తెలుగులో వీక్లీ కరెంట్ అఫైర్స్ 27 మార్చి 2023 | పోటీ పరీక్షల ప్రత్యేకం
Telugu Current Affairs

తెలుగులో వీక్లీ కరెంట్ అఫైర్స్ 27 మార్చి 2023 | పోటీ పరీక్షల ప్రత్యేకం

వీక్లీ కరెంట్ అఫైర్స్ 27 మార్చి 2023 తెలుగులో ఉచితంగా పొందండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే, బ్యాంకింగ్ వంటి వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఔత్సాహికుల కోసం తాజాగా చోటు చేసుకున్న జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను పోటీ పరీక్షల దృక్కోణంలో అందిస్తున్నాం.

Advertisement

డబ్ల్యుపిఎల్ 2023 విజేతగా ముంబై ఇండియన్స్

ఐదు ఫ్రాంచైజీలతో బీసీసీఐ నిర్వహించిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తోలి సీజన్ విజేతగా ముంబై ఇండియన్స్ అవతరించింది. 26 మార్చి 2023న ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై జట్టు, మెగ్-లానింగ్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ విజేతగా నిలిచింది. డబ్ల్యుపిఎల్ విజేత జట్టుకు 6 కోట్లు, రన్నర్-అప్ జట్టుకు 3 కోట్ల ప్రైజ్ మనీ అందజేశారు.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌ను 4 మార్చి నుండి 26 మార్చి 2023 మధ్య ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం మరియు డీవై పాటిల్ స్టేడియంలో డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో నిర్వహించారు. అత్యధిక పాయింట్లతో పూర్తి చేసిన మూడు జట్లు పోటీలో ప్లేఆఫ్ దశల్లోకి ప్రవేశిస్తాయి. తోలి సీజన్ విజయవంతమైతే భవిష్యత్ సీజన్‌లలో మ్యాచ్‌లు మరియు ఫ్రాంచైజీల సంఖ్యను పెంచాలని బీసీసీఐ యోచిస్తోంది.

  • డబ్ల్యుపిఎల్ 2023 విజేత : ముంబై ఇండియన్స్
  • డబ్ల్యుపిఎల్ 2023 రన్నర్-అప్ : ఢిల్లీ క్యాపిటల్స్‌
  • ఆరెంజ్ క్యాప్ (అత్యధిక రన్ స్కోరర్) : మెగ్ లానింగ్ (345 పరుగులు)
  • పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్ టేకర్) : హేలీ మాథ్యూస్ (16 వికెట్లు)
  • పవర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ : సోఫీ డివైన్ (13 సిక్సర్లు)
  • సీజన్‌లో అత్యంత విలువైన క్రీడాకారిణి - హేలీ మాథ్యూస్ (271 పరుగులు, 16 వికెట్లు)
  • ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ : యాస్తికా భాటియా (214 పరుగులు మరియు 13 ఔట్‌లు)
  • ఫెయిర్‌ప్లే అవార్డు : ముంబై ఇండియన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్

ప్రపంచ అత్యుత్తమ విమానాశ్రయంగా సింగపూర్ చాంగి ఎయిర్‌పోర్ట్

సింగపూర్‌లోని చాంగి విమానాశ్రయం రికార్డు స్థాయిలో 12వ సారి "ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయం"గా నిలిచింది. ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డు వేడుకలో సింగపూర్ చాంగి ఎయిర్‌పోర్ట్ 2023 ఏడాదికి సంబంధించి వరల్డ్స్ బెస్ట్ ఎయిర్‌పోర్ట్‌గా ఎంపికైంది. ఈ జాబితాలో దోహా హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రెండవ స్థానంలో, టోక్యో హనేడా ఎయిర్‌పోర్ట్ 3వ స్థానంతో పాటుగా ప్రపంచంలోని క్లీనెస్ట్ ఎయిర్‌పోర్ట్, వరల్డ్ బెస్ట్ డొమెస్టిక్ ఎయిర్‌పోర్టుగా నిలిచింది.

ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ భారతదేశం మరియు దక్షిణాసియాలో ఉత్తమ విమానాశ్రయంగా అవార్డును అందుకోగా, హైదరాబాద్ విమానాశ్రయం భారతదేశం & దక్షిణాసియాలో ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా నిలిచింది. ఇస్తాంబుల్ విమానాశ్రయం దాదాపు 60+ మిలియన్ల ప్రయాణికులతో అత్యంత రద్దీగల విమానాశ్రయంగా నిలిచింది.

స్కైట్రాక్స్ వార్షిక వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డ్‌లు, విమానాశ్రయ పరిశ్రమకు ప్రతిష్టాత్మకమైనవిగా పరిగణించబడతాయి. ఈ అవార్డులు వార్షిక గ్లోబల్ ఎయిర్‌పోర్ట్ కస్టమర్ సంతృప్తి సర్వేలో కస్టమర్‌లు వేసిన ఓటు ద్వారా నిర్ణయిస్తారు. ఈ సర్వే ప్రపంచ వ్యాప్తంగా 550కి పైగా విమానాశ్రయాల పరిధిలో ఏడాది పొడుగునా నిర్వహిస్తారు. ఈ అవార్డులు ప్రపంచ విమానాశ్రయ పరిశ్రమకు నాణ్యమైన బెంచ్‌మార్క్‌.

బంగ్లాదేశ్‌లో తోలి సబ్‌మెరైన్ బేస్ ప్రారంభం

మార్చి 20న కాక్స్ బజార్‌లోని పెకువాలో బంగ్లాదేశ్ మొదటి జలాంతర్గామి స్థావరం 'బిఎన్ఎస్ షేక్ హసీనా'ను ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించబడిన ఈ నావికా స్థావరాన్ని 'అల్ట్రా మోడ్రన్ సబ్‌మెరైన్ బేస్'గా ప్రశంసించిన ఆమె, బంగ్లాదేశ్ నావికా దళ చరిత్రలో ఈ కార్యక్రమాన్ని గర్వించదగ్గ అధ్యాయమంగా పేర్కొన్నారు.

ప్రస్తుతం బంగ్లాదేశ్ నైవికాదళంలో 4 యుద్ధనౌకలు, 6 కొర్వెట్‌లు, 4 పెద్ద పెట్రోలింగ్ క్రాఫ్ట్‌లు, 5 పెట్రోలింగ్ క్రాఫ్ట్‌లు మరియు 2 శిక్షణా నౌకలతో సహా మొత్తం 31 యుద్ధనౌకలు ఉన్నట్లు వెల్లడించారు. 2017లో బంగ్లాదేశ్ నావికాదళంలోకి తొలిసారి బిఎన్ఎస్ నోబోజాత్రా మరియు బిఎన్ఎస్ జాయ్‌జాత్రా అనే రెండు జలాంతర్గాములు చేర్చింది. ప్రస్తుతం ప్రారంభించిన సబ్‌మెరైన్ బేస్ నిర్మాణం కోసం 2019 సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్ ప్రభుత్వం చైనాతో ఒప్పందం కుదుర్చుకుంది.

రాయ్‌బరేలీలోని హాకీ స్టేడియంకు రాణి రాంపాల్ పేరు

భారత మహిళా హాకీ జట్టు మాజీ కెప్టెన్ రాణి రాంపాల్ పేరు మీద రాయబరేలీలోని ఇండియన్ రైల్వేస్ మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీ స్టేడియం పేరును రాణిస్ గర్ల్స్ హాకీ టర్ఫ్‌గా మార్చారు. దీనితో తన పేరిట ఒక స్టేడియంను కలిగి ఉన్న మొదటి మహిళ క్రీడాకారిణిగా నిలిచింది. ఈమె 2020లో భారతదేశ అత్యున్నత క్రీడా గౌరవం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నను అందుకున్నారు. అదే ఏడాది భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది.

రాణి రాంపాల్ 2009లో అరంగేట్రం చేసినప్పటి నుండి భారతదేశం తరపున 250కి పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. 2017 మహిళల ఆసియా కప్ టైటిల్ విజేత జట్టులో భాగంగా ఉన్నారు. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో ఆమె సారథ్యంలోని భారత మహిళల హాకీ జట్టు చారిత్రాత్మకంగా నాల్గవ స్థానంలో నిలిచింది.

యాంటీ సబ్‌మెరైన్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ ఆండ్రోత్ ప్రారంభం

కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్‌లో ఐఎన్ఎస్ ఆండ్రోత్ పేరుతో నిర్మించిన రెండవ యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ప్రారంభించబడింది. దీనికి కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో ఆండ్రోత్ ద్విపం పేరును నామకరణం చేశారు. యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ (ASW - SWC) కొర్వెట్‌లు అనేవి ప్రస్తుతం ఇండియన్ నేవీ కోసం నిర్మించబడుతున్న ఆధునాతన యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ నౌకలు.

భారతీయ నావికాదళంలోని పాత అభయ్ - క్లాస్ కార్వెట్‌లకు ప్రత్యామ్నాయంగా వీటిని రూపొందిస్తున్నారు. ఇవి సముద్రతీర-జలాల్లో ఉపరితల నిఘా, శోధన మరియు వార్ యూనిట్లుగా విధులు నిర్వర్తిస్తాయి. నావికా విమానాలతో సమన్వయ పరచబడిన జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ కార్యకలాపాలకు వీటిని ఉపయోగించనున్నారు.

వీటిని కొచ్చిన్ షిప్‌యార్డ్ మరియు కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజనీర్స్ రూపొందిస్తున్నారు. 29 ఏప్రిల్ 2019లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఈ ఒప్పందం కూర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 2026 నాటికి మొత్తం 16 నౌకలను రూపొందించి భారత నౌకాదళానికి అప్పజెప్పాల్సి ఉంటుంది. వీటిలో గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ మొత్తం 8 నౌకులను నిర్మిస్తున్నారు. ఇప్పటికే గత డిసెంబర్ 20న యాంటీ సబ్‌మెరైన్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ ఆర్నాలా ప్రారంభించబడింది.

ఆరోగ్య హక్కు బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా రాజస్థాన్

దేశంలో ఆరోగ్య హక్కు చట్టాన్ని ఆమోదించిన మొదటి రాష్ట్రంగా రాజస్థాన్ అవతరించింది. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం 2021-2022 రాష్ట్ర బడ్జెట్‌లో చిరంజీవి ఆరోగ్య బీమా పేరుతొ నూతన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అప్పటిలోనే రాష్ట్రలోని నివాసితులందరికీ ఆరోగ్య బీమాను అందించిన భారతదేశంలో మొదటి రాష్ట్రంగా అవతరించింది. ఇప్పుడు దీనికి అనుబంధంగా ఆరోగ్య హక్కును చట్టంగా చేసింది.

మార్చి 21న ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆరోగ్య హక్కు బిల్లు ఆమోదం పొందింది. దీని ప్రకారం రాష్ట్రంలోని ప్రతి నివాసికి ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రైవేట్‌గా నడిచే ఆరోగ్య సంస్థలలో తప్పనిసరిగా ఉచిత అత్యవసర చికిత్సను అందించాల్సి ఉంటుంది. అనగా ఎటువంటి ముందస్తు చెల్లింపు లేకుండా అత్యవసర చికిత్స పొందే హక్కును ఇది కల్పిస్తుంది.

ఆ రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌ల వైద్యులు మరియు పారామెడికల్ సిబ్బంది ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తపరుస్తున్నారు. ప్రభుత్వం ఈ బిల్లులో కఠినమైన నిబంధనలు చేర్చి, ప్రైవేట్ ఆరోగ్య రంగాన్ని అణిచివేస్తుందని ఆరోపిస్తున్నారు. అత్యవసర పరిస్థితిని సరిగా నిర్వచించకుండా ఉచిత చికిత్స అందించడాన్ని ఈ బిల్లు తప్పనిసరి చేసిందని ఆందోళన చెందుతున్నారు.

స్టార్‌బక్స్ సీఈఓగా లక్ష్మణ్ నరసింహన్

భారతీయ సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్, అమెరికా కాఫీహౌస్ చైన్ 'స్టార్‌బక్స్' సంస్థకు తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా బాధ్యతలు స్వీకరించారు. లక్ష్మణ్ నరసింహన్ గత అక్టోబర్ నుండే స్టార్‌బక్స్‌లో ఇన్‌కమింగ్ సీఈఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ రంగంలో ఆయన దాదాపు 30 ఏళ్ళ అనుభవం కలిగి ఉన్నారు.

వాయు ప్రహార్ శిక్షణ వ్యాయామం విజయవంతం

భారత సైన్యం మరియు వైమానిక దళం, చైనా సరిహద్దు వెంబడి వాస్తవ నియంత్రణ రేఖకు (LAC) సమీపంలో  వాయు ప్రహార్ అనే 92 గంటల ఉమ్మడి వ్యాయామాన్ని విజయవంతంగా పూర్తి చేశాయి. ఇరు సాయుధదళాల మధ్య అవగహన పెంపొందించేందుకు మరియు వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం కల్పించేందుకు ఈ శిక్షణ వ్యాయామం నిర్వహిస్తారు.

యూఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ 52వ సెషన్‌లో వార్ & ఉమెన్ బుక్ విడుదల

బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ సమయంలో జరిగిన యుద్ధ నేరాలను వివరిస్తూ 'వార్ అండ్ ఉమెన్' అనే పుస్తకాన్ని మార్చి 24న జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 52వ సెషన్‌లో విడుదల చేశారు. డాక్టర్ ఎంఏ హసన్ రాసిన ఈ పుస్తకంలో, 1971 లిబరేషన్ వార్ సమయంలో పాకిస్తాన్ సైన్యం మహిళలపై చేసిన లైంగిక వేధింపులు, హింసలు మరియు హత్యల పరిమాణాన్ని వివరించారు.

లోక్‌సభ ఎంపీగా రాహుల్‌గాంధీపై అనర్హత వేటు

కాంగ్రెస్ నాయకుడు మరియు వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. 2019 ఎన్నికల సమయంలో మోడీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నేరపూరిత పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ పరువు నష్టం కేసులో రాహుల్‌కి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అదే సమయంలో అతనికి బెయిల్ కూడా మంజూరు చేసింది. పై కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి వీలుగా శిక్షను 30 రోజుల పాటు సస్పెండ్ చేసింది.

అయితే ఈ కోర్టు కేసు వెలువడిన మరుసటి రోజే లోక్‌సభ సెక్రటేరియట్, రాహుల్ గాంధీని వాయనాడ్ లోక్‌సభ సభ్యునిగా అనర్హులుగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేరారోపణపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించకపోతే, వచ్చే ఎనిమిదేళ్లపాటు రాహుల్ గాంధీ ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధించబడతారు. ఈ పరిణామాలన్నింటిని, కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రతీకార చర్యగా ఆరోపిస్తూ దేశవ్యాప్త సత్యాగ్రహ దీక్షను ప్రారంభించింది.

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(4) ప్రకారం ఎన్నికైన ప్రజాప్రతినిధులపై అనర్హుత వేసే ముందు, వారి నేరారోపణపై అప్పీలు చేసుకోవడానికి మూడు నెలలు సమయం ఇవ్వాలనే నిబంధన ఉంది. అయితే భారత సర్వోన్నత న్యాయస్థానం 10 జూలై 2013 నాటి తీర్పులో లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును పరిష్కరిస్తూ, ఎవరైనా పార్లమెంటు సభ్యుడు (MP), సభ్యుడు శాసన సభ (MLA) లేదా శాసన మండలి సభ్యుడు (MLC) ఒక నేరానికి పాల్పడి, కనీసం రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించబడినట్లయితే, తక్షణమే ఆ సభ్యుడుపై అనర్హుత అమలులోకి వస్తుందని వెల్లడించింది.

ఈ నిర్ణయాన్ని తోసిపుచ్చే ప్రయత్నంలో భాగంగా అప్పటి కాంగ్రెస్ ఎంపీ మరియు న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్, ప్రజాప్రాతినిధ్యం బిల్లు సవరించేందుకు 2013 ఆగస్టు 30న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. నేరారోపణ జరిగిన వెంటనే ప్రతినిధులు అనర్హులుగా కాకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం కూడా ఒక రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. అయితే ఈ రెంటిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

దీనితో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ బిల్లును ఆర్డినెన్స్‌గా అమలులోకి తీసుకురావడానికి ప్రయత్నించింది. అయితే అప్పటిలో భారత జాతీయ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా ఉన్న రాహుల్ గాంధీ దీనిని తీవ్రంగా విమర్శించారు. మీడియా ముఖంగా ఈ బిల్లు కాగితాలను చించిపాడేశారు. ఏకంగా తమ యూపీఏ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రాజీనామాకే పిలుపునిచ్చారు.

దీనితో 2 అక్టోబర్ 2013న ఈ ఆర్డినెన్స్ మరియు బిల్లు రెండింటిని యూపీఏ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇప్పుడు అదే అంశం రాహుల్ గాంధీ పేరట శాపంగా మారింది. ఒక రాజకీయ సంబంధిత పరువు నష్టం కేసులో ఒక పార్లమెంట్ సభ్యుడు, ప్రతిపక్ష పార్టీ ప్రధాన నాయకుడు అనర్హుడు అవ్వడంతో దేశ రాజకీయాల్లో అలజడి మొదలైంది. ప్రజాస్వామ్య వ్యవస్థలు, న్యాయ వ్యవస్థల పనితీరుపై మేధావుల్లో అసంతృప్తి నెలకొంది. ఇప్పుడు దీనిని సరి చేయాల్సిన బాధ్యత సుప్రీం కోర్టు చేతిలో ఉంది. అయితే ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయిన మొదటి ఎంపీగా రషీద్ మసూద్ నిలిచారు.

ఇస్రో యొక్క అతిపెద్ద ఎల్‌విఎం3 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), 26 మార్చి 2023న 36 ఉపగ్రహాలతో భారతదేశపు అతిపెద్ద ఎల్‌విఎం3 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి నిర్వహించిన ఈ ప్రయోగం ద్వారా వన్‌వెబ్ గ్రూప్ కంపెనీకి చెందిన 36 ఉపగ్రహాల రెండో సెట్‌ను భూకక్ష్యలో ప్రవేశపెట్టింది. ఎల్‌విఎం3 43.5 మీటర్ల పొడవుతో 643 టన్నుల బరువును కలిగిఉంది.

యూకేకు చెందిన నెట్‌వర్క్ యాక్సెస్ అసోసియేట్స్ లిమిటెడ్ (వన్‌వెబ్ గ్రూప్ కంపెనీ) 72 ఉపగ్రహాలను లో-ఎర్త్ ఆర్బిట్స్ (LEO)లోకి ప్రవేశపెట్టడానికి ఇస్రో యొక్క వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌తో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. వన్‌వెబ్ గ్రూప్ కంపెనీకి చెందిన 36 ఉపగ్రహాల మొదటి సెట్‌ను ఇస్రో ఇదివరకే అక్టోబర్ 23, 2022న ప్రయోగించింది. వన్‌వెబ్ అనేది అంతరిక్ష ఆధారితమైన గ్లోబల్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్. ఇది ప్రభుత్వాలు మరియు వ్యాపారాల కోసం మెరుగైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుంది.

లాంచ్ వెహికల్ మార్క్-3 ( ఎల్‌విఎం3 ) అనేది జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ III ( జీఎస్ఎల్వీ) యొక్క ఆధునాతన వెర్షన్. ఇది మూడు-దశల మీడియం-లిఫ్ట్ ప్రయోగ వాహనం. దీనిని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అభివృద్ధి చేసింది. జియోస్టేషనరీ కక్ష్యలోకి కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇది రూపొందించబడింది. ఇస్రో మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు సిద్దమవుతుండటంతో దీనిని అభివృద్ధి చేసింది.

మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు 4 స్వర్ణాలు

ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు నిఖత్ జరీన్, లోవ్లినా బోర్గోహైన్, నీతు ఘంఘాస్ మరియు సావీటీ బూరాలు బంగారు పతకాలు సాధించారు. అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబీఏ) నిర్వహిస్తున్న ఈ 13వ ఎడిషన్ టోర్నమెంట్‌కు భారత్ ఆతిధ్యం ఇస్తుంది. దీనిని దేశ రాజధాని న్యూ ఢిల్లీలో మార్చి 15 నుండి 26 మార్చి 2023 వరకు నిర్వహించారు. రష్యా మరియు బెలారస్ నుండి అథ్లెట్లు పాల్గొనడం వలన ఈ ఈవెంట్‌ను మెజారిటీ దేశాలు బహిష్కరించాయి.

  1. నిఖత్ జరీన్, మేరీ కోమ్ తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 2 స్వర్ణాలు గెలుచుకున్న మొదటి భారతీయ బాక్సర్‌గా నిలిచింది. 50 కేజీల ఫైనల్‌లో నిఖత్ జరీన్ వియత్నాంకు చెందిన న్గుయెన్ థి థామ్‌ను ఓడించడం ద్వారా ఈ స్వర్ణం సొంతం చేసుకుంది. నిఖత్ గతంలో 52 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకుంది. తెలంగాణకు చెందిన జరీన్ 2022 కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది.
  2. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లోని 81 కిలోల విభాగంలో సావీటీ బూరా బంగారు పతకం సాధించింది.
  3. టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత లోవ్లినా బోర్గోహైన్ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లోని 75 కిలోల విభాగంలో  బంగారు పతకం సొంతం చేసుకుంది.
  4. ఏస్ ఇండియా బాక్సర్ నీతూ ఘంఘాస్ 48 కిలోల విభాగంలో బంగారు పతకం పొందారు. నీతూ గత ఏడాది 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా బంగారు పతక విజేతగా నిలిచింది.

కాశ్మీర్‌కు చెందిన అలియా మీర్‌కు వన్యప్రాణి సంరక్షణ అవార్డు

కాశ్మీర్‌కు చెందిన వన్యప్రాణి సంరక్షకురాలు అలియా మీర్‌కు వన్యప్రాణి సంరక్షణ అవార్డుతో సత్కరించారు. జమ్మూ కాశ్మీర్ కలెక్టివ్ ఫారెస్ట్స్ నిర్వహించిన ప్రపంచ అటవీ దినోత్సవ వేడుకల్లో లెఫ్టినెంట్ మనోజ్ సిన్హా ఆమెకు ఈ అవార్డును అందించారు. కాశ్మీర్‌ ఎలుగుబంటి వంటి వివిధ వన్యప్రాణుల సంరక్షణకు చేస్తున్న సేవకు గాను ఈ అవార్డు అందించారు.

బ్రిక్స్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అధ్యక్షురాలుగా దిల్మా వానా రౌసెఫ్

మార్కస్ ట్రోయ్జో తర్వాత న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (NDB) కొత్త అధినేతగా బ్రెజిల్ మాజీ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ అనేది 2014లో బ్రిక్స్ దేశాలతో స్థాపించబడిన బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకు. దీనిని గతంలో బ్రిక్స్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అని పిలిచేవారు. ఇది బ్రెజిల్‌లోని సియరాలో ఉంది.

న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్, బ్రిక్స్ దేశాల ప్రభుత్వ లేదా ప్రైవేట్ అభివృద్ధి ప్రాజెక్ట్‌లకు ఆర్థిక సహాయం చేస్తుంది. బ్రిక్స్ అనేది ఐదు ప్రముఖ వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు సంక్షిప్త రూపం. బ్రిక్స్ అనగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రికా అని అర్ధం. దీనిని 16 జూన్ 2009లో స్థాపించారు. దీనిని సభ్యదేశాల మధ్య శాంతి, భద్రత, అభివృద్ధి మరియు పరస్పర సహకారాన్ని ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేసారు. దీని ప్రధాన కార్యాలయం చైనాలోని షాంఘైలో ఉంది.

వైజాగ్‌లో 2వ జీ20 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశం

జీ20 ఇండియన్ ప్రెసిడెన్సీలో రెండవ జీ20 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ (IWG) సమావేశం 2023 మార్చి 28 మరియు 29 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నిర్వహించారు. రేపటి ఆర్థిక నగరాలు అనే థీమ్‌తో ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సులో జీ20 సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థల నుండి దాదాపు 63 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ ఏడాది జనవరిలో పూణేలో జరిగిన మొదటి జీ20 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశంకు కొనసాగింపుగా దీనిని నిర్వహిచారు. భారత G20 ప్రెసిడెన్సీలో 2023 మౌలిక సదుపాయాల ఎజెండాపై ప్రధానంగా చర్చలు నిర్వహించారు. ఏటా పట్టణీకరణ శాతం పెరుగుతన్న నేపథ్యంలో, దానికి తగ్గట్టుగా పట్టణ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు రూపొందించనున్నారు. ఈ సమావేశానికి ఇతర కేంద్ర మంత్రులతో సహా ఏపీ సీఎం జగన్ కూడా హాజరయ్యారు.

Advertisement

2 Comments

Post Comment