Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 11 జనవరి 2024
January Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 11 జనవరి 2024

January 11, 2024 Current affairs in Telugu. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో పొందండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షల కొరకు సిద్దమవుతున్న ఆశావహుల కోసం వీటిని అందిస్తున్నాం.

బంగ్లాదేశ్‌ ప్రధానిగా షేక్‌ హసీనా ఐదోసారి ప్రమాణ స్వీకారం

బంగ్లాదేశ్‌ ప్రధానిగా షేక్‌ హసీనా వరుసగా ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. జనవరి 7న జరిగిన బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికల తర్వాత ఆమె పార్టీ అవామీ లీగ్ చారిత్రాత్మకంగా ఐదవసారి విజయం సాధించింది. ఆమె పార్టీ పార్లమెంటులో 300 సీట్లకు గాను 222 స్థానాలను కైవసం చేసుకుని అఖండ విజయం సాధించింది. 76 ఏళ్ళ హసీనా బంగ్లాదేశ్ 12వ ప్రధానిగా జనవరి 12న అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

అయితే ప్రధాన ప్రతిపక్షం అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఈ ఎన్నికలను బహిష్కరించింది, అధికార పార్టీ యొక్క అప్రజాస్వామిక అణచివేత వలన పోలింగ్ రోజు దేశవ్యాప్త బందుకు పిలుపునిచ్చింది. దీనితో కేవలం 40% తక్కువ ఓటింగ్‌ మాత్రమే పోల్ అయ్యి ఆమె విజయం సాధించారు.

ఈ బహిష్కరణ మరియు ఆందోళనలు ఉన్నప్పటికీ, హసీనా గెలుపుకు బంగ్లాదేశ్ ఓటర్లలో ఉన్న ఆమె జనాదరణకు నిదర్శనం. ఆమె లక్షలాది మందిని పేదరికం నుండి బయటపడెలా చేయడంతో పాటుగా, దేశంలో గణనీయమైన ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధికి పాటు పడ్డారు. వాతావరణ మార్పులు మరియు ఉగ్రవాదం వంటి సమస్యలను ఎదుర్కోవడంలో ఆమె కనబర్చిన బలమైన నాయకత్వ ప్రతిభ కూడా ఈ విజయానికి కారణం అయ్యింది.

షేక్‌ హసీనా 34 సంవత్సరాల వయస్సులో మొదటిసారి అవామీ లీగ్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 1981లో భారతదేశం నుండి స్వదేశానికి తిరిగి వెళ్లిన ఆమె, తమ దేశ ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం సైనిక పాలకుడు జియావుర్ రెహమాన్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించారు.

హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ 1996 పార్లమెంటు ఎన్నికల్లో మొదటిసారి విజయం సాధించింది. 2001లో హసీనా పూర్తి ఐదేళ్ల పదవీకాలం తర్వాత శాంతియుతంగా పదవీ విరమణ చేసిన మొదటి నాయకురాలు అయ్యారు. 2001లో ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్వహించిన ఎన్నికల్లో ఆమె పార్టీ ఓడిపోయింది.

2006-2008 రాజకీయ సంక్షోభం సమయంలో ఆమె దోపిడీ ఆరోపణలపై నిర్బంధించబడింది. ఆమె జైలు నుంచి విడుదలైన తర్వాత, 2008 ఎన్నికలలో సైనిక-మద్దతుతో తిరిగి విజయం సాధించారు. ఆమె 2009లో రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2014, 2018లో జరిగిన మూడు ఎన్నికల్లోనూ, తాజాగా జనవరి 7, 2024న జరిగిన ఎన్నికల్లోనూ ఆమె విజయం సాధించారు.

షేక్‌ హసీనా, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ముజిబుర్ రెహమాన్ (బంగాబంధు) కుమార్తె. 1997లో ఆయన మరణం తర్వాత ఆమె పార్టీ బాధ్యతలు స్వీకరించారు. 2024 నాటికి ఆమె బంగ్లాదేశ్ చరిత్రలో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా నిలిచారు, అలానే ఆమె ప్రపంచంలోనే ఎక్కువ కాలం పనిచేసిన మహిళా ప్రభుత్వాధినేతగా కూడా చరిత్రకెక్కారు. ఆమె మొత్తం 19 సంవత్సరాలకు పైగా ప్రధానిగా సేవలు అందించారు.

2024 సంవత్సరంలో మొదటి తుఫానుగా అల్వారో సైక్లోన్

నైరుతి హిందూ మహాసముద్రంలో ఏర్పడ్డ 2024 సీజన్‌ మొదటి తుఫాను అయిన ట్రాపికల్ సైక్లోన్ అల్వారో జనవరి 1, 2024న మడగాస్కర్‌లోని మోరోంబే సమీపంలో ల్యాండ్‌ఫాల్ చేసింది. ఈ తుఫాను బలమైన గాలులు, కుండపోత వర్షంతో ఈ ద్వీప దేశానికి విస్తృతమైన నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఈ తుపాన్ యొక్క బలమైన గాలులు మరియు భారీ వర్షాల కారణంగా గృహాలు, భవనాలు మరియు మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. దీని వలన 17,200 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు.

గత సంవత్సరం కూడా జనవరి మరియు ఫిబ్రవరిలో మడగాస్కర్  వినాశకరమైన తుఫానులతో దెబ్బతింది. జనవరి 19, 2023న ఏర్పడ్డ ఉష్ణమండల తుఫాను చెనెసో ఆ దేశంలోని ఈశాన్య తీరాన్ని తాకింది. మడగాస్కర్ ఏజెన్సీ, నేషనల్ బ్యూరో ఆఫ్ రిస్క్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రకారం, ఇది 33 మందిని పొట్టనబెట్టుకోవడంతో పాటుగా 90,870 మందిని ప్రభావితం చేసింది.

ఫిబ్రవరి 21, 2023న ఏర్పడ్డ ఫ్రెడ్డీ తుఫాను కూడా మడగాస్కర్ యొక్క ఆగ్నేయ తీరం వెంబడి తీరాన్ని తాకింది. ఈ విపత్తులో కనీసం 19,000 మంది ప్రజలు నిరాశ్రయులు అవ్వడంతో పాటుగా 17 మంది మరణించారు. మడగాస్కర్‌ ప్రపంచంలోని నాల్గవ-అతిపెద్ద ద్వీపం.

ఎక్సర్‌సైజ్ సీ డ్రాగన్ -24 లో పాల్గొన్న భారత్ నౌకాదళం

యూఎస్ నావికాదళం నిర్వహిస్తున్న యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ (ఎక్సర్‌సైజ్ సీ డ్రాగన్) వ్యాయామం యొక్క నాల్గవ ఎడిషన్ యందు భారత నౌకాదళం పాల్గొంది. ఈ వ్యాయామం 10 నుండి 22 జనవరి 2024 వరకు యునైటెడ్ స్టేట్స్‌లోని గ్వామ్ ద్విపంలో యూఎస్ నావికాదళం నిర్వహించింది. ఇందులో భారతదేశంతో కూడిన క్వాడ్‌ భాగస్వామ్య దేశాలతో పాటుగా కెనడా మరియు దక్షిణ కొరియాలు పాల్గొన్నాయి. ఈ ఏడాది భారత నౌకాదళానికి చెందిన P-8I యుద్ధ విమానం ఇందులో పాల్గొంది.

సీ డ్రాగన్ వ్యాయామం అనేది యునైటెడ్ స్టేట్స్ నేవీచే నిర్వహించబడే వార్షిక, బహుళజాతి హై-ఎండ్ వ్యాయామం. ఈ రెండు వారాల వ్యాయామంలో కెనడా, దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్, ఇండియా, జపాన్ మరియు ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్ దేశాలు పాల్గొంటాయి. ఈ యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ ఎక్సర్‌సైజ్, సముద్రాల కింద దాక్కున్న శత్రు జలాంతర్గాములను గుర్తించడం మరియు తటస్థీకరించడం లక్యంగా సాగుతుంది.

పశ్చిమ బెంగాల్ ఎస్సీ/ఎస్టీ విద్యార్థుల కోసం యోగశ్రీ పథకం ప్రారంభం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులకు కాంప్లిమెంటరీ శిక్షణను అందించడానికి యోగ్యశ్రీ అనే నూతన సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం పరిధిలో రాష్ట్రంలోని 50 శిక్షణ కేంద్రాల ద్వారా వివిధ ప్రవేశ మరియు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణను అందిస్తారు. మరో 46 అదనపు కేంద్రాలు సివిల్ సర్వీసెస్ వంటి పరీక్షలకు సిద్ధమయ్యే వారికి కోచింగ్ అందిస్తాయి.

ఇదే వేదిక ద్వారా ఆమె స్టూడెంట్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద 2500 మంది అర్హత ఉన్న విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పిస్తారు. అలానే కాలేజీ విద్యార్థుల భద్రత మరియు శ్రేయస్సు కోసం యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

ములుగు జిల్లాలో రాతియుగం నాటి పనిముట్లు లభ్యం

తెలంగాణలోని ములుగులోని గుర్రేవుల మరియు భూపతిపురం గ్రామాల మధ్య వాగులో రాతి గొడ్డలితో సహా ప్రాచీన శిలాయుగం నాటి చేతి గొడ్డలిని పోలిన పనిముట్లు బయటపడ్డాయి. 15.5 సెంటీమీటర్ల పొడవు, 11 సెంటీమీటర్ల వెడల్పు, 5.5 సెంటీమీటర్ల మందంతో ఉన్న ఈ రాతి గొడ్డలిని ఏలేశ్వరం జనార్దనాచారి అనే పరిశోధకుడు కనుగొన్నారు.

పురాతన శిలాయుగంలో మానవ సమాజాల పరిణామం మరియు వాటి సాంకేతిక అభివృద్ధిని అర్థం చేసుకోవడానికి ఈ ఆవిష్కరణలు కీలకమైనవి. ములుగులో ఇటువంటి సాధనాల ఉనికి దక్కన్ పీఠభూమిలో ప్రారంభ మానవ నివాసాల సిద్ధాంతాన్ని బలపరుస్తుంది. ఈ రాతి సాధనాలు వేట, ఆహార సేకరణ మరియు ఆహార ప్రాసెసింగ్ వంటి కార్యకలాపాల కోసం ప్రారంభ మానవులు ఉపయోగించినట్లు అర్దమవుతుంది.

ఫోన్‌పే ఇంటర్నేషనల్ సీఈఓగా రితేష్ పాయ్‌

ప్రముఖ భారతీయ డిజిటల్ చెల్లింపుల యునికార్న్ అయిన ఫోన్‌పే, జనవరి 5 న యెస్ బ్యాంక్ మాజీ ఎగ్జిక్యూటివ్ రితేష్ పాయ్‌ని దాని అంతర్జాతీయ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా నియమించింది. ప్రస్తుతం ఈ సంస్థ వాల్‌మార్ట్ యాజమాన్యంలో సేవలు అందిస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థ యొక్క భారతీయ సీఈఓగా సమీర్ నిగమ్ ఉన్నారు.

సమీర్ నిగమ్ 2015లో ఫోన్‌పే ప్రైవేట్ లిమిటెడ్‌ని స్థాపించారు. ప్రారంభం నుండి ఆయా సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఆయనే పనిచేస్తున్నారు. ఫోన్‌పే ప్రారంభించక ముందు, సమీర్ భారతదేశపు అతిపెద్ద ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన ఫ్లిప్‌కార్ట్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంటుగా సేవలు అందించారు.

ఫోన్‌పే ఈ ఏడాది తన అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరించడానికి సుముఖంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వాల్‌మార్ట్ సంస్థకు ఉన్న మార్కెటింగ్ దృష్ట్యా ఈ సంస్థ ప్రముఖ గ్లోబల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్‌గా ఎదిగేందుకు పుస్కలంగా అవకాశాలు ఉన్నాయి. ఈ విస్తరణకు రితేష్ పాయ్‌ నాయకత్వం సహాయపడుతుందని ఆ సంస్థ భావిస్తుంది. ఈయన ప్రస్తుతం దుబాయ్ పేమెంట్ సంస్థ టెర్రాపే యందు ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ ప్రెసిడెంట్‌గా సేవలు అందిస్తున్నారు.

Post Comment