రోజువారీ కరెంట్ అఫైర్స్ : 21 అక్టోబర్ 2023
Telugu Current Affairs

రోజువారీ కరెంట్ అఫైర్స్ : 21 అక్టోబర్ 2023

రోజువారీ తెలుగు కరెంట్ అఫైర్స్ 21 అక్టోబర్ 2023, తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి  వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

Advertisement

గగన్‌యాన్ సీఈఎస్ టెస్ట్ ఫ్లైట్‌ ప్రయోగం విజయవంతం

గగన్‌యాన్ మిషన్ సంబంధించి క్రూ ఎస్కేప్ సిస్టమ్ (సీఈఎస్) యొక్క టెస్ట్ ఫ్లైట్‌ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విజయవంతంగా నిర్వహించింది. ఈ ద్రవ చోదక సింగిల్-స్టేజ్ టెస్ట్ వెహికల్ (టీవీ-డీ1) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి అక్టోబర్ 21న విజయవంతంగా పరీక్షించబడింది.

క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనేది గగన్‌యాన్ మిషన్‌కు కీలకమైన భద్రతా వ్యవస్థ. ఇది భారతీయ వ్యోమగాముల భద్రత కోసం రూపొందించిన కీలకమైన స్వదేశీ వ్యవస్థ. ఇది అత్యవసర పరిస్థితుల్లో వాహనం నుండి వ్యోమగాములను సురక్షితంగా బయటకు పంపడానికి సహాయపడుతుంది. 2025 నాటికి గగన్‌యాన్ మిషన్ ద్వారా మొదటి భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ యొక్క టెస్ట్ ప్రయోగం నిర్వహించింది.

సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జీఎస్ఎల్వి ఎంకే III రాకెట్ ద్వారా ప్రయోగించబడిన ఈ సిమ్యులేటెడ్ క్రూ మాడ్యూల్, లాంచ్ వెహికల్ నుండి విజయవంతంగా వేరు చేయబడి, పారాచూట్‌ల సహాయంతో తీరానికి 10 కిలోమీటర్ల దూరంలోని బంగాళాఖాతంలో సురక్షితంగా దిగింది.

మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్‌లో ప్రాజెక్ట్ ఉద్భవ్ ప్రారంభం

భారతీయ సైన్యం యొక్క పురాతన వ్యూహాత్మక పరిజ్ఞానాన్ని ఆధునిక సైనిక పద్ధతులతో ఏకీకృతం చేయడానికి 'ఉద్భవ్' అనే కొత్త ప్రాజెక్ట్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అక్టోబర్ 21న ప్రారంభించారు. భారత ఆర్మీ ఢిల్లీలో నిర్వహించిన ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం సందర్భంగా దీనిని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ మనోజ్ పాండే, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, వైమానిక దళ చీఫ్ ఎస్జే సింగ్, వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ జేపీ మాథ్యూ, చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ బీకే శర్మ (రిటైర్డ్) వంటి ప్రముఖులు హాజరయ్యారు.

ఆధునిక భద్రతా సవాళ్లను పరిష్కరించడానికి ఒక ప్రత్యేకమైన మరియు సంపూర్ణమైన విధానాన్ని రూపొందించడం, సమకాలీన సైనిక పద్ధతులతో పురాతన జ్ఞానాన్ని సంశ్లేషణ చేయడం ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. ఇది భారతీయ సైన్యం యొక్క దూరదృష్టితో కూడిన చొరవ, ఇది సమకాలీన సైనిక బోధనతో పురాతన జ్ఞానాన్ని ఏకీకృతం చేయడానికి ప్రయత్నిస్తుంది.

ప్రాజెక్ట్ ఉద్భవ్ ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్, వర్క్‌షాప్‌లు మరియు లీడర్‌షిప్ సెమినార్‌ల ద్వారా ఈ పురాతన జ్ఞానాన్ని ఆధునిక సైనిక బోధనతో సమర్ధవంతంగా సమీకృతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది వ్యూహాత్మక ఆలోచన, స్టేట్‌క్రాఫ్ట్ మరియు వార్‌ఫేర్‌కు సంబంధించి గతంలో అన్వేషించని ఆలోచనలు మరియు సిద్ధాంతాల ఆవిర్భావాన్ని సులభతరం చేస్తుంది. అలానే ఆయా అంశాల యందు లోతైన అవగాహనను పెంపొందిస్తుంది, సైనిక శిక్షణా పాఠ్యాంశాలను మెరుగుపరచడంలో దోహదపడుతుంది.

కస్తూరి కాటన్ భారత్ వెబ్‌సైట్‌ ప్రారంభం

భారతీయ పత్తి యొక్క బ్రాండింగ్ మరియు ట్రేస్‌బిలిటీ కోసం కస్తూరి కాటన్ భారత్ అనే వెబ్‌సైట్‌ను అక్టోబర్ 21న కేంద్ర జౌళి, వాణిజ్య & పరిశ్రమల శాఖమంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. దీనిని టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ట్రేడ్ బాడీస్ & పరిశ్రమల సంయుక్త చొరవతో రూపొందించారు.

ఈ వెబ్‌సైట్ కస్తూరి కాటన్ భారత్ బ్రాండ్‌ను ఉత్పత్తి చేయడానికి జిన్నర్ల నమోదు ప్రక్రియకు అవకాశం కల్పిస్తుంది.  అలానే బ్రాండెడ్ ఇండియన్ కాటన్‌కు అంతర్జాతీయంగా ప్రచారం మరియు మార్కెట్ కల్పించేందుకు సహాయపడుతుంది. కస్తూరి కాటన్ భారత్ అనేది భారతదేశపు ప్రీమియం పత్తి యొక్క బ్రాండ్ పేరు. దీనిని ఇటీవలే అక్టోబర్ 7 న ప్రపంచ పత్తి దినోత్సవం సందర్భంగా జౌళి మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

లడఖ్ హిమాలయాల్లో పగడపు దిబ్బల శిలాజాలు

తూర్పు లడఖ్ హిమాలయాలలోని బర్ట్సే ప్రాంతంలో సముద్ర మట్టానికి 18000 అడుగుల ఎత్తులో పగడపు దిబ్బల శిలాజాలను జియాలజిస్ట్ రితేష్ ఆర్య ఇటీవలే కనుగొన్నారు. ఈ వెతికి తీసిన శిలాజాలలో పగడపు కాలనీల యొక్క క్లిష్టమైన నిర్మాణాలు ఉన్నాయి. అవి సుమారు 250 మిలియన్ సంవత్సరాల నాటివని భావిస్తున్నారు.

లడఖ్ హిమాలయాలలో పగడపు దిబ్బల శిలాజాలను కనుగొనడం ఒక ముఖ్యమైన అన్వేషణ, ఎందుకంటే ఈ ప్రాంతం ఒకప్పుడు వెచ్చని, నిస్సారమైన సముద్రంచే కప్పబడి ఉండేదని రుజువు చేస్తుంది. ఇది లడఖ్ యొక్క ప్రస్తుత ఎత్తైన ఎడారి ప్రకృతి దృశ్యానికి పూర్తి విరుద్దమైన భౌతిక దృశ్యం.

పగడపు దిబ్బల శిలాజాల ఆవిష్కరణ హిమాలయాల భౌగోళిక చరిత్రపై మన అవగాహనకు మరిన్ని ప్రశ్నలను జోడిస్తుంది. హిమాలయాలు రెండు ఖండాంతర పలకల ఢీకొనడం ద్వారా ఏర్పడ్డాయని మనం చదువు కుంటున్నాం. ఈ ఢీకొట్టే సమయంలో సముద్రగర్భం పైకి నెట్టబడి హిమాలయ పర్వతాలు ఏర్పడినట్లు మనం నమ్ముతున్నాం.

అలానే హిమాలయాల వాతావరణం కాలక్రమేణా, వెచ్చని, లోతులేని సముద్రం నుండి ఎత్తైన ఎడారిగా మారిందనే అధ్యయనాలు కూడా ఉన్నాయి. ఈ రెండు అధ్యయనాలు ఈ ప్రాంతం ఒకప్పుడు అనేక రకాల సముద్ర జీవులకు నిలయంగా ఉండేదని సూచిస్తుంది. అయితే ఇది హిమాలయాల ప్రస్తుత జీవవైవిధ్యానికి పూర్తి విభిన్నమైనది.

ఏది ఏమైనా లడఖ్ హిమాలయాలలో పగడపు దిబ్బల శిలాజాలను కనుగొనడం ఒక ముఖ్యమైన శాస్త్రీయ విజయం. ఇది హిమాలయాల భౌగోళిక చరిత్ర మరియు ప్రాంతం యొక్క పురాతన సముద్ర పర్యావరణ వ్యవస్థ గురించి కొత్త అంతర్దృష్టులను అందిస్తుంది.

లడఖ్ గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్ IIకి  క్యాబినెట్ ఆమోదం

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అక్టోబర్ 18 న గ్రీన్ ఎనర్జీ కారిడార్ (జీఈఎస్) ఫేజ్-II ఇంటర్-స్టేట్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ 2029-30 నాటికి పూర్తవుతుందని అంచనా వేయబడుతుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం అంచనా వ్యయం రూ.20,773.70 కోట్లు. ప్రాజెక్ట్ వ్యయంలో 40 శాతం అంటే రూ.8,309.48 కోట్లు కేంద్ర ఆర్థిక సహాయంగా అందించబడుతుంది.

లడఖ్ ప్రాంతంలోని భౌగోళిక సంక్లిష్ట, ప్రతికూల వాతావరణ పరిస్థితులు మరియు రక్షణ సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒక ఏజెన్సీగా పర్యవేక్షిస్తుంది. దీని ద్వారా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వోల్టేజ్ సోర్స్ కన్వర్టర్ ఆధారిత హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్, సిస్టమ్ మరియు ఎక్స్‌ట్రా హై వోల్టేజ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఉత్పత్తి చేయబడుతుంది.

ఈ విద్యుత్‌ను తరలించే ట్రాన్స్‌మిషన్ లైన్ హిమాచల్ ప్రదేశ్ మరియు పంజాబ్ గుండా హర్యానాలోని కైతాల్ వరకు వేయబడుతుంది. ఇక్కడ అది నేషనల్ గ్రిడ్‌తో అనుసంధానించబడుతుంది. లడఖ్‌కు విశ్వసనీయమైన విద్యుత్ సరఫరాను నిర్ధారించడానికి లేహ్‌లోని ఈ ప్రాజెక్ట్ నుండి ఇప్పటికే ఉన్న లడఖ్ గ్రిడ్‌కు ఇంటర్‌కనెక్షన్ చేయబడుతుంది. జమ్మూ & కాశ్మీర్‌కు విద్యుత్ అందించడానికి ఇది లేహ్-అలుస్తెంగ్-శ్రీనగర్ లైన్‌కు కూడా అనుసంధానించబడుతుంది.

ఈ ప్రాజెక్ట్ 2030 నాటికి శిలాజ రహిత ఇంధనాల నుండి 500 గిగా వాట్స్ వ్యవస్థాపించిన విద్యుత్ సామర్థ్యం యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి దోహదం చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ దేశం యొక్క దీర్ఘకాలిక ఇంధన భద్రతను అభివృద్ధి చేయడంలో మరియు కార్బన్ పాదముద్రను తగ్గించడం ద్వారా పర్యావరణపరంగా స్థిరమైన వృద్ధిని ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుంది.

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, తమిళనాడు మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే అమలులో ఉన్న ఇంట్రా-స్టేట్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-II (INSTS GEC-II)కి ఈ ప్రాజెక్ట్ అదనం. 2020 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రధానమంత్రి లడఖ్‌లో 7.5 GW సోలార్ పార్క్ ఏర్పాటును ప్రకటించారు. విస్తృతమైన క్షేత్ర సర్వే తర్వాత, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ  లడఖ్‌లోని పాంగ్‌లో 12 GWh బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ మరియు 13 GW రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసింది.

బెంగాల్ దుర్గా భారత్ అవార్డులు ప్రదానం

పశ్చిమ బెంగాల్ మరియు భారతదేశ సంస్కృతి, విజ్ఞానం మరియు ప్రజాసేవ రంగాలలో విశేషమైన కృషి చేసే వ్యక్తులు సంస్థల కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రారంభించిన మొదటి సెట్‌ దుర్గా భారత్ అవార్డులను గవర్నర్ డాక్టర్ సివి ఆనంద బోస్, గ్రహీతలకు అందజేశారు. ఈ మొదటి విడుత అవార్డులను పండిట్ అజోయ్ చక్రబర్తి (సంగీత లెజెండ్), గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజనీర్స్, విశ్వభారతి విశ్వవిద్యాలయం మరియు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) లకు అందించారు.

పశ్చిమ బెంగాల్ గవర్నర్ 'దుర్గా భారత్ సమ్మాన్' పేరుతొ అందిస్తున్న ఈ అవార్డుల కోసం సెప్టెంబర్ చివరిలో నామినేషన్లు ఆహ్వానించారు. ఈ అవార్డులు దుర్గా భారత్ పరమ సమ్మాన్ (రూ. 1,00,000), దుర్గా భారత్ సమ్మాన్ (రూ. 50,000) మరియు దుర్గా భారత్ పురస్కార్ (రూ. 25,000) పేర్లతో అందిస్తున్నారు.

మణిపూర్ హైకోర్టు 7వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్

మణిపూర్ హైకోర్టు ఏడో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ అక్టోబర్ 21న ప్రమాణ స్వీకారం చేశారు. ఇంఫాల్‌లోని రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్‌తో గవర్నర్ సుశ్రీ అనుసూయా ఉయికే ప్రమాణం చేయించారు. ఢిల్లీ హైకోర్టుకు చెందిన జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్‌ను మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ నెల 16న రాష్ట్రపతి నియమించారు.

భారతీయ విద్యార్థుల కోసం వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడీ కార్డు

భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం వన్ నేషన్ వన్ ఐడీని రూపొందించాలని యోచిస్తోంది. ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (APAAR) ఐడీ అని పిలవబడే గుర్తింపు కార్డు విద్యార్థులకు ఒక డిజిటల్ ఐడీగా ఉంటుంది. ఇది విద్యార్థుల మార్కులు, డిగ్రీలు మరియు అవార్డులతో సహా అన్ని విద్యా రికార్డులతో ఇంటిగ్రేట్ చేయబడుతుంది.

ఈ ఐడీ విద్యార్థులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. విద్యార్థులకు పాఠశాలలు లేదా కళాశాలల బదిలీని సులభతరం చేస్తుంది. విద్యార్థులు తమ విద్యాసంబంధ రికార్డులను విడిగా సమర్పించాల్సిన అవసరం లేనందున ఉద్యోగాలు లేదా స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడం కూడా ఇది సులభతరం చేస్తుంది. వన్ నేషన్ వన్ ఐడీ సురక్షితమైన సర్వర్‌లో నిల్వ చేయబడుతుంది. ఇది విద్యార్థుల ఆధార్ నంబర్‌తో కూడా లింక్ చేయబడుతుంది.

ఈ కార్డు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. వన్ నేషన్ వన్ ఐడీని దశలవారీగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మొదటి దశ 2023-24 విద్యా సంవత్సరంలో అమలు చేయబడుతుంది. మొదటి దశలో, పాఠశాలలు మరియు కళాశాలల్లో చేరిన కొత్త విద్యార్థులందరికీ ఐడీ జారీ చేయబడుతుంది. తదుపరి దశల్లో, ఇప్పటికే ఉన్న విద్యార్థులందరికీ ఐడీ జారీ చేయబడుతుంది.

పారిశ్రామిక సంతులనం కోసం ప్రపంచ మొదటి జెండర్ బ్యాలెన్స్ ఫ్రేమ్‌వర్క్

నాల్గవ పారిశ్రామిక విప్లవం పరిధిలో మహిళలకు సాధికారత కల్పించడానికి మరియు లింగ సమానత్వాన్ని పెంపొందించడానికి ప్రపంచ మొదటి జెండర్ బ్యాలెన్స్ ఫ్రేమ్‌వర్క్ రూపొందించబడింది. దుబాయ్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ యొక్క వార్షిక సమావేశంలో భాగంగా జరిగిన 'జెండర్ బ్యాలెన్స్ మరియు 4ఐఆర్' వర్క్‌షాప్‌లో దీనిని ప్రకటించారు.

ఈ ఫ్రేమ్‌వర్క్ వ్యాపారాలు మరియు ప్రభుత్వాలు కార్యాలయంలో మరియు పౌర సమాజంలో లింగ సమతుల్యతను సాధించడంలో సహాయపడటానికి రూపొందించబడింది. ఈ ఫ్రేమ్‌వర్క్ యూఏఈ జెండర్ బ్యాలెన్స్ కౌన్సిల్ మరియు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు అనుబంధంగా ఉన్న సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ మధ్య సహకార భాగస్వామ్యం ఫలితంగా ఏర్పడింది.

యుఎఇ జెండర్ బ్యాలెన్స్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ మోనా అల్ మర్రి, లింగ సమానత్వానికి కొత్త ప్రమాణాలను నెలకొల్పడంలో గ్లోబల్ లీడర్‌గా యుఎఇ హోదాను సగర్వంగా ప్రకటించారు. ఈ వర్క్‌షాప్ సందర్భంగా, పాల్గొనేవారు లింగ సమతుల్యతను ప్రోత్సహించే 4ఐఆర్ మోడల్‌ను అభివృద్ధి చేయడానికి అవకాశాలను అన్వేషించారు. పారిశ్రామిక ల్యాండ్‌స్కేప్‌లో మరింత సమానమైన మరియు సమగ్ర భవిష్యత్తును రూపొందించడంలో ప్రపంచ నైపుణ్యాన్ని ఎలా ఉపయోగించాలో పరిశీలించారు.

జెండర్ బ్యాలెన్స్ అండ్ 4ఐఆర్ వర్క్‌షాప్‌ను యుఎఇ జెండర్ బ్యాలెన్స్ కౌన్సిల్ సభ్యుడు హుదా అల్ హషేమీ ప్రారంభించారు. యూఏఈ ప్రభుత్వం మరియు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సహ-హోస్ట్ చేసిన ఈ గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్స్ వార్షిక సమావేశంలో ప్రభుత్వ అధికారులు, అంతర్జాతీయ సంస్థలు మరియు విద్యాసంస్థల ప్రతినిధులతో సహ సుమారు 600 మంది అంతర్జాతీయ నిపుణులు మరియు మేధావులు హాజరయ్యారు.

ఆసియన్ మరియు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మొదటి శిఖరాగ్ర సమావేశం

గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మరియు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ నాయకుల మొదటి శిఖరాగ్ర సమావేశం రియాద్‌లో నిర్వహించబడింది. రియాద్ సమ్మిట్ రెండు ప్రాంతాల మధ్య సంబంధాలలో కొత్త శకానికి నాంది పలికిన చారిత్రాత్మక సంఘటన. ఈ సమ్మిట్ ఇరు సమూహాల సహకారాన్ని సమీక్షించింది. విస్తృతమైన ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకుంది. ఈ సదస్సుకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో సహ అధ్యక్షత వహించారు.

గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మరియు ఆసియన్ గ్రూపులు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన ఆర్థిక మరియు రాజకీయ కూటమిలలో రెండు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అనేది మధ్యప్రాచ్యంలోని ఆరు చమురు సంపన్న దేశాల సమూహం. ఇందులో బహ్రయిన్, కువైట్, ఒమన్, కతర్, సౌదీఅరేబియా మరియు యుఏఈ దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ప్రస్తుత ఈ సభ్య దేశాలు అన్ని రాచిరిక రాజ్యాలుగా ఉన్నాయి.

అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ఆసియన్) అనేది ఆగ్నేయాసియాలోని పది దేశాల సమూహం. ఇందులో సభ్య దేశాలుగా ఇండోనేషియా, మలేసియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, బ్రూనే, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియాలు ఉండగా భారత దేశం, చైనా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు డయలాగ్ పార్టనర్స్‌గా వ్యవహరిస్తున్నాయి.

Advertisement

Post Comment