ఇది 1962 సంవత్సరంలో భారత రాజ్యాంగంలోని 21వ భాగంలో చేర్చబడింది. ఇది నాగాల మతపరమైన సామాజిక ఆచారాలు రక్షించుకునే అవకాశం కల్పిస్తుంది. నాగా సంస్కృతిలో మహిళలు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయకుడదనే సాంప్రదాయం ఉంది. ఈ అంశమే మొత్తం వివాదానికి కేంద్ర బిందువుయ్యింది.

అయితే ఇటీవలే జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మొట్టమొదటి సారి ఇద్దరు మహిళలు సల్హౌతుయోనువో క్రూసే, హెకానీ జఖాలు, ప్రత్యేక్ష ఎన్నికలలో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు. అయితే మహిళలకు పట్టణ స్థానిక సంస్థలలో 33% సీట్ల రిజర్వేషన్‌ను కల్పించే ఈ చట్టం రద్దు తీర్మాన చర్చలో ఈ ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు మౌనంగా ఉండటం గమనార్హం.

పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2023లో భారతదేశంకు 144వ స్థానం

2023 వార్షిక పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో భారతదేశం ఆరు స్థానాలు క్షీణించి 70 మొబిలిటీ స్కోరుతో 144వ స్థానానికి చేరుకుంది. గత ఏడాది ఇండియా 138వ స్థానంలో ఉండేది. 199 దేశాలకు చెందిన పాస్‌పోర్ట్ ర్యాంకింగును ఆర్టన్ క్యాపిటల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2023 తాజాగా విడుదల చేసింది. భారతదేశ మొబిలిటీ స్కోర్‌లో క్షీణత యూరోపియన్ యూనియన్ విధానంలో మార్పులతో ముడిపడి ఉందని నివేదిక పేర్కొంది. ఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే చైనా కూడా పాస్‌పోర్ట్ ఇండెక్స్ వ్యక్తిగత ర్యాంకింగ్స్‌లో 118వ స్థానంలో నిలిచింది.

ఆర్టన్ క్యాపిటల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ యందు 181 మొబిలిటీ స్కోరుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అగ్రస్థానంలో నిలవగా, దాని తర్వాత స్థానాల్లో స్వీడన్, జర్మనీ, ఫిన్‌లాండ్, లక్సెంబర్గ్, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్ మరియు ఆస్ట్రియా దేశాలు ఉన్నాయి. దక్షిణాసియాలో దక్షిణ కొరియా 174 మొబిలిటీ స్కోరుతో12వ స్థానంలో ఉండగా, జపాన్ 172 స్కోరుతో 26వ స్థానంలో నిలిచింది. దాదాపు అన్ని ఇతర ఆసియా దేశాలు తమ ర్యాంకింగ్స్‌లో పతనాన్ని చవిచూశాయి.

పాస్‌పోర్ట్ ఇండెక్స్ అనేది ఇతర దేశాల సందర్శనకు సంబంధించి పాస్‌పోర్ట్ యాక్సెస్ పరిధిని తెలియజేస్తుంది. మొబిలిటీ స్కోర్ అనేది ఇచ్చిన పాస్‌పోర్ట్‌తో సులభంగా యాక్సెస్ చేయగల దేశాల మొత్తం సంఖ్యను సూచిస్తుంది. అయితే జనవరిలో విడుదల అయినా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో భారతదేశం 85వ స్థానంలో నిలిచింది. వీసా లేకుండానే భారతీయులు 59 దేశాలకు వెళ్లవచ్చని ఈ నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో జపాన్ అగ్రస్థానం దక్కించుకుంది.

కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డులు 2023

కేరళ సంగీత నాటక అకాడమీ 2022 సంవత్సరపు ఫెలోషిప్‌లు మరియు అవార్డులు ప్రకటించబడ్డాయి. థియేటర్ ఆర్టిస్ట్ గోపీనాథ్ కోజికోడ్, సంగీత దర్శకుడు పిఎస్ విద్యాధరన్ మరియు ప్రముఖ కళాకారుడు కళామండలం ఉన్నికృష్ణన్‌లకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అందించారు. వీరితో పాటుగా మరో 17 మందికి సంగీత నాటక అకాడమీ అవార్డులను, 22 మందికి గురుపూజ పురస్కారాలను అందజేశారు.

కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ప్రధాని మోడీ

ఏప్రిల్ 1న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మూడు రోజుల నిడివితో నిర్వహించిన ఈ కార్యక్రమంలో త్రివిధ సాయుధ దళాలకు చెందిన కమాండర్లు, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సదస్సును 'రెడీ, రీసర్జెంట్, రిలెంట్' అనే థీమ్‌తో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆత్మనిర్భర్త సాధించే దిశగా సాయుధ బలగాల సన్నద్ధత మరియు రక్షణ పర్యావరణ వ్యవస్థలో పురోగతిని సమీక్షించారు.

భోపాల్-ఢిల్లీ వందే భారత్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏప్రిల్ 1న  భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుండి ఢిల్లీకి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఇది మధ్యప్రదేశ్ యొక్క మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు. మొత్తంగా 11వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్. అలానే ఢిల్లీ-వారణాసి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తర్వాత నడపబడే రెండవ వేగవంతమైన మరియు అత్యంత దూరమైనా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా నిలవనుంది. ఈ రైలు 700 కి.మీ దూరాన్ని 7.30 గంటల్లో చేరుకుంటుంది, ఇది న్యూ ఢిల్లీ-భోపాల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ తీసుకునే సమయం కంటే తక్కువ.

దేశంలో మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ - వారణాసి మధ్య ప్రారంభించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వే నడుపుతున్న ప్రతిష్టాత్మక ఆధునిక సెమీ-హై స్పీడ్ రైలుగా పరిగణించ బడుతుంది. భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవ కింద చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని తయారు చేస్తుంది. ఇవి గరిష్టంగా గంటకు 160 కిమీ వేగంతో నడుస్తాయి.

  1. న్యూఢిల్లీ - వారణాసి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (759 కిమీ)
  2. న్యూఢిల్లీ - శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (655 కిమీ)
  3. ముంబై సెంట్రల్ - గాంధీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (522 కిమీ)
  4. న్యూఢిల్లీ - అంబ్ అందౌర వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (412 కిమీ)
  5. చెన్నై సెంట్రల్ - మైసూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (496 కిమీ)
  6. బిలాస్‌పూర్ - నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (412 కిమీ)
  7. హౌరా - న్యూ జల్పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (561 కిమీ)
  8. విశాఖపట్నం - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (698 కిమీ)
  9. ముంబై సెంట్రల్ - షోలాపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (452 కిమీ)
  10. ముంబై సెంట్రల్ - షిర్డీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (343 కిమీ)
  11. భోపాల్ - ఢిల్లీ  భారత్ ఎక్స్‌ప్రెస్ (708  కిమీ)

షాంఘై సహకార సంస్థ డైలాగ్ భాగస్వామిగా సౌదీ అరేబియా

సౌదీ అరేబియా ప్రభుత్వం అధికారికంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO)లో డైలాగ్ పార్టనర్‌గా చేరడానికి అంగీకరించింది. కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్‌సిఓలో డైలాగ్ పార్టనర్ కావడానికి సంబంధించిన మెమోరాండమ్‌ను ఆ దేశ కేబినెట్ ఆమోదించింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది యురేషియా రాజకీయ, ఆర్థిక, అంతర్జాతీయ భద్రత మరియు రక్షణ సంస్థ. దీనిని 2001లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం బీజింగ్ నగరంలో ఉంది.

ఎస్‌సిఓ ప్రస్తుతం ఎనిమిది సభ్యదేశాలను కలిగి ఉంది. ఈ జాబితాలో చైనా, భారతదేశం, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, రష్యా, పాకిస్తాన్, తజికిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ ఉన్నాయి. అలానే ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, ఇరాన్ మరియు మంగోలియాలు అబ్జర్వర్ స్టేట్స్ ఉన్నాయి. అర్మేనియా, అజర్‌బైజాన్, కంబోడియా, నేపాల్, శ్రీలంక మరియు టర్కీలు డైలాగ్ పార్ట్‌నర్స్‌గా కొనసాగుతున్నాయి. 2021లో ఇరాన్ పూర్తి సభ్యునిగా చేరేందుకు అంగీకరించింది. తాజాగా ఈజిప్ట్, ఖతార్ మరియు సౌదీ అరేబియాలు డైలాగ్ పార్ట్‌నర్స్‌గా చేరాయి.

భారతదేశం ప్రస్తుతం 2023 ఏడాదికి సంబంధించి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క అధ్యక్ష హోదాలో ఉంది. ఇటీవలే మార్చి 29న న్యూ ఢిల్లీలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ (NSA) మరియు ఉన్నత అధికారుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహించారు. ఏప్రిల్ 27-29 వరకు ఢిల్లీలో దీనికి సంబంధించి రక్షణ మంత్రుల సమావేశం నిర్వహించనున్నారు.

యాక్సిస్ సెక్యూరిటీస్ కొత్త ఎండీ మరియు సీఈఓగా ప్రణవ్ హరిదాసన్

యాక్సిస్ సెక్యూరిటీస్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ప్రణవ్ హరిదాసన్ నియమితులయ్యారు. హరిదాసన్ ఇది వరకు యాక్సిస్ క్యాపిటల్‌లో మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఈక్విటీస్ కో-హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తించే వారు. ఈయన ఫైనాన్షియల్ మార్కెట్‌లలో దాదాపు 20 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. యాక్సిస్ సెక్యూరిటీస్ లిమిటెడ్ అనేది యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. ఇది రిటైల్ కస్టమర్లకు విస్తృత శ్రేణి ఆర్థిక పరిష్కారాలు మరియు బ్రోకరేజ్ సేవలు అందిస్తుంది.

అస్సాం ఎన్జీవోకు ప్రతిష్టాత్మక చిల్డ్రన్స్ ఛాంపియన్ అవార్డు

అసోంలోని పాత్‌సలాకు చెందిన స్టూడెంట్స్ వెల్ఫేర్ మిషన్ ప్రతిష్టాత్మక చిల్డ్రన్స్ ఛాంపియన్ అవార్డును దక్కించుకుంది. ఈ ఎన్‌జిఓ మానసిక అనారోగ్యం మరియు ఆటిస్టిక్ పిల్లల కోసం స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, సంగీతం మరియు ఇతర నైపుణ్యాలను అందిస్తోంది. దీనితో ఈశాన్య రాష్ట్రాల నుంచి ఈ అవార్డుకు ఎంపికైన ఏకైక సంస్థగా నిలిచింది.

విద్య, న్యాయం, ఆరోగ్యం, పోషకాహారం, క్రీడలు మరియు కళాత్మక వ్యక్తీకరణ వర్గాలలో పిల్లల కోసం సేవలు అందిస్తున్న వ్యక్తులు మరియు సంస్థలను గుర్తించడానికి గత సంవత్సరం ఢిల్లీ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (తపోబన్‌) చేత ఈ అవార్డు స్థాపించబడింది. విజేతకు 75వేల నగదు బహుమతితో పాటుగా సర్టిఫికెట్ అందజేస్తారు.

కాంపిటీషన్ ఆమెండ్మెంట్ బిల్లు లోక్‌సభలో ఆమోదం

కాంపిటీషన్ యాక్ట్ 2002ను సవరించాలని కోరుతూ కాంపిటీషన్ (సవరణ) బిల్లు 2022ని పార్లమెంట్ దిగువ సభ మార్చి 29న ఆమోదించింది. ఈ సవరణ చట్టం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI)కి ప్రత్యేక అధికారాలను ఇవ్వనుంది. దీనితో మోస పూర్వక సంస్థల ప్రపంచ టర్నోవర్‌లపై జరిమానాలు విధించడానికి యాంటీట్రస్ట్ రెగ్యులేటర్‌కు అధికారం కల్పిస్తుంది. అలానే అంతర్జాతీయ బిగ్ టెక్ సంస్థలపై కఠినమైన శిక్షలకు తలుపులు తెరవనుంది.

ప్రస్తుతం, యాంటీట్రస్ట్ వాచ్‌డాగ్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) లకు కార్పొరేట్ సంస్థలపై వారి గ్లోబల్ టర్నోవర్ ఆధారంగా జరిమానాలు విధించే అధికారం లేదు. ఈ సవరణ చట్టం ప్రస్తుతం వీటికి ప్రత్యేక అధికారాలను కల్పిస్తుంది. సంబంధిత వ్యాపార రంగంలో గూగుల్ వంటి సంస్థల గుత్తాధిపత్యంను నియంత్రించేందుకు ఈ సవరణ బిల్లును ఆమోదించారు.

కాంపిటీషన్ యాక్ట్ 2002 అనేది భారతదేశంలో వాణిజ్య పోటీని నియంత్రించే చట్టం. దీనిని పూర్వపు గుత్తాధిపత్యం మరియు నిర్బంధ వాణిజ్య చట్టం స్థానంలో తీసుకొచ్చారు. మార్కెట్లో ఏదో ఒక ప్రత్యేక ఉత్పత్తి లేదా సర్వీసును పోటీ లేకుండా ఒకే సంస్థ/విక్రేత విక్రయిస్తుండటం, లేదా పోటీ సంస్థలు నెగ్గే పరిస్థితి లేకుండా వ్యవహరించినప్పుడు ఈ చట్టం సదురు చర్యను నియంత్రిస్తుంది.

ఈ సవరణ బిల్లును గత ఏడాది ఆగస్టు 5న సభలో ప్రవేశపెట్టారు. ఆగస్టు 16న దీనిని ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేశారు. డిసెంబరులో తన నివేదికను సమర్పించిన ప్యానెల్, దీనికి కొన్ని సిఫారసు చేసింది. అలానే ప్రభుత్వం కొన్ని అదనపు సవరణలతో ఏడాది ఫిబ్రవరి 8న ఈ బిల్లును తిరిగి లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మార్చి 29న ఆమోదం పొందింది.

గాంధీనగర్‌లో మొదటి జీ20 డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం

భారతదేశం యొక్క జీ20 ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో మొదటి జీ20 డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్ సమావేశంను మార్చి 30 - ఏప్రిల్ 1 మధ్య గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహించారు. ఈ సమావేశంను ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పీకే మిశ్రా మరియు భారత ప్రభుత్వ సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి దేవు సిన్హ్ చౌహాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారత జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ కార్యదర్శి కమల్ కిషోర్ నాయకత్వం వహిస్తారు.

ఈ సమావేశంలో ప్రస్తుతం జీ20 ట్రోయికాలో ఉన్న ఇండోనేషియా, భారతదేశం మరియు బ్రెజిల్ దేశాలు విపత్తు రిస్క్ తగ్గింపు కోసం సెండాయ్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా నిర్దేశించబడిన లక్ష్యాలను సాధించడానికి చేస్తున్న తమ ప్రయత్నాలను వివరించాయి. ఇందులో భాగంగా విపత్తు నష్టాన్ని తగ్గించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ముందస్తు హెచ్చరిక వ్యవస్థల అభివృద్ధి, విపత్తు తట్టుకునేలా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్‌లను రూపొందించడం, బలమైన జాతీయ ఆర్థిక ఫ్రేమ్‌వర్క్‌లు అమలుచేయడం, జాతీయ మరియు ప్రపంచ విపత్తు ప్రతిస్పందన వ్యవస్థను బలోపేతం చేయడం మరియు పర్యావరణ వ్యవస్థల-ఆధారిత విపత్తు నిర్వహణ పద్దతులను అభివృద్ధి చేయడం వంటి సూచనలు చేసారు.

జీ20 ట్రోయికా అనగా జీ20 త్రయం అని అర్ధం. గత ఏడాది జీ20కి అధ్యక్షత వహించిన దేశం (ఇండోనేషియా), ప్రస్తుతం అధ్యక్ష పదవిని నిర్వహిస్తున్న దేశం (ఇండియా) మరియు వచ్చే ఏడాది అధ్యక్షత వహించే దేశం (బ్రెజిల్)ను కలిపి జీ20 ట్రోయికా అంటారు. జీ20 సమ్మిట్ రొటేటింగ్ ప్రెసిడెన్సీ అనేది ప్రతీ ఏడాది జీ20 సభ్యదేశాల మధ్య మారుతూ ఉంటుంది.

స్వదేశీ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ : అమోఘ-III టెస్టింగ్ విజయవంతం

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తన తాజా 3వ తరం మ్యాన్-పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ (ATGM) : అమోఘ-III యొక్క ఫీల్డ్ ఫైరింగ్ పరీక్షను మార్చి 30న విజయవంతంగా నిర్వహించింది. ఈ స్వదేశీ క్షిపణిని ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (IGMDP) కింద అభివృద్ధి చేశారు.

డ్యూయల్-మోడ్ ఐఐఆర్ సీకర్ టెక్నాలజీ మరియు టెన్డం వార్‌హెడ్‌ సదుపాయంతో భారత్ డైనమిక్స్ రూపొందించిన ఈ తాజా అమోఘా వెర్షన్ భారత రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క ఆయుధాగారానికి ఒక అధునాతన జోడింపుగాఅభివర్ణించవచ్చు. ఇందులో రెండు వేర్వేరు పేలుడు ఛార్జ్‌లు ఉంటాయి. పూర్వగామి ఛార్జ్ అని పిలువబడే మొదటి ఛార్జ్, లక్ష్యం యొక్క కవచంలోకి చొచ్చుకుపోయే సామర్థ్యం కలిగి ఉంటే, రెండవ ఛార్జ్ లేదా ప్రధాన ఛార్జ్, పేలడానికి ఒక రంధ్రం సృష్టించి, లక్ష్యాన్ని విధ్వంసం చేస్తుంది.

రోడ్లు, రవాణా వ్యవస్థలపై భారత్-రష్యా వర్కింగ్ గ్రూప్ సమావేశం

రోడ్లు మరియు ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్‌పై భారతదేశం - రష్యా వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశం 29 మార్చి 2023న న్యూఢిల్లీలో జరిగింది. భారత రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ మరియు రష్యన్ ఫెడరేషన్ యొక్క రవాణా మంత్రిత్వ శాఖ మధ్య సంతకం చేసిన అవగాహన ఒప్పందం ప్రకారం ఈ కార్యవర్గం ఏర్పాటు చేయబడింది.

రహదారి రవాణా, లాజిస్టిక్స్, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్‌లో కమ్యూనికేషన్ మరియు సంబంధిత సహకారం కోసం దీర్ఘకాలిక మరియు సమర్థవంతమైన ద్వైపాక్షిక సంబంధాన్ని నెలకొల్పడానికి సెప్టెంబర్ 2021లో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సమావేశానికి రోడ్లు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అల్కా ఉపాధ్యాయ మరియు రష్యన్ ఫెడరేషన్ యొక్క రవాణా శాఖ డిప్యూటీ మంత్రి దిమిత్రి బకనోవ్ సహ అధ్యక్షత వహించారు.

ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్, గ్రీన్ మొబిలిటీ, రోడ్ సేఫ్టీ, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ మరియు హైవేస్ సెక్టార్‌లో టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్‌కు సంబంధించి రెండు దేశాలు తీసుకున్న వివిధ కార్యక్రమాలను సమావేశంలో  ప్రదర్శించారు. ఈ చర్చలు రోడ్డు రవాణా అభివృద్ధిలో ఐటిఎస్ సేవలను ప్రారంభించేందుకు మరియు డిజిటల్ టెక్నాలజీ అమలు జరిపేందుకు భారతదేశం మరియు రష్యా మధ్య సుదీర్ఘ సహకారానికి మార్గం సుగమం చేయనున్నాయి.

కేరళలోని కుమరకోమ్‌లో రెండవ జీ20 షెర్పాస్ సమావేశం

భారతదేశం యొక్క జీ20 అధ్యక్షతన రెండవ జీ20 షెర్పా సమావేశం కేరళలోని కుమరకోమ్‌లో మార్చి 30న నిర్వహించారు. ఈ సమావేశంకు భారతదేశం యొక్క జీ20 షెర్పాగా వ్యవహరిస్తున్న అమితాబ్ కాంత్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జీ20 యొక్క ఆర్థిక మరియు అభివృద్ధి ప్రాధాన్యతలపై అలాగే సమకాలీన ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంపై బహుపాక్షిక చర్చలు నిర్వహించారు. దీనికి సంబంధించిన మొదటి షెర్పా సమావేశం గత ఏడాది డిసెంబర్ 04న రాజస్థాన్ రాష్ట్రంలోని చారిత్రాత్మక నగరమైన ఉదయపూర్‌లో జరిగింది.

కాకినాడలో ప్రాంతీయ సెర్చ్ & రెస్క్యూ వ్యాయామం

ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో 28-29 మార్చి 2023న ప్రాంతీయ సెర్చ్ అండ్ రెస్క్యూ (SAR) వ్యాయామాన్ని నిర్వహించింది. రియల్ టైమ్ మారిటైమ్ డిస్ట్రెస్ సినారియోని అనుకరిస్తూ సామూహిక రెస్క్యూ ఆపరేషన్ కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ (SAR) సంస్థ పనితీరును హైలైట్ చేయడం ఈ వ్యాయామం యొక్క లక్ష్యం.

ఈ వ్యాయామం ద్వారా నావికాదళ సముద్ర ప్రమాదాలలో సిబ్బంది ప్రాణాలను కాపాడేందుకు విపత్తు దళాలలకు వాస్తవిక తర్పీదు అందివ్వడంతో పాటుగా ఆకస్మిక సెర్చ్ & రెస్క్యూ ప్రణాళిక అమలను వివరిస్తారు. ప్రమాదంలో ఉన్న నౌకకు బాహ్య అగ్నిమాపక సహాయం, అబాండన్ షిప్ డ్రిల్, రెస్క్యూ బోట్ విస్తరణ, జాసన్ క్రెడిల్, స్క్రాంబుల్ నెట్, లైఫ్ బోట్, లైఫ్ బోయ్, డ్రోన్ ద్వారా నిఘా, హెలికాప్టర్ ద్వారా క్యాజువాలిటీ రెస్క్యూ డి-ఇండక్షన్ మరియు మెడికల్ మేనేజ్‌మెంట్ అంశాలను ఈ వ్యాయామంలో నిర్వహించారు

కృష్ణా గోదావరి బేసిన్‌లో పెద్ద ఎత్తున సహజ వాయువుల అన్వేషణ పెట్రోలియం ఉత్పత్తి కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకుని, ఈ ప్రాంతాన్ని అత్యవసర పరిస్థితుల్లో పెద్ద ఎత్తున షార్ ప్రతిస్పందన అవసరమయ్యే అవకాశం ఉన్నందున కాకినాడ సముద్ర ప్రాంతాన్ని వ్యాయామానికి వేదికగా ఎంచుకున్నారు. ఈ మాస్ రెస్క్యూ ఆపరేషన్ సంబంధిత సభ్యులు మరియు ఏజెన్సీల మధ్య సహకారం మరియు సమన్వయాన్ని పెంపొందించనుంది.

తెలంగాణాలో సరస్సుల అభివృద్ధి కార్యక్రమం

తెలంగాణ ప్రభుత్వ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖ హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ఉన్న 50 సరస్సులను పునరుజ్జీవింపజేయడానికి మరియు అభివృద్ధి చేయడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ 'సరస్సుల అభివృద్ధి కార్యక్రమాన్ని మార్చి 28న ఖాజాగూడ సరస్సు వద్ద మంత్రి కె తారక రామారావు ప్రారంభించారు.

ఈ 50 సరస్సులలో 25 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండగా మిగిలిన 25 హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో ఉన్నాయి. సరస్సులను అభివృద్ధి చేసేందుకు దత్తత తీసుకున్న రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీలకు ప్రభుత్వం ఎంఓయూ సర్టిఫికెట్లను అందజేస్తుంది. ఈ సరస్సుల పరిధిలో వాకింగ్ ట్రాక్‌లు, ల్యాండ్‌స్కేపింగ్, ఓపెన్ జిమ్‌లు, బెంచీలు, టాయిలెట్లు, సాయంత్రం నడిచేందుకు లైట్లు, పిల్లలకు ఆట స్థలం, యాంఫీథియేటర్ తదితర సౌకర్యాలు అందుబాటులో ఉంచనున్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా టీకి యూరోపియన్ జీఐ ట్యాగ్

హిమాచల్ ప్రదేశ్‌లో పండించే భారతదేశపు ప్రత్యేకమైన కాంగ్రా టీకి యూరోపియన్ కమిషన్ (ఈసీ) రక్షిత భౌగోళిక సూచిక (పీజీఐ) ని మంజూరు చేసింది. ఈ గుర్తింపు యూరోపియన్ మార్కెట్‌లోకి కాంగ్రా టీ ప్రవేశించేందుకు వీలు కల్పించనుంది. ప్రత్యేక రుచి మరియు వాసనకు ప్రసిద్ధి చెందిన ఈ కాంగ్రా టీ ఉత్పత్తి ఒకప్పుడు కార్మికుల కొరత మరియు అధిక ఉత్పత్తి వ్యయం కారణంగా తగ్గిపోయింది.

అయితే 2005లో ఈ ఉత్పత్తికి భారతీయ ప్రభుత్వం జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ మంజూరు చేయడంతో. అప్పటి నుండి, హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా ప్రాంతంలో టీ సాగు మరియు అభివృద్ధి నిరంతరం మెరుగుపడింది. ఈ పంటను హిమాలయాల్లోని ధౌలాధర్ పర్వత శ్రేణుల వాలులలో సముద్ర మట్టానికి 900-1,400 మీటర్ల ఎత్తులో పండిస్తారు.

కంగ్రా ఆకుల్లో కాల్షియం, జింక్, ఫోలిక్ యాసిడ్స్, విటమిన్ బి1, విటమిన్ బి2 మరియు విటమిన్ బి6 వంటివి ఉంటాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మరియు అనేక క్యాన్సర్‌లను నివారించడంలో ఉపయోగపడతాయి. అలానే మెదడు, గుండె మరియు ఎముక రుగ్మతలను నిరోధించడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలతో పాటుగా వైరల్ & బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది.

ఈసీ ప్రొటెక్టెడ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేది నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు మరియు ఆహార పదార్థలను యూరోపియన్ మార్కెట్‌లో వాణిజ్యానికి అనుమతి ఇచ్చేనందుకు ఇచ్చే ఒకరకమైన గుర్తింపు. ఇది యూరోపియన్ దేశాల ఉత్పత్తులకే కాకుండా ఈయూ యేతర దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా నమోదిత ఉత్పత్తుల రక్షణకు అవకాశం కల్పిస్తుంది.

11 ఆసియా మరియు పసిఫిక్ దేశాలతో యూకే వాణిజ్య ఒప్పందం

యూరోపియన్ యూనియన్ నుండి అధికారికంగా వైదొలిగిన మూడు సంవత్సరాల తర్వాత 11 ఆసియా మరియు పసిఫిక్ దేశాలతో వాణిజ్య ఒప్పందంలో చేరడానికి యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఈ గ్రూప్‌లో చేరడం ద్వారా చీజ్, కార్లు, చాక్లెట్, మెషినరీ, జిన్ మరియు విస్కీ వంటి యూకే ఉత్పత్తుల ఎగుమతిని పెంచుకునే ప్రణాళిక రూపొందిస్తుంది. దీని కోసం ఆయా దేశాలకు సుంకాలను తగ్గించడం ద్వారా ఎగుమతి వాటాలను పెంచుకోనుంది.

ట్రాన్స్-పసిఫిక్ భాగస్వామ్యానికి సంబంధించి 2018లో కంప్రెహెన్సివ్ & ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ రూపొందించబడింది. ఈ కూటమిలో ఆస్ట్రేలియా, బ్రూనై, కెనడా, చిలీ, జపాన్, మలేషియా, మెక్సికో, న్యూజిలాండ్, పెరూ, సింగపూర్ మరియు వియత్నాం వంటి దేశాలు ఉన్నాయి. ఈ అగ్రిమెంట్ ప్రకారం సభ్యదేశాల మధ్య వాణిజ్యంపై పరిమితులను సడలిస్తుంది మరియు వస్తువులపై సరిహద్దు పన్ను యొక్క సుంకాలకు మినహాయింపు కల్పిస్తారు. ఈ కూటమి దేశాలలో దాదాపు 500 మిలియన్ల జనాభా ఉంది.

31 జనవరి 2020న యూరోపియన్ యూనియన్ నుండి యునైటెడ్ కింగ్‌డమ్ వైదొలగే ప్రక్రియను బ్రెగ్జిట్ అంటారు. ఈయూ నుండి యూకే వైదొలగడానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ బ్రెగ్జిట్ వెనుక ఉన్న కొన్ని ప్రధాన సమస్యలలో జాతీయవాదం, వలసలు, రాజకీయ స్వయంప్రతిపత్తి మరియు ఆర్థిక వ్యవస్థలో పెరుగుదల వంటి అంశాలు ఉన్నాయి. ఈయూ నుండి నిష్క్రమించిన ఏకైక సార్వభౌమ దేశం యూకే మాత్రమే. బ్రిటన్ వైదొలగడంతో ఈయూలో 27 సభ్యదేశాలు మాత్రమే మిగిలాయి.

యూరోపియన్ యూనియన్ అనేది ప్రధానంగా ఐరోపాలో ఉన్న 27 సభ్య దేశాలతో కూడిన అత్యున్నత రాజకీయ మరియు ఆర్థిక సంఘం. వీటి పరిధిలో సుమారు 447 మిలియన్ల జనాభా నివశిస్తున్నారు. ఈయూ సభ్య దేశాలు : ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, క్రొయేషియా, రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగరీ, ఐర్లాండ్, ఇటలీ, లాట్వియా, లిథువేనియా, లక్సెంబర్గ్, మాల్టా, నెదర్లాండ్స్, పోర్చుగల్, రొమేనియా, స్లోవేకియా, స్లోవేనియా, స్పెయిన్ మరియు స్వీడన్.

లషిండా డెమస్‌కు 2012 ఒలింపిక్స్‌ పతకం అందజేత

అమెరికన్ రన్నర్ లషిండా డెముస్ అధికారికంగా 40 ఏళ్ల వయస్సులో ఒలింపిక్ ఛాంపియన్‌గా మారారు. 2012 ఒలింపిక్స్ 400 మీటర్ల హర్డిల్స్‌లో లషిండా డెముస్ రెండవ స్థానంలో నిలిచి రజిత పతకం సొంతం చేసుకుంది అయితే రష్యన్ డోపింగ్ కుంభకోణంలో అప్పటి విజేత నటల్య అంత్యుఖ్ అనర్హత కారణంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 400 మీటర్ల హర్డిల్స్‌లో డెమస్‌ను విజేతగా ప్రకటించి, స్వర్ణ పతకాన్ని అధికారికంగా తిరిగి కేటాయించింది.

మాస్కో టెస్టింగ్ లేబొరేటరీ డేటాబేస్ నుండి డ్రోపింగ్ నివేదిక సేకరించిన అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్, గత అక్టోబర్‌లో జూలై లో 2012 నుండి జూన్ 2013 వరకు అంత్యుఖ్ ఫలితాలను తొలగించాలని నిర్ణయించింది. దీనితో డెమస్‌ దశాబ్దకాలం తర్వాత 40 ఏళ్ల వయస్సులో ఒలింపిక్ ఛాంపియన్‌గా మారారు.

ఢిల్లీ ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ విజేతగా అరవింద్ చితంబరం

భారతదేశానికి చెందిన గ్రాండ్ మాస్టర్ అరవింద్ చితంబరం, జార్జియాకు చెందిన గ్రాండ్ మాస్టర్ పంతులాయా లెవాన్‌ను ఓడించి 20వ ఢిల్లీ ఓపెన్ ఇంటర్నేషనల్ గ్రాండ్‌మాస్టర్స్ విజేతగా నిలిచాడు. అరవింద్ చితంబరం గతంలో 2018, 2019 లలో ఇండియన్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచాడు. గత ఏడాది స్పెయిన్‌లో జరిగిన 41వ విల్లా డి బెనాస్క్ ఇంటర్నేషనల్ చెస్ ఓపెన్‌లో కూడా విజేతగా నిలిచాడు. అరవింద్ 2015లో ఇండియన్ గ్రాండ్ మాస్టర్ హోదాను దక్కించుకున్నాడు.

అబుదాబి యువరాజుగా షేక్ ఖలీద్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన పెద్ద కుమారుడు షేక్ ఖలీద్‌ను గల్ఫ్ రాష్ట్ర చమురు సంపన్న రాజధాని అబుదాబికి యువరాజుగా నియమించారు. దీనితో షేక్ ఖలీద్ గల్ఫ్ చక్రవర్తి యొక్క తదుపరి నాయకుడిగా మారారు. అదే సమయంలో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, యూఏఈ యొక్క తదుపరి వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యందు అజ్మాన్, దుబాయ్, ఫుజైరా, రస్ అల్ ఖైమా, షార్జా మరియు ఉమ్ అల్ క్వైన్‌లతో కూడిన ఏడు ఎమిరేట్ల సమాఖ్య నుండి ఎన్నుకోబడిన రాచరిక ప్రభుత్వం ఉంటుంది. ప్రతి ఎమిరేట్ దాని స్వంత పాలకుడు, దాని స్వంత స్థానిక ప్రభుత్వం, కోర్టులు మరియు పోలీసు బలగాలతో పాలించబడుత. ఈ పాలకులు అందరూ కలిసి ఫెడరల్ సుప్రీం కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తారు.

భారతదేశపు మొట్టమొదటి పాకెట్-సైజ్ స్వైప్‌ను ప్రారంభించిన యాక్సిస్ బ్యాంక్

యాక్సిస్ బ్యాంక్ భారతదేశపు మొట్టమొదటి పాకెట్-సైజ్ స్వైప్ మెషీన్ ' మైక్రోపే'ను ప్రారంభించింది. ఇది సాంప్రదాయ పిఓఎస్ పరికరాల కంటే 30% తక్కువ ఖర్చుతో కూడుకున్నది. భారతదేశంలో డిజిటల్ పాయింట్ ఆఫ్ సేల్ (పిఓఎస్) వ్యవస్థల స్వీకరణ రేటు పెరిగినప్పటికీ, దీని ధర మరియు సర్వీస్ చార్జీలు అధికంగా ఉండటంతో చిన్న వ్యాపారాలు వీటికి దూరంగా ఉంటున్నారు.

దీనికి విప్లవాత్మకమైన పరిస్కారంగా యాక్సిస్ బ్యాంక్ ఈ పిన్ ఆన్ మొబైల్ (మైక్రోపే)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది వ్యాపారి యొక్క స్మార్ట్‌ఫోన్‌ను పాయింట్-ఆఫ్-సేల్ (పిఓఎస్) టెర్మినల్‌గా మారుస్తుంది, తద్వారా డిజిటల్ చెల్లింపులను సులభతరం చేస్తుంది. ఇది ప్రత్యేకించి పరిమిత వర్కింగ్ క్యాపిటల్‌తో పనిచేసే టైర్-2 మరియు 3 నగరాల్లోని రిటైల్ మరియు కిరానా దుకాణాలకు తక్కువ ఖర్చుతో కూడిన చెల్లింపు సేవలను అందిస్తుంది.

ఈ పాకెట్-పరిమాణ పరికరం డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్‌ల కోసం "ఇన్సర్ట్" మరియు "ట్యాప్" ఎంపికలకు మద్దతు ఇచ్చే చిన్న కార్డ్ రీడర్. ఈ సురక్షిత కార్డ్ రీడర్ బ్లూటూత్ ద్వారా వ్యాపారి స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. కస్టమర్‌లు నేరుగా వ్యాపారి స్మార్ట్‌ఫోన్‌లో వారి పిన్‌ను ఎంటర్ చేయడం ద్వారా చెల్లింపును పూర్తిచేయవచ్చు. ఈ సేవలను రాజోర్‌పే మరియు మై పిన్ ప్యాడ్ సంస్థల సహకారంతో అందిస్తుంది.

100 శాతం రైలు నెట్‌వర్క్ విద్యుద్దీకరణ పొందిన రాష్ట్రంగా హర్యానా

హర్యానా 100% రైల్వే నెట్‌వర్క్ విద్యుదీకరణను సాధించిన మొదటి భారతీయ రాష్ట్రంగా అవతరించింది. హర్యానా పరిధిలోని  1,701 కిలోమీటర్ల బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్ ఇప్పుడు 100% విద్యుదీకరించబడినట్లు రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది. హర్యానా రాష్ట్ర భూభాగం ఉత్తర, ఉత్తర మధ్య & నార్త్ వెస్ట్రన్ రైల్వే అధికార పరిధిలోకి వస్తుంది.

  • హర్యానాలోని కొన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు: అంబాలా, పానిపట్, గుర్గావ్, కురుక్షేత్ర, హిసార్ జంక్షన్, రేవారి జంక్షన్, రోహ్తక్ జంక్షన్ మరియు భివానీ స్టేషన్.
  • హర్యానా రాష్ట్రం గుండా ప్రయాణించే కొన్ని ప్రతిష్టాత్మక రైళ్లు : కల్కా శతాబ్ది ఎక్స్‌ప్రెస్, హిమాలయన్ క్వీన్, కల్కా మెయిల్, పశ్చిమ్ ఎక్స్‌ప్రెస్, గోల్డెన్ టెంపుల్ మెయిల్ మరియు కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్.

సిలిగురిలో 2వ టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం

భారతదేశం యొక్క జీ20 ప్రెసిడెన్సీలో 2వ టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశంను ఏప్రిల్ 1 నుండి 3 వరకు డార్జిలింగ్ మరియు హిమాలయాల దిగువ ప్రాంతంలో ఉన్న సిలిగురిలో నిర్వహించారు. ఈ సమావేశాలకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి జి. కిషన్ రెడ్డి మరియు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జాన్ బార్లా హాజరయ్యారు.

ఈ సమావేశం ద్వారా 2004లో భారతదేశంలో మొట్టమొదటి జీఐ ట్యాగ్‌ని పొందిన 'డార్జిలింగ్ టీ, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన  డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే వంటి పర్యాటక ప్రదేశాల గొప్పతనం అతిధిలకు పరిచయం చేశారు. అలానే వీరి కోసం సిలిగురిలోని మేఫెయిర్ టీ రిసార్ట్‌లో మార్నింగ్ యోగా సెషన్ కూడా నిర్వహించారు.

జీ20 ప్రెసిడెన్సీలో 1వ టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశంను ఫిబ్రవరి 7 నుండి 10 తేదీల్లో గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్‌లో నిర్వహించారు. భారతదేశం యొక్క జీ20 ప్రెసిడెన్సీ కింద, భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా 59 కంటే ఎక్కువ నగరాల్లో 200కి పైగా సమావేశాలను నిర్వహిస్తోంది. భారతదేశం యొక్క విభిన్న భౌగోళిక మరియు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడానికి ఈ గమ్యస్థానాలు ఎంపిక చేయబడ్డాయి.

Advertisement

Post Comment