యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాధించడం ఎలా ? అనే ప్రశ్నకు ముందు యూట్యూబ్ కోసం తెలుసుకుందాం. ఈ తరం యువతకు యూట్యూబ్ అనేది కామధేనువు లాంటిది. వారికీ ఇది వినోదాన్ని అందిస్తుంది, విజ్ఞానాన్ని పంచుతుంది అలానే ఉపాధి కూడా కల్పిస్తుంది. నేడు కొన్ని లక్షల సంఖ్యలో యూట్యూబర్లు ఈ వేదిక ద్వారా ఉపాధి పొందుతున్నారు.
ఈ ఆర్టికల్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం ఎలా, దాని ద్వారా డబ్బు సంపాధించడం ఎలా, యాడ్‌సెన్స్ అకౌంట్ రూపొందించుకోవడం ఎలా వంటి మొదలగు అంశాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాధించడం ఎలా
- యూట్యూబ్ ఎలా ప్రారంభించబడింది
- యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడం ఎలా
- యూట్యూబ్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలి
- యూట్యూబ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి
- యూట్యూబ్ మానిటైజేషన్ ప్రక్రియ & యాడ్‌సెన్స్ అకౌంట్
- యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాధించేందుకు ఎవరు అర్హులు
యూట్యూబ్ ఎలా ప్రారంభించబడింది
యూట్యూబ్ 2005 లో స్నేహితులు స్టీవ్ చెన్, చాడ్ హర్లీ మరియు జావేద్ కరీమ్ ద్వారా ప్రారంభించబడింది. స్టీవ్ చెన్, చాడ్ హర్లీ జరుపుకున్న కిట్టీ పార్టీకి జావేద్ కరీమ్ హాజరు కాకపోవడంతో, వీరు సెలెబ్రేట్ చేసుకున్న వీడియో క్లిప్లను జావేద్ ఏవిధంగా పంపించాలనే ఆలోచనలలో యూట్యూబ్ పుట్టుకొచ్చింది. 2006 లో దీనిని గూగుల్ యాజమాన్యం దక్కించుకోవడంతో ఈ అమెరికన్ ఆన్‌లైన్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ యొక్క దశ, దిశా మారిపోయింది.
నేడు యూట్యూబ్, గూగుల్ తర్వాత అత్యధికంగా సందర్శించే రెండవ వెబ్‌సైటుగా నిలిచింది. ప్రతి నెల సుమారు 2.5 బిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదార్లు యూట్యూబును ఉపయోగిస్తున్నారు. ప్రతిరోజు ఒక బిలియన్ గంటల కంటే ఎక్కువ వీడియోలను వీక్షిస్తున్నారు. నిముషానికి 500 గంటల కంటే ఎక్కువ కంటెంట్ యోట్యూబ్ లోకి అప్‌లోడ్ చేయబడుతుంది. ప్రతినెల కొన్ని వందల బిలియన్ల ఆర్థిక సంపదను సృష్టిస్తుంది.
యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడం ఎలా
యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేందుకు మీకు కేవలం 60 సెకండ్లు సరిపోతుంది. దీని కోసం మీ వయస్సు 18 ఏళ్ళు నిండి ఉండాలి. అలానే మీరు ఒక జీమెయిల్ అకౌంటును కలిగివుండాలి. జీమెయిల్ అకౌంట్ లేకున్నా కంగారు పల్సిన అవసరం లేదు. దీన్ని కూడా మీరు చిటికలో రూపొందించవచ్చు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా రూపొందించుకోవాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం.
యూట్యూబ్ ఛానల్ ప్రారంభించేందుకు మొదటిగా మీ మొబైల్ యందు ఉన్న యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి లేదా ఏదైనా ఒక వెబ్ బ్రౌజరులో www.youtube.com అని టైపు చేసి, ఎంటర్ బటన్ నొక్కండి. యాప్ ఓపెన్ చేయగానే లేదా ఎంటర్ బటన్ నొక్కగానే మీకు యూట్యూబ్ హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది.
రెండవ దశలో యూట్యూబ్ హోమ్ పేజీ యొక్క కుడి వైపు, పైభాగంలో చుస్తే మీ యొక్క ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే ఒక సైడ్ మెనూ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అందులో క్రియేట్ యువర్ ఛానల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
మూడవ దశలో ఓపెన్ అయినా పాప్‌అప్ మెనూలో ఛానల్ నేమ్ మరియు కేటగిరికి సంబంధించి రెండు ఎంపికలు కనిపిస్తాయి. మొదటి దానిలో, మీరు పెట్టాలనుకే ఛానల్ యొక్క పేరును ఎంటర్ చేయండి. రెండువ దానిలో మీ వీడియో కంటెంట్ ఏ కేటగిరికి సంబందించిందో దాన్ని ఎంపిక చేసుకోండి. తర్వాత దశలో టర్మ్స్ & కాండియేషన్స్ సంబంధించి చెక్ బాక్స్ యందు క్లిక్క్ చేసి, దిగువున ఉన్న డన్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. దీనితో మీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే ప్రక్రియ పూర్తివుతుంది.
నాలుగవ దశలో మరోసారి మీ యూట్యూబ్ హోమ్ పేజీ యందు కుడివైపు, పై భాగంలో ఉన్న ప్రొఫైల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఓపెన్ అయినా సైడ్ మెనులో మీకు యువర్ ఛానల్ & యువర్ యూట్యూబ్ స్టూడియో ఎంపికలు కనిపిస్తాయి. ఇప్పుడు యువర్ ఛానల్ ఎంపికపై క్లిక్ చేయండి. ఇపుడు మీ యొక్క యూట్యూబ్ ఛానల్ హోమ్ పేజీ ప్రత్యక్షమవుతుంది. ఈ పేజీలో మీకు మీ ఛానల్ నేమ్, ప్రొఫైల్ ఐకాన్, ఛానల్ ఆర్ట్, అలానే హోమ్ పేరుతో స్టార్ట్ అయ్యే ఒక మెనూ కనిపిస్తాయి. అలానే కుడి వైపు భాగంలో కస్టమైజ్ ఛానల్ & వీడియో మానేజ్ అనే ఎంపికలు కూడా కనిపిస్తాయి.
ఇప్పుడు మీ ఛానల్ యొక్క కస్టమైజేషన్ ప్రక్రియను పూర్తిచేయాలి. దీని కోసం కుడి వైపు ఉన్న కస్టమైజ్ ఛానల్ ఎంపికపై క్లిక్ చేయండి. క్లిక్క్ చేయగానే మీ యొక్క యూట్యూబ్ స్టూడియో డాష్‌బోర్డ్ ఓపెన్ అవుతుంది. అందులో ఎడమ వైపు మీకు ఒక స్క్రోలింగ్ మెనూ కనిపిస్తుంది. దాన్ని కిందకి స్క్రోల్ చేయడం ద్వారా దిగువలో కస్టమైజేషన్ అనే ఎంపిక కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు పేజీ మధ్యలో లేఔట్, బ్రాండింగ్, బేసిక్ ఇన్ఫో ఎంపికలతో కస్టమైజేషన్ మెనూ కనిపిస్తుంది.
అందులో మొదటి లేఅవుట్ మెనులో మీ ఛానల్ యొక్క వెల్‌కమ్, ఫీచర్ వీడియో అప్లోడ్ చేయండి. రెండవ బ్రాండింగ్ మెనులో మీ ఛానల్ ఐకాన్, మీ ఛానల్ ఆర్ట్ మరియు వాటర్ మార్క్ ఫోటోలను అప్లోడ్ చేయండి. ఇక చివరిగా బేసిక్ ఇన్ఫో మెనూలో మీ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్, సోషల్ మీడియా అకౌంట్ల లింకింగ్ మరియు మీ కాంటాక్ట్ వివరాలను పొందుపర్చండి.
చివరిగా కుడివైపు పైభాగంలో ఉన్న పబ్లిష్ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా మీ ఛానల్ కస్టమైజేషన్ ప్రక్రియ పూర్తివుతుంది. దీనితో మీ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు 90 శాతం పూర్తి అయినట్లు భావించాలి. మిగతా 10 శాతం ప్రక్రియ పూర్తిచేసేందుకు ఎడమ వైపు ఉన్న మెనూలో సెట్టింగ్స్ ఎంపికపై క్లిక్ చేయండి. అందులో మీకు యూట్యూబ్ డిఫాల్ట్ అప్లోడ్ సెట్టింగ్స్ అలానే ఇతర వివరాలు పొందుపరచడం ద్వారా యూట్యూబ్ ఛానల్ 100 శాతం సిద్దమైనట్లు భావించాలి.
యూట్యూబ్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలి
ఎడిటింగ్ లేదా చిత్రీకరణ పూర్తిచేసుకున్న మీ వీడియోను మీ యూట్యూబ్ ఛానెల్ ద్వారా అప్లోడ్ చేసే పద్దతిని ఇప్పుడు తెలుసుకుందాం. యూట్యూబ్ హోమ్ పేజీ లేదా మీ ఛానెల్ హోమ్ పేజీ లేదా మీ యూట్యూబ్ స్టూడియో పేజీలో కుడి వైపు భాగంలో పరిశీలిస్తే మీకు ప్లస్ సింబల్ తో కూడిన వీడియో ఐకాన్ కనిపిస్తుంది. దీనిపైనా క్లిక్ చేయడం ద్వారా మీకు వీడియో అప్లోడ్ విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సెలెక్ట్ ఫైల్ ఎంపికపై క్లిక్ చేయడం లేదా డ్రాగ్ & డ్రాప్ పద్దతిలో మీ వీడియో అప్లోడ్ ప్రక్రియను పూర్తిచేయండి.
వీడియో అప్లోడ్ ప్రక్రియ పూర్తికాగానే మీకు వీడియో కస్టమైజేషన్ డాష్‌బోర్డ్ ప్రత్యక్షమవుతుంది. ఇందులో మొదటి విండోలో మీ వీడియో టైటిల్, డిస్క్రిప్షన్, వీడియో థంబ్‌నెయిల్ మరియు వీడియో ప్లేలిస్ట్ ఎంపిలను పూర్తిచేయాల్సి ఉంటుంది. రెండవ విండోలో వీడియో ఎలిమెంట్ ఎంపికలు ఉంటాయి. ఇందులో వీడియో కార్డు, ఎండ్ కార్డు ఫీచర్స్ ఉంటాయి. ఈ ఎంపికలను ఉపయోగించి మీరు వీడియో మధ్యలో మరియు చివరిలో సిఫార్సు వీడియోలను, సబ్‌స్క్రైబ్ కార్డులను జోడించవచ్చు. ఇక తర్వాత విండోలో కాపీ రైట్ కంటెంట్ చెకింగ్ ఉంటుంది. ఇక చివరి విండోలో పబ్లిష్ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా వీడియో అప్లోడ్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
యూట్యూబ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి
ప్రతి నిముషం యూట్యూబ్ యందు కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఇందులో కొందరి వీడియోలు మాత్రమే ఎక్కువ వ్యూర్షిపును పొందుతాయి. మీ వీడియోలు కూడా అలా ఎక్కువ మందికి చేరువ అవ్వాలంటే మీరు యూట్యూబ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గురించి తెలుసుకోవాలి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనగా మీరు అప్లోడ్ చేసే కంటెంట్ సెర్చ్ ఇంజిన్లకు ఫ్రెండ్లీగా ఉండటం అని అర్ధం. అనగా మీ వీడియో టైటిల్, డిస్క్రిప్షన్, ఉపయోగించే కీవర్డ్స్ వంటి అంశాలు ఇందులోకి వస్తాయి.
యూట్యూబ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ప్రక్రియలో వీడియో టైటిల్ ప్రధాన భూమిక పోషిస్తుంది. దీని కోసం వీడియోలో ఉండే కంటెంటుకు అనుకూలంగా మీరు టైటిల్ పెట్టాల్సి ఉంటుంది. వీడియో టైటిల్ కనీసం ఐదు నుండి ఆరు పదాలలో ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. అలానే మొదటి రెండు పదాలలో వీడియో కంటెంటుకు సంబంధించిన ప్రధాన కీవర్డ్స్ ఉండేలా చూసుకోవాలి. అలానే టైటిల్ యందు ఉపయోగించే పదాలు, ఒక సాధారణ వ్యూయర్ సెర్చ్ చేసే పదాలకు దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. ఇంకో ముఖ్యమైన అంశం..మీరు వీడియో అప్లోడ్ చేయకముందే ఎడిటింగ్ సమయంలో ఈ టైటిల్ ప్రక్రియను పూర్తిచేసుకోండి. వీడియో అప్లోడ్ చేశాక టైటిల్ ఎడిట్ చేయడం వలన మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు.
ఇక సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ప్రక్రియలో రెండవడి వీడియో డిస్క్రిప్షన్. ఇది పది నుండి ఇరవై పదాలలో వీడియోకు సంబంధించి వివరాలు డిస్క్రిప్షన్ యందు పొందు పర్చండి. అలానే #ట్యాగ్ ఉపయోగిస్తూ వీడియో కంటెంట్ సంబంధిత నాలుగు నుండి ఐదు కీవర్డ్స్ యాడ్ చేయండి. అలానే మీ సోషల్ మీడియా అకౌంట్ల లింకులను డిస్క్రిప్షన్ యందు పొందు పర్చండి.
చివరిగా థంబ్‌నెయిల్ డిజైన్ కూడా వీడియో యొక్క వ్యూర్షిప్ పై ప్రభావం చూపుతుంది. యూట్యూబ్ వీక్షించే వీక్షకులలో మెజారిటీ మంది వీడియో థంబ్‌నెయిల్ చూడటం ద్వారా వీడియోలకు ఆకర్షితులు అవుతారు. వీడియో టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, కీవర్డ్స్ వంటివి యూట్యూబ్ జాబితాలో మీ వీడియోలను ముందు వరుసలోకి తెచ్చేందుకు సహాయపడితే, మీరు ఉపయోగించే థంబ్‌నెయిల్స్ మీ వీడియోను చూసేలా ప్రభావం చూపుతాయి. దీని కోసం మీరు మరికొంత వివరంగా తెలుసుకోవాలంటే యూట్యూబ్ యందు సెర్చ్ చేయడం ద్వారా ఆ వివరాలు పొందొచ్చు.
యూట్యూబ్ మానిటైజేషన్ ప్రక్రియ
వీడియోల యందు ప్రకటనలు చొప్పించడం ద్వారా యూట్యూబ్ మీకు ఆదాయాన్ని అందిస్తుంది. ఈ ప్రక్రియను మానిటైజేషన్ అంటారు. దీని కోసం మీరు గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్ కలిగి ఉండాలి. యాడ్‌సెన్స్ అకౌంట్ పొందేందుకు మీ ఛానల్ కనీసం 1000 మంది సబ్‌స్క్రైబర్లను కలిగి ఉండాలి. అలానే మీ ఛానల్ 4 వేల గంటల వ్యూయర్షిప్ కలిగి ఉండాలి. ఈ రెండు అర్హుతలు మీరు పొందాక, మానిటైజేషన్ ప్రక్రియకు సంబంధించి యూట్యూబ్ మీకు మెయిల్ పంపిస్తుంది.
ఈ మెయిల్ మీరు స్వీకరించాక గూగుల్ యాడ్‌సెన్స్ వెబ్సైటు ద్వారా అకౌంట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీ వ్యక్తిగత అడ్రెస్స్, కాంటాక్ట్ వివరాలు మరియు బ్యాంకు అకౌంట్ వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. మీ దరఖాస్తును పరిశీలించాక, గూగుల్ నుండి ఒక అడ్రెస్స్ వెరిఫికేషన్ పిన్ మీ అడ్రెసుకు పంపించబడుతుంది. ఈ పిన్ వివరాలు మీ యాడ్‌సెన్స్ అకౌంట్ యందు వెరిఫై చేసుకోవడం ద్వారా యాడ్‌సెన్స్ అకౌంట్ ఏర్పాటు ప్రక్రియ పూర్తి అవుతుంది. ఈ యాడ్‌సెన్స్ అకౌంట్ ద్వారా మీ యూట్యూబ్ మరియు వెబ్సైటులను మానిటైజ్ చేసి డబ్బు సంపాధించవచ్చు. గూగుల్ మానిటైజేషన్ ప్రక్రియతో పాటుగా అఫిలియేటింగ్ మార్కెట్ మరియు ప్రీమియర్ మెంబర్షిప్ ప్రోగ్రామ్స్ ద్వారా మీరు యూట్యూబ్ యందు మనీ సంపాధించవచ్చు. దీనికి సంబంధించి మీ ఛానల్ యందు పెద్ద సంఖ్యలో సబ్‌స్క్రైబర్లను కలిగి ఉండాలి.
యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాధించేందుకు ఎవరు అర్హులు
18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాధించేందుకు అర్హులుగా పరిగణించబడతారు. అలానే హింసాత్మక మరియు సెక్సువల్ కంటెంట్ మినహాయిస్తే యూట్యూబ్ యందు ఏవిధమైన కంటెంట్ అయినా అప్లోడ్ చేయొచ్చు. ఇది విద్యార్థులకు, గృహాణిలకు, కళాకారులకు, వృతి నిపుణులకు చక్కని ఉపాధి మార్గాన్ని అందిస్తుంది. పలానా అని కాకుండా వీక్షకులను ఆకర్షించే ఏవిధమైన కంటెంట్ మీరు అప్లోడ్ చేసిన విజయవంతం అవ్వొచ్చు. ఎక్కువ మంది ఎడ్యుకేషన్ ట్యుటోరియల్స్, నైపుణ్యాభివృద్ధి తరగతులు, కుకింగ్, ట్రావిలింగ్, ఫ్యాషన్, యోగ, న్యూస్, వినోదానికి సంబంధించి వీడియోలు రూపొందించి విజయవంతమవుతున్నారు.
యూట్యూబ్ యందు మీరు ఏ కేటగిరికి చెందిన కంటెంట్ అప్లోడ్ చేసినా, ఇది మీ స్వతహాగా రూపొందించినదై ఉండాలి. వీడియో, ఆడియో, ఇమేజ్ ఇలా మీరు ఉపయోగించే ప్రతి కంటెంట్ మీకు సంబంధించినదై ఉండాలి. అలాకాకుండా ఇంటర్నెట్ యందు లేదా ఇదే వరకే యూట్యూబ్ యందు అప్లోడ్ చేసిన వీడియోలు లేదా సోషల్ మీడియా వేదికల్లో దొరికే వీడియోలు అప్లోడ్ చేస్తే, అది కాపీ రైట్ నియమ ఉల్లంఘనకు దారితీస్తుంది. ఇది చివరికి మీ యూట్యూబ్ ఛానెల్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. దీని వలన ఇదివరకు మీరు చేసిన సమయం, పని మొత్తం వృధా అవుతుంది. కావున మీ సొంత కంటెంట్ యందు దృష్టిసారించి విజయవంతం అవ్వండి.