తెలుగులో 2024-25 కేంద్ర మధ్యంతర బడ్జెట్ ముఖ్యాంశాలు
Telugu Current Affairs

తెలుగులో 2024-25 కేంద్ర మధ్యంతర బడ్జెట్ ముఖ్యాంశాలు

కేంద్ర ప్రభుత్వం 2024-25 ఏడాదికి సంబంధించిన మధ్యంతర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో సమర్పించింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రెగ్యులర్ బడ్జెట్ స్థానంలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. వాస్తవానికి ఎన్నికల ఏడాదిలో ప్రభుత్వాలు తాత్కాలిక (ఓటాన్ బడ్జెట్) ప్రవేశపెడతారు, అయితే ప్రభుత్వం తిరిగి ఎన్నికలలో గెలుస్తామనే ధీమాతో దాదాపు పూర్తిస్థాయి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది.

Advertisement

ఈ బడ్జెట్ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఏ 2 ప్రభుత్వం యొక్క చిట్టచివరి బడ్జెట్. అలానే కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఆరవ బడ్జెట్ ఇది. సీతారామన్ స్వతంత్ర భారతదేశంలో వరుసగా ఆరు  బడ్జెట్‌లను సమర్పించిన మూడవ ఆర్థిక మంత్రిగా నిలిచారు. 2019 నుండి ఆమె వరుసగా ప్రవేశపెట్టిన 6వ బడ్జెట్ ఇది. అలానే ఆమె 2021లో భారతదేశ మొదటి డిజిటల్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనతను కూడా దక్కించుకున్నారు.

కేంద్ర బడ్జెట్ చరిత్ర

  • యూనియన్ బడ్జెట్ మొదటిలో భారతదేశ వార్షిక ఆర్థిక నివేదికగా సమర్పించే వారు.
  • కాలానుగుణంగా ఇది ప్రభుత్వం యొక్క ఆదాయం మరియు ఖర్చుల అంచనా రిపోర్టుగా మారింది.
  • భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం ఏటా బడ్జెట్ సమర్పించడం ప్రభుత్వం యొక్క తప్పనిసరి విధి.
  • భారతదేశపు మొదటి బడ్జెట్‌ను 1860 ఫిబ్రవరి 18న స్కాట్‌లాండ్‌కు చెందిన జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టారు.
  • స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి యూనియన్ బడ్జెట్‌ను 26 నవంబర్ 1947న ఆర్కే షణ్ముఖం చెట్టి సమర్పించారు.
  • అయితే రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క మొదటి బడ్జెట్‌ను జాన్ మథాయ్ ఫిబ్రవరి 28 , 1950న సమర్పించారు.
  • 1999 సంవత్సరం వరకు కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి నెల చివరి పని దినం సాయంత్రం 5:00 గంటలకు ప్రకటించబడేది.
  • 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వంలో ఉదయం 11 గంటలకు ప్రకటించడం ద్వారా ఈ ఆచారాన్ని మార్చింది.
  • 2017లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం బడ్జెట్ ప్రకటన తేదీని ఫిబ్రవరి నెల చివరి పని దినం నుండి ఫిబ్రవరి 1వ తేదికి మార్చింది.
  • భారత ప్రభుత్వం 1947 నుండి ఇప్పటి వరకు మొత్తం 73 వార్షిక బడ్జెట్‌లు, 14 మధ్యంతర బడ్జెట్‌లు మరియు నాలుగు ప్రత్యేక బడ్జెట్‌లు ప్రవేశపెట్టింది.
  • వరుసగా 92 సంవత్సరాల పాటు విడిగా సమర్పించబడిన రైలు బడ్జెట్ 2016లో కేంద్ర బడ్జెట్‌లో విలీనం చేయబడింది.
  • ప్రధాని మోడీ ప్రభుత్వం 21 సెప్టెంబర్ 2016 న రైల్వే మరియు సాధారణ బడ్జెట్‌ల విలీనాన్ని ఆమోదించింది.
  • కేంద్ర బడ్జెట్ ప్రత్యక్ష ప్రసారం నేషనల్ డీడీ, డీడీ న్యూస్ మరియు సంసద్ టీవీ ద్వారా ప్రసారం చేయబడుతుంది.
  • ఆర్థిక మంత్రులు 2018 వరకు సంప్రదాయంలో భాగంగా లెదర్ బ్రీఫ్‌కేస్‌లో బడ్జెట్‌ను పెట్టి సభలోకి ప్రవేశించేవారు.
  • ఈ సంప్రదాయాన్ని భారతదేశ మొదటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం చెట్టి ద్వారా మొదలైంది.
  • అయితే 2019లో ప్రస్తుత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, బహీ-ఖాతాలో బడ్జెట్‌ను మోయడం ద్వారా ఈ సంప్రదాయానికి ముగింపు పలికారు.
  • నిర్మలా సీతారామన్ 1 ఫిబ్రవరి 2021న మొదటి పేపర్‌లెస్ బడ్జెట్‌ను సమర్పించిన ఆర్దికమంత్రిగా నిలిచారు.
  • సాంప్రదాయం ప్రకారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి నుండి ఆమోదం పొందాల్సి ఉంటుంది.
  • ఈ ఆమోదం కోసం బడ్జెట్ ప్రకటన రోజు ఆర్థిక మంత్రి రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతిని కలుస్తారు.
  • జవహర్‌లాల్ నెహ్రూ 1958లో ప్రధాని హోదాలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి ఆర్థిక మంత్రిగా నిలిచారు
  • స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యధిక సంఖ్యలో 10 కేంద్ర బడ్జెట్‌లను సమర్పించిన ఘనత మొరార్జీ దేశాయ్ పేరిట ఉంది.
  • మొరార్జీ దేశాయ్ ఆర్దికమంత్రిగా ఎనిమిది వార్షిక మరియు రెండు మధ్యంతర బడ్జెట్‌లను సమర్పించారు.
  • మొరార్జీ దేశాయ్ 29 ఫిబ్రవరి 1964 మరియు 1968లలో తన పుట్టినరోజున కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన ఏకైక ఆర్థిక మంత్రిగా నిలిచారు.
  • భారత ఆర్థిక మంత్రి పదవిని నిర్వహించిన మొదటి మహిళగా ఇందిరా గాంధీ నిలిచారు, ఈమె భారత మొదటి మహిళా ప్రధానిగా కూడా సేవలు అందించారు.
  • 1970లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి మహిళా ఆర్దికమంత్రిగా, రెండవ ప్రధానిగా ఇందిరా గాంధీ నిలిచారు.
  • సిడి దేశ్‌ముఖ్ వరుసగా 7 కేంద్ర బడ్జెట్‌లు సమర్పించిన ఆర్దికమంత్రిగా ఉన్నారు.

అత్యధిక కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రులు

  1. మొరార్జీ దేశాయ్ 10 బడ్జెట్‌లు సమర్పించారు
  2. పి చిదంబరం 9 బడ్జెట్‌లు సమర్పించారు
  3. ప్రణబ్ ముఖర్జీ 8 బడ్జెట్‌లు సమర్పించారు
  4. సిడి దేశ్‌ముఖ్  7 బడ్జెట్‌లు సమర్పించారు
  5. నిర్మల సీతారామన్ 6 బడ్జెట్‌లు సమర్పించారు
  6. మన్మోహన్ సింగ్ 5 బడ్జెట్‌లు సమర్పించారు
  7. యశ్వంత్ సిన్హా 5 బడ్జెట్‌లు సమర్పించారు
  8. అరుణ్ జైట్లీ 5 బడ్జెట్‌లు సమర్పించారు

కేంద్ర బడ్జెట్ 2024-25 ముఖ్యాంశాలు

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్‌సభలో 2024 మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మునుపటి మూడు పూర్తి యూనియన్ బడ్జెట్‌ల మాదిరిగానే, మధ్యంతర బడ్జెట్ 2024 కూడా ఆమె పేపర్‌లెస్ రూపంలో ప్రవేశపెట్టారు. ఇది కొత్త పార్లమెంట్ భవనంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్నికైన తర్వాత పూర్తి కేంద్ర బడ్జెట్‌ సమర్పించబడుతుంది.

ఈ మధ్యంతర బడ్జెట్ 2024 సబ్కా సాథ్, సబ్కా వికాస్, మరియు సబ్కా విశ్వాస్' అనే నినాదంతో దేశం మొత్తం (సబ్కా ప్రయాస్) ప్రయోజనం పొందేలా రూపొందించినట్లు తెలిపారు. ఈ బడ్జెట్ ప్రధాని మోడీ ఆలోచన మేరకు దేశంలోనాలుగు ప్రధాన కులాలు అయినా గరీబ్ (పేద), మహిళాయెన్ (మహిళలు), యువ (యువత) మరియు అన్నదాత (రైతు) అభ్యున్నతిపై దృష్టి సారించినట్లు ఆమె పేర్కొన్నారు. అదే సమయంలో ఈ బడ్జెట్ ద్వారా దేశంలో ఆర్థిక ఏకీకరణను కొనసాగించేస్తున్నట్లు పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం పేదలు, మహిళలు, యువత, రైతుల అవసరాలు, వారి ఆకాంక్షలు మరియు వారి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, వారు అభివృద్ధి చెందినప్పుడే దేశం పురోగమిస్తుందని పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని 'విక్షిత్ భారత్'గా మార్చడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి, ప్రజల సామర్థ్యాన్ని మెరుగుపరచి, వారికి సాధికారత కల్పించాలని ఆమె అన్నారు.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కేవలం 56 నిమిషాల్లో ఈ బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. 2020లో 2.40 గంటల పాటు సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసిన ఆమె, ఆ తరువాత ఏటా తన ప్రసంగాన్ని కుదించుకుంటూ వస్తున్నారు. ఈ బడ్జెట్ ప్రసంగంలో సుమారు ఎనిమిదిసార్లు ఆమె మోదీ ప్రసంగాల నుంచి కొన్ని మాటలను ఉటంకించారు. ఎఫ్ఐ, జీడీపీలకు నిర్మల కొత్త నిర్వ చనం ఇచ్చారు. ఎఫ్ఐ అంటే ఫస్ట్ డెవలప్ ఇండియా (ముందుగా భారత అభి వృద్ధి) అని, జీడీపీ అంటే గవర్నెన్స్, డెవలప్మెంట్, పర్ఫార్మెన్స్ (పరిపాలన, పురోగతి, పనితీరు) అని పేర్కొన్నారు.

గత పదేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలు

  • 10 సంవత్సరాలలో 'సబ్కాకాసాత్' సాధనతో ప్రభుత్వం 25 కోట్ల మంది ప్రజలకు పేదరికం నుండి విముక్తి పొందేందుకు సహాయం చేసింది .
  • ఎంట్రప్రెన్యూర్ ఆకాంక్షల కోసం పీఎం ముద్రా యోజన కింద మొత్తం 22.5 లక్షల కోట్ల రూపాయలతో 43 కోట్ల రుణాలను మంజూరు చేసింది.
  • ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన ద్వారా 38 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చింది, 10 లక్షల మందికి ఉపాధిని కల్పించింది.
  • మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ యోజన యొక్క ప్రధాన్ మంత్రి ఫార్మలైజేషన్ 2.4 లక్షల స్వయం సహాయక బృందాలకు మరియు క్రెడిట్ లింకేజీలు కలిగిన అరవై వేల మంది వ్యక్తులకు సహాయం అందించారు.
  • ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీన్) కింద దేశంలో ఇప్పటికే మూడు కోట్ల ఇళ్లు నిర్మించినట్లు పేర్కొన్నారు.
  • ప్రధానమంత్రి-జన్ ధన్ ఖాతాల్లోకి 34 లక్షల కోట్ల రూపాయల 'డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్' చేయడం ద్వారా గత పదేళ్లలో ప్రభుత్వానికి 2.7 లక్షల కోట్ల రూపాయలు ఆదా చేయబడింది.
  • పీఎం-స్వానిధి పథకం ద్వారా 78 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణ సహాయం అందించారు.
  • పీఎం విశ్వకర్మ యోజన 18 వ్యాపారాలలో నిమగ్నమై ఉన్న చేతివృత్తుల వారికి మరియు కళాకారులకు ఎండ్-టు-ఎండ్ మద్దతును అందిస్తుంది.
  • పీఎం-జనమన్ యోజన కింద అభివృద్ధికి నోచుకోని బలహీన గిరిజన సమూహాలకు ఆరోగ్యం, విద్య, జీవనోపాధిలో అంతరాలను తగ్గించి వారి సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరచడం లక్ష్యంగా పనిచేసింది.
  • పీఎం-కిసాన్ సమ్మాన్ యోజన గత పదేళ్లలో 11.8 కోట్ల మంది రైతులకు ఆర్థిక సహాయం అందించింది.
  • ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 4 కోట్ల మంది రైతులకు పంటల బీమా అందించారు.
  • ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఇ-నామ్) కింద 1361 మండీలను ఏకీకృతం చేసింది. ఇది ప్రస్తుతం 1.8 కోట్ల మంది రైతులకు రూ. 3 లక్షల కోట్ల వ్యాపార పరిమాణంతో సేవలను అందిస్తోంది.
  • గత పదేళ్లలో మహిళా పారిశ్రామికవేత్తలకు 30 కోట్ల ముద్రా యోజన రుణాలు మంజూరు చేయబడ్డాయి.
  • గత పదేళ్లలో ఉన్నత విద్యలో మహిళల నమోదు 28% పెరిగింది.
  • సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్ కోర్సులలో మహిళల నమోదు 43 శాతం పెరిగింది.
  • ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 70% పైగా ఇళ్లు గ్రామీణ ప్రాంతాల మహిళలకు అందించబడ్డాయి.
  • గత పదేళ్లలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు అయి 149కి చేరుకుంది.
  • దాదాపు 517 కొత్త రూట్లలో 1.3 కోట్ల మంది ప్రయాణికులు ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్నారు.
  • స్కిల్ ఇండియా మిషన్ కింద 1.4 కోట్ల మంది యువత శిక్షణ పొందారు.
  • 83 లక్షల స్వయం సహాయక సంఘాలులోని 1 కోటి మహిళలు లఖపతి దీదీలుగా మార్చబడ్డారు.
  • ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన కింద 10 కోట్ల నిరుపేద మహిళకు గ్యాస్ కనెక్షన్లు అందించారు.
  • ఎల్‌ఈడీ ఫర్ ఆల్ (ఉజాలా) చొరవ ద్వారా ప్రభుత్వం 36.8 కోట్ల ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేసింది.
  • స్ట్రీట్ లైటింగ్ నేషనల్ ప్రోగ్రామ్ కింద భారతదేశం అంతటా సుమారు 1. 3 కోట్ల ఎల్‌ఈడీ వీధిలైట్లు ఏర్పాటు చేయబడ్డాయి.

2024-25 కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు & లక్ష్యాలు

1. పీఎం సూర్యోదయ యోజన

  • కేంద్ర ప్రభుత్వం కొత్తగా గృహ విద్యుత్తు వినియోగానికి సంబందించి 'ప్రధానమంత్రి సూర్యోదయ యోజన' పేరిట సరికొత్త పథకాన్ని ప్రకటించింది.
  • ఇందులో భాగంగా ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్‌ చేసుకున్న వారికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది.
  • ఈ పథకం ద్వారా 10 మిలియన్ల కుటుంబాలు తమ మిగులు సౌరశక్తిని విక్రయించుకోవచ్చని ఆమె హైలైట్ చేశారు.
  • ఇది ఈ కుటుంబాలకు ఏడాదికి ₹ 15,000 నుండి ₹ 18,000 మధ్య వార్షిక పొదుపును అందజేస్తుందని వెల్లడించారు.

జనవరి 22న ఆయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రధాని మోదీ ఈ పధకాన్ని ప్రకటించారు. ఈ సోలార్ సిస్టమ్ ఏర్పాటు ద్వారా సంబంధిత రంగంలో వ్యాపార అవకాశాలు పెరుగుతాయని, వీటి తయారీ, సరఫరా, ఇన్‌స్టాలేషన్‌ నిర్వహణతో పెద్ద సంఖ్యలో యువతకు ఉపాధి లభించనుంది. దీని కింద ఏడాదిలోగా దేశంలో కోటి ఇళ్లకు రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్‌ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

2. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్

  • ప్రభుత్వం 1 GW ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) అందించనున్నట్లు 2024 మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించింది.
  • భారతదేశంలో ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ అభివృద్ధిని ఎదుర్కొంటున్న కీలక సవాళ్లలో ఒకదానిని పరిష్కరించడానికి ఇది ఒక ముఖ్యమైన పరిణామం.
  • ఇది విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లలో మరింత పెట్టుబడిని ఆకర్షించడానికి సహాయపడుతుంది. తద్వారా దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి వీలు కల్పిస్తుంది.

3. బొగ్గు గ్యాసిఫికేషన్

  • 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ మరియు ద్రవీకరణ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
  • ఇది చమురు వంటి దిగుమతి చేసుకునె శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది, తద్వారా దేశ శక్తి భద్రతను పెంచుతుంది.
  • అలానే ఈ ప్రక్రియ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను మరియు వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది.
  • గ్యాసిఫికేషన్ విలువైన సింగస్‌ను ఉత్పత్తి చేస్తుంది, వీటిని విద్యుత్ ఉత్పత్తి, రసాయనాల ఉత్పత్తి మరియు హైడ్రోజన్ ఇంధనం కోసం ఉపయోగించవచ్చు.
  • ద్రవీకరణ గ్యాసోలిన్ మరియు డీజిల్ వంటి సింథటిక్ ఇంధనాలను కూడా ఉత్పత్తి చేస్తుంది.

4. సీబీజీ బ్లెండింగ్ ఆబ్లిగేషన్

  • ఈ ఆర్థిక సంవత్సరంలో సీబీజీ బ్లెండింగ్ ఆబ్లిగేషన్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
  • భారత ప్రభుత్వం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) మరియు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) తో కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ)ని దశలవారీగా తప్పనిసరిగా కలపాలని ప్రకటించింది.
  • ఈ నిర్ణయం పునరుత్పాదక శక్తి వనరు అయిన సీబీజీ వినియోగాన్ని పెంచడం మరియు శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది.
  • వాహనాలు మరియు గృహ సరఫరాలకు ఇంధనంగా ఉపయోగించే సహజ వాయువుతో సిబిజిని దశలవారీగా కలపడం తప్పనిసరి కానుంది.
  • బయోమాస్‌ సేకరణకు మద్దతుగా బయోమాస్ అగ్రిగేషన్ యంత్రాల సేకరణకు ఆర్థిక సహాయం అందించనున్నారు.
  • గ్రీన్‌ గ్రోత్‌ను ప్రోత్సహించేందుకు బయో మాన్యుఫ్యాక్చరింగ్‌, బయో ఫౌండ్రీ అనే కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

దేశంలో ఛార్జింగ్ మరియు తయారీ మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల పర్యావరణ వ్యవస్థను విస్తరించేందుకు ప్రణాళిక చేస్తుంది. ఇందులో భాగంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్‌ల కోసం ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని ప్రోత్సహిస్తామని పేర్కొంది.

5. రైల్వే కారిడార్ కార్యక్రమాలు

  • అమృత్ కాల్ వ్యూహంలో భాగంగా ప్రధానమంత్రి గతి శక్తి కింద మూడు ప్రధాన ఆర్థిక రైల్వే కారిడార్ కార్యక్రమాలు ప్రభుత్వం ప్రకటించింది.
  • ఇందులో మొదటిది ఎనర్జీ, మినరల్ మరియు సిమెంట్ కారిడార్లు.
  • ఈ కారిడార్ రోడ్ల కాలుష్యాన్ని తగ్గించడంతో సహా, లాజిస్టిక్స్ ధరను తగ్గించడంలో సహాయపడుతుంది.
  • రెండవది పోర్ట్ కనెక్టివిటీ, ఇది మల్టీమోడల్ 'గతి శక్తి' మార్గంలో రైల్వేల ద్వారా పోర్టులకు అతుకులు లేని కనెక్టివిటీని అందిస్తుంది.
  • మూడవది 'అమృత్ చతుర్భుజ్', ఇది అధిక సాంద్రత కలిగిన ట్రాఫిక్ మార్గాలలో బంగారు చతుర్భుజం లేదా రైల్వే నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది.
  • ఈ కారిడార్లు దేశవ్యాప్తంగా ఇంధన వనరులు (బొగ్గు, ఖనిజాలు) మరియు సిమెంట్ రవాణా కోసం ప్రత్యేక సరుకు రవాణా కారిడార్‌ల అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది.
  • ఈ ప్రకటన ఇప్పటికే ఉన్న రైలు మార్గాల రద్దీని తగ్గించడంతో సహా వస్తు రవాణా కోసం రోడ్డు రవాణాపై ఆధారపడటాన్ని తగ్గించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ 3 కారిడార్ల ద్వారా సుమారు 40,000 కి.మీ కొత్త ట్రాక్ వేయబడుతుంది. ఇది రైల్వే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది మరియు కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. వీటితో పాటుగా వందే భారత్ మరియు అమృత్ భారత్ ట్రైన్ల విజయ తర్వాత ఇప్పుడు 40,000 సాంప్రదాయ రైల్వే కోచ్‌లను అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.

గత పదేళ్లలో భారత రైల్వే వ్యవస్థలో 26,000 కిమీ కొత్త ట్రాక్ అభివృద్ధి చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రైల్వే భద్రతా వ్యవస్థలో 1,08,000 కోట్లు పెట్టుబడి పెట్టబడి పెట్టినట్లు వెల్లడించింది. తాజా బడ్జెట్ యందు రైల్వే రంగానికి 2,52,000 కోట్ల మూలధన వ్యయం ప్రకటించింది.

6. ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి

  • ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాల చర్చల ద్వారా విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం కోసం ప్రణాళిక చేస్తుంది.
  • విదేశీ పెట్టుబడిదారుల కోసం స్పష్టమైన చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతుంది.
  • అలానే ఉడాన్ పథకంలో భాగంగా ప్రస్తుత విమానాశ్రయాల విస్తరణ మరియు కొత్త విమానాశ్రయాల స్థాపనపై దృష్టి సారిస్తున్నట్లు ప్రకటించింది.
  • కొత్తగా భారతీయ క్యారియర్లు 1000 కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చినట్లు తెలిపింది.
  • మెట్రో రైలు మరియు నమో భారత్ కార్యక్రమాల అమలు ద్వారా పట్టణ పునరుద్ధరణ పురోగతికి ప్రయత్నిస్తుంది.
  • మెట్రో రైలు మరియు నమో భారత్ రెండూ వరుసగా ఇంట్రా-సిటీ మరియు ఇంటర్-సిటీ కనెక్టివిటీని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
  • ఇది ప్రయాణ సమయం, రద్దీ మరియు కాలుష్యాన్ని తగ్గిస్తుంది, ఇవి ప్రజా రవాణా ప్రాప్యత మరియు మొత్తం చలనశీలతను మెరుగుపరుస్తుంది.
  • అలానే ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం, ఉపాధి కల్పనతో సహా రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
  • 2018లో ప్రారంభించబడిన ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం, భారతదేశం అంతటా అభివృద్ధి చెందని 112 జిల్లాల అభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
  • ఈ కార్యక్రమం 5 నేపథ్య రంగాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఇందులో ఆరోగ్యం & పోషకాహారం, విద్య, వ్యవసాయం & జలవనరులు, ఆర్థిక చేరిక & నైపుణ్యాభివృద్ధి, మరియు ప్రాథమిక మౌలిక సదుపాయాలు ఉన్నాయి.
  • ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు ఉపాధి కల్పన కోసం ఈ బడ్జెట్ యందు మూలధన వ్యయం 11.1 శాతం పెంచి 11.1 లక్షల కోట్లు కేటాయించింది. ఇది భారత జీడీపీలో 3.4 శాతం విలువకు సమానం.

7. మహిళల ఆరోగ్యం

  • ప్రభుత్వం ఈ బడ్జెట్ యందు మహిళల ఆరోగ్యంకు ఎక్కువ ప్రాధన్యత కల్పించింది.
  • 9-14 సంవత్సరాల వయస్సు గల బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ క్యాన్సర్) వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించడం కోసం సిద్దమవుతుంది.
  • మెరుగైన పోషకాహార పంపిణీ మరియు బాల్య సంరక్షణ కోసం సక్షం అంగన్‌వాడీ మరియు పోషణ్ 2.0 కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు ప్రణాళిక చేస్తుంది.
  • మిషన్ ఇంద్రధనుష్ కింద ఇమ్యునైజేషన్ ప్రయత్నాలను నిర్వహించడానికి యూ-విన్ అనే డిజిటల్ ప్లాట్‌ఫారమ్ అందుబాటులోకి తెస్తుంది.
  • యూ-విన్ అంటే యూనివర్సల్ ప్లాట్‌ఫారమ్ ఫర్ వుమన్ అండ్ చైల్డ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ అని అర్ధం.
  • ఇది ఇమ్యునైజేషన్ డేటాను సమర్థవంతంగా నిర్వహించడానికి రూపొందించబడిన డిజిటల్ వేదిక.
  • ఇది దేశంలో ఇమ్యునైజేషన్ కవరేజీని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

అలానే ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు మరియు సహాయకులందరికీ ఆరోగ్య కవరేజీని పొడిగించే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. దీని కింద ఏటా కుటుంబానికి రూ. 5 లక్షల వరకు ఆరోగ్య కవరేజీని అందిస్తుంది. ఇది 3 మిలియన్లకు పైగా వర్కర్లకు ఆరోగ్య బీమా అందిస్తుంది. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం ఇప్పటికే 10 కోట్లకు పైగా పేద మరియు బలహీన కుటుంబాలను కవర్ చేస్తుంది.

8. పీఎం ఆవాస్ యోజన

  • ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్) ద్వారా ఇప్పటికే 3 కోట్ల ఇళ్ల లక్ష్యాన్ని చేరుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
  • వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల అదనపు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు కూడా వెల్లడించింది.
  • గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం మరియు వారికి సురక్షితమైన గృహాలకు ప్రాప్యతను అందించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపింది.
  • అలానే మధ్యతరగతి వ్యక్తులు వారి స్వంత గృహాలను కొనుగోలు చేయడానికి లేదా నిర్మించుకోవడానికి కొత్తగా మరో గృహనిర్మాణ పథకంను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొంది.
  • ఈ పథకం అద్దె ఇళ్లు, మురికివాడలు లేదా అనధికార కాలనీల్లో నివసిస్తున్న వ్యక్తులు మరియు కుటుంబాలను లక్ష్యంగా చేసుకోనుంది.
  • ఈ పథకం గృహ రుణాలపై వడ్డీ రేటు రాయితీలు, పన్ను మినహాయింపులు మరియు ఇతర ప్రయోజనాల రూపంలో ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

9. పర్యాటక ప్రోత్సహం

  • కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి విక్షిత్ భారత్ విజన్‌ను సాధించేందుకు పర్యాటక కేంద్రాల సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది.
  • ఇందులో భాగంగా ఐకానిక్ టూరిస్ట్ కేంద్రాల సమగ్ర అభివృద్ధి, ప్రపంచ స్థాయిలో బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ చేసేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తామని పేర్కొంది.
  • మ్యాచింగ్ ప్రాతిపదికన ఇటువంటి అభివృద్ధికి ఆర్థిక సహాయం చేయడానికి రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాలు అందించేందుకు సిద్ధమవుతున్నారు.
  • దీని కోసం రాష్ట్రాలకు ₹ 75,000 కోట్లు కేటాయించారు.
  • ఇందులో భాగంగా కేంద్రాల సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించేందుకు, సౌకర్యాలు మరియు సేవల నాణ్యత ఆధారంగా ఈ కేంద్రాల రేటింగ్ కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది.
  • దేశీయ పర్యాటకంను ప్రోత్సహించేందుకు స్థానిక వ్యవస్థాపకతకు అద్భుతమైన అవకాశాలను అందించనుంది.

లక్షద్వీప్‌తో సహా మిగతా దీవులలో పోర్ట్ కనెక్టివిటీ, టూరిజం మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాల కోసం కొత్త ప్రాజెక్టులు చేపట్టబడుతుంన్నట్లు పేర్కొంది. ఇది ఉపాధిని సృష్టించడంలో సహా, దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది పేర్కొంది.

అలానే మాల్దీవులకు ఆర్థిక సహాయంలో 22% కోతను ప్రభుత్వం ప్రతిపాదించింది. తాజాగా రెండు దేశాల మధ్య నెలకొన్న కొన్ని దౌత్యపరమైన ఉద్రిక్తతలు దీనికి కారణం కావొచ్చు. 2023 బడ్జెట్‌లో మాల్దీవులకు భారత్ మొదట రూ. 400 కోట్లు కేటాయించగా, ఆ తర్వాత 770. 90 కోట్లకు సవరించింది. అయితే తాజా బడ్జెట్ యందు 600 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇది దాదాపు గత ఏడాది కంటే 170 కోట్లు తక్కువగా ఉంది.

భూటాన్ మరియు నేపాల్ దేశాలు భారత ప్రభుత్వ గ్రాంట్లలో మొదటి రెండు గ్రహీతలాగా ఉన్నాయి. అభివృద్ధి సహాయం కోసం భూటాన్ దేశానికి ఈ ఏడాది 2068.56 కోట్లు కేటాయించగా, నేపాల్ దేశానికి 700 కోట్లు కేటాయించింది. అయితే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ మరియు లాటిన్ అమెరికా దేశాలతో సహా అనేక ఇతర దేశాలకు ఈ ఏడాది కేటాయింపులు తగ్గించింది.

10. అగ్రికల్చర్ & ఫుడ్ ప్రాసెసింగ్

  • ప్రభుత్వం వ్యవసాయం అనంతర కార్యకలాపాలలో ప్రైవేట్ మరియు ప్రభుత్వ పెట్టుబడులను ప్రోత్సహించాలని యోచిస్తోంది.
  • సరైన మౌలిక సదుపాయాలు, నిల్వ సౌకర్యాలు మరియు ప్రాసెసింగ్ సామర్థ్యాలు లేని కారణంగా భారతదేశం పంట అనంతర నష్టాలను చవిచూస్తోంది. తాజా చొరవ ఈ సమస్యను పరిష్కరిస్తుంది.
  • వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేయడం మరియు ప్యాకేజింగ్ చేయడం వల్ల వాటికి విలువను జోడించడంతో పాటు వాటి షెల్ఫ్ జీవితాన్ని పెంచడం వల్ల రైతులకు అధిక లాభాలు మరియు ఉద్యోగ అవకాశాలను సృష్టించడం జరుగుతుంది.
  • కోల్డ్ చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు లాజిస్టిక్స్‌లో పెట్టుబడులు రైతులను విస్తృత మార్కెట్‌లకు అనుసంధానించగలవు, ఇది మంచి ధరలకు మరియు పెద్ద వినియోగదారుల స్థావరాల ప్రాప్యతకు దారి తీస్తుంది.
  • ఈ ఏడాది దేశంలోని అన్ని ఆగ్రో-క్లైమాటిక్ జోన్‌లలో వివిధ పంటలపై నానో డిఎపి (డి-అమ్మోనియం ఫాస్ఫేట్)ని ఎరువులుగా విస్తరింపజేస్తున్నట్లు ప్రకటించింది.
  • ఆవాలు, వేరుశెనగ, నువ్వులు, సోయాబీన్ మరియు పొద్దుతిరుగుడు వంటి నూనె గింజల కోసం 'ఆత్మనిర్భర్త' సాధించడానికి ఒక వ్యూహాన్ని రూపొందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
  • దీని ద్వారా దిగుమతి చేసుకునె ఆహార నూనెలపై భారతదేశం ఆధారపడటాన్ని తగ్గించడానికి ఒక సానుకూల అడుగు.

డెయిరీ పరిశ్రమ అభివృద్ధికి సమగ్ర కార్యక్రమం రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీని కింద ఆక్వాకల్చర్ ఉత్పాదకతను హెక్టారుకు 3 నుండి 5 టన్నులకు పెంచే లక్ష్యం పెట్టుకుంది. ఈ ఏడాది ఆక్వా ఎగుమతులు 1 లక్ష కోట్లకు పెంచేందుకు ప్రణాళిక చేస్తుంది. దీని ద్వారా సమీప భవిష్యత్తులో 55 లక్షల ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తుంది.

బ్లూ ఎకానమీ 2.0 కోసం వాతావరణ స్థితిస్థాపక కార్యకలాపాలను ప్రోత్సహించడం కోసం, పునరుద్ధరణ మరియు అనుసరణ చర్యల కోసం ఒక పథకం రూపొందిస్తున్నట్లు పేర్కొంది. అలానే ప్రభుత్వం దేశంలో కొత్తగా 5 ఇంటిగ్రేటెడ్ ఆక్వాపార్క్‌ల ఏర్పాటును ప్రకటించింది.

11. పన్ను సంస్కరణల విజయాలు

గత పదేళ్లలో దేశంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడు రెట్లు పెరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలానే దేశంలో ఐటీ రిటర్న్ దాఖలు చేసేవారి సంఖ్య 2.4 రెట్లు పెరిగినట్లు పేర్కొంది. నవీకరించబడిన ఆదాయపు పన్ను రిటర్న్‌లను ప్రవేశపెట్టడం ద్వారా 2013-14 సంవత్సరంలో సగటు రిటర్నుల ప్రాసెసింగ్ సమయం 93 రోజుల నుండి ప్రస్తుతం కేవలం పది రోజులకు తగ్గినట్లు తెలిపారు. కొత్త ఫారమ్ 26ఏఎస్ మరియు పన్ను రిటర్న్‌లను ముందస్తుగా పూరించడం వల్ల పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం సులభతరం చేసిందని, తద్వారా వాపసు వేగంగా జరుగుతుందని తెలిపారు.

గత ఐదేళ్లలో పన్ను చెల్లింపుదారుల సేవలను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ మరియు అప్పీల్‌ను ప్రవేశపెట్టడం ద్వారా పురాతన అధికార పరిధి-ఆధారిత మూల్యాంకన వ్యవస్థ రూపాంతరం చెంది, తద్వారా ఎక్కువ సామర్థ్యం, ​​పారదర్శకత మరియు జవాబుదారీతనం అందించబడుతుందని పేర్కొంది.

2023-24 ఆర్థిక సంవత్సరంలో సగటు నెలవారీ స్థూల జీఎస్టీ వసూళ్లు ₹1.66 లక్షల కోట్లకు రెట్టింపు అయినట్లు పేర్కొంది. రిటైల్ వ్యాపారాల కోసం ఊహాజనిత పన్నుల థ్రెషోల్డ్ ₹ 2 కోట్ల నుండి ₹ 3 కోట్లకు పెంచింది. అదేవిధంగా, ప్రిస్క్రిప్టివ్ టాక్సేషన్‌కు అర్హులైన నిపుణుల థ్రెషోల్డ్ ₹ 50 లక్షల నుండి ₹ 75 లక్షలకు పెంచింది. అలాగే, ప్రస్తుత దేశీయ కంపెనీలకు కార్పొరేట్ పన్ను రేటు 30 శాతం నుంచి 22 శాతానికి మరియు కొన్ని కొత్త తయారీ కంపెనీలకు 15 శాతానికి తగ్గించింది.

2012-16లో 0.72గా ఉన్న రాష్ట్ర ఆదాయపు పన్ను చెల్లింపు 2017-23 జీఎస్‌టీ అనంతర కాలంలో 1.22కి పెరిగినట్లు పేర్కొంది. 2019 నుండి భారతదేశంలోని వివిధ ఎంట్రీ పాయింట్లలో దిగుమతి విడుదల సమయంలో గణనీయమైన క్షీణత నమోదు అయ్యినట్లు ప్రభుత్వం పేర్కొంది. అలానే దేశీయ దిగుమతులకు సంబంధించి ఇన్వెంటరీ హోల్డింగ్ ఖర్చులు భారీగా తగ్గినట్లు తెలిపింది. ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోలలో 47% తగ్గింపు, ఎయిర్ కార్గో కాంప్లెక్స్‌లలో 28% తగ్గింపు, సీ పోర్ట్స్ వద్ద 27% దిగుమతి విడుదల సమయం తగ్గింపు ఉన్నట్లు తెలిపింది.

స్టార్టప్‌లు మరియు సావరిన్ వెల్త్ ఫండ్స్/పెన్షన్ ఫండ్‌లు మరియు గిఫ్ట్ సిటీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ)లో ఉన్న నిర్దిష్ట పెట్టుబడి యూనిట్‌లకు అందించే పన్ను ప్రయోజనాన్ని మార్చి 31, 2025 వరకు ఒక సంవత్సరం పొడిగించినట్లు ప్రకటించింది.

2010 ఆర్థిక సంవత్సరం వరకు రూ. 25,000 మరియు 2011-15 వరకు రూ. 10,000 ఉన్న పాత వివాదాస్పద ప్రత్యక్ష పన్ను డిమాండ్లను ఉపసంహరించుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ముఖ్యమైన ప్రకటన 1 కోటి మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూర్చుతుంది.

పన్నులకు సంబంధించి ఎటువంటి మార్పులను ప్రభుత్వం ప్రతిపాదించలేదు. దిగుమతి సుంకాలతో సహా ప్రత్యక్ష పన్నులు మరియు పరోక్ష పన్నులకు ఒకే పన్ను రేట్లను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త పన్ను పథకం కింద రూ. 7 లక్షల వరకు ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులకు ఎటువంటి పన్ను బాధ్యతలు లేవని ప్రభుత్వం ప్రకటించింది.

2024లో మంత్రిత్వ శాఖలకు బడ్జెట్ కేటాయింపులు

క్ర.స మంత్రిత్వ శాఖలు ₹ లక్ష కోట్లలో
1. రక్షణ మంత్రిత్వ శాఖ 6.2 లక్షల కోట్లు
2. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ 2.78 లక్షల కోట్లు
3. రైల్వే మంత్రిత్వ శాఖ 2.55 లక్షల కోట్లు
4. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం & ప్రజా పంపిణీ 2.13 లక్షల కోట్లు
5. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2.03 లక్షల కోట్లు
6. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 1.77 లక్షల కోట్లు
7. రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ 1.68 లక్షల కోట్లు
8. కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ 1.37 లక్షల కోట్లు
9. వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ 1.27 లక్షల కోట్లు

2024 ప్రధాన పథకాలకు బడ్జెట్ కేటాయింపులు

ప్రధాన పథకాలు 2023 బడ్జెట్ 2024 బడ్జెట్
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 60,000 కోట్లు 86,000 కోట్లు
ఆయుష్మాన్ భారత్ 7200 కోట్లు 7500 కోట్లు
ఉత్పత్తి లింక్డ్ ప్రోత్సాహక పథకం 4,645 కోట్లు 6,200 కోట్లు
సెమీకండక్టర్స్ మరియు డిస్‌ప్లే మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ అభివృద్ధి కోసం సవరించిన ప్రోగ్రామ్ 3,000 కోట్లు 6,903 కోట్లు
సోలార్ పవర్ (గ్రిడ్) 4,970 కోట్లు 8,500 కోట్లు
నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 297 కోట్లు 600 కోట్లు

2024-25 ఆర్థిక ఏడాదిలో ప్రభుత్వ ఆదాయం అంచనా

పన్ను విభాగం రాబడి శాతం
రుణాలు మరియు ఇతరలు 28 శాతం
ఆదాయ పన్ను 19 శాతం
జీఎస్టీ మరియు ఇతర పన్నులు 18 శాతం
కార్పొరేషన్ పన్ను 17 శాతం
నాన్-టాక్స్ రసీదులు 7 శాతం
యూనియన్ ఎక్సైజ్ విధులు 5 శాతం
కస్టమ్స్ 4 శాతం
రుణేతర మూలధన రసీదులు 1 శాతం

2024-25 ఆర్థిక ఏడాదిలో ప్రభుత్వ ఖర్చులు అంచనా

ఖర్చు విభాగం ఖర్చు శాతం
పభుత్వ అప్పుల వడ్డీ చెల్లింపులు 20 శాతం
రాష్ట్రాల వాటా పన్నులు మరియు సుంకాలు 20 శాతం
కేంద్ర ప్రభుత్వ పథకాలు 16 శాతం
ఫైనాన్స్ కమిషన్ మరియు ఇతర బదిలీలు 8 శాతం
కేంద్ర మరియు రాష్ట్రాల ఉమ్మడి పథకాలు 8 శాతం
రక్షణ రంగం 8 శాతం
సబ్సిడీలు 6 శాతం
పెన్షన్లు 4 శాతం
ఇతర ఖర్చులు 9 శాతం

Advertisement

Post Comment