Advertisement
తెలుగులో కరెంట్ అఫైర్స్ 1 మే 2023 | పోటీ పరీక్షల స్పెషల్
Telugu Current Affairs

తెలుగులో కరెంట్ అఫైర్స్ 1 మే 2023 | పోటీ పరీక్షల స్పెషల్

తెలుగులో కరెంట్ అఫైర్స్ 01 మే 2023 ఉచితంగా పొందండి. యూపీఎస్‌సీ, ఎస్ఎస్‌సీ, ఏపీపీఎస్‌సీ, టీఎస్‌పీఎస్‌సీ, రైల్వే, బ్యాంకింగ్, డిఫెన్స్, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ వంటి వివిధ నియామక పరీక్షలకు సిద్దమౌతున్న ఔత్సాహికుల కోసం ప్రత్యేకంగా పోటీ పరీక్షల దృక్కోణంలో అందిస్తున్నాం.

బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత్ చారిత్రాత్మక విజయం

ఏప్రిల్ 30న దుబాయ్‌లో జరిగిన బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్ 2023 లో పురుషుల డబుల్స్ కిరీటాన్ని గెలుచుకోవడం ద్వారా చిరాగ్ శెట్టి , సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి జోడీ చరిత్ర సృష్టించింది. పురుషుల డబుల్స్‌లో ఆరో సీడ్‌గా ఉన్న భారత జోడీ ఫైనల్‌లో మలేషియాకు చెందిన ఓంగ్ యూ సిన్, టియో ఈ యిపై 16-21, 21-17, 21-19 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ గంటా ఏడు నిమిషాల పాటు సాగింది.

ఈ విజయం తర్వాత 1965లో దినేష్ ఖన్నా ఆసియా మీట్‌లో గెలుచుకున్న బంగారు పతకం తర్వాత కాంటినెంటల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లో గెలిచిన మొదటి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారులుగా నిలిచారు. అంతే కాకుండా చిరాగ్ శెట్టి మరియు సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి జోడి ఆసియా మీట్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయ పురుషుల డబుల్స్ జోడీగా నిలిచారు. 58 ఏళ్ల క్రితం దీపు ఘోష్ మరియు రామన్ ఘోష్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

ఇకపోతే బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్‌లు 2023 సింగిల్స్ ఫైనల్లో ఆంథోనీ గింటింగ్, లోహ్ కీన్ యూను ఓడించి స్వర్ణం సాధించాడు. లోహ్ కీన్ యూ పరాజయం పాలైనప్పటికీ, సింగపూర్ నుండి బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడిన తొలి సింగపూర్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. పురుషులకు ముందు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ మాజీ ప్రపంచ నంబర్ 1 చైనీస్ తైపీకి చెందిన తాయ్ ట్జు-యింగ్‌ విజేతగా నిలిచింది.

రతన్ టాటాకు ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం

ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా (AO) లభించింది. ఇండియా-ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషికి గాను ఈ అవార్డుతో సత్కరించారు. ఇది వరకు 2020లో, బయోకాన్ వ్యవస్థాపకరాలు కిరణ్ మజుందార్-షా కూడా ఈ గౌరవంతో సత్కరించబడ్డారు.

ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అనేది అత్యుత్తమ విజయాలు లేదా సేవలు అందించిన ఆస్ట్రేలియన్ పౌరులు మరియు ఇతర దేశాల వ్యక్తులకు అందించబడుతుంది. ఇది ఆస్ట్రేలియా ప్రభుత్వ సలహా మేరకు ఆస్ట్రేలియా రాణి ఎలిజబెత్ II చేత 14 ఫిబ్రవరి 1975న స్థాపించబడింది. ఈ అవార్డు ఏడాదికి దాదాపు 140 మంది పౌరులకు అందజేస్తారు. ఇకపోతే రతన్ టాటాను భారత ప్రభుత్వం 2000 ఏడాదిలో పద్మ భూషణ్ అవార్డుతో, 2008లో  పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది.

గోవా హెరిటేజ్ ఫెస్టివల్ 2023

గోవా హెరిటేజ్ ఫెస్టివల్ 2023ని ఏప్రిల్ 28 నుండి 30 మధ్య సాలిగావో అనే గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఆ రాష్ట్రంలోని సంప్రదాయాలు, సంస్కృతి మరియు కళలను ప్రదర్శించడం ద్వారా సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం గోవా ప్రభుత్వ పర్యాటక శాఖ ఈ వేడుకను ఏటా నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాన్ని ఏప్రిల్ 28న ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రారంభించారు.

అన్నపూర్ణ 1 పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారతీయ వ్యక్తిగా అర్జున్ వాజ్‌పేయ్

భారతీయ ప్రొఫెషనల్ పర్వతారోహకుడు అర్జున్ వాజ్‌పేయ్, సముద్ర మట్టానికి 8,091 మీటర్లు ఎత్తులో ఉన్న ప్రపంచంలోని 10వ ఎత్తైన పర్వతం అయిన అన్నపూర్ణ 1 పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారతీయ వ్యక్తిగా అవతరించాడు. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా 8000 మీటర్ల పైన ఉన్న మొత్తం 7 పర్వతాలను అధిరోహించిన మొదటి భారతీయ వ్యక్తిగా కూడా నిలిచాడు.

ఈ ఏడాది మొదటిలో ఫిట్ ఇండియా ఛాంపియన్‌గా బిరుదు పొందిన అర్జున్, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కులలో ఒకరిగా రికార్డు కలిగివున్నారు. అలానే ప్రపంచ వ్యాప్తంగా 8000 మీటర్ల పైన ఉన్న మొత్తం 14 పర్వతాలను (14 సమ్మిట్ మౌంటయిన్స్) అధిరోహించే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ 14 శిఖరాలు హిమాలయాలు లేదా ఆసియాలోని కారకోరం శ్రేణులలోనే ఉన్నాయి. వీటిని ఇప్పటి వరకు కేవలం 39 మంది పర్వత అధిరోహకులు మాత్రమే చేరుకున్నారు.

8000 మీటర్ల పైన ఉన్న ప్రపంచంలోని 14 ఎత్తైన పర్వత శిఖరాలు

పర్వతం ఎత్తు (మీటర్లలలో) దేశం/ప్రాంతం
ఎవరెస్ట్ 8,849 మీటర్లు నేపాల్ & చైనా
K2 పర్వతం 8,611 మీటర్లు పాకిస్తాన్ & చైనా
కాంచన్‌జంగా 8,586 మీటర్లు నేపాల్ & ఇండియా
లోట్సే శిఖరం 8,516 మీటర్లు నేపాల్ & చైనా
మకాలు శిఖరం 8,481 మీటర్లు నేపాల్ & చైనా
చో ఓయు శిఖరం 8,188 మీటర్లు నేపాల్ & చైనా
ధౌలగిరి I శిఖరం 8,167 మీటర్లు నేపాల్
మనస్లు శిఖరం 8,163 మీటర్లు నేపాల్
నంగా పర్బత్ 8,125 మీటర్లు పాకిస్తాన్
అన్నపూర్ణ I 8,091 మీటర్లు నేపాల్
గషెర్‌బ్రమ్ I (K5 / హిడెన్ పీక్) 8,080 మీటర్లు పాకిస్తాన్ & చైనా
బ్రాడ్ పీక్ 8,034 మీటర్లు పాకిస్తాన్ & చైనా
గాషెర్‌బ్రమ్ II (K4) 8,034 మీటర్లు పాకిస్తాన్ & చైనా
శిషాపంగ్మా (గోసైంతన్) 8,027 మీటర్లు చైనా

'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్‌లో కలెక్టివ్ స్పిరిట్, కాంక్రీట్ యాక్షన్ పుస్తకం విడుదల

ప్రసార భారతి మాజీ సీఈఓ శశి శేఖర్ చేత రచించబడిన 'కలెక్టివ్ స్పిరిట్, కాంక్రీట్ యాక్షన్' అనే పుస్తకాన్ని, ఏప్రిల్ 26న ప్రధాని 'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్‌లో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ చేతుల మీదగా విడుదల చేసారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమం యొక్క డాక్యుమెంట్ రూపం. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ రేడియో ప్రోగ్రామ్‌లలో ప్రధాని చేసిన ఉపన్యాసాలకు శశి శేఖర్ సాహిత్య రూపం అందించారు.

1.4 బిలియన్ల జనాభా ఉన్న భారతదేశం యొక్క వైవిధ్యం, ఆకాంక్షలు, ఆశలు, సవాళ్లు, భావోద్వేగాలు ఆర్థికం, పర్యావరణం, సంస్కృతి, ఆరోగ్యం వంటి వివిధ అంశాలపై ప్రధాని మోదీ స్పృశించిన విభిన్న అంశాలతో ఈ పుస్తకం రూపొందించబడింది. ఈ పుస్తకం మన్ కీ బాత్‌ కార్యక్రమంపై పౌరులకు అవగాహన కల్పించడానికి, ప్రేరేపించడానికి, ప్రోత్సహించడానికి మరియు దిశానిర్దేశం చేయడానికి రూపుదిద్దారు.

స్పైస్‌జెట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా అరుణ్ కశ్యప్‌

ప్రముఖ భారతీయ విమానయాన సంస్థ అయినా స్పైస్‌జెట్ యొక్క నూతన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా అరుణ్ కశ్యప్‌ నియమితులయ్యారు. అరుణ్ కశ్యప్ ఈ ఏడాది జూన్ 12 నుండి ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. అరుణ్ కశ్యప్ గతంలో స్పైస్‌జెట్‌లో చీఫ్ ప్రోగ్రామ్ & ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఈయన ఎయిర్ ఇండియాలో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా ఉన్నారు.

స్పైస్‌జెట్ ప్రయాణీకుల సంఖ్య ఆధారంగా భారతదేశంలో రెండవ అతిపెద్ద విమానయాన సంస్థ. ఇది భారతీయ బడ్జెట్ విమానయాన సంస్థగా ప్రసిద్ధి. ఇది 1994లో ఎయిర్ టాక్సీ ప్రొవైడర్ మోడీలఫ్ట్‌గా స్థాపించబడింది. ఈ కంపెనీని 2004లో భారతీయ పారిశ్రామికవేత్త అజయ్ సింగ్ కొనుగోలు చేసి స్పైస్‌జెట్‌గా పేరు మార్చారు. దీని ప్రధాన కార్యాలయం హర్యానాలోని గుర్గావ్‌లో ఉంది.

  • చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ - అజయ్ సింగ్ చౌహాన్
  • చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ - సంజీవ్ తనేజా
  • చీఫ్ బిజినెస్ ఆఫీసర్ - డెబోజో మహర్షి

ఎయిర్ ఇండియా చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా సిసిర కాంత డాష్

ఎయిర్ ఇండియా చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా సిసిర కాంత డాష్ నూతనంగా నియమితులయ్యారు. ప్రస్తుతం విస్తారాలో ఇంజనీరింగ్ హెడ్‌గా ఉన్న ఈయన కూడా ఈ ఏడాది జూన్ నెలలో ఈ బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం ఈ హోదాలో ఉన్న అరుణ్ కశ్యప్‌, స్పైస్‌జెట్ యొక్క నూతన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియమితులవ్వడంతో ఈ నియామకం చోటుచేసుకుంది.

ఎయిర్ ఇండియాను 1932లో టాటా ఎయిర్‌లైన్స్‌గా ప్రారంభించబడింది. దీనిని జహంగీర్ రతన్‌జీ దాదాభోయ్ టాటా స్థాపించారు. దీనిని 2006 లో ప్రభుత్వరంగ విమానయాన సంస్థ అయినా ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో విలీనం చేయబడింది. తిరిగి 2022లో ప్రభుత్వం తన వాటాను టాటా సంస్థకు అమ్మేయడంతో తిరిగి టాటా సన్స్ యొక్క యాజమాన్య అనుబంధ సంస్థగా మారిపోయింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దీని ప్రస్తుత చైర్మెన్‌గా ఎన్. చంద్రశేఖరన్, సీఈఓగా కాంప్‌బెల్ విల్సన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఆసియాలోనే తొలి మోక్సీ లేజర్‌ ప్రారంభం

ప్రఖ్యాత ప్లాస్టిక్ సర్జన్ మోనిషా కపూర్, ఆసియాలోనే మొట్టమొదటి మోక్సీ లేజర్‌ను న్యూ ఢిల్లీలోని తన క్లినిక్‌లో ప్రారంభించారు. మోక్సీ లేజర్‌ అనేది వృద్ధాప్యం యొక్క మార్పులను చికిత్స చేయడానికి మరియు ప్రకాశవంతమైన చర్మాన్ని ఉత్పత్తి చేయడానికి రూపొందించబడిన సున్నితమైన భిన్నమైన లేజర్ ఉత్పత్తి. ఈ సాంకేతికత మానవ శరీరంలోని కొత్త కణాల పెరుగుదలను ప్రోత్సహించడంతో పాటుగా అవాంఛిత వర్ణద్రవ్యాల ప్రభావాన్ని తగ్గిస్తుంది.

క్రొయేషియాలో 2వ వరల్డ్ స్పోర్ట్స్ టూరిజం కాంగ్రెస్

ప్రపంచ స్పోర్ట్స్ టూరిజం యొక్క 2వ ఎడిషన్, ఏప్రిల్ 26-27 తేదీల్లో క్రొయేషియాలోని జదార్ నగరంలో నిర్వహించబడింది. ఈ కాంగ్రెస్ స్పోర్ట్స్ టూరిజం రంగంలోని నిపుణులకు కొత్త ఆలోచనలు పంచుకోవడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఐక్యరాజ్యసమితి యొక్క వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ మరియు రిపబ్లిక్ ఆఫ్ క్రొయేషియా ప్రభుత్వం, దాని పర్యాటక మరియు క్రీడా మంత్రిత్వ శాఖలు హోస్ట్ చేశాయి.

ఈ కార్యక్రమాన్ని టూరిజం & స్పోర్ట్స్ యునైటెడ్ ఫర్ సస్టైనబిలిటీ అనే థీమ్‌తో నిర్వహించారు. స్పోర్ట్స్ టూరిజంపై ఆర్థిక, పర్యావరణ, సామాజిక ప్రభావం మరియు సహకారంపై చర్చలు నిర్వహించారు. అలాగే స్పోర్ట్స్ ఈవెంట్‌లు, స్పాన్సర్‌షిప్‌లు మరియు బిడ్డింగ్ నిర్వహనా విధానాలపై చర్చించారు.

68వ హ్యుందాయ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2023

టైమ్స్ గ్రూప్ నిర్వహించే వార్షిక ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుక ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఏప్రిల్ 27న హట్టహాసంగా జరిగింది. ఈ అవార్డులు ఏటా విడుదలయ్యే ఉత్తమ భారతీయ హిందీ భాషా చిత్రాలకు ఇవ్వబడతాయి. ఈ అవార్డుల వేడుకకు హ్యుందాయ్‌ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఈ ఈవెంట్ హోస్టులుగా సల్మాన్ ఖాన్, ఆయుష్మాన్ ఖురానా మరియు మనీష్ పాల్‌లు వ్యవరించారు. ఇది 68 వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుక.

ఈ ఏడాది అలియా భట్ టైటిల్ రోల్ పోషించిన గంగూబాయి కతియావాడి చిత్రం అత్యధికంగా 16 విభాగాల్లో పోటీపడి, ఉత్తమ చిత్రంతో సహా 10 అవార్డులతో అత్యధిక అవార్డులను గెలుచుకున్న చిత్రంగా నిలిచింది. బధాయి దో ఉత్తమ చిత్రం క్రిటిక్స్ అవార్డు అందుకోగా బ్రహ్మాస్త్ర: మొదటి భాగం - శివ ఐదు అవార్డులను గెలుచుకుంది.

  • ఉత్తమ చిత్రం - గంగూబాయి కతియావాడి
  • ఉత్తమ దర్శకుడు - సంజయ్ లీలా భన్సాలీ
  • ఉత్తమ నటుడు - రాజ్‌కుమార్ రావ్ (బదాయి దో)
  • ఉత్తమ నటి - అలియా భట్

జార్ఖండ్‌లో తొలి ఎయిర్ అంబులెన్స్‌ను ప్రారంభించిన హేమంత్ సోరెన్

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, రాంచీ నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు రాష్ట్రం యొక్క మొట్టమొదటి ఎయిర్ అంబులెన్స్ సర్వీస్‌ను ఏప్రిల్ 28న ప్రారంభించారు. తీవ్రమైన అనారోగ్యం లేదా గాయపడిన రోగులకు సమగ్ర వైద్య రవాణా సౌకర్యం కల్పించేందుకు దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది.

అయితే దేశంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ అంబులెన్స్ సర్వీస్‌ను ప్రారంభించిన మొదటి రాష్టంగా కర్ణాటక ఉంది. 08 సెప్టెంబర్ 2020లో అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప దానిని బెంగుళూరులో ప్రారంభించారు.

గ్రీన్ క్లైమేట్ ఫండ్‌కి €18 బిలియన్ల సహకారం అందించిన ఈయూ

ప్రపంచ వాతావరణ ఆర్థిక అంతరాన్ని తగ్గించడంతో పాటుగా వాతావరణ మార్పుల ఉపశమనానికి మద్దతు ఇచ్చేందుకు యూరోపియన్ కమిషన్ మరియు యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (EIB) ఉమ్మడిగా గ్లోబల్ గేట్‌వే కింద €18 బిలియన్ల ఫైనాన్సింగ్‌ సహకారాన్ని అందించాయి. ఇది ఇది వాతావరణ మార్పుల నివారణ కోసం యూరోపియన్ భాగస్వామ్య దేశాల కోసం యూరప్ యొక్క పెట్టుబడి వ్యూహంగా ఉండనుంది.

న్యూయార్క్‌లో జరిగిన గ్లోబల్ సిటిజన్ నౌ సమ్మిట్ వేదికగా యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ వాన్ డెర్ లేయన్ మాట్లాడుతూ, యూరోప్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ ఫైనాన్స్ మరియు అధికారిక అభివృద్ధి సహాయాన్ని అందించడంలో అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించారు. దీనిలో అన్ని అగ్రదేశాలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

యూరోపియన్ యూనియన్ 2050 నాటికి వాతావరణ తటస్థతను చేరుకోవడం కోసం చట్టపరమైన లక్ష్యం నిర్దేశించుకుంది. 2030 నాటికి గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను కనీసం 55% తగ్గించాలనే చట్టపరమైన ప్రతిపాదనను ఈయూ అమలులోకి తీసుకొచ్చింది.

గ్లోబల్ గేట్‌వే ఇనిషియేటివ్ అనేది మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టడానికి మరియు ఆర్థిక భాగస్వామ్యాలను స్థాపించడానికి యూరోపియన్ యూనియన్ స్థాపించిన ఒక పెట్టుబడి వ్యూహం. ప్రకృతి వైపరీత్యాల నివారణ, అలాగే స్వచ్ఛమైన ఇంధనం మరియు రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చుతుంది. ఈ ప్రాజెక్ట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ నేతృత్వంలో ఈయూ కమిషన్ ద్వారా 2021లో ప్రారంభించబడింది.

రోబోటిక్ చెక్-ఇన్ అసిస్టెంట్‌ను ఆవిష్కరించిన మొదటి విమానయాన సంస్థగా ఎమిరేట్స్

దుబాయ్ ఆధారిత ఎయిర్‌లైన్ ఎమిరేట్స్, ప్రపంచంలోనే మొట్టమొదటి రోబోటిక్ చెక్-ఇన్ అసిస్టెంట్ ఆవిష్కరించిన విమానయాన సంస్థగా నిలిచింది. సారా పేరుతో ప్రారంభించబడిన ఈ రోబోటిక్ చెక్-ఇన్ అసిస్టెంట్‌, స్కాన్ చేసిన పాస్‌పోర్ట్‌లతో కస్టమర్ల ముఖాలను సరిపోల్చుతుంది. అదే సమయంలో ప్రయాణీకులను తనిఖీ చేసి, లగేజ్ డ్రాప్ ప్రాంతానికి వారిని గైడ్ చేస్తుంది. ఇది బోర్డింగ్ పాస్‌లను జారీచేసే సాంకేతికతను కూడా కలిగి ఉంది.

కొలొంబోలో భారతీయ సినిమాపై వర్క్‌షాప్‌

కొలంబోలోని స్వామి వివేకానంద కల్చరల్ సెంటర్‌లో ఇండియన్ సినిమాపై ఏప్రిల్ 28న వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీలంక పట్టణాభివృద్ధి మరియు గృహనిర్మాణ శాఖ మంత్రి అరుండికా ఫెర్నాండో, శ్రీలంకలోని భారత డిప్యూటీ హైకమిషనర్ వినోద్ జాకబ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కన్నడ చిత్రసీమకు చెందిన ప్రముఖ దర్శకుడు డా. నాగతిహళ్లి చంద్రశేఖర్‌ లీడ్ చేశారు.

భారతదేశం మరియు శ్రీలంకలు 75 సంవత్సరాల దౌత్య సంబంధాలను జరుపుకుంటున్న తరుణంలో ఈ వర్క్‌షాప్ సమయానుకూలంగా జరిగిందని ప్రారంభోత్సవ సందర్భంగా డిప్యూటీ హైకమిషనర్ పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

జమ్మూ కాశ్మీర్‌లో సింథాన్ స్నో ఫెస్టివల్-2023

ఏప్రిల్ 29, 30 తేదీల్లో కిష్త్వార్‌లోని సింథాన్ మైదాన్‌లో రెండు రోజుల సింథాన్ స్నో ఫెస్టివల్-2023 నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని డైరెక్టరేట్ ఆఫ్ టూరిజం, జమ్ము అండ్ కిష్త్వార్ టూరిజం డెవలప్‌మెంట్ అథారిటీ (KTDA) నిర్వహించింది. జమ్మూ & కాశ్మీర్ అకాడమీ ఆఫ్ ఆర్ట్, కల్చర్, అండ్ లాంగ్వేజెస్ (JKAACL) మరియు ఆర్మీ సహకారంతో ఈ స్నో ఫెస్టివల్ విజయవంతమయ్యింది.

2 రోజుల సింథాన్ స్నో ఫెస్టివల్-2023 యందు బైక్ ర్యాలీ, పారాగ్లైడింగ్, స్కీయింగ్, స్లెడ్జింగ్, స్నో కయాకింగ్, స్నో స్కూటర్ వంటి స్నో యాక్టివిటీలు నిర్వహించారు. అలానే స్థానిక సాంస్కృతిక కళలను ప్రదర్శించారు. ఇంకా, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి పత్రమోర్ నుండి సింథన్ మైదాన్ వరకు ట్రెక్కింగ్ యాత్ర, గుర్రపు స్వారీ, ట్రెజర్ హంట్ గేమ్, వాలీబాల్, మారథాన్ మరియు టగ్ ఆఫ్ వార్ వంటి ఇతర ఆటలు కూడా ఏర్పాటు చేశారు.

సింథాన్ అనేది జమ్మూ డివిజన్‌లోని కిష్త్వార్ జిల్లాను కాశ్మీర్ డివిజన్‌లోని అనంత్‌నాగ్ జిల్లాతో కలుపుతూ సముద్ర మట్టానికి 12, 414 అడుగుల ఎత్తులో ఉన్న ఎత్తైన మోటారు పర్వత మార్గం. ఇది అనంత్‌నాగ్ జిల్లాలో బ్రెంగ్ వ్యాలీ మరియు కిష్త్వార్ జిల్లాలో చీనాబ్ వ్యాలీ మధ్య ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఈ కార్యక్రమంను ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్శించేందుకు నిర్వహిస్తారు.

12 భాగాల కామిక్ బుక్ సిరీస్‌ను విడుదల చేసిన సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం యొక్క థీమ్‌లు మరియు వ్యక్తుల ఆధారంగా 12 కామిక్ బుక్ సిరీస్‌లను విడుదల చేసేందుకు భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రత్యేక ప్రాజెక్ట్‌ను అమర్ చిత్ర కథ ద్వారా అమలు చేయనున్నారు. మొదటి సిరీస్‌ను ఆంగ్లంలో అందుబాటులోకి తీసుకొచ్చి, ఆ తర్వాత వీటిని 12 భారతీయ భాషలలో అనువాదం చేయనున్నారు.

ఏప్రిల్ 30న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 100వ ఎపిసోడ్‌ను పురస్కరించుకుని మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కామిక్ బుక్ సిరీస్‌తో పాటు, ఏప్రిల్ 29 నుండి ఢిల్లీలోని ఎర్రకోట మరియు పీఎం మ్యూజియంతో సహా 13 ఐకానిక్ స్మారక చిహ్నాల వద్ద ప్రొజెక్షన్ మ్యాపింగ్ ప్రదర్శనలను కూడా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాలను ప్రజలను ప్రేరేపించడానికి, దేశ నిర్మాణంలో వారిని భాగస్వామ్యం చేసేందుకు అలానే ప్రధాన మంత్రి యొక్క సందేశాన్ని మరియు సూచనలను వారికీ చేరవేసేందుకు నిర్వహిస్తున్నారు.

ఢిల్లీలో మిల్లెట్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ ప్రారంభం

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఏప్రిల్ 28న న్యూఢిల్లీలోని డిల్లీ హాట్‌లో మొట్టమొదటి 'మిల్లెట్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ (MEC)'ని ప్రారంభించారు. దీనిని నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED) మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ సహకారంతో ఏర్పాటు చేసారు. దీనిని మిల్లెట్స్‌పై అవగాహన పెంచడంతో పాటుగా సాధారణ ప్రజలలో వీటి వాడకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో అందుబాటులోకి తీసుకొచ్చారు.

భారత ప్రభుత్వ ప్రతిపాదనతో ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించినందున, ఈ ఏడాది పొడుగునా వీటికి  సంబందించిన వివిధ ప్రచార కార్యక్రమాలను భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం థీమ్ : "Harnessing the untapped potential of millets for food security, nutrition, and sustainable agriculture”

ఇండియా-యుకె నెట్ జీరో ఇన్నోవేషన్ వర్చువల్‌ సెంటర్ ప్రారంభం

భారతదేశం మరియు యుకె సంయుక్తంగా ఇండియా-యుకె 'నెట్ జీరో' ఇన్నోవేషన్ వర్చువల్ సెంటర్‌ను ఏర్పాటుకు ముందుకొచ్చాయి. యూకే మంత్రి జార్జ్ ఫ్రీమాన్, భారత సైన్స్ & టెక్నాలజీ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహించిన ఇండియా - యూకే సైన్స్ & ఇన్నోవేషన్ కౌన్సిల్ మీటింగులో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్బంగా భారతదేశం మరియు యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య సైన్స్ & టెక్నాలజీ సహకారం పెంపొందించుకోవాలని ఇద్దరు నేతలు పిలుపునిచ్చారు. ఆరోగ్యం, వాతావరణం, వాణిజ్యం, విద్య, సైన్స్ & టెక్నాలజీ మరియు రక్షణ రంగాల్లో పరస్పర సహకారం కోసం రూపొందించుకున్న యూకే-భారత్ ప్రతిష్టాత్మక 'రోడ్‌మ్యాప్ 2030' ద్వారా రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారం మరింత పెంపొందనుందని వెల్లడించారు.

భారతదేశం-యుకె "నెట్ జీరో" ఇన్నోవేషన్ వర్చువల్ సెంటర్‌ను ఉత్పాదక & రవాణా వ్యవస్థల డీకార్బనైజేషన్, గ్రీన్ హైడ్రోజన్‌తో సహా కొన్ని ఫోకస్ ఏరియాలలో ఇరు దేశాల వాటాదారులను ఒకచోట భాగస్వామ్యం చేయడానికి ఒక వేదికగా అందుబాటులోకి తీసుకొచ్చారు. 2050 నాటికీ భారతదేశ నికర కర్బన శూన్య ప్రయాణ గమ్యాన్ని చేరుకోవడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. భారతదేశం ఇప్పటికే ఇండియా సోలార్ అలయన్స్, క్లీన్ ఎనర్జీ మిషన్ వంటి మొదలైన కార్యక్రమాలను అమలుచేస్తుంది.

నానో క్లేతో లిక్విడ్ మార్బుల్స్‌ను అభివృద్ధి చేసిన ఐఐటీ గౌహతి పరిశోధకులు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి పరిశోధకులు నానో క్లేని ఉపయోగించి లిక్విడ్ మార్బుల్స్‌ను అభివృద్ధి చేశారు. ఇవి డ్రగ్ డెలివరీ మరియు క్యాస్కేడ్ కెమికల్ రియాక్షన్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించినవి. వీటిని ముందుగా అవసరానికి అనుగుణంగా ప్రోగ్రామ్ చేయవచ్చు. ఇవి శరీర ద్రవాలలో ప్రయాణించి అవసరమైన సమయంలో, అవసరమైన ప్రాంతంలో కంటెంటును విడుదల చేస్తాయి.

సాధారణంగా ఏదైనా వ్యాధి చికిత్స కోసం, రోగులకు మాత్రలు, క్యాప్సూల్స్, సిరప్‌లు, ఆయింట్‌మెంట్‌ల రూపంలో ఔషధాలను అందిస్తారు. అయితే నియంత్రిత డ్రగ్ డెలివరీ సిస్టమ్ అనేది నిర్దిష్ట సైట్‌లో కావలసిన మోతాదును, కావలసిన సమయంలో క్రమంగా అందించడానికి రూపొందించబడిన అధునాతన సాంకేతికత. ఈ సాంకేతికతలో ఔషధాన్ని దాని కరిగే రూపంలో లోడ్ చేయడం ద్వారా అవసరమైన సమయంలో, అవసరమైన ప్రాంతంలో వాటిని విడుదల చేస్తారు. ప్రస్తుతం రూపొందించిన ఈ లిక్విడ్ మార్బుల్స్‌ ఈ కోవకి చెందినవే.

ఈ ద్రవ గోళీలు నానో క్లే మార్బుల్స్ ద్రవాన్ని కలిగి ఉన్న నానోక్లే యొక్క షెల్‌తో తయారు చేయబడ్డాయి. ఈ గోళీల యందు ఉన్న కంటెంట్ సమయానుకూలంగా విడుదల చేయడానికి ప్రీ ప్రోగ్రాం చేయబడ్డాయి. దీని కోసం పరిశోధకులు నానోక్లేని రసాయన సమూహాలతో సవరించారు. ఇవి నాన్-స్టిక్కింగ్, నాన్-వెట్టింగ్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ పరిశోదన అడ్వాన్సుడ్ ఫంక్షనల్ మెటీరియల్స్ జర్నల్ యందు పబ్లిష్ అయ్యింది.

157 కొత్త నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

కేంద్ర ప్రభుత్వం 157 కొత్త ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దేశంలో నర్సింగ్ వర్క్‌ఫోర్స్‌ను బలోపేతం చేసే దిశగా 2014 నుండి స్థాపించబడిన ప్రస్తుత వైద్య కళాశాలలకు అనుబంధంగా ఈ 157 కొత్త నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేయనుంది. వీటి నిర్మాణం కోసం దాదాపు 1570 కోట్ల బడ్జెట్ అందుబాటులో ఉంచింది.

ఏప్రిల్ 26న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటుకు 10 కోట్ల రూపాయాలు కేటాయించనున్నారు. వచ్చే 24 నెలల్లో ఈ నర్సింగ్ కాలేజీలను ఏర్పాటును పూర్తిచేయనున్నారు. వీటిలో మెజారిటీ కాలేజీలు ఉత్తరప్రదేశ్ (27), రాజస్థాన్ (23), మధ్యప్రదేశ్ (14) ఉన్నాయి.

ఇక దక్షిణ భారతదేశంకు మొత్తం 17 కొత్త నర్సింగ్ కాలేజీలు కేటాయించగా వీటిలో 11 నర్సింగ్ కాలేజీలను తమిళనాడులో ఏర్పాటు చేయనున్నారు. మిగతా 6 నర్సింగ్ కాలేజీల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెరో 3 కాలేజీలు కేటాయించారు. కేరళ మరియు తెలంగాణ రాష్ట్రాలకు మొండి చేయి చూపించారు.

ఇఫ్కో నానో డీఏపీని ప్రారంభించిన హోంమంత్రి అమిత్ షా

ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ (ఇఫ్కో) యొక్క నానో డిఎపి (లిక్విడ్)ను హోం మంత్రి అమిత్ షా ఏప్రిల్ 26న న్యూఢిల్లీలో ప్రారంభించారు. భారతదేశం యొక్క ఎరువుల దిగుమతి బెడదను తగ్గించేందుకు 2021 ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ నానో యూరియా ఉత్పత్తికి ఆమోదం తెలిపారు. ఈ రెండేళ్లలో దేశంలో దాదాపు 17 కోట్ల నానో యూరియా బాటిళ్లను తయారు చేయగలిగే మౌలిక సదుపాయాలు కల్పించినట్లు అమిత్ షా వెల్లడించారు. ఈ ఉత్పత్తిలో ఇఫ్కో వంటి సహకార సంఘాలు కీలక భూమిక పోషించినట్లు వెల్లడించారు. దీనిని “మాస్ ప్రొడక్షన్ బై మాస్” అని అభివర్ణించారు.

గ్రాన్యులర్ యూరియా, డీఏపీకి బదులు మరింత ప్రభావవంతమైన ద్రవ నానో యూరియా, డీఏపీని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నుండి అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రాన్యులర్ యూరియా వాడకం వల్ల భూమితో పాటు పంట, ప్రజల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటుగా పంట పెట్టుబడి పెరుగుతుంది. వీటికి ప్రత్యామ్నాయంగా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. 500 మిల్లీలీటర్ల నానో డిఎపి బాటిల్ 45 కిలోల కణిక యూరియాకు  సమానమైన ఫలితాలను అందిస్తుంది.

ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ అనేది బహుళ-రాష్ట్ర సహకార సంఘం. ఇది పూర్తిగా కోఆపరేటివ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా యాజమాన్యంలో ఉంది. ఈ సొసైటీ ఎరువుల తయారీ మరియు మార్కెటింగ్ వ్యాపారంలో నిమగ్నమై ఉంది. దీనిని 1993లో ఏర్పాటు చేసారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.

లడఖ్‌లో యూత్ -20 ప్రీ-సమ్మిట్

భారత జీ20 ప్రెసిడెన్సీలో యూత్-20 ప్రీ-సమ్మిట్ కార్యక్రమాన్ని లడఖ్‌లోని లేహ్‌లో ఏప్రిల్ 26న నిర్వహించారు. సమావేశానికి యూత్ అండ్ స్పోర్ట్స్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ అధ్యక్షత వహిచింది. దాదాపు 30 దేశాల నుంచి 100 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. మూడు రోజుల నిడివితో జరిపిన ఈ సదస్సులో కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ (రిటైర్డ్) బిడి మిశ్రా ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

యూత్ 20 అనేది జీ20 సభ్య దేశాల చెందిన యువత ఒకరితో ఒకరు సంభాషించుకోవడానికి అవకాశం కల్పించే అధికారిక సంప్రదింపుల ఫోరమ్. ఇది యువతను భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దడానికి ప్రపంచ సమస్యలపై అవగాహన పెంచుకోవడానికి, ఆలోచనలను మార్పిడి చేసుకోవడానికి, చర్చలు జరపడానికి మరియు ఏకాభిప్రాయాన్ని చేరుకోవడానికి ప్రోత్సహిస్తుంది.

నేషనల్ మెడికల్ డివైజెస్ పాలసీ 2023కి క్యాబినెట్‌ ఆమోదం

నేషనల్ మెడికల్ డివైజెస్ పాలసీ 2023కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశం ఆమోదం తెలిపింది. ఈ పాలసీ వైద్య రంగానికి సంబందించిన వెంటిలేటర్లు, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్‌లు, రియల్-రైమ్ రివర్స్ ట్రాన్స్‌క్రిప్షన్ వంటి వైద్య పరికరాలు & డయాగ్నస్టిక్ కిట్‌లు వంటి మొదలగు వైద్య పరికరాలను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడంకు సంబంధించింది.

నేషనల్ మెడికల్ డివైజెస్ పాలసీ 2023 యొక్క ముఖ్య లక్షణాలు

  • వైద్య పరికరాల తయారీ మరియు ఆవిష్కరణలలో భారత్ గ్లోబల్ లీడర్‌గా మార్చేందుకు ఇది రూపొందించబడింది.
  • వైద్య పరికరాల రంగం వేగవంతమైన వృద్ధి కోసం పేషెంట్ సెంటర్డ్ & క్వాలిటీ కేర్, ప్రివెంటివ్ & ప్రమోటివ్ హెల్త్, సెక్యూరిటీ, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ మరియు స్కిల్డ్ మ్యాన్‌పవర్ వంటి కింది మిషన్‌లను సాధించడానికి ఈ పాలసీ రోడ్‌మ్యాప్‌ను నిర్దేశిస్తుంది.
  • వైద్య పరికరాల రంగాన్ని ప్రోత్సహించడానికి, ఈ రంగంలో విధాన జోక్యాలను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది.
  • 2021 నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రోగ్రాం మరియు ప్రతిపాదిత నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ కింద ఈ రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచనుంది. ఇందులో భాగంగా పూర్తి లాజిస్టిక్ కనెక్టివిటీతో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కూడిన పెద్ద వైద్య పరికరాల పార్కులు, క్లస్టర్లు  ఏర్పాటు చేయనున్నారు.
  • వైద్య రంగంలో పరిశోధన & అభివృద్ధిని ప్రోత్సహించడం కోసం ఫార్మా-మెడ్‌టెక్ సెక్టార్‌ యొక్క అకడమిక్ మరియు రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్‌లలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్ హబ్‌లు, 'ప్లగ్ అండ్ ప్లే' ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లు మరియు స్టార్ట్-అప్‌లకు సపోర్ట్ అందించనున్నారు.
  • ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు మేక్ ఇన్ ఇండియా, ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్, హీల్-ఇన్-ఇండియా, స్టార్ట్-అప్ మిషన్ వంటి రీసెంట్ స్కీమ్లతో పాటుగా, ఈ పాలసీ ప్రైవేట్ పెట్టుబడులను, వెంచర్ క్యాపిటలిస్ట్‌ల నుండి నిధుల పరంపరను ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వ-ప్రైవేట్. భాగస్వామ్యం (PPP) కు అవకాశం కల్పిస్తుంది.
  • ఈ రంగానికి అవసరమైన శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు, వైద్య నిర్వాహకులు, సాంకేతిక నిపుణులు వంటి మొదలైన వర్క్ ఫోర్స్‌ను అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉంచనుంది.

ఈ నూతన పాలసీ రాబోయే 25 సంవత్సరాలలో విస్తరిస్తున్న గ్లోబల్ మార్కెట్‌లో 10-12% వాటాను భారత్ సాధించడం ద్వారా వైద్య పరికరాల తయారీ మరియు ఆవిష్కరణలలో గ్లోబల్ లీడర్‌గా మార్చనుంది. 2030 నాటికి వైద్య పరికరాల రంగం ప్రస్తుత $11 బిలియన్ల నుండి $50 బిలియన్ల మార్కెట్టుకు పెరగడానికి ఈ పాలసీ సహాయపడుతుందని భావిస్తున్నారు.

ప్రపంచ టాప్ 100 యునికార్న్‌ల జాబితాలో 6 భారతీయ స్టార్టప్‌లు

ఇటీవలే విడుదల చేసిన హురున్ గ్లోబల్ యునికార్న్ ఇండెక్స్‌ యొక్క టాప్ 100 కంపెనీలలో 6 భారతీయ స్టార్టప్‌లు చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ చెల్లింపుల బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్ రేజర్‌పే, ఎడ్‌టెక్ స్టార్టప్ బైజూస్, ఫుడ్‌టెక్ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ మరియు ఫాంటసీ గేమింగ్ కంపెనీ డ్రీమ్11, ఓయో రూమ్‌లు మరియు ఓలా క్యాబ్ సంస్థలు ఉన్నాయి.

ఈ ఏడాది కొత్త యునికార్న్‌ల జాబితాలో 68 నూతన యునికార్న్‌లతో భారత్‌ మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. హురున్ నివేదిక ప్రకారం, యుఎస్‌ అత్యధిక సంఖ్యలో యునికార్న్‌లకు వేదిక అయ్యింది. దీని తరువాత స్థానంలో చైనా ఉంది. మొత్తం $200 బిలియన్ల సంపదతో సోషల్ మీడియా సంస్థ బైట్‌డాన్స్ యునికార్న్ జాబితాలో అగ్రస్థానంను దక్కించుకుంది.

తర్వాత స్థానాలలో ఎలోన్ మస్క్ యొక్క స్పేస్‌ఎక్స్ మరియు యాంట్ గ్రూప్ ఉన్నాయి. ఇ-కామర్స్ వెబ్‌సైట్ షీన్ మరియు ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ స్ట్రైప్‌లు నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. భారతదేశం నుండి అత్యధిక ర్యాంక్ పొందిన యునికార్న్‌గా బైజూస్ 14వ స్థానంలో ఉంది.

గ్లోబల్ యునికార్న్ ఇండెక్స్ ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన స్టార్టప్‌లను జాబితా చేస్తుంది. స్టాక్ మార్కెట్‌లో జాబితా చేయబడకుండానే $1 బిలియన్ల విలువను చేరుకునే స్టార్టప్ కంపెనీలను యునికార్న్‌ అంటారు.

రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఎస్‌సిఓ రక్షణ మంత్రుల సమావేశం

ఏప్రిల్ 28న న్యూఢిల్లీలో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) రక్షణ మంత్రుల సమావేశానికి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ ఈ సమావేశంలో చైనా, కజకిస్థాన్, కిర్గిస్థాన్, రష్యా, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ యొక్క రక్షణ మంత్రులు పాలొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంకు బెలారస్ మరియు ఇరాన్‌లను పరిశీలక దేశాలుగా ఆహ్వానించారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో సభ్య దేశాలలో ప్రాంతీయ శాంతి, భద్రత, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై చర్యలు వంటి అంశాలపై రక్షణ మంత్రులు చర్చలు నిర్వహించారు. దేశాల సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రత, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం, సభ్య దేశాల సమానత్వం మరియు పరస్పర అవగాహన, పరస్పర అభిప్రాయాలను గౌరవించడం వంటి ప్రధాన సూత్రాల ఆధారంగా ఎస్‌సిఓ దేశాలు తమ సంబంధాలను కొనసాగిస్తున్నాయి.

భారత్ 2017లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క పూర్తి సభ్యత్వం పొందిన తర్వాత తొలిసారిగా ఎస్‌సిఓకి అధ్యక్షత వహిస్తోంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది 2001లో స్థాపించబడిన ఒక అంతర్ ప్రభుత్వ సంస్థ. దీనిలో భారతదేశంతో పాటు కజకిస్తాన్, చైనా, కిర్గిజ్‌స్థాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి.

నార్త్ సీలో పవన శక్తి ఉత్పత్తికి యూరోపియన్ శిఖరాగ్ర సమావేశం

ఉత్తర సముద్రాన్ని యూరప్‌లో అతిపెద్ద గ్రీన్ పవర్ ప్లాంట్‌గా మార్చేందుకు తొమ్మిది యూరోపియన్ దేశాలు సంతకం చేశాయి. ఈ దశాబ్దం చివరి నాటికి 130 గిగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి సరిపడా నార్త్ సీ విండ్ ఫామ్‌లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2050 నాటికి ఆ సామర్థ్యం రెండింతలు పెరిగి దాదాపు 300 గిగావాట్లకు చేరువ చేయాలని యోచిస్తున్నారు.

బెల్జియంలోని ఓస్టెండ్‌లో జరిగిన యూరోపియన్ సమ్మిట్ యందు ఫ్రెంచ్ ప్రెసిడెంట్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ మరియు యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, బెల్జియం, నెదర్లాండ్స్ , ఐర్లాండ్, డెన్మార్క్ మరియు లక్సెంబర్గ్ ప్రధాన మంత్రులతో కలిసి ఈ ప్రణాళికను ప్రకటించారు. ఈ సమావేశానికి బెల్జియం ప్రధాన మంత్రి అలెగ్జాండర్ డి క్రూ  అధ్యక్షత వహించారు.

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌కు నవరత్న హోదా

రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) కి నవరత్న హోదా లభించింది. దీనితో నవరత్న హోదా కలిగిన కంపెనీల సంఖ్య 13 కి చేరుకుంది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ 2003లో పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌ (పిఎస్‌యులు) గా విలీనం చేయబడింది. 2013లో మినీ-రత్న హోదాను పొందింది.

భారత ప్రభుత్వం కొన్ని ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు మహారత్న, నవరత్న మరియు మినీరత్న హోదాను కల్పిస్తుంది. పదిహేను వేల కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన ప్రభుత్వ రంగ సంస్థలకు మహారత్న, ఐదువేల కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన ప్రభుత్వ రంగ సంస్థలకు నవరత్న, వెయ్యి కోట్ల లోపు కంపెనీలకు మినీరత్న హోదాను కల్పిస్తుంది. నవరత్న లేదా మినీరత్న హోదా కలిగిన వాటి కంటే మహారత్న హోదా కలిగిన కార్పొరేషన్లకు ఎక్కువ స్వయంప్రతిపత్తి మరియు అధికారాలు ఉంటాయి. కంపెనీల జాబితా.

దీపావళిని అధికారిక సెలవుదినంగా ప్రకటించిన పెన్సిల్వేనియా

యునైటెడ్ స్టేట్స్ యొక్క పెన్సిల్వేనియా రాష్ట్రం హిందూ పండుగ దీపావళిని జాతీయ సెలవుదినంగా ప్రకటించింది.ఈ అంశాన్ని ఆ రాష్ట్ర సెనేటర్ నికిల్ సవాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీపావళిని హిందూవులతో పాటుగా సిక్కు మరియు జైన ప్రవాసులకు కూడా ప్రధాన సాంస్కృతిక కార్యక్రమంగా జరుపుకుంటారు. పెన్సిల్వేనియాలో ఆయా కమ్యూనిటీలకు చెందిన ప్రవాసులు అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీపావళి పండగ ఇండియాతో పాటుగా ఫిజీ, గయానా, మలేషియా, మారిషస్, మయన్మార్, నేపాల్, పాకిస్థాన్, సింగపూర్, శ్రీలంక, సురినామ్ మరియు ట్రినిడాడ్ మరియు టొబాగోలలో అధికారిక సెలవుగా ఉంది.

భారతీయ-అమెరికన్ నీలి బెండపూడికి ఇమ్మిగ్రెంట్ అచీవ్‌మెంట్ అవార్డు

పెన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన ఇండో  అమెరికన్ నీలి బెండపూడి, అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ యొక్క ప్రతిష్టాత్మకమైన ఇమ్మిగ్రెంట్ అచీవ్‌మెంట్ అవార్డు 2023ను అందుకున్నారు. ప్రస్తుతం పెన్ స్టేట్ యూనివర్శిటీకి ప్రెసిడెంటుగా ఉన్న ఆమె, అమెరికా ఉన్నత విద్యకు చేసిన సేవలకు గాను ఈ అవార్డు అందుకున్నారు.

ఇమ్మిగ్రెంట్ అచీవ్‌మెంట్ అవార్డును అమెరికా వారసత్వం పట్ల నిబద్ధత మరియు అంకితభావం మరియు మానవీయ ఇమ్మిగ్రేషన్ విధానం కోసం వాదించే విదేశీ వ్యక్తిలకు లేదా సంస్థకు ప్రతి సంవత్సరం ఇవ్వబడుతుంది. నీలి బెండపూడి ఈ అవార్డు అందుకున్న మొదటి మహిళగా గుర్తింపు పొందారు.

ఢిల్లీలో 4వ భారత్-మొజాంబిక్ జాయింట్ డిఫెన్స్ వర్కింగ్ గ్రూప్ సమావేశం

భారతదేశం-మొజాంబిక్ జాయింట్ డిఫెన్స్ వర్కింగ్ గ్రూప్ యొక్క నాల్గవ సమావేశం ఏప్రిల్ 25న న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అమితాబ్ ప్రసాద్ మరియు మొజాంబిక్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ శాశ్వత కార్యదర్శి కాసిమిరో అగస్టో ముయియోలు అధ్యక్షత వహించారు

ఇరుపక్షాలు సైనిక శిక్షణ మరియు సైనిక కోర్సులు, సైనిక వ్యాయామాలు, మెడిసిన్ మరియు రక్షణ చర్యలు విస్తృత అంశాలపై చర్చించారు. భారత రక్షణ ఉత్పత్తి రంగంలో దేశం యొక్క రక్షణ సామర్థ్యాలను భారతదేశం హైలైట్ చేసింది. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సైనిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి మార్గం సుమం చేయనుంది.

  • మొజాంబిక్ ప్రపంచంలో 35వ అతిపెద్ద దేశం.
  • ఇది ఆఫ్రికా యొక్క ఆగ్నేయ తీరంలో ఉంది.
  • దీని రాజధాని నగరం : మాపుటో.
  • అధికారిక బాష : పోర్చుగీస్
  • అధ్యక్షుడు : ఫిలిప్ న్యుసి
  • ప్రధానిమంత్రి : అడ్రియానో ​​మలేయాన్

పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూశారు

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి మరియు ప్రముఖ అకాలీదళ్ పార్టీ నాయకుడు ప్రకాష్ సింగ్ బాదల్, 25 ఏప్రిల్ 2023న పంజాబ్‌లోని మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో అనారోగ్యంతో 95 సంవత్సరాల వయస్సులో మరణించారు. ప్రకాష్ సింగ్ బాదల్ 1927 డిసెంబర్ 8న మలౌట్ సమీపంలోని అబుల్ ఖురానాలో జన్మించారు. వీరు జాట్ సిక్కు కుటుంబానికి చెందినవారు. బాదల్ లాహోర్‌లోని ఫోర్మాన్ క్రిస్టియన్ కాలేజీ నుండి పట్టభద్రుడయ్యారు.

శిరోమణి అకాలీదళ్ పార్టీ తరుపున బాదల్ నాలుగు పర్యాయాలు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1970లో తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయానికి ఆయన భారతదేశంలో అతి పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రిగా నిలిచారు. 1977 మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో కేంద్ర వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిగా కూడా పని చేశారు.

ప్రకాష్ సింగ్ బాదల్, 30 మార్చి 2015న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (కుడి) నుండి పద్మ విభూషణ్ అవార్డును అందుకుంటున్నారు. అయితే 2020–2021 లో ఢిల్లీలో సరిహద్దులో జరిగిన భారత రైతుల నిరసనకు మద్దతుగా ఈ అవార్డును తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేసారు.

నాస్కామ్ నూతన చైర్‌పర్సన్‌గా అనంత్ మహేశ్వరి

ఐటీ ఇండస్ట్రీ బాడీ అయినా నాస్కామ్ యొక్క నూతన చైర్‌పర్సన్‌గా అనంత్ మహేశ్వరి నియమితులయ్యారు. ఈయన ఈ హోదాలో 2023 -24 ఏడాదికి సంబంధించి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అనంత్ మహేశ్వరి గతంలో మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంటుగా, 2022-23 సంవత్సరాలలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో బిజినెస్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రెసిడెంటుగా పనిచేశారు.

నాస్కామ్ అనగా నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ అని అర్ధం. ఇది భారతీయ ప్రభుత్వేతర వాణిజ్య సంఘం & న్యాయవాద సమూహం. దీనిని 1988లో దేవాంగ్ మెహతా, నందన్ నీలేకనిలు స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం నోయిడాలో ఉంది. దీని ప్రస్తుత అధ్యక్షుడు దేబ్జానీ ఘోష్. నాస్కామ్ గ్లోబల్ ఐటి రంగంలో భారతదేశ పాత్రను విస్తరించడానికి అంకితం చేయబడింది.

మన్ కీ బాత్@100 పై నేషనల్ కాన్ల్కేవ్ నిర్వహించిన ప్రచార భారతి

ప్రదాని మోడీ యొక్క మన్ కీ బాత్ @ 100 వ ఎపిసోడ్‌ను ఘనంగా సెలెబ్రేట్ చేసేందుకు అదే పేరుతొ ప్రచార భారతి జాతీయ సమ్మేళనాన్ని నిర్వహించింది. ఈ వేడుకలకు వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్, హోం మరియు సహకార మంత్రి అమిత్ షా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మరియు సమాచార & ప్రసార మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి గుర్తుగా మన్ కీ బాత్‌లోని 100 ఎపిసోడ్‌లకు సంబంధించిన స్మారక పోస్టల్ స్టాంప్ మరియు నాణేలను ఆవిష్కరించారు. ఏప్రిల్ 26న నిర్వహించిన మన్ కీ బాత్‌ యొక్క100 ఎపిసోడ్‌ దేశ వ్యాప్తంగా ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్‌లు, కమ్యూనిటీ రేడియోలు మరియు వివిధ టీవీ ఛానెల్‌లతో సహా 1000 రేడియో స్టేషన్‌లలో ప్రసారం చేయబడింది.

మన్ కీ బాత్ అనేది పీఎం నరేంద్ర మోడీ యొక్క నెలవారీ రేడియో కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతినెలా ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ప్రజలతో అనేక ముఖ్యమైన విషయాలపై సంభాషిస్తారు. తన పరిపాలనా సంబంధిత అనుభవాలను వారితో పంచుకుంటారు. ఈ కార్యక్రమం 3 అక్టోబర్ 2014 లో ప్రారంభించబడింది. ఇది ఆల్ ఇండియా రేడియో, డీడీ నేషనల్ మరియు డీడీ న్యూస్ చానెల్స్ యందు ప్రచారం చేయబడుతుంది.

మొట్టమొదటి అబార్షన్ మాత్రను ఆమోదించిన జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ

జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆ దేశం యొక్క మొట్టమొదటి అబార్షన్ పిల్‌కు ఆమోదం తెలిపింది. మెఫీగో పేరుతొ అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ అబార్షన్ పిల్‌ తొమ్మిది వారాల వరకు గర్భధారణను విచ్చిన్నం చేసే సామర్థ్యం కలిగిఉంది. శస్త్రచికిత్స ద్వారా చేసే అబార్షన్‌ల కంటే ఈ ఓరల్ పిల్ సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది.

గత దశాబ్ద కాలంగా జపాన్ మహిళల పునరుత్పత్తి హక్కులు మరియు లింగ సమానత్వంపై కొనసుగుతున్న ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 1948 జపాన్ యూజెనిక్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కృత్రిమ గర్భస్రావం అనేది శిక్షార్హమైన నేరం. అయితే కొన్ని షరతులతో ఇది శస్త్రచికిత్స ప్రక్రియ ద్వారా మాత్రమే అనుమతించబడుతుంది. గరిష్టంగా 22 వారాల వరకు చట్టబద్ధంగా అనుమతిస్తున్నారు. అయితే సాధారణంగా జీవిత భాగస్వామి లేదా భాగస్వామి నుండి సమ్మతి అవసరం.

1988లో మొదటి అబార్షన్ పిల్‌ను ఆమోదించిన ఫ్రాన్స్‌తో సహా 2000 ఏడాది నుండి అమెరికా సహా అనేక దేశాలలో ఈ అబార్షన్ పిల్స్ అందుబాటులో ఉన్నాయి. యుజెనిక్స్ అనేది రుగ్మతలు లేని మానవ జాతి అభివృద్ధికి సంబందించిన జన్యుశాస్త్ర విభాగం. 20వ శతాబ్దం ప్రారంభంలో ఇది ప్రజాదరణ పొందింది. అయితే ఈ ఎంపికను అనేక దేశాలు నిషేధించాయి.

గ్లోబల్ మిలిటరీ వ్యయంలో భారతదేశంకు నాల్గవ స్థానం

2022లో భారతదేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద సైనిక వ్యయం చేసే దేశంగా నిలిచింది. భారత రక్షణ వ్యయం 2021తో పోలిస్తే దాదాపు ఆరు శాతం పెరిగిందని స్వీడిష్ థింక్ ట్యాంక్ స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) యొక్క నివేదిక తెలిపింది.

2022లో ప్రపంచ మొత్తం సైనిక వ్యయంలో యునైటెడ్ స్టేట్స్ 39 శాతం వాటాను, చైనా 13 శాతం, రష్యా 3.9 శాతం, భారతదేశం 3.6 శాతం మరియు సౌదీ అరేబియా 3.3 శాతంతో టాప్ 5లో ఉన్నాయి.

ప్రపంచ మొత్తం రక్షణ వ్యయంలో ఈ టాప్ ఐదు దేశాలు 63 శాతం వాటాను కలిగి ఉండటం గమనార్హం. 2022 ఏడాదిలో భారతదేశ సైనిక వ్యయం $81.4 బిలియన్ల మార్కుకు చేరుకున్నట్లు ఈ రిపోర్ట్ నివేదించింది.

మెక్సికో తీరంలో ప్రపంచంలోనే రెండవ లోతైన బ్లూ హోల్

మెక్సికో తీరంలోని చెటుమల్ బేలో ప్రపంచంలోనే రెండవ లోతైన నీలిరంగు రంధ్రంను పరిశోధకులు కనుగొన్నారు. 'తామ్ జా'గా పేరుపెట్టిన ఈ నీలి రంద్రం 147,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 900 అడుగుల లోతుతో ఉంది. ఇది మొదటిసారిగా 2021లో కనుగొనబడినప్పటికీ, ఇటీవల ఫ్రాంటియర్స్ ఇన్ మెరైన్ సైన్స్ అనే సైంటిఫిక్ జర్నల్‌లో నమోదు చేయబడటంతో అధికారికంగా నోటిఫై చేయబడింది.

అయితే ప్రపంచంలోని అత్యంత లోతైన లోతైన రంధ్రం 2016లో దక్షిణ చైనా సముద్రంలో కనుగొనబడింది. దీనిని డ్రాగన్ హోల్ లేదా లాంగ్‌డాంగ్ అని పిలుస్తారు. ఇది పారాసెల్ దీవులలో డ్రమ్మండ్ ద్వీపానికి ఉత్తరాన 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 987 అడుగుల (300.89 మీటర్లు) లోతుతో ఉంటుంది.

షార్జా స్టేడియంలో ఒక  స్టాండ్‌కు సచిన్ టెండూల్కర్ పేరు

సచిన్ టెండూల్కర్ 50వ పుట్టినరోజును పురస్కరించుకుని, యూఏఈలోని ప్రఖ్యాత షార్జా క్రికెట్ స్టేడియంలోని వెస్ట్ స్టాండ్‌కు సచిన్ టెండూల్కర్ పేరును నామకరణం చేశారు. ఆల్-టైమ్ ఇండియన్ క్రికెట్ ఐకాన్‌లలో ఒకరైన టెండూల్కర్ యందు అభిమానంతో ఈ గౌరవం కల్పించారు.

1998లో షార్జాలో ఇదే తేదీన సచిన్ మరపురాని మరియు ఉత్కంఠభరితమైన సెంచరీని నమోదు చేశాడు. ముక్కోణపు వన్డే టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా జట్టుపైన సచిన్ 143 పరుగులు చేయడంతో భారత్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. దీనిని క్రికెట్ అభిమానులు 'ఎడారి తుఫాను' సెంచరీ అని పిలుస్తారు. ఈ 100 నమోదు అయ్యి 25 ఏళ్ళు అవుతుంది. అంతేకాకుండా, ఇది యాదృచ్ఛికంగా లెజెండ్ యొక్క 'హాఫ్ సెంచరీ' (వయస్సు సంఖ్య) కూడా.

ఢిల్లీలో అడ్వాంటేజ్ హెల్త్‌కేర్ ఇండియా 6వ ఎడిషన్

అడ్వాంటేజ్ హెల్త్‌కేర్-ఇండియా (AHCI) 2023 యొక్క 6వ ఎడిషన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, 26 ఏప్రిల్ 2023న వీడియో సందేశం ద్వారా ప్రారంభించారు. ఈ సమావేశాన్ని న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ రెండు రోజుల పాటు నిర్వహించింది. దీనికి ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ మరియు త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహాలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పది దేశాల ఆరోగ్య మంత్రులు కూడా పాల్గొన్నారు.

వన్ ఎర్త్ వన్ హెల్త్ థీమ్‌తో జరిగిన ఈ ఈవెంట్ రెసిలెంట్ గ్లోబల్ హెల్త్ ఆర్కిటెక్చర్‌ను నిర్మించడానికి ఉద్దేశించబడింది. విలువ-ఆధారిత ఆరోగ్య సంరక్షణ ద్వారా యూనివర్సల్ హెల్త్ కవరేజీని సాధించడానికి ప్రపంచ దేశాల సహకారం మరియు భాగస్వామ్యాల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఈ సమ్మిట్‌లో 70 దేశాల నుండి 125 మంది ఎగ్జిబిటర్లు మరియు 500 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈవెంట్‌లో వాటాదారులు 100 అవగాహన ఒప్పందాలపై సంతకం చేశారు.

బ్రెజిల్‌కు చెందిన అలెశాండ్రా కోరాప్‌కు గోల్డ్‌మ్యాన్ ఎన్విరాన్‌మెంట్‌ అవార్డు

బ్రెజిల్‌కు చెందిన అలెస్సాండ్రా కోరాప్, 2023 ఏడాదికి గాను ప్రతిష్ట్మాక గోల్డ్‌మ్యాన్ ఎన్విరాన్‌మెంటల్ ప్రైజ్ అందుకున్నారు. ఈ అవార్డును ఈమెతో పాటుగా జాంబియాకు చెందిన చిలెక్వా ముంబా, ఇండోనేషియా నుండి డెలిమా సిలాలాహి, యుఎస్ నుండి డయాన్ విల్సన్, ఫిన్‌లాండ్ నుండి టెరో ముస్టోనెన్ మరియు టర్కీకి చెందిన జాఫర్ కిజాల్కయా కూడా అందుకున్నారు.

గోల్డ్‌మ్యాన్ ఎన్విరాన్‌మెంటల్ ప్రైజ్ అనేది ప్రపంచంలోని ఆరు భౌగోళిక ప్రాంతాలైన ఆఫ్రికా, ఆసియా, యూరప్, ఐలాండ్ నేషన్స్ ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికాకు చెందిన అట్టడుగు స్థాయిలో పనిచేసే ఆరుగురు పర్యావరణ కార్యకర్తలకు యేటా అందించబడుతుంది. ఈ అవార్డును 1989లో రిచర్డ్ మరియు రోడా గోల్డ్‌మన్ అనే దాతృత్వవేత్తలు రూపొందించారు. విజేతకు రెండు లక్షల యూఎస్ డాలర్ల ప్రైజ్ మనీ అందజేస్తారు.

చివరి సరిహద్దు గ్రామంలో 'ఫస్ట్ ఇండియన్ విలెజ్' సైన్ బోర్డును పెట్టిన బీఆర్ఓ

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, భారతదేశం -చైనా సరిహద్దు రీడింగ్‌లో ఉన్న ఉత్తరాఖండ్‌లోని మనా గ్రామం ప్రవేశద్వారం వద్ద 'ఫస్ట్ ఇండియన్ విలెజ్ మనా' అనే సైన్‌బోర్డ్‌ను అమర్చింది. ఈ గ్రామం ఇది గతంలో చివరి భారతీయ గ్రామంగా గుర్తింపు పొందింది. అయితే ఇప్పుడు దీనిని మొదటి భారతీయ గ్రామంగా ప్రభుత్వ వర్గాలు గుర్తిస్తున్నాయి.

మనా గ్రామం గొప్ప చారిత్రాత్మక నేపథ్యం కలిగి ఉంది. ఇది భారతదేశంలోని పురాతన జనావాస గ్రామాలలో ఒకటిగా నమ్ముతారు. ఈ గ్రామం పాండవుల జన్మస్థలమని కూడా నమ్ముతారు. మనా గ్రామం ఇండో-టిబెటన్ సరిహద్దుకు సమీపంలో ఉన్నందున, ఇది భారతీయ మరియు టిబెటన్ సంస్కృతులచే ప్రభావితమవుతుంది.

2022 బడ్జెట్ యందు పొందుపర్చిన వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ద్వారా సరిహద్దు గ్రామాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. చైనాతో సరిహద్దులో ఉన్న గ్రామాల సమగ్ర అభివృద్ధిని అందించడం మరియు గుర్తించబడిన సరిహద్దు గ్రామాలలో నివసిస్తున్న ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాలు. ఇది పూర్తి కేంద్ర ప్రాయోజిత పథకం.

గ్రీన్‌ల్యాబ్ డైమండ్స్ సంస్థకు ప్రతిష్టాత్మక జెమ్ & జ్యువెలరీ అవార్డు

జెమ్ & జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (GJEPC) ముంబైలో ఇండియా జెమ్ & జ్యువెలరీ అవార్డ్స్ యొక్క 49వ ఎడిషన్‌ను నిర్వహించింది. ఈ ఏడాది గ్రీన్‌ల్యాబ్ డైమండ్స్ ఎల్ ఎల్‌పీ ఈ ప్రతిష్టాత్మకమైన ఇండియా జెమ్ & జ్యువెలరీ అవార్డును గెలుచుకుంది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఈ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ కల్టివేటరుగా ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ ఛైర్మన్‌గా ముఖేష్ పటేల్ ఉన్నారు.

జెమ్ & జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అనేది భారతీయ రత్నాలు మరియు ఆభరణాల పరిశ్రమ మరియు దాని ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో 1966లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.

తమిళనాడులోని మనమదురై కుండలకు జీఐ ట్యాగ్ గుర్తింపు

తమిళనాడు రాష్ట్రానికి చెందిన మనమదురై కుండలు భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్‌ లభించింది. శివగంగై జిల్లాలోని ఈ మనమదురై ప్రాంతం మట్టి కుండల తయారీకి ప్రసిద్ధి. ఈ కుండల తయారీకి అవసరమయ్యే మట్టిని పక్కనే ఉన్న వైగై నది నుండి సేకరిస్తారు. ఈ కుండలు చూడముచ్చటైన ఆకారంతో దృడంగా మరియు ఆకర్షణీయంగా ఉంటాయి.

కేరళలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం

తిరువనంతపురం మరియు కాసర్‌గోడ్ మధ్య కేరళ యొక్క మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఏప్రిల్ 25న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రితో పాటు కేరళ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్ మరియు కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ఉన్నారు.

ఈ రైలు తిరువనంతపురం, కొల్లాం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కాడ్, పతనంతిట్ట, మలప్పురం, కోజికోడ్, కన్నూర్ మరియు కాసర్‌గోడ్ వంటి 11 కేరళ జిల్లాలను కవర్ చేస్తుంది. మొత్తం 587 కిలోమీటర్ల ఈ ప్రయాణ మార్గాన్ని 8.05 గంటలలో పూర్తిచేస్తుంది. ఇది మొత్తంగా దేశంలో 15వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.

ప్రపంచ బ్యాంక్ లాజిస్టిక్స్ పనితీరు సూచికలో భారతదేశంకు 38వ స్థానం

లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ (LPI 2023) 7వ ఎడిషన్‌లో 139 దేశాలలో 6 స్థానాలు ఎగబాకి భారత్ 38వ ర్యాంక్‌కు చేరుకుంది. తద్వారా ప్రపంచ బ్యాంక్ లాజిస్టిక్స్ ర్యాంకింగ్‌లో భారతదేశ స్థానం మెరుగుపడింది. ఇది భారతదేశం యొక్క గ్లోబల్ పొజిషనింగ్‌కు బలమైన సూచిక. 2014 లో భారత్ 54వ స్థానంలో ఉండేది. 2014 నుండి 2022 మధ్య 16 స్థానాలను మెరుగుపర్చుకుంది.

గత ఏడాది సెప్టెంబరులో ప్రధాన మంత్రి జాతీయ లాజిస్టిక్స్ పాలసీ (NLP)ని ప్రారంభించారు. ఇది లాజిస్టిక్స్ విధానాన్ని రూపొందించాలని కోరుకునే రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శక పత్రంగా పనిచేస్తుంది. దాదాపు 19 రాష్ట్రాలు /యూటీలు ఈ లాజిస్టిక్స్ విధానాన్ని అమలుచేస్తున్నాయి. ఈ విధానం లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & సేవల అప్‌గ్రేడేషన్ మరియు డిజిటలైజేషన్ చుట్టూ కేంద్రీకృతమై ఉంది.

భారత ప్రభుత్వం వాణిజ్య-సంబంధిత సాఫ్ట్ మరియు హార్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భారీ పెట్టుబడులు పెడుతుంది. రెండు తీరాలలోని పోర్ట్ గేట్‌వేలను లోతట్టు ప్రాంతాలలోని ఆర్థిక మండలాలకు అనుసంధానం చేస్తుంది. అలానే సప్లయ్ చైన్ విజిబిలిటీ ప్లాట్‌ఫారమ్‌ల యందు పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో సరఫరా ఆలస్యాలను గణనీయంగా తగ్గిస్తుంది. లాజిస్టిక్స్ డేటా బ్యాంక్ ప్రాజెక్ట్ పోర్ట్‌ల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహిస్తుంది. ఈ చర్యలు అన్ని పై ర్యాంకు మెరుగుపడటానికి దోహదపడ్డాయి.

కొచ్చిలో భారతదేశపు మొట్టమొదటి వాటర్ మెట్రో ప్రారంభం

కొచ్చి ఓడరేవు నగరం చుట్టుపక్కల ఉన్న పది చిన్న దీవులను కలిపే దేశం యొక్క మొట్టమొదటి వాటర్ మెట్రోను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఏప్రిల్ 25న జెండా ఊపి ప్రారంభించారు. బ్యాటరీతో నడిచే ఈ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బొట్లు మలబార్ తీరంలో నగరం చుట్టూ ఉన్న 10 దీవులకు వాటర్ మెట్రో సేవలు అందించనున్నాయి.

ఈ వాటర్ మెట్రో ప్రాజెక్ట్ ఖర్చు 1,136 కోట్లుగా అంచనా. దీనిని కేరళ ప్రభుత్వం మరియు జర్మన్ బ్యాంక్ కేఎఫ్‌డబ్ల్యు నిర్మిస్తున్నాయి. ఇకపోతే రెండు రోజుల కేరళ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ 3200 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం చేశారు. ఇదే పర్యటనలో కేరళ మొదటి వందే భారత్ ఎక్సప్రెస్ రైలును కూడా ప్రారంభించారు.

మొట్టమొదటిసారి నీటి వనరుల గణనను చేపట్టిన కేంద్రం

జలశక్తి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా నీటి వనరుల గణనను నిర్వహించింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా చెరువులు, సరస్సుల వంటి సహజ మరియు మానవ నిర్మిత నీటి వనరుల సంఖ్యను సేకరించింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో 24.24 లక్షలకు పైగా నీటి వనరులు లెక్కించబడ్డాయి. వీటిలో 23 లక్షలకు పైగా నీటి వనరులు గ్రామీణ ప్రాంతాల్లో, మిగిలిన 69,000 పట్టణ ప్రాంతాల్లో ఉన్నట్లు తెలిపింది.

నీటి వనరుల సంఖ్య పరంగా పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు అస్సాం రాష్ట్రాలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నట్లు నివేదించింది. దేశంలోని మొత్తం నీటి వనరులలో 63 శాతం నీటి వనరులు పై ఐదు రాష్ట్రాలలో ఉన్నట్లు పేర్కొంది. అందుబాటులో ఉన్న నీటి వనరులలో 59.5% చెరువులు, 15.7% ట్యాంకులు, 12.1% రిజర్వాయర్లు, 9.3% చెక్ డ్యామ్‌లు మరియు 0.9% సరస్సుల రూపంలో ఉన్నాయి.

  • దేశంలో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు : పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు అస్సాం
  • పట్టణ ప్రాంతాల్లో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు : పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్ మరియు త్రిపుర
  • గ్రామీణ ప్రాంతాల్లో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు : పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు అస్సాం

5వ భారతదేశం - గయానా జాయింట్ కమిషన్

భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, ఏప్రిల్ 22న గయానా విదేశాంగ మంత్రి హ్యూ టాడ్‌తో కలిసి 5వ ఇండియా-గయానా జాయింట్ కమిషన్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయం, ఇంధనం, ఆరోగ్యం, ఫార్మాస్యూటికల్స్, ఆయుర్వేదం, రక్షణ సహకారం, మానవ వనరులు, సాంకేతికత ఆవిష్కరణలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సమగ్ర చర్చలు నిర్వహించారు.

ఆర్చరీ ప్రపంచ కప్ 2023లో ఇండియాకు రెండు బంగారు పథకాలు

టర్కీలోని అంటాల్యలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ 2023 స్టేజ్ 1లో భారతదేశం మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ మరియు మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌లో రెండు బంగారు పతకాలను గెలుచుకుంది.

జ్యోతి సురేఖ వెన్నమ్, ఓజాస్ ప్రవీణ్ డియోటాలేలతో కూడిన భారత మిక్స్‌డ్ జట్టు 159-154తో చైనీస్ తైపీకి చెందిన చెన్ యీ హువాన్, చెమ్ చిహ్ లున్‌లను ఓడించి మిక్స్‌డ్ టీమ్ స్వర్ణాన్ని గెలుచుకుంది. అలానే మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ వెన్నం 149-146తో కొలంబియాకు చెందిన సారా లోపెజ్‌ను ఓడించి రెండో స్వర్ణం సాధించింది.

సర్కస్ లెజెండ్ జెమిని శంకరన్ కన్నుమూశారు

మోడరన్ ఇండియన్ సర్కస్‌కు మార్గదర్శకుడైన జెమినీ శంకరన్ అని కూడా పిలువబడే మూర్కోత్ వెంగకండి శంకరన్ ఏప్రిల్ 23న 99 ఏళ్ళ వయస్సులో అనారోగ్యంతో కన్నుమూశారు. శంకరన్ ఈ ఉత్తర కేరళ జిల్లాలోని కొలస్సేరి అనే గ్రామంలో 1924లో జన్మించారు. కొంతకాలం సైన్యంలో పనిచేసిన శంకరన్, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పదవీ విరమణ చేశాడు. తదనంతరం చిరక్కరలోని ఎమ్కే రామన్ యొక్క సర్కస్ పాఠశాలలో చేరి ఏరియలిస్ట్ అయ్యారు.

దేశవ్యాప్తంగా వివిధ సర్కస్ గ్రూపులతో పనిచేసిన తరువాత, 1951లో విజయా సర్కస్ కంపెనీని 6,000కు కొనుగోలు చేసి, దానిని జెమినీ సర్కస్‌గా విస్తరించారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, రాష్ట్రపతులు ఎస్ రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్ సహా పలువురు ప్రముఖులు ఆయన సర్కస్‌కు అభిమానులు. 1964లో అప్పటి సోవియట్ యూనియన్‌లో జరిగిన అంతర్జాతీయ సర్కస్ ఫెస్టివల్‌కు శంకరన్ మొదటి భారతీయ సర్కస్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు.

 షకీరాకు బిల్‌బోర్డ్ మొదటి 'లాటిన్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు

ప్రఖ్యాత కొలంబియన్ గాయని షకీరా, బిల్‌బోర్డ్ మొదటి 'లాటిన్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును అందుకుంది. తన కెరీర్ మరియు దాతృత్వ ప్రయత్నాల ద్వారా లాటిన్ మహిళలకు గుర్తింపు మరియు అవకాశాలను తెచ్చిపెట్టి, సంగీత పరిశ్రమకు ఆమె చేసిన కృషికి గాను ఈ అవార్డు అందించారు.

షకీరా యొక్క దశాబ్దాల కెరీర్ లాటిన్ కళాకారులకు అంతర్జాతీయ అవకశాల తలుపులు తెరిచింది. బిల్‌బోర్డ్ మరియు టెలిముండో ప్రకారం, ఆమె ప్రపంచవ్యాప్తంగా 95 మిలియన్ల కంటే ఎక్కువ రికార్డులను విక్రయించింది, తద్వారా ఆమె అన్ని కాలాలలో అత్యధికంగా అమ్ముడైన మహిళా లాటిన్ కళాకారిణిగా నిలిచింది.

షకీరా 2000 మరియు 2010ల మధ్య కాలంలో రెండుసార్లు బిల్‌బోర్డ్ యొక్క టాప్ ఫిమేల్ లాటిన్ ఆర్టిస్ట్ ఆఫ్ ది డికేడ్‌గా పేరుపొందింది. బిల్‌బోర్డ్ మరియు టెలిముండో ప్రకారం, మూడు గ్రామీలు, 12 లాటిన్ గ్రామీలు, ఏడు బిల్‌బోర్డ్ మ్యూజిక్ అవార్డులు మరియు 39 బిల్‌బోర్డ్ లాటిన్ మ్యూజిక్ అవార్డులను అందుకుంది.

విశాఖపట్నం పోర్ట్ అథారిటీకి సాగర్ శ్రేష్ఠ అవార్డు

విశాఖపట్నం పోర్ట్ అథారిటీ 2023 ఏడాదికి గాను సాగర్ శ్రేష్ఠ అవార్డు అందుకుంది. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ నుండి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఛైర్మన్ ఎం అంగముత్తు ఈ అవార్డును అందుకున్నారు. 'హరిత్ సాగర్' గ్రీన్ పోర్ట్ మార్గదర్శకాలను అమలు చేసిన కారణంగా ఈ అవార్డు లభించింది. దేశంలోని ప్రధాన పోర్టులలో వివిధ రకాల నిర్వహణ సూచీలలో అత్యుత్తమ పనితీరు ప్రదర్శించే పోర్టుకు యేటా ఈ అవార్డు అందిస్తారు.

Post Comment