Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 31 జనవరి 2024
January Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 31 జనవరి 2024

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 31 జనవరి 2024. పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం.

గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్ 2023: 93వ ర్యాంకులో భారత్

ప్రపంచ వ్యాప్తంగా 100కి పైగా దేశాలలో అవినీతిపై పోరాడేందుకు, ప్రజా జీవితంలో పారదర్శకతను పెంపొందించేందుకు పనిచేస్తున్న ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ (టీఐ) యొక్క గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్ 2023 విడుదల అయ్యింది. దీని యొక్క తాజా ర్యాంకింగులో భారతదేశం 180 దేశాలల జాబితాలో 93వ ర్యాంకులో నిలిచింది. ఈ దేశవారి అవినీతి అవగాహన సూచిక (సీపీఐ)లో భారత్ గత ఏడాది 85వ స్థానం నుంచి దిగజారి 93కి చేరుకుంది.

ఈ సంస్థ 180 దేశాలలో 0 నుండి 100 స్కేల్‌లో ప్రభుత్వ రంగ అవినీతిని ర్యాంక్ చేసింది. సంబంధిత దేశాల్లోని నిపుణులు మరియు వ్యాపారంలో ఉన్న వ్యక్తులతో సంప్రదింపుల నుండి ఈ డేటా గ్రహించింది. ఈ నివేదిక ప్రకారం 100 స్కేల్‌కు దగ్గరగా ఉన్నవారు అత్యంత అవినీతిపరులుగా గుర్తించబడ్డారు. ఈ నివేదికలో భారతదేశం 93 వ ర్యాంకులో ఉండగా, దేశం యొక్క మొత్తం స్కోరు 39 వద్ద ఉంది, ఇది 2022 కంటే ఒక పాయింట్ తక్కువ.

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన దర్యాప్తు సంస్థల ద్వారా ప్రతిపక్ష నాయకులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్న సమయంలో ఈ సూచిక వచ్చింది. విశేషమేమిటంటే, భారతదేశంలోని 28 రాష్ట్రాలలో బీజేపీ మరియు దాని మిత్రపక్షాలు ప్రస్తుతం 17 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నాయి.

2023 కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్‌లోని ఇతర అతి తక్కువ అవినీతి దేశాలలో 100 స్కోరుకు గాను డెన్మార్క్ 90 స్కోరుతో అవినీతి రహిత దేశంగా వరుసగా 6వ సారి అగ్రస్థానములో ఉండగా, ఫిన్లాండ్ (87), న్యూజిలాండ్ (85) స్కోరుతో ఈ ఇండెక్స్‌లో టాప్ నాలుగు స్థానాల్లో నిలిచాయి. నార్వే (84), సింగపూర్ (83), స్వీడన్ (82), స్విట్జర్లాండ్ (82), నెదర్లాండ్స్ (79), జర్మనీ (78), మరియు లక్సెంబర్గ్ (78) లు తర్వాత స్థానాలలో ఉన్నాయి.

2023 కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్‌లోని అత్యంత అవినీతి దేశాలుగా 11 స్కోరుతో సోమాలియా అగ్రస్థానంలో ఉండగా వెనిజులా (13), సిరియా (13), దక్షిణ సూడాన్ (13), యెమెన్ (16) స్కోరుతో అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. ఈ దేశాలు అన్ని దీర్ఘకాలిక సంక్షోభాల వల్ల అత్యంత అవినీతితో ప్రభావితమౌతున్నట్లు పేర్కొంది.

ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా జయ్ షా తిరిగి ఎన్నిక

భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి జయ్ షా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా వరుసగా మూడవసారి నియమితులయ్యారు. 2021 జనవరిలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ నజ్ముల్ హసన్ తర్వాత జయ్ షా ఈ బాధ్యతలు మొదటిసారి స్వీకరించారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు హోదా ఏడాది మాత్రమే ఉంటుంది. బాలిలో జరిగిన ఏసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో శ్రీలంక క్రికెట్ ప్రెసిడెంట్ షమ్మీ సిల్వా  ఈ పొడిగింపును ప్రతిపాదించారు.

ఆసియా క్రికెట్ కౌన్సిల్ అనేది ఆసియా దేశాలలో క్రికెట్ క్రీడను ప్రోత్సహించడానికి మరియు అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేయబడ్డ ప్రాంతీయ క్రికెట్ పాలక సంస్థ. ఇది 1983లో స్థాపించబడింది. ఇది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ ఆమోదంతో ప్రస్తుతం ఆసియాలో 25 సభ్యుల సంఘాలను కలిగి ఉంది. ప్రస్తుత ఏసీసీ ప్రధాన కార్యాలయం శ్రీలంకలోని కొలంబోలో ఉంది, ఇది అధికారికంగా 20 ఆగస్టు 2016న ప్రారంభించబడింది.

రామ్‌సర్ జాబితాలో మరో 5 భారతీయ చిత్తడి నేలలు

రామ్‌సర్ కన్వెన్షన్ ప్రకారం అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల ప్రపంచ జాబితాలో మరో ఐదు భారతీయ చిత్తడి నేలలు చేర్చబడ్డాయి. రామ్‌సర్ జాబితాలో కొత్తగా చేర్చబడిన ఐదు చిత్తడి నేలలలో కర్ణాటక నుండి మగడి కెరె కన్జర్వేషన్ రిజర్వ్, అంకసముద్రం బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ మరియు అఘనాశిని ఎస్ట్యూరీ, తమిళనాడు నుండి కరైవెట్టి పక్షి సంరక్షణా కేంద్రం మరియు లాంగ్‌వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నాయి. దీనితో దేశంలో మొత్తం రామ్‌సర్ సైట్ల సంఖ్య 80కి చేరుకుంది.

  1. మగాడి కెరే కన్జర్వేషన్ రిజర్వ్ (కర్ణాటక)
  2. అంకసముద్రం బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ (కర్ణాటక)
  3. అఘనాశిని ఈస్ట్యూరీ, కర్ణాటక (కర్ణాటక)
  4. కరైవెట్టి పక్షుల అభయారణ్యం (తమిళనాడు)
  5. లాంగ్‌వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ (తమిళనాడు)

2022జులైలో కూడా భారతదేశం నుండి ఐదు కొత్త సైట్‌లు రామ్‌సర్ సైట్‌ల జాబితాకు జోడించబడ్డాయి. వాటిలో కరికిలి పక్షుల అభయారణ్యం (తమిళనాడు), పల్లికరణై మార్ష్ రిజర్వ్ ఫారెస్ట్ (తమిళనాడు), పిచ్చవరం మడ అడవులు (తమిళనాడు), సఖ్య సాగర్ (మధ్యప్రదేశ్), పాలా చిత్తడి నేలలు (మిజోరం) ఉన్నాయి.

రామ్‌సర్ కన్వెన్షన్ అనేది రామ్‌సర్ సైట్‌ల పరిరక్షణ మరియు స్థిరమైన అభివృద్ధి కోసం 1971లో యునెస్కోచే అంతర్జాతీయ ఒప్పందం ద్వారా ఏర్పాటు చేశారు. దీనికి ఇరాన్‌లోని రామ్‌సర్ నగరం పేరు పెట్టారు. ఇది 1975లో అమల్లోకి వచ్చింది. రామ్‌సర్ కన్వెన్షన్ కింద జాబితా చేయబడిన ఏదైనా చిత్తడి నేలను సంరక్షించడం మరియు దాని సహజ వనరులను స్థిరమైన వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే, దానిని రామ్‌సర్ సైట్ అంటారు.

రామ్‌సర్ కన్వెన్షన్‌లో 1982 ఫిబ్రవరి 1న భారతదేశం సంతకం చేసింది. ఒరిస్సాలోని చిలికా సరస్సు మరియు రాజస్థాన్‌లోని కియోలాడియో నేషనల్ పార్క్ భారతదేశం నుండి మొదటి రామ్‌సర్ సైట్‌లుగా గుర్తించబడ్డాయి. భారతదేశంలో 80 రామ్సర్ సైట్లు ఉన్నాయి. సుందర్బన్స్ భారతదేశంలోని అతిపెద్ద రామ్సర్ సైట్. భారతదేశంలో తమిళనాడులో అత్యధికంగా 16 రామ్‌సర్ సైట్‌లు కలిగి ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లోని రేణుకా వెట్‌ల్యాండ్ (విస్తీర్ణం - 20 హెక్టార్లు) భారతదేశంలోని అతి చిన్న చిత్తడి నేల.

మలేషియా 17వ రాజుగా జోహార్ సుల్తాన్ ఇబ్రహీం ప్రమాణ స్వీకారం

మలేషియా 17వ రాజుగా జోహార్ సుల్తాన్ ఇబ్రహీం జనవరి 31న ప్రమాణ స్వీకారం చేశారు. కౌలాలంపూర్‌లోని జాతీయ ప్యాలెస్‌లో ఈ కార్యక్రమం జరిగింది. మలేషియాలోని తొమ్మిది రాజకుటుంబాలకు చెందిన అధిపతులు ప్రతి ఐదు సంవత్సరాలకు "యాంగ్ డి-పెర్టువాన్ అగోంగ్" అని పిలవబడే రాజుగా మారతారు. మునపటి చక్రవర్తి అల్-సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా, రాజుగా తన ఐదు సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసిన తర్వాత తన సొంత రాష్ట్రమైన పహాంగ్‌కు నాయకత్వం వహించడానికి వెళ్లిపోయారు. ఆయన స్థానంలో సుల్తాన్ ఇబ్రహీం బాధ్యతలు స్వీకరించారు.

సుల్తాన్ ఇబ్రహీం గత 34 సంవత్సరాలలో జోహోర్ నుండి సింహాసనాన్ని అధిరోహించిన మొదటి పాలకుడుగా నిలిచాడు. మలేషియా రాజు రాజ్యాంగబద్ధమైన చక్రవర్తి కాగా, దేశాధినేతగా మరియు సాయుధ దళాలకు కమాండర్‌గా వ్యవహరిస్తారు. మలేషియా ఆగ్నేయాసియాలోని ఏకైక సమాఖ్య దేశం. దీని ప్రభుత్వ వ్యవస్థ వెస్ట్‌మిన్‌స్టర్ పార్లమెంటరీ వ్యవస్థకు దగ్గరగా రూపొందించబడింది, ఇది బ్రిటిష్ పాలన నుండి వారసత్వంగా వచ్చింది.

మలేషియా ఆగ్నేయాసియాలోని ఒక దేశం. ఇది 13 రాష్ట్రాలు మరియు మూడు సమాఖ్య భూభాగాలను కలిగి ఉంది. దక్షిణ చైనా సముద్రంలో రెండుగా ప్రాంతాలుగా విభజించబడి ఉంది. మలేషియా థాయిలాండ్‌తో భూ మరియు సముద్రసరిహద్దును మరియు సింగపూర్, వియత్నాం మరియు ఇండోనేషియాతో సముద్రసరిహద్దులను పంచుకుంటుంది.

  • దేశం : మలేషియా
  • రాజధాని : కౌలాలంపూర్
  • అధికారిక భాష : మలయ్
  • కరెన్సీ : మలేషియా రింగిట్
  • యాంగ్ డి-పెర్టువాన్ అగోంగ్ : సుల్తాన్ ఇబ్రహీం
  • ప్రధానంత్రి : అన్వర్ బిన్ ఇబ్రహీం

సిర్పూర్ సరస్సు వద్ద ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవ వేడుకలు

వరల్డ్ వెట్‌ల్యాండ్స్ డే 2024 వేడుకలు ఇండోర్‌లోని సిర్పూర్ సరస్సు వద్ద నిర్వహించారు. వెట్ ల్యాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్ అనే థీమ్ ఆధారంగా ఈ ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ మరియు రామ్‌సర్ కన్వెన్షన్ సెక్రటరీ జనరల్ డాక్టర్ ముసోండా ముంబా వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరియు ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో పర్యావరణం, అటవీ & వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో నేషనల్ ప్లాన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ అక్వాటిక్ ఎకోసిస్టమ్స్, మేనేజ్‌మెంట్ ఎఫెక్టివ్‌నెస్ ట్రాకింగ్ టూల్: ఎ ప్రాక్టీషనర్స్ గైడ్ మరియు భారతదేశంలోని రామ్‌సార్ సైట్‌ల ఫైటో-వైవిధ్యంపై ఒక సంకలనం విడుదల చేయబడ్డాయి. నేషనల్ ప్లాన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ అక్వాటిక్ ఎకోసిస్టమ్స్ ప్రచురణ, భారతదేశంలో చిత్తడి నేల నిర్వహణ యొక్క నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌పై రాష్ట్ర/యూటీ వెట్‌ల్యాండ్ అధికారులు, రామ్‌సర్ సైట్ నిర్వాహకులు మరియు నాలెడ్జ్ భాగస్వాములకు నిర్దిష్ట మార్గదర్శకాలను అందిస్తుంది.

ఈ సంకలనంను బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాచే అభివృద్ధి చేసింది. ఇది భారతదేశంలోని మొత్తం 75 రామ్‌సర్ సైట్‌ల (ప్రస్తుతం 80) మరియు యొక్క పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. ఇది భారత ప్రభుత్వం యొక్క అమృత్ ధరోహర్ చొరవ కింద రూపొందించబడింది.

1971లో వెట్‌ల్యాండ్స్‌పై రామ్‌సర్ కన్వెన్షన్‌పై సంతకం చేసిన జ్ఞాపకార్థం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2 వ తేదీన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశం 1982 నుండి ఈ కన్వెన్షన్‌లో భాగస్వామిగా ఉంది. భారతదేశంలో ప్రస్తుతం 80 రామ్‌సర్ సైట్‌లు ఉన్నాయి. దీని మొత్తం వైశాల్యం ఇప్పుడు 1.33 మిలియన్ హెక్టార్లుగా ఉంది. తమిళనాడు గరిష్టంగా 16 రామ్‌సర్ సైట్‌లతో అగ్రస్థానంలో ఉండగా ఉత్తర ప్రదేశ్ 10 సైట్‌లతో రెండవ స్థానంలో ఉంది.

అమృత్ ధరోహర్ చొరవ అనేది భారదేశంలో ఉపాధి అవకాశాలను సృష్టించడం మరియు స్థానిక జీవనోపాధికి మద్దతివ్వడంతోపాటు దేశంలోని రామ్‌సర్ సైట్‌ల యొక్క ప్రత్యేక పరిరక్షణ విలువలను ప్రోత్సహించడానికి జూన్ 2023లో ప్రారంభించబడింది. అమృత్ ధరోహర్ చొరవ 2023-24 బడ్జెట్ ప్రకటనలో భాగంగా చేర్చబడింది. ఈ కార్యక్రమం భారత పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ కింద అమలు చేస్తున్నారు.

ఈ కార్యక్రమం వచ్చే మూడు సంవత్సరాల పాటు వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు మరియు ఏజెన్సీలు, రాష్ట్ర చిత్తడి నేల అధికారులు మరియు అనధికారిక సంస్థలు మరియు వ్యక్తుల నెట్‌వర్క్‌తో అమలు చేయనున్నారు. అమృత్ ధరోహర్ చొరవ భారతదేశ చిత్తడి నేలల పరిరక్షణ మరియు స్థిరమైన ఉపయోగం వైపు ఒక ముఖ్యమైన అడుగు. ఈ పథకం చిత్తడి నేలల పర్యావరణ విలువపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని, చిత్తడి నేలల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుతుందని మరియు చిత్తడి నేలల్లో పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని భావిస్తున్నారు.

సర్జన్ అరుణ్ కుమార్‌కు ప్రతిష్టాత్మక వ్యాఘ్రేశ్వరుడు గోల్డ్ మెడల్

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన ప్రఖ్యాత వెన్నెముక సర్జన్ అరుణ్ కుమార్ వికు ప్రతిష్టాత్మక వ్యాఘ్రేశ్వరుడు బంగారు పతకం 2024 ప్రధానం చేయబడింది. ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ ద్వారా అందించబడింది.

డాక్టర్ కుమార్ వ్యాఘ్రేశ్వరుడు గోల్డ్ మెడల్ అందుకోవడం ఇదే మొదటిసారి కాదు . అతను తన స్థిరమైన అంకితభావం మరియు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ 2021లో కూడా అందుకున్నాడు. డా. కుమార్ వివిధ వెన్నెముక రుగ్మతలకు ఎండోస్కోపిక్ వెన్నెముక శస్త్రచికిత్సలు చేయడంలో అతని అత్యుత్తమ సహకారం మరియు నైపుణ్యానికి గుర్తింపు పొందారు.

రాష్ట్రపతి కోటాలో నామినేట్ అయిన పంజాబ్‌క విద్యావేత్త సత్నామ్ సింగ్

ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చండీగఢ్ యూనివర్శిటీ వ్యవస్థాపక ఛాన్సలర్ మరియు విద్యావేత్త సత్నామ్ సింగ్ సంధును రాజ్యసభకు నామినేట్ చేశారు. రైతు కుటుంబంలో జన్మించిన సత్నామ్ సింగ్, 2001లో మొహాలిలోని లాండ్రాన్‌లో చండీగఢ్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ (సీజీసీ) స్థాపించి ప్రసిద్ధి చెందారు. ఈ సంస్థ 2023లో క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగులో చోటు దక్కించుకుంది. ఆసియాలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో మొదటి స్థానంలో నిలిచింది.

కళ, సాహిత్యం, సైన్స్ మరియు సామాజిక విషయాలలో విశేష జ్ఞానం లేదా ఆచరణాత్మక అనుభవం ఉన్న వ్యక్తుల నుండి 12 మంది సభ్యులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసేందుకు అధికారం కలిగి ఉన్నారు. వీరు ఎటువంటి ఎన్నిక లేకుండా నేరుగా నామినేట్ చేయబడతారు.

Post Comment