Advertisement
తెలుగు వీక్లీ కరెంట్ అఫైర్స్ : 29 మే 2023 | పోటీ పరీక్షల స్పెషల్
Study Material Telugu Current Affairs

తెలుగు వీక్లీ కరెంట్ అఫైర్స్ : 29 మే 2023 | పోటీ పరీక్షల స్పెషల్

వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ తెలుగులో అందిస్తున్నాం. యూపీఎస్‌సీ, ఎస్ఎస్‌సీ, ఏపీపీఎస్‌సీ, టీఎస్‌పీఎస్‌సీ, రైల్వే, బ్యాంకింగ్, డిఫెన్స్, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ వంటి వివిధ నియామక పరీక్షలకు సిద్దమౌతున్న ఔత్సాహికుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందించాం.

ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం

28 మే 2023 న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనంను ప్రారంభించారు. భారతదేశం యొక్క సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా న్యూ ఢిల్లీలో ఈ కొత్త పార్లమెంట్ భవనం నిర్మించబడింది. దీనికి 10 డిసెంబర్ 2020న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ భవనం 150 సంవత్సరాల కంటే ఎక్కువ జీవితకాలం ఉండేలా రూపొందించబడింది.

భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిర్మాణ శైలులు ఇందులో పొందుపరచబడ్డాయి. లోక్‌సభ మరియు రాజ్యసభ ఛాంబర్ల యందు ప్రస్తుతం ఉన్న సీటింగ్ సామర్థ్యం కంటే పెంచబడింది. లోక్‌సభ ఛాంబర్‌లో 888 సీట్లు, రాజ్యసభ ఛాంబర్‌లో 384 సీట్లు అందుబాటులో ఉంచారు. పాత పార్లమెంట్ భవనంలాగా దీనికి సెంట్రల్ హాల్ లేదు. ఉమ్మడి సెషన్‌లో లోక్‌సభ ఛాంబర్‌లో 1,272 మంది సభ్యులు పాల్గొనవచ్చు.

కొత్త భవనంలోని లోక్‌సభ చాంబర్‌లో చోళ రాజవంశం నాటి ప్రేరేపిత సెంగోల్ ఏర్పాటు చేశారు. ఇది ఇక మీదట అధికార మార్పిడి సందర్భంలో ప్రధానుల చేతులు మారనుంది. కొత్త పార్లమెంట్ భవనం దాదాపు 65,000 చ.మీ.ల విస్తీర్ణంలో షట్కోణ ఆకారంలో లేదా త్రిభుజాకార ఆకారంలో నిర్మించబడింది. సెంట్రల్ విస్టా రీడిజైన్‌కు ప్రముఖ ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్ బాధ్యత వహించారు. ఈ నిర్మాణానికి ప్రధాన కాంట్రక్టరుగా టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఆర్కిటెక్ట్ రీడిజైనరుగా హెచ్సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహరించాయి.

కొత్త పార్లమెంట్ ప్రారంబోత్సవానికి అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు దూరంగా ఉన్నాయి, ఈ ప్రారంభోత్సవంను  ప్రధానమంత్రికి బదులుగా దేశ అధినేత రాష్ట్రపతి చేతులు మీదగా జరగాలనేది వారి అభిమతం. ఈ కారణంతో ఈ వేడుకకు వారు హాజరు కాలేదు.

కొత్త పార్లమెంట్‌లో 'సెంగోల్' (దండెం) ఏర్పాటు

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మకమైన బంగారు దండెంను (సెంగోల్) లోక్‌సభ స్పీకర్‌ సీటుకు పక్కనే ఏర్పాటు చేశారు. 'సెంగోల్' అనే చారిత్రక రాజదండాన్ని, బ్రిటిష్ వారి నుండి భారతీయులకు అధికార మార్పిడికి గుర్తుగా భారతదేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూకు అందించినట్లు చరిత్ర చెప్తుంది.

సెంగోల్ అనేది ఒక తమిళ పదం, రాజదండం అని దీని అర్ధం. దీనిని ఇంతవరకు 'సెంగోల్' అలహాబాద్ మ్యూజియంలోని నెహ్రూ గ్యాలరీలో భద్రపరిచారు. దీనిని వుమ్మిడి బంగారు చెట్టి అనే స్వర్ణకారుడు 1947లో మద్రాసులో తమిళనాడు మఠాధిపతి అయిన తిరువడుత్తురై అతీనం దర్శి పర్యవేక్షణలో రూపొందించాడు.

యాత్రికులకు ఉచిత విమాన ప్రయాణాన్ని అందించిన మొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్

ముఖ్య మంత్రి తీర్థం-దర్శన్ యోజన కింద ప్రభుత్వ వ్యయంపై విమానంలో తీర్థయాత్ర నిర్వహించే దేశంలోనే మొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ అవతరించింది. చౌహాన్ ప్రభుత్వం ఈ నెల మే 21న భోపాల్ నుండి ప్రయాగ్‌రాజ్ వరకు 32 మంది సీనియర్ సిటిజన్లను విమానంలో ఉచిత తీర్థయాత్రకు పంపింది. ఈ పథకం లబ్ధిదారులు విమానంలో ప్రయాణించడం ఇదే తొలిసారి. అధికారిక ప్రకటన ప్రకారం, ఈ పథకం కింద ఇప్పటివరకు 7, 82,000 మంది వృద్ధులు 782 ప్రత్యేక రైళ్లలో తీర్థయాత్రలు చేపట్టారు.

వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 76వ సెషన్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ

మే 21న స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ 76 వ సెషన్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి, హాజరైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 75 సంవత్సరాలుగా ప్రపంచానికి సేవ చేయడంలో చారిత్రక మైలురాయిని పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు.

ఆరోగ్య సంరక్షణలో మరింత సహకారం కోసం నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి, కోవిడ్-19 మహమ్మారి సమయంలో బహిర్గతమైన గ్లోబల్ హెల్త్ ఆర్కిటెక్చర్‌లోని అంతరాలను ఎత్తిచూపారు. అంతర్జాతీయ సహకారం పట్ల భారతదేశం యొక్క నిబద్ధతను మోదీ ఎత్తిచూపారు. మహమ్మారి సమయంలో భారత్ 100 దేశాలకు దాదాపు 300 మిలియన్ డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్‌లను రవాణా చేసిందని తెలియజేశారు.

భారతదేశం యొక్క "వసుధైక కుటుంబం" భావజాలాన్ని విడమరిచి చెప్పారు. 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు' అనే జీ20 థీమ్‌ను కూడా ఆయన ఈ సంధర్బంగా గుర్తుచేశారు. భారత్ కేవలం మానవ ఆరోగ్యం కోసమే కాకుండా, భూమి, పర్యావరణం, ఇతర జంతుజాలాల ఆరోగ్యం కోసం పనిచేస్తుందని వెల్లడించారు.

ప్రపంచ అథ్లెటిక్స్ పురుషుల జావెలిన్‌లో నీరజ్ చోప్రా నంబర్ వన్

ప్రపంచ అథ్లెటిక్స్ తాజాగా విడుదల చేసిన పురుషుల జావెలిన్ త్రో ర్యాంకింగ్స్‌లో ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా తన కెరీర్‌లో తొలిసారిగా ప్రపంచ నంబర్ వన్ అయ్యాడు. చోప్రా 1455 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, గ్రెనడా యొక్క ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ 1433 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచాడు.

ప్రముఖ నటుడు శరత్‌బాబు కన్నుమూశారు

ప్రముఖ నటుడు శరత్‌బాబు హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 71 ఏళ్ల ఆయన గత కొద్ది కాలంగా మూత్రపిండాలు మరియు కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. జులై 31, 1951 లో జన్మించిన శరత్‌బాబు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందినవారు.

1973లో తెలుగు సినిమా "రామ రాజ్యం" ద్వారా తన నట జీవితాన్ని ప్రారంభించారు. కె దర్శకత్వం వహించిన "పట్టిన ప్రవేశం" (1977) మరియు బాలచందర్ "నిజాల్ నిజమగిరదు" (1978) వంటి చిత్రాలతో పాపులర్ అయ్యారు. తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ చిత్రాలతో సహా మొత్తం 200 కంటే ఎక్కువ చిత్రాలలో నటించారు. సపోర్టింగ్ రోల్స్ లో ఉత్తమ నటనకు గాను తొమ్మిది సార్లు నంది అవార్డులు అందుకున్నారు.

హాంకే యొక్క వార్షిక మిజరీ ఇండెక్స్‌లో జింబాబ్వే అగ్రస్థానం

ప్రపంచంలోని అత్యంత దయనీయమైన దేశాల జాబితాలో జింబాబ్వే అగ్రస్థానంలో నిలిచింది. ప్రఖ్యాత ఆర్థికవేత్త స్టీవ్ హాంకే యొక్క వార్షిక దుస్థితి సూచిక (HAMI) 2022 ఇటీవలే విడుదలయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా 157 దేశాలకు సంబంధించి ఈ ర్యాంకింగ్ విడుదల చేయగా భారత్ కూడా దాదాపు అంతే దయనీయ స్థితిలో 103వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్ దేశాల నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, బ్యాంక్-లెండింగ్ రేట్లు, జీడీపీ ఆధారంగా రూపొందించబడింది.

ఈ జాబితాలో జింబాబ్వే, వెనిజులా, సిరియా, లెబనాన్ మరియు సుడాన్ దేశాలు టాప్ 5 దయనీయ దేశాలుగా ఉండగా, మలేసియా, జపాన్, ఐర్లాండ్, కువైట్ మరియు స్విజర్లాండ్ దేశాలు దిగువ 5స్థానాలలో ఉన్నాయి.

ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో భారత షూటర్లు అరుదైన రికార్డు

కజకిస్తాన్‌లోని అల్మాటీలో జరిగిన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ISSF) ప్రపంచకప్ వేదికపై భారత మహిళా షూటర్లు తొలిసారిగా రెండు సీనియర్ వ్యక్తిగత పతకాలను గెలుచుకున్నారు. ఈ పోటీలో ఇండియాకు చెందిన గనేమత్ సెఖోన్ రజతం గెలుచుకోగా, సీనియర్ లెవెల్‌లో తొలిసారిగా కనిపించిన దర్శన రాథోడ్ కాంస్యం గెలుచుకుంది.

కజకిస్థాన్‌కు చెందిన స్థానిక ఫేవరెట్ అస్సెం ఓరిన్‌బే, షూట్-ఆఫ్ ద్వారా స్వర్ణం గెలుచుకుంది. ఇక పురుషుల స్కీట్‌లో మైరాజ్ ఖాన్, గుర్జోత్ ఖంగురా మరియు అనంత్‌జీత్ సింగ్ నరుకా పాల్గొన్నారు కానీ ఎవరూ ఫైనల్‌కు చేరుకోలేకపోయారు.

సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ టెన్నిస్ అంబాసిడర్‌గా సానియా మీర్జా

సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కు టెన్నిస్ అంబాసిడర్‌గా సానియా మీర్జాను నియమించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీనితో పాటుగా సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ యొక్క స్టూడియో షో ఎక్స్‌ట్రా సర్వ్‌లోని ప్రముఖ ప్యానెల్‌లో సానియా భాగం కానుంది. దీనితో గత ఏడాది తన కెరీరుకు రిటైర్మెంట్ ప్రకటించిన సానియా, ఇప్పుడు నూతన కెరీర్ ప్రారంభించనుంది.

సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా, డేవిస్ కప్‌తో పాటు ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ మరియు యుఎస్ ఓపెన్ వంటి నాలుగు టెన్నిస్ గ్రాండ్‌స్లామ్‌లలో మూడింటికి మీడియా హక్కులను కలిగిఉంది.

ఉత్తరాఖండ్ తొలి వందే భారత్‌ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ

ఉత్తరాఖండ్ తొలి వందే భారత్‌ రైలును మే 25న ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఇది ఉత్తరాఖండ్‌లో డెహ్రాడూన్‌ను దేశ రాజధాని న్యూఢిల్లీని కలుపుతుంది. ఇది వివిధ మార్గాల నుండి ఢిల్లీని కలుపుతున్న ఆరవ వందే భారత్ రైలు. దేశంలో మొత్తంగా 17వ వందే భారత్ రైలు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈశాన్య భారతదేశంలో మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్

ఈశాన్య ప్రాంతం యొక్క మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను 29 మే 2023 న ప్రధాని నరేంద్ర మోడీ ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఇది అస్సాంలోని గౌహతి మరియు పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయ్‌గురిలను కలుపుతుంది. ఈ అస్సాం రాష్ట్రము యొక్క మొదటి వందే భారత్ రైలు కూడా. ఇది దేశంలో మొత్తంగా 18వ వందే భారత్ రైలు. 407 కిలోమీటర్ల ఏ మార్గాన్ని కేవలం 5 గంటల 30 నిమిషాలలో చేరుకుంటుంది.

దేశంలో మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ - వారణాసి మధ్య ప్రారంభించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వే నడుపుతున్న ప్రతిష్టాత్మక ఆధునిక సెమీ-హై స్పీడ్ రైలుగా పరిగణించ బడుతుంది. భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవ కింద చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని తయారు చేస్తుంది. ఇవి గరిష్టంగా గంటకు 160 కిమీ వేగంతో నడుస్తాయి. ఇవి భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైళ్లు.

భారతదేశంలో మొత్తం వందే భారత్ రైళ్లు జాబితా

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రూట్ దూరం & సమయం ప్రారంభ తేదీ
1 న్యూఢిల్లీ - వారణాసి 759 కిమీ & 8 గం 15 ఫిబ్రవరి 2019
2 న్యూఢిల్లీ - శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా 655 కిమీ & 8 గం 3 అక్టోబర్ 2019
3 ముంబై సెంట్రల్ - గాంధీనగర్ 522 కిమీ & 6.25 గం 30 సెప్టెంబర్ 2022
4 న్యూఢిల్లీ - అంబ్ అందౌర 412 కిమీ & 5.15 గం 13 అక్టోబర్ 2022
5 చెన్నై సెంట్రల్ - మైసూరు 496 కిమీ & 6.30 గం 11 నవంబర్ 2022
6 బిలాస్‌పూర్ - నాగ్‌పూర్ 412 కిమీ & 5.30 గం 11 డిసెంబర్ 2022
7 హౌరా - న్యూ జల్పైగురి 565 కిమీ & 7.30 గం 30 డిసెంబర్ 2022
8 విశాఖపట్నం - సికింద్రాబాద్ 698 కిమీ & 8.30 గం 15 జనవరి 2023
9 ముంబై సెంట్రల్ - షోలాపూర్ 452 కిమీ & 6.30 గం 10 ఫిబ్రవరి 2023
10 ముంబై సెంట్రల్ - సాయినగర్ షిర్డీ 339 కిమీ & 5.20 గం 10 ఫిబ్రవరి 2023
11 రాణి కమలాపతి - ఢిల్లీ 702 కిమీ & 7.30 గం 1 ఏప్రిల్ 2023
12 సికింద్రాబాద్ - తిరుపతి 661 కిమీ & 8.30 గం 8 ఏప్రిల్ 2023
13 చెన్నై - కోయంబత్తూరు 411 కిమీ & 6.15 గం 8 ఏప్రిల్ 2023
14 ఢిల్లీ కంటోన్మెంట్ - అజ్మీర్ 428 కిమీ & 5.15 గం 12 ఏప్రిల్ 2023
15 తిరువనంతపురం - కాసరగోడ్ 587 కిమీ & 8.05 గం 25 ఏప్రిల్ 2023
16 హౌరా - పూరీ 500 కిమీ & 6.25 గం 18 మే 2023
17 ఆనంద్ విహార్ టెర్మినల్ (ఢిల్లీ) - డెహ్రాడూన్ 304 కిమీ & 4.45 గం 25 మే 2023
18 న్యూ జల్పైగురి - గౌహతి 407 కిమీ & 5.30 గం 29 మే 2023

సిడ్నీలోని హారిస్ పార్కుకు 'లిటిల్ ఇండియా'గా పేరు మార్పు

ఆస్ట్రేలియా ప్రభుత్వం, సిడ్నీలోని హారిస్ పార్క్ పేరును 'లిటిల్ ఇండియా'గా పేరు మార్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సిడ్నీ పర్యటన సంధర్బంగా ఈ ప్రకటన చోటు చేసుకుంది. హారిస్ పార్క్ అత్యధిక భారతీయ కమ్యూనిటీకి వేదికగా ఉంది. హారిస్ పార్క్‌ను 'లిటిల్ ఇండియా'గా ప్రకటించాలని ఆస్ట్రేలియన్ ప్రధాన మంత్రి అల్బనీస్ చేసిన ప్రకటనను నరేంద్ర మోడీ స్వాగతించారు.

అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి అరబ్ మహిళా వ్యోమగామిగా బర్నావి

అంతరిక్షంలోకి వెళ్లిన తొలి అరబ్ మహిళా వ్యోమగామిగా రయ్యానా బర్నావి చరిత్ర సృష్టించారు. యాక్సియమ్ 2 అని పిలువబడే ప్రత్యేక మిషన్‌లో భాగంగా సౌదీ రొమ్ము క్యాన్సర్ పరిశోధకురాలు రయ్యానా బర్నావి, ఇదే దేశానికి చెందిన మరో ఫైటర్ పైలట్‌ అలీ అల్-ఖర్నీలు స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకి చేరుకున్నారు.

ఈ ప్రయోగంలో వీరితో పాటుగా అమెరికాకు చెందిన ఫ్లైట్ కమాండర్ పెగ్గి విట్సన్ మరియు పైలట్ జాన్ షాఫ్‌నర్‌ కూడా ఉన్నారు. వీరు దాదాపు 8 రోజులు ఐఎస్ఎస్ యందు గడపనున్నారు. వీరు ఇప్పటికే అందులో ఉన్న యూఏఈకి చెందిన తోటి అరబ్ వ్యోమగామి సుల్తాన్ అల్ నెయాడితో చేరనున్నారు. ఇది అరబ్ ప్రపంచంలో మొట్టమొదటి దీర్ఘ-కాల అంతరిక్ష యాత్ర. సౌదీ ప్రెస్ ఏజెన్సీ ప్రకారం, ఈ బృందం "మానవ పరిశోధన, సెల్ సైన్స్ మరియు మైక్రోగ్రావిటీ వాతావరణంలో క్లౌడ్ సీడింగ్ ప్రయోగాలు నిర్వహించనున్నారు.

శ్రీ రామేశ్వరం-తిరుపతికి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు

దక్షిణ్ యాత్రలో భాగంగా శ్రీరామేశ్వరం-తిరుపతి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు మే 23, 2023 న ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుండి ఫ్లాగ్ ఆఫ్ చేయబడింది. ఈ భారత్ గౌరవ్ రైలు మైసూరు, బెంగళూరు, కన్యాకుమారి, తిరువనంతపురం, రామేశ్వరం, మదురై మరియు తిరుపతి వంటి దివ్య ప్రదేశాల సందర్శనలను 10 రాత్రులు & 11 రోజులలో "ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్" & "దేఖో" కింద కవర్ చేస్తుంది.

తెలుగు రాష్ట్రాల నుంచి తొలి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు మార్చి 19న సికంద్రాబాద్ స్టేషన్‌లో ప్రారంభించారు. ఇది పూరి, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య మరియు ప్రయాగ్‌రాజ్‌లోని చారిత్రక ప్రదేశాలను కవర్ చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి రెండవ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ఏప్రిల్ 18న విజయవాడలో ప్రారంభమైంది. ఇది వరంగల్ మరియు విజయవాడ నుండి కాశ్మీర్ వ్యాలీకి కలుపుతుంది.

దేశంలోని ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక మరియు మతపరమైన ప్రదేశాలను రైలు ద్వారా అనుసంధానించడం ద్వారా భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ 'భారత్ గౌరవ్ రైళ్లను' ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు, భారత్ గౌరవ్ రైళ్ల యొక్క 26 ట్రిప్పులు 22 రాష్ట్రాలు మరియు 04 కేంద్ర పాలిత ప్రాంతాలను కవర్ చేసాయి.

బ్రిస్బేన్‌లో కొత్త కాన్సులేట్‌ను ప్రారంభించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు

ప్రవాస భారతీయుల చిరకాల డిమాండ్‌ను నెరవేరుస్తూ క్వీన్స్‌లాండ్ రాష్ట్ర రాజధాని బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాలో తన నాల్గవ కాన్సులేట్‌ను ప్రారంభించే ప్రణాళికలను ప్రధాని మోదీ ప్రకటించారు. ఆస్ట్రేలియాలో ఇప్పటికే పెర్త్, మెల్‌బోర్న్ మరియు సిడ్నీలలో భారత్ రాయబార కార్యాలయాలు అందుబాటులో ఉన్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఈ ఒప్పందాన్ని ప్రకటించారు, ఇది ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది.

ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా ఆంథోనీ అల్బనీస్ బాధ్యతలు స్వీకరించాక ఇరు దేశాల మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది. ఇది మోదీ మరియు అల్బనీస్ మధ్య జరిగిన ఆరవ ద్వైపాక్షిక ఒప్పందంగా నిలిచింది. ఇరు నాయకుల మధ్య దౌత్య సంభాషణలు 2022లో క్వాడ్ లీడర్స్ సమ్మిట్ నుండి ఇటీవల జపాన్‌లోని హిరోషిమాలో జరిగిన జీ7 సమ్మిట్ వరకు కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ సమావేశంలో ఇండియా-ఆస్ట్రేలియా హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్‌కు సంబంధించిన నిబంధనలను ఖరారు చేశారు. గ్రీన్ హైడ్రోజన్ అవకాశాలను లక్ష్యంగా చేసుకున్న ఈ చొరవ పరిశ్రమను బలపరుస్తాయని, శక్తి లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయని మరియు ప్రపంచ ఉద్గారాల తగ్గింపు ప్రయత్నాలకు మద్దతునిస్తుందని అల్బనీస్ నొక్కిచెప్పారు.

ఈ దౌత్య పర్యటన సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తన ఆస్ట్రేలియా కౌంటర్ పెన్నీ వాంగ్‌తో కూడా సమావేశమయ్యారు. అలానే ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్ డేవిడ్ హర్లీ, ప్రతిపక్ష నేత పీటర్ డటన్‌లతో ప్రధాని మోదీ అదనపు సమావేశాలు నిర్వహించారు.

2022లో $3.5 ట్రిలియన్లను దాటిన భారతదేశ జీడీపీ

భారతదేశ జీడీపీ 2022లో 3.5 ట్రిలియన్‌ల డాలర్లను దాటినట్లు ప్రముఖ అమెరికన్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ నివేదించింది. రాబోయే కొన్ని సంవత్సరాలలో జీ-20 ఆర్థిక వ్యవస్థలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలవనున్నట్లు వెల్లడించింది. అయితే దీనికి సంస్కరణలు మరియు విధానపరమైన అడ్డంకులు పెట్టుబడికి ఆటంకం కలిగిస్తాయని కూడా హెచ్చరించింది.

బ్యూరోక్రసీ లైసెన్స్‌లను పొందడంలో మరియు వ్యాపారాలను స్థాపించడంలో ఆమోద ప్రక్రియలను మందగించవచ్చని, ప్రాజెక్ట్ గర్భధారణను పొడిగించవచ్చని పేర్కొంది. భారత్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను క్రమంగా తగ్గిస్తుందని, దీనితో వీటికి అనుకూలంగా ఉన్న ఇండోనేషియా మరియు వియత్నాం వంటి ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో పోటీపడాల్సి ఉంటుందని నివేదించింది.

వచ్చే దశాబ్దంలో తయారీ మరియు మౌలిక సదుపాయాల రంగాలలో సంవత్సరానికి 3-12 శాతం వృద్ధి నమోదు కావొచ్చు అని, అయితే భారతదేశం యొక్క సామర్థ్యం 2030 నాటికి చైనా కంటే చాలా వెనుకబడే ఉంటుందని నివేదించింది. ఆర్థిక వ్యవస్థకు బలమైన సామర్థ్యం ఉన్నప్పటికీ, పరిమిత ఆర్థిక సరళీకరణ లేదా నెమ్మదిగా పాలసీ అమలు కారణంగా భారతదేశ తయారీ మరియు మౌలిక సదుపాయాల రంగాలలో పెట్టుబడుల వేగం మందగించే ప్రమాదం ఉందని పేర్కొంది.

ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశం

బ్లూమ్‌బెర్గ్ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ యొక్క గ్లోబల్ బిజినెస్ లీడర్‌ మూడవ ఎడిషన్, మే 23-25 తేదీలలో దోహాలో జరిగింది. ఈ సమావేశం ఖతార్ ఎమిర్ అయిన అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ అద్యక్షతన నిర్వహించబడింది. ఈ ఫోరమ్ ప్రధానంగా కీనోట్ ఇంటర్వ్యూలు, ప్యానెల్ చర్చలు మరియు ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌ల ద్వారా ఫైనాన్స్, ఎనర్జీ, హెల్త్‌కేర్ మరియు టెక్నాలజీ రంగాలలో తాజా పురోగతులపై సమీక్ష చేసింది.

మూడు రోజుల ఫోరమ్‌లో ప్రభుత్వ నాయకులు, సీఈఓలు, ప్రపంచ పెట్టుబడిదారులు మరియు సంస్కృతి, క్రీడ మరియు వినోద రంగాల నుండి ప్రభావవంతమైన వ్యక్తులతో సహా 50 మంది ప్రాంతీయ మరియు అంతర్జాతీయ స్పీకర్లు మాట్లాడారు. ఈ ఈవెంట్ దోహాలోని ది కటారా టవర్స్: ఫెయిర్‌మాంట్ & రాఫెల్స్ హోటల్స్‌లో నిర్వహించబడింది.

బంగ్లాదేశ్‌కు 20 బ్రాడ్ గేజ్ లోకోమోటివ్‌లను అందజేసిన భారత్

భారత్ - బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా భారతీయ రైల్వేలు బంగ్లాదేశ్‌కు 20 బ్రాడ్ గేజ్ లోకోమోటివ్‌లను అందించాయి. ఈ లోకోమోటివ్‌లు బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న ప్రయాణీకుల మరియు సరుకు రవాణా రైలు కార్యకలాపాలను నిర్వహించడానికి సహాయపడతాయి. దీనికి సంబంధించి న్యూఢిల్లీలోని రైల్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో భారత రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, బంగ్లాదేశ్ రైల్వే మంత్రి నూరుల్ ఇస్లాం సుజన్ పాల్గొన్నారు.

అక్టోబర్ 2019లో బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా భారతదేశ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. ఈ లోకోమోటివ్‌లు, భారత ప్రభుత్వం నుండి గ్రాంట్ సహాయంగా అందించబడ్డాయి. ఇరు దేశాల సరిహద్దులో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడంలో మరియు బలోపేతం చేయడంలో మరియు ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని మెరుగుపరచడంలో భారతీయ రైల్వే కీలక పాత్ర పోషిస్తోంది.

టోక్ పిసిన్‌లో తమిళ క్లాసిక్ 'తిరుక్కురల్'ని విడుదల చేసిన ప్రధాని మోదీ

పపువా న్యూ గినియా పర్యటనలో, ప్రధాని నరేంద్ర మోదీ పురాతన తమిళ కవి స్వరపరిచిన అత్యంత గౌరవనీయమైన తమిళ క్లాసిక్ 'తిరుక్కురల్' యొక్క టోక్ పిసిన్ అనువాదాన్ని ప్రారంభించారు. వెస్ట్ న్యూ బ్రిటన్ ప్రావిన్స్‌కు చెందిన శుభా శశింద్రన్ మరియు గవర్నర్ శశింద్రన్ ముత్తువేల్ సహ రచయితగా రాసిన ఈ పుస్తకం పురాతన భారతీయ ఆలోచన మరియు సంస్కృతిని ప్రతిబింబిస్తుంది.

ఇంగ్లీష్ మాట్లాడేవారు టోక్ పిసిన్ భాషను తరచుగా న్యూ గినియా పిడ్జిన్ లేదా పిడ్జిన్ అని పిలుస్తారు. ఇది పపువా న్యూ గినియా అంతటా మాట్లాడే క్రియోల్ భాష. ఇది పాపువా న్యూ గినియా యొక్క అధికారిక భాష కూడా. ఇది పపువా న్యూ గినియాలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే భాష.

భారత లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్‌కు స్వర్ణం

గ్రీస్‌లోని కల్లిథియాలో జరిగిన అంతర్జాతీయ జంపింగ్ మీటింగ్‌లో భారత లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ స్వర్ణం సాధించగా, గ్రీస్‌కు చెందిన జెస్విన్ ఆల్డ్రిన్ రజతంతో సరిపెట్టుకున్నాడు. కామన్వెల్త్ గేమ్స్ రజత పతక విజేత అయినా శ్రీశంకర్ తన సీజన్-బెస్ట్ జంప్ 8.18 మీటర్ల రికార్డు నమోదు చేశాడు. 24 ఏళ్ల శ్రీశంకర్ గత ఏడాది గెలిచిన స్వర్ణాన్ని కాపాడుకున్నాడు, అతని కెరీర్‌లో ఇది ఆరవ అత్యుత్తమ ప్రదర్శన.

బల్గేరియన్ రచయిత జార్జి గోస్పోడినోవ్‌కు అంతర్జాతీయ బుకర్‌

ఏంజెలా రోడెల్ అనువదించిన జార్జి గోస్పోడినోవ్ యొక్క టైమ్ షెల్టర్ నవల అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ అందుకుంది. దీనితో అంతర్జాతీయ బుకర్‌ను గెలుచుకున్న బల్గేరియన్‌లో వ్రాసిన మొదటి పుస్తకంగా అవతరించింది. మే 23 న లండన్‌లోని స్కై గార్డెన్‌లో జరిగిన వేడుకలో గోస్పోడినోవ్ మరియు రోడెల్‌లకు ఈ గౌరవం లభించింది. విజేతకు 50వేల ఫౌండ్లు ప్రైజ్ మనీ అందజేశారు.

"టైమ్ షెల్టర్" గతాన్ని పునఃసృష్టించే ఒక క్లినిక్‌ని ఊహించింది వ్రాయబడింది. ఒక్కో అంతస్తు ఒక్కో దశాబ్దాన్ని పునరుత్పత్తి చేస్తుంది. చిత్తవైకల్యం ఉన్న వ్యక్తులు వారి జ్ఞాపకాలను అన్‌లాక్ చేయడంలో సహాయపడే మార్గాలను ఇది పరిచయం చేస్తుంది. ఇది ఆధునిక ప్రపంచం నుండి తప్పించుకోవడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులకు ఉద్దేశించబడి వ్రాయబడింది.

ప్రధాన అధ్యక్షతన నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం

ప్రధానమంత్రి అధ్యక్షతన నీతి ఆయోగ్ యొక్క 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం మే 27న న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని న్యూ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించబడింది. ఈ సమావేశానికి 19 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు 6 యుటిల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. ఈ సందర్బంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు నీతి ఆయోగ్‌తో కలిసి పనిచేయాలని ప్రధాని కోరారు.

కేంద్రం, రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు టీమ్ ఇండియాగా పని చేయాలని మరియు విక్షిత్ భారత్ @ 2047 కోసం ప్రజల కలలు మరియు ఆకాంక్షలను నెరవేర్చాలని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. కోఆపరేటివ్ మరియు కాంపిటేటివ్ ఫెడరలిజాన్ని బలోపేతం చేసేందుకు నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ మరియు ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ వంటి పలు కార్యక్రమాలను తీసుకుంటోందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంలో రాష్ట్రాలు మరియు కేంద్రం శ్రీ అన్నను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. అమృత్ సరోవర్ కార్యక్రమం ద్వారా నీటి సంరక్షణకు కృషి చేయాల్సిన ఆవశ్యకతపై కూడా ఆయన చర్చించారు. రాష్ట్ర స్థాయిలలో ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించడం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రధాన మంత్రి ప్రసంగించారు. గతి శక్తి పోర్టల్‌ను మౌలిక సదుపాయాలు మరియు లాజిస్టిక్స్ కోసం మాత్రమే కాకుండా స్థానిక ప్రాంతాల అభివృద్ధి మరియు సామాజిక మౌలిక సదుపాయాల కల్పన కోసం కూడా రాష్ట్రాలు చురుకుగా పనిచేయాలని కోరారు.

దేశంలో జరుగుతున్న జి20 సమావేశాల ద్వారా జి20 ప్రపంచ వేదికపై భారతదేశానికి కీర్తిని తెచ్చిపెడితే, రాష్ట్రాలకు ప్రపంచవ్యాప్త ఎక్స్‌పోజర్‌కు అవకాశం దొరుకుతుందని అన్నారు. వీటితో పాటుగా ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వడం, నారీ శక్తి, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి వంటి వివిధ అంశాలపై మాట్లాడారు.

నీతి ఆయోగ్ మునపటి ప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1న ఏర్పడిన భారత ప్రభుత్వం యొక్క అత్యున్నత పబ్లిక్ పాలసీ థింక్ ట్యాంక్‌ సంస్థ. నీతి ఆయోగ్ అనగా నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా అని అర్ధం. ఇది ఆర్థిక అభివృద్ధిని ఉత్ప్రేరకపరిచే ప్రణాళికలను, సూచనలను చేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.

  • నీతి ఆయోగ్ ఛైర్‌పర్సన్ : ప్రధాని నరేంద్ర మోడీ
  • నీతి ఆయోగ్ వైస్ ఛైర్‌పర్సన్ : సుమన్ కె. బెర్రీ
  • నీతి ఆయోగ్ సీఈఓ : బీవీఆర్ సుబ్రహ్మణ్యం

త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా సౌరవ్ గంగూలీ

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు ముఖ్యమంత్రి మాణిక్ సాహా ప్రకటించారు. త్రిపుర పర్యాటక శాఖ మంత్రి సుశాంత చౌదరి రాష్ట్ర అధికారులతో కలిసి కోల్‌కతాలోని తన నివాసంలో గంగూలీని కలుసుకుని, ఈ ప్రతిపాదనపై చర్చించిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. త్రిపుర టూరిజంకు గ్లోబల్ మార్క్ గుర్తింపు అందించడంలో భాగంగా ఈ నియామకం చోటు చేసుకుంది.

బాస్కెట్‌బాల్ నూతన అధ్యక్షుడిగా డాక్టర్ కె. గోవిందరాజ్

అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ యొక్క ఆసియా అధ్యక్షుడిగా డాక్టర్ కె గోవిందరాజ్ ఎన్నికయ్యారు. కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడైన ఈయన ప్రస్తుతం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుగా మరియు బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడుగా విధులు నిర్వర్తిస్తున్నారు.

జార్ఖండ్ కొత్త హైకోర్టును ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మే 24న రాంచీలో సుమారు 550 కోట్ల వ్యయంతో నిర్మించిన జార్ఖండ్ హైకోర్టు కొత్త భవనాన్ని ప్రారంభించారు. జార్ఖండ్ హైకోర్టు యొక్క కొత్త భవనం ఇతర ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలకు తమ సారూప్య ప్రాజెక్టులలో పర్యావరణాన్ని కేంద్ర అంశంగా మార్చడానికి స్ఫూర్తినిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

పీఎం జన్ ధన్ యోజన యొక్క100% కవరేజీని సాధించిన రాష్ట్రంగా తెలంగాణ

తెలంగాణ రాష్ట్రం ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన యొక్క 100% కవరేజీని సాధించిన రాష్ట్రంగా నిలిచింది. ఈ జాతీయ మిషన్ ప్రారంభించినప్పటి నుండి, అన్ని వర్గాల జనాభాకు బ్యాంకింగ్ సేవలను విస్తరించడంలో ఈ రాష్ట్రం అద్భుతమైన పురోగతిని సాధించింది. సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ సర్వే ప్రకారం, రాష్ట్రం 100 శాతం కవరేజీని సాధించడంతో పాటుగా 20 శాఖల క్రింద 135 సంక్షేమ పథకాలు మరియు కార్యక్రమాల ప్రయోజనాలు బ్యాంక్ ఖాతాల ద్వారా జమ చేయబడుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 1 కోటి 11 లక్షల మంది జన్ ధన్ బ్యాంకు ఖాతాదారులు ఉన్నారు. అధికారిక రికార్డుల ప్రకారం, ఈ ఖాతాలలో 3 వేల కోట్ల రూపాయలకు పైగా బ్యాలెన్స్ ఉంచబడింది. ఇది పేదలకు బ్యాంక్ ఖాతాలు, చెల్లింపులు, క్రెడిట్, బీమా మరియు పెన్షన్‌ల వంటి ఆర్థిక సేవల ప్రాప్యతను అందించే పథకం.

కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా రూ.75 నాణెం విడుదల

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా, మే 28న రూ.75 డినామినేషన్ కలిగిన స్మారక నాణెంను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఈ నాణెం బరువు 35.35 గ్రాములు ఉంటుందని ఆర్థిక వ్యవహారాల శాఖ తెలిపింది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం, తాజా రూ.75 నాణెం 44 మిమీ వ్యాసంతో వృత్తాకారంలో ఉంది. ఇది క్వాటర్నరీ మిశ్రమంతో రూపొందించబడింది. ఇది 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్ మరియు 5 శాతం జింక్‌ల సమ్మేళనం. ఇదే వేదిక ద్వారా ప్రత్యేక స్మారక తపాలా స్టాంపు కూడా విడుదల చేసారు.

2025 నాటికి క్షయవ్యాధిని అంతం చేసే ప్రణాళిక

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన వన్ వరల్డ్ టిబి సమ్మిట్‌ వేదికగా 2025 నాటికి క్షయవ్యాధిని అంతం చేసే ప్రణాళికను భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇదే వేదికగా టీబీ-ముక్త్ పంచాయితీ, టీబీ ప్రివెంటివ్ ట్రీట్‌మెంట్ యొక్క అధికారిక పాన్-ఇండియా రోల్ అవుట్, టీబీ నియంత్రణ కోసం కుటుంబ-కేంద్రీకృత సంరక్షణ నమూనా మరియు భారతదేశ వార్షిక టీబీ నివేదిక 2023 కూడా విడుదల చేశారు.

వారణాసిలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ & హై కంటైన్‌మెంట్ లాబొరేటరీకి కూడా శంకుస్థాపన చేశారు. అదే సమయంలో టిబిని అంతం చేయడంలో పురోగతి సాధించినందుకు ఎంపిక చేసిన రాష్ట్రాలు/యుటిలు మరియు జిల్లాలకు అవార్డులు అందించారు. రాష్ట్రాలు మరియు యుటిల స్థాయిలో కర్ణాటక మరియు జమ్మూ & కాశ్మీర్, జిల్లా స్థాయిలో నీలగిరి, పుల్వామా మరియు అనంత్‌నాగ్ జిల్లాలు ఈ అవార్డులు అందుకున్నాయి.

భారతదేశంలో మొట్టమొదటి ఇ-గవర్నెన్స్ రాష్ట్రంగా కేరళ

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తమ రాష్ట్రాన్ని సంపూర్ణ ఇ - గవర్నెన్స్ రాష్ట్రంగా ప్రకటించారు. దీనితో పారదర్శకమైన మరియు సమర్ధవంతమైన ప్రభుత్వ సేవలకు మార్గం సుగమం చేస్తూ భారతదేశపు మొట్టమొదటి ఇ-పాలన కలిగిన రాష్ట్రంగా కేరళ అవతరించింది.

టోటల్ ఇ-గవర్నెన్స్ కేరళ పేరుతొ ప్రారంభించిన ఈ సమగ్ర ఇ-గవర్నెన్స్ చొరవ కింద, పౌరులు ప్రభుత్వ కార్యాలయాలను వ్యక్తిగతంగా సందర్శించాల్సిన అవసరాన్ని తొలగించడం ద్వారా ప్రజలకు నేరుగా సేవలను అందించాలని కేరళ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇంటర్నెట్ సదుపాయాన్ని పౌరుల హక్కుగా మార్చిన కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ ప్రాజెక్ట్‌, ఈ ఇ-గవర్నెన్స్ చొరవను ముందుకు తీసుకుపోవడంలో కీలక పాత్ర వహించింది. ఇది దేశంలో ప్రారంభమైన తోలి ప్రభుత్వ ఇంటర్నెట్ ప్రొవైడర్ సంస్థ. ఇది కేరళ నివాసితులకు సరసమైన ధరలో ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది.

చండీగఢ్ పశుసంవర్ధక మరియు ఫిషరీస్ శాఖకు స్కోచ్ అవార్డు

చండీగఢ్ పశుసంవర్ధక మరియు మత్స్య శాఖ, వైద్యరంగంలోని కంప్యూటరీకరణ మరియు ఇ-గవర్నెన్స్ కోసం స్కోచ్ సిల్వర్ అవార్డు 2023 పొందింది. చికిత్స పొందుతున్న పశువుల వైద్య రికార్డుల కంప్యూటరీకరణ చేసే ఈ తరహా ప్రాజెక్టు దేశంలోనే తొలిసారి.

ఈ వెబ్ ఆధారిత అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ చండీగఢ్‌లోని పశుసంవర్ధక శాఖలోని ఐదు ప్రభుత్వ వెటర్నరీ హాస్పిటల్‌లు మరియు తొమ్మిది వెటర్నరీ సబ్‌సెంటర్‌లతో అనుసందించబడి ఉంది. ఇది జంతువుల యజమానులకు వారి జంతువులను చికిత్స కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడం మరియు కృత్రిమ గర్భధారణ, టీకాలు వేయడం వంటి ఇతర సేవలను సులభతరం చేస్తుంది.

సిఐఐ నూతన అధ్యక్షుడిగా ఆర్ దినేష్

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ యొక్క నూతన అధ్యక్షుడిగా ఆర్ దినేష్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2023-24 సంవత్సరానికి గాను ఆయన ఈ హోదాలో ఉండనున్నారు. దినేష్ ఇది వరకు టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మనుగా విధులు నిర్వర్తించే వారు.

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనేది 1895లో స్థాపించబడిన ప్రభుత్వేతర వాణిజ్య సంఘం మరియు న్యాయవాద సమూహం. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇది ప్రపంచ, ప్రాంతీయ మరియు పరిశ్రమల అజెండాలను రూపొందించడానికి వ్యాపార, రాజకీయ, విద్యావేత్త మరియు సమాజంలోని ఇతర నాయకులను నిమగ్నం చేస్తుంది. ఇది సభ్యత్వ ఆధారిత సంస్థ.

అరబ్‌శాట్ బిఎడిఆర్-8 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన స్పేస్‌ఎక్స్

స్పేస్‌ఎక్స్ సౌదీ అరేబియాకు చెందిన ఫ్లీట్ ఆపరేటర్ అరబ్‌శాట్ బిఎడిఆర్-8 ఉపగ్రహాన్ని మే 27న కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇది టీవ ప్రసార మరియు టెలికాం ప్రసారాలకు సంబంధించి సేవలు అందించనుంది. దీనిలో జామింగ్-రెసిస్టెంట్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్ పేలోడ్ డెమోన్‌స్ట్రేటర్ ఉంది. ఈ ఉపగ్రహాన్ని ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుండి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించారు.

ఈ టెలీ కమ్యూనికేషన్ ఉపగ్రహం మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రిక, యూరోప్ మరియు సెంట్రల్ ఆసియా ప్రాంతాలలో టీవ మరియు టెలికాం ప్రసారాలకు ఉపాయోగపడనుంది.

ఆల్కహాల్ హెల్త్ లేబులింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిన మొదటి దేశంగా ఐర్లాండ్

క్యాలరీ కంటెంట్‌పై ప్రజలను అప్రమత్తం చేయడానికి ఆల్కహాలిక్ డ్రింక్స్‌పై హెల్త్ లేబులింగ్‌ను తప్పనిసరి చేసిన ప్రపంచంలోనే మొదటి దేశంగా ఐర్లాండ్ అవతరించింది. ఈ లేబులింగ్ వినియోగదారులకు ప్రోడక్ట్ యొక్క కేలరీల కంటెంట్, ఆల్కహాల్ పరిమాణం, క్యాన్సర్ మరియు కాలేయ వ్యాధి సూచనలు మరియు గర్భధారణ సమయంలో మద్యపానం వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలియజేస్తుంది.

గ్రీన్ షిప్పింగ్ ప్రాజెక్టులకు దాదాపు 30% ఆర్థిక సహాయం ప్రకటించిన కేంద్రం

కొత్తగా నిర్మించే గ్రీన్ షిప్పింగ్ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు 30% సబ్సిడీని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం కింద గ్రీన్ షిప్పింగ్ మరియు ప్రత్యామ్నాయ ఇంధనాలపై పనిచేసే ఓడల నిర్మాణాన్ని ప్రోత్సహించడం మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 30 % ఆర్థికసాయం అందిస్తుంది. ఈ చర్య స్థిరమైన పద్ధతులను పెంపొందించడం ద్వారా భారతదేశాన్ని హరిత సముద్ర రంగం వైపు నడిపించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఫైజర్ యొక్క కోవిడ్ యాంటీవైరల్ మాత్ర పాక్స్‌లోవిడ్‌కు యూఎస్ ఆమోదం

అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, ఫైజర్ యొక్క కోవిడ్ యాంటీవైరల్ మాత్ర పాక్స్‌లోవిడ్‌ను ఆమోదించింది. ఇది తీవ్రమైన కోవిడ్ వ్యాధి ముప్పుతో ఉన్న పెద్దలకు ఓరల్ యాంటీవైరల్ కోవిడ్-19 చికిత్సను అందిస్తుంది. పాక్స్‌లోవిడ్‌, యూఎస్ ప్రభుత్వం ఆమోదించిన నాలుగవ కోవిడ్ చికిత్స ఔషధం. అలానే మొదటి ఓరల్ యాంటీవైరల్ ఔషధం కూడా.

ప్రముఖ తెలుగు రచయత కేతు విశ్వనాథ రెడ్డి మరణించారు

ప్రముఖ తెలుగు నవలా రచయిత కేతు విశ్వనాథ రెడ్డి గుండెపోటుతో మే 21న మరణించారు. ప్రసిద్ధ సాహితీవేత్తగా, విద్యావేత్తగా గుర్తింపు పొందిన ఈయన, ఆయన రచించిన కేతు విశ్వనాథ రెడ్డి కథలు అనే కథ సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు.

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్‌ జిల్లా ఎర్రగుంట్ల మండలం రంగసాయిపురానికి చెందిన కేతు విశ్వనాథరెడ్డి చాలా కాలంగా కడపలో నివసిస్తున్నారు. జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన విశ్వనాథ రెడ్డి ఉపాధ్యాయ వృత్తికి మారారు మరియు అంబేద్కర్ యూనివర్సల్ యూనివర్సిటీ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు.

హైదరాబాద్ విమానాశ్రయానికి వరుసగా ఐదో గ్రీన్ అవార్డు

ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ యొక్క గ్రీన్ ఎయిర్‌పోర్ట్స్‌లో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం గోల్డ్ పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ అవార్డు గెలుచుకోవడం ఇది వరుసగా 5వ సారి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మునలో ఈ అవార్డు లభించింది.

అదే విదంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 2023 స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డులలో ' భారతదేశం మరియు దక్షిణాసియాలో ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయం'గా ఎంపికైంది.

టీ-హబ్‌కి బెస్ట్ టెక్నాలజీ బిజినెస్‌గా జాతీయ అవార్డు

తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఎనేబుల్ ద్వారా దేశంలోనే బెస్ట్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ కోసం నేషనల్ టెక్నాలజీ అవార్డ్ గెలుచుకుంది 14 మే 2023న జరిగిన నేషనల్ టెక్నాలజీ వీక్ 2023లో భాగంగా అవార్డు అందించబడింది. వివిధ రంగాల్లో నాలెడ్జ్-ఇంటెన్సివ్ స్టార్టప్ ఎంటర్‌ప్రైజెస్‌ను ప్రోత్సహించడం ద్వారా టెక్నో-ఆంట్రప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్‌లో అత్యుత్తమ సహకారం అందించినందుకు ఈ అవార్డు లభించింది.

ప్రతిభావంతులైన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలలో అత్యున్నత మార్కులు పొందిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు జగనన్న ఆణిముత్యాలు పేరుతొ నూతన కార్యక్రమం ప్రారంభించింది. ఈ పథకం కింద పదివ తరగతి ఫలితాలలో టాప్ 3 స్థానాలలో, ఇంటర్ ఫలితాలలో ప్రతి గ్రూపులో టాప్ స్థానంలో ఉండే విద్యార్థులకు నగదు ప్రోత్సహకాలు అందిస్తారు.

ఈ అవార్డులు రాష్ట్ర పరిధిలో, జిల్లా పరిధిలో మరియు నియోజకవర్గ పరిధిలో అందివ్వనున్నారు. ఈ పథకం కింద 10వ తాగగతి నుండి 1,246 మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్ నుండి 1,585 మంది విద్యార్థులు అర్హుత పొందినట్లు తెలిపారు. మొదటి స్థానంలో ఉండే విద్యార్థికి 15 వేలు, రెండు, మూడు స్థానాలలో ఉండే విద్యార్థులకు వరుసగా 10 వేలు, 5 వేలు నగదు బహుమతి అందిస్తారు. ఇంటర్మీడియట్ టాపర్లకు ఒక్కో విద్యార్థికి 15వేల నగదు ప్రోత్సహకం ఇవ్వబడుతుంది.

ఐపీఎల్ 2023 టైటిల్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2023 ఫైనల్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది. ఇది చెన్నై జట్టుకు 5వ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్. దీనితో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ సాధించిన రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ రికార్డును ధోనీ జట్టు సమం చేసింది. విజేతకు 20 కోట్ల నగదు బహుమతి మరియు ట్రోఫీ అందించబడింది.

  • ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ : యశస్వి జైస్వాల్
  • లక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది టోర్నమెంట్ : గ్లెన్ మాక్స్‌వెల్
  • ఫెయిర్‌ప్లే అవార్డు : ఢిల్లీ క్యాపిటల్స్
  • అత్యధిక వికెట్లు పర్పుల్ క్యాప్ : మహ్మద్ షమీ
  • సీజన్‌లో అత్యధిక పరుగులకు ఆరెంజ్ క్యాప్: శుభమాన్ గిల్
  • సీజన్‌లో అత్యధిక ఫోర్లు : శుభమాన్ గిల్
  • సీజన్‌లో అత్యంత విలువైన ఆటగాడు : శుభమాన్ గిల్
  • గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్ : శుభమాన్ గిల్
  • క్యాచ్ ఆఫ్ ది సీజన్ : రషీద్ ఖాన్
  • సీజన్‌లో అత్యుత్తమ పిచ్ మరియు గ్రౌండ్ : ఈడెన్ గార్డెన్స్ మరియు వాంఖడే స్టేడియం

 

Post Comment