Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 23 జనవరి 2024
January Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 23 జనవరి 2024

January 23, 2024 Current affairs in Telugu. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో పొందండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షల కొరకు సిద్దమవుతున్న ఆశావహుల కోసం వీటిని అందిస్తున్నాం.

అబుజాలో భారత్, నైజీరియా 6వ జాయింట్ కమీషన్ సమావేశం

అబుజాలో జనవరి 22న నిర్వహించిన ఇండియా & నైజీరియా 6వ జాయింట్ కమీషన్ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్, నైజీరియన్ విదేశాంగ మంత్రి యూసుఫ్ తుగ్గర్‌తో కలిసి సహ అధ్యక్షత వహించారు. ఈ సమావేశం రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో సాగింది.

ముఖ్యంగా వాణిజ్యం మరియు పెట్టుబడులలో ఆర్థిక సహకారం విస్తరణను ఇరుపక్షాలు గుర్తించాయి. నైజీరియా అభివృద్ధి లక్ష్యాలకు మద్దతివ్వడానికి భారత్ తన నైపుణ్యం మరియు సాంకేతికతలను పంచుకోవడానికి సంసిద్ధతను వ్యక్తం చేసింది. 6వ భారతదేశం-నైజీరియా జాయింట్ కమీషన్ సమావేశం వివిధ రంగాలలో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా సానుకూల ముందడుగు వేసింది.

ఈ పర్యటనలో ఆయన లాగోస్‌లో పశ్చిమ ఆఫ్రికాలోని భారత రాయబారుల సమావేశానికి కూడా అధ్యక్షత వహించారు. జైశంకర్ ఈ ప్రాంతంలోని సంబంధాలను సమీక్షించారు. ఆఫ్రికా దేశాలతో భారత్ భాగస్వామ్యాన్ని మరింతగా ఎలా పెంచుకోవాలో చర్చించారు. లాగోస్‌లోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగించారు. లాగోస్‌లో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ప్రతినిధులతో కూడా సమావేశమయ్యారు.

ఢిల్లీలో పర్యాటక మంత్రిత్వ శాఖ వార్షిక మెగా ఈవెంట్ భారత్ పర్వ్

కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, గణతంత్ర దినోత్సవంలో భాగంగా తొమ్మిది రోజుల వార్షిక కార్యక్రమం 'భారత్ పర్వ్'ను నిర్వహించింది. ఈ కార్యక్రమం జనవరి 23 నుంచి జనవరి 31 వరకు చారిత్రాత్మక ఎర్రకోట ఎదురుగా ఉన్న లాన్స్ మరియు జ్ఞాన్ పథ్‌లో జరిగింది. ఈ కార్యక్రమం 2016 నుండి యేటా క్రమం తప్పకుండ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనే వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల బృందాల ముందుస్తు ప్రదర్శనలకు వేదిక అందిస్తుంది.

ఈ ఏడాది 26 కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు డిపార్ట్‌మెంట్ల నుండి పౌర కేంద్రీకృత పథకాలు మరియు మిషన్ లైఫ్, ఒక జిల్లా ఒక ఉత్పత్తి, విక్షిత్ భారత్, నారీ శక్తి, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రదర్శించింది. దేఖో అప్నా దేశ్‌ను ప్రమోట్ చేయడానికి సరికొత్త టెక్నాలజీ సహాయంతో ఒక అనుభవపూర్వక జోన్ కూడా సెటప్ చేయబడింది.

వీటికి అదనంగా, వివిధ రాష్ట్రాలు మరియు యూటీలలోని విభిన్న పాక సంప్రదాయాలను సూచించే రుచికరమైన వంటకాలతో కూడిన ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసారు. అలానే సాంస్కృతిక అనుభవాన్ని మెరుగుపరచడానికి, హస్తకళ మరియు చేనేత స్టాల్స్‌తో కూడిన పాన్-ఇండియా క్రాఫ్ట్స్ బజార్ కూడా ఏర్పాటు చేయబడింది. ఇది వరకు ఆరు రోజులు మాత్రమే నిర్వహించే ఈ వేడుక, ఈ సంవత్సరం 9 రోజులకు పొడిగించబడింది.

డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై భారత్, క్యూబా అవగాహన ఒప్పందం

డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై భారత్, క్యూబా ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఇండియాలో అమలు చేయబడిన విజయవంతమైన డిజిటల్ సొల్యూషన్‌లను పంచుకునే రంగంలో సహకారం లక్ష్యంగా ఈ ఎంఓయూ కుదిరింది. ఈ ఒప్పందం భారత ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు క్యూబా రిపబ్లిక్ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ మధ్య జరిగింది.

ఈ ఒప్పందంపై భారతదేశం వైపు నుండి ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ మరియు క్యూబా వైపు నుండి కమ్యూనికేషన్స్ డిప్యూటీ మంత్రి విల్ఫ్రెడో గొంజాలెజ్ విడాల్ సంతకాలు చేశారు. రెండు దేశాల్లోనూ డిజిటల్ పరివర్తనను ప్రోత్సహించడం ఈ ఎమ్‌ఓయు లక్ష్యం. ఇందులో భాగంగా ఇ-గవర్నెన్స్, డిజిటల్ ఐడెంటిటీ మరియు సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలలో రెండు దేశాలు విజ్ఞానం మరియు నైపుణ్యాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి.

గావ్ చలో అభియాన్‌ అనే దేశవ్యాప్త ప్రచార కార్యక్రమం ప్రారంభం

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, గావ్ చలో అభియాన్ అనే దేశవ్యాప్త ప్రచార కార్యక్రమంను జనవరి 22, 2024న ఢిల్లీలో ప్రారంభించారు. ఈ ప్రచారం గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లను చేరుకోవడం మరియు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం సాధించిన విజయాలను హైలైట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ప్రచారం ఫిబ్రవరి 4 నుండి 11, 2024 వరకు కొనసాగుతుంది. ఇందులో దేశవ్యాప్తంగా 30 లక్షల మంది బీజేపీ పార్టీ కార్యకర్తలు పాల్గొంటారు. దేశవ్యాప్తంగా ఏడు లక్షల గ్రామాలు, అన్ని పట్టణ బూత్‌లను సందర్శించి ఓటర్లతో మమేకమై ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను వివరిస్తారు.

గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ పునాదిని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు నడ్డా తెలిపారు. గ్రామీణ భారత అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉందని, ఈ ప్రాంతంలో ప్రభుత్వ పనితీరును చాటిచెప్పే విధంగా ప్రచారం జరుగుతుందన్నారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ సన్నాహాల్లో ఈ ప్రచారం కీలకంగా కనిపిస్తోంది. ఆ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది మరియు సాంప్రదాయకంగా బలహీనంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో విజయం సాధించాలని ఆశిస్తోంది.

దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కాంగ్రేస్ వంటి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ విపక్షాల కథనాలను ఎదుర్కోవడానికి మరియు గ్రామీణ ప్రాంతాల్లో తమ పార్టీ మద్దతును ఏకీకృతం చేయడానికి గావ్ చలో అభియాన్ సహాయపడుతుందని బిజెపి భావిస్తోంది.

హైదరాబాద్‌లో నేషనల్ స్కిల్ సెంటర్‌ను ప్రారంభించిన కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో కొత్తగా నిర్మించిన నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఉమెన్‌ను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి జనవరి 21న ప్రారంభించారు. 4 ఎకరాల విస్తీర్ణంలో 19.90 కోట్ల రూపాయలతో నిర్మించబడిన ఈ నైపుణ్య శిక్షణ సంస్థ, వివిధ రంగాలలోని మహిళలకు స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక నైపుణ్యం కోర్సులను అందిస్తుంది. ఈ కార్యక్రమంలో సైనా నెహ్వాల్, సునీతా కృష్ణన్ వంటి పలువురు మహిళా సాధకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, జాతీయ మహిళా నైపుణ్య శిక్షణా సంస్థని ప్రారంభించడం పట్ల సొంతోషం వ్యక్తం చేశారు. మహిళా సాధికారత కోసం భారత ప్రభుతం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల కోసం కూడా పంచుకున్నారు. బేటీ బచావో బేటీ పఢావో, ఉజ్వల, ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, ముద్రా యోజన, స్వచ్ఛ భారత్ అభియాన్, సైనిక్ పాఠశాలల్లో రిజర్వేషన్లు వంటి కార్యక్రమాలను ఆయన హైలైట్ చేసారు.

ఆర్టికల్ 370 రద్దు జమ్మూ మరియు కాశ్మీర్ మహిళలకు సమాన హక్కులను నిర్ధారిస్తుందని, ట్రిపుల్ తలాక్ చట్టం మహిళా సాధికారతకు దోహదపడిందని మంత్రి తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ మహిళా జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ, హైదరాబాద్‌లో నైపుణ్య అంతరాన్ని తగ్గిస్తుందని, నాణ్యమైన వృత్తి శిక్షణ ద్వారా మహిళలకు సాధికారత కల్పిస్తుందని పేర్కొన్నారు.

హైదరాబాద్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఉమెన్‌, క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్ మరియు క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్స్ ట్రైనింగ్ స్కీమ్ కింద ఫ్యాషన్ డిజైనింగ్ & టెక్నాలజీ, కాస్మోటాలజీ, ఆర్కిటెక్చరల్ డ్రాట్స్‌మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి ట్రేడ్‌లలో దీర్ఘకాలిక కోర్సులను అందిస్తుంది. అలానే అధిక-డిమాండ్ నైపుణ్యం గల ప్రొఫెషనల్ బ్యూటీ థెరపీ, కట్టింగ్ & టైలరింగ్, డ్రాఫ్టింగ్, కట్టింగ్, స్టిచింగ్ & ఫినిషింగ్ ఆఫ్ డ్రస్సులు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అంశాల యందు కూడా శిక్షణ కల్పిస్తుంది.

ఈ సంస్థ ఏటా 2500 మంది మహిళలకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 480 మంది మహిళలు దీర్ఘకాలిక కోర్సుల్లో చేరారు. అదనంగా 2000 మంది మహిళలు వివిధ స్వల్పకాలిక కోర్సుల్లో అడ్మిషన్ పొందారు. ప్రస్తుతం క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్ మరియు క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్స్ ట్రైనింగ్ స్కీమ్ కోర్సుల కింద 120 మంది ట్రైనీలు ఇన్‌స్టిట్యూట్‌లో దీర్ఘకాలిక వృత్తి నైపుణ్య శిక్షణ పొందుతున్నారు.

యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ ఇండియా పర్యటన

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 78వ సెషన్ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ జనవరి 22 నుండి 26 మధ్య ఐదు రోజుల పాటు ఇండియాలో పర్యటించారు. భారతదేశం మరియు ఐక్యరాజ్యసమితి మధ్య సంబంధాలను బలోపేతం లక్ష్యంగా ఈ పర్యటన చోటు చేసుకుంది.

ఈ పర్యటనలో డెన్నిస్ ఫ్రాన్సిస్, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో సమావేశం అయ్యారు. ఐక్యరాజ్యసమితికి భారతదేశం అందించిన సహకారం మరియు రాబోయే కీలక ప్రపంచ సమావేశాలతో సహా పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ చర్చలు ఐక్యరాజ్యసమితిలో సమగ్ర సంస్కరణల కోసం భారతదేశం యొక్క పిలుపుతో సహా విస్తృత శ్రేణి అంశాలను కలిగి ఉంది. ఐరాస భద్రతా మండలిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతోపాటు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు సమానత్వం మరియు ప్రాతినిధ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఫ్రాన్సిస్ భారతదేశ పర్యటన భారతదేశం-ఐరాస సంబంధాలను బలోపేతం చేయడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందజేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది, ముఖ్యంగా భారతదేశ ప్రాధాన్యతలతో పాటు గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న ప్రపంచ సవాళ్లపై ఐక్యరాజ్యసమితితో భారతదేశ సహకారాన్ని పెంపొందించడానికి కూడా ఈ పర్యటన ఒక అవకాశంగా ఉంటుందని పేర్కొంది.

ఈ పర్యటనలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో కూడా సమావేశం అయ్యారు. అలానే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్‌లో ప్రసంగించారు. అలానే  జైపూర్ మరియు ముంబై నగరాలను కూడా సందర్శించారు. ముంబైలో 2008 ఉగ్రవాద దాడుల మృతుల స్మారకార్థం 26/11 వద్ద పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ని సందర్శించి ఒక సెషన్‌లో ప్రసంగించారు. మహారాష్ట్ర రిపబ్లిక్ డే పరేడ్‌లో రాష్ట్ర అతిథిగా కూడా పాల్గొన్నారు

ఇండియా ఓపెన్ 2024 మహిళల టోర్నీలో తాయ్ ట్జు యింగ్ విజయం

చైనీస్ తైపీకి చెందిన దిగ్గజ క్రీడాకారిణి తాయ్ త్జు యింగ్ తన మొట్టమొదటి మహిళల సింగిల్స్ ఇండియా ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో 21-16, 21-12 వరుస సెట్లలో చైనాకు చెందిన ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్ చెన్ యు ఫీని ఓడించి విజేతగా నిలిచింది. 2016లో సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో చివరిసారిగా ఇండియా ఓపెన్‌లో పాల్గొన్నఆమె, తిరిగి ఇందులో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఆమె ప్రస్తుతం మహిళల ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగులో 3వ స్థానంలో ఉన్నారు.

ఇండియా ఓపెన్ అనేది ప్రతిష్టాత్మకమైన సూపర్ 750 టోర్నమెంట్లలో ఒకటి, ఇది పారిస్ 2024 ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు పోటీపడే ఆటగాళ్లకు ముఖ్యమైన ర్యాంకింగ్ పాయింట్లను అందిస్తోంది. ఈ ఏడాది యోనెక్స్ సన్‌రైజ్ ఇండియా ఓపెన్ 2024 పేరుతొ నిర్వహించిన ఈ క్రీడా కార్యక్రమం జనవరి 16 నుండి 21 వరకు న్యూఢిల్లీలోని కేడి జాదవ్ ఇండోర్ స్టేడియంలో జరిగింది.

  • పురుషుల సింగిల్స్: షి యు క్వి (చైనా)
  • మహిళల సింగిల్స్: తాయ్ ట్జు యింగ్ (చైనీస్ తైపీ)
  • పురుషుల డబుల్స్: కాంగ్ మిన్ హ్యూక్-సియో సీయుంగ్ జే (దక్షిణ కొరియా)
  • మహిళల డబుల్స్: డెచాపోల్ పువరానుక్రోహ్-సప్సీరీ తారెట్టనాచై (థాయ్‌లాండ్)
  • మిక్స్‌డ్ డబుల్స్: మయు మత్సుమోటో-వకానా నగహరా (జపాన్)

పురుషుల డబుల్స్ ఫైనల్‌లో భారత్ ఫేవరెట్‌లు సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి ఫైనల్ యందు దక్షిణ కొరియాకు చెందిన కాంగ్ మిన్ హ్యూక్ మరియు సియో సెయుంగ్ జే చేతిలో ఓడి రెండవ స్థానంలో నిలిచారు.

ఉధంపూర్ జగన్నాథ ఆలయంలో గోలే మేళా ఉత్సవం

జమ్మూ మరియు కాశ్మీర్‌లోని ఉధంపూర్‌ జగన్నాథ ఆలయంలో గోలే మేళా ఉత్సవం జనవరి 20 నుండి 22 మధ్య నిర్వహించబడింది. గోలే మేళా ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహిస్తారు. ఈ వేడుకకు ఉధంపూర్ జిల్లా మరియు వెలుపల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. హిందూ దేవతలైన విష్ణువు, కృష్ణుడు మరియు బలరాములకు అంకితం చేయబడిన జగన్నాథ ఆలయం చుట్టూ ఈ పండుగ కేంద్రీకృతమై ఉంది. పండుగ సందర్భంగా, భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి మరియు వివిధ ఆచారాలు మరియు వేడుకలలో పాల్గొనడానికి ఆలయంకు చేరుకుంటారు.

ఉధంపూర్‌లో గోలే మేళా ఉత్సవం అత్యంత ప్రతిష్టాత్మకమైన సంప్రదాయం. అన్ని వర్గాల ప్రజలు కలిసి తమ విశ్వాసం మరియు సంస్కృతిని జరుపుకునే వేడుక. జగన్నాథ దేవాలయం నుండి సమీపంలోని గోలే మైదానం వరకు భక్తుల భారీ ఊరేగింపుతో పండుగ ప్రారంభమైంది. బ్యాండ్ బృందం సంప్రదాయ సంగీతాన్ని వాయిస్తూ ఊరేగింపు నిర్వహిస్తారు. భారతదేశంలో జగన్నాథునికి అంకితం చేయబడిన రెండు పురాతన దేవాలయాలలో ఒకటి ఒరిస్సాలోని పూరిలో ఉంటె, మరొకటి జమ్మూ మరియు కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో ఉంది.

Post Comment