Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 26 జనవరి 2024
January Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 26 జనవరి 2024

January 26, 2024 Current affairs in Telugu. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో పొందండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షల కొరకు సిద్దమవుతున్న ఆశావహుల కోసం వీటిని అందిస్తున్నాం.

గ్లోబల్ నెట్‌వర్క్‌లో చేరిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా

ఇండియన్ వ్యాక్సిన్ తయారీసంస్థ అయినా సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఓస్లో ఆధారిత కోయలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇన్నోవేషన్స్ (సీఈపీఐ) అనే వ్యాక్సిన్ నిర్మాతల నెట్‌వర్క్‌లో చేరుతున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తులో వ్యాప్తి చెందే అంటు వ్యాధులకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడానికి ఈ చొరవ తీసుకుంది. ఈ చేరిక సీరంకు గ్లోబల్ సౌత్ రీజియన్‌లలో వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రయత్నాలకు గణనీయమైన ప్రోత్సాహం లభిస్తుంది.

కోయలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇన్నోవేషన్స్ (సీఈపీఐ) అనేది అంటువ్యాధులు మరియు మహమ్మారి బెదిరింపులకు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌లు మరియు ఇతర జీవసంబంధమైన ఔసుధాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి కృషి చేస్తున్న ఒక వినూత్న ప్రపంచ భాగస్వామ్యం.

ఈ నెట్‌వర్క్‌లో ప్రస్తుతం 13 దేశాల నుండి 15 భాగస్వామ్య సెంట్రలైజ్డ్ లాబొరేటరీలు సభ్యులుగా ఉన్నాయి. ఈ నెట్‌వర్క్‌ భవిష్యత్ కాలంలో వచ్చే కొత్త అందువ్యాదులకు 100 రోజులలో (100 రోజుల మిషన్‌) విరుగుడిని అభివృద్ధి చేసే లక్ష్యంతో పనిచేస్తుంది. 100 రోజుల మిషన్‌ అనేది మహమ్మారి ముప్పును గుర్తించిన మూడు నెలల్లో తెలిసిన లేదా కొత్త అంటు వ్యాధులకు వ్యతిరేకంగా కొత్త వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయడం మరియు తయారు చేయడం.

సీఈపీఐ, అంటువ్యాధి మరియు మహమ్మారి వ్యాధులకు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ల మూల్యాంకనాన్ని ప్రామాణీకరించడానికి మరియు వేగవంతం చేయడానికి ఆధునాతన పద్ధతులు మరియు పదార్థాలను ఉపయోగిస్తుంది. అంటు వ్యాధి ప్రబలిన సందర్భంలో, గ్లోబల్ క్లినికల్ లాబొరేటరీ నెట్‌వర్క్‌ని ఏర్పాటు చేయడం వలన దాని ప్రపంచవ్యాప్త విస్తరణ కారణంగా విశ్లేషణలను సమన్వయం చేయడం మరియు నమూనా షిప్పింగ్ సమయాన్ని తగ్గించడం ద్వారా వేగవంతమైన డేటా రీడౌట్‌లను సులభతరం చేస్తుంది.

తద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని బలోపేతం చేసి, భవిష్యత్తులో వచ్చే మహమ్మారి మరియు ఇతర ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులకు ప్రతిస్పందించడానికి మెరుగైన సన్నద్ధతను అందిస్తుంది.

బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న అవార్డు

బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు మరణానంతరం భారతరత్న అవార్డు ప్రకటించారు. అతని 100వ జయంతి సంధర్బంగా 26 జనవరి 2024న భారతదేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కర్పూరి ఠాకూర్ బీహార్ 11వ ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు పని చేశారు, మొదట డిసెంబర్ 1970 నుండి జూన్ 1971 వరకు, ఆపై జూన్ 1977 నుండి ఏప్రిల్ 1979 వరకు. ఆయనను బీహార్ ప్రజలు జన్ నాయక్ అని పిలుస్తారు.

బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో జన్మించిన కర్పూరి ఠాకూర్ చిన్నప్పటి నుండి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో భాగమయ్యారు. విద్యార్థి కార్యకర్తగా, అతను క్విట్ ఇండియా ఉద్యమంలో చేరడానికి తన గ్రాడ్యుయేట్ కాలేజీని విడిచిపెట్టాడు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నందుకు 26 నెలలు జైలు జీవితం కూడా గడిపారు.

భారతదేశం స్వాతంత్రం పొందిన తరువాత, ఠాకూర్ తన గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1952లో తాజ్‌పూర్ నియోజకవర్గం నుండి సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా బీహార్ విధానసభకు ఎన్నికయ్యారు. 1970లో బీహార్‌లో మొదటి కాంగ్రేసేతర సోషలిస్ట్ ముఖ్యమంత్రి కావడానికి ముందు బీహార్‌లో మంత్రిగా మరియు ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.

కర్పూరీ ఠాకూర్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో బీహార్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని కూడా అమలు చేశాడు . అతని హయాంలో బీహార్‌లోని వెనుకబడిన ప్రాంతాలలో అతని పేరు మీద అనేక పాఠశాలలు మరియు కళాశాలలు స్థాపించబడ్డాయి.

కర్పూరీ ఠాకూర్ రెండవ సారి 1977 నుండి 1979 వరకు బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముంగేరి లాల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడం ద్వారా ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీలు) రిజర్వేషన్ల ప్రయోజనాన్ని అందించడంలో మార్గదర్శకుడుగా నిలిచారు.

బీహార్‌లోని వెనుకబడిన తరగతులు మరియు ఇతర అణగారిన వర్గాల కోసం పోరాడినందుకు ఠాకూర్‌ను ప్రేమగా జన్ నాయక్ అని పిలుచుకునే వారు. ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యాసంస్థల్లో వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లతో సహా అనేక పేదల అనుకూల కార్యక్రమాలను ఆయన అమలు చేశారు.

ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఠాకూర్ తన జీవితకాలం దేశానికి చేసిన సేవకు తగిన నివాళి. ఇది సాంఘిక సంక్షేమానికి మరియు సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటానికి, కృషిని గుర్తిస్తుంది. ఠాకూర్‌కు భారతరత్న ప్రకటనపై వివిధ రాజకీయ మరియు సామాజిక వర్గాల నుండి విస్తృత ప్రశంసలు అందాయి. అతని వారసత్వాన్ని మరియు భారతదేశంలో సామాజిక న్యాయం యొక్క ప్రాముఖ్యతను గుర్తించే దిశగా ఇది ఒక అడుగుగా భావించబడింది. 1988లో మరణించిన 35 సంవత్సరాల తర్వాత ఠాకూర్‌కు మరణానంతరం ఈ అవార్డును ప్రదానం చేయబడింది.

బీహార్‌లో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ అవార్డు రాజకీయ ప్రేరేపితమై ఉండొచ్చని కొందరు విమర్శకులు అభిప్రాయపడ్డారు. అయితే, రాజకీయ పరిగణనలతో సంబంధం లేకుండా ఇది ఆయన శతజయంతి సంధర్బంగా ఆయన దేశానికి చేసిన నిస్వార్థ సేవలకు ఘనమైన నివాళిగా భావించాలి.

భారతరత్న అనేది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క అత్యున్నత పౌర పురస్కారం. ఇది 2 జనవరి 1954న స్థాపించబడింది. భారత రత్న గ్రహీతలు భారతీయ హోదా ప్రాధాన్యత క్రమంలో ఏడవ స్థానంలో ఉంటారు. భారతరత్న మొదటి అవార్డును తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి సి. రాజగోపాలాచారి, రెండవ రాష్ట్రపతి మరియు భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మరియు నోబెల్ బహుమతి గ్రహీత మరియు భౌతిక శాస్త్రవేత్త సివి రామన్ 1954లో అందుకున్నారు.

భారతరత్న ఇప్పటి వరకు 49 మంది వ్యక్తులకు అందించారు. వీరిలో మరణానంతరం 15 మంది వ్యక్తులు అందుకున్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం గౌరవించబడిన మొదటి వ్యక్తి. 2014లో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 40 ఏళ్ల వయస్సులో ఈ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కుడైన గ్రహీతగా నిలిచాడు. ఈ పురస్కారం పొందిన మొదటి గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి మరియు మొదటి నటుడు ఎంజీ రామచంద్రన్. భారతరత్నఅందుకున్న విదేశీయులలో మదర్ థెరిసా (అల్బేనియా), అబ్దుల్ గఫార్ ఖాన్ (పాకిస్తాన్) మరియు నెల్సన్ మండేలా (దక్షిణాఫ్రికా) ఉన్నారు.

4వ అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా అవతరించిన భారత్

భారత స్టాక్ మార్కెట్ హాంకాంగ్‌ను అధిగమించి తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అతిపెద్ద ఈక్విటీ మార్కెట్‌గా ర్యాంక్ పొందిందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మరియు దాని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక రంగానికి ఇది ఒక ముఖ్యమైన మైలురాయి.

23 జనవరి 2024న భారతదేశం యొక్క ఎక్స్ఛేంజీలలో జాబితా చేయబడిన షేర్ల సంయుక్త మార్కెట్ విలువ హాంకాంగ్ యొక్క $4.29 ట్రిలియన్ కంటే పెరిగి $4.33 ట్రిలియన్లతో ఈ రికార్డు మార్కును చేరుకుంది. ఈ జాబితాలో యూఎస్ ($50.86 ట్రిలియన్), చైనా ($8.44 ట్రిలియన్), జపాన్ ($6.36 ట్రిలియన్) టాప్ మూడు స్థానాలలో ఉన్నాయి.

భారతదేశ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ డిసెంబర్ 5న మొదటిసారిగా $4 ట్రిలియన్‌లను దాటింది. దేశంలో వేగంగా పెరుగుతున్న రిటైల్ ఇన్వెస్టర్ బేస్, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నుండి నిరంతర ఇన్‌ఫ్లోలు, బలమైన కార్పొరేట్ ఆదాయాల నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్‌ ర్యాలీ ఈ మార్కును చేరుకుంది.

2023లో ఓవర్సీస్ ఫండ్స్ భారతీయ షేర్లలోకి $21 బిలియన్లకు పైగా కుమ్మరించాయి, ఇది దేశం యొక్క బెంచ్‌మార్క్ ఎస్&పి బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ వరుసగా ఎనిమిదో సంవత్సరం కూడా లాభాలను పొందేందుకు సహాయపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వెబ్‌సైట్ ప్రకారం డిసెంబర్ 31, 2022 నాటికి దాదాపు 2,113 కంపెనీలు ఎక్స్ఛేంజ్‌లో జాబితా చేయబడ్డాయి.

చైనీస్ జనాభాలో 13%, అమెరికాలో 55%తో పోలిస్తే భారతీయ జనాభాలో కేవలం 3% మంది మాత్రమే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిపెట్టినప్పటికీ డిసెంబర్ 2023 నాటికి, భారతదేశంలో దాదాపు 123.50 మిలియన్ల డీమ్యాట్ ఖాతాలు నమోదు చేయబడ్డాయి.

2023లో అంచనా వేసిన జీడీపీ వృద్ధి 7%తో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటి. ఈ నిరంతర ఆర్థిక విస్తరణ భారతీయ మార్కెట్‌పై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచింది. వ్యాపారాన్ని సులభతరం చేయడానికి మరియు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి భారత ప్రభుత్వం అనేక సంస్కరణలను అమలు చేసింది, ఇది స్టాక్ మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపింది.

ప్రపంచ స్టాక్ మార్కెట్ ర్యాంకింగ్స్‌లో భారతదేశం నాల్గవ స్థానానికి ఎగబాకడం, దేశం యొక్క బలమైన ఆర్థిక మూలాధారాలకు మరియు పెట్టుబడిదారులకు పెరుగుతున్న ఆకర్షణకు నిదర్శనం. సవాళ్లు మిగిలి ఉన్నప్పటికీ, ఈ విజయం నిస్సందేహంగా భారతదేశం యొక్క ప్రధాన ఆర్థిక శక్తిగా మారే ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.

న్యూఢిల్లీ నుంచి తొలి సిద్ధ వెల్‌నెస్ ర్యాలీ ప్రారంభం

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీస్రాచ్ ఇన్ సిద్ధ మరియు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన 'సిద్ధ' వెల్‌నెస్ ర్యాలీ & అవేర్‌నెస్ క్యాంపెయిన్ న్యూఢిల్లీలో ప్రారంభించబడింది. ఢిల్లీ నుండి కన్యాకుమారి వరకు సాగే ఈ బైకర్స్ ర్యాలీకి కేంద్ర ఆయుష్ మరియు మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్‌పరా మహేంద్ర భాయ్ జెండా ఊపి ప్రారంభించారు. న్యూ ఢిల్లీలోని ఆయుష్ క్యాంపస్ మంత్రిత్వ శాఖలోని ఆయుష్ భవన్‌లో ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

ఈ ర్యాలీ దాదాపు 3333 కి.మీ.లను కవర్ చేస్తూ, 20-రోజుల నిడివితో సాగుతుంది. న్యూ ఢిల్లీ నుండి కన్యాకుమారి వరకు యాత్ర పొడుగునా సిద్ధ వైద్య విధానాన్ని ప్రదర్శిస్తుంది. 8 రాష్ట్రాలు/యుటిల గుండా సాగే ఈ ర్యాలీలో 21 అవగాహన క్యాంపు పాయింట్లు ఏర్పాటు చేశారు. ర్యాలీలో సిద్ధ వైద్యులు మరియు విద్యార్థులు పాల్గొంటారు.

ర్యాలీలో అవగాహన శిబిరాలు, వర్క్‌షాప్‌లు మరియు యోగా, ధ్యానం, మూలికా నివారణలు మరియు జీవనశైలి పద్ధతులు వంటి సిద్ధ యొక్క వివిధ అంశాలను ప్రదర్శించే ప్రదర్శనలు ఉంటాయి. సిద్ధా అని పిలవబడే సాంప్రదాయ భారతీయ వైద్య విధానాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ దీనిని ప్రారంభించింది. సంపూర్ణ శ్రేయస్సును నిర్ధారించడంలో సిద్ధ యొక్క సామర్థ్యాన్ని హైలైట్ చేస్తూ ఈ ప్రత్యేకమైన ర్యాలీ తీర్చదిద్దబడింది.

75వ గణతంత్ర దినోత్సవం 2024 ముఖ్యాంశాలు

భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు 26 జనవరి 2024న హాట్టహాసంగా  జరిగాయి. ఈ సంవత్సరం రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు హాజరయ్యారు. ఈ వేడుకలు 'విక్షిత్ భారత్' మరియు 'లోక్తతంత్ర కి మాతృక' అనే థీమ్‌తో నిర్వహించారు. కర్తవ్య పథంలో ఉదయం 8 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఎగరవేశారు. గణతంత్ర దినోత్సవం 2024 పరేడ్ ఉదయం 10:30 గంటలకు న్యూఢిల్లీలోని విజయ్ చౌక్ నుండి కర్తవ్య మార్గం వరకు సాగింది.

భారతదేశం రిపబ్లిక్‌గా అవతరించి ఈ ఏడాదికి 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. జనవరి 26, 1950న రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజుకు గుర్తుగా యేటా ఈ వేడుక నిర్వహిస్తారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా 'మారుత్' ఆకారంలో కర్తవ్య మార్గంలో ఆరు రాఫెల్ విమానాలు ఎగిరాయి. 75వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో 'నారీ శక్తి' పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ, 265 మంది మహిళలు మోటార్‌సైకిళ్లపై వివిధ విన్యాసాలు ప్రదర్శించారు.

ఈ సంవత్సరం కవాతు ప్రత్యేకించి మహిళా సాధికారతను నొక్కిచెప్పింది, ఇందులో త్రివిధ సాయుధ బలగాలతో కూడిన మహిళా బృందం మొదటిసారి కవాతు నిర్వహించింది. ఈ ఏడాది పరేడ్‌లో చంద్రయాన్ 2, ఆదిత్య ఎల్ 1, అయోధ్య బలరాముడు వంటి శకటాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

మూడేళ్ళ విరామం తర్వాత ఈ ఏడాది తెలంగాణ శకటంకు కూడా చోటు కల్పించబడింది. తెలంగాణ విమోచన ఉద్యమంలో విశిష్ట పాత్ర పోషించిన కొమరం భీమ్, రాంజీ గోండ్, చాకలి ఐలమ్మ వంటి ప్రముఖ విప్లవ నాయకుల విగ్రహాలతో కూడిన శకటం ప్రదర్శించబడింది. అలానే ఆంధ్రప్రదేశ్ నుండి విద్యా సంస్కరణల ఇతివృత్తంతో శకటం ప్రదర్శించారు.

శ్రీజ ఆకులకు తొలి అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ టైటిల్‌

భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి శ్రీజ అకుల తన మొదటి అంతర్జాతీయ టైటిల్‌ను గెలుచుకుంది. జనవరి 19న జరిగిన డబ్ల్యూటీటీ ఫీడర్ కార్పస్ క్రిస్టీ 2024 మహిళల సింగిల్స్ ఫైనల్లో అమెరికాకు చెందిన ప్రపంచ నం. 46 లిల్లీ జాంగ్‌ను 11-6, 18-16, 11-5తో ఓడించి విజేతగా నిలిచింది. రెండుసార్లు జాతీయ ఛాంపియన్ శ్రీజ అకులకు ఇది తన తొలి అంతర్జాతీయ టైటిల్‌.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ పీబీ వరాలే ప్రమాణ స్వీకారం

కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రసన్న బి వరాలే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దీనితో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా 34 మంది న్యాయమూర్తుల గరిష్ట సంఖ్యను చేరుకుంది. అలానే మొదటిసారి దళిత సమాజానికి చెందిన ముగ్గురు సిట్టింగ్ జడ్జీలను ఈ ప్యానెల్ కలిగి ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తప్పనిసరిగా 65 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేయాలి.

అజిత్ మిశ్రాకు ఫ్రీడం ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ అవార్డు

భారతదేశంలో జన్మించిన ప్రముఖ న్యాయవాది అజిత్ మిశ్రాకు ప్రతిష్టాత్మకమైన " ఫ్రీడం ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ అవార్డు లభించింది. అజిత్ మిశ్రా తన న్యాయ మరియు ప్రజా జీవితంలో చేసిన విశేష కృషికి గానూ ఈ అవార్డు ఇవ్వబడింది. లండన్ గిల్డ్‌హాల్‌లో ఈ ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ అవార్డును ఆయనకు ప్రదానం చేశారు.

ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ అనేది ఇంగ్లండ్‌లోని చారిత్రాత్మక లండన్ నగరం యొక్క పాలకమండలి అయిన సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ అందించే గౌరవ పురస్కారం. ఈ నగరం లేదా దేశానికి వారి జీవితకాల విజయాలు లేదా విశిష్ట సేవలను గుర్తించి, ఒక వ్యక్తికి ఈ నగరం అందించే అత్యున్నత గౌరవాలలో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది.

జీవన్ రక్షా పదక్ సిరీస్ అవార్డ్స్-2023 ప్రధానం

2023 జీవన్ రక్షా పదక్ సిరీస్ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జనవరి 26న ప్రకటించారు. ఈ మొత్తం 31 మందికి ఈ అవార్డులు అందజేశారు. వీటిలో 3 మందికి సర్వోత్తమ్ జీవన్ రక్షా పదక్ అవార్డులు, 07 మందికి ఉత్తమ్ జీవన్ రక్షా పదక్ అవార్డులు మరియు 21 మందికి జీవన్ రక్షా పదక్‌ అవార్డులు అందజేశారు. వీరిలో ముగ్గురు అవార్డు గ్రహీతలు మరణానంతరం వీటిని అందుకున్నారు.

జీవన్ రక్షా పదక్ సిరీస్ అవార్డులు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని రక్షించడంలో మానవ స్వభావం యొక్క ప్రతిభావంతమైన చర్యకు ఇవ్వబడతాయి. ఈ అవార్డులను సర్వోత్తమ్ జీవన్ రక్షా పదక్, ఉత్తమ్ జీవన్ రక్షా పదక్ మరియు జీవన్ రక్షా పదక్ అనే మూడు విభాగాల్లో అందజేస్తారు. అన్ని రంగాల వ్యక్తులు ఈ అవార్డులకు అర్హులు. ఈ అవార్డును మరణానంతరం కూడా ప్రదానం చేస్తారు. ఈ అవార్డులు ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే, జనవరి 26న ఇవ్వబడతాయి. అవార్డుల గ్రహీతలు మెడల్, సర్టిఫికేట్ మరియు నగదు పురస్కారాన్ని అందుకుంటారు.

2023 సర్వోత్తం జీవన్ రక్ష పదక్ అవార్డు విజేతలు 
  1. మాస్టర్ ఆంథోనీ వన్మావియా (మరణానంతరం), మిజోరాం
  2. మెలోడీ లాల్‌రేమ్రుతి (మరణానంతరం), మిజోరాం
  3. సూరజ్ ఆర్ (మరణానంతరం), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్
2023 ఉత్తమ్ జీవన్ రక్షా పదక్ అవార్డు విజేతలు 
  1. సాహిల్ బిస్సో లాడ్, గోవా
  2. కాజల్ కుమారి, జార్ఖండ్
  3. నవీన్ కుమార్ డి, తెలంగాణ
  4. వినోద్ కుమార్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్
  5. హవల్దార్ షేరా రామ్, రక్షణ మంత్రిత్వ శాఖ
  6. ముఖేష్ కుమార్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్
  7. నరేష్ కుమార్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ
2023 ఉత్తమ్ జీవన్ రక్షా పదక్ అవార్డు విజేతలు 
  1. ఎంఎస్ అనిల్ కుమార్, అండమాన్ మరియు నికోబార్ దీవులు
  2. జీతం పరమేశ్వర రావు, ఆంధ్రప్రదేశ్
  3. సమర్జిత్ బసుమతరీ, అస్సాం
  4. సుదేష్ కుమార్, చండీగఢ్
  5. జస్టిన్ జార్జ్, కేరళ
  6. విల్సన్, కేరళ
  7. పద్మ థిన్లాస్, లడఖ్
  8. మొహమ్మద్ అఫ్జల్, లడఖ్
  9. ఆదికా రాజారాం పాటిల్, మహారాష్ట్రశ్రీమతి ప్రియాంక భరత్ కాలే, మహారాష్ట్ర
  10. సోనాలి సునీల్ బలోడే, మహారాష్ట్ర
  11. మరియా మైఖేల్ ఎ, తమిళనాడు
  12. ఎస్ విజయకుమార్, తమిళనాడు
  13. నరేష్ జోషి, ఉత్తరాఖండ్
  14. అర్జున్ మాలిక్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్
  15. అమిత్ కుమార్ సింగ్, సరిహద్దు భద్రతా దళం
  16. షేర్ సింగ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్
  17. సోను శర్మ, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్
  18. అబ్దుల్ హమీద్, రక్షణ మంత్రిత్వ శాఖ
  19. సునీల్ కుమార్ మిశ్రా, రక్షణ మంత్రిత్వ శాఖ
  20. శశికాంత్ కుమార్, రైల్వే మంత్రిత్వ శాఖ

Post Comment