Advertisement
భారతదేశ జాతీయ అవార్డులు & గౌరవాలు
Study Material

భారతదేశ జాతీయ అవార్డులు & గౌరవాలు

భారత ప్రభుత్వం వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వ్యక్తులకు సమాజానికి సేవలు అందించే వ్యక్తులకు, సంస్థలకు గుర్తించి అవార్డులు & గౌరవాలు అందిస్తుంది. ఈ జాబితాలో భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న నుండి పద్మవిభూషణ్‌, పద్మభూషణ్, పద్మశ్రీ, జ్ఞానపీఠ్, అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర, అర్జున అవార్డు, ధ్యాన్ చంద్ అవార్డు, ద్రోణాచార్య అవార్డులు ఉన్నాయి.

భారతరత్న అవార్డు

భారతరత్న అనేది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క అత్యున్నత పౌర పురస్కారం. ఈ అవార్డును మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జనవరి 2, 1954న ప్రారంభించారు. ఈ అవార్డును కళలు, సాహిత్యం, సైన్స్ మరియు ప్రజా సేవలలో దేశానికి అత్యుత్తమ సేవలు అందించిన వ్యక్తులకు అందిస్తారు. అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి సంతకం చేసిన సనద్ (సర్టిఫికేట్) మరియు పీపల్ లీఫ్ ఆకారపు పతకాన్ని అందిస్తారు.

భారతరత్న అవార్డును ఇప్పటి వరకు 48 మంది ప్రముఖలకు అందించారు. భారతరత్న అవార్డును 1957 లో మొదటిసారి అందించారు. ఇందులో భారతదేశ చివరి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి, భారతదేశపు మొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, భౌతిక శాస్త్రవేత్త సివి రామన్ ఉన్నారు.

ఈ అవార్డును అందుకున్న వారిలో అత్యధికంగా రాజకీయ నాయకులు ఉన్నారు. భారతరత్న అవార్డును ఇప్పటి వరకు ఐదుగురు మహిళలు అందుకున్నారు. ఇందులో ఇందిరా గాంధీ (1971 - పాలిటిక్స్), మదర్ థెరిసా (సామాజిక సేవ - 1980), అరుణా అసఫ్ అలీ (1997 - స్వాతంత్ర కార్యకర్త) ఎంఎస్ సుబ్బలక్ష్మి (1998 - సంగీతం), లతా మంగేష్కర్ (2001 - సంగీతం) ఉన్నారు.

భారతరత్న అవార్డును ఇప్పటి వరకు ఐదుగురు శాస్త్రవేత్తలు అందుకున్నారు. ఇందులో సివి రామన్ (1954 - భౌతిక శాస్త్రం), ఎం. విశ్వేశ్వరయ్య (1955 - ఇంజనీరింగ్), అబ్దుల్ కలాం (1997 - ఏరోస్పేస్ & డిఫెన్స్), అమర్త్య సేన్ (1999 - ఎకనామిక్స్), సిఎన్ఆర్ రావు (2014 - కెమిస్ట్రీ) లు ఉన్నారు.

భారతరత్న అవార్డు అందుకున్న ఏకైక మరియు మొదటి క్రీడాకారుడిగా సచిన్ టెండూల్కర్ (2014) ఉన్నారు. ఈ అవార్డును ఇప్పటి వరకు ఇద్దరు విదేశీయులు అందుకున్నారు. అందులో ఒకరు అబ్దుల్ గఫార్ ఖాన్ (1987 - పాకిస్తాన్) కాగా, మరొకరు నెల్సన్ మండేలా (1990 - దక్షిణాఫ్రికా). ప్రధాని మంత్రిగా పదవిలో ఉన్న సమయంలోనే భారతరత్న అవార్డు అందుకున్న ఏకైక ప్రధానిగా ఇందిరా గాంధీ ఉన్నారు. ఈ అవార్డు అందుకున్న మొదటి పారిశ్రామికవేత్తగా జేడీ టాటా (1992) నిలిచారు.

పద్మ అవార్డులు

పద్మ అవార్డులను భారతరత్న తర్వాత రెండవ అత్యున్నత పౌర పురస్కారాలుగా పరిగణిస్తారు. వీటిని 1954 సంవత్సరంలో స్థాపించారు. ఈ అవార్డులు ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం రోజున ప్రకటించబడతాయి. ఈ అవార్డును కళలు, సాహిత్యం, సైన్స్ మరియు ప్రజా సేవ వంటి వివిధ రంగాల్లో దేశానికి అత్యుత్తమ సేవలు అందించిన వ్యక్తులకు అందిస్తారు.

పద్మ అవార్డులను ప్రాధాన్యత క్రమంలో పద్మవిభూషణ్, పద్మభూషణ్ మరియు పద్మశ్రీ అవార్డుల పేర్లతో అందిస్తారు. పద్మవిభూషణ్ అవార్డును భారత రెండవ అత్యున్నత పౌర పురస్కారంగా పరిగణిస్తారు. పద్మభూషణ్ అవార్డును భారత మూడవ అత్యున్నత పౌర పురస్కారంగా భావిస్తారు. పద్మశ్రీ అవార్డును భారత నాల్గువ అత్యున్నత పౌర పురస్కారంగా గుర్తించబడింది.

పద్మ అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి సంతకం చేసిన సనద్ (సర్టిఫికేట్) మరియు తామరపువ్వుపై దేవనాగరి లిపిలో "పద్మ" అని రాసిన కాంస్య పతకాన్ని అందిస్తారు. గ్రహీతలకు ఎటువంటి నగదు బహుమతి ఇవ్వబడదు.

భారత సైనిక పురస్కారాలు

యుద్ధం మరియు శాంతి సమయాల్లో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించే భారతదేశ సాయుధ దళాలకు భారత ప్రభుత్వం అత్యున్నత గౌరవ మర్యాదలతో సత్కరిస్తుంది. అందులో పరమ వీర చక్ర, మహా వీర్ చక్ర, వీర్ చక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర వంటి మొదలగు గౌరవాలు ఉన్నాయి. పరమ వీర చక్ర, మహా వీర్ చక్ర, వీర్ చక్ర అవార్డులను యుద్ధకాల శౌర్య పురస్కారాలుగా, అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర అవార్డులు శాంతికాల పురస్కారాలుగా అందిస్తారు.

పరమ వీర చక్ర (PVC)

పరమ వీర చక్ర భారతదేశ అత్యున్నత సైనిక అవార్డుగా పరిగణించబడుతుంది. ఈ అవార్డును యుద్ధ సమయంలో విశిష్టమైన పరాక్రమాలను ప్రదర్శించిన సైనికులకు అందిస్తారు. పరమ వీర చక్ర అనగా "వీల్ ఆఫ్ ది అల్టిమేట్ బ్రేవ్" అని అర్ధం. మొదటి పరమ వీర చక్ర అవార్డును 1947 మేజర్ సోమనాథ్ శర్మకు అందించారు.

పరమ వీర చక్రను ఇప్పటి వరకు 21 మంది సైనికులకు అందించారు. వాటిలో 14 మరణానంతరం ఇవ్వబడ్డాయి. అలానే 16 ఇండో-పాకిస్తాన్ సంఘర్షణలలో సాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఇవ్వబడ్డాయి. ఇందులో 20 అవార్డులు భారత్ ఆర్మీకి చెందిన వారు అందుకోగా, కేవలం విక్రమ్ బత్రా (కార్గిల్ వార్) మాత్రమే భారత వైమానిక దళం నుండి అందుకున్నారు.

మహా వీర్ చక్ర (MVC)

మహా వీర్ చక్ర భారత్ రెండవ అత్యున్నత సైనిక పురస్కారంగా భావిస్తారు. ఈ అవార్డును శత్రువుల సమక్షంలో ప్రస్ఫుటమైన శౌర్య సాహసాలు ప్రదర్శించిన త్రివిధ దళాలకు చెందిన సైనికులకు అందిస్తారు. ఈ అవార్డును మొదటిసారి 1947 లో అందించారు. 2021 వరకు ఈ అవార్డును 221 మంది సైనికులకు అందించారు. ఇందులో మరణానంతరం 74 మంది సైనికులు అందుకున్నారు.

వీర్ చక్ర (PrC)

మహా వీర్ చక్ర భారత్ మూడవ అత్యున్నత సైనిక పురస్కారంగా భావిస్తారు. ఈ అవార్డును శత్రువుల సమక్షంలో ప్రస్ఫుటమైన శౌర్య సాహసాలు ప్రదర్శించిన త్రివిధ దళాలకు చెందిన సైనికులకు అందిస్తారు. ఈ అవార్డును మొదటిసారి 1947 లో అందించారు. 2021 వరకు ఈ అవార్డును 1322 మంది సైనికులకు అందించారు. ఇందులో మరణానంతరం 361 మంది సైనికులు అందుకున్నారు.

అశోక చక్ర

అశోక చక్ర భారతదేశం యొక్క అత్యున్నత శాంతికాల సైనిక అవార్డు. ఇది యుద్ధభూమికి బయట శౌర్యం, సాహసోపేతమైన చర్య లేదా ఆత్మత్యాగం చేసుకున్న సైనిక సిబ్బందికి అందిస్తారు. ఈ జాబితాలో రిజర్వ్ ఫోర్సెస్, టెరిటోరియల్ ఆర్మీ, మిలిషియా, సాయుధ దళాల నర్సింగ్ సర్వీసెస్ సభ్యులు, సెంట్రల్ పారా-మిలిటరీ ఫోర్స్ మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ సంబంధిత సభ్యులు ఉంటారు.

కీర్తి చక్ర

కీర్తి చక్ర భారతదేశం యొక్క రెండవ అత్యున్నత శాంతికాల సైనిక అవార్డు. ఇది యుద్ధభూమికి బయట శౌర్యం, సాహసోపేతమైన చర్య లేదా ఆత్మత్యాగం చేసుకున్న సైనిక సిబ్బందికి అందిస్తారు. ఈ జాబితాలో రిజర్వ్ ఫోర్సెస్, టెరిటోరియల్ ఆర్మీ, మిలిషియా, సాయుధ దళాల నర్సింగ్ సర్వీసెస్ సభ్యులు, సెంట్రల్ పారా-మిలిటరీ ఫోర్స్ మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ సంబంధిత సభ్యులు ఉంటారు.

శౌర్య చక్రం

శౌర్య చక్ర భారతదేశం యొక్క మూడవ అత్యున్నత శాంతికాల సైనిక అవార్డు. ఇది యుద్ధభూమికి బయట శౌర్యం, సాహసోపేతమైన చర్య లేదా ఆత్మత్యాగం చేసుకున్న సైనిక సిబ్బందికి అందిస్తారు. ఈ జాబితాలో రిజర్వ్ ఫోర్సెస్, టెరిటోరియల్ ఆర్మీ, మిలిషియా, సాయుధ దళాల నర్సింగ్ సర్వీసెస్ సభ్యులు, సెంట్రల్ పారా-మిలిటరీ ఫోర్స్ మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ సంబంధిత సభ్యులు ఉంటారు.

వీటిలో పాటుగా యుద్ధకాలంలో అత్యుత్తమ సేవలు అందించిన సైనికులకు ఈ క్రింది యుద్ధకాల విశిష్ట సేవ పతకాలను ప్రాధాన్యత క్రమంలో అందిస్తారు.

  • సర్వోత్తం యుద్ధ సేవా పతకం
  • ఉత్తమ్ యుద్ధ సేవా పతకం
  • యుద్ధ సేవా పతకం

అలానే యుద్ధ భూమికి దూరంగా అత్యుత్తమ సేవలు అందించిన సైనికులకు ఈ క్రింది శాంతికాల విశిష్ట సేవ పతకాలను ప్రాధాన్యత క్రమంలో అందిస్తారు.

  • పరమ విశిష్ట సేవా పతకం
  • అతి విశిష్ట సేవా పతకం
  • విశిష్ట సేవా పతకం

జాతీయ అవార్డులు

సర్దార్ పటేల్ నేషనల్ యూనిటీ అవార్డు

భారతదేశ జాతీయ ఐక్యత మరియు సమగ్రతను పెంపొందించడంలో సహకరించిన భారతీయ పౌరులకు ఈ అవార్డు అందిస్తారు. ఈ అవార్డు 2019 లో ప్రారంబించారు. ఈ అవార్డును అక్టోబర్ 31 న జాతీయ ఐక్యత డే అయినా సర్దార్ పటేల్ పుట్టినరోజు నాడు ప్రకటిస్తారు.

ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్

ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్‌లను ఇంటరాక్టివ్ ఫోరమ్ ఆన్ ఇండియన్ ఎకానమీ (IFIE) నిర్వహిస్తుంది. ఈ అవార్డును గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్య సంరక్షణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కుటుంబ సంక్షేమం మరియు  స్వచ్ భారత్ అభియాన్‌లో అత్యుత్తమ సహకారం కోసం అందిస్తారు.

నారీ శక్తి పురస్కారం

మహిళా సాధికారత కోసం చేసిన విశేష కృషి చేసిన వ్యక్తులకు మరియు సంస్థలకు అందిస్తారు. ఈ అవార్డును అంతర్జాతీయ మహిళా దినోత్సవం (8 మార్చి) నాడు రాష్ట్రపతిచే అందజేయబడుతుంది. ఈ అవార్డు స్త్రీ శక్తి పురస్కారం పేరుతో 1999లో స్థాపించబడింది, 2015లో నారీ శక్తి పురస్కారంగా పేరు మార్చబడింది.

పీఎం రాష్ట్రీయ బాల్ పురస్కార్

పీఎం రాష్ట్రీయ బాల్ పురస్కార్ అనేది వివిధ రంగాల్లో సేవలు అందించిన బాలలకు అందిస్తారు. ఈ అవార్డు రెండు కేటగిర్ల వారీగా అందిస్తారు. మొదటిది ఆవిష్కరణలు, శాస్త్రోక్త విజయాలు, సామాజిక సేవ, కళలు మరియు సంస్కృతి, ధైర్యం లేదా క్రీడలలో అత్యుత్తమ విజయాలు సాధించినం 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న భారతీయ పౌరులకు బాల శక్తి పురస్కార్  పేరుతో అవార్డు అందిస్తారు.

రెండవది బాలల అభివృద్ధి, శిశు రక్షణ లేదా శిశు సంక్షేమంలో అత్యుత్తమ కృషి చేసిన వ్యక్తులు లేదా సంస్థలకు బాల్ కళ్యాణ్ పురస్కార్ అందిస్తారు. ఈ అవార్డులను 1996 లో మొదటిసారి అందించారు. ఈ అవార్డులను గణతంత్ర దినోత్సవానికి ముందు వారం ప్రకటించి, భారత రాష్ట్రపతి చేతుల మీదగా ప్రదానం చేస్తారు.

డాక్టర్ బిసి రాయ్ అవార్డు

బిధాన్ చంద్ర రాయ్ అవార్డును డాక్టర్ బిసి రాయ్ జ్ఞాపకార్థం 1962లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపించింది . దీనిని ప్రతి సంవత్సరం జూలై 1, జాతీయ వైద్యుల దినోత్సవం నాడు న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి అందజేస్తారు. ఈ అవార్డును వైద్య రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన వైద్యులకు అందిస్తారు. అవార్డు గ్రహీతకు లక్ష రూపాయల ప్రైజ్ మనీ ఇస్తారు.

సాహిత్య పురస్కారాలు

జ్ఞానపీఠ్ అవార్డు

జ్ఞానపీఠ్ అవార్డును భారతీయ సాహిత్యంలో అత్యుత్తమ సహకారం అందించిన రచయితలకు ప్రతి సంవత్సరం అందించే పురాతన మరియు అత్యున్నత భారతీయ సాహిత్య పురస్కారం. ఇది1961లో స్థాపించబడింది. ఈ అవార్డు భారత రాజ్యాంగంలో ఎనిమిదవ షెడ్యూల్‌లో చేర్చబడిన భారతీయ భాషలలో వ్రాసే భారతీయ రచయితలకు మాత్రమే ఇవ్వబడుతుంది. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతకు 14 లక్షల నగదు బహుమతితో పాటుగా జ్ఞాపిక అందజేస్తారు.

సాహిత్య అకాడమీ అవార్డు

సాహిత్య అకాడమీ అవార్డు అనేది భారతదేశ రెండవ అత్యున్నత సాహిత్య పురస్కారం. దీనిని 1954 లో ప్రారంభించారు. ఈ అవార్డును 24 భారతీయ  భాషలలో ప్రచురించబడిన అత్యుత్తమ సాహిత్య ప్రతిభ గల పుస్తకాల రచయితలకు ప్రదానం చేస్తారు. విజేతకు లక్ష రూపాయల నగదు బహుమతితో పాటుగా జ్ఞాపికను అందజేస్తారు. విజేతలను భారత నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ నిర్ణయిస్తుంది.

సాహిత్య అకాడమీ ఫెలోషిప్

సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అనేది నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ ద్వారా అందించబడే ఒక భారతీయ సాహిత్య గౌరవం. ఈ ఫెలోషిప్ భారతీయ సాహిత్యంపై పరిశోధన చేస్తున్న పండితులకు లేదా భారతదేశం వెలుపుల సార్క్ దేశాలలోని సృజనాత్మక రచయితలకు ఇవ్వబడుతుంది. దీనిని 1968 మొదటిసారి ప్రారంభించారు. సాహిత్య అకాడమీ ఫెలోషిప్ గౌరవాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ అందుకున్నారు.

సరస్వతి సమ్మాన్

సరస్వతీ సమ్మాన్ అనేది భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ VIIIలో జాబితా చేయబడిన భారతదేశంలోని 22 భాషలలో ఏదైనా అత్యుత్తమ గద్య లేదా పద్య సాహిత్య రచనలకు అందించే వార్షిక పురస్కారం. 1991 లో కేకే బిర్లా ఫౌండేషన్ ద్వారా స్థాపించబడిన ఈ అవార్డుకు హిందూ జ్ఞాన దేవత సరస్వతి పేరు నామకరణం చేసారు. విజేతకు 15 లక్షల నగదు బహుమతితో పాటుగా జ్ఞాపికను అందజేస్తారు.

వ్యాస్ సమ్మాన్

వ్యాస్ సమ్మాన్ అనేది అత్యుత్తమ హిందీ సాహిత్య రచనలకు అందించే వార్షిక గౌరవం. 1991 లో కేకే బిర్లా ఫౌండేషన్ ద్వారా స్థాపించబడిన ఈ అవార్డుకు వేదవ్యాసుడు పేరును నామకరణం చేసారు. అవార్డు విజేతకు 4 లక్షల నగదు బహుమతితో పాటుగా జ్ఞాపికను అందజేస్తారు.

జాతీయ క్రీడా పురస్కారాలు

మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్

మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును భారతదేశ అత్యున్నత క్రీడా గౌరవంగా పరిగణిస్తారు. ఈ అవార్డును వరుస నాలుగేళ్లలో భారతీయ క్రీడాకారుల అత్యుత్తమ అంతర్జాతీయ ప్రదర్శనకు గాను అందిస్తారు. ఈ అవార్డును యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఏటా ప్రదానం చేస్తుంది. అవార్డు గ్రహీతకు జ్ఞాపికతో పాటుగా 25 లక్షల నగదు బహుమతి అందజేస్తారు.

ఈ అవార్డును భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణం తర్వాత 1992 లో రాజీవ్ ఖేల్ రత్న పేరుతొ ప్రారంభించారు. 2021 నుండి ఈ అవార్డుకు భారతీయ ఫీల్డ్ హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ పేరు పెట్టారు. మొదటి ఖేల్ రత్న అవార్డును చెస్ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కుడిగా షూటర్ అభినవ్ బింద్రా (2001- 18 ఏళ్ళు) నిలిచారు.

అర్జున అవార్డు

అర్జున అవార్డు భారతదేశం యొక్క రెండవ .అత్యున్నత క్రీడా గౌరవం. 1961లో స్థాపించిన ఈ అవార్డుకు మహాభారత పాత్రలలో ఒకరైన అర్జునుడి పేరుతొ స్థాపించారు. ఈ అవార్డును ఒలింపిక్ గేమ్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ కప్, ప్రపంచ ఛాంపియన్‌షిప్ వంటి టోర్నమెంటులలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే క్రీడాకారులకు అందజేస్తారు. అవార్డు గ్రహీతకు 15 లక్షల నగదు బహుమతితో పాటుగా జ్ఞాపికను అందజేస్తారు.

ధ్యాన్ చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

ధ్యాన్ చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అంతర్జాతీయ లేదా దేశీయ క్రీడా జేవితంలో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన వ్యక్తులకు అందజేస్తారు. ఈ అవార్డుకు మాజీ హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ పేరు పెట్టారు.

2002లో స్థాపించబడిన ఈ అవార్డును ఒలింపిక్ క్రీడలు, పారాలింపిక్ క్రీడలు, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్ మరియు ప్రపంచ కప్‌తో పాటు క్రికెట్, స్వదేశీ క్రీడలు మరియు పారాస్పోర్ట్స్ వంటి ఈవెంట్‌లలో చేర్చబడిన విభాగాలకు మాత్రమే ఇవ్వబడుతుంది. విజేతకు 10 లక్షల నగదు బహుమతితో పాటుగా జ్ఞాపికను అందజేస్తారు.

ద్రోణాచార్య అవార్డు

ద్రోణాచార్య అవార్డు అత్యుత్తమ క్రీడా శిక్షణను అందించే కోచ్‌లకు అందిస్తారు. ఈ అవార్డుకు మహాభారతంలో అత్యుత్తమ గురువైన ద్రోణాచార్యడు పేరును నామకరణం చేసారు. 1985 లో స్థాపించబడిన ఈ అవార్డుకు ద్రోణాచార్య యొక్క కాంస్య విగ్రహంతో పాటుగా 15 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు.

ఈ అవార్డును ఒలింపిక్ క్రీడలు , పారాలింపిక్ క్రీడలు , ఆసియా క్రీడలు , కామన్వెల్త్ క్రీడలు , ప్రపంచ ఛాంపియన్‌షిప్ మరియు ప్రపంచ కప్‌తో పాటు క్రికెట్ , స్వదేశీ ఆటలు మరియు పారాస్పోర్ట్స్ వంటి ఈవెంట్‌లలో చేర్చబడిన విభాగాలకు మాత్రమే ఇవ్వబడుతుంది.

Post Comment