తెలుగు వీక్లీ కరెంట్ అఫైర్స్ 13 ఫిబ్రవరి 2023 : పోటీ పరీక్షల స్పెషల్
Telugu Current Affairs

తెలుగు వీక్లీ కరెంట్ అఫైర్స్ 13 ఫిబ్రవరి 2023 : పోటీ పరీక్షల స్పెషల్

వీక్లీ కరెంట్ అఫైర్స్ 13 ఫిబ్రవరి 2023 తెలుగులో ఉచితంగా పొందండి. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, నిరుద్యోగుల సౌలభ్యం కోసం జాతీయంగా, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న తాజా సమకాలిన అంశాలను మీకు ఇక్కడ అందిస్తున్నాం. ఈ సమాచారం మీ పోటీపరీక్షల సన్నద్ధతను మరింత మెరుగుపరుచుస్తుందని భావిస్తున్నాం.

12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 12 రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్‌లను నియమించారు. ఇందులో ఏడు రాష్ట్రలకు ఇతర రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేయగా మిగతా రాష్ట్రలకు నూతన గవర్నర్లను నియమించారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బదిలీకాగా, ఆయన స్థానంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్‌ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమించారు.

మహారాష్ట్ర గవర్నర్‌ కోష్యారీ స్థానంలో జార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్ నియమితులయ్యారు. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కే మాథుర్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆయన స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బీడీ మిశ్రాను నియమించారు.

  • ఆంధ్రప్రదేశ్ - జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్
  • అరుణాచల్ ప్రదేశ్ - త్రివిక్రమ్ పర్నాయక్
  • అస్సాం - గులాబ్ చంద్ కటారియా
  • బీహార్ - రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్
  • ఛత్తీస్‌ఘడ్ - బిశ్వ భూషణ్ హరిచందన్
  • జార్ఖండ్ - సిపి రాధాకృష్ణన్
  • హిమాచల్ ప్రదేశ్ - శివ ప్రతాప్ శుక్లా
  • మహారాష్ట్ర - రమేష్ బైస్
  • మణిపూర్ - అనసూయ ఉయికీ
  • మేఘాలయ - ఫాగు చౌహాన్
  • నాగాలాండ్ - ఎల్.ఏ గణేశన్
  • సిక్కిం - లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
  • లడఖ్ (యుటి) - డా. బీడీ మిశ్రా (లెఫ్టినెంట్ గవర్నర్)

భారత రాష్ట్రల గవర్నర్లు స్టేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖ యొక్క విధులను పర్యవేక్షిస్తారు. రాష్ట్ర గవర్నర్‌ను ఐదు సంవత్సరాల కాలానికి రాష్ట్రపతి నియమిస్తారు. కనీసం 35 ఏళ్లు నిండిన భారత పౌరులు మాత్రమే ఈ పదివికి అర్హులు. గవర్నర్‌ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 159 ప్రకారం ప్రమాణస్వీకారం చేస్తారు.

25 అడిక్షన్ ట్రీట్‌మెంట్ ఫెసిలిటీస్ (ATF) జాతికి అంకితం

కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ 25 అడిక్షన్ ట్రీట్‌మెంట్ ఫెసిలిటీస్ సెంటర్లను ఫిబ్రవరి 9న జాతికి అంకితం చేశారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కింద ప్రారంభించిన ఈ ఏటీఎఫ్‌ కేంద్రాల ద్వారా సమాజంలోని మాదకద్రవ్యాలను నిర్మూలించడంలో పాటుగా డ్రగ్స్‌ రహిత దేశంగా మార్చేందుకు పని చేయనున్నారు.

యువత, పిల్లలు మరియు సమాజంలో డ్రగ్స్ దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించేందుకు సామాజిక న్యాయం మరియు సాధికారత విభాగం ఆగస్టు 2020లో నషా ముక్త్ భారత్ అభియాన్‌ను ప్రారంభించింది.

ఈ కార్యక్రమం ద్వారా మాదకద్రవ్యాల దుర్వినియోగం ఎక్కువగా ఉన్న 372 సున్నితమైన జిల్లాలను గుర్తించారు. ఇప్పటివరకు, తొమ్మిది కోట్ల 40 లక్షల మందికి పైగా ప్రజలు మరియు వేలాది విద్యా సంస్థలు ఈ దేశవ్యాప్త ప్రచారంలో భాగమయ్యాయి.

మిషన్ అంత్యోదయ సర్వే 2022-23 ప్రారంభం

కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయితీ రాజ్ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్, మిషన్ అంత్యోదయ సర్వే (MAS) 2022-23 దాని పోర్టల్ మరియు మొబైల్ అప్లికేషన్‌ను ఫిబ్రవరి 8న ఢిల్లీలో ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధి శాఖ 2017-18 నుండి దేశంలోని అన్ని గ్రామ పంచాయితీలలో మిషన్ అంత్యోదయ సర్వేను నిర్వహిస్తోంది. ఇది గ్రామీణ పరిపాలనను మెరుగుపర్చేందుకు సంబంధించిన కార్యక్రమం.

ఈ కార్యక్రమం ద్వారా బ్లాక్ మరియు జిల్లా స్థాయిలో వార్షిక పంచాయతీ మౌలిక సదుపాయాలు, పంచాయతీ సేవలు, గ్రామ మౌలిక సదుపాయాలు, గ్రామ సేవలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి మొదలగు అంశాల ప్రాథమిక డాటాను సేకరిస్తారు.

మయన్మార్, రష్యా మధ్య అణుశక్తి అభివృద్ధిపై ఒప్పందం

రష్యా మరియు మయన్మార్ ప్రభుత్వాలు శాంతియుత అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే రంగంలో సహకారాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. 2015లో మయన్మార్ మరియు రష్యా యొక్క అణు విద్యుత్ సంస్థ రోసాటమ్ మధ్య జరిగిన ప్రాథమిక ఒప్పందంకు కొనసాగింపుగా ఇది ఉండనుంది. మయన్మార్‌లోని యాంగాన్‌లోని న్యూక్లియర్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ సెంటర్‌లో ఈ ఒప్పందంపై సంతకం చేయబడింది.

మయన్మార్ (గతంలో బర్మా) భారతదేశం, బంగ్లాదేశ్, చైనా, లావోస్ మరియు థాయ్‌లాండ్‌ల సరిహద్దులతో ఉన్న ఆగ్నేయాసియా దేశం. దీని రాజధాని నగరం నైపిడావ్. ఈ దేశం 1948లో స్వాతంత్ర్యం పొందింది . 1962లో తిరుగుబాటు తరువాత, బర్మా సోషలిస్ట్ ప్రోగ్రామ్ పార్టీ క్రింద సైనిక నియంతృత్వంగా మారింది.

2020 మయన్మార్ సార్వత్రిక ఎన్నికల తరువాత ఆంగ్ సాన్ సూకీ పార్టీ ఉభయ సభలలో స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వంను ఏర్పాటు చేసింది. అయితే 2021లో ఆంగ్ సాన్ సూకీని నిర్బంధించిన బర్మీస్ మిలిటరీ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రస్తుతం ఈ దేశ తాత్కాలిక అధ్యక్షుడుగా మైంట్ స్వే ఉన్నారు. మయన్మార్ మిలటరీ చీఫ్ మిన్ ఆంగ్ హ్లైంగ్ ప్రధానమంత్రిగా ఉన్నారు.

గతంలో మయన్మార్ ఇండియాలో భాగంగా ఉండేది. బర్మా జాతీయవాద ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు బ్రిటీష్ ప్రభుత్వం 1937లో బర్మాను భారతదేశం నుండి విభజించింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, యు ఆంగ్ సాన్ నాయకత్వంలో, ఈ ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంది. బర్మా జనవరి 4, 1948న స్వాతంత్ర్యం పొందింది.

సల్మాన్ రష్దీ కొత్త నవల 'విక్టరీ సిటీ' విడుదల

ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ తన కొత్త నవల “విక్టరీ సిటీ”ని పెంగ్విన్ రాండమ్ హౌస్ ద్వారా ప్రచురించాడు. ఇది 14వ శతాబ్దానికి చెందిన ఒక మహిళా కథ, ఒక నగరాన్ని పాలించడానికి పితృస్వామ్య ప్రపంచాన్ని ధిక్కరించిన ఒక స్త్రీ పురాణ కథ. గత ఆగస్టులో న్యూయార్క్‌లోని చౌటుప్పల్ ఇన్‌స్టిట్యూషన్‌ వేదికపై కత్తిపోటుకు గురైన తర్వాత సల్మాన్ రష్దీ ఒక కంటి చూపును మరియు అతని చేతిని ఉపయోగించగల సామర్థ్యాన్ని కోల్పోయాడు.

సల్మాన్ రష్దీ భారతీయ సంతతికి చెందిన బ్రిటీషు నవలా రచయిత, వ్యాసకర్త. 1981లో ఈయన రెండవ నవల మిడ్‌నైట్ చిల్డ్రన్ బుకర్ ప్రైజు గెలవడంతో ప్రపంచ వ్యాప్తంగా పాపులయ్యారు. ఈయన రచనా శైలి భారత ఉపఖండము నేపథ్యంలో చారిత్రక కాల్పనికతతో మిళితమైన మాజిక్ రియలిజంగా ఉంటుంది.

'డిజిటల్ పేమెంట్స్ ఉత్సవ్' ప్రారంభించిన మంత్రి అశ్విని వైష్ణవ్

ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు రైల్వేల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యంతో 'డిజిటల్ పేమెంట్స్ ఉత్సవ్' అనే సమగ్ర ప్రచారాన్ని ఫిబ్రవరి 9న ప్రారంభించారు. జీ20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ (DEWG) ఈవెంట్‌లో భాగంగా దేశంలో, ముఖ్యంగా లక్నో, పూణే, హైదరాబాద్ మరియు బెంగళూరు నగరాల్లో 2023 ఫిబ్రవరి 9 నుండి అక్టోబర్ 9 మధ్య వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ సందర్బంగా భారతదేశం వెలుపల యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) పరిధిని విస్తరించేందుకు జరుగుతున్న ప్రయత్నాల గురించి వెల్లడించారు. యూపీఐని గ్లోబల్ పేమెంట్ పద్ధతిగా మార్చడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, యూఏఈ, యూకే మరియు అమెరికా వంటి 10 దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు త్వరలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు.

కెనరా బ్యాంకు కొత్త ఎండీ & సీఈఓగా కె సత్యనారాయణ రాజు

బెంగుళూరు కేంద్రంగా ఉన్న కెనరా బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా కె సత్యనారాయణ రాజు నియమితులయ్యారు. మాజీ సీఈఓ శ్రీ ఎల్‌వి ప్రభాకర్ గత 31 డిసెంబర్ 2022న రాజీనామా చేసిన తర్వాత ఈ స్థానం ఖాళీగా ఉన్నది. సత్యనారాయణ రాజు 7 ఫిబ్రవరి 2023 నుండి ఈ కొత్త బాధ్యతలు స్వీకరించారు.

కెనరా బ్యాంక్ అనేది భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ నియంత్రణ మరియు యాజమాన్యంలోని భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకు. ఇది 1906లో మంగళూరులో అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్ చేత స్థాపించబడింది. ప్రస్తుతం ఈ బ్యాంకుకు లండన్, దుబాయ్ మరియు న్యూయార్క్‌లలో కూడా కార్యాలయాలు ఉన్నాయి.

జర్నలిస్టు ఎబికె ప్రసాద్‌కు రాజా రామ్ మోహన్ రాయ్ అవార్డు

ప్రముఖ తెలుగు జర్నలిస్టు ఎబికె ప్రసాద్‌ను జర్నలిజంలో ప్రతిష్టాత్మకమైన రాజా రామ్ మోహన్ రాయ్ జాతీయ అవార్డుకు ఎంపిక చేసినట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఏబీకేగా పేరుగాంచిన అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ గత 75 ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో సేవలు అందిస్తున్నారు.

ఎబికె ప్రసాద్‌ గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన స్రవంతి పత్రికలకు సంపాదకునిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 నుంచి 2009 మధ్య రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్‌గా కూడా పనిచేశారు. ఈ అవార్డును ఫిబ్రవరి 28, 2023న న్యూ ఢిల్లీలోని రఫీ మార్గ్‌లోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలోని డిప్యూటీ స్పీకర్ హాల్‌లో ప్రదానం చేస్తారు.

భారతీయ జర్నలిజానికి రాజా రామ్ మోహన్ రాయ్‌ని మార్గదర్శకుడుగా భావిస్తారు. దేశ ప్రజలలో సామాజిక-సాంస్కృతిక మరియు రాజకీయ అవగాహన కల్పించేందుకు బెంగాలీ (సంబాద్ కౌముది), పర్షియన్ (మిరాత్-ఉల్-అక్బర్) మరియు హిందీ వంటి ప్రధాన భాషలలో జర్నల్స్‌ను తీసుకువచ్చాడు. 1828లో ఈయన బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. ఇది భారతదేశపు మొదటి సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

ప్రపంచంలోని టాప్ 5 అక్రిడిటేషన్ సిస్టమ్స్‌లో భారతదేశం

క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI ) కింద భారతదేశ జాతీయ అక్రిడిటేషన్ సిస్టమ్ ఇటీవలి ప్రచురించిన గ్లోబల్ క్వాలిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ (GQII) యందు 5వ స్థానంలో నిలిచింది. గ్లోబల్ క్వాలిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ ప్రపంచంలోని 184 ఆర్థిక వ్యవస్థలకు నాణ్యమైన మౌలిక సదుపాయాల ఆధారంగా ర్యాంక్ ఇస్తుంది.

అయితే  భారతదేశం యొక్క మొత్తం QI సిస్టమ్ ర్యాంకిగులో 10 వ స్థానంలో ఉండగా, స్టాండర్డైజేషన్ సిస్టమ్ (BIS కింద) 9 వ స్థానంలో మరియు మెట్రాలజీ సిస్టమ్ (NPL-CSIR కింద) ప్రపంచంలో 21 వ స్థానంలో నిలిచింది. ఈ నివేదిక 2021 డేటా ఆధారంగా రూపొందనించారు. అక్రిడిటేషన్ బాడీలు ఐఎస్ఓ/ఐఈసీ వంటి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కన్ఫర్మిటీ అసెస్‌మెంట్ బాడీల యొక్క యోగ్యత మరియు నిష్పాక్షికతను ధృవీకరిస్తాయి.

భారతదేశంలో గుర్తింపు పొందిన ఉన్నత విద్య అక్రిడిటేషన్ సంస్థలు

  • ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE)
  • అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (AIU)
  • నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC)
  • నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (NBA)
  • బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI)
  • ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (AIMA)
  • డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (DEC)
  • మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI)
  • డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (DCI)
  • ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI)
  • నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE)
  • ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (INC)
  • ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR)

ముంబైలో రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 2023 ప్రారంభం

రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 2023ని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ప్రారంభించారు. ఈ మహోత్సవ్‌ను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఫిబ్రవరి 11 నుండి 19 వరకు జరిగే ఈ మహోత్సవంను జాతీయ ఐక్యత మరియు సమగ్రతను ప్రోత్సహించడానికి నిర్వహిస్తారు. ఈ ప్రారంభోత్సవంలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

భారతదేశపు మొట్టమొదటి డ్రోన్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ప్రారంభం

గురుగ్రామ్‌కు చెందిన డ్రోన్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన స్కై ఎయిర్, భారతదేశపు మొట్టమొదటి డ్రోన్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రారంభించింది. స్కై యూటీఎం పేరుతొ అందుబాటుకి తీసుకొచ్చిన ఈ సాంకేతికత డ్రోన్‌లకు సిట్యువేషనల్ అవేర్‌నెస్, అటానమస్ నావిగేషన్, రిస్క్ అసెస్‌మెంట్ మరియు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అందించడానికి నిర్మించబడింది.

భారత రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో ప్రారంభించబడిన ఈ సాఫ్ట్‌వేరును డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిర్వహించనుంది. ప్రపంచవ్యాప్తంగా యూఎస్-ఆధారిత ఎయిర్‌మ్యాప్ మరియు నెదర్లాండ్స్-ఆధారిత ఎయిర్‌బస్ వంటి అనేక కంపెనీలు ఇటువంటి పరిష్కారాలను అందిస్తున్నాయి. మన దేశంలో ఇదే మొదటిది.

క్రెడిట్ కార్డ్‌ చెల్లింపులకు సపోర్ట్ చేసే భారతదేశపు మొట్టమొదటి యాప్‌గా మోబిక్విక్

భారతదేశపు ప్రముఖ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ మోబిక్విక్,  క్రెడిట్ కార్డ్‌ యూపీఐ చెల్లింపులకు సపోర్ట్ చేసే భారతదేశపు మొట్టమొదటి యాప్‌గా అవతరించింది. ప్రస్తుతం ఈ సేవలు రూపే క్రెడిట్ కార్డ్‌ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి రానుంది. రూపే క్రెడిట్ కార్డ్‌ కలిగిన మోబిక్విక్ వియోగదారులు ఇక మీదట యూపీఐ క్యూఆర్ కోడ్‌ ఆధారిత పేమెంట్ సేవలను ఉపయోగించుకోవచ్చు.

ఎంఆర్ఎఫ్ చైర్మన్ కేఎం మమ్మెన్‌కి ఆత్మ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

ఎంఆర్ఎఫ్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కేఎం మమ్మెన్‌ను ఆటోమోటివ్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ATMA) లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించింది. ఈ అవార్డును న్యూఢిల్లీలో జరిగిన ఆత్మ వార్షిక కాన్‌క్లేవ్ 2023లో మారుతీ సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో హిసాచి టేకుచి అందజేశారు. మమ్మెన్‌ యొక్క విలక్షణమైన మరియు అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు, సహకారంకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేసింది.


జమ్మూ కాశ్మీర్‌లో 5.9 మిలియన్ టన్నుల భారీ లిథియం నిక్షేపాలు

జమ్మూ మరియు కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో 5.9 మిలియన్ టన్నుల భారీ లిథియం నిక్షేపాలను కనుగొన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్ఐ) ప్రకటించింది. లిథియం నిక్షేపాలను ఇండియాలో కనుగొనబడటం ఇదే మొదటిసారి. మెరిసే బూడిదరంగులో కనిపించే లిథియం లోహాన్ని 'వైట్ గోల్డ్' అని కూడా పిలుస్తారు. 8 మిలియన్ టన్నులతో, చిలీ ప్రపంచంలోనే అతిపెద్ద లిథియం నిల్వలను కలిగి ఉంది.

దాదాపు 26 సంవత్సరాల క్రితం, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జమ్మూ కాశ్మీర్‌లోని ఇదే ప్రాంతంలో లిథియం ఉనికి గురించి వివరణాత్మక నివేదికను సమర్పించింది. ప్రస్తుతం దానిని అధికారికంగా ప్రకటించింది. లిథియం ఎలక్ట్రిక్ బ్యాటరీల తయారీలో ప్రధాన మూలకంగా ఉపయోగపడుతుంది. దీనితో ఎలక్ట్రిక్ వాహనాలు, ల్యాప్‌టాప్‌లు మరియు సెల్ ఫోన్‌ల బ్యాటరీలలో తయారీ రంగంలో భారత్ ముందుడుగు వేయనుంది.

దక్షిణాఫ్రికాలో ఐసిసి టి-20 మహిళల ప్రపంచకప్ ప్రారంభం

దక్షిణాఫ్రికాలో ఐసిసి టి-20 మహిళల ప్రపంచకప్ ఎనిమిదో ఎడిషన్ ఫిబ్రవరి 10న ప్రారంభం అయ్యింది. ఇది ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో 10 నుండి 26 ఫిబ్రవరి 2023 వరకు నిర్వహించబడుతోంది. దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారతదేశం, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, వెస్ట్ ఇండీస్, బంగ్లాదేశ్ మరియు ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్లు పోటీ పడుతున్నాయి.

నాసా చీఫ్‌ ఆస్ట్రోనాట్‌గా జోసెఫ్ అకాబా

హ్యూస్టన్‌లోని నాసా యొక్క జాన్సన్ స్పేస్ సెంటర్‌లోని ఆస్ట్రోనాట్ కార్యాలయానికి వెటరన్ వ్యోమగామి జోసెఫ్ అకాబా చీఫ్‌గా నియమితులయ్యారు. దీనితో నాసా కార్యాలయానికి నాయకత్వం వహిస్తున్న మొట్టమొదటి హిస్పానిక్ వారసత్వ వ్యక్తిగా అకాబా అవతరించారు.

మూడు అంతరిక్ష ప్రయాణాలలో అనుభవజ్ఞుడైన అకాబా కాలిఫోర్నియాలోని ఇంగ్ల్‌వుడ్‌లో జన్మించాడు. అతను శాంటా బార్బరాలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో భూగర్భ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని, అరిజోనా విశ్వవిద్యాలయం నుండి భూగర్భ శాస్త్రంలో ఒక మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు.

అకాబా 306 రోజులు అంతరిక్షంలో గడిపారు, స్పేస్ షటిల్ డిస్కవరీ యొక్క STS-119 మిషన్‌లో మిషన్ స్పెషలిస్ట్‌గా మరియు 2012లో ఎక్స్‌పెడిషన్స్ 31 మరియు 32 కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఫ్లైట్ ఇంజనీర్‌గా, అలాగే 2017-2018లో ఎక్స్‌పెడిషన్స్ 53 మరియు 54లో కూడా ఉన్నారు. ఆ సమయంలో, అతను మూడు స్పేస్‌వాక్‌లను నిర్మించడంలో మరియు స్పేస్ స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేయడంలో పాల్గొన్నాడు.

టర్కీ, సిరియాల భూకంప సహాయార్థం ఆపరేషన్ దోస్త్

భూకంపంతో స్వర్వం కోల్పోయిన టర్కీ మరియు సిరియా దేశాలకు సహాయం చేయడానికి భారత్ 'ఆపరేషన్ దోస్త్' పేరుతొ శోధన మరియు రెస్క్యూ బృందాలను పంపింది. బాధితులకు సహాయం అందించేందుకు 23 టన్నులకు పైగా సహాయ సామగ్రిని కూడా తరలించింది.

శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడానికి గరుడ ఏరోస్పేస్ యొక్క ద్రోణి డ్రోన్‌లను, మందులు, ఆహారం మరియు సామాగ్రిని మోసుకెళ్ళినందుకు కిసాన్ డ్రోన్‌లను కూడా తీసుకెళ్లింది. 7 ఫిబ్రవరి 2023న, భారత వైమానిక దళం మరో రెండు C-17 విమానాలను టర్కీకి పంపింది. ఈ రెండు విమానాలలో సహాయ సామాగ్రి, మొబైల్ ఆసుపత్రి మరియు అదనపు ప్రత్యేక శోధన మరియు రెస్క్యూ బృందాలు ఉన్నాయి.

భారత్ గతంలో వివిధ పేర్లతో ఇటివంటి ఆపరేషన్లు నిర్వహించింది. 2021 లో తాలిబన్లు, ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని ఆక్రమించుకున్న సందర్భంలో భారత్ పౌరులను తరలింపు కోసం ఆపరేషన్ దేవి శక్తి పేరుతొ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది.

కోవిడ్-19 సమయంలో విదేశాల నుండి భారతీయ పౌరులను స్వదేశానికి రప్పించే జాతీయ ప్రయత్నంలో భాగంగా మే 2020లో ఆపరేషన్ సముద్ర సేతు ప్రారంభించబడింది. 2021లో భారత నౌకాదళం భారతదేశానికి ఆక్సిజన్ నింపిన కంటైనర్‌లను రవాణా చేయడానికి ఆపరేషన్ సముద్ర సేతు-II ని నిర్వహించింది.

2022లో రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం వలన ఉక్రెయిన్ లో ఇరుక్కున్న భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి ఆపరేషన్ గంగా పేరుతొ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. 2015 లో నేపాల్ లో సంభవించిన భయంకర భూకంపములో సర్వం కోల్పోయిన నేపాల్ దేశానికి సహాయ సహకారాలు అందించడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ మైత్రిని నిర్వహించింది.

హైదరాబాద్‌లో ఫార్ములా ఇ-ఛాంపియన్‌షిప్‌

హైదరాబాద్‌లో ఫార్ములా ఇ-ఛాంపియన్‌షిప్‌ను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఫిబ్రవరి 11న జెండా ఊపి ప్రారంభించారు. భారతదేశపు మొట్టమొదటి ఫార్ములా ఈ-రేస్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చింది. విద్యుత్ శక్తితో నడిచే కార్ల రేసు కావడంతో దీనిని ఫార్ములా ఈ-రేస్‌గా పేరు పెట్టారు. దీనితో హైదరాబాద్ ఫార్ములా ఇ-రేస్‌ నిర్వహించిన 27వ నగరంగా నిలిచింది. ఈ తొలి ఆల్-ఎలక్ట్రిక్ రేసులో జీన్-ఎరిక్ వెర్గ్నే విజేతగా నిలిచాడు.

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లేక్ మరియు ఎన్టీఆర్ మార్గ్ ఒడ్డున ఉన్న 'హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్' ఈ ఫార్ములా ఇ-రేస్ హైదరాబాద్ ఇ-ప్రిక్స్‌కు వేదికయ్యింది. 2013లో నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో జరిగిన చివరి ఫార్ములా 1 ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ తర్వాత భారతదేశంలో జరిగే మొదటి ఎఫ్ఐఏ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఈవెంట్ ఇది.

దుబాయ్‌లో వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2023

వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2023 ఫిబ్రవరి 13 న దుబాయ్‌లోని మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్‌లో హోస్ట్ చేయబడింది. ఈ వార్షిక సమ్మిట్ "షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్" అనే థీమ్‌తో నిర్వహించారు. మూడు రోజుల సమావేశానికి వివిధ దేశాల ప్రభుత్వాధినేతలు, మంత్రులు, సీఈవోలు, నిపుణులు మరియు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సహా విభిన్న శ్రేణి వక్తలు నిపుణులు హాజరవుతారు.

వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అనేది దుబాయ్‌లో ప్రతి సంవత్సరం జరిగే గ్లోబల్ ఫోరమ్. ఇది మానవాళి ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలపై చర్చించడం, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల భవిష్యత్తును రూపొందించడం, కొత్త ఆలోచనలు, సాంకేతికతలు మరియు పాలనలో అత్యుత్తమ అభ్యాసాలను అన్వేషించడం, ప్రభుత్వ రంగంలో సానుకూల మార్పును మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఈ సమ్మిట్ యొక్క ప్రధాన లక్ష్యం.

ఉత్తరాఖండ్ యాంటీ కాపీయింగ్ చట్టంకు గవర్నర్ ఆమోదం

దేశంలోనే అత్యంత కఠినమైన కాపీయింగ్ నిరోధక చట్టంను ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఉత్తరాఖండ్ పోటీ పరీక్ష (రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలపై నివారణ చర్యలు) ఆర్డినెన్స్ 2023ని ఫిబ్రవరి 10న ఆ రాష్ట్ర గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ ఆమోదించారు.

ఈ యాంటీ కాపీయింగ్ చట్టం యందు కాపీ క్యాట్ మాఫియాకు జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10 కోట్ల రూపాయల జరిమానా విధించే నిబంధన ఉంది. అంతే కాకుండా కాపీయింగ్ మాఫియా ఆస్తులను అటాచ్ చేయాలనే నిబంధన కూడా చేర్చారు. పోటీ పరీక్షలో అవినీతిని, మాస్ కాపీయింగ్ నిరోధించేందుకు ఈ కఠిన చట్టాన్ని పుష్కర్‌ సింగ్‌ ధామి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది.

ముంబై నుంచి మరో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు ప్రారంభం

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి రెండు వందేభారత్ రైళ్లను ఫిబ్రవరి 10న ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. వీటిలో ఒకటి ముంబై - షోలాపూర్ మధ్య, మరొకటి ముంబై - సాయినగర్ షిర్డీల మధ్య ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. దీనితో భారతదేశంలో ఇప్పుడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్యా 10కి చేరుకుంది.

దేశంలో మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ - వారణాసి మధ్య ప్రారంభించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వే నడుపుతున్న ప్రతిష్టాత్మక ఆధునిక సెమీ-హై స్పీడ్ రైలుగా పరిగణించ బడుతుంది. భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవ కింద చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని తయారు చేస్తుంది. ఇవి గరిష్టంగా గంటకు 160 కిమీ వేగంతో నడుస్తాయి.

  1. న్యూఢిల్లీ - వారణాసి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (759 కిమీ)
  2. న్యూఢిల్లీ - శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (655 కిమీ)
  3. ముంబై సెంట్రల్ - గాంధీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (522 కిమీ)
  4. న్యూఢిల్లీ - అంబ్ అందౌర వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (412 కిమీ)
  5. చెన్నై సెంట్రల్ - మైసూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (496 కిమీ)
  6. బిలాస్‌పూర్ - నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (412 కిమీ)
  7. హౌరా - న్యూ జల్పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (561 కిమీ)
  8. విశాఖపట్నం - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (698 కిమీ)
  9. ముంబై సెంట్రల్ - షోలాపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (452 కిమీ)
  10. ముంబై సెంట్రల్ - షిర్డీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (343 కిమీ)

ఇస్రో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఫిబ్రవరి 10 చేపట్టిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV - D2) రెండవ ఎడిషన్‌ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి 09:18 IST గంటలకు బయలుదేరిన ఈ ఉపగ్రహ వాహనం, ఉపగ్రహాలను భూకక్ష్యలోకి ఇంజెక్ట్ చేయడానికి దాదాపు 15 నిమిషాల సమయం తీసుకుంది.

స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది ఇస్రోచే అభివృద్ధి చేయబడిన కొత్త చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం. ఇది 34 మీటర్ల పొడవు, 2 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. ఇది 500 కిలోల వరకు చిన్న ఉపగ్రహాలను తక్కువ భూమి కక్ష్యలోకి చేర్చేందుకు ఉపయోగపడుతుంది. ఇది భవిష్యత్తులో బహుళ సంఖ్యలో చిన్న వాణిజ్య ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో అంతరిక్షలోకి ప్రయోగించేందుకు సహకరించనుంది.

మూడు ఫార్మాట్‌లలో సెంచరీలు సాధించిన తొలి భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ

అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లలో సెంచరీలు సాధించిన తొలి భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. అలానే అంతర్జాతీయ ఈ ఘనత దక్కించుకున్న నాల్గొవ కెప్టెన్‌గా అవతరించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టులో ఈ రికార్డు నమోదు చేసాడు.

రోహిత్ శర్మ కంటే ముందు, అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లలో సెంచరీలు సాధించిన కెప్టెన్‌ల జాబితాలో తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక), ఫాఫ్ డు ప్లెసిస్ (దక్షిణాఫ్రికా), బాబర్ ఆజం (పాకిస్తాన్) లు ఉన్నారు. అయితే మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారత క్రికెటరుగా సురేష్ రైనా ఈ ఘనతను దక్కించుకున్నాడు.

సైప్రస్ తదుపరి అధ్యక్షుడిగా నికోస్ క్రిస్టోడౌలిడెస్

సైప్రస్ తదుపరి అధ్యక్షుడిగా నికోస్ క్రిస్టోడౌలిడెస్ మార్చి 1న బాధ్యతలు స్వీకరించనున్నారు. అధ్యక్ష ఎన్నికలలో 49 ఏళ్ల క్రిస్టోడౌలిడెస్ 51.9 % ఓట్లను దక్కించుకోగా, రన్‌ఆఫ్ ప్రత్యర్థి ఆండ్రియాస్ మావ్రోయినిస్ 48.1% ఓట్లను మాత్రమే సాధించాడు.

సైప్రస్ తూర్పు మధ్యధరా సముద్రంలో అనటోలియన్ ద్వీపకల్పానికి దక్షిణంగా ఉన్న ఒక ద్వీప దేశం. ఇది భౌగోళికంగా పశ్చిమ ఆసియాలో ఉన్నప్పటికీ, ఇది రాజకీయంగా యూరప్ ఖండంలోకి వస్తుంది. దీని రాజధాని నగరం నికోసియా, అధికారిక కరెన్సీ - యూరో, అధికారిక భాషలు - గ్రీకు, టర్కిష్.


తెలుగులో ఫిబ్రవరి 2023 కరెంట్ అఫైర్స్

దయానంద్ సరస్వతి 200వ జయంతిని ప్రారంభించిన ప్రధాని మోదీ

ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో మహర్షి దయానంద్ 200వ జయంతిని పురస్కరించుకుని ఏడాది పొడవునా జరిగే వేడుకలను ఫిబ్రవరి 12న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సంస్మరణ సందర్భంగా ఆయన లోగోను కూడా విడుదల చేశారు.

స్వామి దయానంద సరస్వతి ఆర్యసమాజ్ స్థాపకుడుగా, భారతీయ తత్వవేత్తగా, సామాజిక నాయకుడుగా మరియు వైదిక ధర్మం యొక్క సంస్కరణకర్తగా ప్రసిద్ధి. స్వామి దయానంద గో బ్యాక్ టు ది వేదస్ ' అనే నినాదాన్ని ఇచ్చాడు. అన్ని రకాల ప్రజలకు మరియు మతాలకు సమాన హక్కు మరియు గౌరవాన్ని ఇచ్చాడు. ఈయన 1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించాడు.

2వ ఇండియన్ రైస్ కాంగ్రెస్‌ను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

కటక్‌లోని ఐసిఏఆర్-నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 2 వ ఇండియన్ రైస్ కాంగ్రెస్‌ను ఫిబ్రవరి 11న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. రెండేళ్లకోసారి నిర్వహిస్తున్న ఈ సమావేశాలను ఈ ఏడాది "ట్రాన్సఫార్మింగ్ రైస్ రీసెర్చ్" థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలు ఫిబ్రవరి 11 నుండి 14 వరకు నాలుగు రోజుల పాటు జరగనున్నాయి.

ఈ కార్యక్రమానికి ఒడిశా గవర్నర్ ప్రొఫెసర్ గణేశి లాల్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఒడిశా వ్యవసాయ శాఖ మంత్రి రణేంద్ర ప్రతాప్ స్వైన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సమావేశాలు రైస్ పరిశోధన సంభందిత అంశాలను చేర్చించేందుకు నిర్వహిస్తారు.

డబ్ల్యుపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా స్మృతి మంధాన

ముంబైలో జరిగిన ప్రారంభ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలిచింది. ఈమెను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం రూ. 3.4 కోట్లకు కొనుగోలు చేసింది.

ఈ వేలంలో అమ్ముడుపోయిన ఇతర మహిళా క్రికెటర్లలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రూ. 1.8 కోట్లు, ఆష్లీ గార్డనర్ (రూ. 3.2 కోట్లు), ఎలీస్ పెర్రీ (రూ. 1.7 కోట్లు), బెత్ మూనీ (రూ. 2 కోట్లు), మెగ్ లానింగ్ (రూ. 1.1 కోట్లు), నటాలీ స్కివర్-బ్రంట్ (రూ. 3.2 కోట్లు) ఉన్నారు.

అండర్-19 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టు కెప్టెన్‌గా ఉన్న షఫాలీ వర్మ (రూ. 2 కోట్లు), జెమీమా రోడ్రిగ్స్ (రూ. 2.2 కోట్లు) మరియు రిచా ఘోష్ (రూ. 1.9 కోట్లు) దక్కించుకున్నారు. ఈ ఏడాది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఐదు జట్లతో పూర్తిస్థాయిలో నిర్వహిస్తున్నారు.

ఇండియా ఇంటర్నేషనల్ సీఫుడ్ షో 2023కి కోల్‌కతా ఆతిథ్యం

ఇండియా ఇంటర్నేషనల్ సీఫుడ్ షో (ఐఐఎస్‌ఎస్) 23వ ఎడిషన్ కోల్‌కతాలోని బిస్వా బంగ్లా మేళా ప్రాంగన్‌లో ఫిబ్రవరి 15 నుండి ఫిబ్రవరి 17 మధ్య నిర్వహించబడుతుంది. ఇండియా ఇంటర్నేషనల్ సీఫుడ్ షో ఆసియాలో అతిపెద్ద సీఫుడ్ ఫెయిర్‌లలో ఒకటి. ఇది రెండేళ్లకోసారి నిర్వహించబడుతుంది.

ఈ సమావేశాల ద్వారా భారతీయ సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులు మరియు దిగుమతిదారులు, ఉత్పత్తిదారులు, ప్రాసెసర్లు, ప్రాసెసింగ్ యంత్రాల తయారీదారులు, అనుసంధాన రంగాలు, సాంకేతిక నిపుణులు ఒక చోట చేరి, సీఫుడ్ పరిశ్రమ సంబంధిత చర్చలు నిర్వహిస్తారు.

2 Comments

Post Comment