గురుగ్రామ్'లో భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్
గురుగ్రామ్'లో భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభించారు. దీనికి ముందు, దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ నవీ ముంబైలో ఉంది. ఈ స్టేషన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల కోసం 96 ఆపరేషనల్ ఛార్జింగ్ పోర్ట్‌లు అందుబాటులో ఉంచారు. వీటితో ఒక రోజున 576 ఎలక్ట్రిక్ వాహనాలకు రౌండ్-ది-క్లాక్ సేవలను అందించవచ్చు. ఒక AC ఛార్జర్ ఎలక్ట్రిక్ వెహికల్ని ఛార్జ్ చేయడానికి గరిష్టంగా ఆరు గంటల సమయం పడుతుంది. అదే DC ఛార్జర్ రెండు గంటలలోపు వాహనాన్ని ఛార్జ్ చేయగలదు. దీనిని పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా నేషనల్ హైవేస్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్ (NHEV) యొక్క భాగస్వామి సంస్థ ద్వారా ఏర్పాటు చేసారు.
ప్రపంచ అత్యంత రద్దీ నగరాల్లో ముంబై 5వ స్థానం
టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ర్యాంకింగ్ 2021 ప్రకారం, మహమ్మారి సంబంధిత ఆంక్షలు ఉన్నప్పటికీ ప్రపంచ అత్యంత రద్దీ నగరాల జాబితాలో ముంబై 5వ స్థానంలో నిలిచింది. సుమారు 58 దేశాల్లో, 404 నగరాలను కవర్ చేస్తూ చేసిన ఈ పరిశోధనలో ఇస్తాంబుల్ (టర్కీ) ప్రపంచ అత్యంత రద్దీ నగరంగా నిలిచింది. ఈ జాబితాలో ముంబై తర్వాత బెంగళూరు 10వ స్థానంలో, ఢిల్లీ 11వ స్థానంలో మరియు పూణె 21వ స్థానంలో నిలిచాయి.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో అటల్ టన్నెల్
అటల్ టన్నెల్ అధికారికంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా 10,000 అడుగులకు పైన ఉన్న ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే టన్నెల్'గా ధృవీకరించబడింది. అటల్ టన్నెల్ అనేది హిమాచల్ ప్రదేశ్‌లోని లేహ్-మనాలి హైవేపై హిమాలయాల తూర్పు పీర్ మరియు పంజాల్ శ్రేణిలో రోహ్‌తంగ్ పాస్ కింద నిర్మించిన హైవే సొరంగం. 9.02 కి.మీ పొడవున్న ఈ హైవే సొరంగంను 3 అక్టోబర్ 2020లో ప్రారంభించారు. దీనికి మాజీ ప్రధాని మరియు బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టారు.
EIU డెమోక్రసీ ఇండెక్స్ 2021 : 46వ స్థానంలో భారత్ ప్రజాస్వామ్యం
ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (EIU) యొక్క డెమోక్రసీ ఇండెక్స్ 2021 ప్రకారం 165 దేశాల డెమోక్రసీ గ్లోబల్ ర్యాంకింగ్‌లో భారతదేశం (6.91 పాయింట్స్) 46వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో టాప్ 3లో నార్వే (9.75), న్యూజిలాండ్ (9.37), ఫిన్లాండ్ (9.27) దేశాలు ఉన్నాయి. ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్, 2006 నుండి ప్రపంచ దేశాల డెమోక్రసీ ఇండెక్స్'ను ఏటా విడుదల చేస్తుంది.
ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ పరిశోధన విభాగం వివిధ దేశాల బహుళత్వం, పౌర హక్కులు, రాజకీయ సంస్కృతి వంటి వివిధ అంశాలకు సంబంధించి సుమారు 60 సూచికలను ఆధారంగా చేసుకుని ఈ ర్యాంకింగును రూపొందిస్తుంది.