Advertisement
డిఫెన్స్ & సెక్యూరిటీ అఫైర్స్ | జనవరి 2022
Telugu Current Affairs

డిఫెన్స్ & సెక్యూరిటీ అఫైర్స్ | జనవరి 2022

24వ  కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్‌గా వీఎస్ పఠానియా

భారత తీర రక్షక దళానికి 24వ డైరెక్టర్ జనరల్ (డిజి)గా వీరేందర్ సింగ్ పఠానియా బాధ్యతలు స్వీకరించారు. మాజీ డైరెక్టర్ జనరల్ కృష్ణస్వామి నటరాజన్ పదవీ విరమణ పొందిన తర్వాత 31 డిసెంబర్ 2021న ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. పఠానియా వెల్లింగ్‌టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ మరియు న్యూ ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీలో తన ఉన్నత విద్యను పూర్తిచేశారు. పఠానియా ఈ పదవిని చేపట్టిన మొదటి హెలికాప్టర్ పైలట్. గతంలో అతను ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క అదనపు డైరెక్టర్ జనరల్ మరియు వెస్ట్రన్ సీబోర్డ్ యొక్క కోస్ట్ గార్డ్ కమాండర్‌గా పనిచేశాడు.

కొచ్చిన్ మెట్రోకీ తొలి ఎలక్ట్రిక్ బోట్‌ను అప్పగించిన కొచ్చిన్ షిప్‌యార్డ్

కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ (కెఎంఆర్‌ఎల్) ఆధ్వర్యంలో వాటర్ మెట్రో ప్రాజెక్ట్ కోసం నిర్మిస్తున్న 23 ఎలక్ట్రిక్ బోట్‌లలో మొదటిదాన్ని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (సిఎస్‌ఎల్) అందజేసింది. షిప్‌యార్డ్‌లో జరిగిన ఈ ప్రారంభ కార్యక్రమంలో కెఎంఆర్‌ఎల్ ఎండి లోక్‌నాథ్ బెహ్రా, ఆయన సతీమణి మధుమితా బెహ్రా సమక్షంలో తొలి బోటును కెఎంఆర్‌ఎల్‌కు అందజేశారు.

బ్యాటరీతో నడిచే వాటర్ మెట్రో బోట్‌లో 100 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఈ బోట్లలో LTO బ్యాటరీలను ఉపయోగించారు, ఇది పారిశ్రామికంగా అత్యంత సురక్షితమైనది. ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో ప్రయాణికులు దిగుతున్నప్పుడు/బోర్డింగ్‌లో ఉన్నప్పుడు బ్యాటరీని 10 నుండి 15 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు.

కొచ్చి వాటర్ మెట్రో అనేది 76 రూట్ కిలోమీటర్ల పొడవుతో 38 టెర్మినల్స్ మరియు 78 బోట్‌లతో ప్రజా వాటర్ ప్రయాణ కనెక్టివిటీని మెరుగుపరచడానికి రూపొందించబడిన ఇంటిగ్రేటెడ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ మార్గం.

కల్పనా చావ్లా స్పేస్ సెంటర్‌ను ప్రారంభించిన రాజ్‌నాథ్ సింగ్

రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ జనవరి 03, 2022న చండీగఢ్ యూనివర్సిటీలో కల్పనా చావ్లా సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్పేస్ సైన్స్ & టెక్నాలజీ (KCCRSST)ని ప్రారంభించారు. ఈ సంధర్బంగా దేశంలోని అంతరిక్ష రంగాన్ని బలోపేతం చేయడంతో పాటుగా భారతదేశాన్ని జ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి దీర్ఘకాలిక ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం కోసం ఆయన పిలుపునిచ్చారు. ఇదే వేదికపై త్రివిధ దళాలకు చెందిన డిఫెన్స్ పర్సనల్ పిల్లల కోసం రూ. 10 కోట్ల విలువైన స్కాలర్‌షిప్ పథకాన్ని కూడా ప్రారంభించారు.

అస్సాం రైఫిల్స్ ఐజీగా మేజర్ జనరల్ వికాస్ లఖేరా

అస్సాం రైఫిల్స్ ( నార్త్ ) 20వ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా మేజర్ జనరల్ వికాస్ లఖేరా బాధ్యతలు స్వీకరించారు. మేజర్ జనరల్ వీపీఎస్ కౌశిక్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. వికాస్ లఖేరా1990లో సిక్కు లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌లో నియమించబడ్డాడు, ఆ తర్వాత అతను పశ్చిమ అస్సాంలో విధులు నిర్వర్తించారు. లఖేరా వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ నుండి పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. లండన్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ డిఫెన్స్ కాలేజ్ నుండి హయ్యర్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ కోర్స్ పూర్తిచేసాడు. ఉగ్రవాద కార్యకలాపాలను నిలువరించడంలో ఈయన దిట్ట.

ఇస్రో తదుపరి చైర్మన్‌గా మలయాళీ శాస్త్రవేత్త ఎస్ సోమనాథ్

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) డైరెక్టరుగా మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) నూతన చైర్మనుగా ప్రముఖ రాకెట్ శాస్త్రవేత్త ఎస్ సోమనాథ్ నియామకానికి క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. మాజీ ఇస్రో ఛైర్మెన్ కె శివన్ స్థానంలో సోమనాథ్ మూడేళ్ళ కాలానికి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇస్రో చైర్మన్, స్పేస్ సెక్రటరీ, స్పేస్ కమీషన్ చీఫ్ వంటి పదవులు ఒక్కరే నిర్వహిస్తారు.

శివన్ జనవరి 2018లో ఇస్రో చీఫ్‌గా, స్పేస్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా మరియు స్పేస్ కమిషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. 2021లో ఆయన పదివికాలం ముగియనుండగా అతనికి జనవరి 14, 2022 వరకు ఒక సంవత్సరం పొడిగింపు ఇవ్వబడింది.

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌కు సోమనాథ్ 10వ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. తిరువననాథపురంలోని వలియమలలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (LPSC) డైరెక్టర్‌గా రెండున్నర సంవత్సరాల పనిచేసిన తర్వాత జనవరి 22, 2018న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అధిపతిగా బాధ్యతలు చేపట్టారు.

భారత సైన్యం కోసం కొత్తగా క్లైమేట్ ఫ్రెండ్లీ యూనిఫాం

భారత సైన్యం కోసం సౌకర్యవంతమైన, వాతావరణ అనుకూలమైన మరియు డిజిటల్ డిస్ట్రప్టివ్ ప్యాటర్న్‌తో కూడిన కొత్త పోరాట యూనిఫామ్‌ను ఆవిష్కరించింది. కరియప్ప మైదానంలో నిర్వహించిన ఆర్మీ డే పరేడ్‌లో పారాచూట్ రెజిమెంట్‌కు చెందిన కమాండోలు కొత్త యూనిఫారాలు ధరించి పాల్గొన్నారు.

ఆలివ్ మరియు మట్టి రంగు సమ్మేళనంతో రూపొందించబడ్డ ఈ యూనిఫాం, ఆర్మీ దళాలు పనిచేసే అన్నిరకాల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండనుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీతో కలిసి వివిధ ఇతర దేశాల ఆర్మీల పోరాట యూనిఫారాలను విశ్లేషించి కొత్త యూనిఫామ్‌ను రూపొందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఢిల్లీ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకు స్కోచ్ అవార్డు

పిల్లలపై జరిగే నేరాలను మరియు హింసను నిలువరించడంలో చేసిన కృషికి ఢిల్లీ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) గవర్నెన్స్ సిల్వర్ విభాగంలో స్కోచ్ అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డును 78 స్కోచ్ సమ్మిట్‌లో అందజేశారు. 2003లో స్థాపించబడిన SKOCH (స్కోచ్) అవార్డు భారతదేశాన్ని మెరుగైన దేశంగా మార్చడానికి పాటుపడే వ్యక్తులకు, ప్రాజెక్ట్‌లకు మరియు సంస్థలకు సత్కరిస్తుంది. గత ఏడాది ఈ అవార్డును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, స్కోచ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ కేటగిరిలో అందించారు.

గురుగ్రామ్‌లో భారతదేశపు మొట్టమొదటి హెలీ-హబ్ ఏర్పాటు

హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా గురుగ్రామ్ అన్ని విమానయాన సౌకర్యాలతో కూడిన భారతదేశపు మొదటి హెలి-హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇది అన్ని రకాల హెలికాఫ్టర్లు లాండింగ్ మరియు టేక్ ఆప్ అయ్యేందుకు అనువుగా మరియు వాటి మరమ్మతు సౌకర్యాలను అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయనున్నారు.

తదుపరి ఆర్మీ వైస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే

ఇండియన్ ఆర్మీ (IA) యొక్క తదుపరి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా తూర్పు ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే నియామక ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జనవరి 31న పదవీ విరమణ చేయనున్న లెఫ్టినెంట్ జనరల్ సీపీ మొహంతి వారసుడు జనరల్ పాండే బాధ్యతలు స్వీకరించనున్నారు. మనోజ్ పాండే గతంలో ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ కు డైరెక్టర్ జనరల్'గా పనిచేసారు.

జాతీయ యుద్ధ స్మారకంలో అమర్‌ జవాన్‌ జ్యోతి విలీనం

ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద 50 ఏళ్ల పాటు నిత్యం వెలిగిన అమర్‌ జవాన్‌ జ్యోతిని, కేంద్రప్రభుత్వం జాతీయ యుద్ధ స్మారకం దగ్గరున్న జ్వాలలో విలీనం చేసింది. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వం కోసం అత్యున్నత త్యాగం చేసిన భారతీయ సైనికుల జ్ఞాపకార్థం ఇండియా గేట్​ను1921లో ఎడ్వర్డ్ లుటియన్స్ నిర్మించారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం తర్వాత అత్యున్నత త్యాగం చేసిన సైనికులకు స్మారక చిహ్నం అవసరమని భారత సాయుధ దళాలు భావించాయి.

1950లో భారతదేశం రిపబ్లిక్‌గా అవతరించి తర్వాత రాజ్‌పథ్‌లో జరిగిన కవాతులో మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారితో కలిసి పోరాడి మరణించిన భారత సైనికులకు మాత్రమే నివాళులు అర్పించారు. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం తర్వాత, స్వతంత్ర యుద్ధ స్మారక చిహ్నం కోసం పెద్ద ఎత్తున డిమాండ్​లు వచ్చాయి. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వం బంగ్లాదేశ్ దేశంగా ఎర్పడడం కోసం ప్రాణాలు అర్పించిన 3843 మంది భారత సైనికుల గౌరవార్థం ఇండియా గేట్ ఆర్చ్ కింద అమర్ జవాన్ జ్యోతిని నిర్మించారు. ఈ ఆనాటి నుండి నిర్విరామంగా ఆ జ్యోతి వెలుగుతూనే ఉంది.

ఇక జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని మోడీ రెండవసారి 30 మే 2019న ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు స్వతంత్ర భారత అమరవీరులకు నివాళులర్పించిన సందర్భంలో ప్రారంభించారు. అయితే ఈ రెండిటిని 21 జనవరి 2022న, చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ నేతృత్వంలో అమర జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధస్మారకం వద్ద ఉన్న జ్వాలలో విలీనం చేశారు. 1947 తర్వాత గాల్వాన్ ఘర్షణ వరకు తమ ప్రాణాలను త్యాగం చేసిన ప్రతి సైనికుడి పేర్లను కలిగి ఉన్న ఈ ప్రదేశంలో ఇప్పుడు మన సైనికులందరికీ గౌరవం ఇస్తున్నారు.

Post Comment