నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్సడ్ లెర్నింగ్ (ఎన్‌పీటీఎల్) ను 2003 లో ఏడు ఐఐటిలు (బొంబాయి, ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, గువహతి మరియు రూర్కీ) మరియు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరు ఉమ్మడిగా ప్రారంభించాయి. సాంకేతిక విద్యకు సంబంధించి పూర్తిస్థాయి ఆన్‌లైన్ కోర్సులను రూపొందించాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేసారు.
ఎన్‌పీటీఎల్ 2014 నుండి మెజారిటీ ఇంజనీరింగ్ బ్రాంచులకు సంబంధించి ఆన్‌లైన్ కోర్సులను అందిస్తుంది. ఉత్తీర్ణత పొందిన కోర్సులకు ఐఐటీ, ఐఐఎస్ డిజిటల్ సర్టిఫికెట్ అందిస్తుంది. ఎన్‌పీటీఎల్ ఈ కోర్సులను తమ అధికారిక వెబ్సైటుతో పాటుగా స్వయం మరియు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తుంది. ఈ కోర్సుల అన్నిటికి అల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) గుర్తింపు ఉంటుంది.
ప్రస్తుతం ఈ వేదికలో 2.5 వేలకు పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోటి మందికి పైగా విద్యార్థులు వివిధ కోర్సులను ఎన్రోల్ చేసుకున్నారు. ఇందులో 15 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షల కోసం రిజస్టర్ చేసుకుని విజయవంతంగా కోర్సులు పూర్తిచేసుకున్నారు. ఈ కోర్సులు అన్ని పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. పరీక్షల నిర్వహణ మరియు డిజిటల్ సర్టిఫికెట్ కోసం 1000/- చెల్లించాల్సి ఉంటుంది. పరీక్షలో 40 శాతం మార్కులు తప్పనిసరి పొందాల్సి ఉంటుంది.
ఎన్‌పీటీఎల్ ఎప్పటికప్పుడు ఈ కోర్సుల సంబంధిత వివరాలు వెబ్సైటులో అందుబాటులో ఉంచుతుంది. కోర్సుల నిడివి 4 నుండి 12 నెలల వ్యవధితో ఉంటాయి. కోర్సుల ప్రారంభ తేదిలు, సెమిస్టరు వివరాలు ఎన్‌పీటీఎల్ వెబ్సైటులో ఉంచబడతాయి. ఈ పరిక్షలలో సాధించిన క్రెడిట్స్ నేరుగా మీ అకాడమిక్ రికార్డులకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది.
కోర్సుల మధ్యకాలంలో వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. టాప్ స్కోర్ సాధించిన విద్యార్థులకు ఐఐటీలలో ఇంటెర్షిప్ చేసే అవకాశం కల్పిస్తుంది. కావాలనుకునే వారికి గేట్ స్టడీ మెటీరియల్ అందిస్తుంది. అలానే ఎన్‌పీటీఎల్ కోర్సులలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు వివిధ కేటగిరిల వారీగా గుర్తిపు స్టార్స్ అందిస్తుంది.