భారత త్రివిధ దళాల్లో స్వల్పకాలిక ప్రాతిపదికన నియామకాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్ పేరుతో తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్సుల యందు నాలుగేళ్ళ కాలపరిమితితో నియామకాలు చేపట్టనున్నారు.
ఈ పథకం ద్వారా వచ్చే ఏడాది జులై నాటికీ దాదాపు 45 వేల మంది యువతకు భారత త్రివిధ దళాల్లో ఉద్యోగాలు కల్పించనున్నారు. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా ఎంపికైన సైనికులను 'అగ్నివీర్' గా పిలుస్తారు. ఈ నియామక ప్రకటనలు కూడా అగ్నివీర్ పేరుతో విడుదల చేయనున్నారు. అలానే ఈ పధకంలో మహిళలకు అవకాశం కల్పించనున్నారు.
అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్ వివరాలు
- అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్ కింద శిక్షణతో కలుపుకుని గరిష్టంగా 4 ఏళ్లలో కాలపరిమితితో నియామకాలు చేపట్టనున్నారు.
- నాలుగేళ్లు పూర్తిచేసుకున్న సైనికులలో కేవలం 25 శాతం మంది సైనికుల్ని మాత్రమే రెగ్యులర్ క్యాడర్‌గా తీసుకుంటారు. వీళ్ళు 15 ఏళ్లపాటు సర్వీస్‌లో ఉంటారు. మిగతా సైనికులు వాలెంటరీ రిటైర్మెంట్ పద్దతితో ఇంటికి పంపబడతారు.
- నాలుగేళ్ళ తర్వాత విరమించబడ్డ సైనికులకు, విరమణ సమయంలో సేవనిధి పేరిట 12 లక్షల వరకు ఆర్థిక వెసులుబాటు కల్పించనున్నారు.
- ఈ పథకం పరిధిలో ఎంపికైన వారికీ పెన్షన్ మరియు గ్రాట్యుటీ వంటివి లభించవు.
- విరమణ పొందిన సైనికులకు అగ్నివీర్ స్కిల్ సర్టిఫికెట్ అందజేస్తారు.
- అలానే ఉద్యోగంలో ఉన్నంతవరకు 48 లక్షల నాన్ కాంట్రిబ్యూటరీ లైఫ్ ఇన్సూరెన్సు కల్పిస్తారు.
- అగ్నిపథ్ పథకంలో భాగంగా సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తారు.
- అలాగే ఈ రెండు బలగాల్లో చేరడానికి కావాల్సిన గరిష్ఠ వయోపరిమితిలోనూ అగ్నివీరులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
అగ్నిపథ్ స్కీమ్ ఎలిజిబిలిటీ
- అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండాలి.
- అభ్యర్థులు అవివాహితులై ఉండాలి
- అభ్యర్థులు పోస్టు వారీగా 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి.
- అభ్యర్థుల వయసు 17.5 ఏళ్ళ నుండి గరిష్టంగా 23 ఏళ్ళ మధ్య ఉండాలి.
- అభ్యర్థులు బౌతికంగా & మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి.
అగ్నివీర్ నియామక ప్రక్రియ
అగ్నివీర్ నియామక ప్రక్రియ ఫీజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ మరియు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (CEC) ద్వారా ఎంపిక చేస్తారు. వీటికి సంబంధించిన పూర్తివివరాలు ఆయా నోటిఫికేషన్ల యందు తెలియజేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు తమకు ఆసక్తి ఉన్న రెజిమెంట్లు/యూనిట్ల యందు పనిచేసే అవకాశం కల్పిస్తారు. అలానే అవసరమైన సమయంలో ఏ రెజిమెంట్లు/యూనిట్ యందయినా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి.
ఎంపికైన అభ్యర్థులకు 10 వారాల నుంచి 6 నెలల వరకు శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ సమయం కూడా నాలుగేళ్ళ కాంట్రాక్టు పీరియడ్ యందు లెక్కించబడుతుంది. అలానే ఏడాది గరిష్టంగా ఏడాదికి 30 రోజుల సాధారణ సెలవలు కల్పిస్తారు. అలానే మెడికల్ సెలవలు కూడా అవసరం మేరకు పొందే అవకాశం ఉంది.
అగ్నిపథ్ స్కీమ్ వేతన వివరాలు
అగ్నిపథ్ స్కీమ్ ద్వారా ఎంపికైన అగ్నివీరులకు మొదటి ఏడాది నెలకు 30 వేల రూపాయల వేతనం అందజేస్తారు. ఇందులో 9 వేల రూపాయలు కార్పస్ నిధికి జోడిస్తారు. మిగిలిన 21 వేలు అందజేస్తారు. అలానే కేంద్ర ప్రభుత్వం అంతే మొత్తంలో 9 వేలు కార్పస్ నిధికి జోడిస్తుంది. రెండవ ఏడాది నుండి ఏటా 10 శాతం చెప్పున వేతనాన్ని పెంచి చెల్లిస్తారు. అంటే రెండవ ఏడాది 33 వేలు, మూడవ ఏడాది 36 వేల ఐదువందలు, అలానే చివరి ఏడాది 40 వేలు వేతనాన్ని అందజేస్తారు.
నెలవారీ జీతం | చేతికి ఇచ్చే జీతం | కార్పస్ ఫండ్ (అభ్యర్థి + ప్రభుత్వం) | |
మొదటి ఏడాది | 30,000/- | 21,000/- | 18,000 /- |
రెండవ ఏడాది | 33,000/- | 23,100/- | 19,800/- |
మూడవ ఏడాది | 36,500/- | 25,580/- | 21,900/- |
నాలుగో ఏడాది | 40,000/- | 28,000/- | 24,000/- |
అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2022
ఆర్మీ అగ్నివీర్ నోటిఫికేషన్ 2022 | పూర్తి వివరాలు | నోటిఫికేషన్ 2022 |
నేవీ అగ్నివీర్ నోటిఫికేషన్ 2022 | పూర్తి వివరాలు | నోటిఫికేషన్ 2022 |
ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్ 2022 | పూర్తి వివరాలు | నోటిఫికేషన్ 2022 |