23 మార్చి 2024 కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుగులో పొందండి. వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం.
టాప్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హాస్పిటల్స్‌కు రక్షా మంత్రి ట్రోఫీ ప్రధానం
దేశంలోని టాప్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హాస్పిటల్స్‌కు రక్షా మంత్రి ట్రోఫీ 2022 ప్రధానం చేయబడింది. ఆర్మీ సదరన్ కమాండ్ పరిధిలోకి వచ్చే పూణేలోని కమాండ్ హాస్పిటల్‌కు బెస్ట్ కమాండ్ హాస్పిటల్‌గా, అలానే ఆర్మీ సెంట్రల్ కమాండ్ పరిధిలోకి వచ్చే లక్నో కమాండ్ హాస్పిటల్‌కు సెకండ్-బెస్ట్ కమాండ్ హాస్పిటల్‌గా ఈ అవార్డులు అందుకున్నాయి.
ఈ ట్రోఫీని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్, జనరల్ దల్జిత్ సింగ్ 19 మార్చి 2024న అందించారు. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ కింద సాయుధ దళాల ఆసుపత్రులు అందించే ఆరోగ్య సంరక్షణ సేవలలో అత్యుత్తమతను గుర్తించడానికి మరియు వాటిలో ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తిని పెంపొందించడానికి 1989లో రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ట్రోఫీని ఏర్పాటు చేసింది.
లెఫ్టినెంట్ జనరల్/తత్సమాన హోదా కలిగిన ఎఎఫ్ఎంసి అధికారి నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఈ అవార్డును విజేతను ఎంపిక చేస్తుంది. ఆసుపత్రుల ఆన్-సైట్ సందర్శనల సమయంలో అంచనా వేసిన ఆబ్జెక్టివ్ పనితీరు సూచికల ఆధారంగా ప్రతి సంవత్సరం ఉత్తమ ఎఎఫ్ఎంసిలకు ఈ అవార్డు సిఫార్సు చేయబడుతుంది.
ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ నెట్‌వర్క్‌లో నిరంతర అభివృద్ధి సంస్కృతిని పెంపొందిస్తూ పూణేలోని ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియో-థొరాసిక్ సైన్సెస్ మరియు బేస్ హాస్పిటల్ ఢిల్లీ కాంట్‌లను చేర్చడానికి 2023లో ఈ పోటీని విస్తరించనున్నట్లు జనరల్ దల్జిత్ సింగ్ ప్రకటించారు.
వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023
స్విస్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కంపెనీ ఐక్యూఎయిర్ యొక్క వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 మార్చి 19న ప్రచురించబడింది. తాజా నివేదిక ప్రకారం134 దేశాలలో కేవలం 10 దేశాలు మాత్రమే ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క వార్షిక మార్గదర్శకానికి అనుగుణంగా ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం 2.5) కలిగి ఉన్నాయని వెల్లడించింది. వీటిలో ఆస్ట్రేలియా, ఎస్టోనియా, ఫిన్లాండ్, గ్రెనడా, ఐస్లాండ్, మారిషస్ మరియు న్యూ జీలాండ్ ఉన్నాయి.
ఈ నివేదిక ఇండియాను ప్రపంచంలో మూడవ అత్యంత కాలుష్య దేశంగా ర్యాంక్ చేసింది. బీహార్‌లోని బెగుసరాయ్ సిటీని ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన మెట్రోపాలిటన్ ప్రాంతంగా అవతరించినట్లు పేర్కొంది, ఢిల్లీ అత్యంత పేలవమైన గాలి నాణ్యతతో అత్యంత కాలుష్య రాజధాని నగరంగా గుర్తించబడింది.
2023 ఎయిర్ క్వాలిటీ రిపోర్టులో ఐదు అత్యంత కాలుష్య దేశాల జాబితాలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారతదేశం, తజికిస్తాన్ మరియు బుర్కినా ఫాసోలు జాబితా చేయబడ్డాయి. బంగ్లాదేశ్ 79.9 µg/m3తో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశంగా ఉంది. పాకిస్తాన్ 73.7 µg/m3తో రెండవ స్థానంలో, భారతదేశం 54.4 µg/m3తో మూడవ స్థానంలో అత్యంత కాలుష్య దేశాలుగా ఉన్నాయి.
- నివేదించిన మొత్తం 134 దేశాలలో 124 దేశాలు (92.5 శాతం) ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క వార్షిక మార్గదర్శక ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం 2.5) కంటే ఎక్కువ కాలుష్యం కలిగి ఉన్నాయి.
- ఈ నివేదిక ఆఫ్రికాలోని మూడవ వంతు దేశాలలో గాలి నాణ్యతను గణించలేదు. ఈ ఖండంలోని మెజారిటీ దేశాలు, ఇప్పటికి గాలి నాణ్యత డేటా ప్రాప్యత లేని దేశాలుగా ఉన్నాయి.
- మధ్య & దక్షిణ ఆసియా ప్రాంతం ప్రపంచంలోని అత్యంత కలుషితమైన మొదటి పది నగరాలకు నిలయంగా ఉంది.
- బెగుసరాయ్ నగరం భారతదేశం అత్యంత కలుషితమైన మెట్రోపాలిటన్ ప్రాంతంగా నిలిచింది.
- 2023లో భారతదేశం ప్రపంచంలోని నాలుగు అత్యంత కాలుష్య నగరాలకు నిలయంగా ఉంది.
- అత్యంత కలుషితమైన అమెరికా నగరాలుగా కొలంబస్, ఒహియో. బెలోయిట్, విస్కాన్సిన్ జాబితా చేయబడ్డాయి.
- లాస్ వెగాస్, నెవాడా అత్యంత పరిశుభ్రమైన ప్రధాన నగరాలుగా జాబితా చేయబడ్డాయి.
- ఈ నివేదిక చరిత్రలో తొలిసారి కెనడాను ఉత్తర అమెరికాలోని అత్యంత కలుషితమైన దేశంగా పేర్కొంది.
- కెనడా 13 అత్యంత కలుషితమైన నగరాలకు కేంద్రంగా నిలిచింది.
గాలి నాణ్యత పర్యవేక్షణ ఉన్న దేశాలు మరియు ప్రాంతాల సంఖ్య గత ఆరు సంవత్సరాలుగా క్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రభుత్వాలు నిర్వహించే కాలుష్య నియంత్రణలో గణనీయమైన ఫలితాలు కనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ మానిటరింగ్ నెట్‌వర్క్‌లలో అంతరాలను తగ్గించడానికి ప్రభుత్వాలు ఇంకా ఎక్కువ కృషి చేయాలని పేర్కొంది.
స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన పర్యావరణం అనేది సార్వత్రిక మానవ హక్కు. అనేక ప్రాంతాల్లో ఇప్పటికి ప్రపంచం గాలి నాణ్యత డేటా ప్రాప్యత లేకపోవడం నిర్ణయాత్మక చర్యను ఆలస్యం చేస్తుంది. ప్రపంచ వాయు నాణ్యత నివేదిక యొక్క ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు మరియు విధాన నిర్ణేతల చర్యకు పిలుపుగా పనిచేస్తాయి. వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి మరియు ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన గాలిని పీల్చుకునేలా చేయడానికి సమర్థవంతమైన వ్యూహాలను అభివృద్ధి చేయడానికి మరియు అమలు చేయడానికి అంతర్జాతీయ సహకారం చాలా కీలకం.
ప్రముఖ రచయిత ప్రభా వర్మకు సరస్వతి సమ్మాన్ పురస్కారం
ప్రఖ్యాత మలయాళి కవి మరియు సాహితీవేత్త ప్రభా వర్మ తన పద్య నవల రౌద్ర సాత్వికం కోసం ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్, 2023 అవార్డును అందుకోనున్నారు. రౌద్ర సాత్వికం 2022లో ప్రచురించబడిన మలయాళి కవితా సంపుటి. ఇది రాజకీయాలు, వ్యక్తులు, రాష్ట్రం, కళ మరియు అధికారం మధ్య సంఘర్షణను ఒక ప్రత్యేకమైన పద్ధతిలో పరిశీలిస్తుంది.
- సరస్వతి సమ్మాన్ అవార్డు 1991లో కెకె బిర్లా ఫౌండేషన్ ద్వారా ప్రారంభించబడుతుంది.
- ఈ అవార్డు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సాహిత్య పురస్కారాలలో ఒకటిగా గుర్తింపుపొందింది.
- సరస్వతీ సమ్మాన్ షెడ్యూల్ VIIIలో జాబితా చేయబడిన 22 భారతీయ భాషలలో ఏదైనా అత్యుత్తమ గద్య లేదా పద్య సాహిత్య రచనలకు యేటా అందించబడుతుంది.
- ఈ అవార్డు గ్రహీతకు ప్రశంసా పత్రం, జ్ఞాపిక మరియు పదిహేను లక్షల రూపాయల నగదు బహుమతి అందజేస్తారు.
- హరివంశ్ రాయ్ బచ్చన్ 1991లో హిందీలో రాసిన తన ఆత్మకథకు గాను మొదటి సరస్వతి సమ్మాన్ అందుకున్నారు.
- తెలుగు రాష్ట్రాల నుండి 2018లో కె శివా రెడ్డి ("పక్కకి ఒట్టిగిలితే") మాత్రమే ఈ అవార్డు దక్కించుకున్నారు.
- సరస్వతి సమ్మాన్ అవార్డు ఇప్పటి వరకు మొత్తం 32 మందికి ప్రదానం చేయబడింది.
మిజోరం లోకాయుక్త చైర్‌పర్సన్‌గా లామల్సవ్మా నియామకం
మిజోరాం మాజీ చీఫ్ సెక్రటరీ లాల్మల్సావ్మ ఆ రాష్ట్ర లోకాయుక్త చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. మార్చి 18న మిజోరాంలోని రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి లాల్దుహోమా, స్పీకర్ లాల్బియాక్జామాలు హాజరయ్యారు.
లాల్మల్సావ్మ గతంలో 2014 నుండి ఫిబ్రవరి 28, 2018 వరకు మిజోరాం ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. 1996 నుండి 2000 వరకు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో డైరెక్టర్‌గా మరియు 8 సంవత్సరాలకు పైగా మిజోరాం ప్రధాన ఎన్నికల అధికారిగా కూడా సేవలు అందించారు.
- లోకాయుక్త భారతదేశంలో రాష్ట్ర స్థాయిలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడే ఒక ముఖ్యమైన సంస్థ.
- రాష్ట్ర శాసనసభలో లోకాయుక్త చట్టాన్ని ఆమోదించిన తర్వాత ఇది రాష్ట్రంలో అమలులోకి తీసుకురాబడుతుంది.
- రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులపై వచ్చిన అవినీతి ఫిర్యాదులను పరిశోధించడానికి ఇది అంబుడ్స్‌మన్‌గా వ్యవహరిస్తుంది.
- వివిధ మూలాధారాల నుండి అందిన సమాచారం ఆధారంగా తన స్వంత చొరవతో కేసులను పరిశోధిస్తుంది.
- దాని నిర్ధారణల ఆధారంగా అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది.
- లోకాయుక్త ప్రభుత్వం నుండి స్వతంత్రంగా ఉంటుంది, నిష్పక్షపాత దర్యాప్తులకు భరోసా ఇస్తుంది.
- 1971లో లోకాయుక్త మరియు ఉప-లోకాయుక్త చట్టం ద్వారా లోకాయుక్త సంస్థను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర అవతరించింది.
- ప్రస్తుతం లోకాయుక్త ఒడిశా, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడు మరియు ఢిల్లీలలో అమలులో ఉంది.
- 2013లో లోక్‌పాల్ బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొంది అధికారికంగా లోక్‌పాల్ మరియు లోకాయుక్త చట్టాలు అమల్లోకి వచ్చాయి.
న్యూఢిల్లీలో 4వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్టార్టప్ ఫోరమ్
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్టార్టప్ ఫోరమ్ యొక్క నాల్గవ ఎడిషన్ 19 మార్చి 2024న న్యూఢిల్లీలో నిర్వహించబడింది. ఈ చొరవ ఎస్‌సిఒ సభ్య దేశాల మధ్య ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అలానే ఉద్యోగ కల్పనను ప్రోత్సహించడం మరియు వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి యువ ప్రతిభావంతులను ప్రేరేపించడంపై దృష్టి సారిస్తుంది.
ఈ ఫోరమ్ యొక్క ప్లీనరీ సెషన్‌లో ఎస్‌సిఒ స్టార్టప్‌ల ప్రతినిధి బృందం, సభ్య దేశాల స్టార్టప్ నోడల్ ఏజెన్సీలు, సీనియర్ ప్రభుత్వ అధికారులు మరియు దౌత్యవేత్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంను సభ్య దేశాలలో స్థానిక స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలను బలోపేతం చేయడం, పెట్టుబడిదారులు మరియు కార్పొరేట్ ఎంగేజ్‌మెంట్ కార్యకలాపాలకు మార్గనిర్దేశం చేసే లక్ష్యంతో భారతదేశం నిర్వహిస్తుంది.
ఎస్‌సిఒ స్టార్టప్ ఫోరమ్ అనేది సభ్య దేశాలలో నూతన ఆవిష్కరణలను పెంపొందించడానికి మరియు యువత నిశ్చితార్థాన్ని ప్రోత్సహించడానికి ఒక కీలకమైన వేదిక. దీనిని 16 సెప్టెంబర్ 2022న ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో జరిగిన ఎస్‌సిఒ దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం ద్వారా ఏర్పాటు చేశారు.
భారత్ మరో మారు నవంబర్ 2024లోస్టార్టప్ వర్కింగ్ గ్రూపు యొక్క రెండవ సమావేశానికి మరియు జనవరి 2025లో ఎస్‌సిఒ స్టార్టప్ ఫోరమ్ 5.0కి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఫోరమ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌లను పెంపొందించడం, నిధుల యాక్సెస్, మెంటార్‌షిప్ ప్రోగ్రామ్‌లు మరియు క్రాస్-బోర్డర్ భాగస్వామ్యాలను నిర్మించడం వంటి వివిధ అంశాలపై ప్యానెల్ చర్చలను నిర్వహించింది.
- షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది చైనా మరియు రష్యాచే స్థాపించబడిన యురేషియా రాజకీయ, ఆర్థిక, అంతర్జాతీయ భద్రత మరియు రక్షణ సంస్థ.
- 2021లో స్థాపించిన ఈ సంస్థ, భౌగోళిక పరిధి మరియు జనాభా పరంగా దాదాపు 80% విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంతీయ సంస్థగా ఉంది.
- దీని ప్రధాన కార్యాలయం బీజింగ్ (చైనా) యందు ఉంది.
- చైనా, భారతదేశం, ఇరాన్, కజకిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్ ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి.
- ఎస్‌సిఒ సెక్రటరీ : జనరల్ జాంగ్ మింగ్.
భారతదేశం-మొజాంబిక్-టాంజానియా ట్రైలాటరల్ ఎక్సర్‌సైజ్ 2024
భారతదేశం-మొజాంబిక్-టాంజానియా త్రైపాక్షిక వ్యాయామం (IMT TRILAT 24) యొక్క రెండవ ఎడిషన్ మొజాంబిక్‌లోని నకాలాలో మార్చి 21 నుండి 28 మధ్య నిర్వహించబడింది. వారం రోజుల పాటు సాగిన ఈ వ్యాయామం మూడు భాగస్వామ్య దేశాల నౌకాదళాల మధ్య సముద్ర సహకారం పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ వ్యాయామంలో భారత్ నుండి ఐఎన్ఎస్ తిర్ మరియు సుజాత పాల్గొన్నాయి. అలానే మొజాంబిక్ నౌకాదళ నౌక నమటిలి మరియు టాంజానియా నౌకాదళ నౌక ఫతుండు ఈ సంయుక్త నావికా విన్యాశాలలో పాల్గొన్నాయి. ఈ వ్యాయామంలో సముద్రపు రైడర్లకు బ్రిడ్జి వాచ్ కీపింగ్, డ్యామేజ్ కంట్రోల్, ఫైర్‌ఫైటింగ్ అంశాలపై శిక్షణ అందించారు.
మొజాంబిక్‌లోని నకాలాలో ఐఎన్‌ఎస్ తిర్ మరియు ఐఎన్‌ఎస్ సుజాతలో మార్చి 28న ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్ యందు మూడు నౌకాదళాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వ్యాయామం విజయవంతంగా పూర్తి కావడం, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సురక్షితమైన సముద్ర వాతావరణాన్ని పెంపొందించడానికి భారతదేశం, మొజాంబిక్ మరియు టాంజానియాల నిబద్ధతను నొక్కి చెబుతుంది.
ఈ కసరత్తు భవిష్యత్తులో మూడు నౌకాదళాల మధ్య మరింత సహకారానికి మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు. ఇందులో ఉమ్మడి గస్తీ, సమాచార భాగస్వామ్యం మరియు సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు ఉండే అవకాశం ఉంది.
ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ప్రధానం
ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ప్రధానం చేయబడింది. దీనితో భూటాన్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న మొదటి విదేశీ ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవతరించారు. ఈ అవార్డు భారత్-భూటాన్ సంబంధాల పెరుగుదలకు మరియు అతని విశిష్ట సేవకు గాను అందించబడింది.
ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో పేరుతొ అందించే ఈ గౌరవాన్ని మార్చి 22న భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రదానం చేశారు. వాస్తవానికి ఈ అవార్డును డిసెంబర్ 17, 2021న జరిగిన 114వ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా భూటాన్ రాజు ప్రకటించారు. అయితే ఇటీవలే రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్ వెళ్లిన ప్రధాని మోదీకి ఈ అవార్డు అందజేశారు.
భూటాన్ పర్యటన సందర్భంగా, భారతదేశం-భూటాన్ ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రధాని మోదీ వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు. భూటాన్ రాజు సమక్షంలో టెండ్రెల్తాంగ్ ఫెస్టివల్ గ్రౌండ్‌లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు.
- ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్ (డ్రుక్ గ్యాల్పో) అనేది భూటాన్ రాజ్యం అందించే అత్యున్నత గౌరవం.
- ఇది భూటాన్ ప్రజలకు మరియు దేశానికి జీవితకాలం అత్యుత్తమ సేవలు అందించిన వ్యక్తులకు అందజేస్తారు.
- భూటాన్ హిమాలయాల తూర్పు అంచున ఉన్న బౌద్ధ రాచరిక దేశం.
- దీని రాజధాని నగరం : థింపూ
- భూటాన్ రాజు : జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్
- ప్రధాన మంత్రి : షెరింగ్ టోబ్గే