అంతర్జాతీయ అంశాలు | ఫిబ్రవరి 2022
Telugu Current Affairs

అంతర్జాతీయ అంశాలు | ఫిబ్రవరి 2022

వ్యాపార లాభాలపై ఫెడరల్ కార్పొరేట్ పన్ను ప్రవేశపెట్టిన యూఏఈ

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వచ్చే ఆర్థిక సంవత్సరం 01 జూన్ 2023 నుండి వ్యాపార లాభాలపై ఫెడరల్ కార్పొరేట్ పన్నును ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఆ దేశ ఆర్థిక శాఖ ప్రకటన ప్రకారం వచ్చే ఏడాది నుండి $102,000 డాలర్ల కంటే ఎక్కువ వ్యాపార లాభాలపై 9 శాతం కార్పొరేట్ పన్ను విధించనున్నట్లు వెల్లడించింది. ప్రధాన చమురు ఎగుమతిదారునిగా అధిక ఆదాయం లభించడంతో చాల ఏళ్లుగా ఈ దేశం పన్ను స్వర్గధామంగా పేరొందింది. ప్రస్తుతం పెట్రోలియంపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, మరియు బడ్జెట్ రాబడులను వైవిధ్యపరచడానికి ఫెడరల్ కార్పొరేట్ పన్నును ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది.

Advertisement

హోండురాస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా జియోమారా క్యాస్ట్రో

వామపక్షవాది జియోమారా కాస్ట్రో హోండురాస్‌కు మొదటి మహిళా అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. హోండురాస్ ఉత్తరాన కరేబియన్ సముద్రం మరియు దక్షిణాన పసిఫిక్ మహాసముద్రం పరిధిలో ఉండే మధ్య అమెరికా దేశం. గత కొద్దీ సంవత్సరాలుగా రాజకీయ సంక్షోభం, నేరాలు మరియు పేదరికంతో నెట్టుకొస్తున్న హోండురాస్‌కు జియోమారా కాస్ట్రో నూతన జీవం పోసేందుకు సిద్ధమయ్యారు.

బ్రెగ్జిట్ ఉల్లంఘనపై యూకేకి వ్యతిరేకంగా బ్రస్సెల్స్ కోర్టు కేసు

యూరోపియన్ కమీషన్, యూకేకి వ్యతిరేకంగా మొదటి పోస్ట్ బ్రెగ్జిట్ కోర్టు కేసును ప్రారంభించింది. బ్రెగ్జిట్ ఉపసంహరణ ఒప్పందంలోని వివిధ అంశాలను రద్దు చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి ప్రతిస్పందనగా ఈ చట్టపరమైన చర్యలకు దిగింది. ఈ వివాదం ప్రధానంగా యూరోపియన్ దేశాల మధ్య అంతర్జాతీయ వాణిజ్యం మరియు భద్రతా అంశాలకు సంబంధించి రూపొందించిన అంతర్గత మార్కెట్ బిల్లులోని వివాదాస్పద నిబంధనల తొలగింపుల కోసం ఏర్పడింది.

జర్మనీ అధ్యక్షుడిగా ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్‌మీర్ తిరిగి ఎన్నిక

జర్మనీ అధ్యక్షుడిగా ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్‌మీర్ తిరిగి ఎన్నికయ్యారు. జర్మనీ పార్లమెంటు దిగువ సభ సభ్యులు మరియు జర్మనీలోని 16 రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన ప్రత్యేక అసెంబ్లీ ద్వారా పెద్ద మెజారిటీతో తిరిగి అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఫ్రాంక్ వాల్టర్ 12 ఫిబ్రవరి 2017న ఫెడరల్ కన్వెన్షన్ ద్వారా 74% ఓట్లతో మొదటసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2017లో ప్రెసిడెంట్ కావడానికి ముందు, స్టెయిన్‌మీర్, 66, ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ యొక్క విదేశాంగ మంత్రిగా రెండు సార్లు పనిచేశారు.

కెనడా 50 ఏళ్లలో మొదటిసారిగా ఎమర్జెన్సీ యాక్ట్‌ అమలు

కెనడియన్ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో 50 సంవత్సరాలలో మొదటిసారిగా ఎమర్జెన్సీ యాక్ట్‌ను అమలు చేశారు. కోవిడ్ ఆంక్షల కారణంగా గత కొద్ది కాలంగా కెనడాలో ట్రక్ డ్రైవర్లు, పౌరులు నిరసనలకు పూనుకున్నారు. శృతి మించుతున్న ఈ ప్రభుత్వ వ్యతిరేకతను అణిచివేసేందుకు 50 ఏళ్ళ తర్వాత మొదటిసారి అత్యవసర చట్టాన్ని అమలు చేశారు.

యూఎస్ సుప్రీంకోర్టు మొదటి నల్లజాతి మహిళ జడ్జిగా కేతంజీ బ్రౌన్ జాక్సన్‌

యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్, ఫెడరల్ అప్పీల్స్ కోర్టు మహిళా న్యాయమూర్తి కేతంజీ బ్రౌన్ జాక్సన్‌ను సుప్రీంకోర్టులో మొదటి నల్లజాతి మహిళ జడ్జిగా నియమించారు. మొత్తంగా ఈ బాధ్యతలు స్వీకరించిన ఆరవ మహిళా జడ్జిగా నిలిచారు.

Advertisement

Post Comment